Thursday, 31 January 2013

అక్బర్.. భాగ్యలక్ష్మి.. మనం







అక్బరుద్దీన్ కామెంట్స్ విషపూరితమైనవి అని చెప్పడానికి మోకాలు తడుముకోవాల్సిన అవసరం కూడా లేదు. మనలోకి తరచి చూసుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. అందరం పోటీపడొచ్చు. కానీ అదే సమయంలో అంతకంటే ముఖ్యమైన విషయాలు మరుగునపడిపోవడం గురించి కూడా కాస్త మాట్లాడుకోవాలి. చార్మినార్‌ను ఆనుకుని వెలసిన భాగ్మలక్ష్మి ఆలయంపై పెద్దగా చర్చ జరగకపోవడం గురించి మాట్లాడుకోవాలి. మక్కా మసీదులో పేలుళ్లకు హిందూ మతానికి చెందిన ఉగ్రవాదులు కారణమైతే అరవై మందికి పైగా ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేసి వేధించి అందులో కొందరిని చిత్రహింసల పాలు చేయడంలో పనిచేసిన అంశం గురించి మాట్లాడుకోవాలి. మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ల అవసరం గురించి మాట్లాడుకోవాలి.
            చార్మినార్ పక్కన ఆలయమేమిటి అనే ప్రశ్నకు అది హైదరాబాద్ మతసామరస్యానికి సూచిక, కుతుబ్ షాహిల పరమత సహనానికి సూచిక అనే సెక్యులర్ కథ జవాబుగా వచ్చేది. ఈ కథ ఎవరు పుట్టించారో ఎందుకు పుట్టించారో తెలీదు. అందులో ఉన్న అందం వల్ల సెక్యులర్ కథ కావడం వల్ల సులభంగా నమ్మించేది. కాబట్టి అది ఎప్పుడూ చర్చలోకి వచ్చింది లేదు. వాస్తవం కొద్ది మందికి తెలిసి ఉండొచ్చేమో కానీ అది పాపులర్ అయ్యింది లేదు. 50 ఏళ్ల క్రితం అది లేదన్న వాస్తవం అతికొద్ది మందికి పరిమితమైన రహస్యం మాదిరి ఉండిపోయింది. పాతికేళ్ల క్రితం చిన్నపాకలాగా కనిపించింది ఇంతింతై వటుడింతై పెరిగిపోతూ ఉంటే నగరంలో అనేక ఆలయాలు పెరిగాయి ఇదీ పెరుగుతుందనుకున్నవారే ఎక్కువ. కానీ దీనిపై ఇటీవల వివాదం మొదలయ్యాక కానీ అక్కడేదో మోసం దాగుంది అని అర్థం కాలేదు. 'ది హిందూ' పత్రికలో ఫోటోలు వచ్చాక గానీ తత్వం బోధపడలేదు.మతోన్మాద కథలే కాదు, సెక్యులర్ కథలు కూడా మోసగించగలవు అని అర్థమైపోయింది. సీరియస్ విషయాలను వదిలేసి ఉత్తుత్తి విషయాల మీద హడావుడి చేయడం మీడియా వ్యాపారానికి అవసరం. పాలకులకు అవసరం. అందుకే పిచ్చి మాటల మీద, ఎవరో రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన కామెంట్స్ మీద జరిగినంత రచ్చ నిజమైన విషయాల మీద జరగదు. కానీ దారి తప్పిన చర్చను ట్రాక్‌లో పెట్టడం బుద్ధిజీవుల బాధ్యత. హైదరాబాద్‌లో సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్‌కు కొదువ లేదు. అయినా ఎందుకో కానీ ఈ విషయంలో సరైన ప్రతిస్పందన కనిపించదు. ప్రాధాన్యాల్లో ఎక్కడో దిగువకు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఇలాంటి అంశాలకు సమయాన్ని శక్తిని కేటాయించలేని స్థితికి, నిరంతరం తక్షణ అవసరాలకు మాత్రమే పరిమితం కావాల్సిన స్థితికి ఉద్యమాలను నెట్టేయడం రాజ్యం సాధించిన విజయానికి సూచిక అనొచ్చేమో!



హైదరాబాద్‌కు పర్యాయపదంగా ఉన్న చారిత్రక కట్టడాన్ని ఆనుకుని ఆలయాన్ని సృష్టిస్తే అది ఇటీవల సృష్టించిందే అని రుజువులతో బయటపడితే మామూలుగా ఏం జరగాలి? ఇపుడేం జరుగుతోంది? చారిత్రక కట్టడాల నిబంధనల ప్రకారం చూసినా అది అక్రమమని తేలుతోంది. చరిత్ర పరంగా చూసినా అది అక్రమమని తేలుతోంది. ఆ అక్రమాన్ని అలాగే కొనసాగిస్తూ ఇతరత్రా విషయాల మీద మాత్రమే హడావుడి చేస్తే ముస్లింలలో అది ఎలాంటి భావనకు దారితీస్తుంది? ఇది మనదేశం. హిందువులకు ఈ దేశంలో ఎంత హక్కుందో మనకూ అంతే ఉంది, వాళ్లకెంత న్యాయం జరుగుతుందో మనకూ అంతే జరుగుతుంది అని వారికి అనిపిస్తుందా! వారికి ఆ భరోసా ఇచ్చినట్టవుతుందా! అయోధ్యలోనేమో పుక్కిడి పురాణాలను ప్రచారం చేసి అక్కడ ఉన్న పెద్ద మసీదును కూల్చేస్తారు. దాని స్థానంలో ఏదో ఒక ఆలయం అప్పటికప్పుడు ఏర్పాటు చేసి భజన మొదలెడతారు. ఇక్కడేమో శతాబ్దాలనాటి చారిత్రక కట్టడం పక్కన కృత్రిమంగా కట్టడం ఏర్పాటు చేస్తారు. అక్కడ రాముడి పేరుతో రాజకీయాలు చేసి వేలమంది ప్రాణాలు తీస్తారు. ఇక్కడ భాగ్యలక్ష్మి పేరుతో ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేస్తారు. అది కూడా మైసమ్మో, పోచమ్మో కాదు, భాగ్యలక్ష్మి! ఆ ఆలయం లాగే దేవత కూడా స్థానికమైనది కాదు.



సాధారణంగా మీడియాలో ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. టీవీల్లో ఏదైనా వస్తే అది గాలిలో కలిసిపోతుందని అదే ప్రింట్‌లో వస్తే అక్షరం నిలిచి ఉంటుంది కాబట్టి అది చర్చకు దారితీస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. కానీ చిత్రంగా మాటలపై జరిగినంత వివాదం మన కంటి ఎదురుగా కనిపిస్తున్న ఒక అక్రమ కట్టడం గురించి జరగడం లేదు. అంతా మాయ! తల్లకిందులుగా నడుస్తున్నపుడు ఎదురుగా ఉన్నది సరిగా కనిపించదు. దాన్ని సరిచేయడం వెన్నెముకతో నిటారుగా నిలబడి ఆలోచించేవారి బాధ్యత. మెజారిటీ మతోన్మాదం లాగే మైనారిటీ మతోన్మాదం కూడా ప్రమాదకరమే.

మెజారిటీ అయినా మైనారిటీ అయినా ఉన్మాదం అనేది వ్యాధి లక్షణం. ఏ వ్యాధి నయం కావాలన్నా అది చూపించిన లక్షణాలకు వైద్యం చేస్తే సరిపోదు. దాని మూలానికి మందువేయాలి. రాజ్యం, చట్టం ఆ పనిచేయలేవు. ఇక్కడింకో విషయం గుర్తుంచుకోవాలి. బాధితులకు అండగా నిలబడే విషయంలో వారికి నాయకత్వం వహిస్తున్నామన్న వారి గుణగణాలు ప్రాథమికం కాకూడదు. ఏ సమూహంలోనైనా వ్యాధిగ్రస్తుల కంటే అది సోకని వారే ఎక్కువ. వారిని నిలబెట్టకపోతే వారి ఆకాంక్షలను సీరియస్‌గా పట్టించుకోకపోతే ఉన్మాదమే వ్యాప్తి చెందుతుంది. చివరకు అదే మిగులుతుంది. మనం అది కోరుకోగలమా!


జి ఎస్‌ రామ్మోహన్‌
(2013 జనవరి 31న ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

2 comments:

  1. రామ్మోహన్ గారు చాల చక్కగా వ్రాసారు. మీ వ్యాసం ఆంధ్రజ్యోతి లో చదివాను. ఆలయం అంటే చార్మినార్ కు దగ్గరలో ప్రదేశం లో ఉంది అనుకున్నాను గాని ఇలా ఒక మినార్ కు ఆనుకొని ఉంది అని తెలియదు. మీరు ఇక్కడ ఇచిన ఫోటో లతో ఆ విషయం తెలిసింది.
    చార్మినార్ ను ఒక మతానికి సంబధించిన దాని గానే చూడడం చాల దురదృష్టకర విషయం. ఇది హైదరబాద్ చరిత్ర కు, ఆనతి నిర్మాణ ప్రతిభ కు సంబందించిన విషయం కదా? ఆధారాలు ఇంత స్పష్టం గా కనిపిస్తున్నప్పటికీ పురావస్తు శాఖ వారు కూడా ఏ విధమైనా చర్య తీసుకోకుండా ఉండడం దురదృష్టకరం .
    మజ్లిస్ పార్టీ వాళ్ళు కుడా ముస్లిం లకు అన్యాయం జరుగుతోంది అనే కోణం లో సమస్యను ప్రస్తావించకుండా చారిత్రాత్మక కట్టడం సమస్య గా దీన్ని ప్రజల ముందుకు తెచ్చి ఉంటె, వారి వాదనకు ప్రజలలో మరింత మద్దతు దొరికేదేమో?

    ReplyDelete
  2. If that is the case, then why none is talking about the mosques which are built near, around, beside many famous & historical hindu temples. Ex: Mathura Krishna temple and mosque, somnath temple etc.

    You are simply asking to igonor and forget about the meeting, words of Akbaruddin, how is it justified. Dont you remember or realised what he said about the cow and hindus. He said that "you worship cow as a mother and we cut, eat and enjoy the meat, you are selling your mother to cut and we are eating and enjoying it, you people dont know the taste of it and if you want you can try".

    For all these you dont want any explanation and you are not bothered or worried. But you have major problem with the temple, agreed that may be the temple is a wrong & illegal construction.

    You are convineintly saying about the babri masjid and assuring and vouching that there was no temple at all, showing photos to convince others about the charminar temple. Are you ever tried to talk these people to convince or atlest explain the facts. I doubt it.

    Why is that you people never ask or question against particluar parties and their activities. So pity.

    ReplyDelete