ఇంత ఆలస్యంగా ఇపుడెందుకు అనేది ముందుగా మాట్లాడుకోవాలి. మిధునం తెరపై చేసిన హడావుడి కంటే తెరవెనుక చేస్తున్న హడావుడి ఎక్కువ. అదిప్పటికీ తెగట్లేదు. ఇంకా తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి లోపం గురించి బాధపడుతున్నవారూ, ఇంతటి సంస్కారవంతమైన సినిమాను ఆదరించలేని మన దౌర్భాగ్యం గురించి వగచుతున్న వారూ ఇంటర్‌నెట్లో కనిపిస్తూనే ఉన్నారు. కాస్తో కూస్తో ఆరోగ్యంగా ఆలోచిస్తారని భావించేవారు కూడా ఈ శోకగీతంలో తమవంతుగా గొంతు కలుపుతున్నారు. మిధునం గురించి ఎవరో ఏదో విమర్శనాత్మకంగా మాట్లాడారని తెలిసి ఇంత మంచి సినిమాను మెచ్చుకోవడానికి సంస్కారం ఉండాలి అని ఒక్కవాక్యంలో తిట్టిపోశారు ఒక కవిమిత్రుడు. ఆ మధ్య పాలపిట్ట అనే మ్యాగజైన్‌లో యాతండీ వ్యాఖ్య చేసి ఉన్నారు. ఇంత గొప్ప సినిమాను విమర్శించడానికి అసలు ఎవరికైనా నోరెలా వస్తుంది అన్నది సారాంశం. అభిరుచి కలిగిన మరికొందరు సాహితీ మిత్రుల ధోరణి కూడా అలాగే ఉంది. ఒక సినిమా గురించి ఇన్ని తప్పుడు అభిప్రాయాలు అచ్చోసి వదిలేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవడం సామాజికుల పని కాదు. బెటర్ లేట్ దెన్ నెవర్.
మిధునం గురించి తరచుగా వినపడే మాటలేమిటి? అది సంస్కారవంతమైన సినిమా. మానవసంబంధాలను ఉన్నతీకరించిన సినిమా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని అపురూపంగా చిత్రించిన సినిమా. నగరజీవనంలో మృగ్యమైపోతున్న సున్నితమైన అంశాలను ఎత్తిపట్టిన సినిమా. ఎక్కడికి పరిగెడుతున్నామో ఎందుకు పరిగెడుతున్నామో తెలీని మ్యాడ్ రష్‌లోంచి బయటకు వచ్చి మనలోపలికి మనం తరచి చూసుకునేలా చేసిన సినిమా. కొంచెం అటూ ఇటూగా ఇలాంటివే. సంస్కారం అనే పదం వినిపించినంతగా సెన్సిబిల్ సినిమా అని వినపడదు. సెన్సిబిల్ అనేది సాధారణంగా విలువలకు సంబంధించిన పదంగా వాడుతున్నాం. అస్తిత్వ్ సెన్సిబిల్ సినిమా, షిప్ ఆఫ్ థీసెస్ సెన్సిబిల్ సినిమా అంటాం. కానీ సంస్కారం కథ వేరు. ఎలాగైనా వాడుకోదగిన ఎలాస్టిసిటీ ఉన్న పదం. సంస్కారం, సంప్రదాయం, ధర్మం స్టేటస్ కోయిస్టులకు ఇష్టమైన పదాలు. అవి వ్యవస్థీకృత విలువలకు సాంస్కృతికపరమైన ఔన్నత్యాన్ని కట్టబెట్టే పదాలు. అందరూ కావాలని అదే అర్థంతో వాడతారని కాదు. కానీ వాడుకలో స్థిరపడిన రూఢి అర్థమైతే అదే.
ఇంతకూ ఏమిటీ సినిమా? శ్రీరమణ గారి మిధునం కథకు తెరనుకరణ. ఒక పల్లెటూరులో విశాలమైన పెరడు, చేద బావి, లతలు, తీగలు, చెట్లు చేమలు, గొడ్డూ గోదాతో పెనవేసుకున్న ఆలుమగల అనుబంధం. సంప్రదాయంగా వస్తున్న ప్రచారానికి అనుగుణంగా కనిపించే స్టీరియోటైప్ తిండిపోతు అప్పదాసు, బుచ్చిలక్ష్మి దంపతుల కథ. సోమయాజి, సోమిదేవమ్మలకు ఆధునిక రూపమన్నమాట. ముగ్గులు వేయడాలు, ఇల్లు అలకడాలు, నోములు, పూజలు, ఆలుమగల మధ్య అలకలు, చిలిపి సరదాలు, అప్పలస్వామి తిండియావకు సంబంధించిన రుచులూ, సంప్రదాయ జీవనవిధానానికి సంబంధించిన అభిరుచులూ అన్నీ కలగలిపి కట్టిన ఇంగువ మూట ఈ సినిమా. ఇద్దరే పాత్రలు. లంకంత కొంప. అందులో చెప్పన్నారు తీగలు, చెట్లు. అన్నీ నేరుగా కోసుకుని తినేయడమే. అప్పదాసు తన పనులన్నీ చేసుకోవడమేకాదు, ఇతరులు చేసే పనులను కూడా నశ్యం పీల్చినంత వీజీగా చేసేస్తూ ఉంటాడు. దూది ఏకుతాడు. కుండలు చేస్తాడు. బంగారం పని చేస్తాడు. చెప్పులూ కుడతాడు. సినిమాలో విశ్వనాధ్ ఎక్కువగానే కనిపిస్తారు. బాపు అపుడపుడు కనిపిస్తారు. సంప్రదాయ జీవనవిధానాన్ని ఆకాశానికెత్తుతూనే ఆధునికతతో భాగంగా వచ్చిన పర్యావరణ స్పృహను, ప్రైవసీ భావనను కలిపి కొట్టడం తెలివైన ఎత్తుగడ.
60దాటిన అమ్మానాన్నల ప్రేమ కథ అని ఒకట్యాగ్ లైన్ ప్రచారం చేశారు. ఈ అమ్మ "కాలుమోపితే ఎండిపోయిన కందిచేను పూత పెట్టే లచ్చుమమ్మ'' కాదు. "ఎద్దోలె ఎనుకాకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసే లచ్చుమమ్మ'' కాదు. ఎకరాలకెకరాల చెట్లను, గొడ్డుగోదలను చిరునవ్వు తొణక్కుండా పోషించే సూపర్‌మామ్ బుచ్చిలక్ష్మి. ఆ నాన్న కూడా "శిలువ మోస్తున్న ఏసుక్రీస్తులా నాగలి భుజాన వేసుకున్న'' రైతో మరొకరో కాదు. శిష్ట జీవనం సాగిస్తూనే సహస్రవృత్తుల సమస్త చిహ్నాలను తనలోనే ప్రదర్శించే సూపర్‌మాన్ అప్పదాసు. శ్రమైక జీవన సౌందర్యం అని శ్రీశ్రీ అన్నాడు కదాని శ్రమను మరీ ఇంత అందంగా చూపిద్దామంటే ఎలాగండీ భరణి గారూ! శారీరక శ్రమ మరీ అంత గ్లామరస్‌గా ఏమీ ఉండదండి! అది కష్టజీవులకందరికీ తెలుసండీ. శ్రమను గౌరవించడమంటే దాన్ని గ్లామరైజ్ చేసిచూపడం కాదండీ! ఆధునిక పరిశ్రమ వృత్తులు అనే బానిసత్వంలో మగ్గిపోయిన మనుషులకు కొత్త వెలుగు చూపించింది. శ్రమచేసే కులాలకు వెసులుబాటునిచ్చింది. "వేల సంవత్సరాలుగా చలనం లేకుండా పడి ఉన్న" భారతీయ సామాజక వ్యవస్థలో ఆధునిక పరిశ్రమ కుదుపు తెచ్చింది. రైళ్ల ప్రవేశంతో ఏమేం జరుగుతాయని విశ్వనాధ సత్యనారాయణ బెంగటిల్లాడో అవన్నీ ఇపుడు జరుగుతున్నాయి. చెప్పుల గూటాల నుంచి, మగ్గం గుంతల నుంచి కొలిమి మంటలనుంచి బయటపడడం వల్లే ఇవాళ అలాంటి కులాల పిల్లలు చాలా మంది అంతకుముందెన్నడూ చూడని రీతిలో డాక్టర్లు, లాయర్లు, కంప్యూటర్ ఇంజనీర్లు అయి సామాజిక సంపదలో తమవంతు వాటా అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందు తమను చిన్నచూపు చూసినవారి సరసన కూర్చోగలుగుతున్నారు. మళ్లీ ఇపుడు వృత్తులను ఆరాధించే పద్ధతిలో వాటి చిహ్నాలను చూపిస్తే అబ్బో, మమ్మల్ని గౌరవించాడు అని ఎగబడి చూడాలా! ఏమియా ఇది! ఏమి మాయయా ఇది!
అప్పదాసు స్వర్గానికి సెంటీమీటర్ దూరంలో అని వర్ణించే రుచులు తెలుగునాట కేవలం ఐదు శాతం లోపువారి రుచులు. ఆ వ్రతాలు, నోములు, వగైరా కూడా మైనార్టీ వ్యవహారమే. అయినా సరే, ఇది తెలుగువారు సగర్వంగా ఎగరేసిన పతాకం, తెలుగుదనానికి అచ్చమైన చిరునామా, తెలుగోడి సత్తా లాంటి మాటలు బోలెడన్ని వినిపించాయి. వినిపిస్తూనే ఉన్నాయి. కేవలం ఐదు శాతం లోపు ఉన్నవారిలోని సంప్రదాయవాదుల ఆచార వ్యవహారాలు, వారి గోములు, అలకలు, చిలిపితనాలు మొత్తం తెలుగుదనానికి పర్యాయపదంగా చాటగలిగిన ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? ఆ ప్రచారాన్ని నోరుమూసుకుని చూసే దశకు మనం ఎందుకు చేరుకున్నాం? ఒక కులం చిహ్నాలు కనిపించినంత మాత్రాన దాన్ని వ్యతిరేకించాలా, అందరికీ వర్తించే కొన్ని అనుభూతులుంటాయి కదా అనే ప్రశ్నలు తలెత్తొచ్చు. అంతవరకే ఉంటే సమస్య లేదు. సినిమాను సినిమాగా చూసి మంచిచెడ్డల గురించి మాట్లాడొచ్చు. కానీ ఇది తెలుగు సంస్కృతి,సంస్కారం అనడంలోనే అసలు సంగతి దాగిఉంది. కొలకలూరి ఇనాక్ కథనో, నాగప్పగారి సుందర్రాజు కథనో, వేముల ఎల్లయ్య కక్కనో ఇలాగే సినిమా తీసి ఇది తెలుగు సంస్కృతి అంటే ఇలాగే ఆమోదించి ఉండేవారా? గ్రామీణజీవితాన్ని నిజాయితీగా చిత్రించిన నామిని, బండినారాయణస్వామి కథలను సినిమాలుగా తీస్తే ఇలాగే తెలుగు సంస్కృతి అని నెత్తిన పెట్టుకునే వారా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోకపోవడంలోనే బానిసత్వం ఉంది. సమాజంలో ఆధిపత్యంలో ఉన్నవారి సంస్కృతే మొత్తం సమాజపు సంస్కృతిగా ప్రచారంలో ఉంటుంది. ఇతరులది ఇతరంగానే ఉంటుంది. పట్టణీకరణతో ఆధిపత్య ప్రదర్శనకు అవకాశం లేకుండా పోయిన కులాలు ఏదో రూపంలో తిరిగి తలెగరేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాయి. తెలుగు సమాజంలో ఆర్థిక రాజకీయ ఆధిపత్యం కోల్పోయి చాలాకాలమే అయినా సంస్కృతి విషయంలో పట్టు నిలుపుకోవడానికి బ్రాహ్మణవాదులు పెనుగులాడుతూ ఉన్నారు. ఇదే సమయంలో కొంతమంది ఇతర అగ్రవర్ణ లిబరల్స్‌లో కూడా నగరీకరణ మీద విసుగు కనిపిస్తోంది. నగరజీవితపు పరుగుపందెంపై నిరసనా, పల్లెజీవితంతో పాటు కోల్పోయిన ఆనందాలపై వలపోత ఇతరత్రా సమూహాలకు పాకుతున్నది. ముఖ్యంగా పట్టణీకరణవల్ల ప్రయోజనాలు పొందడంలో ముందున్న సమూహాల్లో. ఆయా కుటుంబాల్లో రెండో అర్బన్‌తరం కూడా వచ్చేసి ఉంటుంది. ఇతరత్రా ఆధిపత్యాన్ని సవాల్ చేయలేనపుడు ఈ రకంగా ఆమోదనీయమైన మార్గంలో ముందుకు రావాలని ఆ సమూహం ప్రయత్నిస్తోంది. భాష పేరుతో సంస్కృతి పేరుతో ముందుకొస్తున్న బృందాలను, వారి భాషను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇరవై యేళ్ల క్రితం హైదరాబాద్ శంకర్‌మఠ్, విద్యానగర్ లకు చెందిన వృద్ధులు సాయంత్రాల్లో ఆర్ట్స్ కాలేజీ రైల్వేస్టేషన్ బెంచీలమీద కూర్చుని అమెరికాలోని సంతానం గురించి బెంగగా గోముగా చిరుకోపంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. ఇపుడు అలాంటి వృద్ధులు అన్ని ప్రాంతాల్లో అన్ని కులాల్లో పెరిగిపోయారు.
వాళ్లు పిల్లలను అడగాల్సిన అవసరం లేకుండా ఖర్చు చేసుకునే స్వ్చేఛ్చ ఉండాలనుకుంటారు. పట్నవాసపు ఉద్యోగ జీవితాలు, నెలవారీ పెన్షన్లు, అద్దెలు మధ్యతరగతి వృద్ధులకు అలాంటి అవకాశాన్ని కల్పించాయి. అలాగే ఆధునికతతో పాటు వచ్చిన ప్రైవసీ అనే భావన పల్లెటూరి వృద్ధులకు లేని ఒక అదనపు సౌకర్యాన్ని వారికి కల్పించింది. అదే సమయంలో పల్లెటూరి మాదిరి(ఇది కూడా భ్రమే) కొడుకు కోడళ్లపై కొంతైనా పెద్దరికం చెలాయిద్దామని ఉంటుంది. మనమడు, మనుమరాలు కంప్యూటర్లతోనో ఫ్రెండ్స్ తోనో కాకుండా తమ ఒడిలో కబుర్లు చెప్పుకుంటూ, కొడుకు కోడళ్లు అన్ని విషయాల్లో సలహాలడుగుతూ ఉంటే బాగుండునని కూడా ఉంటుంది. వృద్ధులనే కాదు, పల్లె, పట్టణ జీవితం రెండూ తెలిసిన తరంలో చాలామందికి రెంటిలోని సానుకూలమైన అంశాలను అందుకోవాలని ఉంటుంది. రెండు జీవన విధానాలకు మధ్య వైరుధ్యం ఉన్నదని తెలిసినప్పటికీ ఒకదాన్ని వదులుకోవడానికి మనసు అంగీకరించదు. ఆచరణలోనేమో ఆర్థికాభివృద్ధికి అవసరమైన వలసబాటలో పయనిస్తారు. గ్రామీణ జీవనంలో కోల్పోయిన 'ఆనందాల' కోసం గొణుగుతూ ఉంటారు. ఎన్‌ఆర్‌ఐల్లో ఈ వలపోత మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆకలి తీరిన మనిషి ఆనక తనదైన సొంత అస్తిత్వం కోసం ఆరాటపడతాడు. అక్కడ సొంత అస్తిత్వాన్ని విజువల్‌గా చూపించుకోవడానికి భరతనాట్యాలు, బతుకమ్మలు ఆడుతుంటారు. పర్వాలేదు. మనకు తెలుగు భాషా సంస్కృతుల రక్షణ గురించి ఉపన్యాసాలు ఇవ్వనంత వరకూ అది అర్థం చేసుకోదగిన ఆరాటమే.. పల్లెటూరి జీవన విధానం పట్ల ఉన్న గ్లామర్‌ను, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ప్రైవసీ అనే కాన్సెప్ట్‌ని కలిపి వడ్డించింది ఈ సినిమా. రెండూ అతకని విషయాలు. అందుకే ఈ సినిమా శిల్పారామంలో ప్రదర్శించే పల్లెలూరి ఇల్లులాగా ఉంది తప్పితే సహజంగా లేదు. పట్టణీకరణ ఆరంభదశలో అంటే 60, 70ల కాలంలో తెలుగుసినిమా "రెక్కలు వచ్చి పిల్లలు వెళ్లారు, రెక్కలు అలిసి మీరున్నారు, పండుటాకులమై మిగిలేము'' అని పాడుకుంది. పట్నపు కోడలనగానే మిడ్డీనో గౌనో వేసి నోట్లో సిగరెట్ పెట్టి నానా యాగీ చేసింది. నాటి పల్లె నేటి పట్నమయ్యింది. నాటి పట్నం ఇపుడు అమెరికా అయ్యింది. కాకపోతే పల్లె పట్టణాన్నిఆడిపోసుకున్నంత ఈజీగా ఆడిపోసుకోవడం కష్టం. సంపదను చాలామందే అనుభవిస్తున్నారు. దగ్గరి బంధువో, స్నేహితుడో ఎవరో ఒకరు అమెరికాలో లేని మధ్యతరగతి ఇల్లు ఒక్కటి కూడా కానరాని స్థితి. అందువల్ల ఆ భాష వదిలేసి దాని బదులు ఉమ్మడి మిత్రుడు గ్రామం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ప్రాక్టికల్‌గా మనం వెళ్లకపోయినా అలా అనుకుంటూ ఉండొచ్చు. అదొక అందమైన కలగా చూసుకుంటూ ఉండొచ్చు. ఈ దశకు చాలామందే చేరుకున్నారు. ఈ పరిణామమే ఈ సినిమాకు ప్రేరణ.
ఇందులో సోమయాజుల వారు భార్య చీర ఉతకడం, ఆ సందర్భంగా ఏమిటండీ ఇది అని ఆమె కంగారుపడిపోతే ఆయనగారు రోమాంటిక్ డైలాగులు కొట్టడం లాంటి లిబరల్ షో చేశారు. కానీ సోమయాజివారు తూగుటుయ్యాలలో పవ్వలిస్తుంటే సోమిదేవమ్మ గడపమీద కొంగుపర్చుకుని తలవాల్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఎవరెక్కడుండాలో అక్కడే ఉండాలమ్మా! సరదాగా ఒక పూట రోల్ ఛేంజ్ చేసుకుంటాం కానీ పూర్తిస్థాయిలో మార్చుతామంటే ఊరుకోము! అంతేనా భరణిగారూ! "వంటావార్పూ, పిండిరుబ్బడం, బట్టలుతకడం, ముగ్గువేయడం లాంటివన్నీ చేస్తా ఉంటే జబ్బులెందుకొస్తాయి" అని సోమయాజి ఉరఫ్ అప్పదాసు ఉరఫ్ భరణి గారు ఒక ఉపన్యాసమిస్తారు. ఈ పనులన్నీ ఎవరు చేసేవి? ఈ ఉపదేశం ఎవరికిస్తున్నట్టు? ఒకసారి కాళ్లు పట్టిచ్చి, మరోసారి జడవేసి నాలుగు రొమాంటిక్ డైలాగులు చిలకరించినంత మాత్రాన సారం మారుతుందా! ఏ సంప్రదాయ జీవనవిధానమైనా స్ర్తీలను అణచివుంచేదే. ఆడవాళ్లను ఆడిపోసుకోవడమొక్కటే కాదు. ఇందులో మూఢనమ్మకపు ప్రచారమూ దాగి ఉంది. మనం కెమికల్స్ కూడు తిని అనారోగ్యంగా తయారయ్యామని, గ్రామాల్లో రోగాలు రొస్టులు లేకుండా ఇంతకంటే ఆరోగ్యంగా జీవిస్తారని మేధావులకునేవారు కూడా నమ్మేస్తూ ఉంటారు. ఇది కూడా పల్లెజీవితం తెలీని గ్లామర్ వ్యవహారమే. పల్లెల్లో కనీసం రోగం పేరుకూడా తెలీకుండా రాలిపోతూ ఉంటారు. అది కేన్సర్ అని గుండెపోటు అని తెలీకుండా హఠాత్తుగా పోతే కాటికి మోసుకుపోతా ఉంటారు. చివరికి మలేరియాతో కూడా చచ్చిపోవడమే. అక్కడ అరవై దాటితే కృష్ణా రామా అని మూలన కూర్చోవాల్సిన వయసుకు చేరుకున్నట్టే. వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఈ వయసు కొంచెం అటూ ఇటూగా ఉంటుంది. పెరిగిన ఆరోగ్యస్పృహతో మెరుగైన వైద్యసౌకర్యాలతో హెల్త్ చెకింగులతో, ఇన్సూరెన్స్‌లతో మనం వారికంటే మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాం. 70ల్లో కూడా టింగురంగా అంటూ టీషర్ట్, నిక్కరూ వేసుకుని తిరుగుతూ పల్లెలు మనకంటే ఆరోగ్యంగా ఉండేవని ఆడిపోసుకోవడం లేదా చొంగకార్చడం 'అత్యాధునిక' మాయ.
ఇదంతా రాజకీయమండీ, సినిమా గురించి మాట్లాడతారనుకుంటే ఇవన్నీ చెబితే ఎలాగండీ అనబోదురేమో! ఏది రాజకీయం కాదండీ! మేమొక సినిమా తీశాం, మంచి సినిమా తీశాం, అందమైన సినిమా తీశాం అని చెప్పుకోవచ్చు. ఎవరిది వారికి ఇంపుగానే ఉంటుంది కాబట్టి చెప్పుకోవడం వరకూ తప్పులేదు. చాలామంది చెపుతూనే ఉంటారు. కానీ తెలుగు, సంస్కృతి, సంప్రదాయం వగైరా మాటలేటండీ! అది రాజకీయం కాదా అండీ! అందులో సున్నితమైన అనుభూతులున్నాయి కదా వాటిమాటేమిటి, ఆ వరకు తీసుకుని సినిమాను ప్రశంసించవచ్చుకదా అందురేమో! ఆ అనుభూతులను చూపించడంలో నిజాయితీ కావాలి. ఈ సినిమాలో ఏ మాత్రం అలసట లేకుండా ఇద్దరు వృద్ధులు ఆ లంకంత కొంపను అన్ని చెట్లను మెయిన్‌టెయిన్ చేస్తా ఉంటారు. చెప్పనలవి కానన్ని వంటలు చేసుకుంటా ఉంటారు. ఆవులను గేదెలను పోషిస్తా ఉంటారు. మూడో మనిషి కనిపించడు. సాధ్యమా ఇది?మామూలు మసాలా సినిమాలో ఒక హీరో వందమందిని కొట్టేయడానికి దీనికి తేడా ఏమైనా ఉందా! అంతేనా! ఆ ముసలాళ్లిద్దరూ ఉష్ర్టపక్షుల్లా మరో మనిషి అంటూ సొంటూ లేకుండా జీవిస్తా ఉంటారు. ఇది ఏమి సామాజికత స్వామీ! ప్రైవసీ పేరుతో సాటి మనుషులకు దూరంగా బతికేయడం గొప్ప సంస్కృతా! వృద్ధులకు ఇతరుల మాదిరే ప్రైవసీ కచ్చితంగా అవసరం. కానీ ఇలానా! అసలు మనిషి అనేవాడు(రు) ఇంత అన్‌సోషల్‌గా జీవించగలడా(రా)! చేదబావిని చూపించి నీళ్లు తోడుకోవడం అనేది ఆరోగ్యానికి అవసరమైన శ్రమ అని డైలాగ్ కొట్టించితిరి కదా, మరి గ్యాస్ స్టవ్ ఎందుకు వాడితిరి? అక్కడ కూడా నిప్పుల కుంపటి పెట్టి ఊదుతూ ఉంటే ఊపిరితిత్తులకు ఎక్సర్‌సైజ్ అని చెప్పించకపోయారా! అక్కడ కంఫర్ట్ కావాల్సివచ్చింది. అంటే దర్శకుడు చూపించదల్చుకున్న సింబాలిజమ్ మేరకు సంప్రదాయాన్ని, ఆధునికతను, సౌకర్యాలను టైలరింగ్ చేసుకున్నారని అర్థమవుతుంది. చేదబావి, బాదం చెట్టు లాంటివి శిష్ట సంప్రదాయ జీవులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే సింబల్స్. వాటిని డిస్ట్రబ్ చేయడం డైరక్టర్‌కు ఇష్టం లేదు. పైకి అభిరుచిప్రధానమైనదిగా కనిపించినప్పటికీ సారాంశంలో ఈ సినిమా అందించేంది వేరు. ఇది పర్ణశాలలో విహరిస్తున్న జింకకాదు. మాయారూపంలోని మారీచుడు.
" రిటైర్‌మెంట్ తర్వాత ఊర్లో ఒక రిసార్టు లాంటిది కట్టుకుని అక్కడికి వెళ్లిపోవాలని చాలామందికి ఉంటుంది. వెళ్లరు. కానీ అలాంటి కల అయితే ఉంటుంది. వెళ్లినా వెళ్లకపోయినా ఈ సినిమా ద్వారా అలాంటి వారికి ఆ అనుభూతిని క్రియేట్ చేసి పెట్టాం'' అని భరణి ఒక ఇంటర్య్వూలో చెప్పారు. కరెక్ట్‌గా చెప్పారు. ఇది వారి సినిమానే. ఆచరణతో సంబంధం లేని సంపన్న కోరికలు కాబట్టే ఇది హాలీవుడ్ ఏలియన్స్ సినిమాల మాదిరి ఉంటుంది. కాకపోతే అందులో అన్నీ అంతరిక్షపు హైటెక్ సామాగ్రి, ఇందులో ముగ్గులూ దప్పళాలున్నూ!
(జి ఎస్ రామ్మోహన్)
(సారంగ వెబ్‌మ్యాగజైన్‌లో 2013 నవంబర్ 14న ప్రచురితం)