ముఖ్యమంత్రి మరో పథకం ప్రకటించారు. రాష్ట్రీయ స్వాస్త్ బీమా యోజనను ఈ నెలనుంచే అమలులోకి తెస్తున్నామని ప్రకటించారు. ఉప ఎన్నికలు జరిగే తిరుపతి నియోజకవర్గం ఓటర్ల సాక్షిగా ఆయన ఈ వరం ప్రకటించారు. ఎన్నికలు రావాలే కానీ మన నాయకులంత ఉదారులు మరొకరుండరు. జీమూత వాహనుడు, శిబిచక్రవర్తి కూడా బలాదూరే!
కేంద్ర పథకాన్ని ఎన్నికల వేళ ఆయన తనకు ప్రయోజనకరంగా ప్రకటించుకున్నారనేది వేరే విషయం. ఎన్నికలు జరిగే 18 నియోజకవర్గాల్లో ప్రభుత్వ సొమ్మును ఏదో రకంగా గుమ్మరించుకుంటూ వెడుతున్నారనేది వేరే విషయం. కిరణ్ వ్యక్తిగతంగా అవినీతిపరులో కాదో తెలీదు కానీ ఎన్నికల వేళ గెలుపొందడానికి ఆయన చేస్తున్న ట్రిక్స్ అన్నీ అడ్డదారులేనన్నది వేరే విషయం. ఎమ్మెల్యేలను కూడా డబ్బుతో కొంటున్నారన్న ఆరోపణ వేరే విషయం. రాష్ట్రీయ స్వాస్త్ బీమా పథకమైతే మంచి పథకమే. దీని కింద అసంఘటిత కార్మిక రంగంలోని వారికి 2 లక్షల రూపాయల వరకు బీమా ఉంటుంది. వైద్య ఖర్చుల కింద ఏటా 30వేల రూపాయల వరకు అవకాశముంటుంది. అరవై యేళ్లు పైబడిన వారికి నెలకు మూడు వేల రూపాయల వరకు పింఛన్ ఇస్తారు. కార్మికులు ఏటా 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బాగుంది.
కానీ చూడడానికి బాగున్నవన్నీ అమలులో బాగుండాలని రూలేం లేదని మన అనుభవాలు తెలియజేస్తున్నాయి. నిర్దుష్టంగా ఒక ఉదాహరణను చెప్పుకుందాం. రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇప్పట్లో ఆగేలా లేవు. రైతులకు భరోసా ఇవ్వగలిగిన ప్రభుత్వాలు కానీ విధానాలు కానీ కనిపించడం లేదు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటామంటూ అప్పటి వైఎస్ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఈ జీవో-ఎంఎస్ 421, 2004 జూన్ 1న విడుదలైంది.
ఈ జీవో ప్రకారం ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ప్రభుత్వం లక్షరూపాయల పరిహారం అందించాలి. కుటుంబంపేర ఎమ్మార్వోపేర ఉమ్మడి ఖాతా తెరిచి అందులో జమ చేయాలి. ఈ లక్ష కాకుండా బాధితుల అప్పులన్నీ ఏకమొత్తంగా సెటిల్ చేయడానికి ప్రభుత్వం 50వేల రూపాయల వరకు ఇవ్వాలి. ఊరికే డబ్బులు ఇచ్చి మీ అప్పులు మీరు తీర్చేసుకోండి అని చెప్పడం కాదు.
స్థానిక తహసీల్దార్ పరిధిలోని పునరావాస కమిటీ అప్పిచ్చిన వారందరినీ పిలిచి అందరికీ తలా ఇంత ఇచ్చి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయాలి. బాధితులను అప్పులనుంచి పూర్తిగా విముక్తం చేయాలి. వాళ్లు ఒక్క పైసా కూడా ఎవ్వరికీ బాకీ లేరని ప్రకటించాలి. ఇంత స్పష్టంగా ఉంది జీవో. ఉన్నంతలో మానవీయంగానూ ఉంది.
పేపర్ మీద చూడ్డానికి అంతా బాగానే ఉంది. అమలే అధ్వానంగా ఉంది. అసలిలాంటి ఏర్పాటొకటి ఉందని తెలీనంత అన్యాయంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతతో ఏదో ఒకటి మాట్లాడుతుంటారు అనుకోవచ్చు. ఒక కేస్ స్టడీ చూద్దాం. ఒకనాటి విప్లవోద్యమ కేంద్రం కరీంనగర్ ఇటీవల ఆత్మహత్యలకు కేంద్రంగా మారింది. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, తెలంగాణ కోసం యువకుల ఆత్మహత్యలు.. ఎటు చూసినా మరణ మృదంగమే. ఒక్క సిరిసిల్ల డివిజన్‌లోనే గత ఏడాది 15 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. గుర్తించని వారి సంగతి వదిలేద్దాం. గుర్తించిన వారిలో ఒక్కరికి కూడా ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదు.
మానవహక్కుల వేదిక అక్కడ పర్యటించి ఎందుకు సాయం అందలేదనే విషయంపై ఆరాతీసింది. స్థానిక పాత్రికేయులు, యాక్టివిస్టుల సాయంతో సమాచార హక్కు చట్టం కింద కూపీ లాగింది. తహసీల్దార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ అక్కడ పర్యటించి నివేదిక అందించాల్సి ఉందని ఆ ప్రక్రియ పూర్తి అయితే కానీ తర్వాతి ప్రక్రియ ఆరంభం కాదని సిరిసిల్ల డివిజనల్ అధికారి రాతపూర్వకంగా తెలిపారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు కూడా రాశారు. ఘనత వహించిన మహారాజశ్రీ తహసీల్దారు వారి దివ్యసుముఖమునకు చాలా మార్లు స్థానిక కార్యకర్తలు మొరపెట్టుకునే ఉన్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల వారి రోదనలను మోసుకెళ్లే ఉన్నారు. అధికారులవారు ఏ రాచకార్యములనుండిరో ఇంతవరకూ తీరిక దొరకలేదు. గోడుగోడు మంటున్న కుటు ంబాలను పరామర్శించి నివేదిక ఇవ్వలేనంతగా ఏడాదికి పైబడి వారు బిజీగా ఉండినారన్న మాట. సాటి మనుషుల గురించి, వారి వేదన గురించి మన అధికార గణానికున్న కన్సర్న్ అదీ! ఆ కుటుంబాలు ఉంటేనేం, పోతేనేం, మన చిన్ని బొజ్జయే మనకు శ్రీరామరక్ష!
ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి అలానే ఉందని తెలుస్తోంది. కాబట్టి ప్రభుత్వ విధానమే అంత అని తేలుతోంది. మానవీయమైన అధికారులు ఉన్నచోట, సామాజిక ఉద్యమ సంస్ధలు బలంగా ఉండి రైతులకు అండగా నిలిచిన చోట కొంతవరకు అమలవుతోంది. మిగిలిన చోట అతీగతీ లేదు. పాలకులకు అధికార యంత్రాంగానికి రైతులంటే ఉన్న శ్రద్ధ ఇదీ. అన్నదాతలనీ, దేశానికి వెన్నెముకలనీ అదని ఇదని సూపర్ లేటివ్స్‌తో మీడియా ముందు ఎత్తేస్తుంటారు. మాటలు నేర్చిన జాతి అది.
బతికున్నోళ్లతో ఆడుకున్నారు సరే! ఇంటాయన ఉరేసుకుని కుటుంబం అనాధలా మిగిలితే వారితో ఆటలాడుకుంటారా! ఆర్థిక సాయం ఆశపెట్టి మోసం చేస్తారా! అప్పులోళ్లు ఇంటిమీద కొస్తుంటే ఏం చేయాలో దిక్కుతోచక అల్లాడుతున్న కుటుంబాలతో పరాచికాలాడతారా! ఆ యాభైవేల అప్పు సెటిల్మెంట్ ఏదో చేసేస్తే వారి కడుపు తిప్పలేవో వాళ్లు పడతారు కదా! అదే స్థితిలో తమ కుటుంబాలుంటే ఏం చేసేవారో ఘనత వహించిన తహసీల్దార్ గారు ఆలోచించాలి, స్టేజీల మీద బీరాలు పోయి పక్కకు పోయి తూచ్ అనేసే ఏలికలు ఆలోచించాలి. ఈ రెండేళ్లలో ఎమ్మెల్యేల జీతమ్ములు, భత్యమ్ములు అనేక రెట్లు పెంచిన ఉదార స్వభావులు మన కిరణ్‌కుమారుల వారు.
అడిగినవారికి లేదనకుండా వరాలిస్తారని ప్రతీతి. రాజకీయంగా ఉపయోగపడాలే కానీ కోట్ల కొద్దీ సొమ్ము చేతిలో పడే విధంగా ఎమ్మెల్యేలకు వెసులు బాటు కల్పించడంలో ఆయన దిట్ట అని తేలుతూనే ఉంది. కానీ చచ్చిపోయిన రైతు కుటుంబాలకు ఇవ్వాల్సిన సొమ్ము విషయంలోనే పాపం, కొరత ఏర్పడినట్టుంది. జీవో స్పష్టంగానే ఉంది. ఎవరో కాస్త మనసున్న ఐఏఎస్ మారాజు చేయిచేసుకున్నట్టున్నారు. జీవోలో పకడ్బందీ ఏర్పాట్లే ఉన్నాయి. కానీ ఏం లాభం!
దేశంలో ప్రత్యేక లక్షణాలున్న బాధిత సమూహాలకు వాటి తరపున పోరాడే బృందాలు ఏవో ఉంటాయి. కులమో, యూనియన్ ఏర్పాటో ఏదో ఒకటి ఉన్నచోట సర్కారు మెడలు వంచి ఎంతో కొంత సాధించుకోగలగుతున్నారు. ఎటొచ్చీ రైతులు, అసంఘటిత కార్మికుల పరిస్థితే మరీ అన్యాయంగా ఉంది. ఇందులోనూ ఆయకట్టులో ఉన్న పెద్ద కామందుల కథవేరే. వాళ్లకేవో లాబీలు అవీ ఉం టాయి. మెట్ట ప్రాంతపు చిన్నసన్నకారు రైతులు, కౌలు రైతుల గోడు పట్టించుకునేవారు కరవు.
మేమున్నదే రైతుల కోసం అని అన్ని పార్టీలు క్లెయిమ్ చేసుకుంటాయి. కాబట్టి వీళ్ల తరపున గట్టిగా గొంతు వినిపించే ప్రత్యేక బృందాలు ఉండవు. స్పెసిఫిక్‌గా టార్గెట్ చేయగలిగిన ఓట్‌బ్యాంకు కాదు. రైతులను టార్గెట్ చేయాలంటే అందరికీ వర్తించే మంచి పనేదో చేయాలి. అది అందరూ చేయలేరు. ఈ కార్పొరేట్ ప్రపంచంలో నాయకులకు సంకల్పముంటే తప్ప అది సాధ్యం కాదు. ఒక్కముక్కలో అందరూ ఓన్ చేసుకునే అనాధ రైతు సమూహం. ఎవరూ లేని అందరివాళ్లు. వామపక్షాలు, విప్లవపార్టీలు ఉన్నా వాటి గొంతు బలహీనం. తెనాలి రామలింగడి కథ ఒకటుంది.
ఇంటికొకరు చొప్పున ముంతపాలు తెచ్చి యజ్ఞకుండంలో పోయాలని రాజు ఆదేశిస్తే చివరకు నీళ్లు మాత్రమే కనిపిస్తాయి. పాలసంగతి పక్కింటివాడు చూసుకుంటాడులే మన ఒక్కళ్లం నీళ్లు పోస్తే ఏమి అనే భావన. జాతీయ స్థాయిలో సోనియా ఆధ్వర్యంలో ప్రజామేధావులతో పనిచేస్తున్న జాతీయ సలహా మండలి కాస్త మంచి పథకాలైతే రూపొందిస్తున్నది. ఆ ప్రభావం రాష్ట్రాలపైనా పడుతున్నది. వంట సరే, వడ్డించే వాళ్లదగ్గరే పేచీ. రైతులు ఓటుబ్యాంకులాగా సంఘటితం కాలేరు. వర్గాల వారీగా కులాల వారీగా విడిపోయి ఉన్న రైతాంగం ఒక్కటై ఉద్యమించగలిగిన పరిస్థితీ లేదు.
ఇదే బలహీనత. ప్రతి ఏడాది అవే అగ్ని పరీక్షలు, అవే హామీలు, అవే మోసాలు. విత్తనాల కోసం రోజుల తరబడి ఎండలో నిలబడాల్సిన దుస్థితిని కూడా ఇన్నేళ్ల స్వతంత్ర భారతం పరిష్కరించలేకపోయింది. ఇటు చూస్తే ప్రతిపాలకుడు రైతు బాంధవుడే. గుండెలు విప్పి చూపిస్తే నాగలి పట్టుకున్న రైతే కనిపిస్తాడన్నట్టుంటారు ప్రతి నాయకుడూ! ఎవరైనా ఏ హామీనైనా ఇవ్వొచ్చు. పక్కనే నాలుక మడత పెట్టి పరిహాసం చేయొచ్చు. తూచ్! ఇది ప్రజాస్వామ్యం!
No comments:
Post a Comment