Thursday, 13 March 2014

బుజ్జిపిల్ల-తెల్లపిల్ల

ఈ మధ్య ఒక పాట వినాల్సి వచ్చింది.  బుజ్జిపిల్ల, తెల్లపిల్ల, ఐలవ్యూ పిల్లా అనే పాట.  సినిమా పేరు కూడా తెలుగు సినిమావాళ్ల ఊత పదం మాదిరి ఎరైటీగా ఉంది. పోటుగాడు. వెరీ ఇంటరెస్టింగ్‌! యువార్‌ సో టైటూ, ఐయామ్‌ నాట్ వైటు, ఇట్స్‌ ఆల్‌ రైటూ అనే దివ్యమైన చరణం ఈ పల్లవిని అనుసరిస్తుంది. కొలవెర్రి తగ్గింది  కానీ పాటల శైలిపై ఆ ప్రభావం మిగిలే ఉంది. ఇది సినిమా పాట మాత్రమే కాదు. స్ర్తీలకు సంబంధించి, రంగుకు సంబంధించి మన సమాజంలో వ్యాపించి ఉన్న వ్యాధులకు దర్పణం.  భారత్‌లో కొంతకాలంగా రేసిజం మీద చర్చ జరుగుతూ ఉంది. ఈశాన్య రాష్ర్టాల అమ్మాయిలమీద వివక్షగురించి లైంగిక దాడులు ఎక్కువవడం గురించి కొన్ని రోజులుగా మీడియాలో చాలా విశ్లేషణలే వస్తున్నాయి. 90ల తర్వాత ఈశాన్యం నుంచి  'మెయిన్‌ల్యాండ్‌'కు వలసలు పెరిగాయి. ఎక్కువగా సర్వీస్‌ రంగంలో ఉపాధి పొందుతున్నారు.  బ్యూటీపార్లర్లకు వెడితే అక్కడ మసాజ్‌ చేసేది ఎక్కువగా  వారే. హోటల్‌ రంగంలోనూ వారే. పెళ్లిళ్లలో బొమ్మల్లాగా నుంచోబెట్టేది వారినే. ఇంగ్లిష్‌ వల్ల ఆధునిక రూపమెత్తినప్పటికీ సారాంశంలో ఆదివాసీలు వారు. మనకు సేవలు చేయువారిని చులకనగా  చూచుట సంప్రదాయం. దీనికి తోడు వారు వేసుకునే దుస్తులు,  తిండితిప్పలు,  ఇతరులతో వ్యవహరించడంలో చూపే చొరవ లాంటివన్నీ కలిసి వారిపై చులకనభావం పెరిగేట్టు చేస్తున్నాయని అది నేరాలకు దారితీస్తోందని విశ్లేషణ. ఈ పోకడ కొత్తదేమీ  కాదు. పాతికేళ్ల క్రితం మన సినిమాల్లో లూసీలు, లౌసీలు రిసెస్పనిస్టులు, నర్సులుగా ఉండేవారు. మళయాళీలపై ఇలానే  చిన్నచూపు కనిపించేది. సినిమా వాళ్లు ఆ పాత్రలకు తొడిగే  చిట్టి పొట్టిగౌన్లు, ఇంగ్లీష్ కలగలపి కొట్టే తెలుగులు, అపుడపుడు వాళ్ల చేతుల్లో బ్రాందీ బుడ్లు, సిగరెట్‌ బట్లూ, వెరసి వారంటే అందుబాటులో  ఉండే సరుకు అనే చులకన. చదువుకున్న వారి భాషలో ''ఈజీ గోయింగ్ పీపుల్‌". స్టీరియోటైపింగ్‌ మనకు కొత్తదేమీ కాదు.  అవకాశముండాలే కానీ దాన్ని ఎంత వికారమైన స్థాయికైనా తీసికెళ్లగల సాధనం తెలుగు సినిమా.
     


వికార ప్రదర్శనకు   'మనం' కాకుండా ఇంకెవరో ఒక సమూహం కావాలి. మనమూ వాళ్లూ అనే పరిభాష కావాలి.
ఈ 'మనం' అనేది మారుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఈ 'మనం' ప్రాంతం అవుతుంది. అపుడు 'వాళ్లు' నేపాలీయులో ఈశాన్యం  వాళ్లో కేరళ వాళ్లో అవుతారు. హైదరాబాద్‌లో బ్యూటీపార్లర్‌కు పరిమితం కాకుండా మన ఎక్స్‌పోజర్‌ పెరిగి ఏ ఢిల్లీలోనే నాలుగు రోజులు  ఉండాల్సి వస్తే ఈ జ్ఞానం ఇంకాస్త పెరిగి "అమ్మో పంజాబీ ఆడవాళ్లా, వాళ్లు చాలా ఫాస్ట్‌ గురూ,  ఎగేసుకుని పోతారు అని జోకొచ్చన్నమాట.  అలా కాకుండా బావి మరీ చిన్నదైపోయి జిల్లా స్థాయికొచ్చేశామనుకోండి. అపుడు 'వాళ్లు' పెద్దాపురం పాపలయిపోతారు.
పేట చిలకలయిపోతారు. కొన్ని సార్లు ఈ 'మనం' కులం అవుతుంది. అపుడు వాళ్లు భోగం వాళ్లో దళితులో అవుతారు. అయితే వ్యవస్థలో  వచ్చిన మార్పులు ఇక్కడ కులాన్ని తీసేసి మార్కెట్‌ను పెట్టడం వల్ల ఈ కోణం తగ్గిపోయింది. ఇవాళ మసాజ్‌ పార్లర్లు, రిసార్టులు, హోటళ్లమీద దాడుల్లో పట్టుబడుతున్నవాళ్లలో అన్ని కులాల వాళ్లు ఉంటున్నారు. పెట్టుబడి అక్కడ  కులాన్ని దాదాపు తీసేసింది. మిగిలిన చాలా రంగాల్లాగే ఫ్లెష్‌ మార్కెట్‌ కూడా వేరే రూపం తీసుకుంది. కాబట్టి ఈ 'మనం' అనేది కులాన్ని ఆశ్రయించడం తగ్గిపోయింది. కొన్ని సార్లు ఈ 'మనం' మతం అవుతుంది.  అపుడు 'వాళ్లు' క్రైస్తవులో ఇంకెవరో అవుతారు. ముస్లింలయితే చాదస్తులు. క్రైస్తవులైతే మరీ ఫాస్ట్‌ పీపుల్‌. మనం మాత్రమే కరెక్టన్నమాట. వి  ఆర్ ఆల్వేస్‌ నార్మల్‌. దే ఆర్‌ ఆల్వేస్ అబ్‌నార్మల్‌. అది ఎవరూ కాదనరాని గీత. కానీ పౌరుషేయమే.  బుజ్జిపిల్ల-తెల్లపిల్ల మనలో  కాకుండా మనకు విడిగా ఉంటేనే అందరూ వికారాలు బాహాటంగా ప్రదర్శించుకోవడానికి వీలుంటుంది. ఏ లోపమైనా వికారమైనా మనలో  కాకుండా బయట చూడడం చాలా సుఖం.
ఇంతకీ ఈ గొడవకు ఈ బుజ్జిపిల్ల-తెల్లపిల్లా పాటకు సంబంధమేటి? మన లైంగిక సారస్వతంలో అమ్మాయి కన్నె పిల్లగా ఉండవలె.  అబ్బాయి ఎంత ముదురైనప్పటికీ ఇబ్బందేమీ లేదు. కన్యాదానమే చేయవలె. తొలిరేయి నెత్తురు కళ్ల చూడవలె. యువార్‌ సో టైటూ  అనే పవిత్రమైన చరణరాజంలో ఇలాంటి విషయం దాగున్నది. ఈ టైట్‌ లూజూ అనే పదాలు ఇటీవల  లైంగిక పరిభాషలో ఎక్కువగా  వినిపిస్తున్నాయి. మన టెన్త్‌ క్లాస్‌ ప్రేమ సినిమాలన్నింటా వీటితో ముడిపడిన బూతు జోకులు, అమ్మాయి-ఆంటీ విభజనలు చాలానే  ఉంటున్నాయి. కన్యాసంభోగంతో యవ్వనం తిరిగొస్తుంది లాంటి దారుణమైన నమ్మకాలు చాలా సమాజాల్లో ఉన్నాయి. ఆ రకంగా బుజ్జిపిల్ల లాంటి రోగాలన్నీ పాత కాలపు రోగాలు.  గంభీరమైన పరిభాషలో చెప్పుకుంటే ఫ్యూడల్‌ సమాజం నుంచి  కొనసాగుతున్న రోగాలు. లైంగిక చర్యలో పొందే ఆనందంలో  దాని  పాత్ర ఏమీ ఉండదని చాలా అధ్యయనాలే తేల్చినా తలల్ని మట్టిలో పాతేసుకున్న ఉష్ర్టపక్షులు ఆపాత చూరును పట్టుకుని  వేలాడుతున్నాయి. యంగ్‌ ఫ్లెష్‌ పట్ల వ్యామోహం చిన్నపిల్లల అమ్మకాలను ప్రేరేపిస్తున్నది. భయానకమైన సెక్స్‌రాకెట్‌ను, హింసను ప్రేరేపిస్తున్నది. .  బుజ్జిపిల్లా తెల్లపిల్ల లాంటి పాటలు ఇలాంటి రోగాలను వ్యాపింపజేయడంలో వైరస్ లాంటి పాత్రను పోషిస్తున్నాయి. ఇదొక విషవలయం. ఎప్పటికప్పుడు తిరగబెడుతున్న బుజ్జిపిల్లా అనే పాత రోగానికి తోడుగా తెల్లపిల్ల రోగం మధ్యలో వచ్చి చేరిపోయింది. అది వారసత్వపు రోగం కాదు.  పెట్టుబడి తెచ్చిన రోగం. మన సంప్రదాయ సుందరులు తెల్లనివారు కాదు. క్రిష్ణలు. మార్కెట్‌  వ్యాపింపజేసిన ఆధునిక వ్యాధి ఇది. అయితే ఫ్యూడల్‌ ఆధిపత్య లక్షణం మాదిరి ఈ ఆధిపత్యానికి ఆరాధనీయమైన లక్షణం అన్నివేళలా ఉండదు. అదొక యావ, అంతే.  ఆరాధనే నిజమైతే తెలుపే ఆరాధనీయమైతే ఈశాన్యం అమ్మాయిలు, నేపాలీ అమ్మాయిలు, ఉక్రెయన్‌ అమ్మాయిలు అంత చులకనైపోరు. ఇక్కడ ఆధిపత్యం- చులకన అనేవి మార్కెట్‌ అవసరాన్ని బట్టి మార్కెట్‌లో వారున్న స్థితిని బట్టి ఉంటుంది.  సాపేక్షకమైన తేడాలతో గ్రడేషన్స్‌ ఎక్కువగా ఉండే భారత్‌లో వర్ణాధిక్య భావన పశ్చిమదేశాల రేసిజం కంటే ఒకింత భిన్నమైనది. ఉత్తరాది వారు అక్కడి సాపేక్షకమైన తెల్ల తోలుతో సరిపెట్టుకోలేక నేపాలీ మాసం మీదుగా ప్రయాణించి ఇటీవల సోవియెట్‌ దేశాల ఆడమాంసం కోసం ఎగబడుతున్నారు. హైదరాబాద్లో కూడా బలిసినోళ్లు సోవియెట్‌ శరీరాల్నే దిగుమతి చేసుకుంటున్నారు.  ఎక్కడెక్కడ తెల్లగా ఉండే నిరుపేద అమ్మాయిలు దొరికితే అక్కడక్కడకు మార్కెట్‌ పరుగులు పెడుతోంది. తెలుపు ఒక మార్కెట్‌ లక్షణం, అంతే. సహజసిద్ధంగా వచ్చే లక్షణానికి లేని ఆధిపత్యాన్ని ఆపాదించడం దాన్ని కొనుగోలు చేయొచ్చు అని అవాస్తవికమైన భ్రమల్ని ప్రచారం చేయడం మార్కెట్‌ మాయ. ఈ కొనుగోలులో సౌందర్య సాధనాలుఉంటాయి. తెల్ల ఆడశరీరాలూ ఉంటాయి. అది ఆధిపత్యానికి చిహ్నం అని భావించాక అలాంటి లక్షణం ఉన్న శరీరాన్ని పొందడం అనేది కూడా ఆ యావలో భాగమవుతుంది. బలిసినోళ్లకు డ్రైవర్‌గా పనిచేస్తూ వాళ్లలాగే తానూ రష్యన్‌ అమ్మాయిని పొందాలన్న యావలో పడిన ఒక కుర్రాడి విషాద ఘట్టాన్ని అరవింద్‌ ఆదిగ తన వైట్‌ టైగర్‌లో అద్భుతంగా చిత్రించాడు. అందానికి తెలుపును పర్యాయపదం చేసి దాని చుట్టూ ఎన్ని వేల కోట్ల మార్కెట్‌ని అభివృద్ది చేశారో చూస్తూనే ఉన్నాం. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్స్‌ మన బానిసత్వానికి పరాకాష్ట. ఈ రోగాన్ని ఎంతగా ఇంటర్నలైజ్‌ చేసుకున్నామంటే  ఉష్ణదేశంలో నివసించే మనం, సగటు శరీర వర్ణం నలుపుగా ఉండే మనం మన సినిమాల్లో నల్లవాళ్లని బపూన్లని చేసి వారిమీద జోకులు  వేసేస్తున్నాం. నల్లవాళ్లు మెజార్టీగా ఉండే సమాజాల్లో నలుపు మీద అంత దుర్మార్గమైన క్రూరత్వం దేనికి సంకేతం? నలుపులో కూడా నికార్సైన నలుపుకు పెట్టింది పేరైన దక్షిణాదిన తమిళంలో వడివేలు, తెలుగులో బాబూమోహన్‌  పాత్రలు దేనికి సంకేతం? పార్తీపన్‌, విజయ్‌ లాంటి వారు  హీరోలుగా ఉండే తమిళసినిమా రంగంలో వడివేలు పాత్రలు అలా ఉండడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం.  మన దేశంలో భూస్వామ్య సమాజం కులాధిపత్యాన్ని న్యూనతను ఎలా ఇంటర్నలైజ్‌  చేసుకున్నదో  పెట్టుబడి దారీ సమాజం వర్ణాధిపత్యాన్ని న్యూనతను అలా ఇంటర్నలైజ్‌ చేసుకుంటున్నది. మొదటిది సాంఘికపరమైన  ఆధిపత్యానికి అవసరమైన వ్యవహారం అయితే రెండోది మార్కెట్‌కు అవసరమైన ఆధిక్యభావన.
      మళ్లీ పాట దగ్గరకు వద్దాం. ఇక్కడ పాటపాడుతున్నది దక్షిణాది హీరో పాత్రధారుడు.  ఎంత తెల్ల వ్యామోహమున్నా  దక్షిణాది హీరో ఎంతో కొంత  నల్లగా ఉండక తప్పదు. హీరోలు పెట్టుబడితో సంబంధమున్నవారు, లేదా వారి వారసులు.  వాళ్లు కథానాయకులుగా ఉండడం అనివార్యం. అందువల్ల జనంలో ముఖ్యంగా అబ్బాయిల్లో  తెల్ల తోలు పట్ల ఉన్న వ్యామోహాన్ని సొమ్ము చేసుకోవడానికి ఉత్తరాది అమ్మాయిలను దిగుమతి చేసుకోవాలి.  వాళ్లు సాధ్యమైనంత లిబరల్గా ఒళ్లు చూపించేవాళ్లై ఉండాలి. వాళ్లకు మిల్కీ బ్యూటీ లాంటి కుర్రాళ్లను ఊరించే పేర్లు పెట్టాలి. ప్రదర్శన అనేది యుగలక్షణమైన కాలంలో ఉన్నాం కాబట్టి 'అందాల్ని' ప్రదర్శించడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఇట్సే మార్కెట్‌ నీడ్!  ఆస్తులైనా అందాలైనా ప్రదర్శించుకోకుండా మార్కెట్‌ చేసుకోలేని దశ ఇది. అయితే శరీరం చూపించడంలో లిబరల్‌గా ఉండగలిగే వాళ్లందరూ నటించడంలో లిబరల్‌ ఉండలేరు కాబట్టి ఆ పాత్ర నామ్‌కే వస్తే అయిపోవాలి. నాలుగైదు పాటలు, రెండు రోమాన్స్‌ సీన్లు వగైరాలకు పరిమితం కావాలి. మనమెలాగూ ఉన్నట్టుండి రంగు మార్చుకోలేం కాబట్టి యువార్‌ సో టైటూతో పాటు ఐయామ్‌నాట్‌ వైటూ, ఇట్స్‌ ఆల్‌ రైటూ అని లిబరల్‌గా అనేయొచ్చు. అక్కడ మనలాంటి హీరో ఒకడు తెల్లతెల్లగా ఉన్న చిన్నఅమ్మాయి మీద అక్కడా ఇక్కడా చేతులు కాళ్లూ వేస్తూ వికారాలు చూపిస్తా ఉంటే అదేదో మనమే చేస్తున్నట్టుగా మన యువత ఆనందించే వీలుండాలి. ఈ తెల్లతోలు వ్యామోహం వల్ల తొలుత తెలుగులోనూ ఇపుడిపుడే తమిళనాట కూడా ఉత్తరాది తారలు దూసుకుపోతున్నారు. స్థానిక అమ్మాయిలకు అవకాశమే లేకుండా చేస్తున్నారు. మన హీరోల వయసును, రంగును ఎంత మేకప్‌తో నైనా పూర్తిగా మార్చలేం కాబట్టి వారి సరసన చిట్టిపొట్టి తెల్లతెల్లని అమ్మాయిలను తెచ్చిపెట్టి వారి ఒళ్లు చూపించుట, వారి ఒంటిని వర్ణించుట, అందులో లైంగికపరమైన టిటిలేటింగ్‌ భాషను ఉపయోగించుట అవశ్యమన్నమాట. ఈ అడ్డదారి మార్కెట్‌  ఇప్పటికే  స్థిరీకృతమవుతున్న దుర్మార్గమైన విలువలను మరింత పెంచిపోషించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. మన సినిమా ఈ సాంస్కృతిక కాలుష్యవాహికగా పనిచేస్తున్నది. దానికి సూచికే  బుజ్జిపిల్ల-తెల్లపిల్ల. సాంస్కృతికంగా మన మహిళలు మోస్తున్న రెండు పర్వతాలకు పోలిక. కాదంటారా!
(మార్చి 6, 2014న సారంగ వెబ్‌ మ్యాగజైన్లో ప్రచురితం. 'సంవేదన' అనే కాలమ్‌ ఆరంభ వ్యాసం)