Wednesday 13 February 2013

నీయమ్మ...చిన్న కమర్షియల్‌ కథ

       
               నిజం చెప్పొద్దు. నాకు రేడియో జాకీల ముచ్చట్లంటే భలే ముచ్చట. కొత్తదనం కోసం వారు పడే ఆరాటం చూస్తే ఇంకా ముచ్చట. అందులో కొందరుంటారండీ. కేకమీద కేక పుట్టిస్తూ ఇరగదీస్తుంటారండి. అడ్డూ ఆపూలేని సృజనను ఆస్వాదించాలంటే నమో ఆర్జేయానమహ అనాల్సిందేనండి. భాషలో అంతే సృజనాత్మకత ప్రదర్శించే టీవీ యాంకర్లు బాధపడనక్కర్లేదు. శాయికుమార్‌ గురించి మాట్లాడుకుంటున్నపుడు బాలకృష్ణ ప్రస్తావన ఎందుకని, అంతే. ఇందులో పన్నేమీ లేదండి. డామ్‌ డిష్యుం సీరియస్‌. సోదొద్దు. అంతలేసి మాట ఎందుకన్నావ్ అని అడగబోతారు కదా...అక్కడికే వస్తున్నా.

మొన్నామధ్య వాహనంలో ప్రయాణిస్తున్నపుడు రేడియో జాకీ నోట్లోంచి నీ యమ్మ అనే పవిత్రమైన మాట వినిపించిందండి. ఏదో బంగారు షాపు వారి యాడ్‌ అనుకుంటాను. తరుగు ఎంత తక్కువ, ధర ఎంత తగ్గించి అమ్ముతున్నారు, తాజా ఆఫర్లేమిటి వగైరా వివరాలన్నీ చెప్పేశాక ఈ మాట అనేశారు. ఈ టైటిల్‌ చూసినపుడు మీకేమనిపించిందో సరిగ్గా నూటయాభన్నర రెట్లు నాకు కూడా అనిపించిందండి. ఎవరండీ ఈ అమ్మాయి...ఇంతేసి మాట అనేస్తున్నాది అనిపించింది. ఎంత వెరైటీ పదప్రయోగాలకు పెట్టింది పేరయితే మాత్రం నీమమ్మ అంటారేటి! ఎంతగా తెలుగును ఇతర యాసలతో బాసలతో పొదిగించి ఎదిగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంతలేసి మాట అనేస్తారేటి అనిపించినాదండి. పాత్రికేయుల పరిభాషలో గంభీరంగా చెప్పవలెనంటే దిగ్ర్భాంతికి లోనయ్యాను. మరియు గురి కూడా అయినానండి. లిప్తపాటులో ఇన్నేసి అవడాలు ఎలా జరిగిందో నాకు కూడా తెలవదండి. అయితే ఈ లోపు ఈ టెన్షన్‌ నుంచి తప్పించడానికి సదరు జాకీ వారు తర్వాతి మాట కూడా సెలవిచ్చారు. ''మరియు నిబందనలు వర్తిస్తాయి"". ఏదైనా కలుపుకొని చదవాలి కానీ ముక్కకు ముక్క విడదీసి చూడకూడదంటారు కదండీ. మజ్జిగలో ఉప్పు కలిపేసినట్టు కలిపేస్తే “నీయమ్మ మరియు నిబందనలు’’ అని అర్థమైపోయినాది. నియమ మరియు నిబంధనలు అయిఉంటాదని కూడా ఐన్‌స్టీన్‌ లాగా కనిపెట్టేశామనుకోండి. ఈ మరియు ఎవరని అడగబోకండి. మేరీకో మరియాకో కజిన్‌ కానే కాదని మీకందరికీ చిన్నపుడే తెల్సుకదండీ. అది మామూలు మావనభాషలో ఎక్కడా అగుపడే అవకాశమే లేదండి, పాత్రికేయల భాషలో తప్ప. అనువాదాన్ని నిష్టగా అభ్యసించే వారు కొందరుంటారండి. అనువాదంలో అచ్చిరం ముక్క తగ్గితే ఊరుకోరండి. 

           కశ్మీర్‌ సమస్యలాగే తెల్లదొర మనకీ అండ్‌ను వదిలిపోయాడు. బలవంతంగా కలిపేసుకుందామంటే భాష కూడా ఊరుకోదు కదండి. అందుకనే అ అండ్‌ది అతుకుల బతుకు అయిపోయినాదండి. అదే ఇపుడు మనల్నందరినీ నీయమ్మ అనిపించింది. అదే లేకపోతే "నియమ నిబందనలను'' ఎంత రెక్కపట్టుకుని అటూ ఇటూ గుంజినా అంత బూతు రాదు కదండీ. అదండీ "నీమమ్మ'' సంగతి. ఇచ్చిత్రమేమంటే కండిషన్స్‌ అప్లయ్‌లో అండ్‌ ఉండదు. కండిషన్‌ అంటే నియమమో నిబంధనో తేల్చుకోలేక ఆ రెంటినీ పక్కపక్కన బెడితే వాటి మధ్యలో ఏం బూతు జరిగిపోతుందో అని ఈ బూతును తెచ్చిపెట్టారన్న మాట. తెలుగు సీజన్‌ నడుస్తోంది కదా, మేము సైతం అనేసుకున్నారు. లేకపోతే కండిషన్సప్లయ్‌ అని యమా స్పీడ్‌గా వినపడి వినపడకుండా చెప్పేసి ఉందురు. అకటా! తెలుగు ఉద్యమమా! ఎంత పనిచేసితివి! 


         హిజ్‌ పెన్‌ అంటే అతని యొక్క కలము అని చిన్నపుడు చెవులు మెలేసి చెప్పిన టీచర్లు లేరావాయ్‌...వారిని పొగడకుండా కేవలం జాకీలను మాత్రం పొగుడుట ఏమి న్యాయము వాయ్‌ అంటారా! అయితే ఓకె. వారికీ వేసేద్దాం వీరతాళ్లు!

జి ఎస్‌ రామ్మోహన్
(చిన్న మార్పులతో 24-2.13 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)