రేజ్, ఫీవర్, మానియా, ఫ్రెంజీ, ఎన్నైనా చెప్పుకోవచ్చు. రిపిటీషన్‌లో తప్పేమీ లేదు. కొంచెం రిథమిక్‌గా ఉండేట్టు చూసుకోవాలి, అంతే. ఇంకొంచెం ఇంగ్లిష్ తెలిస్తే ఇంకొన్ని విశేషణాలు జోడించుకోవచ్చు. విశేషణమే విశేషం. క్రియ కంటే విశేషణము ప్రాబల్యం సంతరించుకొనుట ఆధునిక యుగధర్మము. ఇంతకీ ఏమిటీ కొలవెర్రి? ఈ వెర్రి ఇరవై యేళ్ల క్రితమే మొదలైంది. దాని ఫలితాలను ఇపుడు రకరకాల రూపాల్లో చూస్తున్నాం. ఒక సన్నీలియోన్, ఒక కొలవెర్రి, ఒక ఎంటివీ రౌడీస్. ఒక బిగ్‌బాస్.. ఇలా అనేక రూపాల్లో అది వ్యక్తమవుతోంది. లోపలున్నదానికంటే పైన కనిపించేదే ముఖ్యమైపోయిన పరిణమానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. దేశం మొత్తం ఊగిపోతోందని యువతకిది మరో జాతీయగీతంగా మారిందని 25 యేళ్లకంటే తక్కువవయస్సున్న ప్రతివారికీ ఈ పాటమీద ఏదో ఒక అభిప్రాయం ఉందని ఇంటర్‌నెట్‌లో రాసేస్తున్నారు. ఏ దేశం, ఏయువత అని అడగడం చాదస్తమనిపించుకుంటుంది. కడుపునకు టీవీ తింటున్నామా...ఇంకేమైనానా! టీవీ ఇంటర్‌నెట్ మయసభ లాంటివి. సత్యాసత్య నిర్ధరణ దుర్లభం. తిండితిప్పలు లాగే సత్యం కూడా సమూహాన్ని బట్టి మారుతూ ఉంటుంది. చాలా సత్యాలు క్లాస్‌బేసుడే.(.ఏమనుకోకండి....ఇదొక కొలవెర్రి) ఇపుడూ ఏ చానల్ చూసినా ఎపుడూ ఏదో ఒక యాడ్ వస్తూ ఉంటుంది. ఏవో కార్యక్రమాలు అవీ నడుస్తూ ఉంటాయి బెల్లీ గురించి. ఏ వెబ్‌సైట్లోకి వెళ్లినా టెన్ థింగ్స్ టు ఫ్లాట్ యువర్ టమ్మీ లాంటి వేవో కనిపిస్తాయి. ఒకటే సబ్జెక్ట్ మీద ప్రతిరోజూ వైవిధ్యభరితమైన పరిష్కారాలను సూచిస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఒబేసిటీ అనేది ఈ దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అనిపిస్తుంది. అది ఎంత మంది సమస్య, ఎవరి సమస్య అని ప్రశ్నించి ప్రయోజనము లేదు. గ్యాస్ బండ ధర పెరిగినపుడు చేసినంత హడావుడి ఎరువుల ధరలు పెరిగినపుడో చిలప నూలు ధరలు పెరిగినపుడో చేయం కదా! వారు ఇంటర్‌నెట్‌కి కానీ టీవీకి కానీ ప్రధానమైన కన్సూమర్స్ కాదు.
మళ్లీ మొదటికొద్దాం. కొలవెర్రి ఎలా మొదలైంది? ఆదియందు పివి నరసింహారావు ఉండెను. ఆతను ప్రధానియై ఉండెను. యాతండు భారత్‌నుంచి ఇండియాను వెలికితీసెను. ఈ బైబిల్ కథ చాలామంది చాలాసార్లు చెప్పారు...ఆ బట్టతలకు ఈ మోకాటికి సంబంధమేమి అని అడుగవచ్చును. ఉన్నది. ఇంటర్నలైజేషన్ అనేది భారతీయసమాజపు ధర్మం. బానిసత్వాన్ని ధర్మం రూపంలో రక్తం లోకి ఇంకించుకున్న సమాజం మనది. దక్షిణాఫ్రికా తెల్లోళ్ల పాలనలో ఉన్నపుడు కూడా నల్లోళ్లు ఇలా పడి ఉండడం మన ధర్మం అనుకోలేదు. అవతలివాడు బలవంతుడు కాబట్టి పడిఉంటున్నాం అనుకున్నారు. చీమలన్నీ ఒక్కటై బలపడిన నాడు పామును లొంగదీసుకుని పాలకులయ్యాయి. కానీ భర్త పాదపూజ చేసుకోవడం, పసుపు తాడును పలుపుతాడు ప్రమాణంలో బలపడేందుకు పూజలు వగైరా చేయడం మన బలహీనత అనుకోం. ధర్మం అనుకుంటాం. ఇది తూరుపు సమాజాల్లో చాలావాటిలో కనిపించొచ్చు. కానీ అగ్రవర్ణ సేవకే మనల్ని దేవుడు పుట్టించాడు అనేది మాత్రం మన ఓన్ ఇన్‌వెన్షన్. టోటల్లీ ఇండిజీనస్. ఇపుడూ మంగళూరు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బ్రాహ్మణులు తిని వదిలేసిన ఇస్తరాకులపై పొర్లు దండాలు పెట్టే ఆనవాయితీని ప్రశ్నించిన వారికేమైంది? మార్కండేయ ఖడ్జు లాగా ఐరోపా చరిత్ర సాహిత్యం చదువుకున్న చాదస్తులు కొందరు అడ్డుపడ్డారు. ఏమైంది? తరిమి తరిమి కొట్టారు. కులబానిసత్వం అనే ధర్మసంరక్షణ మా జన్మహక్కని చాటారు. మేం అభౌతికమైన ధర్మం కోసం ప్రయత్నిస్తుంటే మీరు భౌతిక వాదనలతో అడ్డుపడతారా అని ఆగ్రహం ప్రదర్శించారు. కాకపోతే దాన్ని భౌతిక రూపంలో ప్రదర్శించారు. మతమూ, కులమూ, వగైరా పవిత్ర విలువలను కాపాడుకోవాలనుకునే వారి ఆగ్రహం తరచూ భౌతిక రూపంలోనే వ్యక్తమవుతూ ఉంటుంది. సూత్రరీత్యా చెప్పుకుంటే వారు కాన్పెప్టుయల్‌గా అభౌతికవాదులు అయినప్పటికీ ప్రాక్టికల్‌గా పరమ భౌతికవాదులన్నమాట. మన భక్తిలో ఉండే తమాషా అది. ధింగ్ అబౌ గ్లోబల్లీ. యాక్ట్ లోకల్లీ. ఇక్కడ విశేషమేమంటే మాకు మేము అగ్రవర్ణాలు విసరేసిన ఇస్తళ్లమీద దొర్లుతూ దండాలు పెడతాం మీకేంటి బాధ అని 'దిగువ' కులాలు తమకు తాము అసర్ట్ చేసుకోవడం, అడ్డుకున్నవారిపై దాడిచేయడం. దటీజ్ ఇండియా. ఇది హైటెక్ యుగమా, అత్యాధునిక యుగమా, కంప్యూటర్ యుగమా అని మళ్లీ విశేషణాలతో విరుచుకుపడనక్కర్లేదు. దిసీజ్ ఇండియా. 90ల్లో మన సమాజంలో కొత్త నమూనా అడుగుపెడుతున్నపుడు ఈ లాజిక్‌ను పూర్తిగా ఉపయోగించుకుంది. మందు, పేకాట అడిక్షన్స్ అని ఓ చర్చిస్తారు కానీ డబ్బుతో పులిసినోడికి, 'పై'కులపోడికి గులాంగిరీ చేయడమనేది అన్నింటికన్నా అతి పెద్ద అడిక్షన్. తెల్లోడి ప్రతి ఉత్పత్తి నాగరికత రూపంలో స్టెయిల్ రూపంలో ప్రవేశించాయి మనం దేనికైనా సులభంగా బానిసలు కాగలమని అడిక్షన్ అనేది మన జాతి ధర్మమని గుర్తించారువారు. ఇపుడూ పెప్సీ కోలాలు రుచికరంగా ఉంటాయని తాగుతున్నామా, రుచి మర్చిపోలేక పిజా వెంట పడుతున్నామా! ఈ రుచి, అందం లాంటి పదాలున్నాయే అవి ప్రమాదకరమైనవి. పైవాడు అంటే మనకంటే ఆర్థికంగా పైనున్నవాడు ఏది రుచి అని చెపితే అది మనకు కూడా రుచికరంగా అనిపించాలి. ఏది నాగరికత అని చెపితే మనం కూడా నాగరికత అనేసుకోవాలి. వాడు పాస్తా యమ్మీ యమ్మీ అంటే వాలమ్మో వాలమ్మో ఎంత బాగా చెప్పారు, రుచి అంటే పాస్తాదే సుమండీ అనేయాలి. వాడు రష్యన్ సలాడ్ అంటే మనం కూడా టమోటా కీర ముక్కలను విసిరేసి వన్ రష్యన్ సలాడ్ ప్లీజ్ అనేయాలి. ఏతా వాతా చెప్పొచ్చేదేమిటయ్యా అంటే బాగుండడం అనేది కూడా అనుకరణే. శుధ్ధభౌతికం కాదు. సూత్రం అంటారా అయితే నూతన అభివృద్ధి నమూనా రుచి వంటి పచ్చి భౌతికమైన విషయాన్ని కూడా ఒక కాన్సెప్ట్‌గా మార్చింది అని చెప్పుకోవచ్చు. వస్తాద్ గారూ ఉప్పుతో పళ్లుతోముతున్నారా...ఇదిగో మాపేస్ట్ వాడండి అన్నవాడే పదిహేనేళ్ల తర్వాత మీ పేస్ట్‌లో ఉప్పులేదా అయితే మా పేస్ట్ వాడండి అనడం లేదూ! మార్కెట్ మన రుచులను మన వస్త్రధారణను మన వాహనాలను నిర్ణయిస్తుంది. ఈ బాటిల్ ఇలా పట్టుకుని అమ్మాయితోనో అబ్బాయితోనో మాట్లాడుతూ ఉండకపోతే నువ్వు సోషల్ బీయింగ్‌వి కాకుండా పోతావు. అన్ సోషల్ ఎలిమెంట్ అయిపోతావు. పిజా హట్లో ఫోర్కులతో కుస్తీపడుతూ తిప్పలు పడకపోతే కూడా అంతే.
వై ఓన్లీ కొలవెర్రి? సన్నీ లియోన్ అనబడే పోర్న్ స్టార్ బిగ్‌బాస్ షోలోకి పెద్ద శబ్దముతోనూ మిరుమిట్లు గొలుపు కాంతులతోనూ ప్రవేశించుచున్న సమయంలోనే కింగ్ ఫిషర్ షోలో ఉండీ లేనట్టున్న బట్టల్లో పురుషుడిని ఎలా సెడ్యూస్ చేయాలి అని ఎపిసోడ్ ప్రదర్శించారు. ఇవేవీ విడివిడి విషయాలు కావు. రాబోయే కాలానికి సూచికలు. ఆఫ్టర్ దట్ సన్నీ మార్నింగ్ పోర్నో వ్యూయర్ షిప్ ఎంత పెరిగిందో లెక్కేయాల్సి ఉంది. కనీసం సన్నీ లియోన్ పేరు టైప్ చేసి ఆమె వెబ్‌సైట్లోకి ఎన్ని లక్షల మంది వెళ్లారో చూడాలి. ఆమె సైట్లో అడుగుపెడితే యోగి వేమనకు ఆయన వదిన మహాదర్శనం చేసిన రీతిలో జ్ఞానోదయమవుతుందన్నమాట. పోర్నో అనేది ఇంతవరకూ ఎవరూ చూడకుండా ఇంటర్‌నెట్ కేఫుల్లోనో, ఇంట్లో పెద్దవాళ్లు లేనపుడో చూసే వ్యవహారంలాగా ఉండేది. ఒక పోర్నో స్టార్‌ను కార్యక్రమంలో భాగం చేయడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టింది ఇండియన్ టీవీ ఇండస్ర్టీ.. పోర్నో అనే పదం చుట్టూ ఉన్న గిల్ట్ భావన పోగొట్టి దానికి లెజ్టిమసీ సాధించే పనిలో ఒకింత ముందంజ వేయగలిగింది. దేశంలో పోర్నో అధికారిక ప్రవేశానికి తొలి అడుగు వేయగలిగింది. పనిలో పనిగా పోర్నో మార్కెట్‌ను పెంచడం ఎలాగూ ఉంది. ఏదీ నేరుగా రాకపోవడమే ఆధునిక మార్కెట్ వైచిత్రి. పదాలకు కొత్త అర్థాలు కల్పించడం కవిత్వపు లక్షణంగా చెపుతారు. అభాస కూడా కవుల జాబితాలో వేస్తారు. ఊరికే కవులను ఆడిపోసుకుంటారు కానీ అందులో మార్కెట్ వారి తాత. వన్ బాలీవుడ్ యాక్టర్ యు వాంట్ టు డర్టీ విత్ అని టీవీ విలేఖరి విద్యాబాలన్‌ను అడగాలి. ఎ సర్టెన్ ఎస్ ఆర్ కె అని ఆమె చెప్పాలి. డర్టీ అనే ఇదక్షరాల పదం మరో నాలుగక్షరాల పదానికి కొత్త రూపం అని వీక్షకుడు అర్థం చేసుకోవాలి. తనను తాను ఎస్‌ఆర్కె ప్లేసులో ఊహించుకుని తన తృప్తేదో తాను పొందాలి. ఇదొక ఎత్తుగడ. ఇదొక బోల్డ్ మూవీ అనాలి. ఫలానా ఆమె ఫలానా ఆయన బోల్డ్‌గా నటించారు అనాలి. బోల్డ్ అనగా బట్టలు విప్పిన సీన్లు అని మార్కెట్ హృదయం. బోల్డ్ యాక్ట్, బోల్డ్ సీన్స్, బోల్డ్ టాక్, వగైరా దీని అనుబంధ పదాలు మార్కెట్ డిక్షనరీలో కనిపిస్తాయి. బట్టలు విప్పడం బోల్డ్ అయితే విప్పకపోవడం ఏమవ్వాలి? తెరపై విప్పలేని వారు ఏమవ్వాలి? సాధారణంగా చాలామంది అశ్లీలమని, బూతు అని చెప్పుకునే విషయాలకు బోల్డ్‌ను పర్యాయపదంగా మార్చి కొత్త అర్థాన్ని కల్పించడం కవులకు సాధ్యమా చెప్పండి? అభాస కవులకే సొంతమని ఇంకా చెపుతారా!
వైదిస్ కొలవెర్రిలో కొత్తదనముంది. కొత్తదనం అనేది ఈ గడిచిన ఇరవై యేళ్లలో పాతపడిపోయిన మాట. కొత్తదనం ఎందుకోసం అని అడగకూడదు. సెంటర్‌ఫ్రెష్ యాడ్ లాగా అదొక అబ్సర్డ్ థింగ్. కొత్తదనం కోసమే కొత్తదనం. కాలర్ ఉన్నపుడు లేనిది కొత్తదనం. తొడలను కప్పేసే జీన్స్ బదులు అక్కడ బ్లేడుతో గీతలు పెట్టడం కొత్తదనం. జుట్టు దువ్వుకునే బదులు పైకి లేపుకునే స్పైక్స్ కొత్తదనం. పాట కూడా అంతే. మామూలుగా సెలయేరులాగా పాట ఉందనుకోండి. మధ్యలో నాలుగు నక్క ఊళలు పెడితే కొత్త దనం. 90లకు ముందు పాటలు సాహిత్య ప్రధానమైనవి. తర్వాత మ్యూజిక్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇంటర్‌నెట్‌తో అన్ని దేశాల ట్యూన్స్‌ని ఇండియనైజ్ చేసే ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇవాళ సాహిత్యం అనేది మ్యూజిక్‌కి వెనకాతల వినిపించే కొన్ని ధ్వనులు మాత్రమే. అంతకంటే ప్రాధాన్యమేమీ లేదు. అందులో రిథమ్, బీట్ ముఖ్యం. ఆధునిక సాంకేతికాభివృద్ధి సింగర్‌కి మ్యుజీషియన్‌కు ఉన్న బంధాన్ని తెంపేసింది. ఒక సాలూరి, ఒక కృష్ణశాస్ర్తి కూర్చుని సార్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలా మారిస్తే ఎలా ఉంటుంది అని చర్చించుకునే వాతావరణం లేదు. జనం కాళ్లు చేతులు ఆడించగల శబ్దాలను సృష్టించగలిగిన మ్యుజీషియన్ కొన్ని ట్యూన్స్ ఇస్తారు. ఎవరో ఒక గీతకారుడు అందులో నాలుగు మాటల్నికూరుస్తారు. పాడువారు వారి సమయాల్లో విడివిడిగా వచ్చి ఎవరి ట్రాక్ వారు పాడిపోతారు. రూపం సారాన్ని ఆక్రమించడమంటే ఇదే. కాళ్లూ చేతులు ఆడాలే కానీ హృదయం ఊగనక్కర్లేదు. మనసున మల్లెలూగాల్సిన అవసరం నేడు అంతరించింది. ఏ దిల్ అభీ నహీ భరా అనడానికి దాని అవసరమెక్కడుంది? మార్కెట్ మన అవసరాలను కూడా టైలరింగ్ చేస్తుంది. కొత్త అవసరాలను సృష్టిస్తుంది. తన దారికి అడ్డుగా ఉన్న అవసరాలను డిలీట్ చేస్తుంది. కాళ్లూ చేతులు ఆడించగలగడం మాత్రం నైపుణ్యం కాదా? ఎందుకు కాదు వల్గర్లీ స్కిల్డ్. కాకపోతే నైపుణ్యం ఫర్ వాట్? మచ్చుకు ఒక ఇన్‌స్టంట్ లక్షణం సంగతే చూద్దాం. ఇవాల్టి పాటలు నాలుగు కాలాల పాటు నిలవడం లేదు అని వినిపిస్తూ ఉంటుంది కదా, ఎందుకు నిలవడం లేదు? నిలవాలని వారు కోరుకోవడం లేదు. మార్కెట్‌కు ఆ అవసరం లేదు. ఆ టైంలో నాలుగు కాసులు రాలాలి. ఆ వారంలో అది గోల్డో ప్లాటినమో ఏదో ఒక డిస్క్ అనిపించుకోవాలి. అంతే. సినిమా వందరోజులు ఆడాలని మూడొందల అరవై రోజుల రికార్డు సృష్టించాలని అనుకునే వెర్రిబాగుల వాళ్లెవరైనా ఉన్నారా....మొదటివారంలో ఎంత కలెక్షన్ వచ్చిందనేదే ముఖ్యం. కాబట్టి అంతిమంగా ఆ రంగంలో విలువలను నిర్దేశించేది మార్కెట్టే. పాడుతా తీయగా, సరిగమప లాంటి కార్యక్రమాల్లో ఎందుకు పాతగీతాలే వినిపిస్తాయి? అవి మాత్రమే గుర్తుంచుకోవడానికి అనువుగా ఉంటాయి కనుక. కొత్త పాటల్లో గుర్తుంచుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. దాన్ని మించి మ్యూజిక్ ట్రూప్ పూర్తి స్థాయిలో లేకపోతే పాట అస్సలు వినలేం. అన్యాయంగా ఉంటుంది. ఎందుకంటే దాని ప్రాణం అందులోనే ఉంది కనుక. మున్నీ బద్నామ్ హుయీ ఎందుకంత హిట్ అయ్యింది. రిథమ్. కొలవెర్రి పాట పాపులారిటీ వెనుక ఇంత కథ ఉంది. దీనికి తోడు ఇంటర్‌నెట్, మొబైల్ చాటింగుల్లో వాడే కత్తిరించిన ఇంగ్లిష్,. స్థానిక భాషతో కలగలిపిన ఇంగ్లిష్ వాడడం మరో తెలివైన ఎత్తుగడ. అందులోనూ అటు రజనీ అల్లుడు పాడాడు. ఇటు కమల్ హాసన్ కూతురూ ఓ చేయేసింది. వారిద్దరూ తమిళనాట డెమీ గాడ్స్ అన్నదాంట్లో కొత్తదనమేమీ లేదు కాబట్టి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. డెడ్లీకాంబినేషన్. దటీజ్‌ది స్టోరీ ఆఫ్ కొలవెర్రి. ఈ వెర్రి ఈ పూటది కాదు. ఈ పాటను ఇంత ఇన్‌స్టాంట్ హిట్ చేయడం వెనక పివి నరసింహారావు దగ్గర్నుంచి నాటి విజె మలైకా ఆరోరా దగ్గర్నుంచి సన్నీ లియోన్, చంద్రబాబు దాకా చాలా మంది కృషి ఉంది. న్యాయంగా అయితే ధనుష్ వారందరికీ రాయల్టీ చెల్లించాలి. ఈ వెర్రిలో సమాజానికి ఉపయోగపడేదికానీ మరీ దిగజార్చేది కానీ దానికదిగా ఏమీ లేదు కానీ మీడియా దీని వెంట పడడం వెనుక మార్కెట్ ఉంది. మీడియా అనే భూతానికి నిరంతరం ఏదో ఒక ఈవెంట్ కావాలి. లేకపోతే వాటి ఈవెంట్స్‌ని అవే క్రియేట్ చేసుకుంటాయి. ఇంకా వైదిస్ కొలవెర్రి అని అడగాలా!
జి ఎస్ రామ్మోహన్
(2011 డిసెంబర్ 6న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం)
No comments:
Post a Comment