చెప్పినదానికంటే
ఎక్కువ అర్థం చేయించగలిగేదే గొప్ప కళారూపమని అంటారు. ఆ మాట కూడా సరిపోదు కోర్ట్ అనే మరాఠీ సినిమా మనలో కలిగించే
స్పందనను తెలియజేయడానికి. నటించలేదు, జీవించారు అని చెప్పీ చెప్పీ ఆ మాటలను
సాధారణంగా మార్చేశాం. ఈ అసాధారణ సినిమాను వర్ణించడానికి ఆ మాటలు సరిపోవు. భాషతో ఇబ్బందే.
పదాల్లేవు ఈ సినిమాను వర్ణించడానికి. నినాదాల్లేవు. కానీ సినిమా చూశాక మనం నినాదంగా మారతాం. ఆగ్రహావేశాల్లోవు. కానీ
మన లోలోపలెక్కడో పట్టలేని ఆగ్రహం నిలువనీయకుండా చేస్తుంది. ఇది గడ్డకట్టిన దుఖ్ఖం. ఇది అణిచివేసుకున్న ఆగ్రహం.
చాలా సినిమాలు చూసి ఉంటాం. ఆర్ట్, రియలిస్టిక్, నియో రియలిస్టిక్, క్రాస్ ఓవర్, మాస్ లాంటి చాలా పదాలనే విని ఉంటాం. కానీ ఈ సినిమాను అట్లా ఏదో ఒక బీకర్‌లోకి ఒంపడానికి మనసొప్పదు.
జీవితాన్ని వర్ణించమంటే ఎట్లా బ్బెబ్బెబ్బే అనక తప్పదో ఏదో ఒకటి మాట్లాడడానికి తెలిసిన పిచ్చిమాటలను ఎట్లా
కూర్చుకోక తప్పదో అట్లా ఉంటదీ ఈ సినిమా గురించి చెప్పడమంటే. సటిల్, అండర్ ప్లేయిడ్, న్యూయాన్స్‌డ్, లేయర్డ్ లాంటి ఆంగ్లపదాలు అనేకం వాడేసుకోవచ్చు. పాత్రలు మన తెలుగు సమాజానికి బాగా పరిచయమైనవి. మన
ప్రజా గాయకులు, మన మానవహక్కుల కార్యకర్తలు, మన కూలీలు,
అంతా మనమే. పరిస్థితులు మొత్తం
భారతావని మొత్తానికి పరిచయమైనవే. కోర్టులు,
అడ్వకేట్లు, న్యాయం, అది
పనిచేసే విధానం అన్నీ మొత్తం దేశానికి సంబంధించినవి. వ్యవస్థలోన్యాయం ధర్మం అనేవి పనిచేసే
పద్ధతుల్లోని అబ్సర్డిటీని, సర్రియాలిటీని రియాలిటీతో చిత్రించిన సినిమా. మన సమూహాలకు సంబంధించని మనుషులపట్ల వ్యవస్థలో
గూడు కట్టుకుపోయిన దుర్మార్గపూరితమైన నిర్లిప్తతను
చూపించిన సినిమా. ధిక్కార స్వరాలకు సంకెళ్లు వేయడానికి వ్యవస్థ ఎలాపనిచేస్తుందో చూపించిన సినిమా. ఒక్కముక్కలో ప్రజాస్వామ్యం
అందరిపట్లా అంత ప్రజాస్వామికంగా ఏమీ ఉండదనే
వాస్తవాన్ని చూపించిన సినిమా.
నీలివేదికమీద ఎర్రపాట పాడుతుండగా గద్దర్ లాంటి గాయకుడిని అరెస్ట్ చేస్తారు.
అరెరెరె, హా లతో సహా అచ్చంగా గద్దర్
పాటే. జననాట్యమండలికి సంబంధించిన రెండు టూన్లు ఆ పాటలో స్పష్టంగా కనిపిస్తాయి. గద్దర్
పాట తన మీద చాలా ప్రభావం చూపించిందని దర్శకుడు చైతన్యతమానే ఒక చోట చెప్పారు కూడా. ఒక
మనిషిని ఆత్మహత్యకు పురికొల్పాడని నాన్ బెయిలబుల్
సెక్షన్స్ కింద గాయకుడిపై కేసు. ఎవరా మనిషి? డ్రైనేజ్ క్లీన్
చేసే మనిషి. ఆ మనిషి మాన్‌హోల్‌లోకి ఎటువంటి
మాస్కులు లేకుండా దిగాడు కాబట్టి ఆత్మహత్య చేసుకునే ఉద్దేశ్యంతోనే దిగి ఉంటాడని ప్రాసిక్యూషన్ అభియోగం. ఇతరుల మలమూత్రాలను
చేతులతో క్లీన్ చేసే ఆ పనిచేయడం కన్నా చావడం
మేలు అని అర్థం వచ్చే పాట ఆ గాయకుడు పాడి ఉన్నాడు కాబట్టి ఆ ప్రేరణ తోనే సదరు కార్మికుడు రక్షణ కవచాలేమీ లేకుండా లోపలికి దిగి ఆత్మహత్య చేసుకుని
మరణించి ఉంటాడని అభియోగమన్న మాట. పతంజలి పిలకతిరుగుడు
పువ్వు గుర్తొస్తుందా! అందులో కూసింత వ్యంగ్యాన్ని హాస్యాన్ని జోడించి వ్యవస్థ బండారం బయటపెడతాడు పతంజలి. ఆలోచనల్లో వేగుతూ వేదనలో
కాగుతూ ఈ సినిమా చూస్తాం. ట్రాన్స్‌లో ఉండి
అనేకానేక ఉద్వేగాలతో ఊగిపోతాం. డ్రైనేజీ క్లీన్‌చేసేవారంతా మాస్కులు, కవచాలు ధరించి దిగరని న్యాయవాదులకు
న్యాయమూర్తులకు తెలీదా, దాన్ని ఆధారం చేసుకుని ఆత్మహత్య కేసు
పెడతారా లాంటి అమాయాక ప్రశ్నలు వేయకూడదు. ఈ
సినిమా అంతకంటే లోతైనది. ఇలాంటి అభియోగం ఈ రకంగా మోపడం న్యాయాన్ని అపహాస్యం చేయడం అని
జడ్జి అనుకోడు. పైగా అలాంటి పాట రాశారా అని అడిగితే ''ఇప్పటికి
రాయలేదు కానీ ఇకముందు రాసే అవకాశమొస్తే రాస్తా'' అని కోర్టులో
గాయకుడు ప్రకటించడం మాత్రం ఆయనకు చిర్రెక్కిస్తుంది. విలాస్ గోగ్రే, శంభాజీ భగత్ సన్నిహితుడు, స్వయంగా కార్యకర్త,
విరోధి పత్రిక సంపాదకుడు అయినటువంటి వీరా సతిదార్ ఆ గాయకపాత్రలో అలా
ఇమిడిపోయారు.
న్యాయమూర్తి
,ప్రాసిక్యూషన్ న్యాయవాది ప్రవర్తనకు
మొత్తం అన్ని యంత్రాగాల ప్రవర్తనకు మూలాలు వెతికి ఇదిగో ఇందుకు అని చూపుతాడు. సింబాలిజాన్ని
ఇంతగా వాడుకున్న దర్శకుడు మనదగ్గర మరొకరున్నారా అంటే చెప్పడం కష్టం. పేదలపై వివక్ష, కుల అణచివేత ఎవరిపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయి, వ్యవస్థ
ఎవర్ని ఏ స్థాయిలో వేధించే అవకాశముంది అనేది ఇంత ప్రశాంతంగా చూపిన దర్శకుడిని మరొకరిని ఎరగం. మధ్యతరగతికి చెందిన హక్కుల న్యాయవాది
మీద ఇంకుదాడి జరిగితే ఎర్రెర్రని దళిత గాయకుడి మీద జైలు దాడి జరుగుతుంది. దళితగాయకుడిని నేరుగా ప్రభుత్వమే
వేధిస్తే, మానవహక్కుల న్యాయవాదిపై అదే ప్రభుత్వం అండ ఉన్న ఉన్మాద మూకలు హెచ్చరిక లాంటి
దాడి చేస్తాయి. ఇంకు దాడి జరిగిన తర్వాత మానవహక్కుల
న్యాయవాది బ్యూటీపార్లర్‌లో కూర్చుని గంభీరంగా ఆలోచించే దశ్యమూ, పోలీసుల కస్టడీలో ఆస్పత్రిలో ఉన్న
గాయకకార్యకర్త ఇంజక్షన్ వేసుకోవడానికి తిరస్కరించే దృశ్యాన్ని ఎటువంటి కామెంట్ లేకుండా నింపాదిగా చూపించి మనలో అలజడి రేపుతాడు.
ఊరికే వాస్తవాలను చూపితే చాలదు, మంచి కళారూపం ఒక దిక్కు దిశా చూపించాలి అని కొందరు వ్యాఖ్యానిస్తా ఉంటారు. వాస్తవం అనేదాన్ని
ఎలా నిర్వచిస్తావ్ అనేదే ముఖ్యం కానీ ఎటువంటి
వ్యాఖ్యానం చేయకుండా- కనీసం వాచ్యం చేయకుండా అద్భుతమైన కళారూపం సాధ్యమనేదానికి సాక్ష్యం
ఈ సినిమా. పోలీసుల మీద కానీ ప్రాసిక్యూషన్ లాయర్ మీద కానీ జడ్జిమీద కానీ ఎటువంటి వ్యాఖ్యానం
ఉండదు. వారిని దుర్మార్గులుగా ఏమీ చిత్రించడు. కాకపోతే లాయరమ్మ పిల్లల్ని చూసుకుంటూ
శ్రద్ధగా ఇంటిల్లిపాదీకి వంట వార్పూ చేస్తూ ఆ పనిమధ్యలోనే తన డాక్యుమెంట్లు చదువుకుంటూ
ఆలివ్ ఆయిల్ డిస్కంట్‌లో కొనడం మంచిదేనా కాదా అని తర్కించుకుంటూ ఉంటుంది. కుటుంబంతో
ఒక మధ్యతరగతి వెజ్ రెస్టారెంట్లో ఏదో తినేసి ముంబైనుంచి బీహారీలను తరిమికొట్టాలనే
వికృత హాస్యం గలిగిన నాటకాన్ని ఆనందిస్తుంది. కోర్టులో ఎలాంటి ఎమోషన్ లేకుండా నిర్లిప్తంగా
పేజీలకొద్దీ సెడిషన్ చార్జీలను, డ్రామా చట్టాలను చదివేస్తుంది.
ఈ పాత్రలో గీతాంజలి కులకర్ణిని చూశాక ఇంత గొప్ప నటిని ఇండియన్ సినిమా ఎట్లా మిస్
అయ్యిందా అని కచ్చితంగా ఆలోచిస్తాం. బంధువులు, మిత్రబృందంతో ఏదో
రిసార్టుకెళ్లిన జడ్జిగారు పేరులో ఒక్క హెచ్
అదనంగా చేర్చుకుంటే ఎలా మంచి జరుగుతుందో ఎవరికో సలహా ఇస్తుంటాడు. తన నిద్ర చెడగొట్టినందుకు
ఒక పసిపిల్లాడి చెంప పగలగొడతాడు. ప్రతీదీ దృశ్యరూపంలోని సింబాలిజమే. చివరకు ఒకరోజు
విచారణ తర్వాత కోర్టు అటెండర్ ఒక్కొక్క లైట్ ఆర్పుకుంటూ హాలంతా చీకటి అయిపోయే దృశ్యం
కూడా మనల్ని వెంటాడుతుంది. పొరలు పొరలుగా వలుచుకుంటూ పోతూ ఉంటే ఆ దృశ్యాల్లో ఉన్న లోతు
అర్థమవుతా ఉంటది. నిగ్రహం ఎంత శక్తిమంతమైనదో కదా అనిపిస్తుంది. అసలు ఆ వయసుకు అంత నిగ్రహం
దర్శకుడికి ఎలా సాధ్యమైందో ఎంత ఆలోచించినా అర్థమయ్యే విషయంకాదు. కానీ ఒక చట్టబద్ధం
కాని హెచ్చరిక- ఈ సినిమా మీకేమీ ప్రశాంతతనివ్వదు. వార్మ్‌డ్ అప్ ఇన్ ది హెల్ అని
రచయితలకు సలహా ఇచ్చాడో పెద్దమనిషి. ఈ సినిమా చూడడం కూడా వార్మ్‌డ్ అప్ ఇన్ ది హెల్
లాంటి విషయమే. సామాజిక వాస్తవం హెల్ లాగా ఉన్నది మరి!
జి ఎస్ రామ్మోహన్
(నవంబర్ 8, 2015న ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)
ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు ఇలా స్పందించాను
ReplyDeletehttps://www.facebook.com/naresh.nunna/posts/908580349196432
- మీరు acknowledge చేశారు, థ్యాంక్స్ తో.
ఆ తర్వాత ఏడాదికి ఇలా రాశాను,
https://www.facebook.com/naresh.nunna/posts/1134209826633482
- మీరు చూడలేదు. :-)
అద్భుతంగా రాసినారు 🙏
ReplyDelete