Friday, 24 August 2012

కొన్ని పదార్థాలు; కొన్ని ప్రమాదాలుగౌహతిలో కొందరు రౌడీలు ఒక అమ్మాయిపై దాడిచేసి నీచంగా ప్రవర్తిస్తారు. ఆ అమ్మాయి పబ్ నుంచి వస్తున్నది కాబట్టి మోరల్ పోలీసింగ్ అంటాం. మంగుళూరులో ఇంకొందరు రౌడీలు ఒక రిసార్టు మీదకు వెళ్లి అక్కడున్న అమ్మాయిలు, అబ్బాయిలపై దాడి చేస్తారు. అమ్మాయిల వంటిమీద చేతులు వేసి కుతి తీర్చుకుంటారు. మోరల్ పోలీసింగ్ అనే అంటాం. ఉత్తరాదిలో కొందరు అగ్రవర్ణ దురహంకారులు తమ కూతురు ఎవర్నో ప్రేమించిందని ఆ అమ్మాయిని అబ్బాయిని చిత్రహింసలు పెట్టి చంపుతారు.

అలాంటి హత్యలు వరుసపెట్టి జరుగుతూనే ఉంటాయి. ఆనర్ కిల్లింగ్స్ అంటాం. తెలుగులో పరువు హత్యలు అని అనువదించుకుని వాడతాం. అదే సమయంలో దీనికి రివర్స్ అన్నట్టు ఒక బూతు చిత్రాల తార హిందీ సినిమాల్లో నటిస్తుంది. ఆమెను మాత్రం బూతుతార అనకుండా శృంగార తార అని వ్యవహరిస్తాం. భిన్నమైన విషయాలుగా కనిపించినా వీటన్నింటిలో పూసలో దారంలాగా ఒక మెథడ్ ఉంది. ఒక భావజాలం ఉంది. అది వ్యవస్థీకృతమైన పాత విలువలను, మార్కెట్‌ను ఆమోదించే భావజాలం. నేరాన్ని తక్కువ చేసి చూపే భావజాలం. ఈ భావజాలం వెనుక క్యాస్ట్ ఉంది. క్లాస్ ఉంది. జెండర్ ఉంది. బహిరంగంగా కనిపించదు. సటిల్‌గా ఉంటుంది. కానీ వాటి ప్రభావం దుర్మార్గంగా ఉంటుంది. బహిరంగంగా కనిపించే రూపాల కంటే కనిపించని రూపాలే శక్తిమంతమైనవి.

ముందుగా పరువు హత్యల సంగతి చూద్దాం. పరువు హత్యలేమిటి? అవి కుల దురహంకారంతో చేసిన హత్యలు కదా! కుల దురహంకార హత్యలు అనడానికేమిటి నొప్పి? నొప్పి ఉన్నది. ఆ నొప్పి పేరే కులం. పరువు హత్యలు అనే పదం దేన్ని సూచిస్తున్నది? పరువు కోసం చేసిన హత్య అని చెబుతున్నది. పెద్ద కులం వాళ్లు పరువు పోతుందనే బాధతో ఈ హత్య చేశారు అనే పరోక్ష సమర్థనను ఈ పదబంధం ఇస్తున్నది. తలకాయలు ఇంకాస్త కులంలో కూరుకుపోయి ఉన్న వాళ్ళకైతే పాపం ఏం చేస్తారు, వాళ్లు ఊర్లో తలెత్తుకుని తిరగొద్దా... కన్న కూతురు పరువు తీస్తే ఏం చేస్తారు అని గట్టిగానే సమర్థించే అవకాశాన్ని కల్పిస్తున్నది. ఇంతేనా... ఆ హంతకులను ఆ హత్యలకు తీర్పులిచ్చిన పంచాయతీ పెద్దలను పిలిచి స్టూడియోల్లో కూర్చోబెడతాం.

వి ఆర్ వెరీ లిబరల్. నేరాలకు వెనుక ఉన్న సామాజిక కారణాలను పట్టించుకోవాలి అని వామపక్షవాదులు విస్తృతమైన అర్థంలో అన్నప్పుడు మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది. దొంగతనాలకు కారణాలను చూడం కదా... వాటిని పరోక్షంగా సమర్థించే పదబంధాలు వాడం కదా! వాళ్లను స్టూడియోలకు పిలిచి చర్చించం కదా! కానీ అంతకంటే పెద్ద నేరమైన హత్యలకు మాత్రం సామాజిక కారణాలను చూస్తాం. ఆ కారణం కూడా మానవీయమైనది కానప్పటికీ దానికదిగా దుర్మార్గమైనదిగా కనిపిస్తున్నప్పటికీ సంకోచం లేకుండా నేరాన్ని తక్కువచేసి చూపే పదబంధాన్ని వాడతాం. ఎందుకంటే దొంగలు మన వాళ్లు కాదు. ఈ హంతకులు మనవాళ్లు. కాబట్టి సానుభూతితోనూ సహానుభూతితోనూ నేర స్వభావాన్ని తగ్గించి చూపే పదబంధాన్ని వెతుక్కుంటాం.

ఇపుడు రెండో అంశం దగ్గరకు వద్దాం. ఈ మోరల్ పోలీసింగ్ ఏమిటి? సమాజంలో నైతిక ప్రవర్తన అమలు బాధ్యతను భుజానవేసుకున్న వారు అనే అర్థం ఇస్తున్నది. నువ్వు గొంతు పెంచి ఈ మోరల్ పోలీసింగ్ చేసే అధికారం వీరికెవరిచ్చారు అని గట్టిగానే ప్రశ్నించొచ్చు. కానీ నువ్వు ఎంత అరిచినా అది యానిమేటెడ్ యాంగర్ అని నీ పదజాలంలోనే తెలిసిపోతున్నది. సంప్రదాయ నైతికతే అనుకుంటే పర స్త్రీ మీద చేతులెలా వేస్తారు? అంటే దాడిలో ఉన్నది నైతికతా? మనకు అందుబాటులో లేని స్త్రీ శరీరాన్ని ఏదో పేరుతో తాకాలనే కోరికా? ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో చొరబడి నానా రభస చేసి ఆనందం పొందే వికృత మనస్తత్వమా? అర్బన్ లైఫ్‌తో పాటే మన జీవనంలో ప్రైవసీ అనే పదం వచ్చి చేరింది.

గడ్డివాములు, చెరుకుతోటల ఆదరాబాదరా వ్యవహారాలు ఇక్కడ అవసరం లేదు. వాటికి అర్బన్ ప్రత్యామ్నాయాలే పార్కులు, ఇంటర్‌నెట్ కేఫులు, పబ్బులు, రిసార్టులు. ఈ పరిణామం మంచా చెడా అనేదిక్కడ విషయం కాదు. వాళ్లు మేజర్లు. తాము చేస్తున్నది మంచో చెడో తేల్చుకోగలిగిన వయసులో ఉన్నవారు. వాళ్లమీద దాడులు చేసి అల్లరి చేసి హీరోల్లా ఫోజులు కొట్టడమేమిటి? మోరల్ పోలీసింగ్ అని సాఫ్ట్‌గా చూడబట్టే కదా... గౌహతి లాంటి ఘటనలు జరిగింది? లేకపోతే అంత ధైర్యం ఎక్కడినుంచి వస్తుంది? పౌష్టికాహారం లేక లక్షలాది మంది పిల్లలు రాలిపోయే దేశంలో పబ్బులు, రిసార్ట్‌ల వంటి మిడిమేళం అవసరమా అనుకుంటే ఆ అర్థంలో వాటిని వ్యతిరేకించే పద్ధతి వేరే.

కానీ మార్కెట్‌ని ధిక్కరించడం ఇక్కడ లక్ష్యం కాదు. అది చేయకుండా అమ్మాయిలు మాత్రం కనిపించకూడదు అంటే ఏమిటి అర్థం? ఇవన్నీ పురుషులకే పరిమితం, మీరు కనిపించారో జాగ్రత్త అని హెచ్చరించడం... దానికి పతాక సన్నివేశమే గౌహతి. ఇలాంటి దుర్మార్గాలకు మోరల్ పోలీసింగ్ అని పేరు పెట్టి వారు చేస్తున్నదానికి పరోక్షంగా భావజాల పరమైన మద్దతును మనమే ఇస్తున్నాం. మీడియానే కాదు, ప్రజాస్వామిక వాదులు కూడా అలవాటులో పొరబాటుగా అలాగే వాడేస్తూ ఉంటారు.

భాషకున్న శక్తిని గ్రహించలేని తనమిది. వాస్తవానికి తమకు లేని అధికారాలను ఆపాదించుకుని ఇలా దాడిచేసే అలవాటున్న ఏ గుంపునైనా అది ఏ భావజాలం ముసుగు కప్పుకున్నప్పటికీ గట్టిగా వ్యతిరేకించడం అవసరం. భావజాల బలమూ క్రమశిక్షణా, సరైన నాయకత్వమూ లేనప్పు డు ఇలాంటి గుంపులు లంపెనైజ్ అవుతాయి. రాజ్యవ్యతిరేకత లేదు కాబట్టి ఇందులో జొరబడడంలో మరింత సౌలభ్యం ఉంటుంది. తమకన్నా తక్కువ బలమున్న వారిపై నిస్సహాయతలో ఉన్న వారిపై దాడి అనేసరికి చాలామంది పోగవుతారు. అవతల ఆడపిల్లలు ఉంటారు కాబట్టి మనసులో వికృతమున్న వారికి వేదికలుగా మారతాయి.

మోరల్స్ గురించి ఇంత కన్సర్న్ ఉన్నవారు, నేరాల వెనుక లాజిక్ చూసేవారు సన్నీ లియోన్ విషయంలో ఎలా వ్యవహరించారో చూడండి. సన్నీ లియోన్ ఎవరని అడక్కండి. ఈ ఏడాది భారతీయులు ఇంటర్‌నెట్‌లో అత్యధికంగా వెతికేసిన (మోస్ట్ గూగుల్డ్) పేరు సన్నీ లియోన్. ఆమె నీలిచిత్రాల్లో నటించే బూతు తార. ఇద్దరో ముగ్గురో అంతకంటే ఎక్కువ మందో రతిక్రియలో పాల్గొంటూ దాన్ని వీడియో తీసి అమ్ముకుంటే వాటిని నీలిచిత్రాలు లేదా బూతు చిత్రాలు అని మనదేశంలో ఇప్పటివరకూ వ్యవహరించేవారు. సన్నీ ప్రవేశంతో సీన్ మారిపోయింది. ఆమెను శృంగార తార అని రాస్తున్నారు. ఇంగ్లీష్ మీడియా అయితే అడల్ట్ స్టార్ అంటోంది.

అమెరికాలో అటువంటి విభజన ఉన్నది కనుక అక్కడ పోర్నో స్టార్‌తో పాటు అడల్ట్ స్టార్ అని కూడా అనొచ్చు. కానీ మనకిక్కడ అలాంటి వ్యవహారానికి అనుమతి లేదు కదా! నేను పోర్నో నటిని మొర్రో అని ఆమె బహిరంగంగా చాటుకుంటూ రతి భంగిమలను తన వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండగా పోర్నో నటిని బూతునటి అని వ్యవహరించడానికి మనకేమిటి నొప్పి? కొన్ని సందర్భాల్లో మనకు ఎక్కడలేని సెన్సిబిలిటీ ముంచుకొస్తుంది. ఎక్కడ లేసి సిగ్గు తన్నుకొస్తుంది. మామూలుగా ఫలానా వీడియో పార్లర్‌పై దాడి, 100 బూతు చిత్రాల పట్టివేత అని రాస్తాం. లేదా నీలిచిత్రాల పట్టివేత అని రాస్తాం.

శృంగార చిత్రాల పట్టివేత అని రాయం. ఇంటర్‌నెట్ కేఫ్‌లలో బూతు చిత్రాలు చూడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అని రాస్తాం. కానీ అదే చిత్రాల్లో నటించిన ఆవిడ మన ముందుకొచ్చేసరికి శృంగార తార అయిపోయింది. అడల్ట్ స్టార్ అయిపోయింది. ఎక్కడైనా పోలీసులు నలుగురు సెక్స్ వర్కర్లను పట్టుకుంటే మనం వ్యవహరించే పద్ధతి ఎలాగుంటున్నది? ఇక్కడెలా ఉంది? ఏ చీకటి సందుల్లోనో నలుగురు ఆడవాళ్లను పోలీసులు పట్టుకుంటే వాళ్లు ముఖాలకు ముసుగేసుకుంటే ఎలాగైనా వెంటబడి ముఖాలను చూపించాలని తాపత్రయపడతాం. పట్టణాల్లోని ఏదో వాడలో వ్యభిచారం జరుగుతుంటే సమాజం ఏదో అయిపోతున్నదనీ ఆందోళనా వ్యక్తం చేస్తాం.

ఐటి ఇండస్ట్రీలో ఏమేమో జరుగుతున్నాయని అత్యుత్సాహంగా చర్చిస్తాం. కానీ ఇక్కడ మాత్రం కథ వేరే. ఆమె చేస్తున్న పనిమీద వాల్యూ జడ్జిమెంట్ ఇవ్వాలనడం లేదు. ఇదసలు ఆమెకు సంబంధించిన విషయం కానేకాదు. మన దృష్టికోణానికి సంబంధించిన విషయం. సాధారణంగా అటువంటి స్థితిలో ఉన్నవారిని ఇప్పటివరకూ చూసిన దృష్టి ఎలా మారిపోయింది? కేవలం మహేశ్‌భట్, ఆయన కుమార్తె నిర్మించిన చిత్రంలో నటించినందువల్ల కాదు, అంతకు మించిన కారణాలున్నాయి. విమానంలోంచి దిగి పక్కన సెక్రటరీ, మేనేజర్ లాంటి సిబ్బంది ఉండి ఫైవ్ స్టార్ హోటల్లో మకాంవేసి ప్రెస్‌మీట్లు పెట్టగలిగిన మహిళను బూతు తార అనడానికి మన మనసొప్పుకోదు.

ఆమెను బిగ్‌బాస్ ప్రోగ్రాంకు రప్పించడంలోనూ ఆ తర్వాత సినిమాల్లోకి తీసుకోవడంలోనూ ఒక రహస్య ఎజెండా ఉంది. అమెరికా వలె పోర్నో కంటెంట్‌ని అనుమతించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ప్రయత్నం టీవీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ చేస్తున్నాయి. పైకి సంప్రదాయ దేశం అని చెప్పుకుంటున్నప్పటికీ మనది సెక్స్ స్టార్వ్‌డ్ నేషన్ అని అందరికీ తెలుసు. లేకపోతే సన్నీ లియోన్‌కి అందరికంటే ఎక్కువ హిట్స్ ఎలా వస్తాయి. ఆమె పేరు గూగుల్‌లో టైపు చేస్తే ఏమవుతుంది. అది ఆమె పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లోకి దారితీస్తుంది. అక్కడేమి ఉంటుందో ముందే చెప్పుకున్నాం.

అంటే దేశంలోని నెటిజనుల్లో అత్యధికులు ఒక పోర్నో సైట్‌ని వెతుక్కున్నారన్నమాట. సదరు సన్నీలియోన్ అసలు పోర్న్‌స్టార్ కాబట్టి కార్యక్రమం ఏ మోతాదులో ఉంటుందో అని ఊహిస్తూ జనం టీవీ కార్యక్రమానికి హుక్ అవ్వాలి. సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని ఊహించుకుంటూ బాక్సాఫీసులు నింపాలి. మీడియా ఆమెను స్టూడియోలకు పిలిచి గతమూ, వర్తమానమూ, భవిష్యత్తూ చర్చించాలి. పాపులారిటీతో ఆమె తన వెబ్‌సైట్ మార్కెట్ పెంచుకోవాలి. సో... ఉభయకుశలోపరి వ్యవహారం. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర వారు పోషించి పోర్నో అనేదాని గురించి సమాజంలో ఉన్న బహిరంగ వ్యతిరేకతను తగ్గించి ఆ మార్కెట్‌కు పూర్వరంగాన్ని సిద్ధం చేసిపెడతారు. పోనీ అంత ఔదార్యమున్నవాళ్లు ఇక్కడ సెక్రటేరియట్ బస్టాండులో చీకటి మూలల నిలబడే వారి విషయంలో అలానే వ్యవహరిస్తారా అంటే ఉండదు. క్లాస్ ఈజ్ ఏ రియాలిటీ.

మనం వాడే పదజాలం మన భావజాలాన్ని పట్టిస్తుంది. భావజాలం, రాజకీయాలు అనేవి కొందరికే ఉంటాయి అనుకోవడం భ్రమ. మాకు రాజకీయాలు ఉన్నాయి అని చెప్పుకునే వారికంటే మాకు రాజకీయాలు లేవు అని చెప్పుకునే రాజకీయాలు ప్రమాదకరమైనవి. ఆధిపత్యంలో ఉన్నవారికి రాజకీయాలను రాజకీయాలుగా భావజాలాన్ని భావజాలంగా చాటుకోవాల్సిన అవసరం ఉండదు. ఆధిపత్య విలువలే సామాజిక విలువలుగా చెలామణి అవుతుంటాయి. అవి సమాజ జీవనంలో అంతర్భాగంగా ఉంటాయి. ఎటొచ్చీ ఆ ఆధిపత్యాన్ని ధిక్కరించే వాళ్ల రాజకీయాలు మాత్రమే విడిగా ముద్దలాగా కనిపిస్తూ ఉంటాయి.

మన సమాజంలో ఆధునిక మార్కెట్, పాత భూస్వామ్య విలువలు పెద్ద ఘర్షణ లేకుండానే సంసారం చేసే పద్ధతిని ఎంచుకున్నాయి. ఇరాక్‌పై అమెరికా దాడి తర్వాత హైదరాబాద్ ముస్లిం యువతలో తగ్గిపోయిన కోలా అమ్మకాలను పెంచుకోవడానికి బిర్యానీతో పాటు కోక్ ఫ్రీ అనే నినాదం ఎలా పనిచేసిందో, గతంలో బిర్యానీతో పాటు టీ తాగే హైదరాబాదీ అలవాటును ఈ కొత్త అలవాటు ఎలా ఆక్రమించిందో చూస్తే మార్కెట్ ఎన్నెన్ని వేషాలు వేయగలదో అర్థమవుతుంది. అలాగే భావజాలం కూడా. పబ్బులకు ఇబ్బంది లేకుండా అమ్మాయిల మీద మాత్రమే దాడులు జరపగలం. అదే సమయంలో సన్నీలియోన్‌ను మన తెలుగు, కన్నడ సినిమాల్లోకి లాక్కు రావడానికి పోటీపడగలం.

ఈ మొత్తం ప్రాసెస్‌లో ఆధిపత్య మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. అటు మార్కెట్‌ను ఇటు ఆధిపత్య భావజాలాన్ని రెంటినీ కాపాడే బహురూపి మీడియా. బాబ్రీ మసీదుపై వివాదం కాస్తా బాబ్రీ రామజన్మభూమి వివాదంగానూ తర్వాత రామజన్మభూమి వివాదం గానూ ఇవాళ అయోధ్య వివాదంగానూ మారిన తీరు జాగ్రత్తగా పరిశీలిస్తేమీడియా వాస్తవ రూపమేమిటో అర్థమవుతుంది. కొంతమంది గునపాలతో ఒక కట్టడం లేకుండా చేస్తారు. ఇంకొంతమంది తమ పదజాల మాయాజాలంతో ఆ కట్టడాన్ని మన మస్తిష్కాల్లో కూడా లేకుండా చేస్తారు. అంతే తేడా. సో ఆనర్ కిల్లింగ్స్, మోరల్ పోలీసింగ్ అనే పదాలు ఊరికే యథాలాపంగా వాడుతున్నవి కావు. ఆధిపత్య విలువలను మార్కెట్ మాయాజాలాన్ని మౌలికంగా విభేదించేవారికి - పైకి యానిమేటెడ్ యాంగర్ ప్రదర్శిస్తూ పరోక్ష పద్ధతుల్లో వాటితో గొంతు కలిపే వారికి తేడా చూడాల్సిన అవసరం ఉంది.
- జి.ఎస్. రామ్మోహన్
(ఆంధ్రజ్యోతి దినపత్రికలో 24.8.12 నాడు ప్రచురితం)