Tuesday, 13 December 2011

మన చేతులు చిన్నవి



సమాజంలోని అధికార బృందాలు అపుడపుడు మనకు కొన్ని సంకేతాలు పంపుతుంటాయి. వాటిచేతులు ఎంత పొడవైనవో మన చేతులు ఎంత పొట్టివో తెలియజేస్తుంటాయి. ప్రగతిశీల సమాజం సంఘటితం కావాల్సిన అవసరాన్ని పరోక్షంగా గుర్తుచేస్తుంటాయి. అటువంటి ఒక ప్రమాదకర హెచ్చరికే తస్లీమాపై జరిగిన దాడి. దాడి సమయంలోనే ప్రెస్‌క్లబ్ ఎగ్లిక్యుటీవ్ కమిటి మీటింగు జరుగుతుండడం వల్ల పెద్ద ముప్పు తప్పింది. ఆ పాత్రికేయులంతా కలిసి మజ్లిస్ ఎమ్మెల్యేలను వారివెంట వచ్చిన వంది మాగధులను ప్రతిఘటించి హైదరాబాద్ కు ఘోర అవమానాన్ని తప్పించారు. వారంతా లేకపోయి ఉంటే మజ్లిస్ మూక అక్కడ ఏమేం చేసి ఉండేదో ఊహించడమే కష్టం.
తస్లీమా వంటి పేరు పొందిన రచయిత్రి సమావేశాన్ని రహస్యంగా నిర్వహించాలనుకోవడమే నిర్వాహకుల వ్యూహాత్మక తప్పిదం. వివాదాలను నివారించాలనే ఉద్దేశ్యంతోనే వారలా చేసి ఉండొచ్చు. అయితే అంచనాలకు సంబంధించి ఇందులో రెండు పొరబాట్లున్నాయి. మొదటిది ప్రగతిశీల సమాజానికి- ప్రభుత్వానికి సంబంధించింది. ప్రగతిశీల సమాజం చిన్నదే కానీ మరీ నిర్వాహకులు ఊహించినంత బలహీనమైనది కాదు. సభగురించి బహిరంగంగా ప్రకటించి ఉంటే వివిధ ప్రజాస్వామిక సమూహాలనుంచి  జనం సంఘీభావంగా నిలిచేవారు. పోలీసులు కూడా కచ్చితంగా సభకు రక్షణగా వచ్చి ఉండేవారు. బహిరంగంగా ప్రకటించాక అది వారికి అనివార్యమవుతుంది. ఇక్కడొక ఉదాహరణ చెప్పుకుందాం. కశ్మీర్‌కు స్వాతంత్య్రం కోరుతున్న యాసిన్ మాలిక్, అబ్దుల్ ఘనీ లోన్లను పిలిచి సందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ నిర్వహించగలిగాం. వారు హిందూ అతివాదులకు, ప్రభుత్వానికి శత్రువులు. వారికి మాత్రమే కాదు,  కశ్మీర్ అనే అందాల ఆస్తికి యజమానులం అని భావిస్తూ ఉంటుంది కాబట్టి మెజారిటీ మధ్యతరగతికి కూడా ప్రత్యర్థులే. అయినప్పటికీ సభ విజయవంతంగా నిర్వహించగలిగాం. సంఘపరివారం బయట కాసింత సందడి చేయగలిగింది కానీ అంతకు మించి ఏమీ కాలేదు. పోలీసులు భారీ స్థాయిలో మోహరించక తప్పలేదు. ప్రజాస్వామిక ముఖాన్ని చూపించుకోవడానికి వారికది అవసరం. ఇదంతా ఎందుకంటే సభను బహిరంగంగా ప్రకటించి నిర్వహిస్తే ముప్పును ఎదుర్కోవడానికి జాగ్రత్తలేవో తీసుకుంటాం కదా! కనీసం సాహిత్యాభిమానులకు, రచయితలకు కూడా తెలీకుండా  అండర్‌గ్రౌండ్ సాహిత్య సభ నిర్వహిస్తే ఎలా?
ఇక అంచనాకు సంబంధించిన రెండో తప్పిదం పాత్రికేయులకు సంబంధించింది. సభ రహస్యంగా నిర్వహించిందే కొంతమందికి తెలియకుండా ఉండాలనే లక్ష్యంతో. కానీ ప్రెస్‌క్లబ్‌లో సభ నిర్వహించి పాత్రికేయులను పిలిచాక అది ఎవరికి తెలియకూడదనుకున్నామో వారికి తెలియకుండా ఎలా ఉంటుంది? జర్నలిస్టుల్లో ఇన్నయ్య వంటి హేతువాదులున్నట్టే బుఖారి వంటి, తొగాడియా వంటి మత ఛాందసులుంటారు కదా! పాత్రికేయులనగానే వారంతా ప్రజాస్వామిక మంద అనుకునే అపోహనుంచి ఇప్పటికైనా బయటపడాలి. పాతతరంలో కనీసం అలా అనుకోవడానికి ఏ కొంచెమైనా ఆస్కారముందేమో కానీ ఇవాళ ఎవరు ఏ ఎమ్మెల్యే మూతులు నాకేవాడో, ఎవరు ఏ ఛాందసుడి అనుచరులో చెప్పడం కష్టం. మిగిలిన అన్నిరంగాల్లో మంచి చెడులున్నట్టే ఇక్కడా ఉంటాయి.
బహిరంగంగా ప్రకటించి నిర్వహిస్తే సాధ్యమయ్యేది అనే నమ్మకం ఉన్నప్పుడు మన చేతులు చిన్నవి అనే అంచనా ఏమిటి అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. విషయమేమంటే దాడులు చేస్తే తమ ఎమ్మెల్యే సీట్లు  గల్లంతవుతాయనో, తాము వెళ్లిన చోటల్లా నిరసన ఎదురవుందనో అనిపిస్తే ఆ ముగ్గురు  ఎమ్మెల్మేలు ఇంత తెగించేవారు కాదు. కెమెరాల ఎదరుగ్గా బండబూతులు తిడుతూ చేతికి అందిన వస్తువులతో దాడి చేశారంటే తమకు ఎదురులేదనే నమ్మకమేదో వారికి ఉంది. వారిపైన వారికంత నమ్మకం ఉండడమే మన బలహీనతకు చిహ్నం. ఆ ఘటన జరిగింతర్వాత మజ్లిస్ అగ్రనేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటన సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. ఈ సారి తస్లీమా హైదరాబాద్ వస్తే తల తీసేస్తామని ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఇంత భయంకర నేరానికి పాల్పడినా ఇప్పటికీ వారి బహిష్కారానికి బలంగా ఒత్తిడి తేలేకపోయాం. కనీసం బలమైన నిరసన ప్రదర్శన కూడా నిర్వహించలేకపోయాం.
ఘటన తర్వాత రచయితలు, కళాకారులు, మేధావుల సమావేశమొకటి జనవిజ్ఞాన వేదిక వారి కార్యాయలంలో జరిగింది. దాదాపు అరవై డెభ్భై మంది ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఆరేగుడుగురు ప్రజా సంఘాల కార్యకర్తలు, నలుగురైదుగురు రచయితలు తప్ప మిగిలిన వారందరూ ఎన్జీవోల ప్రతినిధులే.తప్పుకాదు. ఎన్జీవోలు ఒక ప్రజాస్వామిక అంశంపై కదిలిరావడం తప్పుకాదు. వారికా హక్కులేదని చెప్పబోవడం లేదు. కాకపోతే ప్రభుత్వం అన్ని రంగాలను ఎన్జీవోల పరం చేస్తున్నట్టే ప్రజాతంత్ర సంస్థలు కూడా ఇలాంటి అంశాలను ఎన్జీవోలకు వదిలేసే దశ వచ్చేస్తున్నదా అనే సందేహం కలుగుతున్నది. ఆనంద్ సినిమాలో అత్తగారి పాత్ర ధరించిన నటి, ధర్డ్‌పేజీ సెలబ్రిటీ సర్కిల్స్‌లో ప్రజాస్వామిక వాదిగా గుర్తింపు పొందుతున్న చందనా చక్రవర్తి ఇందులో ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. కొందరు తస్లీమాకు శాశ్వత వారసత్వం గురించే మాట్లాడారు. ఆరోజు వేదిక మీద ఉన్న సహ ఉపన్యాసకులు కొందరు దాడి సమయంలో అడ్రస్ లేకుండా పోయారని వారు వేదికమీదే ఉండి ఉంటే కొంతైనా బాగుండేదని మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఇన్నయ్య తప్ప మిగిలిన వారు మంత్రమేసినట్టే వేదిక నుంచి అదృశ్యమయ్యారనే అభిప్రాయాలు వారు వ్యక్తం చేశారు. ఇంకొందరు మళ్లీ తస్లీమాను పిలిచి భారీ స్థాయిలో బహిరంగసభ నిర్వహించాలని సూచించారు. అయితే రచయితలు స్కైబాబా, షాజహానా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దీనివల్ల పెద్ద గొడవ జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఛాందసుల కన్నెర్రకు గురవుతున్న తాము మరింత ఎక్స్‌పోజ్ అవుతామని ఈ దశలో ఇది సరైన చర్య కాబోదని వారన్నారు. ఇంకొంతమంది వారి ఆందోళనను పంచుకున్నారు. చాలామంది తస్లీమా రచనలను పొగిడే పనిలో పడ్డారు. మహా రచయిత్రి, మనందరకూ  ఆదర్శం, అందరం ఆవిడ బాటలో నడవాలి వంటి పదాలు చాలా దొర్లాయి. ఆవిడ రచనల మీద ఎవరికుండే అభిప్రాయాలు వారికుంటాయి కాబట్టి వాటి ప్రస్తావన మానేసి దాడిలో ఉన్న అప్రజాస్వామికత గురించి, ఇకపై ఇలాంటివి జరక్కుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చ పరిమితమైతే బాగుండేది. ఎందుకంటే రచనల బాగోగుల్లోకి వెళ్లడం ఇబ్బందికరం. రచనా సామర్థ్యం పరంగా తస్లీమా సి గ్రేడ్ రచయిత్రి అనుకునే వాళ్లం కూడా ఉండొచ్చు కదా! పైపెచ్చు ఆమె మహా రచయిత్రి కాబట్టి మనం సంఘటితంగా నిలవడం లేదు. మామూలు రచయిత్రి అయినా వ్యక్తీకరణ హక్కు మామూలుగానే ఉంటుంది. మహా రచయితలకు మాత్రమే ప్రజాస్వామిక మద్దతు పరిమితం కాదు. కాకూడదు. 
ఇంత చరిత్ర ఉన్న హైదరాబాద్లో ఒక సహ రచయితపై దుర్మార్గంగా దాడి జరిగితే ప్రజాతంత్ర శిబిరం నుంచి వచ్చిన స్పందన నామమాత్రంగా ఉందనే అభిప్రాయం అక్కడక్కడా వ్యక్తమైంది. స్పందన లోపం కేవలం బలహీనత కాదు. కొంత ఉపేక్ష కూడా ఉండొచ్చు. సాధారణంగా ఏమి జరుగుతుంది? ఏదో ఒక శిబిరం బాధ్యతను భుజానవేసుకుని మిగిలిన శిబిరాలతో సంప్రతింపులు జరిపి ఐక్యవేదిక అనే పేర కార్యక్రమం నిర్వహిస్తుంది. బాధ్యత తీసుకున్న శిబిరానికి చెందిన వారు ముప్పాతిక భాగం మిగిలిన వారంతా కలిపి పాతిక శాతం అందులో పాల్గొంటారు. హైదరాబాద్లో సాహిత్య కార్యక్రమాలను దగ్గరినుంచి చూసిన వారందరికీ పరిచితమైన విషయమే ఇది. కానీ తస్లీమాపై జరిగిన దాడిని ఏ శిబిరమూ అంత సీరియెస్‌గా తీసుకున్న దాఖలాలు లేవు.
బహుశా దాడికి స్పందన తీవ్రంగా లేకపోవడానికి రెండు కారణాలు. ఒకటి దాడికి గురైన వ్యక్తితో రిలేట్ చేసుకునేంత భావజాల పరమైన బంధం కానీ ప్రత్యక్ష సంబంధం కానీ లేకపోవడం. విస్తృతార్థంలో స్థానికీయత. రెండోది ఆమె రచనలపై ప్రజాతంత్ర శిబిరంలో అంతగా గౌరవం లేకపోవడం. దాడి చేసిన వారు ముస్లిం ఛాందసులు కావడమే కారణమనే ఆరోపణ కూడా ఉంది కానీ అది పూర్తిగా సత్యం కాదు. కాకపోతే అటువంటి ఇబ్బందికి సంబంధించిన ఛాయ ఒకటి ఉన్న మాటైతే కొంతవరకూ వాస్తవమే. సంపదలో, వనరుల్లో వాటాకు నోచుకోక ఘెట్టోప్రపంచంలో బతుకులీడుస్తూ అణచివేతకు దోపిడీకి గురవుతున్న ముస్లింల పట్ల ఉండాల్సిన సంఘీభావానికి, వారిలోని ఛాందస మూకల పట్ల అవలంబించాల్సిన వైఖరికి మధ్య ఇంకొంత స్పష్టత అయితే రావాల్సే ఉంది.
ప్రెస్‌క్లబ్‌ల దగ్గర దాడులు చేస్తే సులభంగా ప్రచారం పొందవచ్చుననేది ఎత్తుగడగా మారుతున్నది. ఇది సీరియెస్‌గా పట్టించుకోవాల్సిన అంశం. ఇటీవలి ఘటనలే తీసుకుంటే మధుయాష్కీ వ్యవహారంలో రాజగోపాల్ పై దాడి ప్రెస్‌క్లబ్‌లోనే కెమెరాల సాక్షిగా జరిగింది. ఛానళ్లు దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగలిగాయి. తర్వాత తస్లీమా వ్యవహారం. తాజాగా గోనె ప్రకాశరావుపై దాడి. రాజగోపాల్, గోనెలపై జరిగిన దాడుల మంచి చెడ్డల్లోకి వెళ్లబోవడం లేదు. ప్రెస్‌క్లబ్‌లపై దాడి ప్రచార వ్యూహంగా మారడంలోని ప్రమాదం గురించే పరిమితమవుదాం. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో జరిగిన ప్రహసనం గుర్తొస్తుంది. ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం చాలామంది సులభమైన ప్రక్రియను ఎంచుకున్నారు. పదిమందిని పోగుచేయడం వారిలో ఒకరికి కిరోసిన్ డబ్బా, అగ్గిపెట్టె ఇవ్వడం, టీవీ కెమెరాలకు కబురంపడం..ఇదీ తంతు. వారక్కడ వీరంగం చేయుట, తమ నేతకు టిక్కెట్ ఇవ్వకపోతే ఆత్మాహుతికి పాల్పడతామంటున్న అభిమానులంటూ వార్తలు ప్రసారమగుట తదుపరి తతంగం. కొందరైతే అన్ని చానళ్ల కెమెరాపర్సన్లు వచ్చారో లేదో వాకబు చేసి మరీ ప్రహసనం మొదలెట్టేవారు. చచ్చీ చెడీ ఒక్కడన్నా కాల్చుకు చస్తాడేమే అని ఎదురుచూస్తామా! అలాంటిదేమీ జరగదు. ఇదంతా కెమెరోమానియా. ఇపుడు ప్రెస్‌క్లబ్‌లపై దాడులు కూడా అలానే మారుతున్నాయి. జర్నలిజాన్ని ప్రహసనంగా మార్చే ఇలాంటి తంతు పట్ల పాత్రికేయులు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంటుంది.
మళ్లీ తస్లీమా దగ్గరికే వస్తే దాడిచేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు వారి నాయకుడైన యువసుల్తానుల వారు బోరవిరుచుకుని దర్జాగా ప్రకటనలిచ్చుకుంటూ తిరుగుతున్నారు. వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ వారితో పొత్తు పెట్టుకోబోతున్నది కాబట్టి వారిపై గట్టి చర్యలు తీసుకునే అవకాశాల్లేవు. కన్నబీరన్ వంటి వారు కేసు దాఖలు చేశారు. గూండాలపై చర్య తీసుకోకుండా ఉన్నందుకు పాలకులు కొంచెమైనా నీళ్లు నమిలేట్టు, ఇబ్బంది పడేట్టు చేయగలమా?
జి ఎస్‌ రామ్మోహన్‌
(pranahita.org సెప్టెంబర్‌ 2007 సంచికలో ప్రచురితమైన వ్యాసం)

No comments:

Post a Comment