మూలింటామె-నామిని రెండో రాకడ
నామినితో భలే కష్టం. ఆయన పాత్రలు త్వరగా వదిలిపెట్టవు. కథ చదివి పక్కన మడిచిపెట్టేసి మన మానాన మనం వేరే వ్యాపకాల్లోకి వెడదామంటే కుదరదు. కొంత కాలం పాటు అందులోని మనుషులు మనతోపాటు ప్రయాణిస్తూనే ఉంటారు. మన గతంలోకి దూకేసి జ్ఞాపకాల తుట్టెను రేపి డిస్ర్టబ్ చేస్తా ఉంటారు. ముఖ్యంగా పనీ పాట ఉన్న కుటుంబాలనుంచి వచ్చినవారికి ఇది బాగా అనుభవంలోకి వస్తుంది. మనం పల్లెటూరినుంచి వచ్చినవారిమే అయితే మూలింటామెను చూసే ఉంటాం. ఒంటరితనంతోనూ కష్టాలతోనూ నలిగిన మనిషిని మనం మన పక్కింట్లోనో ఎదిరింట్లోనో నాలుగిళ్లకావలో చూసే ఉంటాం. కొందరు రచయితలు ఆమెను తమ కథల్లో చిత్రించే ఉంటారు. ఇపుడామెను నామిని కావ్వనాయక చేశారు. ధర్మారావు, దయానిధి పక్కన మాంచి పీటవేసి కూర్చోబెట్టారు.
ఈ నవలలో ప్రధాన పాత్రలు మూడు. భర్తను కోల్పోయి పిల్లలను తన భుజాలమీద పెంచి పెద్దచేసిన మూలింటామె కుంచమమ్మ. ఆమె మనమరాలు రూపావతి. బతకనేర్చిన పందొసంత. కథ సగభాగం మాయాబజార్‌లో పాండవుల మాదిరి రూపావతి చుట్టే తిరుగుతా ఉంటుంది. రూపావతి కనిపించకుండా కథను నడిపిస్తూ ఉంటుంది. మూలింటామె మనమరాలు "కళాయిబోసుకునే మాదిగోడితో" లేచిపోవడం ఆ తర్వాత మూలింటామె కొడుక్కి పందొసంతతో పెళ్లి చేయడం, ఆ మహాతల్లి అతని ముందే వేరే ఆసామితో వ్యవహారం నడుపుతూ కుటుంబాన్ని'అభివృద్ధి' చేయడం పైపైన చూస్తే కనిపించే కథ. ఇందులో ప్రత్యేకత ఏమీలేదు. ఎవరయినా ఈ కథ చెప్పేయొచ్చు. కానీ ఈ మధ్యలో నామిని చిత్రిస్తారే ఆ ప్రపంచం, ఆ విలువల వైవిధ్యమూ, వైరుధ్యమూ, హిప్పోక్రసీ, ఆ మార్పూ ఉందే అది మాత్రం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఎక్కడ ఏహ్యభావం కలిగించాలి,ఎక్కడ ప్రేమ పుట్టించాలి అనే విషయంలో పట్టింపు రచయిత దృక్పధానికి అద్దం పడుతుంది. మనుషుల స్వభావాలను పలుకు తీరులోనూ స్వభావంలోనూ జాగ్రత్తగా చిత్రిక పడతారు. ప్రతిపాత్రకూ తనదైన స్వభావమూ, తనదైన నడక ఆసాంతమూ కొనసాగుతుంటాయి. వాళ్లను మనం మనూళ్లో ఉన్న ఫలానా ఫలానా వాళ్లతో పోల్చుకోగలుగుతాం. అరె, ఇది అచ్చంగా మనూర్లో జరిగిందే అనుకోగలుగుతాం. మూలింటామె మౌనం మాటున బాధను అణిచివేసుకునేదయితే ఆమె కూతురు మాటల రొద మాటున సొద మాటున మనేదను వెల్లగక్కుకునే బాపతు. పందొసంత ఒళ్లంతా లౌక్యం నిండిన మార్కెట్ బిడ్డ. చీమంతమ్మ ఎదుటోడి దుక్ఖం తన దుక్ఖంగా భావించగలిగిన ఆర్తి కలిగిన మనిషి. మొలకమ్మ, రంజకం లాంటివారు నోటిదూలిస్టులు. ఇలాంటివారు ఇంతకంటే అన్యాయమైన వారు మన చుట్టూతా రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంటారు. రకరకాల అసంతృప్తులతో రగిలిపోతూ ఆమె ఇట్టంటలే, ఈయన ఇట్టంటలే అని ఇతరుల మీద అవాకులూ చెవాకులూ ప్రచారం చేస్తూ ఆ రకమైన ఫేక్ ఓరల్ సెక్స్‌తో సంతృప్తిపడదామనుకునే మానసిక రోగులుంటారు. అన్నంతినే నోటితోనే అశుద్ధపు మాటలను విసర్జించగల పృష్టముఖులుంటారు. ఈ పేడపురుగులకు జెండర్ ఉండదు. కుచ్చుంటే కత లేస్తే కత రోజుల్లో అలాంటి వారిని లైటర్ నోట్లో చిత్రిస్తే ఇందులో మాత్రం ఆడుకున్నారు నామిని. నోరు గలిగిన వారు నీతిమాటల్ని గట్టిగట్టిగా చెపుతూ న్యాయాన్యాయాలను నిర్దేశిస్తున్నపుడు కడుపుమండిన వికర్ణుడి మాదిరి సభను ధిక్కరించి మాట్టాడిన సుకుమారుడు సింబాలిక్‌గా చూసినపుడు నామిని ప్రతినిధి గామోలు అనిపిస్తుంది. " వుండండి లంజిల్లారా, యీ ఊళ్లో ఆడవి మొగుళ్ల దాపున చేరుకొని ఏఏ వాటంతో లంజరికాలు జేసి పత్తిత్తుల్లాగా చెలామణి అవుతుండాయో ఒక పుస్కం రాసి చూపిస్తా నుండండి లంజల్లారా!" అనేయగలిగిన తెంపు నామినిదే అనిపిస్తుంది. కానీ ఆ సింబాలిజాన్ని దాటుకుని చూస్తే రచయిత సర్వాంతర్యామిలాగా కనిపిస్తాడు. కొన్నిసార్లు మూలింటామెలో మరికొన్ని సార్లు చిలకమ్మలో ఇంకొన్ని సార్లు మాల గురివిలో కూడా కనిపిస్తాడు.
"ఈ కత ఊరి గెమిని దాటిపోకూడదు. ఆడలంజిలు దీన్ని చాటవమాదిరిగా చెప్పుకుంటా ఉంటే యిన్నమొగోడు యిన్నట్టే మెట్టుతో కొట్టీయాల. చుట్టూతా రెడ్లు. రామాపురం రెడ్లు. నడవలూరు రెడ్లు, నెన్నూరు రెడ్లు, గంగరెడ్డి పల్లె రెడ్లు, యిన్నేండ్లూ రెడ్లేలతా ఉంటే మనం నోట్లో ఏలేస్కోని గమ్మనుండినాము. యిప్పుడనంగా మనోడు ఏల్తా ఉంటే రెడ్లు కక్కలేక మింగలేక మినకతా ఉండారు. యీ టయింలో మన కమ్మిరికంలో ఒకాడది యీ మాదిరిగా కళాయిబోస్కునే అరవ మాదిగోడితో పూడిసిందంటే-యీ కత నాలుగూళ్లకు తెలిస్తే మళ్ల మనం తిరప్తికి బస్సెక్కి పోగలమా!'' అని ఇది ఎప్పటికథ,ఎవరి కథ, అనేవి నామిని చెప్పేశాడు. 80ల కథ, కమ్మపల్లెలో జరిగిన కథ. రాష్ర్టంలో ఎన్టీఆర్, కేంద్రంలో రాజీవ్ గాంధీ పాలిస్తున్న దశ. రాజీవ్ కొత్త మార్పులను సమాజంలో ప్రవేశపెడుతున్న దశ. గ్రామీణ సమాజం మార్పులను అనుమానంగానూ ఆసక్తిగానూ చూస్తున్న దశ. పాత కొత్తలు రెంటిలోని విషాదాల్ని వ్యాఖ్యానం లేకుండా మనముందుంచారు నామిని.
నా కొడుక్కి యవాదశొచ్చి పదేడు పజ్జెనిమిదేళ్లయినా నేను పెళ్లి ప్రయత్నం చేసినానా! అప్పుడు నువ్వు మూడేండ్ల బిడ్డ. నిన్ను తండ్రి మాదిరిగా చూసినాడు నీ మేనమామ. నిన్ను బుజాల మిందనే ఎత్తుకొని తిప్పినాడు. ... బొటనేలు తొక్కించుకుని బొట్టు కట్టించుకునే నాటికి నీకు యొచ్చూ తక్కవగా పదైదు పదారేండ్లు. నీ మొగుడికి ముప్పై ముప్పై మూడేళ్లు. వొంటికాలి మింద పదైదేండ్లు దేనికని నిలబడుకోనుండినాడు. సంకన బెట్టుకుని సాకిన బిడ్డి మెళ్లోనే బొట్టు కడదామని!...మూలింటామె మనేదలో కలిపేసి చెప్పాల్సినవి చెప్పేస్తాడు. మనం చేస్తే తప్పుకాదు గానీ పసిబిడ్డ చేస్తే తప్పా....కిందా పైనా నెరిసిపోయ్‌నాక నువ్వూ పత్తీతవే, నేను పత్తీతనే! అని మూలింటామె నోట ఊరికే పలికించలేదు. ఆ ముసలాళ్ల యవ్వనపు రహస్యాలు మనకు తెలియజేయాలనే కొంచెపు మనస్తత్వంతో చేయలేదు. అది ఒక బూటకపు విలువను అపహాస్యం చేయడం. ఏదో ఒక ఆధిపత్యాన్ని ఆపాదించుకుని ఎదుటివారి మీద చెలాయించాలని చూసే మనస్తత్వాలను ఎద్దేవా చేయడం. మనిషి మీద గౌరవం చూపడం.
నవలను రెండు భాగాలుగా విభజించారు నామిని. కంటికి కనిపించని రూపావతి మొదటి భాగానికి కేంద్రకమైతే రెండో భాగమంతా పందొసంత విశ్వరూపం.బావా, నువ్వేంది బీడీలు తాగేది సిగరెట్లు తాగు అని వయసుకు బావైన మనిషితో సరసాలాడే పందొసంత ప్రవేశంతో నవల మరో దశకు చేరుతుంది. బీడీల నుంచి సిగరెట్లకు మారడంలో చాలా మతలబు ఉంది. సిగరెట్లే కాదు, అలాంటి అనేకానేక కొత్త వస్తువులను అమ్మే దుకాణాలు, ట్రాక్టర్లు, మోటార్లు, మోపెడ్లు, కొత్త కొత్త మాటలు అన్నీ చాలా వచ్చేస్తాయి పందొసంత కొంగుపట్టుకుని. అక్కడ్నించి రచయిత కలం కట్టలు తెంచుకుంటుంది. కథనంలో వేగమే కాదు, దూకుడు కూడా పెరుగుతుంది .ప్రయోజనానికి అడ్డొచ్చే ప్రతిదాన్నీ నాశనం చేసుకుంటూ వెళ్లిపోయే ఆధునిక మార్పు పట్ల పట్టరాని కోపం కనిపిస్తుంది. చెట్లు కొట్టేసే దృశ్యం వివరణలో పర్యావరణ స్పృహను కూడా పలికిస్తాడు నామిని. కథకు ఎక్కడా తులం దెబ్బతగలకుండా ఇన్ని విషయాలను చెప్పడంలోనే నేర్పరితనం కనిపిస్తుంది. మరీ అవసరమనుకుంటే తప్ప పాఠకులకు టెక్ట్స్‌కు మధ్య రచయిత పదేపదే అడ్డమొచ్చేసి ఇది ఇదీ, ఇది ఇదీ అని వ్యాఖ్యానాలు జడ్జిమెంట్లు చేయడం నామినికి అలవాటు లేదు. పాఠకులకు నామిని ఇచ్చే గౌరవం ఎక్కువ.
"పాపం మూలింట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒళ్లెరగని నిద్రపోయినా గుడుగుడు చంద్రడు గానీ, పందొసంత గానీ కంటిమీద రెప్పేసుంటే! ,...ఆ మాదిరిగా ఎంతసేపూ ఒకర్నొకరు కరుసుకుని పొడుకోలేక మంచి నిద్దట్లోనే ఆ రేత్తిరంతా అడ్డాపింట్లోకి పొయ్ కొంచి కొంచిం సేపు పొనుకుంటూ మళ్లా మంచం మీదకు వస్తా -రేయి తెల్లవాదులూ ఆ యిద్దురూ కంటిమీద రెప్పేయకుండా వనవాసరం చేసినారు."రచయిత కోపం వ్యంగ్యంలోకి దిగితే ఎలాఉంటుందన్నదానికి ఇది సూచిక అనిపిస్తుంది. గుడుగుడు చంద్రడికి పందొసంతకి బంధాన్ని చెప్పడానికి మామూలుగా నైతే ఇంత వర్ణన అవసరం లేదు. కానీ ప్రథమ భాగంలో 'కళాయిబోసుకునే మాదిగోడితో లేచిపోయిన' రూపావతిపై సాధ్యమైనంత ప్రేమనుచూపే నామిని కలం రెండో భాగంలో కేవలం ప్రయోజనాలకోసం అన్ని లెక్కలు వేసి పందొసంత పెట్టుకున్న బంధంపై సాధ్యమైనంత ఏహ్యభావం కలిగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రెండు చోట్ల కూడా లోకం పోకడను ధిక్కరిస్తుంది. "రంగబిళ్ల ఆ ప్రకారంగా నిప్పుల్లో కాలిపోయ్‌నాక పొందొసంతను బజిన గుడికాడికి పిలిపించి 'గుడుగుడు చంద్రుడెవుడు? వోడి నీ ఇంటికి రావడమేంది, ఆ కోళ్లు కోయడమేంది, నిన్న జూసి మిగతా ఆడవి నేర్చుకోవా?' అని నిగ్గదీసే మొగోడేడీ? అయినా గుడుగుడు చంద్రడు కళాయి బోసుకునే అరవమాదిగోడేమీ గాదే! ఆ తప్పుకే రాములవారి గుడి ముందు అపరాదం పడాలా, యివన్నీ ఏముండాయి, తుకడా ఎవ్వారాలు." అని ఊరి న్యాయం తాలూకు స్వభావాన్ని ఎండగడతారు నామిని. అధికారం ఏ సమాజంలో ఏ రూపమెత్తుతుందో నామినికి బాగా తెలుసు. అయితే సంకనబెట్టుకుని సాకిన బిడ్డి మెళ్లోనే బొట్టుకట్టే వ్యవస్థలో దాగిన అన్యాయం కంటే కాసు తప్ప మరేమీ కనిపించని కొత్త వ్యవస్థ మీద రచయితకు ఎక్కువ కోపం ఉంది అని ఆయన పందొసంత పాత్రను తీర్చిన తీరు చూస్తే అనిపిస్తుంది. రచయితకు ఇంతకుముందు అలవాటు లేని బీభత్స దృశ్యాలు ఇందులో చిత్రించిన తీరు చూస్తే ఒక రకంగా రచయిత పందొసంత మీద కత్తి గట్టినట్టు అనిపిస్తుంది. అలాగే నవల మొదట్లో -యిపుడే బయటకో యాడికో పొయినట్టుండాది మూలింటామె మనవరాలు రూపావొతి అనే వాక్యం లేకపోతేనే బాగుండేమో అనిపిస్తుంది. పాఠకుడిని అలా మళ్లించాల్సిన అవసరం నామిని లాంటి రచయితకేల!
చికెన్ వండేటప్పుడు టమోటా వాడకూడదని ఎంత పట్టింపో అలాగే పిల్లుల జోలికి పోగూడదు అనే పట్టింపు కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. నెపం కాసేపు మూలింటామె మీద నెట్టేసి నవల మొత్తం ఒక ధారలాగా పిల్లిశాస్ర్తం నడిపిస్తూ ఉంటారు. వాటి శుభ్రత, శుచీ, ఆహారపు అలవాట్లు, విసర్జక అలవాట్లు, ఇలా పిల్లి శాస్ర్తమంతా చెప్పేస్తారు రచయిత. రైతాంగ కుటుంబాల్లో పిల్లి పట్ల ఉండే సెంటిమెంట్‌ను పందొసంత మీద కోపాన్ని పెంచడానికి వాడుకున్నారు. మామూలుగా నామిని రచన పెయిన్‌కి పర్యాయపదం. ఇందులో మాత్రం ఆగ్రహం దాన్ని దాటేసింది. ప్రథమభాగంలో వ్యక్తుల మీద పెద్దగా కోపం రాదు. మొత్తం ఆ వ్యవస్థ మీదే కోపం వస్తుంది. కానీ రెండో భాగంలో మాత్రం వ్యవస్థ మీద కంటే కూడా పందొసంత మీదే కోపం కేంద్రీకృతమవుతుంది. . కులమూ, ధనమూ, మానవ విలువల విధ్వంసమూ, పర్యావరణమూ, లాంటి అనేక విషయాలు పాతకొత్త రూపాల్లో ఎలా పనిచేస్తుంటాయో ప్రాక్టికల్‌గా చూపించిన పుస్తకం మూలింటామె. గతంలో ఘటనలనే ఎక్కువగా చిత్రించిన నామిని ఇపుడు పరిణామాన్ని చిత్రించడానికి పూనుకోవడం తెలుగు సాహిత్యం రెండు చేతులా ఆహ్వానించాల్సిన విషయం. నామిని రెండో రాకడకు స్వాగతం.
(జూన్ 29, 2014 ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసం)