అటల్ బిహారీ వాజ్‌పేయి బిజెపికి మాస్క్ లాంటి వారు అని కొందరు విమర్శించేవారు. మరి మోదీని, ఆయన అభివృద్ధి తపనను చూస్తే ఏమనిపిస్తున్నది. పాలనలోకి వచ్చి ఆరునెలలయ్యింది. మోదీ బిజెపిని మించి ఎదిగిపోయారని వింటున్నాం.కానీ పూర్తిస్థాయిలో మోదీ ముఖం ఇప్పటికి బయటపడిందా! తాను బయటకు కనిపించే ప్రతిక్షణం తాను కోరుకున్న విధంగానే కనిపించడంపై ఒక మనిషి అంత శ్రద్ధ పెడితే, భావోద్వేగాలను కొలత వేసి ప్రదర్శిస్తుంటే ఆ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి? స్మార్ట్ సిటీల నిర్మాణం గురించి మాట్లాడిన శృతిలోనే పురాణకాలంలో విమానాలు-ప్లాస్టిక్ సర్జరీలు ఉన్నాయని మాట్లాడగలిగిన వ్యక్తి ముఖంలో ఏ పార్శ్వం నిజం, ఏది మాస్క్!
పైన కనిపించే చిహ్నాలు చూస్తే అవినీతికి ఏమాత్రం తావులేని పాలన అందివ్వడానికి పట్టుగా ఉన్న నేతగా కనిపిస్తారు నరేంద్రమోదీ. అర్జునుడికి పక్షికన్ను మాదిరి అభివృద్ధి తప్ప మరేదీ కనిపించని నేతగా కనిపిస్తారు. హిందూత్వమా, అదేంటి అన్నట్టు కనిపిస్తారు. వ్యవస్థలోని మురికిని చీపురు పట్టి ఊడ్చేసే నేతగా కనిపిస్తారు. పథకాలు అమలులో నిధులు మింగేస్తున్న పందికొక్కులను ఏరివేయడానికి అవతరించిన నాయకుడిగా కనిపిస్తారు. ఇందుకోసం ప్రజల ఆలోచనలు పంచుకుంటూ పనిచేసే సృజనాత్మకమైన నేతగా కనిపిస్తారు. వివాదాల జోలికే పోకూడదని ప్రతినబూనిన వ్యక్తిగా కనిపిస్తారు. స్వాతంత్ర్యంకోసం ప్రాణత్యాగం చేసే అవకాశం లేకపోయినందుకు బాధపడే నేతగా కనిపిస్తారు. అదే సమయంలో విజయం కోసం ఎలాంటి ఎత్తుగడలైనా వేయగలిగిన నేతగా అనిపిస్తారు. మహారాష్ర్టలో కేవలం మిత్రపక్షం అనే పదానికే పరిమితం చేయలేని భావజాల బంధువు శివసేనను డంప్ చేసిన తీరు చూస్తే లక్ష్యసాధనలో సెంటిమెంట్లకు తావివ్వని వ్యక్తిగా అనిపిస్తారు. ఉగ్రవాది అని హిందూత్వ సంస్తలు దుమ్మెత్తిపోసే కశ్మీరీ హురియత్ నేత సజ్జాద్‌లోన్‌తో సమావేశమైన తీరు చూస్తే లక్ష్యసాధనకోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి సిద్ధపడిన నేతగా అనిపిస్తారు. ఇమేజరీ చాలనే ఉంది.తన మంత్రివర్గ సహచరులకు కర్తవ్యబోధ చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశపు దృశ్యాలను చూస్తే అతని దగ్గర అనుచరులకు తప్ప సహచరులకు స్థానం లేదని అర్థమవుతుంది. హెడ్ మాస్టర్ టీచర్లతో సమావేశమైనట్టు లేదు. విద్యార్థులతో సమావేశమైనట్టు ఉంది. వారితో మాట్లాడేటప్పుడు కూడా ఆయన హావభావాలు కొలతేసి ప్రదర్శిస్తున్నారు. అంటే మోదీ ఏ విషయంపై ఏమనుకుంటున్నారో ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఆయన ఏం తెలియజేయదల్చుకున్నారో మాత్రమే తెలుస్తుంది. సింబాలిజం, ఇమేజ్ ప్రధాన పాత్ర పోషించే ఆధునిక ప్రపంచంలో ఆ రెంటి రహస్యాలు ఎరిగినవాడు నరేంద్రమోదీ.
వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వాటికి సంబంధించిన లాభనష్టాలను భరించే బాధ్యత తీసుకోవడం నాయకత్వలక్షణాల్లో ప్రధానమైనవి. అవి మోదీలో పుష్కలంగా ఉన్నాయని ఇవాళ కొత్తగా
చెప్పుకోనక్కర్లేదు. అధికారంలో తీసుకునే నిర్ణయాలను సామాన్యుడి కళ్లతో ముందే చూసి స్పందనను అంచనావేయగలిగిన నైపుణ్యం ఆయనకు పుష్కలంగా ఉంది. ఆ జీవితమూ ఉన్నది. అవగాహనా ఉన్నది. స్ర్టీట్ స్మార్ట్ అంటారే అలాంటి లక్షణాలు ఆయనలో పుష్కలంగా కనిపిస్తాయి.గొప్ప వక్త కాకపోయినా ఆయన్ను సమకాలీన నాయకులందరిలోనూ పైమెట్టుమీద నిలపగలుగుతున్నది ఆ లక్షణమే. ఎలా కనెక్ట్ కావాలో బాగా తెలిసిన నేత. ఆధునిక సమాజం ప్రాధమిక అవసరంగా మార్చిన ఎనర్జీకి సంబంధించి ఆయన మూడు నిర్ణయాలు తీసుకున్నారు. అన్నీ మార్కెట్‌కు సంబంధించినవే. కాంగ్రెస్ నాన్చుతూ వస్తున్నవే. బొగ్గు, గ్యాస్, డీజిల్ మూడు అంశాలను ఆయన తేల్చిపడేశారు-పెద్ద వివాదాలేవీ లేకుండానే! డీజిల్‌ను మార్కెట్‌కు అనుసంధానం చేస్తూ ఇంకెవరైనా నిర్ణయం తీసుకుంటే ఎంత వ్యతిరేకత వచ్చేదో! కానీ మోదీకి అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు కలిసొచ్చాయి. మార్కెట్లకు ఆయనమీదున్న ప్రేమ అలాంటిదేమో! గ్యాస్ ధరను రెట్టింపు చేయాలని రంగరాజన్‌కమిటీ సూచిస్తే అంతకంటే బాగా తక్కువ నిర్ణయించి దేశఖజానాకు ఆదాయాన్ని కాపాడిన నేతగా ఇమేజ్ సంపాదించారు మోదీ. దాన్ని మించింది కేజీ బేసిన్‌లో రిలయెన్స్ గ్యాస్ తవ్వకాలకు సంబంధించిన నిర్ణయం. రిలయెన్స్ తవ్వాల్సినంత గ్యాస్ తవ్వి చూపించేదాకా పాత ధరే వర్తిస్తుందని తేల్చేశారు మోదీ. ఆయన అంబానీల బంటు అని వాదించేవారి నోరు మూయించేందుకు ఆయన ఇచ్చిన మాస్టర్‌స్ర్టోక్ ఇది. ఇలాంటి సింబాలిజం ఇమేజ్ మేకింగ్‌లో ఎలాంటి పాత్ర పోషించగలదో మాస్టరీ చేసిన వ్యక్తి మోదీ.
రిజర్వ్ బ్యాంక్ మీద. ఆర్థిక శాఖ మీద, చెణుకులు విసురుతూ ప్రధాని కార్యాలయం ముందు అవెంత దిగదుడుపో బాహాటంగా చెపుతూ కూడా స్కోత్కర్ష అనే విమర్శ మీడియాలో రాకుండా
చూసుకోగలిగిన వ్యక్తి మోదీ.నల్లధనం తెస్తే ఒక్కొక్కరికి ఎంత పంచొచ్చు అని చెప్పారు కదా సార్, దాని సంగతేమిటి అని సౌమ్యంగా ప్రశ్నించి ఆ తర్వాత పాపం, పీత కష్టాలు పీతకు అన్నట్టు ప్రభుత్వానికి కూడా కష్టాలుంటాయి అని తానే సమాధానపడిపోతున్నది పాపులర్ మీడియా.
ఇప్పటివరకూ కాంగ్రెస్‌కు ఉన్నది బిజెపికి లేనిది స్వాతంత్రోద్యమ వారసత్వం. గాంధీని చంపిన వారసత్వం ఉంది కానీ గాంధీ వారసత్వం లేదు. ఇపుడా వారసత్వంలో ఎలాగోలా వాటాను
తీసుకొచ్చి బిజెపికి కట్టబెట్టే బాధ్యత చేపట్టారు మోదీ. వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు కాదేమో, బిజెపి నాయకుడేమో అనిపించేంత రీతిలో ప్రచారం సాగుతున్నది. నెహ్రూ కంటే పటేల్‌ను పెద్దగీత చేసి సొంతం చేసుకునే ప్రక్రియ సాగుతున్నది. ఇక్కడా అప్రాప్రియేషన్ టాక్టిక్సే. ఇంకోవైపు సిలబస్‌లో మార్పులు సైలెంట్‌గా సాగిపోతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలపై వీధుల్లో వీరంగం చేసే బాధ్యతను తన కజిన్స్‌కు వదిలేసి లోతైన బాధ్యతలో తలమునకలుగా ఉన్నది బిజెపి. ఎప్పుడు అధికారం రుచి చూసినా మానవవనరులశాఖను తీసుకుని ఆ ప్రయత్నం కొద్దో గొప్పో చేయడం మామూలే. ఈ సారి నింపాదిగా చేస్తున్నది.. ఇతరత్రా వ్యవహారాల్లో లభిస్తున్న ఆమోదపు కరతాళధ్వనుల ముందు దీనిపై నిరసన ధ్వనులు వినిపించే పరిస్థితి లేదు. వర్తమానంపై తిరుగులేని విశ్వాసమున్నవాడు కావడం వల్ల, పదేళ్ల వరకూ తిరుగులేదని విశ్వాసమున్నవాడు కావడం వల్ల గతాన్ని తిరగరాయడంపైనా భవిష్యత్తు మీదా కేంద్రీకరించగలిగిన స్థితిలో మోదీ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంత విశ్వాసంతో బిజెపి శ్రేణులు కనిపిస్తున్నాయి. నాయకుడు ఇచ్చే భరోసా బలమది.
మోదీ అహ్మదాబాద్‌నుంచి ఢిల్లీవైపు దృష్టి మళ్లించే నాటికే దేశంలో ఆయన ఆలోచనలకు ఎర్రతివాచీ పరిచే మార్పులు జరిగిఉన్నాయి. ఎర్ర శ్రేణులు నీరసపడి ఉన్నాయి. తమ రాష్ర్టానికి పెట్టుబడులు ఆకర్షించడం అనేది సిఎంల ప్రొఫైల్‌లో అతిముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఫలానా రాష్ర్టానికి పోవాల్సిన పెట్టుబడిని ఫలానా ఫలానా రాయితీలిచ్చి మా రాష్ర్టానికి తెచ్చుకోగలిగాం అని ముఖ్యమంత్రులు బాహాటంగా చాటుకుంటూ స్కోర్‌కార్డ్ పెంచుకోవడం స్థిరపడి పోయి ఉన్నది. టీవీ చూసే పత్రికలు చదివే వోకల్ సెక్షన్స్‌లో దానికి ఆమోదం మాత్రమే కాదు, అంతకు మించిన విలువ స్థిరపడిపోయి ఉన్నది. ఆ సెక్షన్ పెరుగుతూ ఉన్నది. మార్కెట్ సంస్కరణల వల్ల ప్రయోజనాలు పొందినవారు ఇపుడు మోదీ ప్రతి కదలికకు చీర్ లీడర్స్ అవుతున్నారు.ఆ పునాది మీదే ఆ విశ్వాసం మీదే ఇపుడు మోదీ అత్యంత ప్రమాదకరమైన కార్మిక సంస్కరణలకు సిద్ధమవుతున్నారు. 2001లో యశ్వంత్ సిన్హా కార్మిక సంస్కరణలకు తెరతీసినపుడు ఆయన్ను క్రిమినల్ అని తిట్టిపోశారు దత్తాపంత్ థెంగ్డే. వాజ్‌పేయి మంత్రుల్లో సగంమంది అమెరికా, ఐరోపా దేశాల పేరోల్స్‌లో ఉన్నారని, అందుకే వారు మల్టీ నేషనల్
కంపెనీలకు తైనాతీలుగా వ్యవహరిస్తున్నారని ఆయన నిప్పులు కక్కారు. థెంగ్డే బయటివాడు కాదు, వామపక్ష వాది అస్సలే కాదు. ఆరెస్సెస్ సీనియర్ నాయకుడు. భారతీయ మజ్దూర్‌సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు. సొంత శిబిరం నుంచి వచ్చిన ఈ విమర్శలపై అప్పట్లో బిజెపిలో బోలెడంత చర్చ నడిచింది. ఇవాళ ఆ శిబిరంనుంచి విమర్శలు చేసేవాళ్లూ లేరు. అథవా ఎవరైనా లోలోపల మనకు తెలీకుండా గొణిగినా సీరియస్‌గా తీసుకుని చర్చించేవారు అసలే లేరు. స్వదేశీ జాగరణ మంచ్ ఏమైందో తెలీదు. గ్లోబలైజేషన్ మీద అధ్యయనం చేసిన గోవిందాచార్య లాంటివారు ఏమయ్యారో తెలీదు. అంతమాత్రాన మోదీ ఆరెస్సెస్ కంటే పెద్దవాడేపోయాడని భావించడానికి లేదు. దాన్ని ధిక్కరించి వ్యవహరిస్తున్నట్టు అస్సలు భావించడానికి లేదు. దేవాలయాల కన్నా టాయిలెట్లు అవసరం లాంటి స్టేట్ మెంట్లు చూసి అదిగో చూశారా అనడం అమాయకత్వమవుతుంది.ఆరెస్సెస్ మీద నిషేధం విధించినపుడు అండర్ గ్రౌండ్లో పనిచేసిన నిబద్ధ కార్యకర్త మోదీ. స్వతంత్రభారత చరిత్రలో తొలిసారి సర్‌సంఘ్ చాలక్‌కు జాతిని ఉద్దేశించి ప్రభుత్వ మీడియాలో ఉపన్యసించే అవకాశం కల్పించినవాడు మోదీ.రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అవసరాల కోసం పనిచేస్తున్న వివిధ విభాగాల మధ్య అనుసంధానానికి, అవసరమైన సందర్భాల్లో సైద్ధాంతిక మార్గదర్వకత్వానికి, నాయకులను తయారుచేసి అందివ్వడానికి ఆరెస్సెస్ పరిమితమైనట్టు అనిపిస్తోంది.తమ తమ రంగాల్లో విజయం సాధించడానికి వారు ఎంచుకునే వ్యూహాలు-ఎత్తుగడల్లో తమ కోర్ ఏరియాకు ఇబ్బందికరమైనది ఉంటే తప్ప స్పందించకూడదని కూడా భావిస్తున్నట్టు అర్థమవుతున్నది. వాళ్లకోర్ ఏరియా కార్మికులు అయ్యే అవకాశం లేదు. కోర్ ఏరియాల్లో ఆరెస్సెస్‌కు భిన్నంగా మోదీ నడిచే అవకాశం లేదు.మోదీ ఇమేజ్ మేక్ ఓవర్ పూర్తయితే కానీ ఆ కోర్ ఏరియాల పని పట్టకపోవచ్చు.
బిసి నాయకుడిని ముందు పెట్టడం మోదీ రూపంలో వ్యక్తమై ఉండవచ్చును. కానీ కులంతోనూ కుల నాయకులతోనూ వారి సయ్యాట ఇవాళ మొదలైందేమీకాదు.
ముఖ్యంగా గత ఐదారేళ్లుగా వాళ్లు దేశంలోని వివిధ కులసంఘాలతోనూ వాటి నాయకులతోనూ చర్చలు జరుపుతూ ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులతోనే కాదు, సైద్ధాంతిక శత్రువులతో కూడా కలిసి మాట్లాడడానికివెనుకాడడం లేదు. దేశంలో వేగంగా సాగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఆ మార్పులను తనకు అనువుగా మలుచుకోవడానికి వారు సమర్థంగా కృషి చేస్తున్నారు. తాము ఉగ్రవాదిఅని పిలిచే సజ్జాద్ లోన్‌తో అవసరం కోసం మోదీ చేతులు కలిపితే కూడా మౌనంగా ఉండిపోయేంత స్థితప్రజ్ఞత ప్రదర్శిస్తున్నది ఆరెస్సెస్. మోదీ ఎంత ఎదిగినా, ఏం చేసినా ఏనాడూ అభద్రత అనిపించకపోవడంలో వారి సైద్ధాంతిక అనుబంధం, పరస్పర విశ్వాసం ఇమిడి ఉన్నాయి. మోదీ మీద వారికున్న ఆ అపార నమ్మకంలోనే అసలు విషయం దాగుంది. మార్కెట్ ఎర్రతివాచీ పరిచి ఉన్నా ఇంకేమి చేసి ఉన్నా పార్లెమెంటరీ రెబల్ జార్జిఫెర్నాండెజ్ ఆ నాడు ఆ అడుగు వేయకపోయి ఉంటే మోదీ ఇవాళ ఈ స్థాయిలో ఉండేవారు కాదు. లెజ్టిమసీ అనేది కీలకమైన విషయం. మోదీ ఉథ్తానం-కమ్యూనిస్టుల పతనం విలోమనిష్ఫత్తి కలిగినవి.వామపక్షాల స్పేస్‌ను ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు భర్తీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వాళ్లూ వ్యక్తిగతంగా నిజాయితీ పరులే. పేదలకు మేలు చేయాలనే వారే. రాజకీయాలు అప్రధానమైపోయాక మేలు అనే అమూర్తమైన మాటను ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. నక్సలైట్ల త్యాగం, సుందరయ్యగారి సైకిల్, రాఘవులు చేతి సంచీ గురించి జరిగిన ప్రచారంలో పదో భాగమైనా వారి రాజకీయాల గురించి జరిగి ఉంటే కథ వేరే ఉండేది.
పెట్టుబడి అనేది ఇవాళ ఆకర్షణీయమైన పదం.పాత అవశేషాలనుపూడ్చిపెట్టి ఎవరు పెట్టుబడిదారీ విధానాన్ని వేగవంతం చేస్తే వారివైపు నిలబడే వారు పెరుగుతున్నారు. కాకపోతే వారికి 'నిజాయితీ' ఉండాలి!మనుషులు ప్రయోజనాలకోసం పోగవుతారు తప్పితే సమానత్వం కోసంకాదనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.సమానత్వంలోనే ప్రయోజనాలున్నాయి అని అర్థం చేయించగలిగిన స్థితిలో లేరు. కొంతమందికి ప్రయోజనాలను ఎక్కువమందికి అందుబాటులో ఉన్నది అనే ఆశను కల్పించే మార్కెట్ వ్యవస్థలో అది సంక్లిష్టమైన వ్యవహారం.బ్లాక్ అండ్ వైట్ సన్నివేశాలకు తప్ప సంక్లిష్టమైన సన్నివేశాలకు వామపక్షాలు సిద్ధపడి ఉన్నాయా అనేది సందేహం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బూటకమనో మరోటనో అనేసి సంతృప్తిపడేవారు అది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ జైత్రయాత్ర సాగించడంలో దాగి ఉన్న కోణాలను అర్థం చేసుగోగలిగారా అనేదీ సందేహమే! ఎన్జీవోల మాదిరి మార్జినలైజ్డ్ భాష మాట్లాడుతూ కొమ్మలపైన మాత్రమే కేంద్రీకరించి చెట్టుని మర్చిపోయామా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందేమో! కార్మిక సంస్కరణల సందర్భం ఆ ఆలోచనకు ఉత్ర్పేరకంగా పనిచేస్తుందని ఆశించొచ్చా!
(2014 నవంబర్ 26న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వ్యాసం)
No comments:
Post a Comment