Wednesday, 13 March 2013

రొమాంటిసిజం-జీవితం


        ఆ మధ్య హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో హస్తకళల ఎగ్జిబిషన్ జరిగింది. అందులో మగ్గం నేస్తున్న మనిషి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. చంద్రమండలం నుంచి తెచ్చిన శకలం చుట్టూ మూగినట్టు విపరీతమైన జనం. ఆశ్చర్యంగా కుతూహలంగా అది ఎలా పనిచేస్తుందో అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఇటీవల పత్రికలు పోటీపడి పల్లెటూరి రైతు ఫొటోను మొదటి పేజీలో ప్రచురించాయి. తెల్లని చొక్కా పంచెకట్టులో ఉన్న రైతు ఏటీఎం గార్డుగా మారిన చిత్రాన్ని రెండు బాక్సులు కట్టిమరీ ప్రచురించారు. తొలి బాక్సులో పంచెకట్టులో ఉన్న రైతు, రెండో బాక్సులో ఆయన ఏటీఎం గార్డుగా కుర్చీలో కూర్చుని ఉన్న చిత్రం. సేద్యంలో బతుకులేక పట్నమొచ్చి ఎక్కడో ఏటీఎమ్ దగ్గర గార్డుగా ఉన్నాడు. భారమైన హృదయంతో కవితాత్మకమైన రైటప్‌లు రాసి మరీ ప్రచురించారు. చదివిన వారిలో చాలామంది బోలెడంత సానుభూతి కురిపించడం కనిపించింది. ఈ రెండు ఘటనలు మన సమాజం ఏ దశనుంచి ఏ దశలోకి ప్రయాణిస్తున్నదో తెలియజేసే ఘట్టాలు. మన శరీరాలు అర్బన్ మార్కెట్ సమాజంలోనూ మన మనస్సులు సంప్రదాయ గ్రామిణ వ్యవస్థలోనూ ఉండిపోయాయని తెలియజేసే సందర్భాలు. ఇప్పటికీ ఈ దేశంలో జనానికి ఉపాధి కలిపిస్తున్న పెద్ద రం గాల్లో మొదటిది వ్యవసాయం, రెండోది చేనేత. దేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలు ఇపుడు అంతమందికి ఉపాధి కల్పించలేక ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నపుడు మన ఆలోచనలెలా ఉండాలి? జరుగుతున్నదేమిటి?








గ్రామాల్లో తరచుగా వినిపించే మాట ఒకటుంది. ఇంత బతుకు బతికి ఒకడి కాళ్లకిందకు పోయేదేందిరా అంటారు. ఒక మోస్తరు రైతు వేరే పొలంలో కూలీకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తేనే గింజుకుని చచ్చే వాతావరణం ఉంటుంది. సొంతంగా సంపాదించుకోవడం గౌరవనీయమైన పని అని వేరొకరి ఆజమాయిషీలో పనిచేయడం అవమానకరమని ఫ్యూడల్ భావన మన మెదళ్లలో స్థిరపడిపోయి ఉంది. చావనైనా చస్తాం కానీ ఒకడి కింద కూలీకి పోతామా అనేవారు సైతం ఉన్నారు. ఇపుడిపుడే పరిస్థితిలో మార్పు వస్తున్నది. పత్రిక మొదటి బాక్సులో వేసినట్టు మడత నలగని తెల్లని చొక్క పంచె వేసుకుని "దర్జాగా'' బతికే పరిస్థితే ఉంటే ఆ రైతు ఏటీఎం గార్డు దాకా రాడు. తరాలు మారేకొద్దీ కమతాలు చిన్నగా మారిపోవడం, ఉపాధి కోసం వేరే రంగాలు వెతుక్కోవాల్సి రావడం అనివార్యమైన పరిణామం. వ్యవసాయం గతంలో పోషించినంతమందిని ఇపుడు పోషించలేదు.ఎందుకు బతకలేరు, గతంలో హాయిగా బతికారు కదా అని పురోగామి వాదులు సైతం వాదిస్తూ ఉంటారు. ఈ దర్జాగా బతకడం, హాయిగా బతకడం లాంటివి భ్రమలు. మన ఊహలకు ఆశలకు రూపమిచ్చుకోవడానికి సృష్టించుకునే పదజాలాలు. ఇంతకుముందు కూడా హాయిగా ఏమీ బతకలేదు. హాయిగా బతికుంటే ధాత కరువుల చరిత్రలు, మనుషులు పిట్టల్లా రాలిపోయిన చరిత్రలు ఉండేవి కావు. అది అలా ఉంచితే మన అర్బన్ జీవితాల్లో ఇమేజరీకి ప్రాధాన్యం ఎక్కువ. మనం ఏదో దిక్కులేక పట్నమొచ్చి ఉద్యోగం చేసుకుంటూ బానిస జీవితం గడుపుతున్నామని అక్కడింకా కొంతమంది స్వతంత్రంగా జీవిస్తున్నారని అనుకోవడంలో సౌలభ్యం ఉంది. మనం వదిలేసిన లెగసీని వారు కాపాడుతున్నారని అనుకోవడంలో గిల్ట్‌ను తృప్తిపరుచుకునే వ్యవహారం ఉంది.

     


గిల్ట్ అర్థం లేనిదే. సంతృప్తీ అర్థం లేనిదే. సంక్రాంతి మూడు రోజుల తర్వాత ఊరిలో మరి నాలుగు రోజులు ఉండాల్సి వస్తే ఏం చేయాలో తోచక గింజుకుంటాం. ఏడాదికో మారు ఏ అటవీ ప్రాంతానికో వెళ్లి ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అని పాడుకోవడం బాగానే ఉంటుంది. అది జీవితం కాదు. అయినా సరే, మనలాగా దరిద్రంగా కార్లలోనో బైకులమీదో కిలోమీటర్ల కొద్దీ ఆఫీసుకు వెళ్లి ఏసీల్లోనో ఫ్యాన్ల కిందో పనిచేస్తూ యాంత్రికంగా జీవించాల్సిన అవసరం వారికి లేదని, వారు హాయిగా పచ్చని చెట్టులా పదిమందికి నీడనిస్తూ ఉన్నారని అనుకోవడంలో సౌఖ్యం ఉంది. ఎపుడైనా అక్కడ రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగినపుడు మాత్రం చ్చొచ్చొచ్చో అనుకోవచ్చు. కానీ వారు మాత్రం బతుకుదెరువుకు పట్నం రాకూడదు. కార్మికులుగా మారకూడదు. ఎంతటి వేదన భరించైనా సరే ఎదురీదాలి. మనమో మన పూర్వీకులో వదిలేసిన లెగసీని కాపాడుతూ వారక్కడే ఉండిపోవాలి. పేదరికమా.. అయితే మాత్రమేమిటి.. వాళ్లు ఆత్మగౌరవమున్నవాళ్లు, ఈ దేశపు జెండాకున్నంత గర్వం ఉన్నవాళ్లు అని కవితాత్మకంగా అనుకోవడంలో ఒక తుత్తి. 

ఈ పేదరికముందే అది దాటేశాక అందంగా కనిపిస్తుంది."ఇప్పుడంటే ఇలా ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం కానీ అప్పుడు ఎర్రని ఎండలో పొలం గట్టుమీద ఎర్రకారం కలుపుకుని తింటుంటే ఆ రుచేవేరు'' అనడం ప్యాషన్. పేదరికం జ్ఞాపకంగా మురిపెంగానూ అనుభవంలో దుర్భరంగానూ ఉంటుంది. గ్రామాల్లో రైతు బతుకు చితికిపోవడానికి కారణాలు అనేకం. విధానపరమైన కారణాలతో పాటు మారుతున్న జీవనశైలికి సంబంధించిన కారణాలూ చాలానే ఉన్నాయి. ఒక నాడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో తిండిదే ప్రధాన ఖర్చు. ఇవాళ కాదు. కాకపోవడం ఒక అర్థంలో మంచిదే. అభివృద్ధి సంకేతమే. మనిషి తన సమస్త శ్రమను తిండికోసమే వెచ్చించాల్సి రావడం పూర్తిగా వెనుకబడిన వ్యవహారం. 

కాకపోతే ఆర్థిక వ్యవస్థ ఒక దశనుంచి మరోదశకు మారుతున్న సంధిదశలో మార్పును అర్థం చేసుకోని వాళ్లు, దానికి అనువుగా తమను తాము సంసిద్ధం చేసుకోని వాళ్లు, చేసుకోలేనివాళ్లు నలిగిపోతారు. అదే ఇపుడు జరుగుతున్నది. అలాంటి వారు సరికొత్త ఆర్థిక వ్యవస్థ రథచక్రాల కింద నలిగిపోకుండా సపోర్ట్ సిస్టమ్స్ మన వ్యవస్థ ఏర్పాటు చేయలేకపోవడం, దానికి గల కారణాలు వేరే కథ. అది చాలా పెద్ద విషాదగాధ. కారణాలు ఏవైనా ఒకరైతు గ్రామాన్నుంచి వచ్చి పట్నంలో ఆటో తోలుకున్నా, ఏటీఎమ్ గార్డుగా కుదురుకున్నా, ఒక అపార్ట్మెంట్‌లో వాచ్‌మెన్‌గా కుదిరినా ఏం చేసినా అది చిన్నతనమేమీ కాదు అతను రైతునుంచి కార్మికుడిగా మారుతున్నాడు. ప్రోలటేరియట్‌లో భాగమవుతున్నాడు. అంతకు ముందు కంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నాడు. ఎందుకు జాలిపడాలి? ఎందుకు చొచ్చొచ్చొ అనాలి? అంతకంటే మెరుగైన ఉపాధి దొరికితే బాగుండని అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇంత బతుకు బతికి పాపం గార్డుగా... రాజులాగా బతికినోడు చివరికి... లాంటి భావన రాకూడదు.


పంచెకట్టుకంటే ఖాకీ ఫ్యాంట్ తక్కువదేమీ కాదు. మన ఆలోచనల్లో వెనుకబాటు తనాన్ని గొప్పగా విప్లవకరంగా చాటుకునే లక్షణం ఇటీవల పెరిగిపోయింది. ముఖ్యంగా అస్తిత్వఉద్యమాల పేరుతో ముందుకొచ్చిన ధోరణుల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పేదల పరిభాష వాడుతూ మధ్యతరగతి ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే తంతు సాగుతున్నది. గ్యాస్ సబ్సిడీ ఆరు సిలిండర్లకు తగ్గిస్తేకూడా మనకు కడుపు మంటే. అయ్యో నిరుపేదలకు నష్టం!! ఏ నిరుపేద కుటుంబం ఏడాదికి ఆరు సిలిండర్ల కంటే ఎక్కువ వాడుతుందో చూపించండని ప్రశ్నించే నాధుడే లేడు. ఎన్ని వేల కోట్లు సొమ్ము! గ్రామీణ ఉపాధి పథకంలో ఎంతో సొమ్ము వృధా అవుతున్నదని వగచేవారిలో కొందరైనా ఈ సబ్సిడీలు ఎవరిపేరుతో ఎవరు అనుభవిస్తున్నారనేది మాట్లాడరు. మధ్యతరగతికీ సబ్సిడీ అవసరమనుకుంటే ఆ విషయాన్నే నేరుగా చెప్పొచ్చు. అలాచేయరు. నిరుపేదల పేరు పెట్టి తాము ప్రయోజనాలు పొం దాలి. ప్రాక్టికల్ ప్రయోజనాల విషయంలో మధ్యతరగతిలో ఉండడమూ, రోమాంటిసిజమ్ దగ్గరికొచ్చే సరికి పల్లెపాట పాడడం ఆనవాయితీగా మారింది.

        చేనేతకేం దర్జాగా నిలబడుతుంది అని వాదించేవారిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఏడాదికో మారు రాష్ట్రపతి చరఖా ముందు కూర్చోవడం ఏమిటని రామ్ మనోహర్ లోహియా1952లో పరిహసించారు. చరఖా గతమే కానీ వర్తమానం కాదని, ఇలాంటి సిం బాలిజం వల్ల ఫలితం లేదని అప్పుడే చెప్పారు. 60 యేళ్ల తర్వాత ఇంకా కులవృత్తుల గురించి గ్లామరస్‌గా మాట్లాడుతున్నామంటే మనం ఎక్కడున్నామనుకోవాలి? ఇళ్లలో ఆలివ్ ఆయిల్ వాడుకుంటూ ఖరీదైన షాపుల్లో ఆర్గానిక్ ఫుడ్స్ కొంటూ అత్యంత ఖరీదైన ఆర్గానిక్ జీవనం గడిపే ప్రత్యామ్నాయ అభివృద్ధి వాదులు మనకు చాలామందే ఉన్నారు. వాళ్లదేం పోయింది? మనది కాకపోతే తిరుపతిదాకా దేకమన్నాట్ట వెనకటికెవరో! అగ్గిపెట్టె చీరలు, బంజారాహిల్స్‌లో మాత్రమే అమ్ముడయ్యే డిజైనర్ చీరలు, సుగంధ పట్టు చీరలు లాంటి ప్రయోగాలను చూపించి ఎందుకు బతకదు అని వాదించలగరు. పోచంపల్లి, గద్వాల, ఉప్పాడ, పొందూరు లాంటి బ్రాండెడ్ ఊర్లను చూపించి దానికేం అనగలరు.ఆ బ్రాండెడ్ సెంటర్లు కూడా ఎన్ని తిప్పలు పడుతున్నాయో సరిచూసుకునే ఓపిక కూడా ఉండదు. ఏదో ఒక ఎన్జీవో ఏదో ఒక ఊరిలోనే మండలంలోనే ఒక పని సమర్థంగా చేసి చూపించి ఇలాగా దేశమంతా ఎందుకు చేయరు అని వాదించడం లాంటి వ్యవహారం ఇక్కడా కనిపిస్తుంది. మన బొటనవేలు అంత లేని భూటాన్‌ను చూపించి వారి హ్యాపీ ఇండెక్స్ గురించి ప్రకృతి ప్రేమ గురించి మాట్లాడేవాళ్లకు, మన చిటికెన వేలంత లేని సింగపూర్‌ను చూపించి అక్కడి పరిశుభ్రత గురించి అవినీతి రాహిత్యం గురించి మాట్లాడేవాళ్లకు స్కేల్, పరిధి అర్థం కావు. బతకడమంటే ఎలీట్‌కు ఉపయోగపడే కళారూపంగా అక్కడక్కడా మిగిలిపోవడమా, ఇన్ని లక్షల మందికి ఉపాధినిచ్చే రంగంగా బతికుండడమా అనే తేడా కూడా తెలీదు. 

         చేనేత బతుకుతుందో లేదో అందులో పనిచేస్తున్నవారికి బాగానే తెలుసు. గ్రామీణ ఉపాధి పథకంలో ఇచ్చే రోజూకూలీలో సగం కూడా గిట్టుబాటు కాని ఈ వృత్తినుంచి బయటపడాలని వారు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. నాలుగేళ్లనాడు 35 లక్షల మగ్గాలపై 65 లక్షల మంది ఆధారపడి బతికేవారని, ఇవాళ 23 లక్షల మగ్గాలపై 35 లక్షల మంది ఆధారపడి ఉన్నారని ప్రభుత్వలెక్కలు తెలియజేస్తున్నాయి. సర్కారీ గణాంకాలపై ఎవరి అనుమానాలు వారికుండొచ్చు కానీ తగ్గుదల అయితే వాస్తవం. వృత్తిలో ఉన్నవారిని బయటకు రప్పించడానికి బలవంతం చేయనక్కర్లేదు. దాని మీదే ఆధారపడిన వారి రక్షణకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరమూ ఉంది. అది వేరే కథ. కానీ దాన్ని రోమాంటిసైజ్ చేసే ధోరణి వల్ల చాలా నష్టం జరుగుతోంది. పారిశ్రామికయుగంలో ఇంకా నిర్దిష్టంగా చెప్పుకుంటే 2013లో ఇంకా చేతివృత్తులు అలాగే ఉంటే బాగుంటుంది అని కళ్లు విప్పార్చి మాట్లాడుతున్నామంటే అది అమాయకత్వమన్నా అయి ఉండాలి. ధూర్తత్వమన్నా అయ్యుండాలి. 
       చెప్పులు కుట్టుకునేవారు అలానే దర్జాగా కుట్టుకుంటూ ఆత్మగౌరవంగా బతుకుతుంటే ఎంత బాగుంటుంది అనలేరు. అంటే ఏమవుతుందో వారికి తెలుసు.చేనేత కొచ్చేసరికి మాటతీరు మారుతోంది. కులవృత్తుల్ని వదిలేసి కొత్త ఆర్థికవ్యవస్థలో వాటా కోసం పోరాడటం వల్లే దళితులు ఇతర బాధిత బృందాల కంటే ఇవాళ మరింత క్రియాశీలకంగా సమర శీలంగా మారగలిగారు. చేనేతను ఎవరూ పనిగట్టుకుని ధ్వంసం చేయనక్కర్లేదు కానీ రోమాంటిక్ సింబాలిజాన్ని ధ్వంసం చేయాల్సి ఉంది.. అర్థశతాబ్ది క్రితం పార్లమెంట్‌లో స్వర్ణకారుల గురించి వివా దం నడుస్తున్నపుడు మురార్జీదేశాయ్ ఆ కుటుంబా ల్లోని ఆడవా ళ్లకు కుట్టుమిషన్లు సప్లయ్ చేయడం దగ్గర్నుంచి వారి పిల్లలందరినీ తప్పనిసరిగా స్కూళ్లలో చేర్పించడం దాకా చాలా అంశాల గురించి మాట్లాడారు. మూత్రపానం మంచిదన్న నాయకుడు కూడా అంత అధునాతనంగా ఆరోజుల్లోనే ఆలోచించగలిగాడు.


        గాంధీగారు ప్రవచించిన గ్రామ స్వరాజ్యంపై కొందరికి ప్రేమ ఉండొచ్చు. నిజంగానే వృత్తి కార్మికులు గౌరవనీయంగా బతికితే బాగుండుననే ఆశ కూడా కొందరికి ఉండొచ్చు. దాన్ని నమూనాగా తీసుకుని తమ జీవితాలను ప్రయోగశాలగా మార్చుకున్నవాళ్లున్నారు. వాళ్లని గౌరవిద్దాం. కానీ దానిచుట్టూ అల్లుకునే రోమాంటిసిజాన్ని కాదు. రోమాంటిసిజమ్ జీవితం కాదు. గాంధీ గారి మూర్తిమత్వాన్ని కీర్తిస్తూనే ఆయన అభివృధ్ధి నమూనా వర్తమాన సమాజానికి పనికిరాదని స్పష్టంగా చెప్పాడు లోహియా 60 యేళ్ల క్రితం. ప్రపంచం మన ఆశల ప్రకారం నడవదు. మనం దాన్నుంచి చాలా దూరమే వచ్చేశాం. కేలండర్‌ను వెనక్కు తిప్పాలనుకునే వారికి చరిత్ర ఒక పేరిచ్చింది. దాని పేరు తిరోగామివాదం. స్టేటస్ కో యిస్టులకన్నా దారుణమైన వ్యవహారమిది. తిరోగామి భావజాలాన్ని కూడా విప్లవకరమైనదిగా చాటుకోగలిగిన వాతావరణం ఉండడమే మన సమాజంలో నెలకొన్న విషాదం.
- జి.ఎస్. రామ్మోహన్
(మార్చి 12, 213న ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)