Monday, 6 February 2012

రెండు న్యాయాలు

నార్వేలో ఒక భారతీయ జంట. వారికిద్దరు పిల్లలు. ఒకరికి మూడేళ్లు. మరొకరికి ఏడాది. ఒక ఉదయాన చైల్డ్ కేర్ ఏజెన్సీ అధికారులు వచ్చి ఇద్దరు పిల్లలను తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేర్ సెంటర్‌లో పెట్టారు. పిల్లలిద్దరిని 18 ఏళ్లవరకూ ప్రభుత్వమే పెంచుతుంది, తల్లిదండ్రుల ప్రమేయం అవసరం లేదు అని తేల్చారు. తల్లిదండ్రులకు సరిగా పెంచడం రాదు కాబట్టి బిడ్డలను తీసుకుపోతున్నట్టు తేల్చారు. ఇంతకీ నార్వే అధికారులు కనుగొన్న నేరాలేమిటి? బిడ్డల డయాపర్స్ మార్చడానికి ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేసుకోలేదు-బెడ్ మీదే మారుస్తున్నారు. వారిని ప్రత్యేక మంచం మీద కాకుండా తమతో పాటే నిద్రపోనిస్తున్నారు. 

తల్లి బిడ్డకు చనుబాలు ఇచ్చేపుడు బిడ్డను పట్టుకునే పద్ధతి సరిగా లేదు. వాళ్లకిచ్చిన ఆటబొమ్మలు చట్టప్రకారం వారి వయసుకు సరిపడేవి కావు. చేతితో తిండి తినిపిస్తున్నారు... ఇవండీ నేరాలు. తిరిగి ఆ బిడ్డలను రప్పించడానికి ఆ తల్లిదండ్రులు భూమ్యాకాశాలు ఏకం చేయాల్సి వచ్చింది. విదేశాంగ మంత్రుల లెవల్లో చర్చలు జరపాల్సి వచ్చింది. అయినా బిడ్డలను తల్లిదండ్రులకివ్వడానికి ఒప్పుకోలేదు. అంకుల్‌కి ఇవ్వబోతున్నారు. నవ్వూ కోపం అన్నీ కలగలిసి వస్తున్నాయి కదా! తెల్లతోలు అహంకారం, సాంస్కృతిక దురహంకారం అని తెగతిట్టిపోయాలని అనిపిస్తుందికదా! 

తప్పులేదు. కానీ అదే సమయంలో మరో కోణం కూడా ఆలోచించాలి. ఒక పసిప్రాణానికి ఆ దేశం ఇచ్చే స్థానం గురించి బిడ్డ మానసిక శారీరక ఎదుగుదల గురించి ఆ దేశానికి ఉన్న శ్రద్ధ గురించి ఆలోచించాలి. ఆ తల్లిదండ్రులు దేశ ప్రమాణాలకు భిన్నంగా బిడ్డలను పెంచుతున్నారని అనుకున్నాక ఆ ఇంటిమీద చాలా కాలం నిఘా పెట్టారు. పరిశోధన జరిపి మరీ ఈ విడ్డూరమనిపించే నేరాల చిట్టా బయటకు తీశారు. ప్రతి మనిషి మీద అంత శ్రద్ధ పెట్టగలిగిన వ్యవస్థ, బిడ్డలను అంత శ్రద్ధగా వారి ప్రమాణాల మేరకు ప్రభుత్వమే పెంచగలిగిన వ్యవస్థ అక్కడ ఉన్నది. అంత సంపద కూడా ఉన్నది. 

అది మానవాభివృద్ధి సూచిలో ప్రధమ స్థానంలో ఉన్న దేశం. అదే సమయంలో భారత్‌లో ఏం జరిగింది? ఒక విదేశీ జంట. సరోగసీ ద్వారా బిడ్డను పొందింది. తల్లి అమెరికన్. తండ్రి జమైకన్. వారి సంతానం హైదరాబాద్‌లోని ఒక తల్లి గర్భంలో పెరిగింది. బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను ఆ తల్లిదండ్రులు అమెరికా తీసికెళ్లాలి. పాస్‌పోర్ట్ ఆఫీస్ దగ్గర చిక్కొచ్చింది. మూడు జాతీయతలతో ముడిపడిన ఆ బిడ్డను ఏ జాతీయుడిగా గుర్తించాలనేది సమస్య. ఢిల్లీతోనూ వాషింగ్టన్‌తోనూ చర్చోపచర్చలు జరిపారు కానీ విషయం తెగలేదు. ముడిపడలేదు. ఈ లోపు ఆ అమెరికన్ అమ్మవారికి కోపమొచ్చింది. ఇంత ఆలస్యం చేస్తారా.. అనేసి బిడ్డను అక్కడ వదిలేసి వెళ్లిపోయింది. 

మీ ఇష్టం మీరేం చేసుకుంటారో చేసుకోండి అనేది నిరసన. తర్వాత అధికారులే తలపట్టుకుని ఆమె ఎక్కడుంటే అక్కడికెళ్లి బతిమిలాడి బామాలి పిలుచుకొచ్చి బిడ్డను అప్పగించారు. అయినా మన పాలనాయంత్రాంగానికి కోపం రాదు. బిడ్డ ఏమైనా స్కాచ్ బాటిలా అ«ధికారులు అభ్యంతరం చెపితే అలా వదిలేసిపోవడానికి! ఆ అమెరికన్ మహిళ చేసింది నేరంలా కనిపించకపోవడంలో పనిచేసిన అంశమేమిటి? ఎందుకు కేసు పెట్టలేదు? ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కనీస లీగల్ ఫ్రేమ్ వర్క్ తయారు చేయకుండానే ఆటోల మీద పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేసుకునేంతగా గర్భాల వ్యాపారాన్ని అనుమతించిన వారినేమనాలి? ఇక్కడే ఉంది అసలు విషయం. 

ఒక దేశంలో బిడ్డను తమ దేశప్రమాణాల ప్రకారం పెంచడం లేదని పిల్లల పెంపకం బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. అవెంత విపరీతమైన ప్రమాణాలు అయినప్పటికీ. ఇంకో దేశంలో బిడ్డను అలా ఆఫీసులోనే విసిరేసిపోయినా మనకు చీమకుట్టినట్టయినా ఉండదు. పసిబిడ్డల గురించి ఉన్న శ్రద్ధలోనూ వ్యవస్థలోనూ తేడాలు అలాంటివి. మన దేశంలో ప్రాణాలకు ఉన్న విలువ అలాంటిది. 

ఇక్కడ బిడ్డలను ఆస్పత్రుల నుంచి ఎవరో ఎత్తుకుపోతుంటారు. పసిప్రాణాలను కుక్కలు, పందులు పీక్కుతింటుంటాయి. కుహనా విలువల వల్ల మన సొసైటీలో తిష్టవేసుకుపోయిన హిప్పోక్రసీ వల్ల పసిబిడ్డలు కుప్పతొట్లలో, ముళ్లకంపల్లో ప్రత్యక్షమవుతుంటారు. మనకేమీ కోపంగా అనిపించదు. పేదలు, పేద పిల్లలు ఎలా చచ్చినా ఏమీ అనిపించనంత ఇమ్యూన్ అయిపోయాం. 

వందకోట్ల పైచిలుకు దేశం కదా, మనుషులు దోమల్లా చీమల్లా రాలిపోవడం ఆనవాయితీగా మారింది. కళ్లముందే ఆకలిచావులు కనిపిస్తున్నా అగ్రరాజ్యం హోదా కోసం అర్రులుచాచగల దుస్సాహసికులం కదా, అందువల్ల మనకు ఒక బిడ్డను అలా ఆఫీసులో విసిరేసిపోయినా ఆ మహిళ నేరపూరిత నిర్లక్ష్యంపై రావాల్సినంత కోపం రాదు. పైగా అమెరికన్ మహిళ. కేసు పెట్టే సాహసం అస్సలు చేయలేం. భయం, బానిస మనస్తత్వం. 

అవుట్‌సోర్సింగ్ అలవాటైపోయింది మనకు. ఇతరత్రా సేవలయిపోయాయి. ఇపుడు గర్భసేవల శకం. ఇక్కడి పేదతల్లులకు కొన్ని వేలు పడేస్తే ఏదేశపు వారి వీర్యానికో రూపమిచ్చి కడుపులో తొమ్మిది నెలలు మోసి కని ఇచ్చేయగలరు. చీప్ లేబర్. కానీ ఇందులోని లేబర్ చీప్ కాదు. లేబర్ పెయిన్స్ అంటే చచ్చిబతకడమే. అంతేనా! అద్దెగర్భాన్ని కాపాడుకోవడానికి అవసరమైన డ్రగ్స్, ఒత్తిడి, సైడ్ అఫెక్ట్స్ అన్నీ భరించాలి. పేదరికం మహాచెడ్డది. నార్వేను తెగడడంలో ఉన్నంత ఆవేశం ఇక్కడ అమెరికన్‌ను తెగడడంలో చూపించరు. 

ఎందుకంటే అది అమెరికా. సమస్య తెల్లతోలు-నల్లతోలు కాదు. మన దగ్గర బలిసినోళ్లు తాగి తందనాలాడి కేళీ విలాసాల్లో మునిగితేలడానికి ఉజ్జెకిస్తాన్, తజకిస్తాన్, తుర్కెమెనిస్తాన్ లాంటి దేశాలనుంచి తెల్లతోలు అమ్మాయిలను దిగుమతి చేసుకుంటారు. ఢిల్లీలోనూ హైదరాబాద్‌లోనూ ఏ హైక్లాస్ ప్రాస్టిట్యూషన్ ప్లేస్‌లో చూసినా వాళ్లే. అసలు సమస్య పేదరికం. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక ప్రపంచానికి సెక్స్ వర్కర్లను సప్లయ్ చేసే సెంటర్‌గా మారిపోయింది. డబ్బు అధికారం ఉన్న తెల్లతోలు పట్ల మన పర్సెప్షన్ వేరు. 

అది లేని చోట్ల మన పర్సెప్షన్ వేరు. వర్వర్షన్స్ వేరు. ప్రపంచంలోని ధనిక తెల్ల దేశాలు భారత్‌లో అద్దెగర్భాలు చీప్‌గా దొరుకును అని కనుగొన్న తరుణంలోనే ఇక్కడి విలాసపురుషులు వేరే తెల్లదేశాల నుంచి సెక్స్ వర్కర్లను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండడం ఈ దేశ వ్యవస్థలోనూ సంపద పంపిణీ లో నూ ఎంత దుర్మార్గం ఉందో తెలియజేస్తుంది. ఇంతకీ నార్వే ఘటన హైదరాబాద్ ఘటన చూశాకైనా అగ్రరాజ్య హోదా గురించి మాట్లాడడం మానేస్తారని ఆశించగలమా! అనవసరమైన డాంబికాలు మానే సి కనీస మానవీయ విలువలున్న వ్యవస్థ కోసం ప్రయత్నించగలమా! 

- జి.ఎస్.రామ్మోహన్
(2012 జనవరి 28న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వ్యాసం)

అన్నా ఉద్యమం-ఆంతర్యాలు


అన్నా ఉద్యమం వల్ల సామాజిక అసమానతలు తగ్గుముఖం పడతాయా...మనూరి కనీస్టీబు బాడీ లాంగ్వేజ్ మారుతుందా...భూమి లేనోడికి భూమి దక్కుతుందా...ఇవేవీ కావు కాబట్టి అది ఉత్తిదే అనడం ఒక పద్ధతి. ఇవేవీ కావు కాబట్టే అది మహోద్యమం, మరో స్వాతంత్ర్యపోరాటం అనడం మరో పద్ధతి. అవేవీ కాకపోయినా అన్నా ఉద్యమం కదలిక తీసుకువచ్చిన మాట వాస్తవం. ఆయన సైతం ఊహించని విధంగా మద్దతు వచ్చిన మాట వాస్తవం. అయితే ఇది ఈ దేశంలోని సామాన్యుడి ఉద్యమం కాదు, మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి ఉద్యమం. 90ల దాకా ఉన్న వ్యవస్థ మధ్యతరగతిని అవినీతికి ప్రోత్సహించింది. అవినీతి ఇంతగా ఊడలు పాతుకుపోయేలా చేసింది ఈ దేశంలోని మధ్యతరగతే. వారు టిటిఇకి యాభై ఇచ్చి సీటు కన్‌ఫర్మ్‌ చేసుకోగలరు. తెలిసిన నాయకుడిని పట్టుకుని ఏదో ఒక ఉద్యోగం తన సంతానానికి సాధించగలరు. నాలుగైదు లక్షలిచ్చి నాలుగు రాళ్లు దొరికే చోటికి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోగలరు. ఆధిక్యతను ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉండిన కాలమది. ఈ ఇరవై యేళ్లలో వచ్చిన మార్పులు మధ్యతరగతిని పెంచేశాయి.  టిటిఇకి యాభై వంద ఇవ్వగలిగిన భద్రలోక్‌ సమాజం పెరిగింది. మధ్యతరగతిలోనే అనేక లేయర్స్‌ వచ్చాయి. ఓ మోస్తరు పట్టణంలో నెలకు 20 వేలు వచ్చేవారు మధ్యతరగతి అయితే హైదరాబాద్‌ లాంటి సిటీలో నెలకు 50, 60 వేల జీతగాళ్లు కూడా మధ్యతరగతే. సంఖ్య పెరిగాక ప్రివిలేజ్  పనిచేసే స్థితిని కోల్పోతుంది. అవకాశం కొద్దిమందికి ఉన్నపుడే అది ప్రివిలేజ్ అనిపించుకుంటుంది. దాన్ని అడ్వాంటేజ్‌గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పట్లో ఏదైనా గవర్నమెంట్‌ ఆఫీస్‌లోకి వెళ్లి ఇంగ్లిష్‌లో మాట్లాడితే అక్కడున్న వారు కాసింత అటెంటివ్గా వినే పరిస్థితి ఉండేది. ఇవాళ కూడా ఎల్లన్న మల్లన్నల కంటే కూసింత మర్యాదిచ్చే పరిస్థితి ఉన్నా గతంలో ఉన్నంత ప్రివిలేజ్‌ లేదు. అక్కడ కూర్చున్నవారు కూడా అంతకంటే ఘాటుగా ఇంగ్లిష్‌లో బదులివ్వగలరు. అన్ని ఆఫీసుల్లో ఆ తరం వచ్చేసింది. అదొక్కటే కాకుండా ప్రైవేటైజేషన్‌ కూడా ప్రివిలేజెస్ రూపాలను మార్చేసింది. ప్రభుత్వ యంత్రాగం నుంచి సేవలను పొందే విషయంలో 90లకు ముందున్న ఆధిక్యత ఇవాళ మధ్యతరగతికి లేదు. ప్రభుత్వ సేవలు  కుచించుకుపోయాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. బర్త్‌ సర్టిఫికెట్‌, డెత్‌ సర్టిఫికెట్‌, ఇంటి నిర్మాణ అనుమతులు వంటివి మినహాయిస్తే మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతికి ప్రభుత్వ యంత్రాంగంతో ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయాయి. రోజువారీ సంబంధాలు అయితే అసలే లేవు.
       సాధారణంగా  కింది వాళ్లు ఏదో ఒక నిచ్చెన వేసుకుని తమను అందుకోవాలని చూసేలోపు అభివృద్ధిలో ముందున్న వాళ్లు తమ ఆధిక్యతను కాపాడుకోవడానికి ఇంకేదో రూపాన్ని ఎంచుకుంటారు. 90లకు ముందు ప్రభుత్వ ఉద్యోగాలే సర్వస్వం అయిపోయిన దశలో అప్పటికే ఎదిగిన వారి ఆధిపత్యం ఉండేది. ఉన్నత స్థానాల్లో వారి హవా నడిచేది. రిజర్వేషన్ల వల్ల , ఉన్నత విద్య వల్ల మిగిలిన కులాలవారు కూడా వారి సరసన కూర్చునే పరిస్థితి వచ్చేసరికి వారు ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను తగ్గించేశారు. పాలనా యంత్రాంగంలో ఇంకా తమ పట్టే సాగుతున్నది కాబట్టి వారి సాయంతో డబ్బు ఊరబెట్టుకునే ప్రైవేట్‌ మార్గం చూసుకున్నారు. ప్రభుత్వ యంత్రాగంలోని అవినీతితో విసిగిపోయి ఉన్నందున రానున్న ముప్పును గుర్తించే పరిస్థితి లేనందున పెద్ద వ్యతిరేకత కూడా రాలేదు. సామాన్యుడికి అత్యవసరమైన రెండు రంగాలను వారికి దూరం చేశారు. అవి ఆరోగ్యం, విద్య. రెంటిలోనూ సెక్లూజివ్‌ విధానాలను అవలంబించి ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పథకం ప్రకారం నాశనం చేయగలిగారు. అయినా సరే అప్పటికే ఏదో విధంగా పట్టణాల్లో ప్రవేశించిన కింది వర్గాలు నెమ్మదిగా అభివృద్ధి నమూనా రహస్యాన్ని అర్ధం చేసుకోగలిగాయి. గ్రామీణ వాతావరణం నుంచి బయటపడి ఏదో రూపంలో తమ సంతానాన్ని విద్యాధికులను చేయగలిగిన వారు మధ్యతరగతిలో చేరిపోయారు. ముఖ్యంగా ఐటి, ఫార్మా, టెలికం లాంటి రంగాలు పూర్తిస్థాయి కార్పోరేట్ రూపం సంతరించుకున్నాయి. ఇవి దేశంలో మధ్యతరగతిని పెంచాయి. దారుణంగా నష్టపోయింది గ్రామీణ వర్గాలే. సో ఏమైతేనేం ప్రపంచీకరణ ఫలితంగా గుర్తించదగిన సంఖ్యలో దిగువతరగతి మధ్యతరగతిగా మారిన మాట వాస్తవం. మరింత మందికి ఆశలు రేకెత్తించిన మాట వాస్తవం. వేతన జీవుల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. మధ్యతరగతికి అంతకు ముందు వలె ప్రివిలేజెస్‌ను ప్రదర్శించుకోవడానికి అవకాశాలు తగ్గిపోయిన మాట కూడా వాస్తవం. ఇదే సమయంలో ప్రైవేట్‌ పెట్టుబడి 90ల తర్వాత రియల్‌ ఎస్టేట్‌, భారీ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో విశ్వరూపం ప్రదర్శించడం మొదలెట్టింది. ప్రభుత్వ సొమ్మును అంతకుముందు ఎన్నడూ  ఊహించని స్థాయిలో దోచుకోవడానికి ఇవి మార్గం చూపాయి. సాధారణ అవినీతి స్థానే వందలు వేల కోట్ల అవినీతి నిత్యకృత్యంగా మారింది. అవినీతి కేంద్రీకృతమైంది. అధికారం అక్రమార్జనకు రాజమార్గంగా మారింది. ఎన్నికల వేళలో పార్టీలకు డబ్బులు ఇవ్వడానికి పరిమితమైన పారిశ్రామికవేత్తలు నేరుగా అధికారంలో జొరబడి తిష్టవేశారు. విభజన రేఖ చెరిగిపోయింది. రాజకీయ రంగం ఇతర రంగాలనుంచి ప్రధానులను, రాష్ర్టపతులను అరువుతెచ్చుకునే దశ వచ్చేసరికి అదెంత వల్నర్‌బుల్‌ పరిస్థితిలో ఉందో కార్పోరేట్‌ సార్లకు అర్థమైంది. తాము నేరుగా జొరబడొచ్చనే ధైర్యం పెరిగింది. ఒక దశలో అయితే కంపెనీలను లాభాలబాటలో నడిపించే వారు దేశాన్ని కూడా నడిపిస్తారని ఇన్ఫోసిన్‌ నారాయణమూర్తి లాంటివారికి దేశాన్ని అప్పగించాలనే అసహ్యకరమైన వాదనలను కూడా ధైర్యంగా ముందుకు తేగలిగారు. చట్టసభలు కార్పోరేట్‌ బోర్డు రూములుగా మారుతున్న కాలమిది. ఒక్కో బిజినెస్‌ టైకూన్‌ కొంతమంది ఎమ్మెల్యేలను తన ఖాతాలో ఉంచుకోవడం తన రాజకీయ అవసరాలకనుగుణంగా వారిని చట్టసభలో ఉపయోగించుకోవడం అనేధోరణి పెరిగింది. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఏడేడు తరాలకు ఫర్వాలేదు అనిపించే కాలమిది.  ఓ వైపు తమ కళ్లముందే కొంతమంది వందలు వేలకోట్లకు పడగలెత్తుతా ఉంటే తాము అలా మిగిలిపోవడమనే అసంతృప్తి వేతన జీవుల్లో పెరిగింది. వేల రూపాయల వేతనజీవులను ఎసిబి పట్టుకుంటూ ఉండడం అవి టీవీల్లో కనిపించడం, అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జీ హుజూర్‌ జాతికి చెందిన కొందరు ఐఎఎస్‌ ఐపిఎస్‌లు కుబేరులుగా మారి రొమ్ము విరుచుకుంటూ తిరగడం  అనేది కళ్లముందు కనిపిస్తూనే ఉంటుంది. కడుపు మండమంటే మండకుండా ఉంటుందా!
        ఇదొక్కటే కాదు. పాలకులు ఎన్నికల సమయాల్లో ఇచ్చే వరాలు చూసినా మధ్యతరగతికి కడుపు మంటగానే ఉంటుంది. అదేంటి ఈ కాలంలో కూడా రెండు రూపాయలకు కిలోబియ్యం ఏమిటి? టీవీలివ్వడమేమిటి? ఫీజులు ఉచితంగా ఇవ్వడమేమిటి? వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడమేమిటి? ఇన్ని సబ్సిడీలేమిటి?  అని అనర్గళంగా వారు ప్రశ్నించగలరు. ఎల్‌పిజి సిలిండర్‌ మీద ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందో వారు గుర్తు చేసుకోరు. వారెక్కే విమానం ఇంధనంపై ప్రభుత్వం వారు ఎంత సబ్సిడీ ఇస్తారో చెప్పరు. పారిశ్రామిక వేత్తలకు ఎన్ని వేల కోట్ల టాక్స్‌ హాలీడేలిస్తారో చెప్పరు. బ్యాంకులు నాన్‌ ఫెర్మార్మింగ్‌ ఎస్సెట్స్‌ కింద ఎన్ని వేల కోట్లు కొట్టివేస్తాయో చెప్పరు. ఇవన్నీ చెపితే అవి పేదలకు ఇచ్చే సబ్సిడీలకంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్పారు. ఆ హమీలు సరైనవని పేదరికాన్ని పారదోలతాయని కాదు. చేపలు పట్టే విధానం నేర్పకుండా అపుడపుడు కొన్ని చేపలు విసిరి వారిని బిచ్చగాళ్లుగానే ఉంచడమనే కుట్ర ఉందిందులో. కాకపోతే మధ్యతరగతి కోపం అందుక్కాదు. ఏదో దోచిపెడుతున్నారనే దుగ్ధ.  ఏదేమైనా మధ్యతరగతికి ఇవాళ రెండు రకాల కోపాలున్నాయి. అది తాము  బుద్ధిగా టాక్స్‌ కడుతూ ఉంటే పాలకులు, కాంట్రాక్టర్లు దోచేస్తున్నారు అనే ఆగ్రహం. పశ్చిమదేశాల్లో వలె మనదేశంలోనూ ఇకముందు తారకమంత్రంగా మారగల పదబంధం టాక్స్‌ పేయర్స్‌ మనీ. కారణమేదైనా ఇది ధర్మాగ్రహం. రెండోది తాము చెల్లిస్తున్న మనీని ప్రభుత్వం పేదలకు ఉచిత వరాలపేరుతో వృధాచేస్తోంది అని. ఇది అధర్మాగ్రహం. అన్నా హజారే ఉద్యమానికి ఇన్‌స్టంట్‌ మద్దతులో కనిపించిందైతే ధర్మాగ్రహమే. కాకపోతే ఆ క్యాండిల్స్‌ విప్లవకారుల్లో ఎక్కువమంది కట్నం తీసుకుంటారు. కొనుగోళ్లు అమ్మకాల్లో కరెక్టు లెక్కలు చూపించరు. పాస్‌పోర్టు ఇంక్వైరీకి వచ్చిన కానిస్టేబుల్‌ను సంతృప్తి పరుస్తారు. ఉద్యమానికి గ్లామర్‌ యాడ్‌ చేసిన సినిమా తారల్లో ఎంత మంది తాము సినిమాకు తీసుకునే మొత్తాన్ని కాగితాలపై చూపిస్తారు?  ఇవేవీ వారికి అవినీతిలాగా అనిపించవు. అది అందరూ చేసేది, సామాజిక ఆమోదం ఉన్నదీ అని భావిస్తారు. కాబట్టి తాము చేసేది అవినీతి కాదని వేరేవారు చేసేది మాత్రమే అవినీతి అని భావిస్తారు. తాము భాగంలో కాని అవినీతిపైనే కోపం. తమకు భాగస్వామ్యం లేకపోవడం వల్లే కోపం. అందరూ అలా అని కాదు గానీ అన్నా ఉద్యమంలో కనిపించిన వారిలో ఎక్కువ ఇదే బాపతు. అయితే ఈ కోపం ఆ రూపంలో వ్యక్తం కాదు. కాలేదు.  సమూహంలోకి వచ్చినపుడు ఒక విలువను ముందుకు తెస్తారు. అవినీతి వ్యతిరేకత అనే సార్వజనీక విలువను ముందు పెడతారు. అక్కడ దీన్ని ప్రజాస్వామిక ఆకాంక్షగా చూడొచ్చు. వారి కోపానికి కారణమేదైనా వారు ముందు పెట్టిన డిమాండ్లో ఉన్న విలువ అవసరమైనది.  వారికి మాత్రమే కాదు. పేదలకు కూడా అవసరమైనది. సమాజంలో అవినీతి ఊడలు వేసుకుని పోవడం వల్ల ఎక్కువ నష్టపోతున్నది పేదలే. పార్లమెంటరీ ప్రజాస్వామిక అర్థంలో అయినా అందరికీ అవకాశాలు సమానంగా ఉండే స్థితి కోసం ప్రయత్నించడం కొందరు అడ్డదారుల్లో వాటిని ఎగరేసుకుపోయే స్థితిని అడ్డుకోవడం  సామాన్యునికి లాభమే. మౌలికమైంది కాకపోవచ్చు కానీ వారికి అవసరమైనది ఇది. కాకపోతే ఇలాంటి ఉద్యమాలతో అవినీతిని నిర్మూలించగలమనే నమ్మకం ఏదీ పేదలకు లేదు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే వారి భాష, బాడీ లాంగ్వేజ్ వారిని ఆకట్టుకునేవి కావు.
     ఇంతా జేసి అన్నా హజారే మంచి ఆరంభాన్ని చేజేతులారా కొంత వరకు పాడుచేసుకున్నారు. తాము ఆ కమిటీలో ఉండే బదులు  మార్గదర్శనాలేమైనా రూపొందించాలని పట్టుబట్టి ఉంటే కమిటీ నియామకం మరింత పారదర్శకంగా  ఉంటే బాగుండేది. అన్నా హజారే తనతో వేదికమీద ఉన్నవారితో కమిటీని నింపివేయడం వివాదాస్పదమైంది. కనీస మోడెస్టీ కూడా లేకుండా  తండ్రీకొడుకుల జంట శాంతి-ప్రశాంతి భూషణ్‌లు కమిటీలో కూర్చోవడం మరో విడ్డూరం. అన్నా గుర్తు చేసుకోవాల్సిన అంశం మరోటుంది. గాంధీ వేషం వేసిన వారందరి నుంచి త్యాగం అనే విలువను ఆశిస్తారు జనం. తాను స్వయంగా కమిటీలో లేకపోతే ఏదేదో జరిగిపోతుంది అనుకోవడం భ్రమ. కేవలం నిజాయితీనే ఒక విలువగా తీసుకుంటే భారత దేశంలో కొల్లలు కొల్లలుగా ఉన్నారు. పేరు గడించినవారూ ఉన్నారు, దానితో నిమిత్తం లేకుండా పనిచేసుకుపోయే వారూ ఉన్నారు. వారినందరినీ విస్మరించి ఒక పద్ధతి పాడూ కూడా లేకుండా ఏ ప్రాతిపదికన కమిటీ నియమించారంటే సమాధానం చెప్పుకోలేని స్థితికి తనను తాను చేర్చుకోవడం ఆయన చేసిన తప్పిదం. ఈ ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకుని ఆయన తన ప్రయత్నాన్ని మరింత సమగ్రంగా ముందుకు తీసికెళ్లగలిగితే దేశానికి మహోపకారం చేసినవారవుతారు.
                                                                                                    జి ఎస్‌ రామ్మోహన్‌
(5-7-2011 న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం)