Friday, 19 July 2013

భారతీయుడు, హజారే, మోదీ

July 19, 2013-ఆంధ్రజ్యోతి
రాంబో కల్చర్ భారత రాజకీయాల్లో హడావుడి చేస్తోంది. హాలీవుడ్ రాంబో వియత్నాంలో చిక్కుకుపోయిన అమెరికన్లను రక్షిస్తాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న తాలిబన్లకు అండగా నిలబడతాడు. ఎక్కడ ఏ దేశంలో తన సేవలు అవసరమైతే అక్కడ గద్దలా వాలిపోయి జనాలను రక్షించేస్తూ ఉంటాడు. వామపక్ష హీరో చే గువారాకు పోటీగా మనిషి దొరక్క హాలీవుడ్ సృష్టించుకున్న హైటెక్ కల రాంబో. ఇపుడు అదే నమూనాలో మన దేశంలో ఒక రాంబో బయలు దేరారు. ఆయన గుజరాతీయులు ఎక్కడెక్కడ ఇరుక్కుపోయినా అక్కడ వాలిపోయి తమవారిని రక్షించేస్తూ ఉంటాట్ట! ఆ మెసేజ్ ఇవ్వడానికి ఆయన ఇమేజ్ మేకర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రేపు ఢిల్లీ గద్దెనెక్కితే ఇదే రీతిన భారతీయులను రక్షించగలడని ప్రచారం చేయడానికి ఆయన సైబర్ సైన్యం శక్తికి మించి ప్రయత్నిస్తోంది. ఈ సైబర్ సైనికులు గుజరాత్ ఆర్థిక అభివృద్ధి గురించి ఊదరగొడతారు. మానవాభివృద్ధి సూచికల్లో ఆ రాష్ట్రం వెనుకబడిపోవడం గురించి మాట్లాడరు.

హక్కుల సంగతి సరేసరి. దూకుడు ప్రచారంతో మత మారణకాండ మచ్చను మర్చిపోయేలా చేయొచ్చనేది వ్యూహం.మోదీ ఆజ్ఞలమేరకే ఇష్రత్ జహాన్‌ను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశారని అక్కడి పోలీస్ అధికారులు చెపుతున్నారు. గుజరాత్‌లో బూటకపు ఎన్‌కౌంటర్లు బయటపడడం ఇది తొలిసారేం కాదు. మామూలుగానైతే ప్రజాస్వామిక సమాజంలో అలాంటివి బయటకొస్తే నాయకులు భయపడిపోవాలి. కానీ బిజెపికి చీమకుట్టినట్టయినా లేదు. అన్నీ మన మంచికే అనుకుంటున్నట్టుంది వారి బాడీ లాంగ్వేజ్. బూటకం కాదు అని బిజెపి వాదించడం లేదు. ఆ అమ్మాయి ఉగ్రవాది అని అరుగెక్కి అరుస్తోంది. ఉగ్రవాదిగా ప్రచారం చేస్తే చాలు ఈ బూటకపు ఎన్‌కౌంటర్ వల్ల నష్టం కంటే లాభమే ఎక్కువ అని బిజెపి భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ ధోరణి సమాజంలో వ్యాపించిన బలహీనతకు చిహ్నం. ఈ బలహీనత రాజకీయపార్టీలకు పరిమితమైనది కాదు. వ్యవస్థలో లిబరల్ ప్రజాస్వామిక విలువలు బలపడకపోవడానికి సంబంధించింది. ఈ బలహీనత కేవలం బూటకపు ఎన్‌కౌంటర్ల విషయంలో సమాజపు నిర్లిప్తతకు సంబంధించింది కూడా కాదు. అటువంటి నిర్లిప్తత ఆవహించి చాలాకాలమే అయ్యింది.

నిర్లిప్తత స్థాయిని దాటి 'మీరు మాత్రం చట్టాన్ని మీరవచ్చు, నేను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తప్పా'' అని ప్రశ్నించే అపరిచితుడు బాపతు పెరిగిపోతున్నారు. నియంతృత్వ పోకడలున్నా పర్వాలేదు, పని చేసిపెట్టేవాడు కావాలి అనేధోరణి పెరిగింది. ఇదైతే 90ల తర్వాత జరిగిన పరిణామమే. మధ్యతరగతిలో గొంతున్న వర్గం, గొంతు చించుకుని అరవగలిగిన వర్గం ఈ ధోరణికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. మధ్యతరగతి బాహాటంగా మతోన్మాదాన్ని అంగీకరించడం కష్టం కాబట్టి అభివృద్ధి ముసుగు అవసరమైంది. అన్నా హజారేకు కొవ్వొత్తులతో హారతులు పట్టిన వారిలో చాలామంది ఇపుడు మోడికి హారతులు పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలనాడు హైటెక్ చంద్రబాబు నాయుడిని పొగిడి పొగిడి అలసిపోయినవారు విశ్రాంతి తీసుకుని ఇపుడు మోడి భజనకు గొంతు సవరించుకుంటున్నారు. ఎక్కడో గుజరాత్ అనే చిన్న ఉత్తరాది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇవాళ మనమంతా అటో ఇటో తేల్చేసుకోవాల్సినంత వ్యక్తిగా ఎలా మారారు? ఆయన నిజాయితీ పరుడు,అడ్మినిస్ట్రేటర్, అభివృద్ధి పథగామి, వరుసగా ప్రజామోదం పొందుతున్నవాడు అని సెక్యులర్‌గా పొగిడేవాళ్లు నిజంగా అవే ప్రమాణాలని నమ్మితే వాటన్నింటిలోనూ ఆయనకంటే ఎన్నో మెట్లు పైనుండే మాణిక్ సర్కారు ఎందుకు కనిపించరు? బిజెపికి ఒక్క పార్లమెంట్ సీటు కూడా లేని రాష్ట్ర రాజధానిలో ఆయన ఉపన్యాసానికి ఐదు రూపాయల ఫీజు పెట్టగలిగిన నమ్మకం బిజెపికి ఎక్కడినుంచి వచ్చింది? హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకునే ఒక మధ్యతరగతి మనిషి, ఒక పబ్ గోయింగ్ యువకుడు 'మోదీ మగాడు సర్' అనే పరిస్థితి ఎందుకొస్తున్నది? బిజెపి భావజాలంపై ఆకర్షణ లేని వారు కూడా మోదీ వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? వీరి సంఖ్య బిజెపి పంట పండేంత ఉండకపోవచ్చు. కానీ ఈ ధోరణి పెరగడానికి దారితీస్తున్న పరిస్థితులేమిటి, ఏ సామాజిక సాంస్కృతిక పరిణామాలు మనల్ని ఇక్కడికి లాక్కొచ్చాయి అనే అంశాలైతే చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.


90ల తర్వాత వచ్చిన కొత్త సాధనాలు తెరచాటు మనిషిని ఆవిష్కరించాయి. సాటి మనుషుల కంటే తెరతో సంపర్కం పెరిగిపోయింది. ఆహార్యం దగ్గర్నుంచి ఆచార వ్యవహారాల దగ్గర్నుంచి అనేకానేక అంశాల్లో తెర మన ఆలోచనలను ప్రభావితం చేస్తోంది. ఈ తెర ఏదైనా కావచ్చు. మొబైల్ తెర కావచ్చు, కంప్యూటర్ తెరకావచ్చు. టీవీ తెర కావచ్చు. సినిమా తెర కావచ్చు. మనం ప్రధానంగా సినిమా జీవులం కదా! ఇంటర్‌నెట్‌లో మనం సెర్చ్ చేస్తున్నది అధికంలో అధికం సినిమాలే అని సర్వేల్లో తేలింది కదా! సినిమాల వైపు నుంచి వద్దాం. 90లకు ముందు సినిమాల్లో పోలీస్ ఎలా ఉండేవాడు? శుభం కార్డుకు ముందు వచ్చి గాల్లోకి కాల్పులు జరిపి హ్యాండ్సప్ అనేవాడు. విలన్లకు సంకెళ్లువేసి తీసికెళ్లేవాడు. టపా టపా కాల్చేసేవాడు కాదు. మధ్యమధ్యలో విలన్లను యు ఆర్ అండర్ అరెస్ట్ అనేవాడు. 'మిస్టర్ మీ దగ్గర వారెంట్ ఉందా' అని విలన్ స్టెయిల్‌గా ప్రశ్నించేవాడు. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు పోలీసులొస్తారు అని జోకులు వినిపించేవి.

కానీ 90ల తర్వాత పోలీస్ ఎలా మారిపోయాడు? అతను తుపాకులతో డాన్సులు వేస్తాడు. విలన్లతో డాన్సులు వేయిస్తాడు. నేనసలే మంచాడ్ని కాదంటాడు. నేను సింహాన్ని అంటాడు. పండును అంటాడు. ఎదుట సూట్లుబూట్లలో ఉన్న వందలమంది రౌడీల దగ్గర గుళ్లు అయిపోతాయి కానీ మన పోలీస్ హీరో రివాల్వర్‌లో మాత్రం అయిపోవు. జోకులేస్తూ కాల్చేస్తూ జోకులేస్తూ చెడ్డచావులను యమా చెడ్డగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. గాల్లో ఎగురుతూ నీటిలో దూకుతూ కొండలమించి దుముకుతూ చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో చిత్రవిచిత్రమైన యాంగిల్స్‌లో కాల్చిచంపడం ఎంటర్‌టెయిన్‌మెంట్ అయిపోయింది. శస్త్రం చేత చేధించబడని బుల్లెట్ చేతగాయపడని పోలీస్ ఎంటర్‌టెయినర్ అయిపోయాడు. అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే చట్టప్రకారం కుదరదు. మంచి పనికోసం చెడ్డదారి ఎంచుకున్నా ఫర్వాలేదు అనేది ఆమోదనీయమైన భావనగా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చింది ఇటీవలి సినిమా. చట్ట ఉల్లంఘనను గ్లామరస్ విషయంగా మార్చింది సినిమా. ఈ పునాది మీద పైపై మార్పులతో ఎన్ని పోలీస్ సినిమాలొచ్చాయో విజ్ఞులైన తెలుగు పాఠకులకు అట్టే చెప్పనక్కర్లేదు.

ఈ క్రియేటివిటీ హద్దులు దాటి ఉత్తరాది దక్షిణాది మధ్య ఈ విషయంలో ఆదాన ప్రదానాలు ఎక్కువైపోయాయి. అక్కడ దబాంగ్ అనగానే ఇక్కడ గబ్బర్ సింగ్ అనాల్సిందే. రాజ్యాంగం, చట్టం లాంటి చాదస్తాలను పట్టించుకుంటే న్యాయం చేయలేం అనేది ఈ సినిమాలన్నీ అందించు నీతి. షార్ప్ షూటర్స్ సినిమా హీరోల పాత్రలకు మోడల్స్‌గా మారిపోవడం అలాంటి సినిమాలు తిరిగి సమాజంలో బూటకపు ఎన్‌కౌంటర్లకు ఆమోదం కలిగించడం ఒక సాంస్కృతిక విషవలయం. బలుపు, బద్మాష్, పోకిరి, రాస్కెల్ వంటి ప్రతికూల లక్షణాలు హీరోచిత లక్షణాలుగా, ఆమోదనీయ లక్షణాలుగా మార్చడం ఇంకో విష పరిణామం. ఇక ఇంటర్‌నెట్, టీవీ సంగతి చెప్పనే అక్కర్లేదు. మన ఆలోచనల్లో ప్రజాస్వామ్య వ్యతిరేక భావనలు పెరిగిపోవడంలోనూ, మోదీ లాంటి అప్రజాస్వామిక వ్యక్తికి సామాజిక ఆమోదం రావడంలోనూ ఇలాంటి అంశాల పాత్ర చాలా ఉంది.


దీనికి కవల పిల్ల లాంటి మరో అంశం అవినీతి వ్యతిరేక సినిమా పోరాటం. భారతీయ సినిమాలో అవినీతి రూపుమాపడమనే బాధ్యతను భుజాన వేసుకున్న వ్యక్తి పేరు శంకర్. ఆయన సృష్టించిన అపరిచితుడుకు ఆయనే ప్రతీక. ఒక చేత్తో హీరో హీరోయిన్లను మచ్చుపిచ్చు, ఐఫిల్‌టవర్, పిరమిడ్ల మిద పాటలు పాడించేసి మరో నిర్మాత భయపడేంత ఖరీదైన వినోదం అందిస్తూ ఉంటాడు. మరో చేత్తో అవినీతి మీద ఒంటరిపోరాటం చేస్తూ ఉంటాడు. భారతీయుడు నుంచి శివాజీ దాకా ఆయన హీరోల కథే వేరు . ఒకరు మర్మకళతో అవినీతిపరులను అంతమొందిస్తారు. మరొకరు చిత్రవిచిత్రమైన శిక్షలు వేసి అంతమొందిస్తారు. మరొకరు మాఫియా డాన్‌ను మట్టికరిపించి బ్లాక్ మనీని బయటకు తెస్తారు. అవినీతి వ్యతిరేక పోరాటరూపాన్ని ఆచరణకు అసాధ్యమైన రూపంలో చూపించడం టక్కులమారి టెక్నిక్. అవినీతి మీద కోపాన్ని అడ్రస్ చేయాలి. కానీ మనం చేయాల్సింది ఏమీ లేదు, ఎవరో హీరో వచ్చి అన్ని తీసేసి పోతాడు అనే ఫీలింగ్ కలిగించాలి.

మనలోకి మనం చూసుకోవాల్సిన అవసరం కానీ మనచుట్టూ చూడాల్సిన అవసరం కానీ ఉండకూడదు. తెరమీద ప్రతీదీ మనం చూసి ఆనందించగలిగిన స్పెక్టకిల్‌గానే కనిపించాలి. వందల మంది ప్రాణాలు పోవడానికి కారకుడైన వాడిని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆపకుండా వెళ్లిపోయిన వాడిని ఒకే గాటన కట్టి ఇద్దరికీ నరలోకపు శిక్షలతో చిత్ర విచిత్రంగా చంపేయాలి. అవినీతిని బ్రహ్మపదార్థం చేసి జనంలో ఉన్న సెన్సిబిలిటీని చంపేయాలి. సమష్టి ఆచరణతో మార్చుకోవడం కాదు. వ్యవస్థను బాగుపరుచుకోవడం కాదు. కమల్ హసనో విక్రమో అత్యంత సినిమా తెలివితేటలతో అందర్నీ చంపేస్తూ ఉండాలి. మనమేమి చేయకుండా అంతా మారిపోతే ఎంత బాగుంటుంది అనుకునే మహామంచివాళ్లందరికీ గొప్ప వెసులుబాటు ఇలాంటి సినిమాలు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది కోరికలాంటిదే ఇది.

ప్రజానాట్యమండలి అవశేషాలు మిగిలి ఉన్న కాలంలో భూస్వామి-పేద రైతు, ఫ్యాక్టరీ యజమాని-కార్మికుడి సినిమాల్లో జనం పోగవడం ఉంటుంది. 60లు,70ల్లో కనీసం జనం తూరుపు దిక్కుకు పిడికిళ్లెత్తి నడిచేవాళ్లు. ఇపుడు అన్ని పిడికిళ్లు అవసరం లేదు. అన్నీ ఒకటే చేయి చేసేస్తుంది. ప్రస్తుతం ఆ చేయిని మోదీలో చూసుకుంటోంది తెరాధునిక మధ్యతరగతి. మొన్నటికి మొన్న అన్నా హాజారేలో కూడా చూసుకుంది. మోడి వైపు చేసిన ప్రయాణంలో అన్నా హజారే ఒక ట్రాన్సిట్ పాయింట్.
హజారే అవినీతి వ్యతిరేకత అనగానే కార్పోరేట్ సంస్థలు, కార్పోరేట్ మీడియా అండతో వోకల్ మిడిల్‌క్లాస్ రోడ్లమీదకొచ్చింది. టీవీలు బ్రహ్మరథం పట్టాయి. తర్వాత ఆయనేమయ్యాడో తెలీదు. అన్నా హజారే వ్యవహారశైలిలో ప్రజాస్వామిక లక్షణాలు తక్కువ. పార్లమెంట్‌కు హక్కులను తగ్గించి ఎగ్జిక్యుటీవ్‌కి, జ్యుడీషియరీకి సర్వహక్కులు ధారపోయాలనడం ఇపుడున్న పరిస్థితిలో భలే భలే అనిపిస్తుంది. రాజకీయనేతలను కేరికేచరింగ్ చేసిన తెరాధునికత ఈ రెండు అంగాలను పెద్దగీతలుగా మార్చేస్తున్నది. మార్కెట్ శక్తులవైపు మన చూపు పడకుండా ఈ పనులన్నీ చేయగలగడంలో ఈ శక్తులకున్న నైపుణ్యం అపారం. ఎటువంటి కృషి చేయకుండానే ఫలితాలు తొందరగా రావాలనుకునే ఇన్‌స్టంట్ తరానికి ఇది పసందుగానే అనిపిస్తుంది. కానీ అది భస్మాసుర హస్తం అవుతుందనే ఎరుక వారికుండదు. మన కొవ్వొత్తుల బ్యాచ్‌కి అంత దీర్ఘకాలికంగా చూపు సారించే ఓపిక ఉండదు. దాని పర్యవసానమే గోగెటర్‌ల పట్ల ఆరాధన. 'గో అండ్ గెట్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్' అనేది వర్తమాన నినాదం.

90ల తర్వాత విశ్వరూపమెత్తిన ఈ మార్కెట్ నినాదం తాలూకు ప్రతిఫలనమే మోదీ. మార్కెట్ పూర్వకాలపు గ్రామిణ సమాజంలో మాదిరి పచ్చిగా మొరటుగా ఉండదు. ఆది తనమీద తానే ఉద్యమాలు చేసుకోగలదు. ఎంతలో కావాలో అంతలోనే ఎప్పుడు కావాలో అప్పుడే చేయించగలదు. ఎప్పుడు ఆపాలో అప్పుడు ఆపేయగలదు. ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామిక వాదులు చాలా కాలంగా మాట్లాడుతున్న భాషను మార్కెట్ హైజాక్ చేసి తనకు అవసరమైనట్టు టైలరింగ్ చేసుకుంది. ఆమ్ ఆద్మీ స్థానంలో టాక్స్‌పేయర్ పరిభాష వచ్చి చేరింది. అన్ని రంగాల్లో ఈ అప్రాప్రియేషన్ కొనసాగుతున్నది. వోకల్‌గా ఉన్న మధ్యతరగతి నియంతృత్వాన్ని ప్రేమిస్తోంది. ప్రజాస్వామికంగా ఉండే వ్యక్తులతో, రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవించే వ్యక్తులతో న్యాయం జరగదు. వాటిని పట్టించుకోకుండా అర్జెంట్‌గా ఏదో ఒకటి చేసేవాడు కావాలి. పెట్టుబడులను, జిడిపిని పెంచేవాడు కావాలి. ఒక్కముక్కలో తమకు ఏవి అవసరమని అనుకుంటున్నారో అవి ఎలాగైనా సాధించిపెట్టే గో గెటర్ కావాలి. మోదీ అనే వ్యక్తి రాంబో అవతారమెత్తి భారతసమాజం మీద కత్తిలా వేలాడడానికి వెనుక ఈ కారణాలన్నీ ఉన్నాయి.

అతను గోగెటర్! మధ్యతరగతిలో ఒక సమూహం కోరుకుంటున్న రాంబో. కారుకింద ఎన్ని కుక్కపిల్లలు చనిపోయినా పట్టించుకోకుండా దాన్ని వారు కోరుకున్న గమ్యానికి చేర్చగలిగిన డ్రైవర్. కానీ వారు మర్చిపోతున్న అంశం ఒకటుంది. తెరమీద హడావుడి చేసే రాంబో నిజమైన యుద్ధంలో నిలబడి గెలుస్తానడనడానికి ఆధారమేదీ లేదు. కెమెరాల రాద్దాంతానికి, సైబర్ హడావుడికి దూరంగా సైలెంట్ మెజారిటీ ఉంటుంది. దాన్ని నిద్రలేపే శక్తులు ఇపుడు బలహీనంగా కనిపించొచ్చు. కానీ బలహీనత శాశ్వతం కాదు.

2 comments:

  1. వ్యాసం లో విషయం గురించి చెప్పేదేమి లేదు. పూర్తిగా అంగీకారమే. కాని మీరు రాసే విధానం పువ్వులు గుచ్చినట్లు ఉంటుందని నా స్నేహితురాలి మాట గుర్తుకు వచ్చింది

    ReplyDelete
  2. రమా గారూ, పువ్వులు గుచ్చినట్టు అన్న వ్యాఖ్యను కొంచెం విశదీకరించగలరా!

    ReplyDelete