పల్లె బతుకుపై అక్షర చిత్రం
నేడే చదవండి.పల్లె బతుకు లోతుల్ని తవ్వి తీసిన విద్యాసాగర్ అపురూపమైన అక్షర చిత్రం పల్లెను మింగిన పెట్టుబడి. మాయా లేదు, మర్మం లేదు. గాలిమేడలు కట్టడం అసలే లేదు.నిద్రలో ఉన్నవారిని, నిద్రనటించేవారిని మేల్కొలిపే రాత యిది. ఈ నేల గురించి ఈ నేలను నమ్ముకున్న మనుషుల గురించి ప్రేమ ఉన్న వారు, వారికోసం ఏమైనాచేయాలనుకునే వారు తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం ఇది. మా రోజుల్లో అనే తలపోతల నుంచి, పల్లెలు కూడా చెడిపోతున్నాయి అనే వలపోతల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపకరించే సాధనం ఈ పుస్తకం. పట్నవాసపు సౌఖ్యాలను అందుకుంటూ పల్లెగురించి తెలిసీ తెలీని రాతలు రాసే రచయితల వల్ల వ్యాపించిన రోమాంటిసిజమ్ అనే వ్యాధిని నయం చేసే కషాయం ఈ పుస్తకం. గ్రామీణ సమాజం,వ్యవసాయం,వృత్తులు,వలస, పెట్టుబడి, వాటి అంతస్సంబంధాల గురించి అధ్యయనం చేయాలనుకునే వారు అవశ్యం పఠించాల్సిన గ్రంధం. తిరోగామి వాదాన్ని పురోగామివాదంగా విప్లవకరంగా ప్రచారం చేస్తూ చరిత్రను, సామాజిక చలనాల్ని తలకిందులుగా చూపిస్తున్న మేధావులను సరిచేసి నిటారుగా నిలబెట్టే శక్తి కలిగిన అక్షరాయుధం. వామపక్ష రాజకీయాల్లో ఇటీవల తీవ్రస్థాయిలో సాగుతున్న మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ డిబేట్‌ని ప్రభావితం చేయగలిగిన సత్తా ఉన్న పుస్తకం. సాధారణ కార్యకర్తలకు సైతం సులభంగా ఆ అంశాలను వివరించగలిగిన పుస్తకం. ఆ రకంగా సామాజిక రాజకీయ రంగాలకు విద్యాసాగర్ చేర్పుగా దీన్ని చెప్పుకోవచ్చు.
విద్యాసాగర్ ఏం చెప్పారు? గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అనే పరమ చెత్తను మోసుకు తిరుగుతున్న వారి బండారాన్ని బయటపెట్టారు. గ్రామీణ సమాజంలో స్వర్ణయుగం అనేది ఏదీ లేదని అది కొందరి స్వకపోల కల్పితమని ఆధారాలతో సహా చూపించారు.శ్రీకాకుళం జిల్లాను నమూనాగా తీసుకుని ఊరూరూ తిరిగి గొడ్డుచాకిరీ చేసి మరీ నిరూపించారు. గతంలో సుందరయ్య లాంటి వారు చేసిన సర్వేల కంటే విసృతమైనది ఇది. ఉత్పత్తి, రవాణా మెరుగుపడని సమాజాల్లో జీవనం ఎంత దుర్భరంగా ఉండేదో నివేదికల సాక్ష్యంగా చూపించారు విద్యాసాగర్. గతం స్వర్ణయుగం కాదని తెలిసిన వారికి కూడా ఒళ్లు జలదరించే నివేదికలవి. బిడ్డలను 6 నుంచి 12 దినార్‌లకు అమ్మివేయడం దగ్గర్నుంచి బిడ్డల్నే చంపి తినేదాకా చరిత్ర పొడవునా దారుణమైన కరువులు. గుర్రాలు, ఏనుగుల మలంలో ధాన్యం కోసం వెతుక్కునే దగ్గర నుంచి కోటలోంచి ఒక గాడిద బయటకు వస్తే దానిమీద తోడేళ్ల మందవలెపడి కండరకండరాన్ని పీక్కుతినే ఉదంతాల దాకా ఎన్నో భరింప శక్యం కాని ఉదాహరణలిచ్చారు. ఉత్పత్తి అంతంతమాత్రంగా ఉండి కరువు కాటకాల సమయంలో బయటినుంచి ధాన్యం వచ్చే రవాణా ఏర్పాట్లు లేని రోజున ఈ సమాజం ఎలా ఉండిందో సామాజిక చలనాల గురించి తెలిసినవారు ఊహించగలిగిన విషయాలే. నిన్న కాక మొన్న బెంగాల్లో చూసిందే. చరిత్ర తెలుగు సినిమా కాదు. ఇది అర్థభూస్వామ్య అర్థ వలస సమాజమనే విశ్లేషణను పూర్వపక్షం చేశారు విద్యాసాగర్. పెట్టుబడి దానితో పాటే లాభాలపోటీ ఎట్లా విస్తరిస్తున్నాయో స్వేచ్చగా శ్రమను అమ్ముకునే అవకాశాలు ఎలా పెరిగాయో వివరించారు. రోలు, మిక్సీ పక్కపక్కనే ఉండే స్థితిని చూపించి పెట్టుబడి భూస్వామ్యంతో మిలాఖత్ అయ్యిందని గాలిపటాలెగరేయలేదు. దానికి భిన్నంగా ఆదిమ సమాజం నాటి కంక నుంచి ఇవాల్టి ట్రాక్టర్ దాకా అన్నీ ఉనికిలో ఉండి కూడా పెట్టుబడిదారీ సంబంధాలు సాధ్యమేనని ఉదాహరణలతో చాటారు.మతాన్ని కులాన్ని ముందుపెట్టి పెట్టుబడి వాటితో సహజీవనం చేస్తున్నది కదా అని కూడా కొందరు అంటుంటారు. పెట్టుబడిదారీ సమాజంలో మతం- కులం ఉండవని ఎవరు చెప్పారో ఎందుకలాంటి అపోహ ఏర్పడిందో తెలీదు. మనలాంటి దేశాల్లో పెట్టుబడికి పురోగామి స్వభావం ఉండదని ఇంకొంతమంది మిత్రులు వాదిస్తూ ఉంటారు. ఇక్కడ బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ఏదీ రాలేదని అందువల్ల పెట్టుబడికి సానుకూల స్వభావమేదీ లేకుండా పోయిందని చెపుతూ ఉంటారు. రైలు అనే ఒక సాధారణ రవాణా సాధనం తెచ్చిన మార్పుల గురించి తెలిసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చక్రానికే అంత శక్తి ఉంటే శాటిలైట్‌కి ఎంత ఉండాలి! పెట్టుబడికి ఒక స్వభావముంది. బూర్జువా ప్రజాతంత్ర విప్లవం షరతు ఏమీ కాదు. షరతుగా చెప్పడమంటే ఉత్పత్తి సంబంధాలకు మనిషి చైతన్యానికి మధ్య సంబంధాన్ని తిరస్కరించడం. పాత సంబంధాలను ధ్వంసం చేయకుండా పెట్టుబడి పురోగమించలేదని విద్యాసాగర్ తేల్చిచెప్పారు. పెట్టుబడి తనతో పాటు తీసుకువచ్చే సాంకేతికత ఫ్యూడల్ సంబంధాలను నాశనం చేయడానికి ఎలా ఉపయోగ పడుతుందో చూపించారు. వాడిపడేసే ప్లాస్టిక్ గ్లాసులు రావడం రెండు గ్లాసుల విధానం పోవడానికి ఎలా దారితీసిందో చిన్న ఉదాహరణతో సంకేతాత్మకంగా చెప్పారు. ఇది చదువుతుంటే ఉత్తరాదిన నాగళ్లు పోయి ట్రాక్టర్లు రావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కుల అణచివేతకు సంబంధించిన కొన్ని రూపాలు ఎలా అంతరించాయో చెప్పే అధ్యయనాలు గుర్తొచ్చాయి. గతంలో అనూరాధాగాంధీ లాంటివారు గ్రామీణ-కుల సంబంధాలను మార్చడంలో పెట్టుబడి పాత్ర గురించి ప్రస్తావించినా దాని ప్రాధాన్యాన్ని పట్టించుకోలేదు. వృత్తికార్మికులకు సంబంధించిన వివరణలో ట్రాప్డ్ అనే పదాన్ని ఉపయోగించినా దాన్ని చాలా పరిమితమైన అర్థంలో పాసింగ్‌గా వాడారు. విద్యాసాగర్ ఆ ఖాళీని పూరించారు.
మెరుగైనా రవాణా సౌకర్యాలు ఏర్పడడం కూలీరేట్లు పెరగడానికి ఏ విధంగా దోహదం చేసిందో రచయిత వివరించారు. ”కులవృత్తుల విధ్వంసం అనేది పెట్టుబడి చొరబాటుకు మౌలిక అవసరం. గ్రామీణ ధనిక రైతాంగానికి అర్థబానిస రూపంలో దీర్ఘకాలం కట్టివేయబడిన ఈ కులవృత్తుల సమాజం స్వేచ్ఛగా శ్రమను అమ్ముకునే కూలీలుగా మారారు” అని తేల్చారు. వృత్తులు కొనసాగాలని కోరుకోవడమంటే మనుధర్మాన్ని కొనసాగించాలని కోరుకోవడమేనని, వామపక్ష మేధావులు కూడా అ పాట పాడడం అన్యాయమని చెప్పారు. ఎన్ని సాకులు చెప్పి ఏ రూపంలో వివరించినా అది తిరోగమనమేనని నిర్మొహమాటంగా చెప్పారు. భారత దేశంలో పురోగామివాదులు ప్రధానంగా మార్క్స్ అనుయాయులు. లేదంటే అంబేద్కర్ అనుయాయలు. ఇద్దరి లోంచి అవసరమైనవి తీసుకోవాలని భావించేవారు కూడా ఉండొచ్చు. ఆ ఇద్దరూ వృత్తులు ధ్వంసం కావాలనే కోరుకున్నారు. వృత్తులు కొనసాగాలని కోరుకున్నది గాంధీ. ఆర్థిక రంగానికి సంబంధించి ఆయన ప్రవచించిన విషయాలు ఆచరణ సాధ్యం కానివి. సమాజాన్ని వెనక్కు తీసికెళ్లేవి. కానీ విచిత్రంగా మార్క్సిస్టులని చెప్పుకునేవారు కూడా రకరకాల వాదనలతో వృత్తులను ఆరాధించడం చూస్తూ ఉంటాం. సమాజాన్ని మార్చాలనే బాధ్యతను భుజాన వేసుకున్న వారెవరైనా వ్యూహాలు-ఎత్తుగడలకు సంబంధించిన గాంధీ నాయకత్వ పటిమనుంచి స్ఫూర్తి పొందొచ్చు. ఆయన వాదంనుంచి కాదు. వ్యక్తిగా ఆయన మహానాయకుడు. ఆయన జీవితం ప్రతి కార్యకర్త తప్పనిసరిగా చదివి తీరాల్సిన పాఠం. కానీ మన దగ్గర దానికి భిన్నంగా జరుగుతోంది. వ్యక్తిగతంగా ఆయన్ను దూషించడం, భావజాలంలో ఆయనను అనుసరించడం వంటి విచిత్రాలు మనం చాలాకాలంగా చూస్తున్నాం. అందుకే ఈ రచయిత మీరెటువైపు, మనువు-గాంధీవైపా, మార్క్స్-అంబేద్కర్ వైపా అనేరీతిలో అడగాల్సిన ప్రశ్నే అడిగారు.
విద్యాసాగర్ ఇంకా ఏం చెప్పారు? వ్యవసాయ సంక్షోభం ఏటికేడు ఎందుకు తీవ్రమవుతున్నదో వివరించారు. ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ సంక్షోభం పెరగడం వెనుక కారణాలను సరిగా పట్టుకున్నారు. ప్రధానంగా అది చెల్లింపుల సంక్షోభం అని తేల్చారు. వ్యవసాయం వ్యాపారంగా మారిపోయిందని విస్పష్టంగా వివరించారు. సేద్యంలోకి ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం దగ్గర్నుంచి రైతాంగం జీవనశైలి మార్పుల దాకా అనేకానేక అంశాలను చర్చించారు. పిల్లల చదువులకు ఎక్కువ ఖర్చుపెట్లాల్సిన స్థితితో పాటు బర్త్‌డే పార్టీల్లాంటివి పెరిగిపోవడం లిక్కర్ వాడుక పెరిగిపోవడం లాంటి అంశాలను మన ముందుంచారు. “తక్కువ ఖర్చుతో జీవితం గడిచినప్పటికీ అతితక్కువ ఆదాయం ఉండడంతో ఫ్యూడల్ సమాజం ఒకరకం సంక్షోభం సృష్టిస్తే పెరిగిన ఆదాయాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చులు పెంచి పెట్టుబడి మరో రకం సంక్షోభం సృష్టిస్తోంది” అని ప్రకటించారు. వాస్తవానికి ఒకనాడు గ్రామీణ సమాజంలో ఖర్చు అంటే ప్రధానంగా తిండి ఖర్చే. ఇవాళ పట్టణాల మాదిరే ఇతర ఖర్చులు తిండి ఖర్చును మించిపోయాయి. ఈ మార్పు సమాజం ఒక దశ నుంచి ఇంకో దశకు వెళ్లిందనేదానికి సంకేతం. ఇవాళ గ్రామాలంటూ ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు, అవి పట్టణాల ఎక్స్‌టెన్షన్స్ మాత్రమే అని చక్కని మాట చెప్పారు. ఇళ్లలో పాల చుక్కవాడకుండా అన్నీ పాలకేంద్రాలకే పోస్తున్న ధోరణి గురించి రచయిత ఒక చోట ప్రస్తావించారు. గ్రామాల్లో పెట్టుబడి తెచ్చిన విషాదం ఇక్కడుంది. ఒకనాడు ఎదురింటి రైతుకు కుడితి నీళ్లు పోస్తే పెరుగో మజ్జిగో పోసేవారు. కూలీపని నుంచి వస్తూ వస్తూ ఏదో ఒక పొలంలో పిడికెడు గోంగూర పెరక్కొచ్చుకుని ఏదో ఒక రొట్టె చేసుకుంటే పూటగడిచేది. ఒక వీధిలో చిక్కుడు పాదుకు కాయలు కాస్తే ఆ ఆవీధిలోని ఇళ్లన్నింటా ఆ రోజు చిక్కుడు గుభాలించేది. ఏదీ లేని నాడు ఊరికే పడిఉండే మునగచెట్లనుంచి నాలుగు ఆకులు దూసి ఉడికేసుకుంటే పూటగడిచేది. అమ్మడం-కొనడం జీవితాన్ని ముంచెత్తని దశ కావడం వల్ల ఇరుగు పొరుగు సహకార జీవనం ఒకటి ఉండేది. ఒకే సాంఘిక హోదా కలిగిన కుటుంబాల మధ్య ఆర్థిక అంతరాలతో నిమిత్తం లేకుండా ఇలాంటి ఆదాన ప్రదానాలుండేవి. అన్నీ సరుకులుగా మారి మార్కెట్‌కు వెళ్లడం వల్ల ఇవాళ పల్లెల్లో కూడా ఈ రకమైన జీవనం కనిపించడం లేదు. గుంపు జీవనంలో ఉన్న అణచివేత తగ్గడం వంటి సానుకూల పరిణామాలతో పాటు అదే జీవనంలో కొంతవరకు అంతర్భాగంగా ఉండే సహకార ధోరణి పోయి వ్యక్తి ఒంటరవుతున్న దృశ్యం కనిపిస్తోంది.
గ్రామీణ సమాజం సంవత్సరమంతా మట్టిగడ్డలను కౌగిలించుకుని, అర్థబానిస తరహా శ్రమను చేస్తూ పండించిన ఉత్పత్తిని మార్కెట్‌కు ‘విలువ తక్కువ’ ఉత్పత్తులుగా ఎగుమతి చేస్తోంది. తిరిగిన తనకు అవసరం ఉన్నా లేకపోయినా ‘విలువ ఎక్కువైన’ పారిశ్రామిక ఉత్పత్తులను దిగుమతి చేసుకునే స్థితిని మార్కెట్ కల్పించింది. ఈ చెల్లింపుల సంక్షోభమే నేటి రైతు సంక్షోభం” అని విద్యాసాగర్ వివరించారు. వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం గురించిన ప్రస్తావన ఒక చోట చేశారు. తాను కొనుగోలు చేసే వస్తువుల రూపంలో పన్నుభారం, వ్యవసాయంపై మదుపు భారం అనే ” ఈ రెండు పర్వతాలను మోస్తున్న భారతీయ రైతాంగం ఆ భారాన్ని వదిలించుకోవడానికి పట్టణ శ్రామిక వర్గంగా మారుతోంది.” అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు లోపించడం వల్ల తలెత్తుతున్న సమస్యలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. చాలా దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర ఉత్ప్తత్తి ఇంకా ఎందుకు దారుణంగా ఉంటోంది? చైనాలో హెక్టార్‌కు ఆరు టన్నులకు మించి వరి పండిస్తూ ఉంటే మనం మూడు టన్నులు కూడా ఎందుకు చేరలేకపోతున్నాం అనేది ఆలోచించాలేమో! ఒక సీజన్‌లో కిలో యాభై రూపాయలు పలికే ఉల్లి, టమోటా, ఆలూ మరో సీజన్‌లో రోడ్డుమీద పారేయాల్సిన స్థితికి ఎలా వెడుతుందనే ప్రశ్నకు కూడా సమాధానం వెతుక్కోవాలేమో! వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల గురించి అతిగా మాట్లాడే ప్రభుత్వాలు ఆచరణలో దుర్మార్గమైన నిర్ల్యక్షం చూపడాన్ని కచ్చితంగా ప్రశ్చించాలి. కోళ్లకు దాణాగా ఉన్న మొక్కజొన్న శ్రీకాకుళం జిల్లాలో 8500 ఎకరాల నుంచి 20 వేల ఎకరాలకు పెరగడాన్ని ప్రస్తావిస్తూ”మనుషులు తినే ఆహారం కోసం విదేశాలవైపుకు కోళ్ల ఆహారం కోసం దేశీయ పొలాలకు అనే వ్యూహం ఏ న్యాయసూత్రాల ప్రకారం సరైనదో ఆలోచించాలి” అన్నారు. ఇక్కడ రచయిత ఒక విషయం మర్చిపోయారు. కోళ్లు కూడా మనుషులు తినే ఆహారమే. ఈ దేశంలో ఎక్కువ జనాభా తినే ఆహారం. ఒకనాడు పండక్కో పబ్బానికో లేక ఇంటికి బంధువొచ్చినపుడో మాత్రమే తినగలిగే ఆహారం ఇవాళ బ్రాయిలర్ కోళ్ల వెల్లువ వల్ల తరచుగా తినే ఆహారంగా మారింది. ఇది సానుకూలంగా చూడాల్సిన పరిణామమే. రచయిత చెప్పిన అర్థంలో అయినా మనుషులు తినే ఆహార ఉత్పత్తిలో మనమేం వెనుకబడిలేం. ఏటా కోట్ల టన్నుల ధాన్యం గోడౌన్లలో మగ్గిపోతోంది. ఆహారపంటల వైశాల్యం తగ్గిపోతోందని ఆందోళన పడాల్సిన అవసరమేమీ ఇవాళ లేదు. ఇలాంటి చిన్న చిన్న వివరాల విషయం పక్కనబెడితే మౌలిక మైన విషయాలన్నింటా రచయిత పూర్తిగా శాస్ర్తీయమైన దృక్పధాన్ని పాటించారు.
తెలుగు నేలమీద వలస వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతున్నది. బలవంతపు వలసలను వ్యతిరేకించవచ్చు. పేదరికాన్ని ఆసరా చేసుకుని భూములు తక్కువకు కొనుగోలు చేసే దోపిడీని వ్యతిరేకించవచ్చు. ”కుండా సట్టి మూటనుగట్టి ఉండా బిడ్డల చంకనబెట్టి మాసం మాసం గాసం కోసం దేశం దేశం తిరిగే పేదల” బతుకుల గురించి ఆందోళన తోనూ ఆర్తితోనూ చర్చించొచ్చు. కానీ మొత్తంగానే వలస అనేపదాన్ని బూతుపదంగా మార్చకూడదు. ఇక్కడ రచయిత సరైన వైఖరి తీసుకున్నారు. వలస తెచ్చిన సానుకూల పరిణామాలను చూపారు. కూలీ రేట్లలో వేతనాల్లో వచ్చిన మార్పులను చూపారు. మెరుగైన రవాణా సౌకర్యాలతో కూలీలు తమకిష్టమైన చోట శ్రమను అమ్ముకునే వెసులుబాటు కలిగిన తీరును చూపారు. తలదాచుకోవడానికి గ్రామం-శ్రమను అమ్ముకోవడానికి బస్తీ అనే పరిణామాన్ని పట్టుకున్నారు. మద్రాస్ పోయిన దళిత కూలీలు తమ గ్రామాల్లో రైతులకు డబ్బులు అప్పు ఇచ్చే స్థితికి చేరిన విధానాన్ని వివరించారు. “మనిషి తన వృత్తిని మార్చుకోగలగడమే అతని మనుగడకు పునాదిగా ఉందని గుర్తించాలి. అలా గుర్తించకపోతే మనిషి రాకాసి బల్లి అయ్యే ప్రమాదముంది” అని చక్కని మాట చెప్పారు. అప్పుల విధానంలో వచ్చిన మార్పుల గురించి చెపుతూ ఫాయిదాలు, ముందస్తు ధర ఖండన ,అప్పులిచ్చిన షావుకారికి పంటను అమ్మాలనే షరతులు రద్దయ్యాయి. ఆ స్థానంలో సరళమైన వడ్డీరేట్లతో అప్పులు దొరికే స్థితికి శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాలు చేరుకున్నాయి” అని మంచి మాట చెప్పారు. సరళమైన అప్పులైనా మన వ్యవసాయ రంగంలో ఉరిత్రాడే. కాదనలేం. కాకపోతే సామాజిక సంబంధాల పరంగా చూసినపుడు గ్రామీణ వడ్డీవ్యాపారికి ముందస్తు ధరకు పంట అమ్మడం లాంటి బానిసత్వం నుంచి విముక్తి పొందడం అనేది ముఖ్యమైన పరిణామం. ”ఏ దేశంలో అయినా ఫ్యూడల్ వ్యవస్థను ధ్వంసం చేసేది పెట్టుబడే. ఆ పని భారతదేశంలో దాదాపుగా పూర్తయ్యింది”. అని మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఈ సమాజం స్వరూపస్వభావాలేమిటో చెప్పకనే చెప్పారు. సామాజిక సంబంధాల విషయంలో నిశిత పరిశీలన వల్ల వాస్తవాలను వాస్తవంగా చూపే వీలు కల్పించింది. ముఖ్యంగా రచయిత శ్రామికుల- శ్రామిక కులాల దృక్కోణం నుంచి సమాజాన్ని పరిశీలించారు. సాధారణంగా గ్రామీణ సంబంధాల్లో మార్పులను పైనించి చూసేవారికి కోల్పోయిన దర్జా గుర్తొస్తుంది. కింది నుంచి చూసేవారికి వదిలించుకున్న బానిసత్వం గుర్తొస్తుంది. పాలేర్ల వ్యవస్థ పోవడంతో పశుసంపద అంతరిస్తున్న వైనాన్ని సాగర్ బాగా చెప్పారు. రైతుకు-పశుసంపదకు తల్లీ బిడ్డ సంబంధమని అదనీ ఇదనీ మనదగ్గర పురోగామివాదులనుకునే వారు సైతం బోలెడు సెంటిమెంట్లు గుమ్మరిస్తుంటారు. అనుబంధం ఉండే మాట వాస్తవమేగాని అది తన జీవికను మించి కాదు. పశుమాంసం ఎగుమతిలో మన దేశం ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్న విషయం గుర్తు చేసుకుంటే మన పశువులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరు వాటిని తరలిస్తున్నారో అర్థం అవుతుంది. గతంలో దళితులు నికర ఉద్యోగంగా లభించే పాలేరు వృత్తి దొరకడమే అదృష్టంగా భావించేవారని ఆ స్థితి ఇవాళ పోయి కాస్త మెరుగైన ఉపాధి దొరుకుతున్నదని సానుకూల పరిణామాన్ని రచయిత వివరించారు. ”గ్రామీణ ప్రాంతాల్లో వాళ్లకు వృత్తిని ఉపాధిని కల్పించిన అర్థబానిస వ్యవస్థ అయిన పాలేరు వృత్తి నుంచే కాక, అర్థాకలితో మాడ్చి చంపిన వ్యవసాయ కూలీ రంగం నుంచి కూడా దళితులు నిష్ర్కమిస్తున్నారు” అని గతాన్ని వర్తమానాన్ని కలిపి వివరించారు. “స్వతంత్ర జీవనం సాగించడానికి పట్టణాల్లో ఉపాధి దొరకడం, సాంఘిక గౌరవం లభించడం” అనేవి పాలేరు వ్యవస్థ పోవడానికి కారణాలుగా దళితుల మాటల్లోనే చూపారు. సాంఘిక గౌరవమనగానే పట్నాల్లో కులం లేదా అని దీర్ఘాలు తీయనక్కర్లేదు. పల్లెల్లో కులానికి పట్నాల్లో కులానికి తేడా ఉంటుంది. ఈ మార్పు కేవలం పరిమాణాత్మకంగా మాత్రమే కొందరికి కనిపించొచ్చు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అది గుణాత్మకమార్పుగా మారుతున్నదని అర్థమవుతుంది. యాంత్రీకరణ జరిగితే ఉపాధి పోతుందని ‘సర్‌ప్లస్ పీపుల్’ పెరుగుతారని గాంధీలాగే చాలామంది ఇప్పటికి కూడా భావిస్తుంటారు. ట్రాక్టర్లు వచ్చాక కూలీలు గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణబాట పట్టారని దీనితో కూలీల కొరత తీవ్రమై కూలీరేట్లు పెరిగాయని వాస్తవ స్థితిని రచయిత వర్ణించారు.
అయితే ఏమిటి? ఇంతకుముందున్నది నరకమూ, ఇప్పటిది స్వర్గమూనా అనొచ్చు. కానే కాదు. రచయితకు స్పష్టత ఉంది. విద్యాసాగర్ కమ్యూనిస్టు. ఎంత కమ్యూనిస్టు అంటే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం గురించి రాయాల్సి వచ్చినపుడు మహాత్మాగాంధీకి కోట్స్ పెట్టే అంత కమ్యూనిస్టు. కాట్‌స్కీని ఎక్కువగా కోట్ చేస్తే తనమీద రెనగేడ్ ముద్ర పడే ప్రమాదముందని తెలిసీ సదాశయం కోసం తెగింపుతో ముందుకెళ్లిన కమ్యూనిస్టు. పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మార్గమైనదే. లాభం తప్ప మరేమీ పట్టని ఈ వ్యవస్థను, మనిషిని యంత్రంగా మార్చే ఈ వ్యవస్థను, మనిషికి మనిషిని నిరంతరం పోటీ పెట్టే ఈ వ్యవస్థలోని దుర్మార్గాన్ని ఎదుర్కోవాల్సిందే. కాకపోతే దానికోసం ఇంతకంటే దుర్మార్గమైన గతాన్ని ఆశ్రయించరాదు అని రచయిత చెప్పారు. ఇది పాతవ్యవస్థ కాదు. దానిని తలదన్ని ఏర్పాటైన కొత్త వ్యవస్థ. కొత్త వ్యవస్థ వల్ల కొన్ని మార్పులున్నాయి. అవి మౌలిక మైనవి కావు. పెట్టుబడికి అవసరమైన మార్పులు మాత్రమే. అసమానతలు పోగొట్టే మౌలిక మైన మార్పుల కోసం పోరాటం సాగాల్సిందే. కాకపోతే దానికి పాత మాటలు, పాత సాధనాలు పనిచేయవు అని కూడా రచయిత చెప్పకుండానే చెప్పినట్టుగా అనిపించింది.
జి ఎస్ రామ్మోహన్
(నేల మీద నమ్మకం ఉంటే చదవండి తప్పక!..శీర్షికతో ఏప్రిల్10, 2014న సారంగలో అచ్చయిన 'సంవేదన' కాలమ్)
ఇది నిజంగానే మనల్ని ఆలోచింపచేసే పుస్తకం. ఈ శీర్షిక కూ ఆదే చేస్తుంది.
ReplyDeleteGreat book. DEALING TO How CAPITALISM HAD BEEN PENETRATION IN VILLAGES. SO LONG SOME DECADES AGO. IT HAS PROOVED. SEMI COLONIAL, SEMI FUEDAL ARE TOTAL UNDERMINING IN INDIA. CAPITALISM IS PREDOMINANTLY SO LONG AGO.
ReplyDelete