Thursday, 14 April 2016

మదర్‌ ఇండియా-దేశభక్తి పురాణం



నెహ్రూ ఆనవాళ్లపై మోదీ చేస్తున్న యుద్ధం ఇపుడు నెహ్రూ విశ్వవిద్యాలయం దగ్గర వచ్చి ఆగింది. ఈ యుద్ధంలో ప్రతీదీ సింబాలిజమే. ఆ సింబాలిజాన్ని మొదలుపెట్టినవాడు మోదీ.  స్వాతంత్ర్యోద్యమ వారసత్వం లేకపోగా ఆ స్వాతంత్రోద్యమ నాయకుడు గాంధీ హంతక వారసత్వమున్న సమూహానికి చెందినవాడు మోదీ. నెహ్రూ స్మృతులను చెరిపివేయకుండా  బలమైన పునాదులు వేసుకోవడం కష్టమని గ్రహించినవాడు. ఇతరత్రా భావోద్వేగ అంశాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినా అది తాత్కాలికమే అవుతుందని గ్రహించి పాత గురుతులు  చెరిపివేయడానికి ప్రయత్నించిన తొలి బిజెపి నాయకుడు. నెహ్రూని చెరిపివేయడమంటే ఆయన విధానాలను , ఆయన ఆరంభించిన ప్రణాళికా సంఘం లాంటి వాటిని రద్దు  చేయడమొక్కటే కాదు. పటేల్‌ విగ్రహాలను పెద్దవి చేయడమొక్కటే కాదు. బోస్‌ ఫైల్స్‌ అడ్డం పెట్టుకుని దాడి చేయడమొక్కటే కాదు. నెహ్రూని చెరిపివేయడమంటే దేశపు మేధో  వారసత్వంలో బలంగా జీర్ణించుకుపోయి ఉన్న లిబరల్‌, లెఫ్టిస్ట్‌ ధోరణులను తుడిచేయడం. మిగిలిన పనులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేయొచ్చు. కానీ ఇక్కడ ఘర్షణ ఎదుర్కోక  తప్పదు. నెహ్రూ ఇతరత్రా అంశాల్లో ఎన్ని సర్దుబాట్లు చేసుకున్నా ఒక్కో సారి రాజీ పడినట్టు కనిపించినా మేధో సంప్రదాయంలో మాత్రం గంభీరమైన వాతావరణానికి బాటలు వేశారు.  అక్కడ సైంటిఫిక్‌ టెంపర్‌మెంట్‌ కోసం ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీ బంట్లను నియమించాలని ఎన్నడూ అనుకున్నట్టు కానరాదు. కాంగ్రెస్‌ అంత:పుర రాజకీయాల్లో భాగంగా తర్వాత  పదవి చేపట్టిన ఆయన వారసులు కూడా ఈ విషయంలో ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. వామపక్షాలతో దోస్తీ నెరుపుతున్న కాలంలోనే కాదు. వారు ప్రత్యర్థులుగా మారిన కాలంలో  కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థలకు వామపక్ష, లిబరల్‌ భావాలున్న వారినే నియమించేవారు. ఇపుడు మోదీ ఈ మొత్తం విధానాన్నే సవాల్‌ చేయదల్చుకున్నారు.దీన్ని సవాల్‌ చేయకుండా  మనం తలల మార్పిడి శస్ర్త చికిత్సలు ఎపుడో చేశామని, విమానాలు ఎప్పుడో కనుగొన్నామని సైన్స్‌ కాంగ్రెస్‌లో చెప్పడం సాధ్యం కాదు. టిప్పు సుల్తాన్‌ గురించి శివాజీ గురించి తమకు  తోచింది ప్రచారం చేయడం సాధ్యం కాదు. సినిమా కళారంగాల్లో తమ అజ్ఞానాన్ని బాహాటంగా ప్రదర్శించుకోవడం సాధ్యం కాదు.  జీవితాన్ని వాటికే అర్పించిన మేధావులు ఆయా  రంగాలన్నింటిలో స్థిరపడి పోయి ఉన్నారు.అక్కడ గురి చూసి కొట్టారు మోదీ. దేశంలోని సెక్యులర్‌ లిబరల్‌ లెఫ్టిస్ట్‌ శక్తులతో యుద్ధానికి తలపడ్డారు. అది ఎఫ్‌టిటిఐ లాంటి సంస్థల్లో  నియామకాలు కావచ్చు. హేతువాదులు, నాస్తికులపై దాడులు కావచ్చు. ఆడవాళ్ల బట్టలమీద అదేపనిగా చర్చ లేవనెత్తడం కావచ్చు. టిప్పు సుల్తాన్‌ లాంటి ఎపిసోడ్‌లు కావచ్చు.  దేశభక్తిమీద చర్చ కావచ్చు. మరేదైనా కావచ్చు. ఇవ్వన్నీ ఈ దేశపు సాంస్కృతిక రంగంలో ఇప్పటివరకూ ఎంతో కొంత స్థిరపడి పోయి ఉన్న సెక్యులర్‌ లిబరల్ వామపక్ష స్ఫూర్తిని  తుడిచివేసే బలమైన ప్రయత్నం. సైన్స్‌ కాంగ్రెస్‌, హిస్టరీ కాంగ్రెస్‌ లో ఆ మార్పులు కనిపిస్తున్నాయి. ఇంతవరకూ దేశాన్ని ఏ పార్టీ పాలించినా భావజాల రంగంలో బలమైన ప్రయత్నం  చేయలేదు. ఇది ఒక రకంగా కాషాయ సాంస్కృతిక విప్లవం.  ఇక్కడ రివర్స్‌. బంబార్డ్‌ ది హెడ్‌ క్వార్టర్స్ లాగా కేంద్రంపై పోరు కాదు. కేంద్రం నుంచి పోరు.
ఈ ముప్పును ఆయా రంగాల్లోని వారు సరిగానే గ్రహించారు. కానీ వారు సంఘటితశక్తిగా లేరు. అందువల్ల ఏ రంగానికి ఆ రంగం ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. అందులోనూ బోలెడంత  సింబాలిజం ఉంది. చరిత్రకారులు స్పందించారు. సైంటిస్టులు స్పందించారు. రచయితలు తమ అవార్డులు వెనక్కు ఇవ్వడం ద్వారా స్పందించారు. సినిమా కళాకారులు వారికి తోచిన  రూపాల్లో స్పందించారు. ప్రతి రంగంలోనూ విభజన స్పష్టంగా కానవచ్చిన కాలమిదే.కానీ  ప్రతిఘటన వచ్చిన కొద్దీ మోదీ పరివారం మరింత కరుగ్గా తయారవుతూ వచ్చింది. మన  ప్రయాణం ఎటువైపు అనేదానికి ఇదొక సింబల్‌. ఆయా సందర్భాల్లో వారి మాటలు, చేతలు చూస్తే వారికి ఎంత స్ఫష్టమైన ఎజెండా ఉందో అర్థం అవుతుంది.ప్రతిష్టాత్మకమైన పుణే ఫిల్మ్‌  ఇన్‌స్టిట్యూట్‌కి జోకర్‌ లాంటివాడిని నియమించారు అని మెజారిటీ కళాకారులు గొంతెత్తి నినదించినా, విద్యార్థులు నెలల తరబడి ఆందోళన చేసినా ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గలేదు.  ఈ స్పష్టమైన సంకేతాలు గ్రహించే అన్ని రంగాల్లోని లిబరల్‌ వామపక్ష శక్తులు తమ శక్తిమేరకు తమకు తోచిన రూపాల్లో నిరసన తెలిపారు.రాజకీయ రంగంలోని వైఫల్యం వల్ల కళాకారుల  సైంటిస్టుల మేధావుల ప్రయత్నం కూడా తాటాకు మంటగానే మిగిలిపోయింది. కాకపోతే ఏదో ముప్పు పొంచి ఉంది అనే స్పృహ ఐతే దేశంలోని ఆలోచనాపరుల్లో పెంచగలిగింది. ఇపుడిక  చివరిగా విద్యార్థుల వంతు.మధ్యతరగతి ప్రభుత్వ హాస్టళ్లో చదువుకునే రోజులు ముగిసిపోయాక కళాశాలల్లో రాజకీయ చైతన్యం దాదాపుగా అడుగంటింది.క్యాంపస్‌లలో ఉండే అనుకూల  వాతావరణం వల్ల అక్కడ కేంద్రీకృతమైంది.ఉడుకుడుకు నెత్తుటి వ్యక్తీకరణ  వేడిగా ఉంటుంది. ప్రభుత్వం అందులోని వేడిని మాత్రమే బయటకు చూపించి అందులోని నిప్పులాంటి  వాస్తవాన్ని మాత్రం దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నది. అవసరం అనుకున్న చోట నిప్పుకు ఫోటోషాప్‌ మంటలద్ది మీడియాకు వదులుతున్నది. అందుకు అన్ని అంగాలను వాడుకుంటున్నది.  హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో రోహిత్‌ ఆత్మహత్య తర్వాత తమకు తోచిన రీతిలో ఎడిట్‌ చేసిన కొన్ని దృశ్యాలను మీడియాలకు విడుదల చేయడం ఇందులో భాగం. జెఎన్‌యులో  కన్నయ్య కుమార్‌ నినాదాలపై తప్పుడు ఆడియో వేసి మోసపు వీడియో విడుదల చేయడం అందులో భాగం. వాస్తవానికి రెండు చోట్ల విద్యార్థుల ఆందోళనలో కశ్మీర్‌, అప్జల్‌ గురు  వివాదాస్పద ఉరి అంశాలు ఉన్నాయి. ఆ రెండూ చూపించి దేశభక్తిపేరుతో ఉన్మాదం పెంచొచ్చు. కానీ ఆ రెండూ మాట్లాడుతున్నవారు మేధావుల్లో చాలామందే ఉన్నారు. అందువల్ల  భారత్‌కు బర్బాద్‌ కరేంగీ అన్నారని యాకూబ్‌మెమన్‌ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇట్లా ఏవేవో మాటలు ఎలివేట్‌ చేసి లిబరల్స్‌ను కూడా ఇబ్బంది పెట్టాలనేది ఎత్తుగడ.  విద్యార్థులకు మద్దతునిచ్చే లిబరల్‌ న్యాయవాదులను కోర్టులోనే పరుగులు పెట్టించి మరీ కొట్టారు. కన్నయ్యను కోర్టు ఆవరణలోనే పోలీసుల మధ్యలోనే దారుణంగా కొట్టారు. పైగా  ఉచ్చపడేట్టు కొట్టాం అని బహిరంగ ప్రకటనలు కూడా ఇచ్చారు. భౌతికంగా తమకు ఉన్న ఆధిక్యతను భావజాల యుద్ధంలో పూర్తిగా ఉపయోగించుకోవాలని మోదీ పరివారం భావిస్తోంది.  ఇది స్పష్టం. 

స్మృతి ఇరానీ గరం గరంగా మాట్లాడారు. సావిత్రి మాదిరే తనకూ గ్లిజరిన్ అవసరం లేదు అని నిరూపించారు. చాలా ఎమోషనల్‌గా పవర్‌ఫుల్‌ స్పీచ్‌ ఇచ్చారు. బిజెపిలో మరెవరూ  మాట్లాడలేనంత గంభీరంగా మాట్లాడారు. వెల్... ఇంతకీ సారాంశమేమిటి? ఒక్క ముక్క అయినా పనికొచ్చేది మాట్లాడారా? ఈ దేశపు మానవవనరుల మంత్రి ఫలానా ఫలానా అంశాలపై  తనకు వ్యక్తిగతంగా ఫలానా ఫలానాఅభిప్రాయాలు భావోద్వేగాలు ఉన్నాయని ప్రకటించారు. అంతకంటే సరుకు అందులో ఏమన్నా ఉందా! మహిషాసుర అమరత్వ మట అని ఎద్దేవా  చేశారు. తడికంటితో గద్గదంగా మాట్లాడారు. మహిషాసుర అమరత్వపు దినం జరపడం ఇది కొత్త కాదని ఆమెకి ఎవరైనా చెప్పాలి కదా! నరకాసురుడి అమరత్వం కూడా  జరుపుకొంటున్నారని దీని వెనుక తరతరాల వివక్ష బారిన పడిన మండిన గుండెల ఆవేదన ఉందని ఆమెకెవరైనా చెప్పాలి కదా! దేవతలు రాక్షసులకు సంబంధించి ఒకే ఒక లీనియర్‌  సిద్దాంతం ఏమీ లేదు. ఎవరి నమ్మకాలు వారికి ఉండొచ్చు. దేవతలు ఆధిపత్య సూచికలు అని భావించేవారు ఆ ఆధిపత్యాన్ని సవాల్‌ చేయడానికి రాక్షసుల్లో తమను తాము  చూసుకోవచ్చు. చరిత్రలోనే కాదు. పురాణాల్లో కూడా గెలిచిన వాడే హీరో. ఓడిన వాడు విలన్.ఈనాడు అనేక రకాలుగా సమాజంలో ఓటమికి వివక్షకు బలవుతున్నవారు  ఆ నాడు ఓటమి  పాలైన వారిలో తమను తాము చూసుకోవడం ఒక సింబాలిక్‌ విషయం. దాని వెనుక పనిచేసే ఆర్యన్‌-ద్రవిడియన్‌ సిద్ధాంతాలను కాసేపు పక్కనబెడదాం. ఆమె ఏం చేశారు? కోల్‌కతాలో ఈ  మాట అనగలరా అని బెంగాల్‌ సభ్యులకు సవాల్‌ విసిరారు. ఇందులో ఏముంది? ప్రిన్సిపులా, రాజకీయ ఎత్తుగడా! తమిళనాట రాముడిని కొలిచే ఆచారం ఉండక పోవచ్చు. కొన్ని చోట్ల  రావణాసురుడిని కొలిచే ఆచారం ఉండొచ్చు. అయ్యో మహిషాసురుడిని కొలుస్తారా అని అదేదో ద్రోహం లాగా పార్లమెంట్‌లో పేపర్లు విసిరేస్తూ ఊగిపోతా ఉంటే ఆహా, ఏమి సెప్తిరి ఏమి  సెప్తిరి అని మనం చప్పట్టు కొట్టాలా? ఏవో పుస్తకాలు తెచ్చి నాలుగో తరగతికి ఇలాంటి పాఠాలు చెప్తారా, ఆరోతరగతికి ఇలాంటి పాఠాలు చెప్తారా అని నిగ్గతీసి అడిగారు. అలా వెతుక్కుంటూ  పోతే చాలానే ఉంటాయి. అంతెందుకు, చంద్రుని మీదకు గ్రహాలు పంపుతూ ఒకే తరగతిలో ఒక చోట అదొక గ్రహమని ఇంకో చోట అదొక దేవత అని చెప్పడం వింత కాదూ! ఈ వింతని  వింత అనలేనంతగా మనం అలవాటు పడలేదూ. చంద్రుని మీదకు ప్రయోగాలు చేసే సైంటిస్టులే, చంద్రుని తలలో ధరించాడని భావించే విగ్రహానికి మొక్కడం అసహ్యంగా లేదూ! అలవాటై  పోయిన వింతలు, అసహ్యాలు మామూలైపోతాయి. ఆధిపత్య సమూహపు వింతలువింతలుగా కనిపించవు. ప్రభుత్వాధినేతలు ముహూర్తాలు చూసి పునాదులు వేయడం, పూజలు  చేయడం వగైరా రాజ్యాంగానికి అవమానం కాదూ! ఇవేమీ మనం అడగడం లేదు కాబట్టి అవన్నీ వాళ్ల విశ్వాసం పోనిద్దురూ అనే సహనం మనందరిలో పెరిగిపోయింది కాబట్టి వారికి  న్యాయమైన విషయాల పట్ల కూడా అసహనం వెలిబుచ్చే అవకాశం వస్తోంది. చాలా సహజమైన విషయాలు కూడా విడ్డూరంగా కనిపిస్తున్నాయి. ఇంత గంభీరమైన ఉపన్యాసం ఇచ్చిన  మంత్రిణి కన్నయ్య కుమార్‌ మీద కేసులు తప్పుడు కేసులా నిజమైనవా  అనే విషయంలోకి మాత్రం రాలేకపోయారు. అతను బ్రాహ్మణిజం పోవాలి, ప్యూడలిజం పోవాలి, క్యాపిటలిజం  పోవాలి, అంటే కశ్మీర్‌కు అఫ్జల్‌ గురుకు అనుకూలంగా భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడినట్టు తప్పుడు మాటలు చెప్పి అరెస్ట్‌ చేశారే,దాని గురించి స్మృతి గారి నోరెందుకు మూతపడినట్టు.  చనిపోయిన రోహిత్‌ ఒక అబ్బాయి.కులం మతం కాదు, ఒక మనిషి, ఒక యువకుడు. ఒక తల్లిగా మాట్లాడుతున్నా అని ఆవేశపడిన స్మృతికి కన్నయ్య గురించి ఎందుకు నోరు రాలేదు.  ఎందుకంటే చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం ఈజీ. పైగా కులం మతం ఇత్యాది విషయాల్లో ఆధిపత్య స్థానాల్లో ఉన్నవారికి వాటి ప్రస్తావన అవసరం ఉండదు. వారికి చాలా  ఇన్‌ఫార్మల్‌ లెవల్లో ఆపరేట్‌ చేసే విద్యలు తెలిసి ఉంటాయి. కొత్తగా వాటిని ఎదుర్కోవాల్సిన సన్నివేశంలో ఉన్నవారే సంఘటితం కావల్సి ఉంటుంది. ఫార్మల్‌ రూపాల్లో బాహాటంగా వాటి  గురించి మాట్లాడాల్సి వస్తుంది. అందుకే ఈ దేశంలో కులాన్ని మతాన్ని అన్ని చోట్లా సోషల్‌ కేపిటల్‌గా ఆధిపత్య సాధనంగా వాడుకునే వారే ఈ కులం గోల ఏటండీ అనేస్తుంటారు. కేంద్రీయ  విశ్వవిద్యాలయాల్లో 23 మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో 19 మంది దళితులు, ఇద్దరు ఆదివాసీలు, ఒక మైనారిటీ అని ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక తేల్చింది. మరి  ఆత్మహత్యల మీద దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు పేటెంట్ ఎందుకు ఉందో బతుకు భరోసాపైన సంపదపైనా మిగిలిన వారికి పేటెంట్‌ ఎలా వచ్చిందో సదరు మంత్రిణి గారు చెప్పాలి  కదా? ఇంతకీ స్మృతి ఇరానీ గరం గరం ఉపన్యాసం రుచి ఏమిటి? సుగతో బోస్‌ చేసిన అర్థవంతమైన ఉపన్యాసం సోదిలేకి లేకుండా పోయి మీడియా అంతా స్మృతి ఇరానీ కనిపిస్తే మనం  ఏమని అర్థం చేసుకోవాలి?

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, దేశభక్తి అనే రెండు భావనలకు సంబంధించి బోలెడంత చర్చ నడుస్తూ ఉంది. చదువుకోవాల్సిన చోట రాజకీయాలేంటి అనే పాత ముతక మాటల దగ్గర్నుంచి  ఫలానా ఫలానా నినాదాలు ఇవ్వవచ్చా అనేదాకా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఆర్మీ వాళ్లు ఎక్కడో వాతావరణం బాగా లేక చనిపోతే దాన్ని పోటీ పెట్టి తోక కోసిన కోతిలాగాగంతులు  వేసే వాళ్లూ ఉన్నారు. విద్యార్థి లోకం బిజెపితో పెట్టుకోదల్చుకుంది. వారి జగన్నాధ రథచక్రాన్ని అడ్డుకోదల్చుకుంది. మిగిలిన రంగాలు ప్రయత్నించి వదిలేసిన బాధ్యతను తాను భుజాన  వేసుకోదల్చుకుంది.అదీ అసలు విషయం. మిగిలిందంతా సింబాలిజమే.ఇందులో వారికి ఫలానా అంశం అవసరమా కాదా అనే చర్చ ఉండదు. ఏ నినాదం ఇస్తే బిజెపికి గట్టిగా  తగులుతుందో అదే విసురుతారు.  కశ్మీర్‌, అఫ్జల్‌ గురు, యాకూబ్‌మెమన్‌ అంశాలు అలా వచ్చి చేరినవే. ఈ మూడు అంశాల్లోనూ వివాదాలున్నాయి.  కశ్మీరీల స్వేచ్ఛా కాంక్షకు  మద్దతునిచ్చేవారంతా ఉగ్రవాదులైతే వారికి ప్లెబిసైట్‌ నిర్వహిస్తామని లాల్‌ చౌక్‌లో హామీ ఇచ్చిన ప్రప్రధమ ప్రధాని నెహ్రూ ఏమవ్వాలి?  భారత రాజ్యం వారికిచ్చిన హామీ ఏమైంది అడిగిన  పాపానికి టెర్రరిస్టులు అని ముద్ర వేస్తున్న వారు హురియత్‌ కాన్ఫరెన్స్‌తో ఏ ప్రాతిపదికన చర్చలు జరుపుతున్నారు. వారినెప్పుడూ టెర్రరిస్టులు అని పిలవగా మనం విన్నామా? అఫ్జల్‌  గురు శిక్షకు సంబంధించి న్యాయనిపుణులు కూడా అప్పట్లోనే సందేహాలు వెలిబుచ్చి ఉన్నారు. కలెక్టివ్‌ కన్‌సైన్స్‌ ను సంతృప్తిపర్చడానికి ఈ శిక్ష విధిస్తున్నట్టు అప్పట్లో సుప్రీం కోర్టు  పేర్కొంది. ఆ తీర్పును తప్పు పట్టడం నేరమా? అఫ్జల్‌ గురు అమరవీరుడని పిడిపి పబ్లిగ్గానే ప్రకటించుకుంది. మరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని బిజెపి కశ్మీర్‌లో అధికారంలో ఎలా భాగం పంచుకుంది? యాకూబ్‌ మెమన్‌ను ఏమీ చేయం అని మంచి మాటలతో భారత్‌ పిలిపించి ఉరిశిక్ష వేశారు అనే వాదన బలంగా ఉంది. పోలీస్‌ శిబిరాల్లోనే  దీనికి సంబంధించిన వివాదాలున్నాయి. ఇవేమీ కొత్త అంశాలు కావు. కొత్తగా కళ్లు పత్తిపువ్వుల్లాగా విప్పార్చుకుని చూడాల్సిన వివాదాలూ కావు. సుప్రీంకోర్టు శిక్ష విధించిన మనిషికి  మద్దతుగా మాట్లాడాతారా అని కళ్లు ఇంత పెద్దవి చేసి స్మృతి ఇరానీ ప్రశ్నిస్తున్నారు. విమర్శలకు సుప్రీంకోర్టు అతీతమేమీ కాదు అని ఆమెకు ఎవరు చెప్పాలి? చుండూరు మారణకాండకు  ఎవరూ కారకులు కారన్నట్టు అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తే హైకోర్టును విమర్శించకుండా ఉన్నామా? సదరు మంత్రిణికి ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి ప్రజాస్వామ్య చరిత్ర గురించి  ఎవరు చెప్పాలి? అసలీ దేశభక్తి అనే కాన్సెప్ట్‌ ఎప్పుడు వచ్చింది, దాని మూలాలేమిటి అనే చర్చ వేరే కథ. ఆ మాటకొస్తే దేశం దేశభక్తి అనే భావనలను ఎగతాళి చేసిన ఠాగూర్‌ గీతాన్ని  జాతీయగీతంగా పెట్టుకున్న దేశం మనది. స్మృతి ఇరానీ వాదన ప్రకారం అయితే ఠాగూర్‌ దేశద్రోహి అవుతారు. అనగలరా ఆమె ఆ మాట. సుగతా బోస్‌కు పదే పదే సవాళ్లు విసిరిన  మంత్రిణి ఈ మాటకు బదులు చెప్పగలిగారా?  బెంగాల్‌ వీధుల్లో కోల్‌కతా కాళీనే కాదు, మేడమ్‌, ఠాగూర్‌ కూడా ఉంటారు అని ఆమెకు ఎవరు చెప్పాలి? దేని పట్ల అయినా ఏభక్తి అయినా  ఆరోగ్యకరమైనది కాదు. వ్యక్తికి కాదు. సమాజానికి కాదు. భక్తి హేతువుకు బద్ధశత్రువు.  బలవంతుని అభిప్రాయాలే అభిప్రాయాలుగా చెలామని అయ్యే చోట దేశభక్తి మెజారిటీ పట్ల భక్తే.  అదేమీ అమూర్తమైనది కాదు. అంతిమమైనదీకాదు. దేశభక్తి పేరుతో మిలిట్రీ డ్రెస్‌ చూసి చొక్కాలు చించుకుని స్టుడియోనే కిష్కింధ కాండగా మార్చే చానల్‌ సంపాదకులు ఉన్న చోట  చదువు బొత్తిగా లేనట్టు కనిపిస్తున్న స్మృతి ఇరానీకి ఏం చెపుతాం?
 జెఎన్‌యు లాంటి వివాదమే జాదవ్‌పూర్‌ వర్సిటీలో చెలరేగితే అక్కడ విసి చొరవ వల్ల అది అక్కడికే పరిమితమైంది. జెఎన్‌యులో పరివారం నియమించిన విసి లాగా జాదవ్‌పూర్‌ విసి  పోలీసులను పిలవలేదు. సెడిషన్‌ కేసులు పెట్టించలేదు. మాజీ ఆర్మీ వాళ్లతో దేశభక్త  పేరెడ్‌ నిర్వహించలేదు. ఆర్మీ యూనిఫామ్‌ దేశభక్తి సంకేతం కావడంలోనే ప్రమాదకరమైన సింబాలిజం  దాగున్నది. జెఎన్‌యు వివాదం కన్నయ్యతో ఆగదు. అసలు వారి టార్గెట్‌ కన్నయ్య కూడా కాకపోవచ్చు.  ఉమర్‌ ఖలీద్‌ లాంటి వాళ్లు కావచ్చు. అతను ప్రాతినిధ్యం వహించే రాజకీయ  భావజాలం కావచ్చు. అతను ప్రాతినిధ్యం వహించే మార్జినలైజ్డ్‌ సమూహాలు కావచ్చు. ఉమర్‌ ఖలీద్‌లాంటి వారి భవితవ్యం ఏమవుతుంది అనేదాన్ని బట్టి మనం ఎంతవరకు మన  ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకోగలం అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్కటైతే నిజం. ఇది ఇక్కడితే ఆగేది కాదు. దళితులు మైనారిటీలు విద్యావంతులు అయ్యే కొద్దీ మార్క్స్‌  అంబేద్కర్‌ తిరిగి తిరిగి వస్తారు. పరివారానికి సవాళ్లు విసురుతూనే ఉంటారు.
 జి ఎస్‌ రామ్మోహన్‌ 
(ఫిబ్రవరి 27, 2016న ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

2 comments: