Friday, 23 December 2011

పాత్రికేయ స్వామిజీకి ప్రేమలేఖ


టైమ్స్‌నౌ చానల్‌సంపాదకులు అర్ణవ్‌గోస్వామి గార్కి,
మీరు  పౌరహక్కుల సంఘాలను నిలదీసిన విధానం భలేభలే. హక్కులంటే కేవలం ఉద్యమకారుల వేనా అన్న పాత ప్రశ్నను కూడా సరికొత్త ఆవేశంతో గొంతులోంచి ఎగజిమ్మగల నేర్పరులు మీరు. వేర్‌ ఆర్‌యు హిపోక్రాట్స్‌అని గాయంలో సీతారామశాస్ర్తిలాగా నిగ్గదీసి అడగడం మీడియాలో మీకే సాధ్యం. శ్రీనగర్‌లో బంద్‌పాటించనందుకు తారిఖ్‌భట్ అనే దుకాణదారుడిని బ్యాట్‌లతో కొట్టి చంపడం దుర్మార్గమన్న మీ వాదనతో విభేదించేవారు భారత్‌లోనే కాదు, ఎక్కడైనా ఉంటారని అనుకోలేం. కానీ వాస్తవాలను రిపోర్ట్‌చేయడం అనే పాతకాలపు జర్నలిజానికి పాతరేసి  మన అభిప్రాయాలను ఆవేశాలను తెరముందుకు తీసుకురావడం అనే మీ ఒరవడి ఉంది చూశారూ ఇట్స్‌సో చిల్లింగ్‌యార్‌! కశ్మీర్‌ దారుణాన్ని అడ్డుపెట్టుకుని భారత్‌లోని సకల ఉద్యమాలను ఉద్యమ నాయకులను-ముఖ్యంగా హక్కుల సంఘాలను కడిగి పారేయాలనే మీ సంకల్పం రాజ్యమంత పురాతనమైనది. పాలకులు అమెరికాను అనుసరిస్తున్నపుడు మీడియా మాత్రం ఫాక్స్‌ను అనుసరించొద్దా! ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయాలనడం ఏం న్యాయం! యూ ఆర్‌ఆల్వేస్‌ఆన్‌“రైట్‌’ సైడ్ బాస్‌!! కానీ అభిప్రాయమున్న ప్రతిమనిషికి మీలాగా కెమెరాలో మూతిపెట్టి గట్టిగా మాట్లాడే అవకాశమొస్తుందా చెప్పండి. అభిప్రాయాలు అందరికీ ఉండొచ్చు. మైకులు అందరికీ ఉండవు. మూతులందరికీ ఉండొచ్చు. కెమెరాలు అందరికీ ఉండవు. మొన్నామధ్య కరీంనగర్‌లో దళిత మహిళలు వండిన మధ్యాహ్న భోజనాన్ని తినబోమని పెద్దకులాల పిల్లలు భీష్మించారండీ. తాను ఇచ్చిన ప్లేట్‌ను తినకుండా పిల్లలు తిరస్కారభావంతో వెళ్లిపోతే ఆ దళిత తల్లి కంట్లో కదిలిన కన్నీటి పొరను వ్యక్తీకరించే కెమెరాలు లేవండి. ఆ కన్నీటిపొరకే శక్తి ఉంటే ఈ దేశంలో కులమనే అశుద్ధం కొట్టుకుపోవాలి సర్‌! ఆ కంటిచూపుకే శాపమిచ్చే శక్తి ఉంటే ఆ ఆగ్రహంలో కుల అహంకారులు ఊడ్చుకుపోవాలి సర్‌! కానీ ఈ దేశపు దేవుళ్లు శాపాలిచ్చే అర్హతలు కూడా కొందరికే ఇచ్చి జాగ్రత్తపడ్డారు సర్‌! మీకు బాగా తెలుసుసర్‌! యునో...ఇనో స్వామిజీ...యునో! మీకు ఆవేశం తప్పించిన కశ్మీర్‌దగ్గరకే వద్దాం సర్‌! కశ్మీర్‌లో నాలుగేళ్ల బాలుడిపై బాంబు దాడి కేసు పెట్టినపుడు ఇదేమి అన్యాయమని ఆక్రోశించిన వారికి కెమెరాల సదుపాయం లేదు. వందల కొద్దీ యువకుల మిస్సింగ్‌వ్యవహారాల్లో ఆ తల్లుల కడుపు కోత పంచుకోవడానికి సరిపడా మైకుల్లేవు. గార్డెన్లకు ప్రసిద్ధి గాంచిన కశ్మీర్‌లో ఆనవాళ్లు లేని సమాధుల తోటలున్నాయి కదా! ఆ వేలాది శవాలు ఎవరివో ఎందుకున్నాయో అందులో మిస్సింగ్‌పిల్లలెంత మందో తేల్చే దిక్కులేదు.  మీరెప్పుడైనా శ్రీనగర్‌దాటి పల్లెలకు వెళ్లారా..వెళ్లే ఉంటారు సర్‌!  భూసంస్కరణలు పటిష్టంగా అమలైన ప్రాంతం కశ్మీర్‌అని మీబోటి పెద్ద జర్నలిస్టులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెంగాల్‌ కూడా కశ్మీర్‌తర్వాతే. అదంతా షేక్‌అబ్దుల్లా చలువండీ. చిన్నచిన్న కమతాలుసర్‌.....రైతులెక్కువ సర్‌! ప్రతిరైతు తన ఊరినుంచి పొలానికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు జవాన్లచేత తడిమించుకుని వెళ్లాలి కదా సార్‌...అక్కడ ఎన్ని కళ్లు ఆ రైతు కుటుంబాలలోని స్ర్తీలను కళ్లతోనే రేప్‌చేస్తాయో తెలుసా సర్‌! నిజమైన రేప్‌ఆరోపణల గురించి మాట్లాడబోవడం లేదు సార్‌! 'ఆర్మీని డీ మోరలైజ్‌చేసే విదేశీ కుట్రలోనూ మరియును దేశద్రోహం'లోనూ పాలుపంచుకోవాలని లేదు సార్‌! మనింట్లోంచి మనం బయటకువెళ్లినపుడు వచ్చినపుడు మనల్ని  శత్రువు  దృష్టితో చూసే జవాన్‌చేత ఒళ్లంతా తడిమించుకోవడమనే అనుభవం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి సర్‌! అన్నట్టు ఇపుడూ జవహర్‌లాల్‌నెహ్రూ అనే పెద్దమనిషి ఉన్నాడు కదా సర్‌! ఆయన శ్రీనగర్‌లాల్‌చౌక్‌దగ్గర ఒక ఉపన్యాసం ఇచ్చాడు సర్‌! "భారత దళాలు ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. కశ్మీరీలు భారత్లో కలిసి పోతారా..పాకిస్తాన్‌లో కలుస్తారా...ఎలా ఉండాలనుకుంటారు అనే స్వయంనిర్ణయాధికారం వారికే ఉంటుంది. వారు కోరినపుడు ప్లెబిసైట్‌నిర్వహిస్తాం'' అని బహిరంగంగా చెప్పారు కదా సర్‌! ఆ ఉపన్యాసం ఇపుడు ఇంటర్‌నెట్‌లోంచి తీసేశారు సర్‌! అలా తీసేయడం పౌర స్వేచ్ఛకు ప్రజాస్వామిక వాతావరణానికి భిన్నమని మీకు అనిపించలేదు కదండీ ! మీరు పెద్ద ఎడిటర్‌కదా సర్‌! ఆ ఉపన్యాసం ముందే విని ఉంటారు. చూసే ఉంటారు. తొలి ప్రధాని చెప్పిన మాటలను ఎవరైనా గుర్తుచేస్తే వారు ఉగ్రవాది అవుతారాండీ! ఉగ్రవాదులకు ఊతమిచ్చే దేశద్రోహులవుతారా స్వామిగారూ! నెహ్రూగారి కుమార్తె ఇందిర కశ్మీరీలతో సంబంధం లేకుండా పాకిస్తాన్‌తో చేసుకున్న సిమ్లా ఒప్పందం గురించి మాట్లాడితే దేశభక్తులైపోయి ఆమె నాన్న నెహ్రూ కశ్మీరీలకిచ్చిన హామీ గురించి మాట్లాడితే దేశద్రోహులైపోవడం ఎంత చిత్రమండీ!   చచ్చిపోయిన తర్వాత అంతటి  పెద్దమనిషి మాటలను అంతటి స్వాతంత్ర్యపోరాటయోధుడి మాటలను అంతటి స్టేట్స్‌మన్‌మాటలను పాటించకపోవడం పాపం ఆయనకు అన్యాయం చేయడమే కదండీ...బతికి లేడుకదా అని ఆయన హామీని బుట్టదాఖలా చేయడం తగునా సుమండీ....అరుంధతీరాయ్‌ ఏం కోరారండీ...నెహ్రూను గౌరవిద్దామని ప్రయత్నించారండీ! తప్పాండీ! ఎక్కడ కానిస్టేబుల్‌నక్సలైట్ల చేతుల్లో చచ్చిపోయినా, ఎక్కడ కశ్మీరీ పండిట్లకు చిన్నపాటి అన్యాయం జరిగినా మీరు వాట్‌అరుంధతీరాయ్‌అని ప్రశ్నిస్తూ ఉంటారు కదండీ.! మేధాపట్కర్‌, బినాయక్‌ సేన్‌, సుజాతో భధ్రో లాంటివాళ్లందరినీ ఉద్దేశించి వాట్‌హిప్పోక్రాట్స్‌అంటూ ఉంటారు కదండీ! నాకు తెలిసీ వాళ్లెవరనీ చంపినోళ్లు కాదండీ! పైగా పువ్వులూ పిట్టలూ చెట్లూ అని కవిత్వం కూడా చెప్పేయగల కాల్పనిక జీవులండీ! ఉద్యమాల నాయకులు జైళ్లో ఉన్నపుడు కూడా ఆదాహై చాంద్‌మా అని పాడుకోగలిగిన సున్నితమైనోళ్లండీ! ఇదంతా ఉద్యమాల సానుభూతిపరుల వాచాలత్వం అనిపించొచ్చండీ! కానీ సుధీంద్ర కులకర్ణి కోబాడ్‌గాంధీ గురించి ఏం రాస్తున్నారో చూడండి సార్‌! కులకర్ణి అయితే ఉద్యమాల సానుభూతిపరుడు కాదుకదండీ! ఆయన బిజెపి నాయకుడని తెలుసుకదండీ! మనుషులను అర్థం చేసుకోవాలంటే మనసును పట్టుకోవాలి సార్‌! కానీ మీ కెమెరాకు మొకమూ ఇంకోటి తప్ప మనసు తెలీదు కదా సర్‌! హే హిప్పోక్రాట్స్‌పండిట్స్‌సంగతేంటి అని మీరు ప్రశ్నిస్తూ ఉంటారు కదా సర్‌!  పండిట్ల గురించి కశ్మీర్‌లో చిన్నా పెద్దా నాయకుడిని ఎవరిని కదిలించినా సారీ ఫేస్‌పెడతారు, తలవంచుకున్నట్టు ఫీలవుతారు తప్పితే ఎవరూ ఘనకార్యం అనుకోరు సర్‌! మనుషులు కదండీ!
       మీరు ఒంటికాలిమీద లేచే పౌరహక్కుల నేతలు ఏమంటారు? బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా ఏమంటారు! పౌరులు నేరాలు చేస్తే నియంత్రించడానికి రాజ్య వ్యవస్థ ఉంది. ఇపుడు శ్రీనగర్‌లో బ్యాట్‌తో కొట్టి చంపిన ఘటనలో నేరస్తుల పని పట్టడానికి వ్యవస్థ ఉంది. వారా పని చేయాలి. కానీ రాజ్యమే నేరం చేస్తే ఎవరినడగాలి? మన కిష్టం లేని వాళ్లను కాల్చి చంపడానికి స్ర్తీలమీద అత్యాచారాలు చేయడానికి వారికి పర్మిషన్‌ఇస్తే ఏమవుతుంది? అది ఎక్కడికి దారితీస్తుంది? పాలనా వ్యవస్థ అంటే  మనుషులే కదా సర్‌! వారికి కూడా రాగద్వేషాలు ఉంటాయి కదా సర్‌! ఒకసారి వారికి అవసరంలేని అధికారాలు కట్టబెడితే  ఎవరినైనా బలితీసుకోవచ్చు. అది ఇవాళ నీకు ఇష్టం లేని సమూహం కావచ్చు. రేపు నువ్వే కావచ్చు. ఈ మాటలేవీ కొత్తవి కావు. భూమి పుట్టినప్పటినుంచి హక్కుల నాయకులు చెపుతూనే ఉన్నారు. ప్రజలు తమకు అవసరమైన డిమాండ్ల కోసం ఉద్యమించి నపుడు వారి ఆకాంక్షలను పట్టించుకోకుండా హింసతో అణిచివేయడం వల్ల వారికి  ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని అది మరింత హింసకు దారితీస్తుందని ఉద్యమకారులు హెచ్చరిస్తుంటారు. అంటే వారు ప్రజాస్వామ్యానికి అవసరమైనవారూ ప్రియమైన వారూ అన్నమాట. కానీ మీలాగ ఒక బాక్సైట్‌ప్రాజెక్టు ఒక కుదంకుళం ప్రాజెక్టు మందగిస్తే వెంటనే ప్రజాస్వామ్య వ్యవస్థ  బ్రాండ్‌ఇండియాను దెబ్బతీస్తోందా( ఈజ్‌డెమొక్రటిక్‌పాలసీస్‌ఇంపాక్టింగ్‌బ్రాండ్‌ఇండియా-టైమ్స్‌నౌ- టైమ్స్‌ఆఫ్‌ఇండియా వెబ్‌సైట్‌లో చర్చాంశం. పోల్ నిర్వహించుచున్న అంశం)అని ప్రజాస్వామ్యంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేయలేదు.  ప్రజాస్వామ్యం వల్ల అభివృద్ధి ఆగిపోయింది అని నిందిస్తే ఇక మీరు ఏంకావాలని కోరుకుంటున్నట్టు? ఆ రకంగా మీరు నిందిస్తున్న హక్కుల సంఘాల వారు  ప్రజాస్వామిక వాదులా?మీరు ప్రజాస్వామిక వాదులా సర్‌? ఏమిటో సర్‌! ప్రజాస్వామ్యం లాగే అంతా మిధ్య?
జి ఎస్‌రామ్మోహన్‌

Tuesday, 13 December 2011

పులి జూదం








ఎంకారెడ్డి మూడోసారి పంచె సవరిచ్చుకున్నాడు. ఏం జేసినా అది నీలుక్కుని సావడం ల్యా. 'ఈనెమ్మ'... గంజి సరిగా పెట్టలేదని సాకల్ని తిట్టుకుంటా యాప చెట్టుకాడికి ఎళ్లబారినాడు.
'ఎంత గంజి పెట్టినా ఇంకా ఎన్నాళ్లొస్తది సామీ. ఎపుడో మీ కూతురు పెళ్లి నాటి పంచె. ఆడికీ శానా ఎక్కువ కాలం సేవ జేసింది'... సాకలి మాటలు గుర్తులేక కాదు. కాకపోతే అట్లాంటివి గుర్తు చేసుకోవడమంటే ఎంకారెడ్డికి బో చిరాకు.
యాపచెట్టుకాడ అప్పటికే జోరుగా సాగుతోంది పులిజూదం. సాలోళ్ల పరంధాముడి తాజ్‌మహల్‌ బీడి, బలిజోళ్ల సుబ్బారాయుడి విల్స్‌ సిగరెట్టూ పోటాపోటీగా పొగలు చిమ్ముతున్నాయి.

'ఒక ఆటెత్తు, రెండు సంపుళ్లు. మావా. నీ పులుల పని అయిపోయిందే'
'నా పులుల్ని కట్టేయాలంటే నీ జేజినాయన దిగిరావాలోయ్‌. ఇదిగో ఈ మేకను సావకుండా చూసుకో చేతనైతే'...
మాంచి ఊపులో వున్నారిద్దరూ. పరంధాముడు రెడ్డికి పలకరింపు నవ్వు యిసిరేసి కొంచెం ముడ్డి పక్కకు జరిపినాడు కూర్చోవడానికి చోటిచ్చినట్టు. సుబ్బారాయుడు కూడా నవ్వీ నవ్వనట్టు అదో రకంగా పలకరిచ్చినాడు. ఎపుడూ రానోడు ఈడెందుకొచ్చినాడీడికి? సుబ్బారాయుడెందుకో అపశకునంలాగా అనిపిచ్చినాడు రెడ్డికి. పలకరింపులు అయినాయిగానీ అటైతే ఇప్పట్లో అయ్యేట్టు కన్పిచ్చడంల్యా. ఎవురూ లేసేట్టు లేరు.
'ఆ చెవి జూదం ఆడవోయ్‌. అది.. చెవిలోకి తోయవోయ్‌ నాయాలా'
ఎంకారెడ్డి పరంధాముడి మీదకు వొంగి సలహాలివ్వడం మొదలుపెట్టినాడు.
'ఇగో మామా. పేకాట కాడ, పులిజూదం కాడ పైయోళ్ల యవ్వారం వద్దే వద్దని నువ్వే అంటివి' పరంధాముడు గుర్తు చేసినాడు.
'అది ఆడ కూచున్నప్పుడు అంటిలేవోయ్‌. పెద్ద
లాపాయింటు మాట్లాడినావ్‌గాని'
సహజన్యాయన్ని మృదువుగా గుర్తు చేసినాడు ఎంకారెడ్డి. రెడ్డి అర్యుూ యిర్యుూ మాట్లాడుతున్నాడేగాని చూపంతా పోల్రాజు టీ కొట్టు మీదే ఉంది. ఒక చేతిని ఆకాశానికి మరో చేతిని బూమికి ఆనిచ్చినట్టు టీ తిరగ్గొడతా ఉన్నాడు పోల్రాజు.

'ఇంతకీ ఈ నా కొడుకు నన్ను చూసినట్టా, చూడనట్టా. చూసినా చూడనట్టు యాక్సన్‌ జేచ్చన్నడా'...
ఎంకారెడ్డి హృదయం రకరకాలుగా ఆలోచిస్తా ఉంది. యాడ్నో కాల్తా ఉంది. అతని అవస్తను చూసి లోలోపలే వికటాట్టహాసాలు చేసుకుంటున్న పోల్రాజు ఆ ఆనందపారవశ్యాన అదాటున దొరికిపోయినాడు. చూపులు చూపులు కలిసినాయి. ఇక తప్పలేదు. చార్మినారు పాకెట్టు, కాఫీ గల్లాసు పట్టుకొని యాపచెట్టు కాడికి నడిచినాడు.
పెట్టె తెరిచిన రెడ్డికి షాక్‌ కొట్టినట్టయ్యింది. పదికి బదులు ఐదే.
గంభీరంగా ఉరిమి చూడబోయినాడు. పరిస్థితిని ముందే ఊహించిన పోల్రాజు
'బాబాయ్‌' అని పద్దుల పుస్తకం మీద చేయి వేయబోయినాడు.
'పరువు దీస్తడా యేం నా కొడుకు' రెడ్డి హృదయం గుబగుబలాడింది. గంభీరం కాస్త భయగంభీరమైంది. చివరకు దీన గాంభీర్యంగా అవతరించింది.
రెడ్డి భయం జూసి పోల్రాజుకు ఆర్గాజానుభూతమైంది.'పోన్లే పెద్ద నా కొడుకు' అనుకుంటా టీ కలపడంలో మునిగిపోయినాడు.
పరంధాముడు, సుబ్బరాయుడుతో సహా ఆడున్నోళ్లందరూ ఏమీ ఎరగనట్టు మర్యాద నటిస్తూనే అంతా గమనిస్తా ఉన్నారు రంజుగా.
రెడ్డికి వాళ్ల యవ్వారంపై అరకొరగా అనుమానమున్నా 'చీ చీ మనూరోళ్లు మరీ అంత ఎదవలు కాదులే' అని ఆ అనుమానాన్ని తొక్కేసినాడు.
ఎందుకో ఉన్నట్టుండి అతనికి
జేజినాయన అబ్బారెడ్డి గుర్తుకొచ్చినాడు.

'ఆయన గుర్రమెక్కి యాపచెట్టుకాడికి ఎళ్లబారితే ఊరు ఊరంతా గప్‌చుప్పయ్యేది. కావ్‌ అందామనుకుని నోరు తెరిసిన కాకి గూడ కా తోనే ఆగిపోయేది. యాపచెట్టు కాడ ఆయన కొలువు తీరిస్తే బోజరాజు సబ లాగుండేది గాదూ. ఎట్టాంటి రోజులయి. ఎంత గౌరం, ఎంత మర్యాద. ఆ రోజులే యేరు. దర్మం నాలుగు పాదాలా నడిసే రోజులయి. ఇట్టాంటి మిడిమాలపు రోజులా. నాన్న ఇన్నారెడ్డి మాత్రం.. బుల్లెట్‌ టపటపలాడిస్తే ఎవురైనా నోరు తెరిసే వాళ్లా. అంత దమ్ములా ఎవుడికైనా'
రెడ్డి బాధాకర మధుర స్మ­ృతులకు బ్రేక్‌ వేస్తూ ఊడిపడింది ఆర్టీసి బస్సు ఎర్రదుమ్ము లేపుకుంటా.
డ్రైవర్‌ కొండయ్య బుయ్‌ బుయ్‌మని రెండుసార్లు ఆరన్‌ మోగిచ్చి బస్సు దిగి పోల్రాజు దగ్గర కూలబడ్డాడు. కండట్టర్‌ ఉసేను పంచాయితీ పేపర్‌ తెచ్చి రెడ్డి చేతిలో పెట్టినాడు ఆనవాయితీ పెకారం. ఉసేను నేరుగా పేపర్‌ తనకే యివ్వడం రెడ్డికి రుూరుబానతో రుూపు గోకిచ్చుకున్నంత సుఖంగా అనిపిచ్చింది. సుబ్బారాయుడ్ని చూడ్డంతోనే కలిగిన అపశకునానికి ఉపశమనంలాగా అనిపిచ్చింది. ''పర్లేదు. యింకా ఆచారాలు మిగిలున్నాయి. దర్మం అక్కడక్కడా వుంది'' అనుకొని అభినందనపూర్వకంగా నవ్వినాడు. విదురుడి కేసి క్రిష్ణ పరమాత్ముడు చూసినట్టుగా చూసినాడు ఉసేనుకేసి. ఆ తర్వాత మొదటి పేజీ వుంచేసుకొని మిగిలినవి ఉదారంగా పంచి పెట్టినాడు ఆనవాయితీ పెకారం.

'ఏరా కొండిగా! ఇంకో రెండుసార్లు ఆరనేస్తే మీ తాత ముల్లేమైనా పోతాండాదా? ఆ మూలున్న గౌండ్లోళ్ల రుూదిలోకి ఆరన్‌ యినిపించాల్నా లేదా? ఎవురెక్కకుండా ఒట్టి బస్సునే తీసకపోవాలనుకొంటాండావా?' డ్రైవర్‌ కొండయ్యను మందలిస్తా ఉన్నారు కొందరు చైతన్యపూరితులైన గ్రామస్తులు.
'ఆ ఏచ్చాలేవోయ్‌. రెండుసార్లేం కర్మ. రెండొందలసార్లు ఏచ్చాంగానీ. ఏం కాసేపు ముందొచ్చి కూర్చుంటే మీ వూరోల్ల గని ఏమైనా తరిగిపోతాండాదా?' మాటకు మాట అంటిస్తున్నాడు కొండయ్య.
ఆ ఊరికి ఒగటే బస్సు. ఒగటే పేపరు. నిన్న మొన్నటి దాకా ఒగడే నాయకుడు. ఇట్టాంటి వాతావరణంలో అక్కడికి వచ్చినాడు రామయ్య అలియాస్‌ రామశాస్త్రి. పొద్దుటాల్నే పొలాల నుంచి వస్తున్నట్టున్నాడు. చేతిలో కంచు చెంబు. దానికి పోటీగా నేరేడు పండుగాలా మిలమిలమాడుతున్న గుండ్రని పొట్ట. బుజం మీద కాశీ తువ్వాల. నడుము చుట్టూ కావి రంగు పంచె.
రామయ్య రాగానే పోల్రాజు టీకొట్లో బెంచీల మీద కూర్చున్నోళ్లంతా లేచి నిలబడినారు దండం సోమీ అనుకుంటా. రెడ్డి నమస్కారం పెట్టలేదుగానీ అంతకంటే మర్యాదగా నవ్వుతో మందలిచ్చి పేపర్‌ చేతికిచ్చేసినాడు. పరంధాముడు ఓ నమస్కారబాణం పడేసినాడు. సుబ్బారాయుడు మాత్రం వింతైన పలకరింపు ఇసిరినాడు.
'ఏం సోమీ అంతా సుఖమేనా?'
స్వామి పొట్టను, కంచు చెంబును కొంటెగా చూస్తా సుబ్బారాయుడు అడిగిన ప్రశకు మామూలుగానైతే పక్కున నవ్వులు ఇనపడాల్సిందే. అయితే ఎంకారెడ్డి యిందాకే అనుకున్నట్టు ఊరోళ్లు పెద్దా చిన్నా తెలిసినోళ్లు. ఎందుకైనా మంచిదని నవ్వును లోలోపలే దాచుకున్నారు. స్వామేం తక్కువ తిన్నాడా గాయం కనపడకుండా మొకాన్ని గాంభీర్యంతో కడిగేసినాడు. ఈరేంద్ర సెవ్వాగు పాకిస్తాన్‌ బౌలింగ్‌ను ఎట్లా ఇరగదీసినాడో పేపర్‌ ఎనకాల్నుంచి వంగి వంగి చదువుతున్న పిల్లకాయలను ఒక్క కసురు కసిరినాడు.

'పోండ్రా కుంకల్లారా!. చిన్నా లేదు. పెద్దా లేదు. ఇంతోడికి పేపర్‌ గావాల. అంతోడికి పేపర్‌ గావాల. యాడుండోడు ఆడుండేది ల్యా. ప్రతోడికి పేపర్‌ గావాల, రాజకీయాలు గావాల. కలికాల మహిమ. అయినా ఒకర్నని లాభంలేదులే. అంతా ఆడు చేసిన పని' ఎన్టీఆర్‌ను మనసులోనే కసిదీరా తిట్టుకుంటా పేపర్‌ రెడ్డికిచ్చేసి ఎళ్లబారినాడు చెంబూపుకుంటా. యిరవైఏళ్లు దాటినా గాయం పచ్చిగానే ఉన్నట్టుంది రామశాస్త్రికి.
'ఎంతైనా కర్ణపోడు కర్ణపోడే. ఆడితో చెతుర్లా' నలుగురైదుగురు చెవులు కొరుక్కున్నారు సుబ్బారాయుడుకేసి అదోరకంగా చూస్తా. తనకింకా చిటారుకొమ్మన పండును కొట్టేంత గురి రాలేదని అర్థమైంది సుబ్బారాయుడుకు.
'రెడ్డీ.. పులులు తీసుకుంటావా? మేకలా? అయినా రెడ్డివి కదా. పులులే తీసుకోలే'
గాలి ఇటు తిప్పాడు. రెడ్డికి సెలకోలతో కొట్టినట్టయ్యింది. 'ఈడు నా మీద ఔదార్యం చూపుతాడేంది?. నేను కదా అది అందరి మీద చూపాల్సింది! అది నా హక్కు గదా!' రెడ్డి మనసు మూలిగింది.

'స్వామికేమి సుబ్బరంగా జారుకున్నాడు. కానీ తనట్ల పోలేడే. ఈ యాపచెట్టు యిడిసిపెట్టలేడే. అది యిడిస్తే పాణం ఇడిసినట్టే గదా. ఈడు జూస్తే కడుపులో ఏదో కుట్రపెట్టుకొనే ఈడికి వచ్చినట్టున్నాడు. అయినా అటో యిటో తేల్చేసుకోవాల్సిందే'
దీరƒంగా నిట్టూర్చి...''నలబై ఏళ్ల నుంచి ఈ ఆటాడతాండాను సుబ్బారాయుడా. నాకేవైతేనేమిగానీ పులులు నువ్వే తీసుకో. నేను మేకలు తీసుకుంటాగాని''.. ఒక్క ఉదుటున అనేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు.
నక్సలైట్లూ, ఉచిత విద్యుత్తూ, బిన్‌ లాదెన్నూ తదితర ప్రపంచ సమస్యలను కూలంకషంగా చర్చిస్తున్న పోల్రాజు టీకొట్టులోని సకల జనసందోహం కూడా అరుగు చుట్టూ చేరతా వుంది. పరంధాముడి పని అటూ ఇటూ కాకుండా వుంది. యింటిలో సాపు పూర్తవడానికి రెండు గజాలు మిగిలుంది. 'ముందే పూట పూటకి కటకటగా వుంటే మగ్గం మీద కాసేపైనా ముడ్డి మోపకుండా పెద్ద పోతుమొగోని మాదిరి యాపచెట్టు కాడ పెత్తనాలేందని' పెళ్లాం పోరుతున్నా ఇదిలిచ్చుకోని వచ్చినాడు. ఈడ జూస్తేనేమో యవ్వారం బో కుశాలగా ఉంది. 'ఆ రెండు గజాలు అదే నేచ్చదిలే' అని ఆడ్నే కూలబడినాడు. ఏదో పెళ్లి పందిట్లో కాటి సీను రికార్డు మోత మోగిస్తా ఉంది. 'ఇచ్చోటనే.. ఇచ్చోటనే భూములేలు రాజేంద్రుల అధికార ముద్రికల్‌ అంతరించే' డివి సుబ్బారావు గొంతు ఆరున్నరలో ఖంగు ఖంగుమంటోంది.
మూమూలుగా సుబ్బారాయుడు యాపచెట్టుకాడికి వచ్చేవోడు కాదు. మిలట్రీ నుంచి రిటైరైనాక డ్రైవర్‌గా చేరి లారీ కొన్నప్పట్నించి ఊరులో అతని పేరు పెద్దమనుషుల లెక్కలో చేరింది. కష్టపడి చదివించుకున్న కొడుకు అమెరికా పోయి ఆడ్నించి పంపించే డాలర్లతో ఊర్లో వడ్డీ వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాక యవ్వారం పూర్తిగా మారిపోయింది. ఓల్‌ మొత్తం డివిజన్‌లోనే అమెరికా కొడుకున్న ఏకైక తండ్రిగా పేరు ఎలిగిపోతా వుంది. బేస్‌మెంట్‌ నుంచి అంతా సిమెంట్‌తో టౌన్లోల్ల మాదిరి జాంజాంగా మాడీ కట్టించినాడు. బీడీలనొదిలేసి సిగరెట్టుకు మారినాడు. నాటు నుంచి సీమసరుక్కు తిరిగినాడు. ఊళ్లో వాళ్ల మాటల్లో చెప్పాలంటే 'ఇయ్యాల ఆడి ఉచ్చ పెట్రోలై మండుతా వుంది'.

'రెడ్డీ, తెలంగాణ వచ్చదంటావా?' కొండ మీంచి పులిని కిందకి దించి తొలి ఎత్తు వేసినాడు సుబ్బారాయుడు.
'వస్తే ఏముంది, రాకపోతే ఏముంది, మనకేమన్నా ఉంటదా, ఊడుద్దా' ఉషారైన జవాబిచ్చానని సంబరపడినాడు రెడ్డి.
'అదేంది రెడ్డీ, మడుసులన్నాక అన్నీ తెలుసుకోవాల. అందునా పెద్దమడుసులన్నోళ్లు అవసరమా కాదా అనుకోకుండా పేపర్లో వచ్చేయన్నీ తెలుసుకోవాల. ల్యాపోతే మనకూ మిగిలినోళ్లకూ తేడా ఏముంటది?' ఇంకో పులిని కిందికి దించినాడు సుబ్బారాయుడు.
అంతా పళ్ల బిగువున బరిస్తానే ఉన్నాడు రెడ్డి.
'మనకూ మిగిలినోళ్లకూ అని చెప్పి గుర్రాన్ని గాడిదను ఏకం జేచ్చడా? నాలుగు రాళ్లు ఎనకేసుకోగానే పెద్ద మొగోడయిపోయినాడు, అబ్బారెడ్డి జమీందారు వంశీకులతో సమానమైపోయినాడా' అని గిలగిలలాడిపోయాడు. ఆయువుపట్టు మీద దెబ్బ కొట్టినట్టయ్యింది.
'రెడ్డీ... పివి నరసిమ్మారావు మేదావా? వాజ్పేయి మేదావా?' ఇంకో బాణం యిసిరినాడు సుబ్బారాయుడు.
ఇందాకటి అనుభవం యిచ్చిన జ్ఞానం వల్ల వెంటనే మనకెందుకు అని సమాధానమియ్యకుండా ఒకించుక దీరƒంగానే ఆలోచించినాడు రెడ్డి.
'ఎవుర్ని కాదంటామోయ్‌. ఇద్దరూ గట్టోళ్లే' నిదానంగానైనా మాంచి ధీమాగా చెప్పినాడు.
'అదేంది రెడ్డా. అట్లనేసినావు. ఇద్దరూ గడుసుపిండాలే అని నాకు తెలీకనా. ఏదో పెద్దోడివి. ఇద్దర్లో ఎవురు ఎక్కువ మేదావి అని చెపుతావనే కదా అడిగింది' అట్నుంచి నరుక్కొచ్చినాడు సుబ్బారాయుడు.

రెడ్డికి ఎటూ పాలుపోకుండా ఉంది. రెడ్డి పుటక పుట్టినాక అందులోనూ జమీందార్‌ వంశాన పుట్టినాక అవతలోడు సవాల్‌ ఇసిరితే యెనక్కు పోయేదానికే ల్యా. అట్టని అవతలోడి దగ్గర ఏమేం ఆయుదాలుండాయో తెలుసుకోకుండా రంగంలోకి దిగాల్నంటే ఎవురికైనా కష్టమే. అకస్మాత్తుగా జేజినాయన అబ్బారెడ్డి గుర్తొచ్చినాడు. ఆయన గుర్రమూ, ఆ ఠీవి... ఆలోచనలతో బరువెక్కిన తలను ఒక్కసారి ఇదిల్చినాడు. ఒంట్లో సత్తువ అంతా కూడగట్టుకుని గంభీరంగా గాలి పీల్చి 'నరసిమ్మారావే ఒక మెట్టెక్కువ' అనేసినాడు.
'ఎట్టా?' పాయింట్‌ దొరగ్గానే కోర్టులో వకీలు అడిగినట్టు గబాల్న అడిగినాడు సుబ్బారాయుడు. అప్పటికే మూడు మేకల్ని చంపేసి ఊపు మీదున్నాడు.
'ఆయన జగమెరిగిన పండితుడు, బాగా చదూకున్నోడు'
'అంటే వాజ్పేయి సదూకోలేదనా. ఆయనా బెమ్మాండంగా సదివినోడే కదా'
'ఈయన పుస్తకాలు అవీ రాసినాడప్పా. ఆయనతో పోలికెక్కడ?'
'ఆయన రాయలేదనా ఏంది? ఆయన రాసిన పాటలు మా కలర్‌ టీవీలో గూడ సూపిస్తిరే' కలర్‌ టీవిని నొక్కి పలుకుతా చెప్పినాడు సుబ్బారాయుడు. అంతటితో ఊరుకోకుండా ఏమంటావు అన్నట్టు పరంధాముడి వైపు చూసినాడు.
పరంధాముడి పని శానా ఇబ్బందిగా తయారైంది.
అటు చూస్తే ఇంట్లో సాపు తెంపినాల్నించి మళ్లీ నూలు కోసం, రంగుల కోసం సుబ్బారాయుడే గతి. ఇటు చూస్తే తరతరాల అనుబంధం. ఇస్వాసమా బోయినమా అన్నట్టుంది పరిస్థితి. ఏం చేయాల్నో తోచక అటూ ఇటూ కానట్టు కన్ఫ్యూజింగుగా నవ్వినాడు. రెడ్డికి షాక్‌ కొట్టిన ట్టయ్యింది.
'చీ ఇస్వాసం లేని నాకొడుకు' కడుపులో కసిదీరా తిట్టుకున్నాడు.
ప్రయత్నంగా కాలు మీద కాలు వేసుకున్నాడు. మీసాల మీదికి చేయి పోనిచ్చి మెలి తిప్పుతా అదనపు గాంభీర్యం కోసం ప్రయత్నించినాడు. ఏంజేసినా సుబ్బారాయుడి మొకంలో క నిపిస్తున్న దర్పానికి సమానంగా రావడం ల్యా. కరుక్షేత్రంలో కర్ణుడి మాదిరి వుంది రెడ్డి పరిస్థితి. నమ్ముకున్నవన్నీ నట్టేట ముంచి ప్రత్యర్థి ముందు తనను నిరాయుధుడిని చేస్తున్నట్టనిపించింది. అంతటి నిస్సహాయతలోనూ ఏదో మెరుపులాగా మెరిసింది.
'ఆయన బహుబాషా కోవిదుడు. ఈ విషయంలో ఎదురే లేదు'... పాశుపతాస్త్రం యిసిరినానని అనుకున్నాడు రెడ్డి. తన జవాబుకు ఎదురే లేదన్న ధైర్యంతో ఒక్కసారిగా తలెత్తి అందరి మొకాల వంకా ధీమాగా చూశాడు.

అయితే ఆ ఆనందం ఒక్క క్షణంలోనే ఆవిరైపోయింది.
'అంటే ఏంది.. చానా బాసలొస్తయనేగా. సరే అట్టయితే ఆయన కంటే నాకే ఎక్కువ బాసలొచ్చు. నేనే పెద్ద మేదావినవ్వాలి కదప్పా ఈ పెకారం' తడుముకోకుండా అనేసి ఉల్లాసంగా పెట్టెలోంచి సిగిరెట్‌ తీసి ఇలాసంగా ఎలిగిచ్చినాడు సుబ్బారాయుడు.
రెడ్డి మొకంలో నెత్తురంతా ఆవిరైపోయింది. 'ఈడు మిలట్రీ నా కొడుకని గుర్తు లేకపాయగదా' అని వగచినాడు. చుట్టుపక్కల జనం కేసి పరికించి చూసినాడు. అందరూ చూపుల్లోనూ భరించలేని జాలి.
'అయిపోయింది. సర్వం అయిపోయింది. తాతల తండ్రుల నాటి పరువును తాను నిలపలేకపోయినాడు. జమీందారీ వంశాన తాను చెడబుట్టినాడు. నిన్నమొన్నటి దాకా తువ్వాల చేత్తో పట్టుకొని నసుగుతూ నంగినంగిగా మాట్లాడే వోడి పవర్‌ ముందు తాను నిలబడలేకపోయినాడు. చేతుల్లో ఇంత పెద్ద సిగరెట్‌ పట్టుకుని ఊర్లో ఏవో పెత్తనాలు చేసుకుంటా తిరుగుతున్నాడని తెలిసె గాని ఇంత అగస్మాత్తుగా తన కోటలోకి వస్తాడని కలగంటిమా!'

జీవితంలో చాలా సంవత్సరాల తర్వాత రెడ్డి కళ్లలో నీటిపొర కదలాడింది. అది చుక్కగా మారి కిందకి దూకకుండా ఉండడానికి అతడు తన సర్వశక్తుల్నీ కేంద్రీకరించాడు. అయితే అప్పటికే ఆ తడి అందరికీ అనుభూతమైంది. రెడ్డి కళ్లకు జనాన్ని మోసం చేసే శక్తి లేకపోయింది. దైన్యాన్ని జయించడానికి మాటలనాశ్రయించక తప్పలేదు.
కాసేపు అర్యుూ యిర్యుూ అంతూపొంతూ లేకుండా మాట్లాడినాడు. పరంధాముడితో ఒకప్పుడు నేతపని ఎంత వెలుగు వెలిగిందో చెప్పినాడు. ఊర్లో శ్రీరామనవమి రోజు తాలిబొట్టుకోసం రాములవారి విగ్రహాన్ని పరంధాముడి జేజినాయన ఇంటికి ఎట్లా ఊరేగింపుగా తెచ్చేవారో చెప్పినాడు. ఎనకటి రోజుల్లో కులవృత్తుల కున్న గౌరవం గురించి పెద్దా చిన్నా మర్యాదల గురించి అర్యుూ ఇర్యుూ మాట్లాడినాడు. కాలంలో వెనక్కు నడిచిన వాడి మాదిరిగా చుట్టుపక్కల వారిని పట్టించుకోకుండా ఎంతో సేపు గతాన్ని పలవరిచ్చినాడు. మనుషులను అపుడే కొత్తగా చూస్తున్నట్టు అందర్నీ వింతగా పరికించి చూసినాడు. ఆ తర్వాత హటాత్తుగా మాటలాపేసినాడు. సుబ్బారాయుడి కేసి ఒక్క చూపు యిసిరినాడు. ప్రపంచంలోని కసిని, ద్వేషాన్ని, అసహ్యాన్ని రంగరించుకున్నట్టుందా చూపు. అదిగో అప్పుడు మాత్రం సుబ్బారాయుడి ఒళ్లు జలదరించిన మాట వాస్తవం. చూపుకు అంత శక్తి వుంటుందని అతను తొలిసారిగా తెలుసుకున్నాడు.

కాసింత మౌనం తర్వాత 'వస్తానోయ్‌ పరంధాముడు' అని ఒక మాటనేసి నెమ్మదిగా ఇంటి బాట పట్టినాడు ఎంకారెడ్డి. జొరమొచ్చి వారం రోజులు ఉపాసాలు చేసిన రోజున కూడా రెడ్డి అంత నీరసంగా నడవల్యా.
మర్నాడు కూడా యాపచెట్టు యదావిదిగా కొలుపు దీరినాది. కాకపోతే అరుగు మీద రెడ్డి చార్మినార్‌ వాసనలేదు. సుబ్బారాయుడి విల్స్‌ సిగరెట్టు పొగ మాత్రం ఉంగరాలు ఉంగరాలై తిరుగుతా ఉంది.
అతడు అడక్కముందే సిగిరెట్‌ పెట్టె, కాఫీ పట్టుకొచ్చి యిచ్చినాడు పోల్రాజు. కండక్టర్‌ ఉసేను గూడ పేపర్‌ అతనికే తెచ్చివ్వాల్సి వచ్చింది.
జి ఎస్‌ రామ్మోహన్‌
(2005 జూన్‌ 11న ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

చివరి మనీషి!


తనతో విభేదించిన సంస్థను కూడా తన దారిలోనే నడవాల్సిన పరిస్థితి కల్పించిన వాడు బాలగోపాల్. వాస్తవానికి ఆయన్ను ఆ సందర్భంలో వ్యతిరేకించిన వారికి కూడా ఆయన చూపిన తోవ అవసరమైనదని గుర్తించక తప్పని స్థితి. కొన్ని సంస్థలు చేసే పనిని ఒంటి చేత్తో చేసి చూపారు.
గాంధీ గురించి ఐన్‌స్టీన్‌ అన్న మాటలు బాలగోపాల్‌కు కూడా వర్తిస్తాయి. ఇటువంటి మనిషి ఈ భూమ్మీద రక్తమాంసాలతో నడిచాడంటే నమ్మడం కష్టం. అతిశయోక్తి అనిపించినా ఇది నిజం. జీవితాన్ని నమూనా చేసి వెళ్లిపోయినవాడు. అందులోనూ ఊహించుకోవడానికే భయమేసేంతటి ప్రమాణాలు నెలకొల్పి ప్రజా రాజకీయాల్లో ఉన్నామనుకునే వారిని కూడా ఇరుకున పడేసి వెళ్లారు. మేధస్సులో ఆయనతో సాటిరాగల వారు అరుదు. ఆచరణలో చెప్పనక్కర్లేదు.
విడివిడిగానే ఆయన లోటును పూడ్చగలిగిన వారు కనుచూపు మేర లో కనిపించడం లేదు. ఇక రెండూ కలగలిసి ఆసాధ్యం. మేధాశ్రమ, శారీరక శ్రమ అని చాలా మాట్లాడుతుం టాం. ఆ రేఖలను జీవితంతోనే పూర్తిగా చెరిపేసినవాడు. ప్రతివారం ఆయన సగటున వేయి కిలోమీటర్లు పర్యటిస్తారు. దాదాపు అంతా బస్సుల్లోనే. ప్రభుత్వ బస్సుల్లో నే. హిమాచల్‌ప్రదేశ్‌ లాంటి ఒకట్రెండు మినహాయిస్తే దేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రాంతమైనా మన పక్కనే ఉన్న ఊరి గురించి చెప్పినంత సులభంగా రూట్లు, బస్సుల వేళల గురించి చెప్పగలడంటే ఆయన ఏ రీతిలో పర్యటించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
ఏ వేదిక మీదనైనా దానికి సంబంధించిన అంశం మీదే నిర్దిష్టంగా మామూలు మాటల్లో అందరికీ అర్థమయ్యేలా మాట్లాడడం ఆయన లో ఉన్న ప్రత్యేకత. బహుశా తిరుగులేని స్పష్టత వల్లో తడుముకోవాల్సిన అవసరం కానీ ఉపన్యాసాన్ని ముందే రూపొందించుకోవలసిన అవసరం కానీ లేకపోవడం వల్లో ఆయన మాటల ప్రవాహ వేగం ఎక్కువ. అది జలపాతపు హోరు.
సెజ్‌లో భూమి పోతున్న రైతాంగంతో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రపంచ బ్యాంక్‌ కుట్ర, రాజ్య స్వభావం వంటి పెద్దపెద్ద మాటల్ని కుమ్మరించరు. ఎందుకు పోతుందో, ఎవరికి పోతుందో స్పష్టంగా వివరిస్తారు. మానవహక్కుల కర పత్రాలు, బుక్‌లెట్లు దీనికి మంచి ఉదాహరణ. తెలుగు సీమ మీద కరపత్ర సాహిత్యానికి బాలగోపాల్‌ కూర్పు అది. గతంలో బస్టాండుల్లో నిలబడి వివిధ సంస్థల వారు కరపత్రాలు పంచుతున్నప్పుడు- వరిబీజం… కరపత్రాలలాగే – ఒక సెకన్‌ అలా చూసి విసిరిపారేసే వారు ఎక్కువ మంది.
ఎత్తుకోవడం ఎత్తుకోవడమే పీకల్లోతు కూరుకుపోయిన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని భయపెడితే ఏదో వింత భాష అనుకుని అలా పడేయడం సహజం. సానుభూతి పరుల విషయం వేరే. వాళ్ల కోసం కాదు కదా కరపత్రాలు, ఉపన్యాసాలు!ఇంకోవైపు ఆయన సిద్ధాంతంలో ఖాళీలను వెతుకుతూ వాటిని సవ్యంగా పూరించడం గురించి ఆలోచించేవారు. ఈ నేలకు ఈ మట్టికి ఈ నెత్తుటికి సరిపడదగినదేదో కనుగొనాలనే అన్వేషణ ఉండింది. దీనికి సంబంధించి నిరంతరం శ్రమిస్తున్న-నోట్స్‌ రాసుకుంటున్న దాఖలాలు ఉన్నాయి.
ఈ పని పూర్తి చేయకుండానే వెళ్లిపోయారు. తొంభయవ దశకం మొదట్లో అయిలయ్య లాంటి వారు కులాన్ని కొసదాక తీసుకెళ్లి మాట్లాడుతున్నప్పుడు నాబోటి పిల్లకాయలం ఎపిసిఎల్‌సిలో ఆయనపై ఒంటికాలిపై లేచేవారం. ఆయన చైనా వాల్‌లాగా అండగా నిలిచేవారు. అది ఆయన అభిప్రాయాలతో ఏకీభవించి కాదు. భిన్నత్వమనేదే లేకపోతే ఏకశిలా సదృశ మై సంస్థలు మొద్దుబారిపోతాయని. ఈ భిన్నత్వాన్ని కాపాడడానికి ఆయన చివరిదాకా ప్రయత్న పూర్వకంగా కృషి చేశారు.
తక్కువ మాట్లాడతాడు అంటున్నారు గానీ తక్కువ ఎక్కువ సంగతి కాదది. పలకరింపులుండవు. మాటలుంటాయి. అది తన ఇల్లు అనుకున్న వాడు వచ్చిన వారిని అతిథిగా చూస్తారు. అస్సలు అలా దేన్నీ సొంతమనుకోని వ్యక్తి ఆయన. వచ్చిన వారిని ఎప్పుడొచ్చారు, బాగున్నారా లాంటి మొక్కుబడి పలకరింపులేమీ ఉండవు. టీ పెట్టడానికి వెడుతూ నువ్వు తాగుతావు కదా అనైతే అడుగుతారు. అవసరాన్ని బట్టే మాట. కొన్ని రోజులు ఆయనతో గడిపిన వారికెవరికైనా ఆయనెంత హస్యప్రియుడో అనుభవమే.
కాశ్మీర్‌కు స్వాతంత్య్రమంటూ వస్తే తొలి ఉన్నతమైన అవార్డు బాలగోపాల్‌ కే అని అక్కడి హక్కుల సంస్థ నేత పర్వేజ్‌ ఇమ్రోజ్‌ లాంటి వారు అనేవారంటే, ఆయన చనిపోయిన రాత్రి మరో హక్కుల నేత కుర్రం పర్వేజ్‌ ఫోన్‌లో ఘెల్లుమన్నారంటే ఆయన కృషి ఎంత విస్తారమైందో ఎన్ని చోట్ల ఎందరి గుండెల్ని తడిమిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రాష్ట్రంలో తన కృషి వల్ల ఎన్ని వేల ప్రాణాలను కాపాడాడో, ఎందరికి ఆయనున్నాడు కదా అనే ధైర్యమిచ్చా డో చెప్పడం కష్టం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దీనిమీద ఆయన అభిప్రాయమేమిటో అనే ఆసక్తి అందరికీ ఉండేది.
పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాస్వామిక సంస్థల్లోని వారందరికీ ఆయన కన్సైన్స్‌ కీపర్‌గా ఉండేవారు. అన్ని స్రవంతుల వారికి ఒక అర్థంలో మీటింగ్‌ పాయింట్‌గా ఉండేవారు. మానవ హక్కులంటే నక్సలై ట్‌ ఉద్యమానికి పరిమితమైన వ్యవహారమనే ప్రచారాని కి భిన్నంగా వాటిని సమగ్రంగా నిర్వచించి ఆచరణలో చూపించి తనతో విభేదించిన సంస్థను కూడా తన దారిలోనే నడవాల్సిన పరిస్థితి కల్పించా రు. వాస్తవానికి ఆయన్ను ఆ సందర్భంలో వ్యతిరేకించిన వారికి కూడా ఆయన చూపిన తోవ అవసరమైనదని గుర్తించక తప్పని స్థితి. కొన్ని సంస్థలు చేసే పనిని ఒంటి చేత్తో చేసి చూపారు.
అధ్యాపక ఉద్యోగాన్ని వదిలేసి… అని కీర్తిస్తున్నారు. వాస్తవానికి ఆయన గణిత శాస్త్రంలో కృషి కొనసాగించి ఉంటే నోబె ల్‌ గ్యారంటీ అని నిపుణులే అన్న సందర్భాలున్నాయి. ఒక్క కెరీరెమిటి? వదులుకోనిదేమిటి? రుచిని జయించాడు. అలసటను జయించాడు. నిద్రను జయించా డు. నొప్పిని కూడా జయించాడు. భయ మూ భక్తీ బొత్తిగా లేవు. శరీరాన్ని కూడా పూర్తి స్థాయిలో జయించాలనుకున్నాడు.
అది చెప్పిన కంప్లయింట్స్‌ వింటూ ఉంటే రోజూ చెపుతూనే ఉంటుం ది అని ఆయన భావన. శరీరాన్ని థర్డ్‌ పర్సన్‌గా చూడాలని ఆయన అభిప్రాయం. పుచ్చలపల్లి సుందరయ్య ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే నీ శరీరంపై హక్కు నీకు మాత్రమే ఉండదు అని తీర్మానం చేసి మరీ పార్టీ సంరక్షించేదని ఎవరో చెప్పారు. ఆ రకమైన పని ఎవరమూ చేయలేకపోయాం. ఇప్పుడు కుములుతున్నాం.
జి ఎస్‌ రామ్మోహన్‌
(2009 అక్టోబర్‌ 14న ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

మన చేతులు చిన్నవి



సమాజంలోని అధికార బృందాలు అపుడపుడు మనకు కొన్ని సంకేతాలు పంపుతుంటాయి. వాటిచేతులు ఎంత పొడవైనవో మన చేతులు ఎంత పొట్టివో తెలియజేస్తుంటాయి. ప్రగతిశీల సమాజం సంఘటితం కావాల్సిన అవసరాన్ని పరోక్షంగా గుర్తుచేస్తుంటాయి. అటువంటి ఒక ప్రమాదకర హెచ్చరికే తస్లీమాపై జరిగిన దాడి. దాడి సమయంలోనే ప్రెస్‌క్లబ్ ఎగ్లిక్యుటీవ్ కమిటి మీటింగు జరుగుతుండడం వల్ల పెద్ద ముప్పు తప్పింది. ఆ పాత్రికేయులంతా కలిసి మజ్లిస్ ఎమ్మెల్యేలను వారివెంట వచ్చిన వంది మాగధులను ప్రతిఘటించి హైదరాబాద్ కు ఘోర అవమానాన్ని తప్పించారు. వారంతా లేకపోయి ఉంటే మజ్లిస్ మూక అక్కడ ఏమేం చేసి ఉండేదో ఊహించడమే కష్టం.
తస్లీమా వంటి పేరు పొందిన రచయిత్రి సమావేశాన్ని రహస్యంగా నిర్వహించాలనుకోవడమే నిర్వాహకుల వ్యూహాత్మక తప్పిదం. వివాదాలను నివారించాలనే ఉద్దేశ్యంతోనే వారలా చేసి ఉండొచ్చు. అయితే అంచనాలకు సంబంధించి ఇందులో రెండు పొరబాట్లున్నాయి. మొదటిది ప్రగతిశీల సమాజానికి- ప్రభుత్వానికి సంబంధించింది. ప్రగతిశీల సమాజం చిన్నదే కానీ మరీ నిర్వాహకులు ఊహించినంత బలహీనమైనది కాదు. సభగురించి బహిరంగంగా ప్రకటించి ఉంటే వివిధ ప్రజాస్వామిక సమూహాలనుంచి  జనం సంఘీభావంగా నిలిచేవారు. పోలీసులు కూడా కచ్చితంగా సభకు రక్షణగా వచ్చి ఉండేవారు. బహిరంగంగా ప్రకటించాక అది వారికి అనివార్యమవుతుంది. ఇక్కడొక ఉదాహరణ చెప్పుకుందాం. కశ్మీర్‌కు స్వాతంత్య్రం కోరుతున్న యాసిన్ మాలిక్, అబ్దుల్ ఘనీ లోన్లను పిలిచి సందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ నిర్వహించగలిగాం. వారు హిందూ అతివాదులకు, ప్రభుత్వానికి శత్రువులు. వారికి మాత్రమే కాదు,  కశ్మీర్ అనే అందాల ఆస్తికి యజమానులం అని భావిస్తూ ఉంటుంది కాబట్టి మెజారిటీ మధ్యతరగతికి కూడా ప్రత్యర్థులే. అయినప్పటికీ సభ విజయవంతంగా నిర్వహించగలిగాం. సంఘపరివారం బయట కాసింత సందడి చేయగలిగింది కానీ అంతకు మించి ఏమీ కాలేదు. పోలీసులు భారీ స్థాయిలో మోహరించక తప్పలేదు. ప్రజాస్వామిక ముఖాన్ని చూపించుకోవడానికి వారికది అవసరం. ఇదంతా ఎందుకంటే సభను బహిరంగంగా ప్రకటించి నిర్వహిస్తే ముప్పును ఎదుర్కోవడానికి జాగ్రత్తలేవో తీసుకుంటాం కదా! కనీసం సాహిత్యాభిమానులకు, రచయితలకు కూడా తెలీకుండా  అండర్‌గ్రౌండ్ సాహిత్య సభ నిర్వహిస్తే ఎలా?
ఇక అంచనాకు సంబంధించిన రెండో తప్పిదం పాత్రికేయులకు సంబంధించింది. సభ రహస్యంగా నిర్వహించిందే కొంతమందికి తెలియకుండా ఉండాలనే లక్ష్యంతో. కానీ ప్రెస్‌క్లబ్‌లో సభ నిర్వహించి పాత్రికేయులను పిలిచాక అది ఎవరికి తెలియకూడదనుకున్నామో వారికి తెలియకుండా ఎలా ఉంటుంది? జర్నలిస్టుల్లో ఇన్నయ్య వంటి హేతువాదులున్నట్టే బుఖారి వంటి, తొగాడియా వంటి మత ఛాందసులుంటారు కదా! పాత్రికేయులనగానే వారంతా ప్రజాస్వామిక మంద అనుకునే అపోహనుంచి ఇప్పటికైనా బయటపడాలి. పాతతరంలో కనీసం అలా అనుకోవడానికి ఏ కొంచెమైనా ఆస్కారముందేమో కానీ ఇవాళ ఎవరు ఏ ఎమ్మెల్యే మూతులు నాకేవాడో, ఎవరు ఏ ఛాందసుడి అనుచరులో చెప్పడం కష్టం. మిగిలిన అన్నిరంగాల్లో మంచి చెడులున్నట్టే ఇక్కడా ఉంటాయి.
బహిరంగంగా ప్రకటించి నిర్వహిస్తే సాధ్యమయ్యేది అనే నమ్మకం ఉన్నప్పుడు మన చేతులు చిన్నవి అనే అంచనా ఏమిటి అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. విషయమేమంటే దాడులు చేస్తే తమ ఎమ్మెల్యే సీట్లు  గల్లంతవుతాయనో, తాము వెళ్లిన చోటల్లా నిరసన ఎదురవుందనో అనిపిస్తే ఆ ముగ్గురు  ఎమ్మెల్మేలు ఇంత తెగించేవారు కాదు. కెమెరాల ఎదరుగ్గా బండబూతులు తిడుతూ చేతికి అందిన వస్తువులతో దాడి చేశారంటే తమకు ఎదురులేదనే నమ్మకమేదో వారికి ఉంది. వారిపైన వారికంత నమ్మకం ఉండడమే మన బలహీనతకు చిహ్నం. ఆ ఘటన జరిగింతర్వాత మజ్లిస్ అగ్రనేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటన సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. ఈ సారి తస్లీమా హైదరాబాద్ వస్తే తల తీసేస్తామని ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఇంత భయంకర నేరానికి పాల్పడినా ఇప్పటికీ వారి బహిష్కారానికి బలంగా ఒత్తిడి తేలేకపోయాం. కనీసం బలమైన నిరసన ప్రదర్శన కూడా నిర్వహించలేకపోయాం.
ఘటన తర్వాత రచయితలు, కళాకారులు, మేధావుల సమావేశమొకటి జనవిజ్ఞాన వేదిక వారి కార్యాయలంలో జరిగింది. దాదాపు అరవై డెభ్భై మంది ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఆరేగుడుగురు ప్రజా సంఘాల కార్యకర్తలు, నలుగురైదుగురు రచయితలు తప్ప మిగిలిన వారందరూ ఎన్జీవోల ప్రతినిధులే.తప్పుకాదు. ఎన్జీవోలు ఒక ప్రజాస్వామిక అంశంపై కదిలిరావడం తప్పుకాదు. వారికా హక్కులేదని చెప్పబోవడం లేదు. కాకపోతే ప్రభుత్వం అన్ని రంగాలను ఎన్జీవోల పరం చేస్తున్నట్టే ప్రజాతంత్ర సంస్థలు కూడా ఇలాంటి అంశాలను ఎన్జీవోలకు వదిలేసే దశ వచ్చేస్తున్నదా అనే సందేహం కలుగుతున్నది. ఆనంద్ సినిమాలో అత్తగారి పాత్ర ధరించిన నటి, ధర్డ్‌పేజీ సెలబ్రిటీ సర్కిల్స్‌లో ప్రజాస్వామిక వాదిగా గుర్తింపు పొందుతున్న చందనా చక్రవర్తి ఇందులో ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. కొందరు తస్లీమాకు శాశ్వత వారసత్వం గురించే మాట్లాడారు. ఆరోజు వేదిక మీద ఉన్న సహ ఉపన్యాసకులు కొందరు దాడి సమయంలో అడ్రస్ లేకుండా పోయారని వారు వేదికమీదే ఉండి ఉంటే కొంతైనా బాగుండేదని మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఇన్నయ్య తప్ప మిగిలిన వారు మంత్రమేసినట్టే వేదిక నుంచి అదృశ్యమయ్యారనే అభిప్రాయాలు వారు వ్యక్తం చేశారు. ఇంకొందరు మళ్లీ తస్లీమాను పిలిచి భారీ స్థాయిలో బహిరంగసభ నిర్వహించాలని సూచించారు. అయితే రచయితలు స్కైబాబా, షాజహానా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దీనివల్ల పెద్ద గొడవ జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఛాందసుల కన్నెర్రకు గురవుతున్న తాము మరింత ఎక్స్‌పోజ్ అవుతామని ఈ దశలో ఇది సరైన చర్య కాబోదని వారన్నారు. ఇంకొంతమంది వారి ఆందోళనను పంచుకున్నారు. చాలామంది తస్లీమా రచనలను పొగిడే పనిలో పడ్డారు. మహా రచయిత్రి, మనందరకూ  ఆదర్శం, అందరం ఆవిడ బాటలో నడవాలి వంటి పదాలు చాలా దొర్లాయి. ఆవిడ రచనల మీద ఎవరికుండే అభిప్రాయాలు వారికుంటాయి కాబట్టి వాటి ప్రస్తావన మానేసి దాడిలో ఉన్న అప్రజాస్వామికత గురించి, ఇకపై ఇలాంటివి జరక్కుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చ పరిమితమైతే బాగుండేది. ఎందుకంటే రచనల బాగోగుల్లోకి వెళ్లడం ఇబ్బందికరం. రచనా సామర్థ్యం పరంగా తస్లీమా సి గ్రేడ్ రచయిత్రి అనుకునే వాళ్లం కూడా ఉండొచ్చు కదా! పైపెచ్చు ఆమె మహా రచయిత్రి కాబట్టి మనం సంఘటితంగా నిలవడం లేదు. మామూలు రచయిత్రి అయినా వ్యక్తీకరణ హక్కు మామూలుగానే ఉంటుంది. మహా రచయితలకు మాత్రమే ప్రజాస్వామిక మద్దతు పరిమితం కాదు. కాకూడదు. 
ఇంత చరిత్ర ఉన్న హైదరాబాద్లో ఒక సహ రచయితపై దుర్మార్గంగా దాడి జరిగితే ప్రజాతంత్ర శిబిరం నుంచి వచ్చిన స్పందన నామమాత్రంగా ఉందనే అభిప్రాయం అక్కడక్కడా వ్యక్తమైంది. స్పందన లోపం కేవలం బలహీనత కాదు. కొంత ఉపేక్ష కూడా ఉండొచ్చు. సాధారణంగా ఏమి జరుగుతుంది? ఏదో ఒక శిబిరం బాధ్యతను భుజానవేసుకుని మిగిలిన శిబిరాలతో సంప్రతింపులు జరిపి ఐక్యవేదిక అనే పేర కార్యక్రమం నిర్వహిస్తుంది. బాధ్యత తీసుకున్న శిబిరానికి చెందిన వారు ముప్పాతిక భాగం మిగిలిన వారంతా కలిపి పాతిక శాతం అందులో పాల్గొంటారు. హైదరాబాద్లో సాహిత్య కార్యక్రమాలను దగ్గరినుంచి చూసిన వారందరికీ పరిచితమైన విషయమే ఇది. కానీ తస్లీమాపై జరిగిన దాడిని ఏ శిబిరమూ అంత సీరియెస్‌గా తీసుకున్న దాఖలాలు లేవు.
బహుశా దాడికి స్పందన తీవ్రంగా లేకపోవడానికి రెండు కారణాలు. ఒకటి దాడికి గురైన వ్యక్తితో రిలేట్ చేసుకునేంత భావజాల పరమైన బంధం కానీ ప్రత్యక్ష సంబంధం కానీ లేకపోవడం. విస్తృతార్థంలో స్థానికీయత. రెండోది ఆమె రచనలపై ప్రజాతంత్ర శిబిరంలో అంతగా గౌరవం లేకపోవడం. దాడి చేసిన వారు ముస్లిం ఛాందసులు కావడమే కారణమనే ఆరోపణ కూడా ఉంది కానీ అది పూర్తిగా సత్యం కాదు. కాకపోతే అటువంటి ఇబ్బందికి సంబంధించిన ఛాయ ఒకటి ఉన్న మాటైతే కొంతవరకూ వాస్తవమే. సంపదలో, వనరుల్లో వాటాకు నోచుకోక ఘెట్టోప్రపంచంలో బతుకులీడుస్తూ అణచివేతకు దోపిడీకి గురవుతున్న ముస్లింల పట్ల ఉండాల్సిన సంఘీభావానికి, వారిలోని ఛాందస మూకల పట్ల అవలంబించాల్సిన వైఖరికి మధ్య ఇంకొంత స్పష్టత అయితే రావాల్సే ఉంది.
ప్రెస్‌క్లబ్‌ల దగ్గర దాడులు చేస్తే సులభంగా ప్రచారం పొందవచ్చుననేది ఎత్తుగడగా మారుతున్నది. ఇది సీరియెస్‌గా పట్టించుకోవాల్సిన అంశం. ఇటీవలి ఘటనలే తీసుకుంటే మధుయాష్కీ వ్యవహారంలో రాజగోపాల్ పై దాడి ప్రెస్‌క్లబ్‌లోనే కెమెరాల సాక్షిగా జరిగింది. ఛానళ్లు దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగలిగాయి. తర్వాత తస్లీమా వ్యవహారం. తాజాగా గోనె ప్రకాశరావుపై దాడి. రాజగోపాల్, గోనెలపై జరిగిన దాడుల మంచి చెడ్డల్లోకి వెళ్లబోవడం లేదు. ప్రెస్‌క్లబ్‌లపై దాడి ప్రచార వ్యూహంగా మారడంలోని ప్రమాదం గురించే పరిమితమవుదాం. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో జరిగిన ప్రహసనం గుర్తొస్తుంది. ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం చాలామంది సులభమైన ప్రక్రియను ఎంచుకున్నారు. పదిమందిని పోగుచేయడం వారిలో ఒకరికి కిరోసిన్ డబ్బా, అగ్గిపెట్టె ఇవ్వడం, టీవీ కెమెరాలకు కబురంపడం..ఇదీ తంతు. వారక్కడ వీరంగం చేయుట, తమ నేతకు టిక్కెట్ ఇవ్వకపోతే ఆత్మాహుతికి పాల్పడతామంటున్న అభిమానులంటూ వార్తలు ప్రసారమగుట తదుపరి తతంగం. కొందరైతే అన్ని చానళ్ల కెమెరాపర్సన్లు వచ్చారో లేదో వాకబు చేసి మరీ ప్రహసనం మొదలెట్టేవారు. చచ్చీ చెడీ ఒక్కడన్నా కాల్చుకు చస్తాడేమే అని ఎదురుచూస్తామా! అలాంటిదేమీ జరగదు. ఇదంతా కెమెరోమానియా. ఇపుడు ప్రెస్‌క్లబ్‌లపై దాడులు కూడా అలానే మారుతున్నాయి. జర్నలిజాన్ని ప్రహసనంగా మార్చే ఇలాంటి తంతు పట్ల పాత్రికేయులు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంటుంది.
మళ్లీ తస్లీమా దగ్గరికే వస్తే దాడిచేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు వారి నాయకుడైన యువసుల్తానుల వారు బోరవిరుచుకుని దర్జాగా ప్రకటనలిచ్చుకుంటూ తిరుగుతున్నారు. వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ వారితో పొత్తు పెట్టుకోబోతున్నది కాబట్టి వారిపై గట్టి చర్యలు తీసుకునే అవకాశాల్లేవు. కన్నబీరన్ వంటి వారు కేసు దాఖలు చేశారు. గూండాలపై చర్య తీసుకోకుండా ఉన్నందుకు పాలకులు కొంచెమైనా నీళ్లు నమిలేట్టు, ఇబ్బంది పడేట్టు చేయగలమా?
జి ఎస్‌ రామ్మోహన్‌
(pranahita.org సెప్టెంబర్‌ 2007 సంచికలో ప్రచురితమైన వ్యాసం)

Friday, 9 December 2011

వై దిస్‌ కొలవెర్రి?


రేజ్‌, ఫీవర్‌, మానియా, ఫ్రెంజీ, ఎన్నైనా చెప్పుకోవచ్చు. రిపిటీషన్‌లో తప్పేమీ లేదు. కొంచెం రిథమిక్‌గా ఉండేట్టు చూసుకోవాలి, అంతే. ఇంకొంచెం ఇంగ్లిష్‌ తెలిస్తే ఇంకొన్ని విశేషణాలు జోడించుకోవచ్చు. విశేషణమే విశేషం. క్రియ కంటే విశేషణము ప్రాబల్యం సంతరించుకొనుట ఆధునిక యుగధర్మము. ఇంతకీ ఏమిటీ కొలవెర్రి? ఈ వెర్రి  ఇరవై యేళ్ల క్రితమే  మొదలైంది. దాని ఫలితాలను ఇపుడు రకరకాల రూపాల్లో చూస్తున్నాం. ఒక సన్నీలియోన్‌, ఒక కొలవెర్రి, ఒక ఎంటివీ రౌడీస్‌. ఒక బిగ్‌బాస్‌.. ఇలా అనేక రూపాల్లో అది వ్యక్తమవుతోంది. లోపలున్నదానికంటే పైన కనిపించేదే ముఖ్యమైపోయిన పరిణమానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. దేశం మొత్తం ఊగిపోతోందని యువతకిది మరో జాతీయగీతంగా మారిందని 25 యేళ్లకంటే తక్కువవయస్సున్న ప్రతివారికీ ఈ పాటమీద ఏదో ఒక అభిప్రాయం ఉందని ఇంటర్‌నెట్‌లో రాసేస్తున్నారు. ఏ దేశం, ఏయువత అని అడగడం చాదస్తమనిపించుకుంటుంది. కడుపునకు టీవీ తింటున్నామా...ఇంకేమైనానా! టీవీ ఇంటర్‌నెట్ మయసభ లాంటివి. సత్యాసత్య నిర్ధరణ దుర్లభం. తిండితిప్పలు లాగే సత్యం కూడా సమూహాన్ని బట్టి మారుతూ ఉంటుంది. చాలా సత్యాలు క్లాస్‌బేసుడే.(.ఏమనుకోకండి....ఇదొక కొలవెర్రి) ఇపుడూ ఏ చానల్‌ చూసినా ఎపుడూ ఏదో ఒక యాడ్‌ వస్తూ ఉంటుంది. ఏవో కార్యక్రమాలు అవీ నడుస్తూ ఉంటాయి బెల్లీ గురించి. ఏ వెబ్‌సైట్లోకి వెళ్లినా టెన్‌ థింగ్స్‌ టు ఫ్లాట్‌ యువర్‌ టమ్మీ లాంటి వేవో కనిపిస్తాయి. ఒకటే సబ్జెక్ట్‌ మీద ప్రతిరోజూ వైవిధ్యభరితమైన పరిష్కారాలను సూచిస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఒబేసిటీ అనేది ఈ దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అనిపిస్తుంది. అది ఎంత మంది సమస్య, ఎవరి సమస్య అని ప్రశ్నించి ప్రయోజనము లేదు. గ్యాస్‌ బండ ధర పెరిగినపుడు చేసినంత హడావుడి ఎరువుల ధరలు పెరిగినపుడో చిలప నూలు ధరలు పెరిగినపుడో చేయం కదా! వారు ఇంటర్‌నెట్‌కి కానీ టీవీకి కానీ ప్రధానమైన కన్సూమర్స్‌ కాదు. 
            మళ్లీ మొదటికొద్దాం. కొలవెర్రి ఎలా మొదలైంది? ఆదియందు పివి నరసింహారావు ఉండెను. ఆతను ప్రధానియై ఉండెను. యాతండు భారత్‌నుంచి ఇండియాను వెలికితీసెను. ఈ బైబిల్‌ కథ చాలామంది చాలాసార్లు చెప్పారు...ఆ బట్టతలకు ఈ మోకాటికి సంబంధమేమి అని అడుగవచ్చును. ఉన్నది. ఇంటర్నలైజేషన్‌ అనేది భారతీయసమాజపు ధర్మం. బానిసత్వాన్ని ధర్మం రూపంలో రక్తం లోకి ఇంకించుకున్న సమాజం మనది. దక్షిణాఫ్రికా తెల్లోళ్ల పాలనలో ఉన్నపుడు కూడా నల్లోళ్లు ఇలా పడి ఉండడం మన ధర్మం అనుకోలేదు. అవతలివాడు బలవంతుడు కాబట్టి పడిఉంటున్నాం  అనుకున్నారు. చీమలన్నీ ఒక్కటై బలపడిన నాడు పామును లొంగదీసుకుని పాలకులయ్యాయి. కానీ భర్త పాదపూజ చేసుకోవడం, పసుపు తాడును పలుపుతాడు ప్రమాణంలో బలపడేందుకు పూజలు వగైరా చేయడం మన బలహీనత అనుకోం. ధర్మం అనుకుంటాం. ఇది తూరుపు సమాజాల్లో చాలావాటిలో కనిపించొచ్చు. కానీ అగ్రవర్ణ సేవకే మనల్ని దేవుడు పుట్టించాడు అనేది మాత్రం మన ఓన్‌ ఇన్‌వెన్షన్‌. టోటల్లీ ఇండిజీనస్‌. ఇపుడూ మంగళూరు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బ్రాహ్మణులు తిని వదిలేసిన ఇస్తరాకులపై  పొర్లు దండాలు పెట్టే ఆనవాయితీని ప్రశ్నించిన వారికేమైంది? మార్కండేయ ఖడ్జు లాగా ఐరోపా చరిత్ర సాహిత్యం చదువుకున్న చాదస్తులు కొందరు అడ్డుపడ్డారు. ఏమైంది? తరిమి తరిమి కొట్టారు. కులబానిసత్వం అనే ధర్మసంరక్షణ మా జన్మహక్కని చాటారు.  మేం అభౌతికమైన ధర్మం కోసం ప్రయత్నిస్తుంటే మీరు భౌతిక వాదనలతో అడ్డుపడతారా అని ఆగ్రహం ప్రదర్శించారు. కాకపోతే దాన్ని భౌతిక రూపంలో ప్రదర్శించారు. మతమూ, కులమూ, వగైరా పవిత్ర విలువలను కాపాడుకోవాలనుకునే వారి ఆగ్రహం తరచూ భౌతిక రూపంలోనే వ్యక్తమవుతూ ఉంటుంది. సూత్రరీత్యా చెప్పుకుంటే వారు కాన్పెప్టుయల్‌గా అభౌతికవాదులు అయినప్పటికీ ప్రాక్టికల్‌గా పరమ భౌతికవాదులన్నమాట. మన భక్తిలో ఉండే తమాషా అది. ధింగ్‌ అబౌ గ్లోబల్లీ. యాక్ట్‌ లోకల్లీ.  ఇక్కడ విశేషమేమంటే మాకు మేము అగ్రవర్ణాలు విసరేసిన ఇస్తళ్లమీద దొర్లుతూ దండాలు పెడతాం మీకేంటి బాధ అని 'దిగువ' కులాలు తమకు తాము అసర్ట్‌ చేసుకోవడం, అడ్డుకున్నవారిపై దాడిచేయడం. దటీజ్‌ ఇండియా. ఇది హైటెక్‌ యుగమా, అత్యాధునిక యుగమా, కంప్యూటర్‌ యుగమా అని మళ్లీ విశేషణాలతో విరుచుకుపడనక్కర్లేదు. దిసీజ్‌ ఇండియా. 90ల్లో మన సమాజంలో కొత్త నమూనా అడుగుపెడుతున్నపుడు ఈ లాజిక్‌ను పూర్తిగా ఉపయోగించుకుంది. మందు, పేకాట అడిక్షన్స్‌ అని ఓ చర్చిస్తారు కానీ డబ్బుతో పులిసినోడికి, 'పై'కులపోడికి గులాంగిరీ చేయడమనేది అన్నింటికన్నా అతి పెద్ద అడిక్షన్‌. తెల్లోడి ప్రతి ఉత్పత్తి నాగరికత రూపంలో స్టెయిల్‌ రూపంలో ప్రవేశించాయి మనం దేనికైనా సులభంగా బానిసలు కాగలమని అడిక్షన్‌ అనేది మన జాతి ధర్మమని గుర్తించారువారు. ఇపుడూ పెప్సీ కోలాలు రుచికరంగా ఉంటాయని తాగుతున్నామా, రుచి మర్చిపోలేక పిజా వెంట పడుతున్నామా!  ఈ రుచి, అందం లాంటి పదాలున్నాయే అవి ప్రమాదకరమైనవి. పైవాడు అంటే మనకంటే  ఆర్థికంగా పైనున్నవాడు ఏది రుచి అని చెపితే అది మనకు కూడా రుచికరంగా అనిపించాలి. ఏది నాగరికత అని చెపితే మనం కూడా నాగరికత అనేసుకోవాలి. వాడు పాస్తా యమ్మీ యమ్మీ అంటే వాలమ్మో వాలమ్మో ఎంత బాగా చెప్పారు, రుచి అంటే పాస్తాదే సుమండీ అనేయాలి. వాడు రష్యన్‌ సలాడ్‌ అంటే మనం కూడా టమోటా కీర ముక్కలను విసిరేసి వన్‌ రష్యన్‌ సలాడ్‌ ప్లీజ్‌ అనేయాలి. ఏతా వాతా చెప్పొచ్చేదేమిటయ్యా అంటే బాగుండడం అనేది కూడా అనుకరణే. శుధ్ధభౌతికం కాదు. సూత్రం అంటారా అయితే నూతన అభివృద్ధి నమూనా రుచి వంటి పచ్చి భౌతికమైన విషయాన్ని కూడా ఒక కాన్సెప్ట్‌గా మార్చింది అని చెప్పుకోవచ్చు.  వస్తాద్‌ గారూ ఉప్పుతో పళ్లుతోముతున్నారా...ఇదిగో మాపేస్ట్‌ వాడండి అన్నవాడే పదిహేనేళ్ల తర్వాత మీ పేస్ట్‌లో ఉప్పులేదా అయితే మా పేస్ట్‌ వాడండి అనడం లేదూ! మార్కెట్‌ మన రుచులను మన వస్త్రధారణను మన వాహనాలను నిర్ణయిస్తుంది. ఈ బాటిల్‌ ఇలా పట్టుకుని అమ్మాయితోనో అబ్బాయితోనో మాట్లాడుతూ ఉండకపోతే నువ్వు సోషల్‌ బీయింగ్‌వి కాకుండా పోతావు. అన్‌ సోషల్‌ ఎలిమెంట్‌ అయిపోతావు. పిజా హట్లో ఫోర్కులతో కుస్తీపడుతూ తిప్పలు పడకపోతే కూడా అంతే. 
          వై ఓన్లీ కొలవెర్రి? సన్నీ లియోన్‌ అనబడే పోర్న్‌ స్టార్‌ బిగ్‌బాస్‌ షోలోకి పెద్ద శబ్దముతోనూ మిరుమిట్లు గొలుపు కాంతులతోనూ ప్రవేశించుచున్న సమయంలోనే కింగ్‌ ఫిషర్‌ షోలో ఉండీ లేనట్టున్న బట్టల్లో పురుషుడిని ఎలా సెడ్యూస్‌ చేయాలి అని ఎపిసోడ్‌ ప్రదర్శించారు. ఇవేవీ విడివిడి విషయాలు కావు. రాబోయే కాలానికి సూచికలు. ఆఫ్టర్‌ దట్‌ సన్నీ మార్నింగ్‌ పోర్నో వ్యూయర్‌ షిప్‌ ఎంత పెరిగిందో లెక్కేయాల్సి ఉంది. కనీసం సన్నీ లియోన్‌ పేరు టైప్‌ చేసి ఆమె వెబ్‌సైట్లోకి ఎన్ని లక్షల మంది వెళ్లారో చూడాలి. ఆమె సైట్లో అడుగుపెడితే యోగి వేమనకు ఆయన వదిన మహాదర్శనం చేసిన రీతిలో జ్ఞానోదయమవుతుందన్నమాట. పోర్నో అనేది ఇంతవరకూ ఎవరూ చూడకుండా ఇంటర్‌నెట్‌ కేఫుల్లోనో, ఇంట్లో పెద్దవాళ్లు లేనపుడో చూసే వ్యవహారంలాగా ఉండేది. ఒక పోర్నో స్టార్‌ను కార్యక్రమంలో భాగం చేయడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టింది ఇండియన్‌ టీవీ ఇండస్ర్టీ.. పోర్నో అనే పదం చుట్టూ ఉన్న గిల్ట్‌ భావన పోగొట్టి దానికి లెజ్టిమసీ సాధించే పనిలో ఒకింత ముందంజ వేయగలిగింది. దేశంలో పోర్నో అధికారిక ప్రవేశానికి తొలి అడుగు వేయగలిగింది. పనిలో పనిగా పోర్నో మార్కెట్‌ను పెంచడం ఎలాగూ ఉంది. ఏదీ నేరుగా రాకపోవడమే ఆధునిక మార్కెట్‌ వైచిత్రి. పదాలకు కొత్త అర్థాలు కల్పించడం కవిత్వపు లక్షణంగా చెపుతారు. అభాస కూడా కవుల జాబితాలో వేస్తారు. ఊరికే కవులను ఆడిపోసుకుంటారు కానీ అందులో మార్కెట్‌ వారి తాత. వన్‌ బాలీవుడ్ యాక్టర్‌ యు వాంట్‌ టు డర్టీ విత్‌ అని టీవీ విలేఖరి విద్యాబాలన్‌ను అడగాలి. ఎ సర్టెన్‌ ఎస్‌ ఆర్‌ కె అని ఆమె చెప్పాలి. డర్టీ అనే ఇదక్షరాల పదం మరో నాలుగక్షరాల పదానికి కొత్త రూపం అని వీక్షకుడు అర్థం చేసుకోవాలి. తనను తాను ఎస్‌ఆర్కె ప్లేసులో ఊహించుకుని తన తృప్తేదో తాను పొందాలి. ఇదొక ఎత్తుగడ. ఇదొక బోల్డ్‌ మూవీ అనాలి. ఫలానా ఆమె ఫలానా ఆయన బోల్డ్‌గా నటించారు అనాలి. బోల్డ్‌ అనగా బట్టలు విప్పిన సీన్లు అని మార్కెట్‌ హృదయం. బోల్డ్‌ యాక్ట్‌, బోల్డ్‌ సీన్స్‌, బోల్డ్‌ టాక్‌, వగైరా దీని అనుబంధ పదాలు మార్కెట్‌ డిక్షనరీలో కనిపిస్తాయి.  బట్టలు విప్పడం బోల్డ్‌ అయితే విప్పకపోవడం ఏమవ్వాలి? తెరపై విప్పలేని వారు ఏమవ్వాలి? సాధారణంగా చాలామంది అశ్లీలమని, బూతు అని  చెప్పుకునే విషయాలకు బోల్డ్‌ను పర్యాయపదంగా మార్చి కొత్త అర్థాన్ని కల్పించడం కవులకు సాధ్యమా చెప్పండి? అభాస కవులకే సొంతమని ఇంకా చెపుతారా! 
                      వైదిస్‌ కొలవెర్రిలో కొత్తదనముంది. కొత్తదనం అనేది ఈ గడిచిన ఇరవై యేళ్లలో పాతపడిపోయిన మాట. కొత్తదనం ఎందుకోసం అని అడగకూడదు. సెంటర్‌ఫ్రెష్‌ యాడ్‌ లాగా అదొక అబ్సర్డ్‌ థింగ్. కొత్తదనం కోసమే కొత్తదనం. కాలర్‌ ఉన్నపుడు లేనిది కొత్తదనం. తొడలను కప్పేసే జీన్స్‌ బదులు అక్కడ బ్లేడుతో గీతలు పెట్టడం కొత్తదనం. జుట్టు దువ్వుకునే బదులు పైకి లేపుకునే స్పైక్స్‌ కొత్తదనం. పాట కూడా అంతే. మామూలుగా సెలయేరులాగా పాట ఉందనుకోండి. మధ్యలో నాలుగు నక్క ఊళలు పెడితే కొత్త దనం. 90లకు ముందు పాటలు సాహిత్య ప్రధానమైనవి. తర్వాత మ్యూజిక్‌ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇంటర్‌నెట్‌తో అన్ని దేశాల ట్యూన్స్‌ని ఇండియనైజ్‌ చేసే ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇవాళ సాహిత్యం అనేది మ్యూజిక్‌కి వెనకాతల వినిపించే కొన్ని ధ్వనులు మాత్రమే. అంతకంటే ప్రాధాన్యమేమీ లేదు. అందులో రిథమ్‌, బీట్‌ ముఖ్యం. ఆధునిక సాంకేతికాభివృద్ధి సింగర్‌కి మ్యుజీషియన్‌కు ఉన్న బంధాన్ని తెంపేసింది. ఒక సాలూరి, ఒక కృష్ణశాస్ర్తి కూర్చుని సార్‌ ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలా మారిస్తే ఎలా ఉంటుంది అని చర్చించుకునే వాతావరణం లేదు. జనం కాళ్లు చేతులు ఆడించగల శబ్దాలను సృష్టించగలిగిన మ్యుజీషియన్‌ కొన్ని ట్యూన్స్‌ ఇస్తారు. ఎవరో ఒక గీతకారుడు అందులో నాలుగు మాటల్నికూరుస్తారు. పాడువారు వారి సమయాల్లో విడివిడిగా వచ్చి ఎవరి ట్రాక్ వారు పాడిపోతారు. రూపం సారాన్ని ఆక్రమించడమంటే ఇదే. కాళ్లూ చేతులు ఆడాలే కానీ హృదయం ఊగనక్కర్లేదు. మనసున మల్లెలూగాల్సిన అవసరం నేడు అంతరించింది. ఏ దిల్‌ అభీ నహీ భరా అనడానికి దాని అవసరమెక్కడుంది? మార్కెట్‌ మన అవసరాలను కూడా టైలరింగ్‌ చేస్తుంది. కొత్త అవసరాలను సృష్టిస్తుంది. తన దారికి అడ్డుగా ఉన్న అవసరాలను డిలీట్‌ చేస్తుంది. కాళ్లూ చేతులు ఆడించగలగడం మాత్రం నైపుణ్యం కాదా? ఎందుకు కాదు వల్గర్లీ స్కిల్డ్‌.  కాకపోతే నైపుణ్యం ఫర్‌ వాట్‌?  మచ్చుకు ఒక ఇన్‌స్టంట్‌ లక్షణం సంగతే చూద్దాం. ఇవాల్టి పాటలు నాలుగు కాలాల పాటు నిలవడం లేదు అని వినిపిస్తూ ఉంటుంది కదా, ఎందుకు నిలవడం లేదు?  నిలవాలని వారు కోరుకోవడం లేదు. మార్కెట్‌కు ఆ అవసరం లేదు. ఆ టైంలో నాలుగు కాసులు రాలాలి.  ఆ వారంలో అది గోల్డో ప్లాటినమో ఏదో ఒక డిస్క్‌ అనిపించుకోవాలి. అంతే. సినిమా వందరోజులు ఆడాలని మూడొందల అరవై రోజుల రికార్డు సృష్టించాలని అనుకునే వెర్రిబాగుల వాళ్లెవరైనా ఉన్నారా....మొదటివారంలో ఎంత కలెక్షన్‌ వచ్చిందనేదే ముఖ్యం. కాబట్టి అంతిమంగా ఆ రంగంలో విలువలను నిర్దేశించేది మార్కెట్టే. పాడుతా తీయగా, సరిగమప లాంటి కార్యక్రమాల్లో ఎందుకు పాతగీతాలే వినిపిస్తాయి? అవి మాత్రమే గుర్తుంచుకోవడానికి అనువుగా ఉంటాయి కనుక. కొత్త పాటల్లో గుర్తుంచుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. దాన్ని మించి మ్యూజిక్‌ ట్రూప్‌ పూర్తి స్థాయిలో లేకపోతే పాట అస్సలు వినలేం. అన్యాయంగా ఉంటుంది.  ఎందుకంటే దాని ప్రాణం అందులోనే ఉంది కనుక. మున్నీ బద్నామ్‌ హుయీ ఎందుకంత హిట్‌ అయ్యింది. రిథమ్‌.  కొలవెర్రి పాట పాపులారిటీ వెనుక ఇంత కథ ఉంది. దీనికి తోడు ఇంటర్‌నెట్‌, మొబైల్‌ చాటింగుల్లో వాడే కత్తిరించిన ఇంగ్లిష్,. స్థానిక భాషతో కలగలిపిన ఇంగ్లిష్‌ వాడడం మరో తెలివైన ఎత్తుగడ. అందులోనూ అటు రజనీ అల్లుడు పాడాడు. ఇటు కమల్‌ హాసన్‌ కూతురూ ఓ చేయేసింది. వారిద్దరూ తమిళనాట డెమీ గాడ్స్‌ అన్నదాంట్లో కొత్తదనమేమీ లేదు కాబట్టి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. డెడ్లీకాంబినేషన్‌. దటీజ్‌ది స్టోరీ ఆఫ్‌ కొలవెర్రి. ఈ వెర్రి ఈ పూటది కాదు. ఈ పాటను ఇంత ఇన్‌స్టాంట్‌ హిట్‌ చేయడం వెనక పివి నరసింహారావు దగ్గర్నుంచి నాటి విజె మలైకా ఆరోరా దగ్గర్నుంచి సన్నీ లియోన్‌, చంద్రబాబు దాకా చాలా మంది కృషి ఉంది. న్యాయంగా అయితే ధనుష్‌ వారందరికీ రాయల్టీ చెల్లించాలి. ఈ వెర్రిలో సమాజానికి ఉపయోగపడేదికానీ మరీ దిగజార్చేది కానీ దానికదిగా ఏమీ లేదు కానీ మీడియా దీని వెంట పడడం వెనుక మార్కెట్‌ ఉంది. మీడియా అనే భూతానికి నిరంతరం ఏదో ఒక ఈవెంట్‌ కావాలి. లేకపోతే వాటి ఈవెంట్స్‌ని అవే క్రియేట్‌ చేసుకుంటాయి. ఇంకా వైదిస్‌ కొలవెర్రి అని అడగాలా!
జి ఎస్‌ రామ్మోహన్‌
(2011 డిసెంబర్‌ 6న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం)

చిల్లర దేవుళ్లు..




మీడియాలో భక్తి ఇపుడో హాట్ టాపిక్. మంచి బాబాలు చెడ్డ బాబాల చర్చ తీవ్రం గా జరుగుతోంది. భక్తుడికి భగవంతుడికి మధ్య పుట్టుకొచ్చిన ఈ దళారులను అర్థం చేసుకోవడాలంటే 90ల తర్వాత ఉత్పత్తిదారుడి కంటే మేనేజర్లకు, దళార్లకు పెరిగిన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 90ల్లో పెరిగిన కొత్త తరగతి తమకు అవసరమైన స్కూళ్లు, ఆస్పత్రులు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, పబ్బులు, క్లబ్బులను సృష్టించుకున్నట్టే భక్తిలోనూ తనకవసరమైన దేవుళ్లను- చిల్లర దేవుళ్లను సృష్టించుకుంది. 90ల తర్వాత మనల్ని తీర్చిదిద్దే వేదికలు, తీరిక సమయాలను గడిపే వేదికలన్నీ వర్గాలవారీగా విడిపోయిన విషయం జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. 

ఎవరి తాహతును బట్టి వారికి స్కూళ్లు, ఆస్పత్రులు, రెస్టారెంట్లు.. అన్నీ. వీటన్నింటితో పాటే దేవాలయాలు కూడా. 90లకు ముందు కూడా దేశంలో స్వాములోర్లున్నారు. అక్కడా ఇక్కడా బాబాలున్నారు. కానీ రజనీష్, చంద్రస్వామి లాంటి వేళ్లమీద లెక్కపెట్టగలిగినవారు తప్ప మిగిలినవారందరూ మామూలు స్వాములు. తాయెత్తులు, పసుపు-కుంకుమలు, నిమ్మకాయల బాపతు. పిల్లలు లేనివారికి, రోగాలు నయం కానివారికి ఉద్యోగాలు రానివారికి లాస్ట్ రిసార్టుగా స్వాములోర్లు ఉండేవారు. 

అది ప్రధానంగా మధ్యతరగతి వ్యవహారం కాదు. 

బాగా పైవారికి రజనీష్, చంద్రస్వామి లాంటివారుండేవారు. కింది తరగతికి ఊరికొక తాయెత్తుస్వాములోరు ఉండేవారు. 80ల్లో చాపకింద నీరులా మొదలై 90ల్లో విశ్వరూపం చూపిన వినియోగ ఆధారిత అభివృద్ధి నమూనా మన భావజాలంలో కూడా భయానకమైన మార్పును తీసుకువచ్చింది. అన్నిరంగాల్లో మధ్య దళారీలు విపరీతంగా బలపడ్డారు. భక్తిలో కూడా. భక్తి అతిపెద్ద కమోడిటీగా మారింది.

భారతీయ వాత్సాయనం, యోగా, భక్తి మార్గం విదేశాలకు ఎగుమతి అయిన పెద్ద మార్కెట్ సాధనాలు. వాస్తవానికి ఇటీవల ప్రదర్శన రూపంలో పెరిగిన యోగా-భక్తి-సెక్స్ మూడింటికీ అవినాభావ సంబంధం ఉంది.

పెరిగిన మధ్యతరగతికి పాత సాధనా లు సరిపోవు. పాత అలవాట్లు సరిపోవు. విశ్వాసానికి కొంత లాజిక్ జోడిస్తే కానీ దానికి తృప్తి ఉండదు. బలులు, నెత్తురు, కుంకుమ-పసుపు-నిమ్మకాయల వంటివి మరీ నాటుగా, మూర్ఖంగా తోస్తాయి. భక్తికోసమో ముక్తి కోసమో ఫలానా దగ్గరకు పోతున్నామని చెప్పుకోవడం మాత్ర మే సరిపోదు. ఆసుపత్రి కట్టించాడండి అనా లి. స్కూళ్లు పెట్టించాడండీ, పేదలకు సేవ చేశాడండీ అనాలి. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేం ద్రాలుగా ఉంటే సరిపోదు. మానసిక ఉల్లాసం ఇచ్చే రిక్రియేషన్ సెంటర్లుగా ఉండా లి. 

చలువరాతి మందిరమ్ములు కావాలి. భక్తి కేవలం పరం అయితే కుదరదు. ఇహపరములను లింక్ చేసి మాట్లాడేవారు కావాలి. మెటీరియలిస్టిక్‌గా ఉంటూనే శాంతినివ్వాలి. ఒక్కముక్కలో సుఖమూ శాంతి రెండూ కావాలి. శాంతికోసం సుఖం ఒదులుకొమ్మనే 'అభివృద్ధి నిరోధక' పాత నమూనా కొత్త మధ్యతరగతికి పడే వ్యవహారం కాదు. ఈ రెంటినీ సమన్వయం చేసి బోధించే ఉపన్యాసకులు కావాలి. 

ఇన్నర్ ఇంజినీరింగ్, కాస్మోరేస్ వంటి ఆంగ్ల పదాలను కలిపికొట్టగలిగినవారు కావాలి. గిల్ట్‌ను పోగొట్టుకోవడానికి ఆశ్రయించే దేవాలయాల బదులు గిల్ట్ అవసరం లేదు అనే బాబాలు కావాలి. శాంతి కోసం కోరికలను అదుపులో పెట్టుకోవాలనే బౌద్ధాన్ని ఏనాడో తరిమేశాం (వర్తమాన వినియోగ ఆధారిత అభివృద్ధి నమూనాకు అది పూర్తి వ్యతిరేకమైనది). చేయించడం అయినా చేయడమైనా అన్నింటికీ కారకుడను నేనే అనే గీతను ఆనాడే భారతంలో చేర్చాం. ఆనాడు బౌద్ధాన్ని తరిమి కొట్టడానికి రక్తపాతం అవసరమైంది. ఇవాళ ఆ అవసరం లేదు. టీవీ ఉంది. 

ఈ మధ్యనే దేశవ్యాప్తంగా ఉపన్యాసకళలో ఆరితేరిన బాబాలు, సుఖశాంతులను ఒకే పదబంధంగా బోధించగలిగిన బాబాలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చారు. ఇక్కడ కూడా ఆంగ్లం రావడం అదనపు అర్హత అయింది. చక్కటి ఆంగ్లం మాట్లాడే జగ్గీ వాసుదేవ్, రవిశంకర్ లాంటివారు బాబాల్లో క్రీమ్‌గా మారిపోయారు. భక్తి బోధనవల్ల ఒనగూరే సౌఖ్యాలతో తృప్తిపడి స్కూల్లో, ఆస్పత్రులో పెట్టుకుని ఆ రకంగా ప్రయాణం సాగించే బాబాలు కొందరైతే దీనివల్ల అధికారిక గణం తో ఏర్పడే పరిచయాలను బిజినెస్‌గా మార్చుకుని డబ్బుని రకరకాల రూపాల్లోకి మళ్లిస్తున్న బాబాలు మరికొందరు. రానురాను బాబా అనేవాడు సింగిల్ విండోగా తయారయ్యాడు. 

అతను కాంట్రాక్టులు ఇప్పించగలడు. సినిమా చాన్సులు ఇప్పించగలడు. మంత్రి పదవులు కూడా ఇప్పించగలడు. అందరూ అందుకే వెళతారని కాదు. ఫలానా ఫలానా పెద్దమనుషులే వెళ్లారు. ఏమీ లేకపోతే ఎందుకెళ్తారు అనేది గొర్రెదాటు తీరు. కోర్సు, కోడ్, డ్రెస్ అనేవి భక్తి కార్పోరేటీకరణలో కొత్తగా పాపులర్అయిన పదాలు. అయ్యప్ప వారసత్వంలో ఇపుడెన్ని దీక్షలు! ఎన్ని డ్రెస్సులు! కల్కి దీనికి భారీ ఫీజు కూడా చేర్చి పతాక స్థాయకి తీసికెళ్లాడు. భక్తి అనేది నిరంతర ప్రక్రియ స్థాయి నుంచి నిర్ణీత వ్యవధిలో చేసే కోర్సుగా మారిపోయింది. 

మొత్తంగా ఇవాళ బాబాయిజం ఒక పెద్ద ఇండస్ట్రీ. కొంతభాగం మాఫియా కూడా. మాఫియాలాగే ఇది రాబిన్‌హుడ్ ఇమేజినీ తొడుక్కోగలదు. హత్యలూ చేయించగలదు. సుఖం అనేదాన్ని వస్తువుల్లో వెతుక్కుంటూ వాటికోసం పరిగెట్టి పరిగెట్టి ఆ స్ట్రెస్ పోవడం కోసం బాబాల దగ్గరకు జిమ్‌లకు (ఆరోగ్యం కాదు, ఫిట్‌నెస్ కోసం) క్యూలు కట్టే మన మధ్యతరగతి మనస్తత్వం దీనికి ఇంధనం.

 పోయేది పెద్దగా లేనప్పుడు అందరూ చేస్తున్న దానికి భిన్నంగా ఎందుకుండాలి అనేదే భక్తి భావనలో మూలసూత్రం. బాబాయిజం దీని ఆధునిక రూపం. కాబట్టి అతనెవరో కాషాయం తొడుక్కుని రాసలీలలు చేస్తాడా, ఇతను ఆశ్రమం పేరుతో డ్రగ్స్ సప్లయ్ చేస్తాడా అని ఆవేశపడడంవల్ల ప్రయోజనం లేదు. దొరికితేనే దొంగబాబా. దొరికేంతవరకూ ఘరానా బాబానే! వీరి మూలం మన మధ్యతరగతి ఆలోచనా విధానంలో ఉంది. మన ఆశలో దురాశలో ఉంది. సారం కంటే రూపానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ఆధునిక విలువల చట్రంలో ఉంది.
- జిఎస్ రామ్మోహన్
(మార్చి 31, 2010న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వ్యాసం)

Monday, 24 October 2011


టీ వీ భాష-కొన్ని విషయాలు

టీవీల్లో వాడే భాష తెలుగులాగా లేదని, ఈ సంకరతనం చూడలేక చస్తున్నామని చాలామంది భాషాభిమానులు ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ చాన ళ్ళ సంగతి సరే, న్యూస్ చానళ్లలో కూడానా అని ఆవేదన. ఈ ఆవేదన సమంజసమైనది. కాకపోతే చాలామంది పెద్దమనుషు లు దీని వెనుక చూస్తున్న కారణాలు పాక్షికమైనవి.

ప్రత్యేకించి టీవీ జర్నలిస్టులకు, యాంకర్లకు శిక్షణ సరిగా లేకపోవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఇవాళ ప్రింట్ అయినా టీ వీ అయినా శిక్షణ లోపం అన్నింట్లోనూ ఉంది. కాకపోతే న్యూస్ చానళ్ళు ఒక్కసారిగా తోసుకుని రావడం వల్ల లోపం ఓ తులం ఎక్కువ ఉండొచ్చు. అది జనరల్ అంశం. టీవీల స్వభావంతోనే ముడిపడిన నిర్దిష్టమైన కారణాలు వేరే ఉన్నాయి.

న్యూస్ చాన ళ్ళు ప్రధానంగా అర్బన్ ఆడియెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని సాఫ్ట్‌వేర్ రూపొందించుకుంటాయి. ఎందుకంటే ఆడి యెన్స్‌ని కొలిచే టామ్ వ్యవస్థ పట్టణాలకే పరిమితం. యాడ్స్ అన్నీ పట్టణ విద్యావంతులైన యువత మీదే ఆధారపడి ఉంటాయి. పట్టణ పరిభాషకు సంబం«ధించి, ఆంగ్ల వాడకానికి సంబం«ధించి మనకున్న అవగాహన, అందులోని లోటుపాట్లు అన్నీ టీవీల్లో ప్రతిఫలిస్తాయి.

వాస్తవానికి అన్యదేశ్యాల వాడకం కంటే తీవ్రమైన సమస్యలున్నాయి. ఇరవై ఏళ్ళలో వచ్చిన సామాజిక పరిణామా ల వల్ల ఇపుడు కాలేజీల నుంచి జర్నలిజంలోకి వస్తున్న వారిలో ఎక్కువ మందికి సమాజం గురించిన అవగాహన, పట్టింపు అంతకుముందు తరాలతో పోలిస్తే తక్కువ. ఇది అండర్‌స్టేట్‌మెంట్. ఒకచోట 160 మంది విద్యార్ధులను ఇంటర్య్వూ చేస్తే నలుగురు మాత్రమే శ్రీశ్రీ, చలం పేర్లు విన్నారని తేలింది.

ఈ విషాదంలోకి వెడితే బయటకు రాలేం. తాము చదివే వార్తలకు చాలామంది న్యూస్ రీడర్లకు ఉన్న బంధం పరాయిది. నిజ జీవితంలో ఎన్నడూ రాని పాజింగ్ సమస్య వార్తలు చదివేప్పుడే ఎందుకు వస్తుంది? విషయమూ, వాక్యమూ బయటివి కాబట్టి. అవగాహన, ఉచ్ఛారణ, పదాల పొందిక-విరుపు, వాడే పదజాలం మీడియా భాషకు సంబంధించిన ముఖ్యమైన విషయా లు.

అవగాహన గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. మిగిలిన విషయాలను చూద్దాం. స్క్రీన్ మీద కనిపించే వారిని కూడా పట్టణాల నుంచే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఉచ్చారణ వ్యవహారంలో భాగంగా వస్తే సహజంగా ఉంటుంది. కానీ పట్టణాల్లోని చదువుల వల్ల తెలుగును పిల్లలు నేర్చుకోవాల్సి వస్తున్నది. లిపి నుంచి నేర్చుకున్న తెలుగు వ్యవహారంలో భాగంగా ఒంటబట్టే తెలుగంత సహజంగా ఉండదు.

ఎందుకంటే ఉచ్చారణ ప్రాధమికం. లిపి ద్వితీయం. కొంతమంది వ్యవహారంలోనే నేర్చుకున్నా పలుకుబడులు, జాతీయాలు, సామెతలతో సంప ర్కం తక్కువ. చందమామ, బాలమిత్రల మీదుగా నడిచొచ్చిన బాల్యానికి ట్వింకిల్ ట్వింకిల్ మీదుగా నడిచొచ్చిన బాల్యానికి తేడా ఉంటుంది. ఒక్కముక్కలో న్యూస్ రీడర్లు మాట్లాడే తెలు గు మీద అర్బన్ సమాజంలో ఆధిపత్యంలో ఉన్న సంస్కృతి ప్రభావం ఉంటుంది. ఒక రకమైన వింత ఉచ్చారణతో మాట్లాడడం స్టెయిల్ అనే పేరుతో నగరాల్లో చెలామణిలో ఉంది.

చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. తెలుగు సినిమాల్లో హీరోయిన్ల భాష చూడండి. తెలుగేనా అంటే తెలుగే. కానీ తెలుగులాగా వినిపించదు. సూర్యకాంతం తెలుగును, త్రిషకు చెప్పే డబ్బింగ్ తెలుగును పక్కపక్కన వింటే తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఆశాభోంస్లేను గాయనిగా తప్పు పట్టగలమా! మరి ఆమె అడుగులు నేర్పావు అని-పావుశేరులో పాను పాడేసింది. తప్పుఆమెది అన లేం.

అసలే ''నువ్వంటే పాడిపాడి చస్తానే'' అని స్టెయిలిష్‌గా 'వరవషం'తో హమ్ చేసుకుంటున్న కాలం. సినిమా మార్కెట్ ఆ విధంగా అలోచిస్తోంది. ''యాతమేసి తోడినా ఏరు ఎండదు - "పొగిలిపొగిలి ఏడ్చినా పొంత నిండదు'', "సడిసేయకే గాలి'' లాంటి పాటలకు ఇపుడైతే ప్రతిపదార్ధ, తాత్పర్యమివ్వాల్సి ఉంటుంది. కచ్చతనంతో ఈ పనిచేశాడు.. లో చ్చను పచ్చదనంతో పరవశిస్తోందిలోని చ్చను ఒకేరకంగానే పలుకుతారు కొంతమంది . వెనక్కు లాగాడులో గా ను రాగాలు తీశాడులో గా ను ఒకే రకంగా పలుకుతారు.

జానెడు పొట్ట, జారుడు బల్లల్లో ఒకటే జ. చవితి చంద్రుడొచ్చాడంటే చచ్చారే. ఒక్కటే చ. ఱ లాగే మూడో చ, మూడో జ కూడా అంతరించి పోతున్న జాతుల్లో చేరే ప్రమాదం కనిపిస్తోంది. అది సహజమైన మార్పు అయితే ఆహ్వానించొచ్చు. ఈ మార్పు కృత్రిమమైనది. కింది నుంచి వచ్చిన మార్పు కాదు. పైనుంచి రుద్దుతున్నది. రాసారు చేసారు శబ్దాలు సాధారణమై పోయాయి.

తల్లనకా-పిల్లనకా రెంటిలో రెండో అక్షరం శబ్దం ఒకటే. సర్వ శబ్ద సమానత్వం! పైడి తల్లమ్మకూ ఈ తిప్పలు తప్పవు. పుల్లమ్మలో ల్ల శబ్దంతో ఆమెకు జాతర చేస్తారు. చెప్పారు కు అప్పారావుకు తేడా ఉండ దు. కొట్టాడు - పట్టాలు, తన్నాడు - చిన్నారావు సేమ్ టు సేమ్. ఒక్క 'ఎఇ' శబ్దాలకే పరిమితమైన సమస్య కాదు. మౌలికంగానే ఈ ఉచ్చారణ పద్ధతి వేరు. ఇది వ్యక్తుల సమస్య కూడా కాదు.

టీవీల్లో ఆన్‌స్క్రీన్‌కి మార్కెట్ నిర్దేశించిన అర్హతల్లో తెలుగుదనం ప్రధానమైనది కాదు. ఉచ్చారణకు లిపికి సంబంధించి వర్తమాన అవగాహనకు అద్దంపట్టే ఉదాహరణ టీవీలతో పాటు పుట్టుకొచ్చిన ఒక ఆంగ్ల పదం వాల్డ్. వరల్డ్ కొచ్చిన తిప్పలు. వరల్డ్ రాస్తే ఆర్ సైలెంట్ చేయకుండా (అది సైలెంట్ చేయకపోతే స్టెయిల్‌గా ఉండదని భయం) అలాగే చదివేస్తారనే భయంతో పదాన్నే మార్చేసి మన వార్తా రచయితలు ఈ కొత్త పదాన్ని సృష్టించారు. అదియందు శబ్దముండెను అని ఆధ్యాత్మికంగా నమ్మేవారు సైతం సాంస్కృతిక వ్యవహారాల దగ్గరికొచ్చేసరికి ఆదియందు వాక్యముండెను పద్ధతి పాటిస్తారు. ఇదో వైరుధ్యం.

నిరుడు అనే పదం 'ఆడ్‌గా' అనిపించి గతేడాది అనే దిక్కుమాలిన పదం ప్రమాణమై కూర్చుంటుంది. శక్తిలోపం కంటే అవగాహన లోపం వల్ల ఏర్పడే ప్రమాదం ఎక్కువ కాబ ట్టి దీని గురించి ఇంతగా చెప్పుకోవాల్సి వస్తున్నది. ఇక తత్సమాలు, తద్భవాల చర్చలోకి అడుగుపెట్టే పరిస్థితే లేదు. టీవీ చానళ్లలో కూడా ముఖయంత్రము, కరణము అని బొమ్మలు అవీ వేసి నాలుక ఎక్కడ తగిలితే ఏ శబ్దం వస్తుంది అని వివరించాలనే తపన ఉన్నవారుంటారు.

ఓష్ఠ్యాలు, దంత్యాలు, అనునాసికాలు అని ఏమోమో నూరిపోయాలనుకునే వారుంటారు. కానీ అది మార్కెట్ అవసరం కాదు. ఇదంతా ఎందుకంటే సినిమాల్లోనయినా టీవీల్లోనయినా తెలుగును తెలుగులాగా పలకడం అనేది ప్రమాణం కాదు. మార్కెట్ అవసరం కూడా కాదు. పట్టణాల్లో ఈ కొత్త తెలుగుకు ఆమోదం వస్తున్నది. పై తరగతి అలవాట్లను కింది తరగతి అనుసరిస్తుంది కాబట్టి ఇది ప్రమాణంగా కూడా మారుతున్నది.

టీవీలో పనిచేసే జర్నలిస్టులనో, యాంకర్లనో మరొకరినో తప్పుపట్టాల్సిన పనిలేదు. మార్కెట్ శాసిస్తుంది. భాష పాటిస్తుంది. ఏ వ్యవస్థ అయినా దాని అవసరానికి తగినట్టే తనను తాను తీర్చుదిద్దుకుంటుంది. మార్కెట్ ముందు సెంటిమెంట్లు, విలువల భాషణలు పనిచేయవు.

తెలుగు అజంతమూ, ఎల్లోరానా అని హనుమాన్ చాలీ సా పఠించడం వల్ల లాభం ఉండదు. మనం ఎడిటర్లకు మహాజర్లు అవీ సమర్పించడం వల్ల మహా అయితే పైపై మార్పులు సాధించగలమేమో (అది కూడా ఆ ఎడిటర్ భాషాభిమాని అయి ఉంటే). ఇవాళ సమాజంలో ఎదగడానికి తెలుగు అవస రం అంతగా లేదు. చదువుల్లో ఉద్యోగాల్లో అది ప్రతిఫలిస్తున్న ది. అక్కడ మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. అది కొంచెం పెద్ద విషయమే. పెద్ద విషయాలు పరిష్కారం కావాలంటే పెద్ద ప్రయత్నాలే జరగాలి.

-జి.ఎస్.రామ్మోహన్
(2010 నవంబర్‌ 11న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వ్యాసం)

Thursday, 20 October 2011

కొన్ని తెలుగు బూతులు-ఒక పరిశీలన




రోజూ సోనా మసూరి తినేవాళ్లు నెలకోమారు రాగిసంగటి తినాలనుకోవచ్చు.  ఇన్నాళ్లూ సంగటితో బతికిన వాళ్లు సోనామసూరి తినాలని ఆశపడొచ్చు. ఒకటి సరదా....తలకాయ కూరతోనో పల్లీల చట్నీతోనో భేషుగ్గా అనిపించే జిహ్వ చాపల్యం. ఒక్క ముక్కలో ఫాన్సీ. ఇంకొకటి...అన్నిమాటల్లేవు. ఒకటేమాట. జీవితం. మేం ఇంత కష్టపడి సూపర్‌మార్కెట్‌లో రాగిపిండి కొనుక్కుని  ముచ్చట పడి మరీ  సంగటి తింటుంటే మీరా అనారోగ్యకారకమైన సోనా మసూరికోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఫాన్సీగాడు జీవితంగాడికి బోధిస్తే ఏమంటాం? దీన్ని అచ్చతెలుగులో బూతు అంటారు. మరి, ఇంగ్లిష్ రెక్కలు తొడుక్కుని అమెరికాకు ఎగిరిపోయిన వారు ఇక్కడి తెలుగు వాళ్లకు మాతృభాష గురించి పాఠాలు చెప్పడాన్ని ఏమనాలి? అదీ ఇసయం! ఈ మద్దెన తానా తందానా..ఆటా పాటా, సిలికానాంధ్ర-సెలైనాంధ్ర ఏది చూసినా తెలుగు ముచ్చట్లే. మాంచిగా పట్టు ధోవతులు, పట్టు పరికిణీలు కట్టి మరీ తెలుగుదేశంలో తెలుగేమైపోతున్నది అని బాధపడుతున్నారు. ఖండాంతరాలు దాటి ఇంత దూరం వచ్చినా తాము ఇంతగా మాతృభాష కోసం ప్రాకులాడుతుంటే తెలుగుదేశంలో ఉండి తెలుగును మర్చిపోతారా అని ఆవేశం, ఆవేదన, ఆక్రోశం ఇత్యాది అకారాదిభావాలనేకం  గొంతులోనూ ముఖంలోనూ పలికిస్తున్నారు. ఈ ఇంగ్లిష్‌ వ్యామోహమేమిటి? అని నిగ్గదీసి నిలదీసేస్తున్నారు. గుడ్డు..వెరీ గుడ్డు..వెరీ వెరీ గుడ్డు. నాలుగింగిలిపీసు ముక్కలు నేర్చుకుంటే మెరుగైన అన్నం తినొచ్చని మెరుగైన బండిలో తిరగొచ్చని మెరుగైన దేశంలో ఉండొచ్చని ఇంకా ఇలాంటి మెరుగుల కోసమే కదా దొరలూ మీరు సముద్రం దాటేసింది. మరి ఆ మెరుగులు మాకొద్దా! మీకు అవసరమైపోయింది మా దగ్గరికొచ్చేసరికి పనికిమాలినదైపోయిందా సార్లూ! ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ అని మీరు పాడితే కర్ణపేయంగానూ మేం పాడితే కర్ణ కఠోరంగానూ ఉంటుందా దొరలూ? మంచి ఎవరు చెప్పినా మంచే కదా...మెరుగైన జీవితం కోసమని మన మాతృభాషను కించపరిచే ధోరణులు తగునా..ఇపుడు నడుస్తున్న పోకడలు సమంజసమైనవా అని పెద్దలు గంభీర్‌కే రూప్‌మే ప్రశ్నించవచ్చును. లెస్సయిన ప్రశ్నలే. కానీ మంచి చెడులు సైతం స్థలకాలాతీతములు కాలేవు. ఆంగ్లంలోనే అన్నీ ఉన్నాయిష అనేవాడిని సిగపాయ తీసి తందుమా లేదా అనేది మనం మనం తేల్చుకుందాం. మన తిప్పలేవో మనం పడదాం. కానీ వలసపక్షులకు దారిచూపిన వారు ఇంగ్లిష్‌ వ్యామోహం ఇంతగా పెరిగిపోవడానికి ఉత్ప్రేరకులైన వారు మనకు ఉల్టా నీతులు చెపితే మాత్రం ఎక్కడో కాలుద్ది. కాలకపోతే మనలో ఏదో లోపమున్నట్టే లెక్క. నాలుగు డబ్బులున్నోడు ఏం కూసినా ఎగబడి చూసే రోగం ధనమంత పురాతనమైనది. వారసత్వ సామాజిక వ్యాధియని చరిత్ర చెప్పుచున్నది.  చెప్పువాడు కుబేరుడైతే ఎగబడి చూచువాడిని తెలుగులో బానిస అంటారు. దూరం పోయినంత మాత్రాన మాతృభాషమీద ప్రేమ యుండకూడదా? ఉండవచ్చును.  దూరమైన దానిపట్ల ప్రేమ ఎక్కువగానే యుండవచ్చును. ముగ్గులు, పిడకలు, కీర్తనలు, గొబ్బెమ్మలు, ఇత్యాది దినుసులతో తెలుగు సంస్కృతిని కాపాడుకుంటున్నామనుకోవచ్చును. సాఫ్టువేరులు, హర్డువేరులు రూపొందించవచ్చును. సంతోషం. సంవ్సతరానికి ఒకసారి ఆ ప్రేమను చాటుకోవడానికి పంచెలు, ఓణీలతో ఉత్సవాలు చేసుకోవచ్చును. తెలుగుదేశం నుంచి సినిమా బాబుగార్లను హిందీ తారలను పిలిపించుకుని డాన్సులవీ వేసి ముచ్చట తీర్చుకోవచ్చును. ఆ పక్కనే ఏ శోభారాజ్‌నో పిలిపించుకుని అన్నమయ్య కీర్తనలూ పాడించుకోవచ్చును. తప్పులేదు. ఇంగ్లిష్‌ జీవితంలో ఉన్నవారు ఒకరోజు తెలుగు ఉత్సవం చేసుకుంటే ఎందుకు తప్పు పడతాం! కానీ తెలుగు జీవితంలో ఉన్నవారికి తెలుగు పాఠాలు చెప్పే దుస్సాహసానికి పాల్పడితే మాత్రం బాగోదు. ఇపుడూ, నువ్వు పట్నవాసపు ఏసిరూముల్లో బతుకుతూ పల్లెల్లో నక్షత్రాలు, వెన్నెల ఎంతబాగుంటాయో అని వగచవచ్చు. పెరట్లో కొబ్బరాకుల మాటున చంద్రున్ని చూస్తూ నులకమంచంపై పడుకోవండలో ఉన్న ఆనందం గురించి కూడా సినిమా లెవల్లో కబుర్లాడుకోవచ్చు. ఎన్నైనా అనుకోవచ్చు. మనకు దక్కని వెన్నెలతో మంచిగాలితో పల్లెజనం ఎంత సుఖపడిపోతున్నారో అని బాధపడిపోవచ్చు. తప్పేమీ లేదు. కానీ మేం వెన్నెల గురించి ఆలోచిస్తుంటే మీరు ఫ్యాన్లు, ఎసిల కోసం పాకులాడడమేమిట్రా అని వారికి పాఠాలు మాత్రం చెప్పరాదు. మిక్సీలు, గ్రైండర్ల కంటే రోటి పచ్చడి బెటరని నువ్వనుకోవచ్చు. అందుకు పెళ్లాలను రాచిరంపాన పెట్టొచ్చు. కానీ మేమే రోటి పచ్చళ్లవైపు చూస్తుంటే నువ్వు మిక్సీలు కొంటున్నావేంట్రా సుబ్బాయ్‌ అని సుమతి అవతారమెత్తకూడదు. నువ్వు ఇంటిపక్కనే ఉన్న సూపర్‌ మార్కెట్‌కు  కూడా బైకో కారో వేసుకుని వెళ్లవచ్చు. కానీ  "అప్పట్లో కాలేజీకి ఐదారుకిలోమీటర్లు నడిచిపోయేవాళ్లం..ఇపుడు కిలోమీటర్‌ నడిచేవాడు లేడు. అన్నింటికీ ఆటోనో బస్సో కావాల్సిందే..పల్లెలు కూడా సోమరితనం నేర్చుకున్నాయి..ప్చ్‌ పాడైపోయాయి..." అనకూడదు.  ఆదిలోనే చెప్పుకున్నట్టు దాన్ని బూతు అంటారు. కొన్ని ప్రాంతాల్లో బలుపు అని కూడా వ్యవహరించడం కద్దు. తన్నుమాలిన దర్మసూత్రములు వల్లించువారిని నోటికి చేతికి పొంతనలేని వారిని అలా వ్యవహరించడమే మర్యాద, పద్ధతీను. మన తెల్లదొరలు అతీతులేమీ కాదు. కనీసం వెస్ట్రన్ లెక్కల్లో అయినా యు ఓకే..ఐ ఓకే అనన్నా అనుకోవాలి. ఐ ఓకే..యు నాట్‌ అంటే ఏమనాలి? అహా! ఏమనాలి అంట! ఏమంటాం? ఇంగ్లిష్‌ దేశంలో ఉన్నారు కదా!..ఏసు క్రీస్తు మాటలనే చెప్పుకుందాం. అయ్యలారా!..అమ్మలారా! మాకోసం ఏడవకండి..మీ కోసం..మీ పిల్లల కోసం ఏడవండి..ఆమెన్‌!
                                                                                                                                     జి ఎస్‌ రామ్మోహన్‌


                                                                                                               

రెండు దశాబ్దాలు-అనేక కుదుపులు


పివి నరసింహారావు సూత్రధారిగా మన్మోహన్‌ సింగ్‌ పాత్రధారిగా ఆరంభమైన కొత్త ఆర్థిక విధానాలకు ఇరవై యేళ్లు. చరిత్రాత్మకం అని చాలామంది చెప్పుకునే నాటి మన్మోహన్‌ బడ్జెట్‌కు 20 యేళ్లు. ఈ రెండు దశాబ్దాలు స్వతంత్రభారత చరిత్రలో ప్రత్యేకమైనవి. దేశపు దిశ దశ మార్చేసినవి. ఇది పారాడిమ్‌ చేంజ్‌  అనేది అందరూ ఒప్పుకునే మాటే. కాకపోతే గుణదోషాలకు సంబంధించి ఎవరి భాష్యం వారు చెప్పుకోవచ్చు. పెరిగిన పట్నాల గురించి తరిగిన పల్లెల గురించి, ఆదాయంతో పాటుగా పెరిగిన అంతరాల గురించి మాట్లాడుకోవచ్చు. అంత గంభీరమైన విషయాల జోలికి పోకుండా మనకు కొట్టొచ్చినట్టు కనిపించే చిన్నచిన్న విషయాల గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఈ 20 యేళ్లలో కొన్ని కొత్త పదాలుపుట్టుకొచ్చాయి. కొన్నిపదాలకు కొత్త అర్థాలు పుట్టుకొచ్చాయి. అసలు ఆ రోజు బడ్జెట్‌ వచ్చీ రావడమే సరళీకరణ అనే  పదాన్ని మోసుకొచ్చింది. మామూలుగా సరళీకరణ అంటే ఉండే అర్థం వేరు. కానీ ఏం జరిగింది? ప్రభుత్వ రంగంలోని సంస్థలను ప్రైవేట్‌ పరం చేసే ప్రక్రియగా మార్చేశారు. సరుకు ఏదైనా ఎలా ఉన్నా పాకేజింగ్‌‌ మాత్రం అందంగా ఉండాలి అనే భావనకు ఇది సంకేతం. సారం కంటే రూపం ప్రధానమైపోయిన దశకు సంకేతం. రేట్లు పెంచాం అనరు. హేతుబద్ధీకరించాం అంటారు. ఈ ఒరవడిని అన్ని రంగాలు అందిపుచ్చుకున్నాయి.  బ్రిటీషర్లు లిఫ్ట్‌ అంటే అమెరికన్లు ఎలివేటర్‌ అంటారు చూశారూ అలా మార్కెట్‌ పాత పదాలకు సొంత అర్థాల్ని ఇచ్చుకోవడమే కాకుండా ప్రత్యామ్నాయ పదాల్ని కూడా సృష్టించుకుంది. ఇరవై యేళ్లక్రితం ఆరోగ్యంగా ఉండాలి అనేవారు. ఇపుడు ఫిట్‌నెస్‌తో ఉండాలి అంటున్నారు. అప్పట్లో క్లబ్‌ సాంగ్స్‌ అనేవారు. క్లబ్‌ డాన్సర్లనేవారు. ఇపుడు ఐటెమ్‌ సాంగ్స్‌ ఐటెమ్‌ గర్ల్స్‌ అంటున్నారు. జ్వోతిలక్ష్మీ, జయమాలిని, అనూరాధల కంటే ఒక అంగుళం ఎక్కువే బొడ్డుకింద, మెడకింద దిగేయడానికి హీరోయిన్లబడే వారే సిద్ధమవడంతో క్లబ్‌డాన్సర్లనే జాతి అంతరించింది. ఇరవై యేళ్లక్రితం సీరియల్‌ రచయితల హవా నడిచేది. మేగజైన్లు బాగా నడిచేవి. 90ల్లో టీవీలు మన నట్టింట్లోకి వచ్చాక వాటి గ్లామర్‌ తగ్గింది. సీరియళ్ల రచయితల్లో చాలామంది రూట్‌ మార్చి వ్యక్తిత్వ వికాసకులు అయిపోయారు. టేబుళ్లమీద చేతి రుమాలు ఎలా మడిచి పెట్టుకోవాలి. సూప్‌ ఒళ్లో పడకుండా ఎలా తాగాలి, ఇంటర్యూలో ఎలా కూర్చోవాలి లాంటి ఎటికెట్ కూడా పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అయిపోయింది. స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ జంటపదాలయి పోయాయి. 
              క్షౌరశాలలు అప్పటికే సెలూన్‌లుగా మారుతున్నాయి. అవి ఆ తర్వాత బ్యూటీ పార్లర్స్‌గా బ్యూటీస్టుడియోలుగా స్పాలుగా మారిపోయాయి. దర్జీ షాపులు బొతిక్‌లుగా రూపాంతరం చెందాయి. అంతకు ముందు బిజినెస్‌ వార్తలు లోపలిపేజీల్లో కనిపించేవి. ఇపుడు అవి పతాకశీర్షికలుగా మారిపోయాయి. మీడియాలో లైఫ్‌ స్టెయిల్‌ జర్నలిజం అనే పదం వచ్చి చేరడమే కాదు, ప్రధానమైన విభాగంగా మారిపోయింది. బార్లు ఆమ్‌ఆద్మీకి మిగిలిపోయి పబ్బులు హైక్లాస్‌ సెంటర్లుగా రూపాంతరం చెందాయి. అంటే అప్పర్‌క్లాస్‌, హయ్యర్‌ మిడిల్‌క్లాస్‌ ఈజీగా గుర్తించేట్టుగా ఇవి మీవి అని వారికి సులభంగా చెప్పగలిగేలా అన్ని విభాగాలూ కొత్త పరిభాషను సృష్టించుకున్నాయి. ఇరవై యేళ్ల క్రితం ఇండస్ర్టియలిస్టులు రాజకీయ నాయకులకు నిధులిచ్చి తమ పనులు చక్కబెట్టుకునే వారుగా మాత్రమే ఉండేవారు. ఈ 20 యేళ్లలో వచ్చిన పరిణామాలు తెర వెనుక ఉన్న వాళ్లను తెరమీదకు తెచ్చాయి. రాజకీయం అతి పెద్ద వ్యాపారంగా మారింది. మధ్యతరగతి అవినీతికి అవకాశాలు తగ్గిపోయి ఎక్కువ సమానుల పాత్రను కోల్పోయారు. అవినీతి తప్పుడు పని అని ఇప్పుడే కనిపెట్టేశారు. అంతా ఇపుడు రూల్‌ ఆఫ్‌ లా గురించి వాదిస్తున్నారు.
          ఇవి కాకుండా ఈ 20 యేళ్లలో ప్రధానమైన పరిణామం ఎక్స్‌క్లూజివ్‌ విధానాలు. విద్య, వైద్యం, ఆధ్యాత్మికం, రిక్రిషియేషన్‌ అన్ని రంగాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ క్లాస్‌కు ఆ క్లాస్‌ స్కూల్స్‌, ఆస్పత్రులు, సినిమా హాళ్లు, దేవాలయాలు కూడా ఏర్పడ్డాయి. పూనకం అనారగికమైపోయి ధ్యాన మార్గంలో సూక్ష్మ శరీరంతో దేహం వీడి ఎక్కడికో వెళ్లి రావడం లాంటి మాటలు ఆధునికమైపోయాయి. మామూలు సినిమాహాళ్లలో అలగా జనంతో పాటు వెళ్లి చూసే బాధ తప్పించుకోవడానికి ఉన్నత తరగతి మల్లీఫ్లెక్స్‌లను సృష్టించుకుంది. మల్టీప్లెక్స్‌ థియేటర్ల రాకతో దానికి అవసరమైన న్యూ జనరేషన్‌ సినిమాలు దర్శకులు వచ్చి చేరారు. దానికి సెన్సిబిలిటీ అనే అందమైన పదాన్ని ఆపాదించేసుకున్నారు. శేఖర్‌ కమ్ములలు, దేవ్‌ కట్టాలు, జాగర్లమూడి క్రిష్‌లు ఈ మల్లీఫ్లెక్స్‌ పరిణామం నుంచి పుట్టుకొచ్చినవారే. కనీసం 150 రూపాయల టికెట్‌ ఉండే ఈ మల్టీఫ్లెక్స్‌లోకి సామాన్యాడే కాదు, మధ్యతరగతి కూడా వెళ్లే అవకాశం లేదు. స్పెషలైజేషన్‌ ఈ ఇరవై యేళ్లలో పెరిగిన మరో లక్షణం. విద్య, వైద్యరంగాల్లో ఇది తీవ్రంగా కనిపిస్తోంది. దానికదే మంచిచెడూ కాలేదు కానీ స్పెషలైజేషన్‌ ఇప్పటికైతే సామాన్యుడిని సేవలకు దూరంగా ఉంచేసింది. ఈ 20 యేళ్లలో పెరిగిన మరో ట్రెండ్‌ బ్రాండ్‌.  లో దుస్తులు కూడా బ్రాండెడ్‌ అవ్వాల్సిందే. ఏ తరగతికి అవసరమైన బ్రాండ్లు అన్ని విషయాల్లో స్థిరపడిపోయాయి. అంటే ఉన్నత తరగతి, ఉన్నత మధ్యతరగతి ఈ 20 యేళ్లలో అన్ని రంగాల్లో తనకు అవసరమైన వేదికలను సృష్టించుకోదగినంత ఎదిగింది అనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అది మనం సాధించిన అభివృద్ధి. అసలు అభివృద్ధే లేకుండా ఇదంతా సాధ్యం కాదు. కానీ ఇప్పటికీ ఎన్‌ఆర్‌ఇజిఎ లాంటి పథకాలు ప్రవేశపెట్టి ఓట్లు పొందాలని పాలకులు అనుకోవాల్సిన పరిస్థితి ఉండడం అభివృద్ధికున్న మరో పార్శ్వం.
          ఫ్యూడల్‌ వ్యవస్థ రూపం మార్చుకుని పెట్టుబడిదారీ సమాజంగా మారడం లాంటి పునాది పరిభాషను పక్కనబెట్టి పైపైన కనిపించే విషయాలకే పరిమితమైతే ఈ 20 యేళ్లలో భారత సంస్కృతీ సంప్రదాయాలమీద అత్యంత ప్రభావం చూపిన సాధనాలు-నాలుగు. ఒకటి టీవీ, రెండు ఇంటర్‌ నెట్‌,మూడు-మొబైల్‌. నాలుగు-ఐపిల్‌. 90కి ముందు టీవీ ఇంకా ఆరంభదశలోనే ఉన్న సాధనం. ఈ ఇరవై యేళ్లలో అది జనజీవితాన్ని దాదాపు శాసించే స్థాయికి ఎదిగింది. ఏది మంచో ఏది చెడో ఏది స్టెయిలో ఏది కాదో ఏది రుచికరమో ఏది కాదో ఏ ప్రదేశం చూడదగ్గదో ఏది కాదో అన్నీ టీవీనే చెప్పేస్తోంది. చివరకు పెళ్లాం మొగుళ్ల మధ్య గొడవలకు పంచాయితీలకు కూడా వేదికగా మారింది. రోటీ కపడా మకాన్‌ ఔర్‌ టీవీ అనే స్థితి. ఇక మిగిలిన మూడు ఈ 20 యేళ్లలోనే పుట్టి అంతలోనే విశ్వరూపం చూపించేశాయి. ఇంటర్‌నెట్‌ మనలోని అమాయకత్వాన్ని చంపేసింది. అవసరమైనవీ అవసరం లేనివీ కూడా బట్టబయలు చేసింది. మనలాంటి ముసుగు కప్పుకున్న సమాజాల్లో గుప్తమైన విషయాల మీద విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇంటర్‌ నెట్‌ మన జీవితాల్లోకి రాకముందు ఉన్న జనరేషన్స్‌కు వచ్చిన తర్వాత జనరేషన్‌కు ఉన్న తేడా మామూలుది కాదు. పట్టణీకరణ వల్ల దానికి అనుబంధంగా ప్రైవేట్‌ విద్య, హాస్టల్స్‌, స్వేచ్ఛ, దానికితోడు ఇంటర్‌ నెట్‌ అన్నీ కాక్‌టెయిల్‌ మాదిరి యూత్‌ లైఫ్‌ని మార్చేశాయి. ఇంటర్‌నెట్‌ సమస్త సమాచారానికే కాకుండా జ్ఞానానికి అజ్ఞానానికి కూడా వేదికగా మారింది. మొబైల్‌, ఇంటర్‌నెట్టూ ముఖం తెలీకుండా సంభాషించుకునే స్నేహించుకునే ఏర్పాటు చేశాయి. ముఖం లేని చోట మనిషి స్వైరుడు అవుతాడు. అందులోనూ కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు మనలాంటి ముసుగు సమాజంలో స్వైరం ఎక్కువగా ఉంటుంది. 
            ఐటి, ఫార్మా, బయో వెల్లువలు ఉత్పత్తిలోకి మహిళా శక్తిని లాక్కొచ్చాయి. ఒకనాడు సాయంత్రం ఆరింటికల్లా అమ్మాయి ఇంట్లో లేకపోతే సైకిలేసుకుని వెతకడానికి బయల్దేరే తండ్రి ఇవాళ హాయిగా హైదరాబాద్‌ పంపించి మా అమ్మాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేస్తోంది అని చెప్పుకోగలుతున్నాడు. ఈ రెండు దశాబ్దాల్లో వచ్చిన మంచి మార్పు ఇది.  డిగ్రీ చదివి ఊర్లో వీధి అరుగుల మీద ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఉద్యోగాలివ్వడం లేదు అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఆవారా యువబృందాలు ఇపుడు కనిపించడం లేదు. ప్రభుత్వమే ఏకైక దిక్కు అనే భావనను బద్దలు చేయడం వల్ల వచ్చిన పాజిటివ్‌ చేంజ్‌ ఇది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిరుద్యోగం ఇరవై యేళ్ల క్రితం ఉన్నట్టుగా ఇపుడు కనిపించడం లేదు. కాకపోతే పిల్లలను చిన్నప్పటినుంచే కెరీర్‌ ఓరియెంటేషన్‌తో పెంచడం వల్ల సమాజంతో తోటివారితో ఇంటరాక్షన్‌ కరువవడం వల్ల వారిలో కామన్‌ సెన్స్‌ లోపించి పెళుసుగా తయారవడం చూస్తున్నాం. చిన్నపాటి ఫెయిల్యూర్‌నే తట్టుకోలేక ఉసురు తీసుకోవడమో ఇంకొకరి ఉసురు తీయడమో చూస్తున్నాం. ఇదొక విషాద పార్శ్వం. ఐపిల్‌ మనుషుల్లో అణచివేసుకున్న కాంక్షను రోడ్డుమీదకు లాక్కొచ్చింది. ముఖ్యంగా పట్టణ సమాజంలో. చదువుల్లోకి ఉద్యోగాల్లోకి మహిళలు ఎక్కువగా రావడంతో బంధాలు పెరిగాయి. పట్టణ సమాజంలో ఉండే ప్రైవసీ అవకాశాలు స్వేచ్ఛా కాంక్షను పెంచాయి. గతంలో గర్భభయం సెక్స్‌ స్వేచ్ఛపై కొంతవరకు ఒక మూతను ఉంచేది. దాని భారం మహిళల్లోనే కనిపిస్తుంది కాబట్టి సమాజభయం ఎక్కువగా ఉండేది. ఇపుడు ఐపిల్‌తో ఆ భయం తొలగిపోయింది. దీని వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ బోలెడున్నాయని వైద్యులు మొత్తుకుంటున్నా రోజూ చాక్‌లెట్లలాగా చప్పరిస్తున్న వారు సైతం ఉన్నారు. బహుశా ఇలాంటి పరిణామాల్నే కొందరు పెద్దమనుషులు విలువల పతనంగా సమాజం చెడిపోవడంగా వర్ణిస్తూ ఉంటారు. విమెన్‌ ఉత్పత్తిలోకి రావడం అనే ఒక పెద్ద సానుకూల పరిణామం ముందు ఇలాంటివి చిన్నవిషయాలు. .  ఎమోషనల్‌ బాండేజ్‌కి ఫిజికల్‌ బాండేజ్‌కి ఉన్న తేడాను అర్థం చేసుకోలేకనో మానవసంబంధాలపై స్పష్టత లేకనో కొందరి జీవితాలు బుగ్గిపాలవుతున్న విషయం వాస్తవమే అయినా అది సంధిదశలో అనివార్యమైన విషాదంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువభాగం విషాదాలు మగవాళ్లు ఇంకా పాత మైండ్‌ సెట్‌ నుంచి రాకపోవడం వల్ల మేల్‌ పిగ్‌ ఇగో వల్ల జరుగుతున్నవి. అందుకోసం మొత్తం పరిణామాన్ని నిందించనక్కర్లేదు. 
             ఏమైతేనేం మన సమాజం చాలా గట్టిది. మన విలువలు గట్టివి. అనే పేరుతో సగభాగాన్ని తొక్కిఉంచిన పాతకాలపు ప్రేలాపనలను కొత్త ఆర్థిక సంబంధాలు బద్దలు చేశాయి.  మడీ మట్టు చాటున మగ్గబెడుతూ వచ్చిన సమాజంలోకి కొత్తగాలిని తీసుకొచ్చాయి. వాస్తవానికి గతంలో కూడా సమాజం ఎన్నడూ పూర్తిగా కరడు గట్టి లేదు. తప్పో ఒప్పో చేస్తే చేశావు గానీ బహిరంగంగా వ్యవస్థను ప్రశ్నించకు అనేది మన ముసుగు సమాజపు అలిఖిత చట్టం. గ్రామీణ జీవితంతో సంబంధమున్న వారందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి అది ఇరవై యేళ్ల క్రిందటి గ్రామీణ సమాజమైనా ఇప్పటి పట్టణ సమాజమైనా తేడా వ్యక్తీకరణలోనే. అప్పట్లో ఏదైనా ముసుగు తప్పనిసరి. ఇవాల్టి పట్టణ సమాజం ముసుగు అంతగా అవసరం లేనిది. ఇన్‌ఫార్మల్‌గా ఉండే గ్రామీణ సమాజంలో మనిషిని గుర్తించేది కులంతో డబ్బుతోనే. పట్టణాల్లో చేసే పనిని బట్టే గుర్తింపు. పట్టణాల్లో అన్నీ ప్రదర్శన వస్తువులే. ఇల్లూ ఒళ్లూ అన్నీ. వేసుకునే చొక్కా, నడిపే వాహనం, ఉండే ఇళ్లు, తినే హోటల్‌, ఆరాధించే దేవత అన్నీ ప్రదర్శనకు పెట్టుకోవాల్సిందే. ఈ ఇరవై యేళ్లలో ఇది విపరీతంగా పెరిగింది. సమానత్వంలో సంతృప్తిని పొందే స్థితి సమాజంలో లేదు కాబట్టి ఆధిక్యంలో సంతృప్తిని పొందడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఈ నిచ్చెనమెట్లు పాత గ్రామీణ సమాజంలో ఒక రకంగా ఉంటే పట్నాల్లో ఇంకో రకంగా ఉంటాయి. పల్లెల్లో ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేకుండానే ఆధిపత్యం చాటుకోవడానికి అవకాశం ఉంటుంది. పట్నాల్లో అది ప్రదర్శన ద్వారానే సాధ్యం. అందుకు మనిషి నిరంతరం పరుగు పెడుతూనే ఉంటాడు. ఇరవై యేళ్లలో ఈ పోటీ విపరీతంగా పెరిగింది. మనిషి స్థానాన్ని వినియోగదారుడు ఆక్రమించినట్టుగానే మనిషి కోసం మనిషి అనే ఆలోచనను పూర్తిగా పోగొట్టి మనిషి కి మనిషి పోటీ అనే వాతావరణాన్ని పెంచింది. చదువుల్లో కెరీర్లో స్పష్టంగా కనిపిస్తున్న ధోరణి ఇది. ఎక్కువ జీతం పొందడమే చదువు ఏకైక లక్ష్యంగా మారిపోవడం వల్ల మానవశాస్ర్తాలు అనాధల్లాగా మారిన విషాదాన్ని కూడా చూస్తున్నాం. ఈ ధోరణులపై అసంతృప్తితో వచ్చిన  దిల్‌ చాహ్ తా హై, త్రీ ఇడియట్స్‌, జిందగీ దుబారా నహీ మిలేగీ వంటి సినిమాలు సూపర్‌ హిట్‌ కావడం మన అంతరాల్లో ఉన్న కోరికలకు వాస్తవ స్థితికి మధ్య ఉన్న తేడాను చూపిస్తుందనుకోవచ్చు. బహుశా ఇది సంధి దశ. 
                                                                                                                                     -జి. ఎస్‌. రామ్మోహన్‌