ఇదే మహాభారతం!
-జి ఎస్ రామ్మోహన్
~
యవ్వన కాలపు పురాణ పఠనానుభవాన్ని రాస్తూ ఇంటలెక్చువల్ స్టిములేషన్, షీర్ ఎంటర్‌టెయిన్‌మెంట్ అని రెండు పదాలు వాడారు అమర్త్య సేన్. వెటకారంగానైనా రెండోది మాత్రమే నిజం అనుకున్నట్టున్నారు రంగనాయకమ్మ. అంత గాంభీర్యమేమీ అక్కర్లేదని తీర్మానించుకున్నారు. మొగ్గా పువ్వూ లేని, కాయా పండూ లేని, మోడు! మాయల, మంత్రాల, వ్యర్థాల, వైరుధ్యాల, వికృతాల, వికారాల, క్రూరత్వాల, అబద్దాల, కట్టుకథల పుక్కిటి పురాణాల పుట్ట! అని గుక్కతిప్పుకోకుండా శ్లోకం వలె చెప్పేశారు. భక్తి పూర్వకంగా ఎవరైనా అదాటున లోపలికి వెళ్లి ఆనక చెంపలేసుకునే పరిస్థితి రాకుండా పుస్తకం ముఖచిత్రం మీదే అన్ని విశేషణాలూ అచ్చేశారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడడానికి భారతం రచయితలు ఎన్ని తీర్ల ప్రయత్నాలు చేశారో అన్ని తీర్ల వారిని రంగనాయకమ్మ తిట్టిపోశారు.
‘కులాల గురించి నిర్భయంగా బరితెగించి చెప్పడమే ఈ రచనలో కనపడింది. బ్రాహ్మణులను పూజించండి! వేదాల్ని పూజించండి! అనే రెండు మాటలు తప్ప, ఆ మొత్తం కథల్లో మూడో మాట ఏదీ లేదు.! బ్రాహ్మణులను పూజించండి అన్న మాట బ్రాహ్మణులు చెప్పుకోవడమే కాదు, శూద్రులు కూడా అదే చెపుతారు! భారతంలో ఉన్న ప్రధానాంశం అంతా అదే” అని సారాంశాన్ని ముందుమాటలోనే ప్రకటించేశారు. ”నా వ్యాఖ్యానాలు నేను చేసుకున్నాను. కానీ కథలో వేలు పెట్టలేదు”. అని చెప్పారు. తన పద్ధతిలో పాటించారు కూడా. కాకపోతే మనం వాడే భాషలోనూ ధ్వనిలోనూ మన దృక్పథం ప్రతిఫలిస్తుంది. ఈ గ్రంధం రాయడం కోసం మూడు రకాల మూలాలను తీసుకున్నారు. మూడూ భక్తి సంప్రదాయంలోని వారు మౌలికమైనవిగా భావించేవే. నాస్తికులో హేతువాదులో రాసినవి కావు. ఒక రకంగా రంగనాయకమ్మ బండ చాకిరీ చేశారని చెప్పొచ్చు. దీనికోసమేనా ఇంత చాకిరీ చేసింది అనే విసుగులాంటి ధ్వని కూడా ఆమె వ్యాఖ్యానంలో ప్రతిఫలిస్తున్నదేమో అనిపిస్తుంది.
సావిత్రి తండ్రి ” కలిమికి సంతోషించనూ కూడదు, లేమికి విచారించనూ కూడదు” అన్నాడు అని రాసిన వెంటనే ‘అయితే కలిమీ-లేమి అని ఆ తేడాలెందుకు?’ అని వ్యాఖ్యానిస్తారు. సరైన తర్కాన్ని తిరస్కరించేంది ఏదైనా మూర్ఖత్వమే అని తర్క ప్రాధాన్యాన్ని ఒక చోట ఫుట్‌నోట్‌లో వివరించారు. తర్కం అన్ని వేళళా సరిపోతుందా అని అనుమానం. విరాట పర్వంలోని ఒక ఘట్టంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఎక్కడ తలదాచుకుని ఉండొచ్చు అని కౌరవులు చర్చిస్తా ఉంటారు. “ధర్మరాజు ఉన్న రాజ్యంలో పాడి సమృద్ధిగా ఉంటుంది. అన్ని దేశాలనూ పరిశీలిస్తే పాండవులు ఎక్కడ వున్నారో తెలిసిపోతుంది.” అని భీష్ముడు అన్న మాటను రాస్తారు. ఆ వెంటనే ”పాండవులు ధర్మాత్ములు అని ఒక పక్క చెపుతూనే ఫలానా రకంగా పరిశీలిస్తే పాండవులు దొరికిపోతారు అని ఇంకో పక్క చెపుతున్నాడు. రాజు చెప్పమన్నాడు కదా అని చెపుతున్నాను అంటున్నాడు. భీష్ముడు దుర్యోధనునికి జడవాలా..ఏం ఖర్మ” అంటూ వ్యాఖ్యానం చేస్తారు. భీష్ముడు అలా ప్రవర్తించడం న్యాయమని అనకపోయినా అలా ప్రవర్తించడాన్ని సమర్థించే రాజధర్మాలు అప్పటికే అక్కడ స్థిరపడి ఉన్నాయి. మొదటి పర్వాల్లోనే అది తేటతెల్లమైంది. మళ్లీ విరాట పర్వలోనూ ఆ ప్రశ్న వేస్తే అది సరైన తర్కం అవుతుందా! ఆమె పాఠాన్ని అధ్యయనం చేసేటప్పుడు వ్యాఖ్యానించేటప్పుడు కాంటెక్ట్స్‌కి సరైన ప్రాధాన్యమిస్తారా అని అనుమానం. ”ఆవుల మందలను సుశర్మ తోలుకు రమ్మంటే తోలుకు పోవడం మొదలు పెట్టారు సైనికులు” అంటూ ఆ వెంటనే ‘రాజు ఏ పని చెయ్యమని చెప్తే ఆ పని ఉత్సాహంగా చేసేస్తారన్న మాట సైనికులు. సైనికుల అజ్ఞానమే శక్తి. రాజు శక్తి’ అని విసురు విసురుతారు. ఇది సరైన తర్కమేనా అని అనుమానం. అప్పుడైనా ఇప్పుడైనా రాజు లేదా ప్రభుత్వం మాట వినడం సైనికుల విధి. పాలిటిక్స్ ఇన్ కమాండ్ అని రంగనాయకమ్మగారికి మనం గుర్తుచేయనక్కర్లేదు.
“బౌద్ధమతమూ, జైనమతమూ వంటి మతాలు,హిందూ మతంలో ధర్మాల్నీ యాగాల్నీ వ్యతిరేకించాయనీ దాని వల్లనే హిందూ పండితులు తమ మతాన్ని దృఢతరం చేసుకోవడం కోసం ఈ భారతం రచనను ప్రారంభించి సాగించారనీ, హిందూ మతవాదులు చెపుతారు” అని రాశారు. రంగనాయకమ్మగారేనా ఇది రాసింది అని ఆశ్చర్యం కలిగించే మాట ఇది. ఆ రకమైన విశ్లేషణ చేసింది ప్రధానంగా ప్రజామేధావులు. హిందూ మతవాదులు కాదు. కోశాంబి అటువంటి వ్యాఖ్యానం చేశారు. ఆయన విశ్లేషణతో ఏకీభవిస్తూ అంబేద్కర్ మరికాస్త వివరించారు. ఇది వేర్వేరు రచయితల సృష్టి అని అంబేద్కర్ చెప్పారు. ప్రాచీనం అనే అమూర్త భావనను పూర్వపక్షం చేస్తూ ఇది గుప్తరాజైన బాలాదిత్య కాలంలో వచ్చిన గ్రంథంగా తేల్చారు. చాలామంది స్కాలర్ల మాదిరే ఆయన కూడా భగవద్గీత మీద ఎక్కువ దృష్టిపెట్టారు. బౌద్ధం తర్వాత ముఖ్యంగా అశోకుడి తర్వాత కుదేలైన హిందూమతం తదనంతర కాలంలో బ్రాహ్మణ రాజైన పుష్యమిత్ర కాలం నుంచి మళ్లీ తలెగరేసిందని ఆ పరిణామాల్లో భాగంగానే భగవద్గీత రూపొందిందని అంబేద్కర్ సాధికారంగా విశ్లేషించారు. భగవద్గీత హిందూ మతవాదుల ప్రతఘాత విప్లవపు తాత్విక సమర్థనా పత్రం అని ఆయన తేల్చి చెప్పారు.
పేజీపేజీనా రంగనాయకమ్మ చేసిన వ్యాఖ్యానాలతో విసుర్లతో పేచీపడాల్సిందేమీ లేదు. అగ్నిలో కాలదు, నీటిలో తడవదు, శస్ర్తంతో ఛేదించబడదు అని ఆత్మభాషలో గంభీరంగా వినిపిస్తున్నపుడు పక్కనే ఎవరైనా అబ్బ ఛా అంటే బానే ఉంటుంది. కానీ అది సరిపోతుందా అని సందేహం. మహాభారతాన్ని ప్రత్యేకంగా భగవద్గీతను విశ్లేషించిన ప్రతి మేధావీ తన దృక్పథంలోంచి సీరియెస్‌గా విశ్లేషించే ప్రయత్నం చేశారు. గాంధీ అంబేద్కర్ ఇద్దరూ చెరోవైపున నిలబడి వ్యాఖ్యానం చేశారు. అంబేద్కర్ అందులో హింసను వర్ణాధిక్య సమర్థనను చూస్తే, గాంధీ తన భావజాలానికి అనువుగా అన్వయించుకుని సత్యానికి అహింసకు సంకేతంగా భాష్యం చెప్పారు. జంతుబలులకు వ్యతిరేకంగా దాన్ని నిర్వచించే ప్రయత్నం ఆశ్చర్యకరమైన రీతిలో చేశారు. అమర్త్యసేన్ దాన్ని విధికి-పర్యవసానాలకు మధ్య సంవాదంగా భావించారు. అణుబాంబు పితామహుడిగా చెప్పుకునే రాబర్ట్ ఆపెన్‌హైమర్‌కి అది వినాశనాన్ని తాత్వికంగా సమర్థించుకోవడానికి ఉపయోగపడే సంకేతంగా కనిపించింది. భగవద్గీత ప్రాచుర్యం దేశ సరిహద్దులు దాటి చాలాకాలమైంది. అదొక వ్యక్తిత్వ వికాస గ్రంథమని మేనేజ్ మెంట్ ఉద్గ్రంధమని ప్రచారంలో ఉంది. ఒక రకంగా గాంధీ కంటే ముందు విదేశాలకు భారత్ ఎగుమతి చేసిన అంశాల్లో యోగ-వాత్సాయన కామసూత్రాలతో పాటు భగవద్గీతను కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. మన దృష్టిలో ఎలాగున్నా సమాజంలో దానికి అలాంటి ప్రాధాన్యమున్నపుడు దాన్ని విమర్శించే పద్ధతి ఎలా ఉండాలి? రంగనాయకమ్మ ఎంచుకున్న టోన్ సరైనదేనా అని అనుమానం.
“భారతదేశంలో మెజారిటీ ప్రజల్ని సంస్కృతి పేరుతో బుట్టలో వేసే మతగ్రంధాలు రామాయణ, భారత, భాగవతాలు. వాటిలో ఉన్న నిజానిజాలు ఈ ప్రజలకు తెలిసి తీరాలి” అని చెప్పారు. ఇంకా “ఏ దేశం అయినా ఏయే తప్పుడు సంస్కృతుల్లో పీకలదాకా కూరుకుని ఉందో ఆ సంగతి ఆ దేశంలో జనాలకు నిజంగా తెలిస్తే వాళ్లు అదే రకం జీవితాల్లో ఉండిపోవాలని కోరుకోరు. అజ్ఞానం వల్ల అలా ఉండిపోతే ఆ జీవితాల్లో ఆనందంగా ఉండలేరు.” అని తేల్చారు రంగనాయకమ్మ. కేవలం తర్కంతో చూస్తే ఎలా కనిపిస్తుందో కానీ ఇది కాస్త సంక్లిష్టమైన వ్యవహారం. మనుషుల ఆచరణలోని లోటుపాట్లకు జ్ఞానం ఉండడం లేకపోవడం అనేదే కారణమవుతుందా! అలవాట్లు, అవసరాలు, ప్రయోజనాల పాత్ర, ఇంకా అనేకానేక అంశాల పాత్ర ఉండదా! తన గ్రంధ లక్ష్యాన్ని ఇంత భారీగా పెట్టుకోవడం అచారిత్రకమైన ఆశావాదమవదా! కర్త కర్మ క్రియ అతడే, అతడి ఆజ్ఞలేనిది చీమైనా కదలలేదు అని చెపుతున్నవారికి మరి ఈ నేరాలు ఘోరాల మాటేమిటి? వాటికి కూడా ఆయనే బాధ్యుడు కదా? అనే ప్రాధమిక ప్రశ్నలు కూడా తలెత్తకుండా ఉంటాయని అనుకోగలమా! భక్తి విషయంలో మతం విషయంలో నిజానిజాల ప్రభావం ఎంత అనేది సంక్లిష్టమైన విషయం. అదలా ఉంచి, సాధారణ ప్రజలు అంటే తప్పుడు సంస్కృతుల్లో పీకలలోతు కూరుకుపోయిన ప్రజలు దీన్ని చదివి మారే అవకాశం ఎంత? అసలు మనిషి లోపలికి అడుగే పెట్టకుండా తలుపు దగ్గరే కాపు కాసి అంతపెద్ద విశేషాణాల సమ్మెటతో దెబ్బ వేశాక ఏ ధైర్యంతో వాళ్లు లోపలికి అడుగుపెట్టాలి? ఎక్కువలో ఎక్కువ అన్ని పురోగామి స్రవంతుల్లోని నాస్తికులే చదవాలి. అదొకరకంగా మోనోలాగ్ అవుతుంది. డీటైల్స్ మినహాయిస్తే వారైనా దీన్నుంచి కొత్తగా పొందే చైతన్యం ఏమిటి? కాబట్టి ఇది సరైన వ్యాఖ్యాన పద్దతే అవుతుందా అనేది ఆలోచించుకోవాల్సి ఉందేమో! వేరే ప్లేన్ ఎంచుకుని ఉండాల్సిందేమో!
ఈ అంశాలతో పాటు మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఆ మధ్య కథా రచయితలు కొందరు కలిసినపుడు ఇపుడైతే రామాయణ విషవృక్షం సాధ్యమేనా అనే చర్చ వచ్చింది. హిందూత్వ ఉన్మాదం ఇంతగా పెచ్చుపెరిగిపోయి ప్రతీదీ వివాదమవుతున్న నేపధ్యంలో ఇపుడు అలాంటిది సాధ్యం కాదేమో అని అభిప్రాయం వెల్లడైంది. కానీ ఆ అభిప్రాయాన్ని తప్పని నిరూపించారు. అలా నిరూపించినందుకు రంగనాయకమ్మకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్సులు.
(అక్టోబర్ 15, 2015న సారంగలో ప్రచురితం)
No comments:
Post a Comment