పేరు----....ఫేస్‌బుక్
వయసు-...పదేళ్లు
సబ్‌స్కైబర్స్-... దాదాపు భారత దేశ జనాభా అంత
విలువ-....దాదాపు లక్షకోట్లు
కుమారస్వామి నానా తిప్పలు పడి ప్రపంచం చుట్టొచ్చాడు. వినాయకుడేమి చేశాడు? మౌస్ జిందాబాద్ అనేసుకుని ఎలుక మీదెక్కి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు. తల్లిదండ్రుల చుట్టూ తిరగడం ప్రపంచం చుట్టూ తిరిగిన దానికంటే ఎక్కువ అని ఇంటర్‌ప్రెటేషన్ ఇచ్చి అతన్నే విజేత అని ప్రకటించారు. అమెరికాలో పుట్టినా ఆ ఇంటర్‌ప్రెటేషన్ గురించి బాగా తెలుసుకున్నట్టున్నాడు మార్క్స్‌జుకర్‌బెర్గ్! మౌస్‌తో ప్రపంచాన్ని చుట్టేయొచ్చు అని చిన్ననాటనే గ్రహించాడు. ప్రపంచానికి తిరిగే ఓపిక లేదు, పరిస్థితీ లేదు. తిరిగేసి ఏమోమో చేసేసిన ఫీలింగ్ ఇచ్చేస్తే పుణ్యం, పురుషార్థం అని అర్థం చేసుకున్నాడు. మాయా బజార్లో మాయా దర్పణం మాదిరి హ్రిహ్రిం అని ఫేస్‌బుక్ మనముందుంచాడు. ముందు విశ్వవిద్యాలయంలోనూ ఆ తర్వాత లొకాలిటీలోనూ అలా అలా ఇంతింతై వటుడింతై రీతిలో ఇవాళ ఖండఖండాలుగా ప్రపంచమంతా వ్యాపించాడు. ఫేస్‌బుక్ ఇన్‌స్టాంట్ హిట్. ఇటీజ్ ది హైటెక్ అవతార్ ఆఫ్ ది ఇన్‌స్టాంట్ జనరేషన్. డార్లింగ్ ఆఫ్ సెల్ఫీస్. ఇంతకీ ఈ ఫేస్‌బుక్‌తో ఏం చేస్తాం. ఏముంది? ఫ్రెండ్‌షిప్ చేస్తాం. లైకింగ్ చేస్తాం, కామెంట్ చేస్తాం. మామూలుగా ఒక్కోరికి ఎంత మంది స్నేహితులుండొచ్చు. ఎంతమందితో స్నేహం చేయగలిగిన శక్తి , సమయం మనకుంటాయి? నగరాల్లో అయితే ముగ్గురు నలుగురితో స్నేహం నెరపడానికే జీవితకాలం సరిపోదు. ఫోన్ చేసిన ప్రతిసారీ కలుద్దాం అని ముగిస్తాం కానీ కలవడం కలగానే ఉంటుంది. కానీ ఈ ఫేస్‌బుక్‌లో ఏకకాలంలో ఏడువందలమందితోనో ఇంకా ఓపికుంటే ఏడువేలమందితోనో స్నేహం చేయొచ్చు. చాలావిషయాలను లైకింగ్ చేయొచ్చు. అనేకానేక ప్రాపంచిక విషయాల మీద కామెంట్స్ చేసేయొచ్చు. టింగు రంగా అని చాటింగూ చేసేసుకోవచ్చు.వచ్చు. వచ్చు. చాలా వచ్చు. కథలు, కాకరకాయలు చర్చించనూ వచ్చు. నీకు కథో, కాకరకాయ వేపుడో ఇష్టమైతే ఆ ఇష్టాలతో గ్రూప్ ఏర్పరుచుకోవచ్చు. రూపం-సారం, శైలి, టెక్నిక్ అంటూ బోలెడన్ని విసయాలు మాట్లాడేసుకోవచ్చు. కాకరకాయల్లో ఏ మసాలా కూరిస్తే రుచి బాగా ఉంటుందో తెలసుకోనూ వచ్చు.అంగోలా దగ్గర్నుంచి ఎబోలా దాకా చాలా విషయాల మీద మాట్లాడుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. 'స్నేహితుల' ఆనంద విషాద, జ్ఞానాజ్ఞాన విశేషాలను షేర్ చేసుకోవచ్చు. కాలక్షేపం చేసేయొచ్చు. అమ్మొచ్చు. కొనొచ్చు. ఇన్ని వచ్చులు ఉన్నాయి కాబట్టే ఇది మానవ జీవితంలో వ్యసనంగానూ వ్యామోహంగానూ మారిపోయింది. ఆ వ్యామోహమే జుకర్‌బెర్గ్ అనే కుర్రాడిని పాతికేళ్లకే వేల కోట్లకు పడగలెత్తేలా చేసింది.
ఆ రోజు పత్రికలో వచ్చిన కథనమో, ఆ రోజు రోడ్డుమీద కనిపించిన దృశ్యమో, ఆ రోజు మీ పిల్లవాడు చేసిన మురిపెమో, ఏదైనా సరే, పేస్‌బుక్ ఏమీ అభ్యంతర పెట్టదు. నీకేమనిపిస్తే అది షేర్ చేసుకోవడమే.డిజిటల్ చరిత్రలో నీకొక పేజీ సృష్టించుకోవచ్చు. వీటన్నింటిని మించి ఫేస్‌బుక్‌లో ఎక్కువభాగం కనిపించేది పిక్చర్స్, ప్రొఫైల్ పిక్చర్స్. ఎపుడూ ఒకటే ముఖం కనిపిస్తే ఏం బాగుంటుంది మడిసన్నాక కూసింత కళాపోసనుండాల అని ప్రొఫైల్ పిక్సర్స్ తెగ మార్చేస్తుంటారు. నేను పొద్దున టీ తాగుతూ, నేను మధ్యాహ్నం భోంచేస్తూ తరహా ఫొటోలకు కూడా అభ్యంతర మేమీ లేదు. నేను అనేది విశ్వరూపం ధరించిన లోకంలో ఇదొక తుత్తి. ఏదో పోస్ట్ పెట్టేస్తాం. ఇక అక్కడ్నించి కామెంట్స్, లైకుల హడావుడి మొదలవుతుంది. నీ పోస్టింగ్ కిందనే లైక్, కామెంట్, షేర్ అని మూడు ఐకాన్లు కనిపిస్తుంటాయి. ఏం చేయాలనుకుంటే అది చేసేయడమే, అడ్డేముంది. లైక్ అయితే ఒక్క క్లిక్ దూరం. సులభంగా అభిమానాన్ని ప్రదర్శించుకొను మార్గము. షేర్ రెండు క్లిక్కుల దూరం. కామెంట్ అంటే ఏదో ఒక అభిప్రాయాన్ని రాయడం. పోస్టు పెట్టిన వాళ్లలో చాలామంది ఎన్ని లైకులొస్తాయి, ఎన్ని కామెంట్లు వస్తాయి అని తెగ ఆరాటపడిపోతుంటారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్నవారిలో ఎక్కువమంది ప్రతి ఆరు నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉంటారని ఇటీవలే ఒక అధ్యయనం తేల్చిచెప్పింది. ఎన్ని లైకులొస్తే అంత ప్రాచుర్యం ఉన్నట్లు లెక్క! కాబట్టి లైకుల కోసం ఆరాటం ఉంటుంది. లైకుల బిజినెస్ కూడా ఉంటుంది. నాయకుల ఇమేజ్‌ని లైకుల ఆధారంగా కొలిచే వ్యవహారం ఉంది కాబట్టి అదొక ప్రహసనంగా మారింది. కంపెనీల పేజీలకు నాయకుల పేజీలకు లైకులు వేలల్లో లక్షల్లో కురిపించే ఏజెన్సీలు వచ్చేశాయి. ఆ బాగోతం ఈ మధ్యే బయటపడి విచారణలు వగైరా సాగుతున్నాయి. బిజినెస్‌ను వదిలేసి మనవరకే పరిమితమయితే ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం బాపతు కూడా ఉంటుంది. నీ పోస్టులన్నింటికీ నేను లైక్ కొడతా. నా పోస్టులకు నువ్వు లైక్ కొట్టాలి తరహా అన్నమాట. లైక్ కొట్టడానికి అతను ఆ పోస్ట్‌ను పూర్తిగా చదివాడనో చదివి ఆనందించాడనో భ్రమ పడనక్కర్లేదు. నువ్వు పోస్ట్ పెట్టిన క్షణంలోపలే టిక్ మని లైక్ పడిపోయిందంటే ఏమని అర్థం? నిజంగా ఆ విషయంతో ఆ వ్యక్తీకరణతో ఏకీభావముండి లైక్ చేసే వారు కొందరయితే కేవలం అతనితో లేదా ఆమెతో మనకున్న అనుబంధాన్ని వ్యక్తీకరించుకోవడానికి సాధనంగా వాడుకునే వారు మరికొందరు. కొంతమంది తెలిసిన పేర్లతో ఉన్న పోస్టులన్నింటికీ టిక్‌టిక్‌టిక్ మనిపించుకుంటూ వెడతారు. ఇందులోనూ సమాజంలో ఉన్న అన్ని ధోరణులు కనిపిస్తూనే ఉంటాయి.కాస్త శుభ్రంగా ఉన్న అమ్మాయి ఫొటో పెడితే కాసేపట్లోనే సెంచరీ దాటేస్తుంది. లైక్ కొట్టవేమిరా సామీ అని నీకు ఏకంగా మెయిల్ పెట్టేవారుంటారు. అందులో ఫలానా వారు తమ పేజీకి లైక్ కొట్టమని కోరుతున్నారు అని వస్తుంది. వాళ్లంత శ్రమ పడ్డాక క్లిక్‌మనిపించక చస్తామా! క్లిక్..క్లిక్..క్లిక్.
ఫేస్‌బుక్ ఇవాళ సోషల్ మీడియా అనే గంభీరమైన పదానికి ప్రతీక. ట్విట్టర్ వగైరాలు కూడా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌దే ప్రధాన పాత్ర. దీని శక్తి సామర్థ్యాల మీద, ప్రభావాల మీద ప్రపంచవ్యాప్తంగా బోలెడంత చర్చ నడుస్తున్నది. శక్తి మీద మరీ కొట్టుకునేంత బేధాభిప్రాయాలు కనిపించవు కానీ ప్రభావాల మీదైతే మీదపడి రక్కేసుకునేంత గొడవలున్నాయి. బాబోయ్, మొన్న మా చెల్లి ఇంటికి వెళ్లామా! అది మాతో మాట్లాడుతూనే ఉంది, అతగాడు అపుడపుడు పొడిపొడిగా ఒక మాట పడేస్తూ మొబైల్‌లో ఫేస్‌బుక్‌తో కుస్తీ పడుతూ ఉండిపోయాడు. వాళ్లింటికెడితే గోడతో మాట్లాడినట్టే ఉంటోంది..అని వాపోయేవారు కోకొల్లలు. స్నేహితుల మధ్య, తల్లిదండ్రులు-పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య ఈ విషయమై గొడవలు సాగుతూనే ఉంటాయి. అది సంసారాలను కూల్చేస్తోందండీ అని వాపోయే వారుంటారు. 'వాడెవడు? నీ ఫ్రెండ్ లిస్టులో బాగా అతి చేస్తున్నాడు' అనో, 'అదెవత్తె, నీ పేస్‌బుక్‌లో చాలా డ్రామా చేస్తుంది' అనో గొడవలు పడే జంటలుంటాయి. ఒకళ్ల ఎకౌంట్లలో మరొకరు జొరబడి పత్తేదారు పనులు చేయడం లాంటివి ఉంటాయి. సాంకేతికత కొత్తగానీ అనుమానాలు మనకేం కొత్త! ఏ కొత్త సాంకేతిక పరికరం వచ్చినా ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సర్కస్ సాగుతూనే ఉంటుంది. ఇదంతా ఒకవైపుంటే ఇంకోవైపు సోషల్ మీడియానే లేకపోతే ప్రపంచం ఏమైపోయేట్టు? ఎంత ప్రజాస్వామీకరించింది అది ప్రపంచాన్ని! అని దాని భక్తులు కళ్లు విప్పార్చుకుంటూ చెపుతారు. జాస్మిన్ విప్లవం దగ్గర్నుంచి అన్నా హజారే హడావుడి దాకా చాలా ఉదాహరణలనే చూపిస్తారు. షోలేలో అమితాబ్ మాదిరి రెండువైపులా ఒకటే బొమ్మ ఉన్న నాణెం ఉంటే తప్ప ఈ విషయంలో స్టాండ్ తీసుకోవడం కష్టం. ఆధునిక జీవనంలోని అనేకానేక అంశాలలాగే ఇది కూడా ఏకకాలంలో కషాయంగానూ, విషంగానూ పనిచేస్తుంది. నువ్వెలా ఉపయోగించుకుంటావనేదాన్ని బట్టి, ఉపయోగించుకునే మోతాదును బట్టి అది ఆధారపడి ఉంటుంది.
ముఖపుస్తక మాయ-మర్మం!
తక్కువకాలంలోనే ఫేస్‌బుక్ సామూహిక అబ్సెషన్‌గా మారిపోయింది. దీనికి కారణాలు అనేకం. ఐడెంటిటీ అనేది ఆధునిక మనిషికి పెద్ద సమస్య. మార్కెట్ వ్యవస్థ గుంపునుంచి మనిషిని బయటపడేసి వినియోగదారుడిగా మార్చింది. పాత గుంపుల్లో ఉన్న అవలక్షణాలనుంచే కాక అందులోని అస్తిత్వాన్నుంచి కూడా దూరం చేసింది. ఎప్పటికప్పుడు అవసరాలను సృస్టించుకుంటూ- పెంచుకుంటూ వాటిని తీర్చుకోవడానికి ఇంకా ఇంకింకా డబ్బు సంపాదించడానికి కష్టపడుతూ పరిగెట్టడం తప్ప చేసే పనిలో ఆనందం లేని స్థితి. కొనడం అమ్మడం లాంటి వాటితో వాటిగురించి ఆలోచనలతో మనిషి నిరంతరం సతమతమయ్యేట్టు చేసింది. మధ్యమధ్యలో ఈ ఇడెంటిటీ అనే తేలుకొండి తొలుస్తూ ఉంటుంది. ఇటువంటి వారికి ఊరట నిస్తుంది ఈ ఫేస్‌బుక్, బ్లాగ్ వగైరాలతో కూడిన సోషల్ మీడియా. రోజూ ఎక్కడో చోట కనిపించడం లేదా వినిపించడం అనేది అవసరంగా మారిపోయింది. హమ్మయ్య!, మనమున్నాం, మనల్ని ప్రపంచం గుర్తిస్తున్నది అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. నలుగురితో ఉన్నాను అనే భావన వల్ల ఒంటరితనాన్నుంచి దూరమైన ఫీలింగ్ తెచ్చేసుకోవచ్చు. ఫాల్స్ గ్రాటిఫికేషన్ అంటామా ఇంకేమైనా అంటామా అనేది మీ ఇష్టం. చాలామంది మనుషులకు చాలా విషయాలమీద ఏవో అభిప్రాయాలుంటాయి. ఏదో ఒకటి చెప్పాలని ఉంటుంది. ఎక్కడ చెప్పాలి? ఎలా చెప్పాలి? వేదిక ఏదీ! అదిగో అలాంటి వారికి అక్షరాలా ఆసరా ఇస్తుంది ఫేస్‌బుక్. తనను తాను వ్యక్తీకరించుకోవడం అనే మనిషి కోరికను ఇన్‌స్టాంట్‌గా తీర్చేస్తుంది. ఆ వర్మ ఇలా అంటాడా, ఈ సానియాకు ఇన్ని డబ్బులిస్తారా, ఈ రైతుల ఆత్మహత్యలు ఇంకెంతకాలం, రాయలసీమ గోడు పట్టదా ఇట్లా ఏవో అనిపించొచ్చు. గోవిందుడు అందరివాడేలే ఎలా ఉందో నలుగురితో చెప్పుకోవాలి అనిపించొచ్చు. అదిగో అలాంటి భిన్నరుచులున్న లోకానికంతటికీ ఉచితంగా గొంతునిస్తుంది ఫేస్‌బుక్. మన అభిప్రాయంతో ఒక పోస్ట్ పెట్టేస్తే మనలాంటి వారు నలుగురుదానిమీద ఏదో ఒకటి మాట్లాడేస్తే అదొక తృప్తి. మనిషి సంఘజీవి కదా!అలాగే ఏదో ఒక సామాజికాంశానికి సంబంధించి ఫేస్‌బుక్‌లో ఒక లైక్ చేసో ఒక సంతకం పెట్టో ఒక కామెంట్ చేసో నేనున్నూ ఉద్యమంలో ఉన్నాను, గుంపులోఉన్నాను అనే భావన తెచ్చేసుకోవచ్చు. అంటే గిల్ట్ తీర్చుకోవడానికి కూడా ఒక వేదికగా పనిచేస్తుంది. నిజంగా ఆ సమస్య మీద ఏదైనా చేయడం బదులు దానిమీద ఏదో ఒక కామెంట్ ద్వారా మన ఆగ్రహాన్ని బాధను తీర్చుకునే వెసులుబాటు కల్పిస్తుంది. అంటే థింక్ అండ్ డూ అనే భావన స్థానంలో ఫీల్ అండ్ షేర్ భావనను ఫేస్‌బుక్ మనకు అలవాటు చేస్తుంది. ఇపుడు చెస్‌బోర్డుకు అటు వైపు కూర్చుందాం! సెన్సారింగ్ లేకుండా వేదిక సమస్య లేకుండా మనుషులు చాలా అంశాల మీద అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి ఇదొక ప్రజాస్వామిక వేదిక. లోతుగా చూపు సారించాలే కానీ చాలా చాలా గంభీరమైన చర్చలే సాగుతుంటాయి. చాలాచాలా లోతైన అంశాలమీద బోలెడంత సమాచారం మనకు అందుబాటులోకి వస్తుంది. మనకు అందుబాటులో లేని అనేకానేక వీడియోలు, సమాచారం ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా మన ముందుకు వస్తుంది. ప్రపంచంలో ఇలా ఆలోచించేవారు ఇంతమంది ఉన్నారా అనేట్టు మన భావాలతో సామీప్యం ఉన్నవారు అనేకులు పరిచయమవుతారు. అభిరుచుల్లో సామీప్యమున్న వారి గ్రూప్లో ఉంటే మనకు ఎంతో ప్రయోజనకరమైన కాలక్షేపంతో పాటు కూసింత జ్ఞానం కూడా లభిస్తుంది. మంచి మంచి డాక్యుమెంటరీలు, సినిమాల గురించి తెలుసుకోవచ్చు. ఎక్కడో ఏదో మ్యాగజైన్లో వచ్చిన అద్భుతమైన వ్యాసం గురించి తెలుసుకోవచ్చు. సంగీతం, సాహిత్యం, రాజకీయాలు అన్నింటా మనకు అవసరమైన సమాచారం కావాల్సినంత పంచుకోవచ్చు. అనుభవాలూ, జ్ఞాపకాలూ నెమరేసుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులకు ఇదొక తోడుగా ఉంటుందనుకోవచ్చు. గొప్ప కాలక్షేపం.
ఇదీ ముఖపుస్తక భాష!
భాషకు వ్యక్తీకరణకు సంబంధించి ఫేస్‌బుక్ కొన్ని మౌలిక మైన మార్పులు చేసినట్టుగా అనిపిస్తుంది. మామూలుగా లిఖిత భాషకు మౌఖిక భాషకు తేడా ఉంటుంది. లిఖిత భాషతో పోలిస్తే మౌఖిక భాషలో ఆలోచనకు తావు తక్కువ. అప్పటి సందర్భాన్ని బట్టి ఉద్వేగాన్ని బట్టి మాట్లాడేస్తాం. కానీ రాసేటప్పుడు మనకు మనమే సెన్సార్ ఆఫీసర్ అవుతాం. వెనుకా ముందూ ఆలోచిస్తాం. కానీ ఫేస్‌బుక్ ఈ అంతరాన్ని బాగా తగ్గించేసింది. అప్పటికప్పుడు ఏ మూడ్‌లో ఉంటే ఆ మూడ్లో టపాటపా రెండు వాక్యాలు కొట్టేయడమే. థింక్ అండ్ రైట్ స్థానంలో ఫీల్ అండ్ ఎక్స్‌ప్రెస్ అనే భావనను తెచ్చేసింది. థింకింగ్ ఎలిమెంట్‌ను బాగా తగ్గించేసింది. వ్యక్తీకరణ రూపం మారిపోయింది. హహహహ అని నాటకాల పుస్తకాల్లో చదువుకున్న నవ్వు ధ్వనిని పెట్టేస్తారు. హమ్‌మ్...అని ఆలోచనకు కూడా ధ్వని సంకేతాన్ని కల్పించి లిపిలో పెట్టేస్తారు. అంటే మౌఖిక స్వభావాన్ని చాలావరకు లిపిలోకి తెచ్చేస్తా ఉంటారు. ఈ వేదిక అటువంటి అవసరాలను సృష్టించింది. ఆవేశకావేశాలపైన అదుపు తప్పే ప్రమాదం సైతం ఎక్కువే. వ్యాప్తి చెందే లక్షణం ఎక్కువగానూ నిర్థరించుకోగలిగిన అవకాశం వ్యవధి తక్కవగానూ ఉండడం వల్ల గాలి కబుర్లు హైటెక్ వేషమేసుకుని విపరీతమైన ప్రచారం పొందేస్తాయి. తిరుమల కొండమీద మూడు తలలున్న పాము వీడియో ఇలాంటిదే. ఇలాంటి కల్పితమైన వీడియోలకు లెక్కే ఉండదు. ఇంకొన్ని గంభీరమైన విషయాలుంటాయి. ఒక సందర్భంలో ఒక సమూహంలో పంచుకుంటేనే వాటి అంతరార్థం అర్థమయ్యే విషయాలుంటాయి. అంటే ఆయా విషయాలకు సంబంధించి లోతుపాతులు తెలిసినవారికి మాత్రమే సవ్యంగా అర్థమయ్యే విషయాలు కొన్ని ఉంటాయి. అవి దారి తప్పి ఇక్కడికొచ్చి పెద్ద రచ్చ చేసేస్తుంటాయి. టైం అండ్ స్పేస్ కలగాపులగం అవుతుంటాయి. ఆశీష్ నందినో, రొమిల్లా థాపరో ఎక్కడో ఏదో మాట్లాడారు అనుకోండి. మన పక్కన ఉన్న ఎమ్మెల్యే లేదా ఎంపికీ ఏమిటీ సంబంధం? ఫేస్‌బుక్‌లో సందర్భశుధ్దిలేకుండా పెట్టిన రెండు మూడు వాక్యాలు చూసి ఆయన రంకెలేస్తారు. కేసులు పెడతామంటారు. దేవుడు చనిపోయాడు అని నీషే మాట ఎవరైనా పెడితే అతని ఉనికితో నిమిత్తం లేకుండా నీషే మీద రంకెలేయడానికి, బెదిరించడానికి బయల్దేరగలిగిన వారుంటారు. ప్రతీదీ అందరకీ అందుబాటులో ఉండడం అనే మాట బాగానే కనిపించినా అది ప్రజాస్వామికమే అనిపించినా అందులో ఇలాంటి ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. సాంస్కృతిక అంతరాలతో పాటు సాంస్కృతిక వైషమ్యాలు కూడా ఎక్కువగా ఉన్న మనలాంటి సమాజాల్లో ఇలాంటి అబ్సర్డ్ వ్యవహారాలు చాలా చూడాల్సి వస్తుంది.
బిజినెస్ ..మాటర్స్
నౌ వి నీడ్ టు గెట్ ఇన్ టు బిజినెస్. ఫేస్‌బుక్‌తో సామాజిక లాభనష్టములు ఎన్ని విధములో వారికి లాభము చేకూర్చు మార్గములు అన్ని విధములు. మన ఫేస్‌బుక్ ప్రొఫైల్లో ఇష్టమైన పుస్తకాలు, మ్యూజిక్, సినిమాలు,నటులు వగైరా ఆప్షన్స్ చాలా ఉంటాయి. అవన్నీ కేవలం మన అభిరుచి ప్రదర్శన కోసమే ఉండవు. ప్రధానంగా వారి లాభంకోసం ఉంటాయి. అదెలా! మీ అభిరుచులు, ఆసక్తులు గమనించి అందుకు తగిన ప్రొడక్ట్స్ యాడ్స్‌గా ప్రత్యక్షమవుతాయి. మనం తరచుగా పంచుకునే సమాచారం, మిత్రులతో చేసే సంభాషణలో దొర్లే అంశాలు, తరచుగా వీక్షించే అంశాలు వంటి అనేకానేక అంశాలను వడపోసి ఆయా ప్రొడక్ట్ కంపెనీలు యాడ్స్ రూపంలో తెరమీద కనిపిస్తాయి. గూగుల్ లాంటి కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకుని నీ ఈ మెయిల్స్, ఉపయోగించే యాప్స్, గూగుల్ సెర్చ్‌లో వెతికే అంశాలను కూడా వడబోసి కంపెనీల వారికి అందిస్తుంది ఫేస్‌బుక్. అంటే ఉత్పత్తిదారునికి వినియోగదారుడికి మధ్య వారధిగా పనిచేస్తుంది ఫేస్‌బుక్. ఇన్ని కోట్లమంది ఈమెయిల్స్, సంభాషణలు ఎలా చూస్తారు అనే సందేహమక్కర్లేదు. దానికి ఆల్గోరిథమ్స్ లాంటి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ సాయం చేస్తాయి. ఇవి మాత్రమే కాకుండా కంపెనీ పేజెస్ పేరుతో కార్పోరేట్లకు వేరే రూపాల్లో ఫేస్‌బుక్ ఖరీదైన సేవలు అందిస్తూ ఉంటుంది. ఇదంతా భారీ బిజినెస్ వ్యవహారం. కార్పోరేట్ అడ్వర్టయిజ్ మెంట్లు మాత్రమే కాదు. వినియోగదారుల అభిరుచులు ఆసక్తుల్లో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసే సంస్థలకు రాజకీయ పార్టీలకు కూడా ఉపయోగపడుతుంది ఫేస్‌బుక్. 'మిస్టర్ ఆవరేజ్' ఫ్రెంచ్ సినిమాలో చిరుబొజ్జతో కూడిన సగటురూపం, సగటు ఉద్యోగం, వగైరా ఉన్న సగటు మనిషిని చాలా అధ్యయనంతో వెతికి పట్టుకుని అతను ఎటువంటి ప్రాడక్ట్స్ వాడతాడు, రాజకీయంగా ఎట్లా ఆలోచిస్తాడు వగైరా విషయాలను తెలుసుకోవడానికి కార్పోరేట్ల-రాజకీయపార్టీల కన్సార్టియం ఒక ఏజెంట్‌ని అతని గర్ల్‌ఫ్రెండ్ రూపంలో పంపిస్తుంది. అతని ఇంటినిండా కెమెరాలు పెట్టి 24 గంటలు అతన్ని నీడలా వెంటాడి అతని ఆలోచనలన్నీ తెలుసుకుని వాటిని ఈ కన్సార్టియం తాలూకు లేబరేటరీలో రికార్డు చేసి అధ్యయనం చేస్తా ఉంటారు. అదిగో అన్ని కెమెరాలు హడావుడి అవసరం లేకుండా ఆ గర్ల్‌ఫ్రెండ్ పాత్రను ఇక్కడ ఫేస్‌బుక్ పోషిస్తుంది. యు ఆర్ అండర్ సర్వైలెన్స్. యు ఆర్ బీయింగ్ అబ్జర్వ్‌డ్. యూ ఆర్ బీయింగ్ మెజర్డ్. అయితే అదేమీ మనకుఇబ్బంది కలిగించేట్టు ఉండదు. కనిపించేట్టు ఉండదు. నీ పనినువ్వు చేసుకుపోతావు. వాళ్లపని వాళ్లు చేసుకుపోతారు. బిజినెస్ వాళ్ల భాషలో విన్-విన్ సిచ్యుయేషన్!
అతి సర్వత్రా వర్జయేత్!
ఫేస్‌బుక్‌ను వారధిగా ఉపయోగించుకోవడం వరకు ఉపయోగమే. కానీ వ్యసనంగా మార్చుకోకూడదనేది మానసిక విశ్లేషకుల మాట. ఇదేమీ తక్కువ వ్యసనం కాదు. వ్యసనమనగానే తాగుడు, తిరుగుడు అని తాగుణింతం వల్లించనక్కర్లేదు. తగ్గించుకోవడం లేదా మానడం కష్టమైన ఏ అలవాటునైనా స్థూలమైన అర్థంలో వ్యవసనమనే పిలవొచ్చు. రోజుకు గంటలకొద్దీ చూడకుండా ఉండలేని స్థాయిలో ఈ వ్యసనం బారిన పడిన వారు చాలామంది కనిపిస్తున్నారు. దాని ప్రభావాలూ కనిపిస్తున్నాయి. సైక్రియిట్రిస్టుల దగ్గరకు చేరుతున్న కేసులు భారీ స్థాయిలోఉన్నాయి. సామాజిక బంధాలపై ప్రభావానికి సంబంధించిన ఉదాహరణలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. ఉపయోగమే, ఉపయోగించుకోండి. కానీ కాసేపు నెట్ లేకపోతే ఫేస్‌బుక్ చూడకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతోందంటే మాత్రం ఆలోచించుకోవాల్సిందే. అతి సర్వత్రా వర్జయేత్!
జి ఎస్ రామ్మోహన్
(2014 అక్టోబర్ 26న ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో "ఫేస్‌బుక్ వి లవ్ యు'' పేరుతో 'వచ్చిన కవర్ స్టోరీ)
No comments:
Post a Comment