Wednesday 29 April 2015

అర్బేన్‌, లిబరల్‌

ఇపుడంటే"ఆ ఉదయ్‌కిరణ్‌తో ఏదో సినిమా తీశాడు, రజనీకాంత్‌- కమల్‌హాసన్‌లకు గురువంటనే'' అయిపోయాడు కానీ ఇరవై యేళ్ల క్రితం బాలచందర్‌ తెలుగోడి కిందే లెక్క. ఇది కథకాదు, అంతులేని కథ, ఆకలిరాజ్యం, తూర్పు పడమర, గుప్పెడు మనసు లాంటి సినిమాలు చూసిన తరానికి రజనీ-కమల్‌ బ్రాండ్‌ కళ్లజోడు సాయం అవసరం లేదు. దిల్‌ చాహ్‌తా హైతో హిందీలో మొదలైన ధోరణిని ఆయన దక్షిణాదిన 70ల్లోనే ఆరంభించారు. పూర్తిగా ఎలీట్‌ వ్యూయర్‌కి మాత్రమే పరిమితమయ్యే ఆర్ట్‌ సినిమాలకు, పూర్తిగా బాక్సాఫీస్‌ పరిమితులకు లొంగిపోయే మాస్‌ మసాలా సినిమాలకు మధ్య మధ్యేమార్గం అనదగినదేదో ఎంచుకున్నారు. తాను చెప్పదల్చుకున్న విషయంలో పూర్తిగా రాజీపడకుండానే ప్రేక్షకులను చేరే మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక రకంగా అది గురుదత్‌ అంతకు ముందే రుచి చూపించిన మార్గం. మేకింగ్‌ విషయంలో ప్యాసా, కాగజ్‌ కే పూల్‌ పూర్తి రియలిస్టిక్‌ మూవీస్‌ ఏమీ కావు. కానీ అవి మనలోకి ప్రసారం చేసిన భావోద్వేగాలు సామాన్యమైనవి కావు. దర్శకుడు కోరుకున్న ఎమోషన్‌ను క్యారీ చేసిందా లేదా అనేదే సినిమాలో ప్రధానమైన విషయం.

బాలచందర్‌ అర్బేన్‌. ఆ సెన్సిబిలిటీస్‌ అంతకుముందు సినిమాలు చూసి ఉన్నవి కావు. పట్టణీకరణ వేగంపుంజుకుంటున్నప్పటికీ ఇంకా న్యూక్లియస్‌ ఫ్యామిలీ సిస్టమ్‌ ఏర్పడని 70ల కాలపు సందిగ్ధతలన్నీ ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. హిప్పోక్రసీని బట్టలుప్పదీసి చూపించడంలో ఆయన సినిమాలది పతాకస్థాయి. ఆయన మానవసంబంధాల స్పెషలిస్ట్‌. పాత్రల ఉద్వేగాన్ని మనలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయగల టెక్నీషియన్‌. మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని రుజువు చేసేట్టు ఉంటాయి చాలా సినిమాల్లోఆయన పాత్రలు, సన్నివేశాలు. చాలీచాలని సంపాదన ఉన్న కుటుంబాల్లో ఆర్థిక సంబంధాల్లోని డైలమా అంతా కనిపిస్తుంది. లవ్‌, సెక్స్‌, పాషన్‌ ఇత్యాది భావనల్లోని కాంప్లెక్సిటీని చిత్రించడంబాలచందర్‌ స్పెషాలిటీ. ఆయన ఆలోచనల్లో తనకాలం కంటే ముందున్నాడు. ఇది కథ కాదు, తూర్పు పడమర అప్పటికి సామాన్యమైన విషయమైతే కాదు. మంచీ చెడూ, కింగ్‌ అండ్‌ పాపర్‌ లాంటి బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఆలోచనా పద్థతినుంచి సినిమాను బయటపడేసి మిడిల్‌ క్లాస్‌ సెన్సిబిలిటీస్‌ను పాతేసిన వాడు బాలచందర్‌. ఎక్స్‌ట్రీమ్ మెలోడ్రామాల నుంచి కాస్త రియలిజం వైపు పయనించేలా చేసినవాడు ‌. థియేటర్‌ ప్రభావం వల్ల డ్రమెటిక్‌ ఎలిమెంట్‌ ఉంటుంది. కానీ అది వెగటు పుట్టేంత మెలోడ్రామాగా ఉండదు. ఫ్యూడల్‌ సెటప్‌ నుంచి మిడిల్‌క్లాస్ సెటప్‌లోకి సినిమాను నడిపించినవాడు. ఒక రకంగా మన సాహిత్యంలో కొకు ఎలాగ మధ్యతరగతిని ప్రతిబింబించాడో సినిమాల్లో బాలచందర్‌ ఆ పాత్ర పోషించాడు. కొకు కథల్లో ఉండే రాడికల్‌ ఎలిమెంట్‌ ఉండదు. లిబరల్‌ ఎలిమెంట్‌ మాత్రమే ఉంటుంది. తన్నీర్‌ తన్నీర్‌, ఆకలి రాజ్యం లాంటి రెండుమూడు సినిమాల్లో పొలిటికల్‌ ఎలిమెంట్‌ ఉన్నాబాలచందర్‌కు పొలిటికల్‌ ఎలిమెంట్‌ ముఖ్యం కాదు. సోషల్‌ ఎలిమెంట్‌, అందులోనూ మానవసంబంధాల్లోని మార్పులే ప్రధానం. సినిమా లాంటి మార్కెట్‌ ఓరియెంటెడ్‌ మీడియంలో అది కూడా చిన్న విషయమేమీ కాదు.
ఆయన స్ర్తీలు కేవలం కూతుర్లు, కోడళ్లు, అత్తలు, తల్లులు కాదు. వర్కింగ్‌ విమెన్‌. దక్షిణాది సినిమాలో స్ర్టాంగ్‌ వర్కింగ్‌ విమెన్‌ పాత్రలను పాతేసిన వాడు బాలచందర్‌. వాళ్లు చీరెకొంగుతో కళ్లొత్తుకుంటూ ఉండే రకం కారు,కాలేరు. పరిస్థితులకు ఎదురీదే ఆత్మవిశ్వాసం ఉన్నవారు. అలా అని రెబల్స్‌ అని పిలవలేము. పరిస్థితులకు లోబడీ ఉండరు. పరిస్థితులను మార్చేద్దాం అన్నంత ఉద్యమావేశంతోనూ ఉండరు. ప్రేక్షకుల అభిరుచిని చైతన్యాన్ని బట్టి ఆ మధ్యలో ఏదో లైన్‌ కనిపెట్టి కత్తిమీద సాములాగా నడిపిస్తారు. సినిమా మేకింగ్లో పూర్తి రియలిజం కాకుండా మధ్యంతరంగా ఒక
లైన్‌ను ఎలా ఎంచుకున్నారో అలాగే స్ర్తీల విషయంలోనూ ఒక లైన్‌ తీసుకున్నారు. అప్పటికి సమాజంలో ఉన్న చైతన్యానికంటే ఒక అడుగు ముందున్నట్టు ఉంటుంది. అలా అని పూర్తిగా బ్రేక్‌చేసి దూకినట్టు ఉండదు. గెంతు బదులు అడుగే ఉంటుంది. ఆ విషయాన్ని ఆయన ఇంటర్వ్యూలలో చెప్పుకున్నాడు కూడా. మార్కెట్‌ను పూర్తిగా ధిక్కరించకుండా అలా అని దానికి పూర్తిగా లొంగిపోకుండా తాను నడవదల్చుకున్నమార్గంలోనే నడవడం ఎలాగో చూపించినవాడు బాలచందర్‌.
ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌లు తమిళ సినిమాను హోరెత్తిస్తున్న వేళ స్టార్‌డమ్‌కు ఎదురీదిన వాడు బాలచందర్‌. ఆయన స్టార్లను తయారుచేశాడు కానీ తన సినిమాల కోసం స్టార్లను నమ్ముకోలేదు. పనిగట్టుకుని దూరంగా ఉన్నాడు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లను స్టార్లుగా మలిచినప్పటికీ వారు స్టార్లుగా మారాక వారితో సినిమాలు చేయలేదు. తన సినిమా తన దృక్పథాన్ని అభిప్రాయాలను తప్పనిసరిగా ప్రతిబింబించాలని స్టార్స్‌తో చేస్తే అది కష్టమని ఆయన ఇంటర్య్వూలలో చెప్పుకున్నాడు. బాక్సాఫీసును ఊపేస్తున్న ఇద్దరు స్టార్లు తాను కోరితే పరిగెట్టుకుంటూ వచ్చి నటిస్తారు అని తెలిసి కూడా తన మార్గానికి తాను కట్టుబడిఉండడం మామూలు విషయమేమీ కాదు. తనమీద, తన మార్గం మీద ఎంతో కన్విక్షన్‌ ఉంటే తప్ప సాధ్యం కాని విషయం. ముఖ్యంగా ఏదో ఒక స్థాయిలో మార్కెట్‌కు ఎదురెళ్లే ధైర్యం ఉంటే తప్ప సాధ్యం కాని పని. చిరంజీవితో తెలుగులో రుద్రవీణ చేసినా అందులో ఆ పరిమితులు అన్నీ కనిపిస్తాయి. అది అటు చిరంజీవి సినిమా కాకుండా ఇటు బాలచందర్‌ సినిమా కాకుండా పోయిందేమో అనిపిస్తుంది.
ఆయన ఫ్యూడల్‌ సెటప్ స్థానంలో మోడ్రన్‌ సెటప్‌ తెచ్చిపెట్టారు. అలాగని అన్ని కులాలను బ్రాహ్మణ్యంలో కలపలేదు. బ్రాహ్మణ పాత్రలనే ఇతర వృత్తులవైపు నడిపించాడు. అందర్నీ సంప్రదాయాల వైపు వెళ్లేట్టు చేయలేదు. సంప్రదాయాలనుంచి బయటపడేట్టు చేశారు. సింధుభైరవిలో సుహాసిని చివరకు కొత్త ప్రపంచాన్ని అన్వేషించుకుంటూ వెడుతుంది. కుటుంబ అవసరాల కోసం సంప్రదాయ స్ర్తీని సెక్స్‌వర్కర్‌గా మార్చి నైతికత, కుటుంబబంధాల హిప్పోక్రసీని ఎండగట్టిన అరంగేట్రం ఇంకోరకంగా పెద్ద షాక్‌. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన స్ర్తీ సెక్స్‌వర్కర్‌గా మార్చడమే కాకుండా, దుర్గాదేవి రూపంలో పోస్టర్‌ తయారుచేయడం దానికదే పెద్ద షాక్‌. ఆకలిరాజ్యంలో సంప్రదాయకుటుంబంనుంచి వచ్చిన కమల్‌ హాసన్‌ చివరకు క్షురకవృత్తిని ఎంచుకుంటాడు. ఇలాంటి ధోరణులు ఆయన సినిమాల్లో తరచుగా కనిపిస్తాయి. కులాల్ని ఆరాధించే విధంగా కొందరు సమకాలికులు సంప్రదాయాలను ఎత్తిపడుతూ సినిమాలు తీస్తూ ఉంటే దానికి భిన్నంగా లిబరల్‌ లైన్‌ తీసుకున్న వాడు బాలచందర్‌. కులానికి వృత్తులకు మధ్య బంధాలను తెగ్గొట్టడం అనివార్యం-అవసరం అని భావించాడా అనిపిస్తుంది.

థియేటర్‌ నుంచి సినిమాకు అక్కడినుంచి సీరియళ్లకు కాలంతో పాటే తన లాయల్‌ ప్రేక్షకులతో పాటే ప్రయాణిస్తూ వచ్చాడు బాలచందర్‌. కొత్తమార్గాన్ని వేయడంతోనే ఆగిపోకుండా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ విస్తరిస్తూ హైవేగా మలిచాడు. ఇవాళ ఆ హైవే మీద చాలామంది దర్శకులే ప్రయాణిస్తున్నారు.. ఆ రకంగా దక్షిణాది సినిమాకు లిబరల్‌ మార్గం చూపిన క్రాంతిదర్శి బాలచందర్‌.  
(డిసెంబర్‌ 26, 2014న ఆంధ్రజ్యోతి ఎడిట్‌పేజీలో ప్రచురితమైన వ్యాసం)