Thursday 6 September 2012

కొబ్బరి చెట్టు నుంచి క్రోటన్‌ దాకా (విశ్వనాధ్‌ కుర్చీలో శేఖర్‌ కమ్ముల)

“శేఖర్ అన్ని ఫంక్షన్లకు నన్ను పిలుస్తూ ఉంటాడు కానీ నాతో సినిమా చేయమంటే మాత్రం చేయడు…” ఇది అక్కినేని నాగార్జున మాట. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆడియో ఆవిష్కరణ సభలో నిన్నగాక మొన్న చెప్పినమాట ఇది. నాగార్జున ఏదో పైపైకి మాట్లాడి ఉంటారని అనుకోనక్కర్లేదు. నిజంగానే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే నటులు కూడా పారితోషికం తగ్గించుకుని శేఖర్‌తో ఒక సినిమా అయినా చేయాలని ఉబలాటపడడం సహజం. ప్రతి జనరేషన్‌లోనూ ఒకరో ఇద్దరో దర్శకులుంటారు. వారు స్పెషల్, యూనిక్, క్లాస్ అనిపించుకుంటారు. హీరోలు వారి సినిమాలో ఒక్కదాంట్లోనైనా నటించాలని కోరుకుంటారు. ఏదో డబ్బుల కోసం ఇటొచ్చాం కానీ మేం కూడా క్లాసమ్మా అనిపించుకోవాలనుకుంటారు. బాక్సాఫీస్ బద్దలవుతున్న రోజుల్లో చిరంజీవి ఆపద్భాంధవుడు, స్వయంకృషి, రుద్రవీణ చేయడం అందులో భాగమే. 90లకు ముందు విశ్వనాథ్‌కున్న ఇమేజ్‌ని ఇపుడు శేఖర్ కమ్ముల భర్తీ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అయితే భర్తీ ప్రక్రియ పూర్తి కాకముందే శేఖర్ తన గురించి తాను ఎక్కువ ఊహించుకున్నట్టుగా కూడా అర్థమవుతోంది.

“ఇక ముందు తెలుగు పొలిటికల్ సినిమా గురించి మాట్లాడేవారెవరైనా లీడర్‌కు ముందు ఆ తర్వాత అని మాట్లాడుకుంటారు..”లీడర్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా దర్శకులు శేఖర్ కమ్ముల అన్నమాటలివి. మామూలుగా శేఖర్ సిగ్గరి. పొదుపుగా మాట్లాడే అలవాటున్న వాడు. డబ్బాకొట్టుకునే బాపతు వాడు కాదు. మూడో రోజే డబ్బాలు తిరిగొచ్చినా టీవీ స్టూడియోల కొచ్చి మొకమంతా నవ్వులు పులుముకుని ఈ సినిమాను ఇంతటి సూపర్‌హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞతలు అనే బాపతు కాదు. అయినప్పటికీ అంతకుముందు తెలుగుసినిమా వారెవరూ చేయనంతటి సాహసం చేశాడు. చాలా పెద్దమాట అనేశాడు. అంత (అతి) ఆత్మవిశ్వాసం కలగడానికి కారణం అతనికొచ్చిన పాపులారిటీ. చాలా తొందరగా పెద్ద గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. విశ్వనాథ్ ముప్ఫై ఏళ్ల కృషి తర్వాత కానీ అందుకోని గుర్తింపుని శేఖర్ పదేళ్లలోపే అందుకోగలిగాడు. అందుకు శేఖర్ స్వయంకృషితో పాటు సినిమా రంగంలోనూ బయటా వచ్చిన మార్పులు పనిచేశాయి. అంతకంటే ముఖ్యంగా టీవీ పనిచేసింది. శంకరాభరణం తర్వాత గానీ విశ్వనాథ్‌కు ప్రత్యేక గుర్తింపు రాలేదు. సినిమాలో మన పక్కింటి మనిషి లాంటి హీరో అంతరించి అతనొక ప్రత్యేక జాతిగా అవతరిస్తున్న కాలంలో విశ్వనాథ్ తనకంటూ వేరే ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోగలిగాడు. తెలుగుసినిమా స్వర్ణయుగం నుంచి ఇనుపగజ్జెల తల్లి కాలంలోకి ప్రయాణిస్తున్న సంధికాలంలోని వాడు విశ్వనాథ్. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు ముమ్మరమైన దశ అది. అది ఆరంభమైన తొలిదశలో అంటే 70ల్లో చాలా సినిమాలు ఆ థీమ్‌తో వచ్చాయి. ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమవుతుందన్న బెంగను గ్రామీణ సమాజపు కోణం నుంచి చూపించాయి. సోదరులంతా తిండిమానేసి శకునికి పెట్టినట్టు అంటే పోలిక బాగోదేమో కానీ నలుగురైదుగురు పిల్లలున్న ఇంట్లో అంతా చెమటను నెత్తురు చేసి ఒకడిని చదివిస్తారు. అతను పట్నంలో చదువుకుంటూ కలెక్టరో డాక్టరో అయ్యి అక్కడే పెద్దింటి ఆయన కూతురును పెళ్లి చేసుకుంటాడు. ఆ ఆడబిడ్డ ఆయన్ను పూర్తిగా మార్చేసి అతని కుటుంబానికి ఉపయోగపడకుండా చేస్తుంది. రూరల్ అర్బన్ లైఫ్‌స్టెయిల్స్ మధ్య ఘర్షణను నాటకీయంగా రూరల్ బెంట్ ఆఫ్ మైండ్‌తో చూపించడం ఆనవాయితీ. అప్పటికింకా ప్రేక్షకుల్లో ఎక్కువభాగం బీ క్లాస్ సీ క్లాస్ వాళ్లే. ఇప్పట్లాగా ఆరుక్లాసుల విభజన లేదు. పట్నంలో పెద్ద పార్టీ జరుగుతుండగా తండ్రి సొరకాయో, చేపలో తెస్తే విసిరేయడం తల్లిని పనిమనిషిగా పరిచయం చేయడం లాంటివి కొల్లలు. ఇక్కడి నుంచి మధ్యలో వ్యవస్థపై తిరుగుబాటు చేసే రెబల్ హీరో అనే తాత్కాలిక ఫేజ్‌ని పక్కనబెడితే పెద్ద గెంతు హీరో రౌడీలను చితకతన్నే దశకే. ఫైట్స్, స్టెప్పులు అనే కొత్తరకం ఫార్ములా ప్రవేశించాక అందులో వెరైటీల కోసం తిప్పలు పడడమే క్రియేటివిటీ అయిపోయింది. ఒకడు పదిమందిని కొడితే ఇంకో హీరో వందమందిని కొట్టాలి. ఒకడు కాలు కిందపెట్టకుండా అందర్నీ గాలిలోనే కొట్టేస్తే ఇంకొకడు కళ్లకు గంతలు కట్టుకుని కొట్టాలి. ఆ తర్వాత టాటాసుమోలను చేత్తో తిరగేయడం,రైళ్లను చేయికూడా పెట్టకుండానే కంటిచూపుతో ఆపేయడం ఇలా తెలుగు సినిమా చాలా దూరమే ప్రయాణించింది. సినిమాలో సెన్సిబిలిటీస్ అంతరిస్తున్న కాలంలో లేట్ సెవెంటీస్‌లో కుటుంబ కథాచిత్రాలు అంతరించి ఈ రకమైన కొత్తరకం హీరో అవతరించాడు. మధ్యతరగతి పాత్రలు పోయి ఒంటి చేత్తో వేలమందిని మట్టి కరిపించే హీరో అవతరించాడు. ఈ పరిణామానికి సంకేతాలుగా రెండు చిత్రాలు కనిపిస్తాయి. హాలీవుడ్ కౌబాయ్ కాపీకాట్ మోసగాళ్లకు మోసగాడు ఒకరకంగా వెస్టర్న్ పంథా చూపితే ఖైదీ మరోరకంగా డాన్స్ ఫైట్స్ డ్రామా ఎలిమెంట్‌ను మేళవించి హిట్ కొట్టింది. ప్రేక్షకుడు తనను తాను ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఇండస్ట్రీ పెద్దలు అవగాహనకు వస్తున్న దశ. రియాలిటీ, లాజిక్ అనేవి అవసరం లేదు, తెరమీద మామూలు మనిషిని కాకుండా లార్జర్‌దాన్ లైఫ్ ఇమేజ్‌ని చూపించినా ప్రేక్షకుడు తాను చేయలేని దాన్ని తన చుట్టూ ఉన్నవాళ్లు చేయలేని దాన్ని ఒక అద్భుతం చూసినట్టు చూడగలడు అని గుర్తించిన దశ. హీరోయిన్, కథ రెండూ చిక్కిపోతున దశ. సినిమా హీరో సెంట్రిక్‌గా మారుతున్న దశ. సినిమా వ్యాపారాత్మక కళనా కళాత్మక వ్యాపారమా అనే పనికిమాలిన చర్చకు ముగింపు పలికి ఇది పచ్చి యాపారం బాబయా, ఇక కళ అంటారా,ఆమెవరు బాబయా అని ప్రశ్నించే స్థితికి చేరుకుంటున్న దశ. సినిమా అంటే కళ కానిది విలువైనది అని గుర్తిస్తున్న దశ. సినిమారంగంలోకి రావడానికి ఆకర్షణో మోజో అవసరం లేదు కేవలం లాభార్జన కోసం ఇతరత్రా వ్యాపారాల్లాగే చూడొచ్చు అని డబ్బుతో పులిసిన వారు గుర్తించిన దశ. బొడ్డుమీద యాపిల్ పళ్లు వేయడం ఒక కళారూపంగా మారుతున్న దశ. సినిమాలు అందవిహీనంగా రసహీనంగా మారుతున్నాయని క్లాస్ పీపుల్ వగచు వేళ వాళ్లని కేటర్ చేసే లక్ష్యాన్ని భుజాన వేసుకున్నవాడు కాశీనాధుని విశ్వనాథ్. గ్రామాల్లోని వర్ణసంస్కృతిని ఉన్నతీకరించి చూపడం,అప్పుడప్పుడే పట్నాలకు వలసపోయినవారి నోస్టాల్జిక్ ఫీలింగ్స్‌ని సంతృప్తిపర్చడం అనే రెండు లక్ష్యాలను భుజానికెత్తుకున్నవాడు విశ్వనాథ్.

 మౌలికంగా చూస్తే సాహిత్యంలో విశ్వనాథకు ఎలాంటి అభిప్రాయాలున్నాయో సినిమా విశ్వనాథుడికి అవే ఉంటాయి. కాకపోతే విశ్వనాథ మరీ విద్యుత్ ప్రవేశాన్ని, రైళ్ల ప్రవేశాన్ని కూడా వ్యతిరేకించగలిగినంత ఛాందసుడు. సినిమా విశ్వనాథుడు మాత్రం గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అని నేరుగా అనకుండా ఉపరితల రిఫార్మ్ రూట్ తీసుకున్నాడు.కొంతవరకు వివేకానంద స్కూల్ అని చెప్పొచ్చు. కులం పోవాలి అనకూడదు. చిన్న కులాలు పెద్దకులాల ఆధిపత్యాన్ని ధిక్కరించకూడదు. ధిక్కరించడానికి అక్కడ అన్యాయమసలే లేదు. అందరూ ఎవరి ధర్మాలు వారు పాటిస్తూ కలిసి మెలిసి కాపురం చేసుకోవాలి. ఆచరణ చేత ఎవరైనా బ్రాహ్మల మెప్ప పొందొచ్చు. వారికి దగ్గరవ్వచ్చు. అది సప్తపది అయినా, సూత్రధారులైనా, స్వయంకృషి అయినా, శుభసంకల్పం అయినా చెప్పేది ఇదే. ఒకచోట అది యాదవులవ్వొచ్చు. ఇంకొకచోట చెప్పలు కుట్టుకునే దళితులవ్వవచ్చు. మరోచోట జాలర్లవ్వొచ్చు. నువ్వు ధర్మమార్గమువల్ల కానీ చదువువల్ల కానీ వ్యాపారంవల్ల కానీ ఉన్నతుడవై బ్రాహ్మల సరసన చోటు సంపాదించుకోవచ్చు. చదువు వల్ల ఉన్నతుడు కావడం సూత్రధారుల్లోనూ, వ్యాపారం వల్ల ఉన్నతుడు కావడం స్వయంకృషిలోనూ కనపడుతుంది. ధర్మం అనేది అన్ని సినిమాల్లోనూ అంతస్సూత్రంగా ఉంటుంది. ధర్మమార్గమనేదానికి సంప్రదాయ విధివిధానాలను పాటించు మార్గము అని ఇక్కడ అర్థం. ఏం చేసైనా అన్ని చిన్నచిన్నపాయలు వైదిక ధర్మమనే సముద్రంలో కలవాలి. ఒక్క ముక్కలో ఇది సంస్కరణవాదంగా కనిపిస్తూ భూస్వామ్య విలువలను ఉన్నతీకరించి చూపే వ్యవహారం. ఇంటి పెద్ద, ఊరి పెద్ద యాజులు గారిలానే ఉండాలి. ఇంటి ఆవిడ సోమిదేవమ్మ లాగే ఉండాలి. ఆడవాళ్లు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. మరీ అవసరమైతే ఇంటిపెద్ద తానో మెట్టుదిగి తక్కువ కులం అమ్మాయిని చేరదీయవచ్చు. అది వారి ఔన్నత్యం. కానీ మహిళలు తాము అలాంటిది కోరుకుని ముందడుగు వేయకూడదు. మార్పు ఉన్నత స్థితిలో ఉన్నవారి ఔదార్యం వల్ల రావాలి తప్పితే ధిక్కారము వల్ల రాదు. పొరబడి సంప్రదాయాన్ని ధిక్కరిస్తే సిరివెన్నెలలో మూన్‌మూన్ సేన్‌కు పట్టిన గతే పడుతుంది. పాత్ర అర్థంతరంగా అంతమవుతుంది.

 సిగరెట్ తాగే అలవాటున్న (స్మోకింగ్‌ను ఆరోగ్యం అనారోగ్యం చర్చల్లో కాకుండా ధిక్కారం, సంప్రదాయ రాహిత్యం చర్చలో భాగంగా చూడడంలోనే ధర్మసూత్రం ఉంది.) ఇంకా శరీరం భర్తకు మాత్రమే అప్పగించవలెననే నైతికతను పాటించని తనను ధర్మము, సంప్రదాయము ప్రాణములుగా భావించే ఒక కళాకారుడు దేవతలాగా చూడడంతో న్యూనతలో పడి ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ధర్మమే శాశ్వతం, పాత్రలు కాదు. సాగర సంగమంలో కూడా ఎన్ని సన్నివేశాలు దగ్గరగా వచ్చినా పరస్పరం ఆకర్షణ, ప్రేమ ఉన్నా కమల్ హాసన్, జయప్రద ఆఖరుదాకా 'పవిత్రంగా' ఉంటారు. అన్ని నాట్యరీతులను స్కాచి వడపోసిన హీరో ఏమైనా చేస్తాడు కానీ ఆమె కుంకుమ బొట్టు వర్షంలో తడుస్తుంటే మాత్రం చూడలేడు. ఇలాంటి ఉదాహరణలు కొల్లలుగా చెప్పొచ్చు. చివర్లో కమల్‌హాసన్‌ను, జయప్రదను చంపేసే బదులు వారిని కలిపేయవచ్చు. కానీ విశ్వనాథవారి సంప్రదాయం అనుమతించదు.

 "సంప్రదాయాన్ని పరిరక్షించేబాధ్యతను ఒక తరాన్నించి మరో తరానికి అందించడం అనేది కూడా విశ్వనాథ్ సినిమాల్లో బలంగా కనిపించే అంశం. సాగరసంగమంలో సంప్రదాయాన్ని పరిరక్షించే బాధ్యతను కమల్ హాసన్ నుంచి ఆయన శిష్యురాలు శైలజ తీసుకుంటుంది. శంకరాభరణంలో సోమయాజులు నుంచి తులసి తీసుకుంటుంది''. సంప్రదాయానికి ప్రతీకలుగా ఆయన తీసుకున్న రూపాలు అంతరించిపోతున్న నృత్య సంగీత రీతులు. వాస్తవానికి ఆ రూపాలు ఆరంభంలో బ్రాహ్మణేతరులవే అయినా 20వ శతాబ్ది తొలినాళ్లలో వాటిని వారు చిన్నచిన్న మార్పులతో ఓన్ చేసుకున్నారు. ఆ రకంగా అవి క్లాస్ కళారూపాలుగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. గ్రామీణ వాతావరణంలో క్లాస్ అంటే సాంస్కృతికంగా పైనున్నవారి వ్యవహారాలే. అదీ కథ. ఆ రెండు కళారూపాలు జనాభాలో ఐదు శాతం కూడా లేని ఒక కులంలోని కొందరిలో ప్రాచుర్యం పొందినవి. గిలకబావి, బాదం చెట్టు వంటివన్నమాట. వాటిని కేవలం నృత్య, సంగీత రూపాలుగా కాకుండా సంప్రదాయానికి సూచికలుగా ఎస్టాబ్లిష్ చేయడంలో అనితర సాధ్యుడు విశ్వనాథ్. అవి ప్రధానంగా కొందరికే పరిమితమయినా ఆ కొందరు సంస్కృతీ సంప్రదాయాలను నిర్వచించగలిగిన స్థితిలో ఉన్నవారు. ఏ రంగంలోనైనా ఆధిపత్య సంస్కృతే సంస్కృతిగా ఉంటుంది. కాబట్టి అది మనందరి మహోన్నత సంస్కృతి అని ప్రచారం చేయడంలో పెద్దలంతా పోటీపడుతూ ఉంటారు. ఇపుడు విదేశాల్లో బాగా స్థిరపడి సొంత సంస్థలు నడుపుకుంటున్న రెండు శూద్రఅగ్రకులాలకు రూట్స్ అనుకున్నప్పడల్లా సంప్రదాయ నృత్యం గుర్తొస్తుంది. రవీంద్రభారతిలో ఫలానా ఎన్‌ఆర్‌ఐ అమ్మాయి కూచిపూడి నాట్యప్రదర్శన రూపంలో బయటపడుతుంది. మన సంప్రదాయాన్ని పరిరక్షించుకోవాల్సి అవసరం ఎందుకుందో దాన్ని ఏడేడు సముద్రాలకవతల ఉండి కూడా దాన్ని తామెట్లా ఆచరిస్తున్నామో వారు మనకు ఉపన్యసించగలరు. అట్లా దానికొక యాంటిక్ వాల్యూ ఉంది. దాన్ని ప్రధానవనరుగా తీసుకుని తాను చెప్పదలుచుకున్నది చెప్పిన వాడు విశ్వనాథుడు. అట్లా ఊరికే చెప్పదలుచుకున్నది చెప్పడం వల్ల మాత్రమే గుర్తింపు రాదు. ఎలా చెప్పాలో తెలిస్తేనే వస్తుంది. ఆ టెక్నిక్ తెలిసినవాడు విశ్వనాథ్. మానవసంబంధాలు,అందులో ఉద్వేగాలు తెరపై శక్తిమంతంగా ఆవిష్కరించగల నేర్పరి. ఎంత నేర్పరి అంటే ఆయన భుజానకెత్తుకున్న విలువలను వ్యతిరేకించే వారు కూడా సినిమా చూసి అరే భలే తీశాడే అనుకునేంత నేర్పరి. బాలచందర్, మణిరత్నంలాంటి ప్రతిభావంతుడైన టెక్నీషియన్. కాకపోతే బాలచందర్‌లో వ్యవస్థీకృత విలువలపై ధిక్కారం ఉంటుంది. విశ్వనాథలో సామరస్యం ఉంటుంది. వరకట్నం లాంటి అందరూ ‘బాహాటంగా’ వ్యతిరేకించే సబ్జెక్ట్‌ని ముట్టుకున్నా విమర్శ కటువుగా లేకుండా  కామెడీ చేసి తేల్చేస్తాడు.

విశ్వనాథ్ సినిమా గ్రామర్ తెలిసినవాడు. మౌనం విలువ తెలిసినవాడు. మాటల కంటే దృశ్యాలతో ఎక్కువ మాట్లాడిస్తేనే అది శక్తిమంతంగా ఉంటుంది అని ఎరిగినవాడు. జయప్రద వేరే వారి చిత్రాల్లో ఆ మాదిరి మౌనమేలనోయి అంటే అది బూతు అయిపోయేది. విశ్వనాథ్ ఎరోటికాగానే మిగిల్చారు. సాధారణ మెలోడ్రామాగా తేలిపోయే సీన్లు కూడా విశ్వనాథ్ చేతిలో పడితే కళాత్మకతను సంతరించుకుంటాయి. తల్లి ఆస్పత్రిబెడ్ మీద మరణిస్తూ ఉంటే కుమారుడు పూనకం వచ్చినట్టు డాన్స్ చేయడం ఇంకొకరి చేతుల్లోనైతే అభాసుపాలయ్యేది. ప్రత్యేకించి విలన్లు, హీరోలు అంటూ ఎవరూ ఉండరని రెండూ మనమేనని తెలిసినవాడు విశ్వనాథ్. సూత్రధారుల్లో కొద్దిగా విలన్ షేడ్ ఉన్నా అక్కడ ఆ పాత్రను సింపుల్‌గా రిఫార్మ్‌ చేసి పడేస్తాడు. సామాజిక స్థితిగతుల గురించి అవగాహన ఉన్న వారంతా మంచి చెడూ వేర్వేరుగా ఉండవని గుర్తిస్తారు. కాకపోతే నిజమైన మార్పును కోరుకునేవారు ఆ మనిషి చెడుగా మారడానికి ఉన్న పరిస్థితులను నిర్మూలిస్తే తప్ప సమాజం మారదని అనుకుంటారు. విశ్వనాథ్ లాంటివారు సున్నితంగా చెపితే కూడా మార్పు సాధ్యమని నమ్మబలుకుతారు. ఆ మార్పు కూడా ముందుకు కాకుండా వెనక్కి చూపిస్తారు. ధర్మో రక్షతి రక్షిత: అనుకుంటారు. అదీ తేడా. విశ్వనాథ్ సున్నితంగా కాకుండా కాస్త బండగా చెప్పిన సందర్భం ఒక్కటే. అది స్వర్ణకమలం. అందులో వేద పండితులైన ఘనాపాఠిలకు లౌకిక పరమైన ఆఫీసుల్లో తగిన గౌరవం ఇవ్వకపోవడంపై వెంకటేశ్ చాలా ఆవేశపడతాడు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చిన్నపాటి ఉపన్యాసం కూడా ఉంటుంది. విశ్వనాథ్ కడుపు చించుకుని తన ఆక్రోశాన్ని తన అభిప్రాయాలను సూటిగా కోపంగా చెప్పింది బహుశా ఇదే సందర్భంలోనేమో. సినిమాకు కెప్టెన్ అయిన దర్శకుడి ప్రతిభ పాత్రధారుల ఎంపికలోనూ టీమ్ ఎంపికలోనూ బయటపడుతుంది. విశ్వనాథ్ మెజారిటీ సినిమాల్లో పనిచేసిన నటీనటులు,మాటల రచయితలు, పాటల రచయితలు, ఇతర టెక్నీషియన్స్ ఆయా రంగాల్లో పండితులు. భావానికి తగ్గ ఫీల్ ఇవ్వగల నేర్పరులు. సినిమా కేవలం డబ్బు, పేరు సంపాదించి పెట్టే సాధనం కాదు, అది కళాత్మక సాధనం కూడా అనే ఎరుక ఉండడం, మంచి టెక్నీషియన్ కావడం, వీటితో పాటుగా కొన్ని బలమైన అభిప్రాయాలు కలిగి ఉండడం విశ్వనాథ బలం. ఈ లక్షణాలు జమిలిగా ఉన్నవారెవరైనా ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు. విశ్వనాథ్ వారసుడిగా ఇపుడు మనం చెప్పకుంటున్న శేఖర్ కమ్ములకు కూడా ఆ చివరిది తప్ప మిగిలిన లక్షణాలు కొద్దోగొప్పో ఉన్నాయి. ఆ చివరి లక్షణం లేకుండా కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగలగడం అనేది 90ల తర్వాత మారిన సామాజిక వాతావరణం వల్ల సాధ్యమైంది. సారం కంటే రూపం ముఖ్యమైపోయిన దశ కదా!

      డాలర్ డ్రీమ్స్‌లాంటి బాలారిష్టాలను పక్కనబెడితే శేఖర్ తన రాకను ఘనంగా చాటింది ఆనంద్‌తోటే. అయితే ఇతని సినిమాలు చూసినపుడు మనకి కలిగే ఇంప్రెషన్స్ ఏంటని అడిగితే మాత్రం తడుముకోకుండా జవాబు చెప్పడం కష్టం. క్లీన్,సెన్సిబుల్… అని మూడో పదం కోసం తడుముకోవాల్సిందే. ఆ రెండు మాత్రం రెండా అంటే చెప్పడానికేమీ లేదు. శేఖర్ రంగం మీదకు దూసుకొచ్చేసరికి అర్బనైజేషన్ కీలకమైన దశకు చేరుకుంది. అర్బన్ మిడిల్‌క్లాస్ ఒక పెద్ద క్లాస్‌గా అవతరించింది. ఇంటర్నెట్ పుణ్యమా అని వరల్డ్ ఎక్స్‌పోజర్ వచ్చింది. మల్టీప్లెక్స్‌లు కూడా వచ్చేశాయి. హెలికాఫ్టర్లు, సుమోలు లేపకుండా మామూలు మనుషులతో మామూలు లొకేషన్స్‌లో ఒళ్లు దగ్గరపెట్టుకుని బడ్జెట్ అదుపులో ఉంచుకుని సినిమా తీస్తే పెట్టిన డబ్బులు తిరిగొస్తాయనే నమ్మకాన్ని ఈ కొత్త మార్కెట్ ఇచ్చింది. దీంతో కాస్త చదువుకున్నవారు, సినిమా మీద నిజంగా ప్రేమ ఉన్నవారు రావడానికి మార్గం సుగమమైంది. ఈ కొత్త వాతావరణం దేశమంతా ఉంది. దిల్ చాహ్‌తాహై తర్వాత హిందీలో ఎన్ని మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయో చెప్పలేం. 70లు, 80 మనలాగే వాళ్లకు ఇనుపదశ  అయినప్పటికీ ఆయా కాలాల్ని పట్టించే సినిమాలు ప్రతిదశలోనూ ఉన్నాయి. చష్మే బద్దుర్ నెహ్రూవియన్ ఆర్థిక విధానాల కాలాన్ని కళ్లకు కడితే దిల్ చాహ్‌తాహై 90ల తర్వాత మారిన భారతాన్ని చూపుతోంది. మన సినిమా దేన్ని పట్టిస్తుంది అంటే చెప్పడం కష్టం.

ఇది వేలు, ఇది కాలు మడిస్తే వలిచేస్తా నీ తోలు వంటి బండ డైలాగులతో విసుగెత్తిపోయి ఉన్న అర్బన్ క్లాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని ఇవాళ శేఖర్ లాంటి కొత్త దర్శకుస్తున్నారు. కొత్తగాలి వీస్తోంది. కాకపోతే తెలుగులో ఇలాంటి సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ సమస్య. థియేటర్ల సమస్యలైతే ఉన్నాయి. అవింకా పెద్దోళ్ల చెరలోనే ఉన్నాయి. ఏదో తిప్పలు పడి ఒక సినిమాను హిట్ అనిపించుకుంటే తప్ప ఈ హర్డిల్‌ను కొంతవరకైనా దాటలేరు. ఆనంద్‌తో ఆ హర్డిల్ దాటేశాడు శేఖర్. ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలకు టానిక్ లాగా పనిచేసింది ఈ సినిమా. సెన్సిబిల్ అనే ముద్రపోకుండా ఈ హిట్ అనే బ్రహ్మపదార్థాన్ని చేరుకోవడానికి కొత్తతరం దర్శకులు చాలా విన్యాసాలే చేస్తున్నారు. ఏదో ఒక కమర్షియల్ ఎలిమెంట్‌ను జోడించడమో లేక కమర్షియల్ వాల్యూ ఉన్న నటీనటులను ఆశ్రయించడమో చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్, థియేటర్ల సమస్యలు రాకుండా ఉండడం కోసం ఫలానా బాబుగారినో వారి వారసులనో ఆశ్రయిస్తున్నారు. తమ ప్రొఫైల్‌లో ఇలాంటి సినిమాలు కూడా ఒకట్రెండు ఉండాలని వారు కూడా కోరుకుంటూ ఉండడం వల్ల కొందరికి అవకాశం లభిస్తోంది.

శేఖర్ ఏం చేశాడు? తెలుగు సినిమాలో కరవైపోయిన నేటివిటీని పట్టుకొచ్చాడు. మామూలుగా ఎంత చెత్త తమిళ సినిమా చూసిన అది తమిళ సినిమా అని తెలిసిపోతుంది. కానీ తెలుగు సినిమాలో తెలుగుదనం అనేది దుర్భిణీ వేసి వెతికినా కనిపించదు. తెలుగుదనానికి కమర్షియల్ తెలుగు దర్శకులకు బొత్తిగా పడదనుకుంటా. ఈ గ్యాప్‌ని భర్తీ చేశాడు ఆనంద్. అలాగే చాలాకాలం తర్వాత విమెన్ కేరక్టర్‌ని బలంగా చూపించాడు. బలంగా అనగానే తిరుగుబాటు లాంటి వ్యవహారాల జోలికిపోకుండా మామూలు దైనందిన జీవితంలో కూడా మహిళ ఆత్మవిశ్వాసంతోనూ, ఆత్మగౌరవంతోనూ ఉండగలదని చూపించాడు. ఎలాంటి అభూత శక్తులు లేని మన పక్కింటి అబ్బాయిని తెరకెక్కించి అక్కడా మార్కులు కొట్టేశాడు. మామూలుగా నేటి అర్బన్ యూత్‌కి ఇష్టమైన పర్యావరణం వగైరాలను పనిలో పనిగా చూపించాడు. అర్బన్ యూత్ తమను తాము ఐడెంటిఫై చేసుకునేట్టు చూశాడు. అదే సమయంలో వారు ఇబ్బందిపడే సబ్జెక్ట్‌ల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. చివరకు రాగింగ్‌ను కూడా ఒక నేరంగా కాకుండా అదుపులో ఉంటే ఫర్వాలేదన్న ధోరణిలోనే చూపించాడు. టీచర్ పాత్రను చాలా సినిమాలు వల్గరైజ్ చేస్తున్న వేళ అదే టీచర్ పాత్రకు స్టూడెంట్‌కి మధ్య ఇన్‌ఫాక్చుయేషన్ పెట్టి కూడా అది హద్దులు దాటకుండా చూడగలిగాడు. ఒక రకంగా యువదర్శకులకు ఉండే బడ్జెట్ పరిమితులే వరంగా కూడా పరిణమించాయి అని చెప్పొచ్చు. కాస్త తెలుగు దనాన్ని చూడగలుగుతున్నాం.

శేఖర్ అర్బన్ యూత్ ఆశలను ఆకాంక్షలను సెన్సిబిలిటీస్‌ని చూపగలిగాడు. ఫీల్ గుడ్ మూవీస్ డైరక్టర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. కొంతమందికి మాత్రమే పరిమితమైన రియాలిటీని రొమాంటిసైజ్ చేసి చూపాడు. సమాజంలోని వైరుధ్యాలతో అతనికి పెద్దగా సంబంధం లేదు. కాసేపు ఏ ఇబ్బందిలేని కాలక్షేపంగా మాత్రమే సినిమాని చూస్తే అతనితో ఇబ్బంది ఉండదు. పాప్ కార్న్ మనకు మంచిదా చెడ్డదా అంటే ఏం చెపుతాం. పీచు ఆరోగ్యానికి మంచిదే అని తప్ప. టీవీలాగే మనల్ని ప్రశ్నించని డిస్ట్రబ్ చేయని ఆలోచనలు రేపని కాలక్షేపాన్ని కోరుకునే వారు ఈ జనరేషన్‌లో చాలామందే ఉన్నారు. సమాజంలోని వైరుధ్యాలు, రాజకీయాలు, ఆధిపత్యాలు, సమానత్వ ఆరాటపోరాటాలు లాంటివేవీ ఆయన సినిమాల్లో కనిపించవు. లోతైన భావాలు కానీ ఆలోచనలు కానీ ఉండవు. బహుశా అదే ఇవాల్టి యూత్‌కు కూడా కావాల్సింది. పుస్తకాలతో కాకుండా టీవీతో వీడియోగేమ్స్‌తో సహవాసం చేసిన జనరేషన్‌కు, అందుబాటులో ఉన్న అన్ని ఆనందాలు త్వరత్వరగా పొందేయాలనే ఆరాటం ఉన్న జనరేషన్‌కు, పోస్ట్ స్టూడెంట్స్ యూనియన్ జనరేషన్‌కు ఉన్న సెన్సిబిల్ ఆప్షన్ శేఖర్.కాకపోతే లీడర్‌ను తన మాగ్నం ఓపస్‌గా చెప్పకున్నాడు శేఖర్. తనకూ కొన్ని విశాల లిబరల్ భావాలున్నాయని చెప్పకుంటే పర్వాలేదు. ఆ సినిమాతో భరతమాత ఆనందతాండవం చేస్తుందని చెప్పాడు. కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థకు పాజిబుల్ సొల్యూషన్ అని కూడా అన్నాడు. కానీ సినిమా అతన్ని అంతకుముందున్న స్థితినుంచి వెనక్కునెట్టింది. అతని అవగాహన ఇమ్మెచ్చురిష్ అని అర్థం చేసుకోవడానికి పెద్ద మేధావిత్వమేమీ అక్కర్లేదు. తండ్రి అవినీతితో సంపాదించిన వేల కోట్ల రూపాయలతో గద్దెనెక్కి నీతిమంతమైన వ్యవస్థను నెలకొల్పుతాననే లీడర్‌ను ప్రేక్షకులు ఆమోదించి ఆనంద తాండవం చేస్తారనుకోవడంలోనే అమాయకత్వముంది.  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల సినిమాల్లో పూసలో దారంలాగా ఒక ధార ఉంటుంది. సినిమా తీయగల నేర్పు, మరీ దిగజారి ఆలోచించకుండా మధ్యతరగతిలోని లిబరల్ సైడ్‌ని చూపించగలగడం వంటి కారణాలు తప్పితే అటువంటి భావధార ఏదీ శేఖర్ సినిమాల్లో లేదు. అర్బన్‌ సెన్సిబిలిటీసే ప్రత్యేకత అయితే ఇవాళ చాలామందే కనిపిస్తున్నారు. నందినీ రెడ్డి, నీలకంఠ,జాగర్లమూడి క్రిష్ లాంటివారు అదే బాటలో పయనిస్తున్నారు. గమ్యంలో ఉన్నపాటి సిన్సియారిటీ వేదంలో లేకపోయినా క్రిష్‌లో ఒక భావధార అయితే కనిపిస్తోంది. పూర్తి ఫార్ములా సినిమాలే తీసిన త్రివిక్రమ్‌లో కూడా లోతైన ఆలోచనలు ఉన్నట్టు అర్థమవుతుంది. మహేశ్ బాబును, ఫార్ములా మసాలాను పెట్టి కంగాళీ చేయకుండా సిన్సియర్‌గా చేసి ఉంటే ఖలేజా మంచి సినిమా అయ్యుండేది. ఏమైనా అర్బన్ సెన్సిబిలిటీస్‌ని గుర్తించిన దర్శకుడిగా ఆ పంథాకు మార్గనిర్దేశనం చేసినవాడిగా గుర్తింపు అయితే శేఖర్‌కు ఉంది. ఎలాంటి భావధారలేకపోయినా అర్బన్ యూత్‌లో ఐకాన్ స్టేటస్ రావడం ఇవ్వాల్టి సామాజిక స్థితికి సంకేతం. భావజాలం అనేదాన్ని భారంగా చూస్తున్న తరానికి అవసరమైన ఎంటర్‌టెయిన్‌మెంట్ ఇచ్చే సెన్సిబిల్ సినిమా వ్యాపారి శేఖర్. కారణాలింకేమైనా ఉండొచ్చు. ఇరవైయేళ్ల క్రితం సినిమా రంగంలో విశ్వనాథ్‌కు ఎలాంటి ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఉండేవో అలాంటివన్నీ ఇవాళ శేఖర్‌కు ఉన్నాయి. ఈ ఇరవై యేళ్లలో వచ్చిన మార్పులు ఒక పెద్దమనిషిని నోస్టాల్జియాగా మార్చేశాయి. మరొక మనిషిని ఆ సీట్లో కూర్చోబెట్టాం. ధోవతి, పంచెకట్టున్న పల్లెటూరి పంతులు గారి స్థానాన్ని జీన్స్ వేసుకున్న పట్నపు కుర్రాడు ఆక్రమించారు. కాకపోతే శేఖర్ లాంటివాళ్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. పేరు ప్రతిష్టలకు సంబంధించి గతానికి వర్తమానానికి తేడా ఉంది. పాత రోజుల నాటి కీర్తి పాతపాటల్లాంటిది. జనం నోళ్లలో నానుతూనే ఉంటుంది. ఇవాల్టి ఫేమ్ ఇవాళ్టిపాట లాంటిది. నాలుగురోజులు ఎక్కడ చూసినా అదే వినిపిస్తుంది. ఐదో రోజు కనుమరుగవుతుంది. అంతా ఇన్‌స్టంటే. ఫేమ్ కూడా ఇవాళ ఎప్పటికప్పడు రీచార్జ్ చేసుకోవాల్సిన విషయమే.

(2012 సెప్టెంబర్‌ మొదటివారం సండే ఇండియన్ వారపత్రికలో ప్రచురితం)

- జి.ఎస్.రామ్మోహన్