Thursday, 14 April 2016

రాజ్యం మెసేజ్‌-ప్రజాస్వామిక వాదులకు ఎస్‌ఓఎస్‌!



encounter-main2



వాళ్లు చొక్కా అవసరం లేనంత పేదవాళ్లు. ఏ కులమో ఏ మతమో మనకు తెలీదు. మనలాగా పేపర్‌ చదివి, మనలాగా రాజకీయాలు చర్చించే మనుషులు కారు. మనలాగా కేరేజీ తీసుకుని స్కూటర్‌మీదో కారులోనో ఆఫీసుకు వెళ్లే మనుషులు కాదు. మనలాంటి మధ్యతరగతి మర్యాదపురుషులు కాదు. మన భాష కాదు, మన రాష్ర్టమూ కాదు. వాళ్లు వేరే. వాళ్లు మనకు ఏలియన్స్‌. అందుకేనేమో మనకు పెద్దగా పట్టింపు ఉండదు. సివిల్‌ సొసైటీలో స్పందన కష్టం. ”భలే పని చేశారు గురూ, ఈ దెబ్బకు ఇక ఇటువైపు రారు” అనేమాట ఎక్కువగా వినిపిస్తోంది.
మనందరి ఆస్తిని ఎవరో కొట్టేసుకుపోతూ ఉంటే పోలీసులు వారికి గట్టి బుద్ధి చెప్పినట్టుగా ఉంది. చెట్లు కొట్టేయడం మనుషులను కాల్చిచంపదగిన నేరంగా ఎప్పుడు మారింది అని అడిగీ లాభం లేదు. రాళ్లు విసిరితే తుపాకులతో కాల్చేయడం ఏ విధమైన ఆత్మరక్షణ లాజిక్‌ అని అడిగి లాభం లేదు. ఆ శవాల పక్కనబెట్టిన దుంగలు ఎప్పటివో లాగున్నాయి, కొన్నింటిమీద పెయింట్‌ కూడా కనిపిస్తోంది అని ప్రశ్నించీ లాభం లేదు. ఇది ఎన్‌కౌంటరే అని నమ్మకం కలిగించాల్సిన అవసరం అంతగా లేదని, దానికోసం కష్టపడనక్కర్లేదని పోలీసులు భావించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ర్టాల్లో పోలీసులకు తమ సివిల్‌ సొసైటీ మీదా, నాయకుల మీదా, న్యాయవ్యవస్థమీదా నమ్మకం అంతగా పెరిగిపోయింది. ప్రజాస్వామ్య శక్తులు అంతగా బలాన్ని కోల్పోయాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడుతామని మనసావాచా కర్మణా ప్రమాణం చేసితిరి కదయ్యా అని పాలకులను ప్రశ్నించీ లాభం లేదు. అలాంటి ప్రశ్నలు వినపడే దూరంలో వారు లేరు. ముద్దు మాటలు వినలేదా! బొజ్జల వారి వివరణ చూడలేదా! అంతకుమించి అడవిలో కూలీలకేం పని అన్న వెంకయ్య నాయుడు ప్రశ్న చెవుల్లో రింగురుమనడం లేదా?
అడవిలో కూలీలకేం పని అనడంలో ఆధునిక ఆధిపత్య వ్యాపార శాస్ర్తముంది. నేటి ప్రభుత్వాలకు అడవి ఆస్తి. వనరుల గని. ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట ప్రభుత్వానికైతే ఎర్రచందనం మరీ కల్పతరువులాగా కనిపిస్తున్న ఆస్తి. ఒక్క ప్రభుత్వానికే కాదు. రాజకీయనాయకుల్లో చాలామందికి ఇవాళ అడవి వేలకోట్ల డబ్బుల మూట. సారాయి వేలంపాటలు, రియల్‌ ఎస్టేట్లు, ప్రాజెక్టుల్లో కమిషన్ల మీదుగా ఎదిగిన రాజకీయ నాయకత్వం చూపంతా అడవులమీదా గుట్టలమీదే ఉంది. ఇది ఆస్తి కోణం. మైదాన ప్రాంతపు ఆధునిక వృత్తులు, పనులు తెలీని ఆదివాసీల్లో చాలామందికి అడవి ఉపాధి. తునికాకో మరో ఆకో అలుమో కాయో పండో ఇచ్చే జీవన వనరు.
samvedana logo copy(1)

వాలులో నాలుగు గింజలు వేసుకుంటే నాలుగొందల గింజలిచ్చి పొట్టనింపే ఉపాధి. అడవి వారి జీవనాధారం. జీవనాధారం చేసుకోవడంలో ఇపుడు చనిపోయిన 20 మంది చట్టాలను పట్టించుకోకపోయి ఉండొచ్చు. వారి జీవనాధారంలో నేరకోణం ఉండొచ్చు. కానీ ఆస్తి కోణం ఉన్నవారు అందుకోసమే వేల ఎకరాల్లో ఆ చెట్లను పెంచి నరికి అమ్ముకుంటామని ఇంతకు ముందు ప్రకటించారని గుర్తుంచుకోవాలి. అదేదో వాతావరణం సహకరించదని తర్వాత ఇడియా ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఏమిటి? ఇక్కడ సమస్య చెట్లను కొట్టడం కాదు. ఎవరు కొట్టాలి? ఎవరి ఆస్తి? ఎవరు తరలించుకుపోతారు అనేదే సమస్య.
అక్రమ కొట్టివేతా-సక్రమ కొట్టివేతా తప్ప కొట్టివేత అనేది దానికది నేరమనే భావన ఇక్కడ లేదు. ఆ మాటకొస్తే నల్లమల కొండలకు ఆనుకుని ఉన్న కడప, ప్రకాశం జిల్లాల్లోని మైదానప్రాంతాల్లో చాలా ఇళ్లలో దూలాలు దంతెలు ఎర్రగాకనిపిస్తాయి. బండి గాండ్లు, ఇతరత్రా పరికరాలు ఎర్రచందనమే. ఎక్కువగా దొరికే నాణ్యమైన కర్రగా మాత్రమే వారికి తెలుసు. వారికి ఇపుడిపుడే దాని విలువ తెలుస్తున్నది. అది కర్రకాదు, బంగారం అని అర్థమవుతున్నది. తమ తాతలు తండ్రులు అన్నలు ఊ అంటే అడవిలోకి వెళ్లి నాలుగు కర్రలు నరుక్కొచ్చి ఇంటి పనికి ఉపయోగించేవారని వారు రాజ్యం చంపదగిన నేరాలు చేశారని వారికి ఇపుడిపుడే అర్థమవుతోంది. అది అంతపెద్ద నేరమెప్పుడైందో తెలిసే అవకాశం లేదు. వస్తువు ఖరీదు పెరిగితే అది నేరమవుతుంది, ఆస్తి విలువ కొద్దీ నేర స్వభావం పెరిగిపోతుంది అనే లాజిక్‌ ఇపుడిపుడే అందరికీ అర్థం చేయిస్తోంది ప్రభుత్వం. ఆ రకమైన మెసేజ్‌ని పంపించాలని భావించింది ప్రభుత్వం. మెసేజ్‌ని జనంలోకి పంపించాలనుకున్నపుడు డిమాన్‌స్ర్టేషన్‌ ఎఫెక్ట్‌ యాడ్‌ చేయగలిగితే అంతకు మించిన శక్తిమంతమైన సాధనం ఉండదు. 20 మంది శవాలతో డిమాన్‌స్ర్టేషన్‌ చేశాక ఇంకెవరైనా గొడ్డలి పట్టుకుని అడవిలోకి అడుగుపెడతారా!
20 మంది ఎవరో, ఎవరు కన్నబిడ్డల్లో ఎవరు కట్టుకున్న భర్తలో, ఎవరైతే మనకేంటి? వాళ్లెవరో పరాయివాళ్లు. ఈ మనమూ వాళ్లు అనేదాన్ని ప్రాంతం, కులం, మతం, వస్ర్తధారణ వంటివి నిర్వచిస్తాయి అనే మాట నిజమే కానీ అంతకుమించి నిజంగా నిర్వచించగలిగేది ఆస్తి. వాళ్లు ఆస్తి లేని వాళ్లు. ఆస్తే ఉంటే ఆ పనికి ఎగబడరు, అంతమందిని రాజ్యం చంపే మాటా ఉండదు. ఇక్కడ మైదాన ప్రాంతంలో గొంతుండి పత్రికల్లోటీవీల్లో మాట్లాడగలిగే రాయగలిగే, వినగలిగే, చదవగలిగే మనబోటోళ్లం ఎంతో కొంత భద్రలోకులం. కాబట్టి వారు పరాయివారే. ఆడవి ఆస్తిగా మారాక అడవుల మీద రాజ్యానికి రాజ్యంలో రక్షణ బాధ్యతలు చూసేవారికి గతంలో ఎప్పటికంటే అడవి పూర్తిగా మాదే అన్న సొంత భావన పెరిగిపోయింది. రివర్స్‌ లాజిక్‌లో ఆదివాసీలకు అడవితో ఏం పని అనే రోజులొచ్చాయి.
sheshashalam
నిజమే. వాళ్లు రాజ్యానికి చెందిన ఆస్తి అయినటువంటి చెట్లను నరికేశారు. వాళ్లు బండవాళ్లు, మొరటు వాళ్లు. నిజమే. ఆయా ప్రాంతాల్లో తిరిగి వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వడానికి ప్రయత్నించిన వారితో కూడా మొరటుగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నమాట నిజమే. ఒకనాడు మన రాష్ర్టంలో స్టువర్ట్‌ పురంలా పేరుబడిన సోకాల్డ్‌ ‘నోటిఫైడ్‌’ ప్రాంతాల వారు అయిన మాట వాస్తవమే. అందరమూ అక్కడినుంచి వచ్చినవారమే. మనిషి పుట్టుకతోనే బ్రాండెడ్‌ షర్టుతోనూ బ్రాండెడ్‌ ఉద్యోగంతోనూ పుట్టలేదు. అందరమూ అడవులనుంచి ఆదిమ దశనుంచి వచ్చినవారమే. దాటి వచ్చిన దశ పట్ల అంత వ్యతిరేకత ప్రదర్శించడం మన సమాజంలోని అప్రజాస్వామిక లక్షణాల్లో ఒకటి. అడవుల అందం పట్ల అంతులేని గ్లామర్ అక్కడి ప్రజల పట్ల అంతులేని చిన్నచూపూ ప్రదర్శించుకునే వాళ్ సంఖ్య పెరిగిపోతున్నది. అడవి అనే ఆస్తి కావాలి. అడవి బిడ్డలు వద్దు. వాళ్లు ప్రజాధనాన్ని దోచుకోవాలనుకున్నారు కాబట్టి కాల్చేశామంటున్నారు కదా!
అంతకంటే దారుణంగా కమిషన్ల రూపంలో లంచాల రూపంలో ప్రజాధనాన్ని టేబుల్‌ కిందినుంచో పైనుంచో చేతులు చాచేవాళ్లను ఇలాగే కాల్చేస్తే సివిల్‌ సొసైటీ ఇలాగే మౌనం వహిస్తుందా, భలే పని చేశారు గురూ అనగలుగుతుందా అని వాదనకోసమైనా అనలేం. రకరకాల రూపాల్లో ప్రభుత్వానికి రావాల్సి పన్నులనునొక్కేసే తెల్లచొక్కాయి మనుషులను ఇలాగే పట్టుకుని కాల్చిచంపేయగలరా అని అడగలేం. వాళ్లంతా భద్రజీవితంలో ఉన్నవాళ్లు. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఆఫీసర్‌ ప్రత్యక్షంగా దోపిడీ చేస్తూ పట్టుబడినా నేరం రుజువు కాకముందే నేరస్తుడెట్లా అంటారు అని వైట్‌ కాలరెగరేసి మాట్లాడగలడు. నాకు భారత న్యాయవ్యవస్థమీద నమ్మకం ఉంది గంభీరంగా మైకుల ముందు చెప్పగలడు. ఇపుడు చనిపోయిన 20 మంది ఉన్నారే వాళ్లు అలా చెప్పలేరు. వాళ్లకు మన వ్యవస్థ మీద అంత నమ్మకము ఉండదు. నమ్మకం ఎలా ఉంటుంది?
పోలీసులు తప్ప మరో శాఖ ఆ తండాలను గ్రామాలను సందర్శించకుండా ఉన్నపుడు బూతులు బెదిరింపులు తప్ప మరో మంచి మాట చెవి సోకనపుడు వారికి ఏ వ్యవస్థమీదైనా నమ్మకం ఎలా కలుగుతుంది? ఆయా ప్రాంతాలు దోపిడీదొంగల ప్రాంతాలని, వీరప్పన్‌ ప్రభావిత ప్రాంతాలని గట్టిగట్టిగా ప్రచారం చేయడం వల్ల వాళ్లు వేరే వాళ్లు వేరే అనే పరాయిభావనను అదే పనిగా జనంలోకి పంపించడం ఎత్తుగడ. ఈ ఎత్తుగడ కేవలం రాజ్యానిది మాత్రమే కాదు. ఆస్తిపరులందరిదీ. రాజ్యం కేటలిస్ట్‌ మాత్రమే. కశ్మీర్‌ను ఎలాగైతే ఆస్తిగా చూసి అక్కడ తిరగబడే వారిని ఎంతమందిని కాల్చితే అంత సంతోషపడే స్వభావాన్ని పెంచుకున్నారో ఇపుడలాగే శేషాచలం అడవులను ఆస్తిగా చూపి ఆ ఆస్తిపై కన్నేసినా చేయేసినా చంపేయొచ్చనే భావనను మధ్యతరగతిలో పెంచగలుగుతున్నది.
మన దేశంలో ప్రజాస్వామ్యం చిత్రమైనది. ఇది అవసరమైనపుడు నాలుగు పడగలు, పది తలలు తొడుక్కోగలదు. అది ఒకవైపు అమెరికాను ఆదర్శంగా చూపుతూ అక్కడ చూడండి రూల్‌ అంటే రూలే అనగలదు. ఏం కోర్టులండీ, కాల్చేస్తే గానీ బుద్ధిరాదు అని అదే నోటితో తాలిబన్ల లాజిక్‌ కూడా వినిపించగలదు. అక్కడ ఆధునిక బూర్జువా రాజ్యం ఆదర్శం కాదు. ఎక్కడ ఏది అవసరమైతే అది అనే ప్రాతిపదికన ఈ రాజ్యం నడుస్తుంది. తమకు అవసరమైనపుడు చట్టం ఒకటుంది కదండీ అనగలదు. అవసరం లేదు అనుకుంటే అన్నింటికీ చట్టాలంటే కుదరదండీ, పది మందిని వేసేస్తే గానీ పదకొండో మనిషికి తెలివిరాదు అనగలదు. రాజ్యాంగం రాసేటప్పుడు సూత్రబద్ధవైఖరుల కోసం నాటి మేధావులు అనేకానేక రాజ్యాంగాల మీద ఆధారపడ్డారు. వివిధ దేశాల్లో కాలక్రమేణా ముందుకు వచ్చిన విలువలు, నాగరికత తీసుకునే ప్రయత్నం చేశారు. ఇవాల్టి నేతలు తమ అవసరాల కోసం తమ క్రూరత్వాన్ని సమర్థించుకోవడం కోసం ఎక్కడెక్కడి అనాగరిక పద్ధతులను ఆదర్శంగా తీసుకుంటున్నారు.
కానీ సమస్యలను తుపాకీతో పరిష్కరించాలనుకునే దేశాలు ఏమయ్యాయో ఈ దేశపు పాలకులు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది. తుపాకీ తాత్కాలికంగా గ్లామరస్‌గా కనిపించొచ్చు, తక్షణ పరిష్కారంగా కనిపించొచ్చుగానీ అది పాలకులకు ఈ వ్యవస్థకే ప్రమాదకరం అని గుర్తించాలి. ఆస్తి ప్రాతిపదికన మనుషులను శిక్షించదగినవారు- శిక్షించకూడని వారు, అందులోనూ చంపదగినవారు చంపకూడని వారు అని విభజించే ఈ విచిత్రన్యాయం ప్రమాదకరమైనది. ఈ దేశపు పేదలు ఇవాళ తెలుగువారు తమిళనాడు వారుగానో ఆదివాసీలు, మైదానప్రాంతం వారుగానో చీలిపోయి ఉండొచ్చును. ఆర్థిక అంతరాల వల్ల పేదలు కూడా తమకింద ఇంకా దరిద్రులున్నారనే భావనలో ఆధిక్యభావనలో ఉండొచ్చు. భద్రలోక భావజాలం అవసరమైన వారికంటే ఎక్కువమందిలో మాయలాగా కమ్మి ఉండొచ్చు. వారికి ఉమ్మడిగా గొంతునిచ్చే శక్తులు బలహీనంగా ఉండొచ్చును. కానీ ఏ బలహీనతా శాశ్వతం కాదు.

జి ఎస్‌ రామ్మోహన్‌

(ఏప్రిల్‌ 8, 2015న సారంగలో ప్రచురితం)

No comments:

Post a Comment