Saturday 27 December 2014

(2014 డిసెంబర్‌ 14న ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ప్రచురితమైన వ్యాసం)

మార్కెట్‌ కింగ్-మార్జినల్‌ ప్లేయర్స్‌






అటల్‌ బిహారీ వాజ్‌పేయి బిజెపికి మాస్క్‌ లాంటి వారు అని కొందరు విమర్శించేవారు. మరి మోదీని, ఆయన అభివృద్ధి తపనను చూస్తే ఏమనిపిస్తున్నది. పాలనలోకి వచ్చి ఆరునెలలయ్యింది. మోదీ బిజెపిని మించి ఎదిగిపోయారని వింటున్నాం.కానీ పూర్తిస్థాయిలో మోదీ ముఖం ఇప్పటికి బయటపడిందా! తాను బయటకు కనిపించే ప్రతిక్షణం తాను కోరుకున్న విధంగానే కనిపించడంపై ఒక మనిషి అంత శ్రద్ధ పెడితే, భావోద్వేగాలను కొలత వేసి ప్రదర్శిస్తుంటే ఆ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి? స్మార్ట్‌ సిటీల నిర్మాణం గురించి మాట్లాడిన శృతిలోనే పురాణకాలంలో విమానాలు-ప్లాస్టిక్‌ సర్జరీలు ఉన్నాయని మాట్లాడగలిగిన వ్యక్తి ముఖంలో ఏ పార్శ్వం నిజం, ఏది మాస్క్‌!
        పైన కనిపించే చిహ్నాలు చూస్తే అవినీతికి ఏమాత్రం తావులేని పాలన అందివ్వడానికి పట్టుగా ఉన్న నేతగా కనిపిస్తారు నరేంద్రమోదీ. అర్జునుడికి పక్షికన్ను మాదిరి అభివృద్ధి తప్ప మరేదీ కనిపించని నేతగా కనిపిస్తారు. హిందూత్వమా, అదేంటి అన్నట్టు కనిపిస్తారు. వ్యవస్థలోని మురికిని చీపురు పట్టి ఊడ్చేసే నేతగా కనిపిస్తారు. పథకాలు అమలులో నిధులు మింగేస్తున్న పందికొక్కులను ఏరివేయడానికి అవతరించిన నాయకుడిగా కనిపిస్తారు. ఇందుకోసం ప్రజల ఆలోచనలు పంచుకుంటూ పనిచేసే సృజనాత్మకమైన నేతగా కనిపిస్తారు. వివాదాల జోలికే పోకూడదని ప్రతినబూనిన వ్యక్తిగా కనిపిస్తారు. స్వాతంత్ర్యంకోసం ప్రాణత్యాగం చేసే అవకాశం లేకపోయినందుకు బాధపడే నేతగా కనిపిస్తారు. అదే సమయంలో విజయం కోసం ఎలాంటి ఎత్తుగడలైనా వేయగలిగిన నేతగా అనిపిస్తారు. మహారాష్ర్టలో కేవలం మిత్రపక్షం అనే పదానికే పరిమితం చేయలేని భావజాల బంధువు శివసేనను డంప్‌ చేసిన తీరు చూస్తే లక్ష్యసాధనలో సెంటిమెంట్లకు తావివ్వని వ్యక్తిగా అనిపిస్తారు. ఉగ్రవాది అని హిందూత్వ సంస్తలు దుమ్మెత్తిపోసే కశ్మీరీ హురియత్‌ నేత సజ్జాద్‌లోన్‌తో సమావేశమైన తీరు చూస్తే లక్ష్యసాధనకోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి సిద్ధపడిన నేతగా అనిపిస్తారు. ఇమేజరీ చాలనే ఉంది.తన మంత్రివర్గ సహచరులకు కర్తవ్యబోధ చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశపు దృశ్యాలను చూస్తే అతని దగ్గర అనుచరులకు తప్ప సహచరులకు స్థానం లేదని అర్థమవుతుంది. హెడ్‌ మాస్టర్‌ టీచర్లతో సమావేశమైనట్టు లేదు. విద్యార్థులతో సమావేశమైనట్టు ఉంది. వారితో మాట్లాడేటప్పుడు కూడా ఆయన హావభావాలు కొలతేసి ప్రదర్శిస్తున్నారు. అంటే మోదీ ఏ విషయంపై ఏమనుకుంటున్నారో ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఆయన ఏం తెలియజేయదల్చుకున్నారో మాత్రమే తెలుస్తుంది. సింబాలిజం, ఇమేజ్‌ ప్రధాన పాత్ర పోషించే ఆధునిక ప్రపంచంలో ఆ రెంటి రహస్యాలు ఎరిగినవాడు నరేంద్రమోదీ.
    వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వాటికి సంబంధించిన లాభనష్టాలను భరించే బాధ్యత తీసుకోవడం నాయకత్వలక్షణాల్లో ప్రధానమైనవి. అవి మోదీలో పుష్కలంగా ఉన్నాయని ఇవాళ కొత్తగా
చెప్పుకోనక్కర్లేదు. అధికారంలో తీసుకునే నిర్ణయాలను సామాన్యుడి కళ్లతో ముందే  చూసి స్పందనను అంచనావేయగలిగిన నైపుణ్యం ఆయనకు పుష్కలంగా ఉంది. ఆ జీవితమూ ఉన్నది. అవగాహనా ఉన్నది.  స్ర్టీట్‌ స్మార్ట్‌ అంటారే అలాంటి లక్షణాలు ఆయనలో పుష్కలంగా కనిపిస్తాయి.గొప్ప వక్త కాకపోయినా ఆయన్ను సమకాలీన  నాయకులందరిలోనూ పైమెట్టుమీద నిలపగలుగుతున్నది ఆ లక్షణమే. ఎలా కనెక్ట్‌ కావాలో బాగా తెలిసిన నేత. ఆధునిక సమాజం ప్రాధమిక అవసరంగా మార్చిన ఎనర్జీకి సంబంధించి ఆయన మూడు నిర్ణయాలు తీసుకున్నారు. అన్నీ మార్కెట్‌కు సంబంధించినవే. కాంగ్రెస్‌ నాన్చుతూ వస్తున్నవే. బొగ్గు, గ్యాస్‌, డీజిల్‌ మూడు అంశాలను ఆయన తేల్చిపడేశారు-పెద్ద వివాదాలేవీ లేకుండానే! డీజిల్‌ను మార్కెట్‌కు అనుసంధానం చేస్తూ ఇంకెవరైనా నిర్ణయం తీసుకుంటే ఎంత వ్యతిరేకత వచ్చేదో! కానీ మోదీకి అంతర్జాతీయ మార్కెట్‌ పరిణామాలు కలిసొచ్చాయి. మార్కెట్లకు ఆయనమీదున్న ప్రేమ అలాంటిదేమో! గ్యాస్‌ ధరను రెట్టింపు చేయాలని రంగరాజన్‌కమిటీ సూచిస్తే అంతకంటే బాగా తక్కువ నిర్ణయించి దేశఖజానాకు ఆదాయాన్ని కాపాడిన నేతగా ఇమేజ్‌ సంపాదించారు మోదీ. దాన్ని మించింది కేజీ బేసిన్‌లో రిలయెన్స్‌ గ్యాస్‌ తవ్వకాలకు సంబంధించిన నిర్ణయం. రిలయెన్స్‌ తవ్వాల్సినంత గ్యాస్‌ తవ్వి చూపించేదాకా పాత ధరే వర్తిస్తుందని తేల్చేశారు మోదీ. ఆయన అంబానీల బంటు అని వాదించేవారి నోరు మూయించేందుకు ఆయన ఇచ్చిన మాస్టర్‌స్ర్టోక్‌ ఇది. ఇలాంటి సింబాలిజం ఇమేజ్‌ మేకింగ్‌లో ఎలాంటి పాత్ర పోషించగలదో మాస్టరీ చేసిన వ్యక్తి మోదీ.
రిజర్వ్‌ బ్యాంక్‌ మీద. ఆర్థిక శాఖ మీద, చెణుకులు విసురుతూ ప్రధాని కార్యాలయం ముందు అవెంత దిగదుడుపో బాహాటంగా చెపుతూ కూడా స్కోత్కర్ష అనే విమర్శ మీడియాలో రాకుండా
చూసుకోగలిగిన వ్యక్తి మోదీ.నల్లధనం తెస్తే ఒక్కొక్కరికి ఎంత పంచొచ్చు అని చెప్పారు కదా సార్‌, దాని సంగతేమిటి అని సౌమ్యంగా ప్రశ్నించి ఆ తర్వాత పాపం, పీత కష్టాలు పీతకు అన్నట్టు ప్రభుత్వానికి కూడా కష్టాలుంటాయి అని తానే సమాధానపడిపోతున్నది పాపులర్‌ మీడియా.
       ఇప్పటివరకూ కాంగ్రెస్‌కు ఉన్నది బిజెపికి లేనిది స్వాతంత్రోద్యమ వారసత్వం. గాంధీని చంపిన వారసత్వం ఉంది కానీ గాంధీ వారసత్వం లేదు. ఇపుడా వారసత్వంలో ఎలాగోలా వాటాను
తీసుకొచ్చి బిజెపికి కట్టబెట్టే బాధ్యత చేపట్టారు మోదీ. వల్లభాయ్‌ పటేల్‌ కాంగ్రెస్‌ నాయకుడు కాదేమో, బిజెపి నాయకుడేమో అనిపించేంత రీతిలో ప్రచారం సాగుతున్నది. నెహ్రూ కంటే పటేల్‌ను పెద్దగీత చేసి సొంతం చేసుకునే ప్రక్రియ సాగుతున్నది. ఇక్కడా అప్రాప్రియేషన్‌ టాక్టిక్సే. ఇంకోవైపు సిలబస్‌లో మార్పులు సైలెంట్‌గా సాగిపోతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలపై వీధుల్లో వీరంగం చేసే బాధ్యతను తన కజిన్స్‌కు వదిలేసి లోతైన బాధ్యతలో తలమునకలుగా ఉన్నది బిజెపి.  ఎప్పుడు అధికారం రుచి చూసినా మానవవనరులశాఖను తీసుకుని ఆ ప్రయత్నం కొద్దో గొప్పో చేయడం మామూలే. ఈ సారి నింపాదిగా చేస్తున్నది.. ఇతరత్రా వ్యవహారాల్లో లభిస్తున్న ఆమోదపు కరతాళధ్వనుల ముందు దీనిపై నిరసన ధ్వనులు వినిపించే పరిస్థితి లేదు. వర్తమానంపై తిరుగులేని విశ్వాసమున్నవాడు కావడం వల్ల, పదేళ్ల వరకూ తిరుగులేదని విశ్వాసమున్నవాడు కావడం వల్ల గతాన్ని తిరగరాయడంపైనా భవిష్యత్తు మీదా కేంద్రీకరించగలిగిన స్థితిలో మోదీ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంత విశ్వాసంతో బిజెపి శ్రేణులు కనిపిస్తున్నాయి. నాయకుడు ఇచ్చే భరోసా బలమది.
      మోదీ అహ్మదాబాద్‌నుంచి ఢిల్లీవైపు దృష్టి మళ్లించే నాటికే దేశంలో ఆయన ఆలోచనలకు ఎర్రతివాచీ పరిచే మార్పులు జరిగిఉన్నాయి. ఎర్ర శ్రేణులు నీరసపడి ఉన్నాయి. తమ రాష్ర్టానికి పెట్టుబడులు ఆకర్షించడం అనేది సిఎంల ప్రొఫైల్‌లో అతిముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఫలానా రాష్ర్టానికి పోవాల్సిన పెట్టుబడిని ఫలానా ఫలానా రాయితీలిచ్చి మా రాష్ర్టానికి తెచ్చుకోగలిగాం అని ముఖ్యమంత్రులు బాహాటంగా చాటుకుంటూ స్కోర్‌కార్డ్‌ పెంచుకోవడం స్థిరపడి పోయి ఉన్నది. టీవీ చూసే పత్రికలు చదివే వోకల్‌ సెక్షన్స్‌లో దానికి ఆమోదం మాత్రమే కాదు, అంతకు మించిన విలువ స్థిరపడిపోయి ఉన్నది. ఆ సెక్షన్‌ పెరుగుతూ ఉన్నది. మార్కెట్‌ సంస్కరణల వల్ల ప్రయోజనాలు పొందినవారు ఇపుడు మోదీ ప్రతి కదలికకు చీర్‌ లీడర్స్ అవుతున్నారు.ఆ పునాది మీదే ఆ విశ్వాసం మీదే ఇపుడు మోదీ అత్యంత ప్రమాదకరమైన కార్మిక సంస్కరణలకు సిద్ధమవుతున్నారు. 2001లో యశ్వంత్‌ సిన్హా కార్మిక సంస్కరణలకు తెరతీసినపుడు ఆయన్ను క్రిమినల్‌ అని తిట్టిపోశారు దత్తాపంత్‌ థెంగ్డే. వాజ్‌పేయి మంత్రుల్లో సగంమంది అమెరికా, ఐరోపా దేశాల పేరోల్స్‌లో ఉన్నారని, అందుకే వారు మల్టీ నేషనల్‌
కంపెనీలకు తైనాతీలుగా వ్యవహరిస్తున్నారని ఆయన నిప్పులు కక్కారు. థెంగ్డే బయటివాడు కాదు, వామపక్ష వాది అస్సలే కాదు. ఆరెస్సెస్‌ సీనియర్‌ నాయకుడు. భారతీయ మజ్దూర్‌సంఘ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు. సొంత శిబిరం నుంచి వచ్చిన ఈ విమర్శలపై అప్పట్లో బిజెపిలో బోలెడంత చర్చ నడిచింది. ఇవాళ ఆ శిబిరంనుంచి విమర్శలు చేసేవాళ్లూ లేరు. అథవా ఎవరైనా లోలోపల మనకు తెలీకుండా గొణిగినా సీరియస్‌గా తీసుకుని చర్చించేవారు అసలే లేరు. స్వదేశీ జాగరణ మంచ్‌ ఏమైందో తెలీదు. గ్లోబలైజేషన్‌ మీద అధ్యయనం చేసిన గోవిందాచార్య లాంటివారు ఏమయ్యారో తెలీదు. అంతమాత్రాన మోదీ ఆరెస్సెస్‌ కంటే పెద్దవాడేపోయాడని భావించడానికి లేదు. దాన్ని ధిక్కరించి వ్యవహరిస్తున్నట్టు అస్సలు భావించడానికి లేదు. దేవాలయాల కన్నా టాయిలెట్లు అవసరం లాంటి స్టేట్‌ మెంట్లు చూసి అదిగో చూశారా అనడం అమాయకత్వమవుతుంది.ఆరెస్సెస్‌ మీద నిషేధం విధించినపుడు అండర్‌ గ్రౌండ్లో పనిచేసిన నిబద్ధ కార్యకర్త మోదీ. స్వతంత్రభారత చరిత్రలో తొలిసారి సర్‌సంఘ్‌ చాలక్‌కు జాతిని ఉద్దేశించి ప్రభుత్వ మీడియాలో ఉపన్యసించే అవకాశం కల్పించినవాడు మోదీ.రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అవసరాల కోసం పనిచేస్తున్న వివిధ విభాగాల మధ్య అనుసంధానానికి, అవసరమైన సందర్భాల్లో సైద్ధాంతిక మార్గదర్వకత్వానికి, నాయకులను తయారుచేసి అందివ్వడానికి ఆరెస్సెస్‌ పరిమితమైనట్టు అనిపిస్తోంది.తమ తమ రంగాల్లో విజయం సాధించడానికి వారు ఎంచుకునే వ్యూహాలు-ఎత్తుగడల్లో తమ కోర్‌ ఏరియాకు ఇబ్బందికరమైనది ఉంటే తప్ప స్పందించకూడదని కూడా భావిస్తున్నట్టు అర్థమవుతున్నది. వాళ్లకోర్‌ ఏరియా కార్మికులు అయ్యే అవకాశం లేదు. కోర్‌ ఏరియాల్లో ఆరెస్సెస్‌కు భిన్నంగా మోదీ నడిచే అవకాశం లేదు.మోదీ ఇమేజ్‌ మేక్‌ ఓవర్‌ పూర్తయితే కానీ ఆ కోర్‌ ఏరియాల పని పట్టకపోవచ్చు.
       బిసి నాయకుడిని ముందు పెట్టడం మోదీ రూపంలో వ్యక్తమై ఉండవచ్చును. కానీ కులంతోనూ కుల నాయకులతోనూ వారి సయ్యాట ఇవాళ మొదలైందేమీకాదు.
ముఖ్యంగా గత ఐదారేళ్లుగా వాళ్లు దేశంలోని వివిధ కులసంఘాలతోనూ వాటి నాయకులతోనూ చర్చలు జరుపుతూ ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులతోనే కాదు, సైద్ధాంతిక శత్రువులతో కూడా కలిసి మాట్లాడడానికివెనుకాడడం లేదు. దేశంలో వేగంగా సాగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఆ మార్పులను తనకు అనువుగా మలుచుకోవడానికి వారు సమర్థంగా కృషి చేస్తున్నారు. తాము ఉగ్రవాదిఅని పిలిచే సజ్జాద్‌ లోన్‌తో అవసరం కోసం మోదీ చేతులు కలిపితే కూడా మౌనంగా ఉండిపోయేంత స్థితప్రజ్ఞత ప్రదర్శిస్తున్నది ఆరెస్సెస్‌. మోదీ ఎంత ఎదిగినా, ఏం చేసినా ఏనాడూ అభద్రత అనిపించకపోవడంలో వారి సైద్ధాంతిక అనుబంధం, పరస్పర విశ్వాసం ఇమిడి ఉన్నాయి. మోదీ మీద వారికున్న ఆ అపార నమ్మకంలోనే అసలు విషయం దాగుంది. మార్కెట్‌ ఎర్రతివాచీ పరిచి ఉన్నా ఇంకేమి చేసి ఉన్నా పార్లెమెంటరీ రెబల్‌ జార్జిఫెర్నాండెజ్‌ ఆ నాడు ఆ అడుగు వేయకపోయి ఉంటే మోదీ ఇవాళ ఈ స్థాయిలో ఉండేవారు కాదు. లెజ్టిమసీ అనేది కీలకమైన విషయం.  మోదీ ఉథ్తానం-కమ్యూనిస్టుల పతనం విలోమనిష్ఫత్తి కలిగినవి.వామపక్షాల  స్పేస్‌ను ఆమ్‌ ఆద్మీ లాంటి పార్టీలు భర్తీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వాళ్లూ వ్యక్తిగతంగా నిజాయితీ పరులే. పేదలకు మేలు చేయాలనే వారే. రాజకీయాలు అప్రధానమైపోయాక మేలు అనే అమూర్తమైన మాటను ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. నక్సలైట్ల త్యాగం, సుందరయ్యగారి సైకిల్‌, రాఘవులు చేతి సంచీ గురించి జరిగిన ప్రచారంలో పదో భాగమైనా వారి రాజకీయాల గురించి జరిగి ఉంటే కథ వేరే ఉండేది.
        పెట్టుబడి అనేది ఇవాళ ఆకర్షణీయమైన పదం.పాత అవశేషాలనుపూడ్చిపెట్టి ఎవరు పెట్టుబడిదారీ విధానాన్ని వేగవంతం చేస్తే వారివైపు నిలబడే వారు పెరుగుతున్నారు. కాకపోతే వారికి 'నిజాయితీ' ఉండాలి!మనుషులు ప్రయోజనాలకోసం పోగవుతారు తప్పితే సమానత్వం కోసంకాదనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.సమానత్వంలోనే ప్రయోజనాలున్నాయి అని అర్థం చేయించగలిగిన స్థితిలో లేరు. కొంతమందికి ప్రయోజనాలను ఎక్కువమందికి అందుబాటులో ఉన్నది అనే ఆశను కల్పించే మార్కెట్‌ వ్యవస్థలో అది సంక్లిష్టమైన వ్యవహారం.బ్లాక్ అండ్‌ వైట్‌ సన్నివేశాలకు తప్ప సంక్లిష్టమైన సన్నివేశాలకు వామపక్షాలు సిద్ధపడి ఉన్నాయా అనేది సందేహం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బూటకమనో మరోటనో అనేసి సంతృప్తిపడేవారు అది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ  జైత్రయాత్ర సాగించడంలో దాగి ఉన్న కోణాలను అర్థం చేసుగోగలిగారా అనేదీ సందేహమే! ఎన్జీవోల మాదిరి మార్జినలైజ్డ్‌ భాష మాట్లాడుతూ కొమ్మలపైన మాత్రమే కేంద్రీకరించి చెట్టుని మర్చిపోయామా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందేమో! కార్మిక సంస్కరణల సందర్భం ఆ ఆలోచనకు ఉత్ర్పేరకంగా పనిచేస్తుందని ఆశించొచ్చా!
(2014 నవంబర్‌ 26న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వ్యాసం)

నమస్తే, ముఖపుస్తకాయ!


పేరు----....ఫేస్‌బుక్‌
వయసు-...పదేళ్లు
సబ్‌స్కైబర్స్‌-... దాదాపు భారత దేశ జనాభా అంత
విలువ-....దాదాపు లక్షకోట్లు
కుమారస్వామి నానా తిప్పలు పడి ప్రపంచం చుట్టొచ్చాడు. వినాయకుడేమి చేశాడు? మౌస్‌ జిందాబాద్‌ అనేసుకుని ఎలుక మీదెక్కి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు. తల్లిదండ్రుల చుట్టూ తిరగడం ప్రపంచం చుట్టూ తిరిగిన దానికంటే ఎక్కువ అని ఇంటర్‌ప్రెటేషన్‌ ఇచ్చి అతన్నే విజేత అని ప్రకటించారు. అమెరికాలో పుట్టినా ఆ ఇంటర్‌ప్రెటేషన్‌ గురించి బాగా తెలుసుకున్నట్టున్నాడు మార్క్స్‌జుకర్‌బెర్గ్! మౌస్‌తో ప్రపంచాన్ని చుట్టేయొచ్చు అని చిన్ననాటనే గ్రహించాడు. ప్రపంచానికి తిరిగే ఓపిక లేదు, పరిస్థితీ లేదు. తిరిగేసి ఏమోమో చేసేసిన ఫీలింగ్‌ ఇచ్చేస్తే పుణ్యం, పురుషార్థం అని అర్థం చేసుకున్నాడు. మాయా బజార్లో మాయా దర్పణం మాదిరి హ్రిహ్రిం అని ఫేస్‌బుక్‌ మనముందుంచాడు. ముందు విశ్వవిద్యాలయంలోనూ ఆ తర్వాత లొకాలిటీలోనూ అలా అలా ఇంతింతై వటుడింతై రీతిలో ఇవాళ ఖండఖండాలుగా ప్రపంచమంతా వ్యాపించాడు. ఫేస్‌బుక్‌ ఇన్‌స్టాంట్‌ హిట్‌. ఇటీజ్‌ ది హైటెక్‌ అవతార్ ఆఫ్‌ ది ఇన్‌స్టాంట్‌ జనరేషన్‌. డార్లింగ్‌ ఆఫ్‌ సెల్ఫీస్‌. ఇంతకీ ఈ ఫేస్‌బుక్‌తో ఏం చేస్తాం. ఏముంది? ఫ్రెండ్‌షిప్‌ చేస్తాం. లైకింగ్‌ చేస్తాం, కామెంట్‌ చేస్తాం. మామూలుగా ఒక్కోరికి ఎంత మంది స్నేహితులుండొచ్చు. ఎంతమందితో స్నేహం చేయగలిగిన శక్తి , సమయం మనకుంటాయి? నగరాల్లో అయితే ముగ్గురు నలుగురితో స్నేహం నెరపడానికే జీవితకాలం సరిపోదు. ఫోన్‌ చేసిన ప్రతిసారీ కలుద్దాం అని ముగిస్తాం కానీ కలవడం కలగానే ఉంటుంది. కానీ ఈ ఫేస్‌బుక్‌లో ఏకకాలంలో ఏడువందలమందితోనో ఇంకా ఓపికుంటే ఏడువేలమందితోనో స్నేహం చేయొచ్చు. చాలావిషయాలను లైకింగ్‌ చేయొచ్చు. అనేకానేక ప్రాపంచిక విషయాల మీద కామెంట్స్ చేసేయొచ్చు. టింగు రంగా అని చాటింగూ చేసేసుకోవచ్చు.వచ్చు. వచ్చు. చాలా వచ్చు. కథలు, కాకరకాయలు చర్చించనూ వచ్చు. నీకు కథో, కాకరకాయ వేపుడో ఇష్టమైతే ఆ ఇష్టాలతో గ్రూప్‌ ఏర్పరుచుకోవచ్చు. రూపం-సారం, శైలి, టెక్నిక్‌ అంటూ బోలెడన్ని విసయాలు మాట్లాడేసుకోవచ్చు. కాకరకాయల్లో ఏ మసాలా కూరిస్తే రుచి బాగా ఉంటుందో తెలసుకోనూ వచ్చు.అంగోలా దగ్గర్నుంచి ఎబోలా దాకా చాలా విషయాల మీద మాట్లాడుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకోవచ్చు. 'స్నేహితుల' ఆనంద విషాద, జ్ఞానాజ్ఞాన విశేషాలను షేర్‌ చేసుకోవచ్చు. కాలక్షేపం చేసేయొచ్చు. అమ్మొచ్చు. కొనొచ్చు. ఇన్ని వచ్చులు ఉన్నాయి కాబట్టే ఇది మానవ జీవితంలో వ్యసనంగానూ వ్యామోహంగానూ మారిపోయింది. ఆ వ్యామోహమే జుకర్‌బెర్గ్‌ అనే కుర్రాడిని పాతికేళ్లకే వేల కోట్లకు పడగలెత్తేలా చేసింది.


ఆ రోజు పత్రికలో వచ్చిన కథనమో, ఆ రోజు రోడ్డుమీద కనిపించిన దృశ్యమో, ఆ రోజు మీ పిల్లవాడు చేసిన మురిపెమో, ఏదైనా సరే, పేస్‌బుక్‌ ఏమీ అభ్యంతర పెట్టదు. నీకేమనిపిస్తే అది షేర్‌ చేసుకోవడమే.డిజిటల్ చరిత్రలో నీకొక పేజీ సృష్టించుకోవచ్చు. వీటన్నింటిని మించి ఫేస్‌బుక్‌లో ఎక్కువభాగం కనిపించేది పిక్చర్స్, ప్రొఫైల్‌ పిక్చర్స్‌. ఎపుడూ ఒకటే ముఖం కనిపిస్తే ఏం బాగుంటుంది మడిసన్నాక కూసింత కళాపోసనుండాల అని ప్రొఫైల్‌ పిక్సర్స్‌ తెగ మార్చేస్తుంటారు. నేను పొద్దున టీ తాగుతూ, నేను మధ్యాహ్నం భోంచేస్తూ తరహా ఫొటోలకు కూడా అభ్యంతర మేమీ లేదు. నేను అనేది విశ్వరూపం ధరించిన లోకంలో ఇదొక తుత్తి. ఏదో పోస్ట్‌ పెట్టేస్తాం. ఇక అక్కడ్నించి కామెంట్స్‌, లైకుల హడావుడి మొదలవుతుంది. నీ పోస్టింగ్‌ కిందనే లైక్‌, కామెంట్‌, షేర్‌ అని మూడు ఐకాన్లు కనిపిస్తుంటాయి. ఏం చేయాలనుకుంటే అది చేసేయడమే, అడ్డేముంది. లైక్‌ అయితే ఒక్క క్లిక్‌ దూరం. సులభంగా అభిమానాన్ని ప్రదర్శించుకొను మార్గము. షేర్‌ రెండు క్లిక్కుల దూరం. కామెంట్ అంటే ఏదో ఒక అభిప్రాయాన్ని రాయడం. పోస్టు పెట్టిన వాళ్లలో చాలామంది ఎన్ని లైకులొస్తాయి, ఎన్ని కామెంట్లు వస్తాయి అని తెగ ఆరాటపడిపోతుంటారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నవారిలో ఎక్కువమంది ప్రతి ఆరు నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉంటారని ఇటీవలే ఒక అధ్యయనం తేల్చిచెప్పింది. ఎన్ని లైకులొస్తే అంత ప్రాచుర్యం ఉన్నట్లు లెక్క! కాబట్టి లైకుల కోసం ఆరాటం ఉంటుంది. లైకుల బిజినెస్‌ కూడా ఉంటుంది. నాయకుల ఇమేజ్‌ని లైకుల ఆధారంగా కొలిచే వ్యవహారం ఉంది కాబట్టి అదొక ప్రహసనంగా మారింది. కంపెనీల పేజీలకు నాయకుల పేజీలకు లైకులు వేలల్లో లక్షల్లో కురిపించే ఏజెన్సీలు వచ్చేశాయి. ఆ బాగోతం ఈ మధ్యే బయటపడి విచారణలు వగైరా సాగుతున్నాయి. బిజినెస్‌ను వదిలేసి మనవరకే పరిమితమయితే ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం బాపతు కూడా ఉంటుంది. నీ పోస్టులన్నింటికీ నేను లైక్‌ కొడతా. నా పోస్టులకు నువ్వు లైక్‌ కొట్టాలి తరహా అన్నమాట. లైక్‌ కొట్టడానికి అతను ఆ పోస్ట్‌ను పూర్తిగా చదివాడనో చదివి ఆనందించాడనో భ్రమ పడనక్కర్లేదు. నువ్వు పోస్ట్‌ పెట్టిన క్షణంలోపలే టిక్‌ మని లైక్‌ పడిపోయిందంటే ఏమని అర్థం? నిజంగా ఆ విషయంతో ఆ వ్యక్తీకరణతో ఏకీభావముండి లైక్‌ చేసే వారు కొందరయితే కేవలం అతనితో లేదా ఆమెతో మనకున్న అనుబంధాన్ని వ్యక్తీకరించుకోవడానికి సాధనంగా వాడుకునే వారు మరికొందరు. కొంతమంది తెలిసిన పేర్లతో ఉన్న పోస్టులన్నింటికీ టిక్‌టిక్‌టిక్‌ మనిపించుకుంటూ వెడతారు. ఇందులోనూ సమాజంలో ఉన్న అన్ని ధోరణులు కనిపిస్తూనే ఉంటాయి.కాస్త శుభ్రంగా ఉన్న అమ్మాయి ఫొటో పెడితే కాసేపట్లోనే సెంచరీ దాటేస్తుంది. లైక్‌ కొట్టవేమిరా సామీ అని నీకు ఏకంగా మెయిల్ పెట్టేవారుంటారు. అందులో ఫలానా వారు తమ పేజీకి లైక్‌ కొట్టమని కోరుతున్నారు అని వస్తుంది. వాళ్లంత శ్రమ పడ్డాక క్లిక్‌మనిపించక చస్తామా! క్లిక్‌..క్లిక్‌..క్లిక్‌.!
ఫేస్‌బుక్‌ ఇవాళ సోషల్‌ మీడియా అనే గంభీరమైన పదానికి ప్రతీక. ట్విట్టర్‌ వగైరాలు కూడా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో ఫేస్‌బుక్‌దే ప్రధాన పాత్ర. దీని శక్తి సామర్థ్యాల మీద, ప్రభావాల మీద ప్రపంచవ్యాప్తంగా బోలెడంత చర్చ నడుస్తున్నది. శక్తి మీద మరీ కొట్టుకునేంత బేధాభిప్రాయాలు కనిపించవు కానీ ప్రభావాల మీదైతే మీదపడి రక్కేసుకునేంత గొడవలున్నాయి. బాబోయ్‌, మొన్న మా చెల్లి ఇంటికి వెళ్లామా! అది మాతో మాట్లాడుతూనే ఉంది, అతగాడు అపుడపుడు పొడిపొడిగా ఒక మాట పడేస్తూ మొబైల్‌లో ఫేస్‌బుక్‌తో కుస్తీ పడుతూ ఉండిపోయాడు. వాళ్లింటికెడితే గోడతో మాట్లాడినట్టే ఉంటోంది..అని వాపోయేవారు కోకొల్లలు. స్నేహితుల మధ్య, తల్లిదండ్రులు-పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య ఈ విషయమై గొడవలు సాగుతూనే ఉంటాయి. అది సంసారాలను కూల్చేస్తోందండీ అని వాపోయే వారుంటారు. 'వాడెవడు? నీ ఫ్రెండ్‌ లిస్టులో బాగా అతి చేస్తున్నాడు' అనో, 'అదెవత్తె, నీ పేస్‌బుక్‌లో చాలా డ్రామా చేస్తుంది' అనో గొడవలు పడే జంటలుంటాయి. ఒకళ్ల ఎకౌంట్లలో మరొకరు జొరబడి పత్తేదారు పనులు చేయడం లాంటివి ఉంటాయి. సాంకేతికత కొత్తగానీ అనుమానాలు మనకేం కొత్త! ఏ కొత్త సాంకేతిక పరికరం వచ్చినా ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ సర్కస్‌ సాగుతూనే ఉంటుంది. ఇదంతా ఒకవైపుంటే ఇంకోవైపు సోషల్‌ మీడియానే లేకపోతే ప్రపంచం ఏమైపోయేట్టు? ఎంత ప్రజాస్వామీకరించింది అది ప్రపంచాన్ని! అని దాని భక్తులు కళ్లు విప్పార్చుకుంటూ చెపుతారు. జాస్మిన్‌ విప్లవం దగ్గర్నుంచి అన్నా హజారే హడావుడి దాకా చాలా ఉదాహరణలనే చూపిస్తారు. షోలేలో అమితాబ్‌ మాదిరి రెండువైపులా ఒకటే బొమ్మ ఉన్న నాణెం ఉంటే తప్ప ఈ విషయంలో స్టాండ్‌ తీసుకోవడం కష్టం. ఆధునిక జీవనంలోని అనేకానేక అంశాలలాగే ఇది కూడా ఏకకాలంలో కషాయంగానూ, విషంగానూ పనిచేస్తుంది. నువ్వెలా ఉపయోగించుకుంటావనేదాన్ని బట్టి, ఉపయోగించుకునే మోతాదును బట్టి అది ఆధారపడి ఉంటుంది. 



ముఖపుస్తక మాయ-మర్మం!

తక్కువకాలంలోనే ఫేస్‌బుక్‌ సామూహిక అబ్సెషన్‌గా మారిపోయింది. దీనికి కారణాలు అనేకం. ఐడెంటిటీ అనేది ఆధునిక మనిషికి పెద్ద సమస్య. మార్కెట్ వ్యవస్థ గుంపునుంచి మనిషిని బయటపడేసి వినియోగదారుడిగా మార్చింది. పాత గుంపుల్లో ఉన్న అవలక్షణాలనుంచే కాక అందులోని అస్తిత్వాన్నుంచి కూడా దూరం చేసింది. ఎప్పటికప్పుడు అవసరాలను సృస్టించుకుంటూ- పెంచుకుంటూ వాటిని తీర్చుకోవడానికి ఇంకా ఇంకింకా డబ్బు సంపాదించడానికి కష్టపడుతూ పరిగెట్టడం తప్ప చేసే పనిలో ఆనందం లేని స్థితి. కొనడం అమ్మడం లాంటి వాటితో వాటిగురించి ఆలోచనలతో మనిషి నిరంతరం సతమతమయ్యేట్టు చేసింది. మధ్యమధ్యలో ఈ ఇడెంటిటీ అనే తేలుకొండి తొలుస్తూ ఉంటుంది. ఇటువంటి వారికి ఊరట నిస్తుంది ఈ ఫేస్‌బుక్‌, బ్లాగ్‌ వగైరాలతో కూడిన సోషల్‌ మీడియా. రోజూ ఎక్కడో చోట కనిపించడం లేదా వినిపించడం అనేది అవసరంగా మారిపోయింది. హమ్మయ్య!, మనమున్నాం, మనల్ని ప్రపంచం గుర్తిస్తున్నది అనే ఒక ఫీలింగ్‌ కలుగుతుంది. నలుగురితో ఉన్నాను అనే భావన వల్ల ఒంటరితనాన్నుంచి దూరమైన ఫీలింగ్ తెచ్చేసుకోవచ్చు. ఫాల్స్‌ గ్రాటిఫికేషన్‌ అంటామా ఇంకేమైనా అంటామా అనేది మీ ఇష్టం. చాలామంది మనుషులకు చాలా విషయాలమీద ఏవో అభిప్రాయాలుంటాయి. ఏదో ఒకటి చెప్పాలని ఉంటుంది. ఎక్కడ చెప్పాలి? ఎలా చెప్పాలి? వేదిక ఏదీ! అదిగో అలాంటి వారికి అక్షరాలా ఆసరా ఇస్తుంది ఫేస్‌బుక్‌. తనను తాను వ్యక్తీకరించుకోవడం అనే మనిషి కోరికను ఇన్‌స్టాంట్‌గా తీర్చేస్తుంది. ఆ వర్మ ఇలా అంటాడా, ఈ సానియాకు ఇన్ని డబ్బులిస్తారా, ఈ రైతుల ఆత్మహత్యలు ఇంకెంతకాలం, రాయలసీమ గోడు పట్టదా ఇట్లా ఏవో అనిపించొచ్చు. గోవిందుడు అందరివాడేలే ఎలా ఉందో నలుగురితో చెప్పుకోవాలి అనిపించొచ్చు. అదిగో అలాంటి భిన్నరుచులున్న లోకానికంతటికీ ఉచితంగా గొంతునిస్తుంది ఫేస్‌బుక్‌. మన అభిప్రాయంతో ఒక పోస్ట్‌ పెట్టేస్తే మనలాంటి వారు నలుగురుదానిమీద ఏదో ఒకటి మాట్లాడేస్తే అదొక తృప్తి. మనిషి సంఘజీవి కదా!అలాగే ఏదో ఒక సామాజికాంశానికి సంబంధించి ఫేస్‌బుక్‌లో ఒక లైక్‌ చేసో ఒక సంతకం పెట్టో ఒక కామెంట్ చేసో నేనున్నూ ఉద్యమంలో ఉన్నాను, గుంపులోఉన్నాను అనే భావన తెచ్చేసుకోవచ్చు. అంటే గిల్ట్‌ తీర్చుకోవడానికి కూడా ఒక వేదికగా పనిచేస్తుంది. నిజంగా ఆ సమస్య మీద ఏదైనా చేయడం బదులు దానిమీద ఏదో ఒక కామెంట్‌ ద్వారా మన ఆగ్రహాన్ని బాధను తీర్చుకునే వెసులుబాటు కల్పిస్తుంది. అంటే థింక్‌ అండ్‌ డూ అనే భావన స్థానంలో ఫీల్‌ అండ్‌ షేర్‌ భావనను ఫేస్‌బుక్‌ మనకు అలవాటు చేస్తుంది. ఇపుడు చెస్‌బోర్డుకు అటు వైపు కూర్చుందాం! సెన్సారింగ్‌ లేకుండా వేదిక సమస్య లేకుండా మనుషులు చాలా అంశాల మీద అభిప్రాయాలు షేర్‌ చేసుకోవడానికి ఇదొక ప్రజాస్వామిక వేదిక. లోతుగా చూపు సారించాలే కానీ చాలా చాలా గంభీరమైన చర్చలే సాగుతుంటాయి. చాలాచాలా లోతైన అంశాలమీద బోలెడంత సమాచారం మనకు అందుబాటులోకి వస్తుంది. మనకు అందుబాటులో లేని అనేకానేక వీడియోలు, సమాచారం ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా మన ముందుకు వస్తుంది. ప్రపంచంలో ఇలా ఆలోచించేవారు ఇంతమంది ఉన్నారా అనేట్టు మన భావాలతో సామీప్యం ఉన్నవారు అనేకులు పరిచయమవుతారు. అభిరుచుల్లో సామీప్యమున్న వారి గ్రూప్లో ఉంటే మనకు ఎంతో ప్రయోజనకరమైన కాలక్షేపంతో పాటు కూసింత జ్ఞానం కూడా లభిస్తుంది. మంచి మంచి డాక్యుమెంటరీలు, సినిమాల గురించి తెలుసుకోవచ్చు. ఎక్కడో ఏదో మ్యాగజైన్లో వచ్చిన అద్భుతమైన వ్యాసం గురించి తెలుసుకోవచ్చు. సంగీతం, సాహిత్యం, రాజకీయాలు అన్నింటా మనకు అవసరమైన సమాచారం కావాల్సినంత పంచుకోవచ్చు. అనుభవాలూ, జ్ఞాపకాలూ నెమరేసుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులకు ఇదొక తోడుగా ఉంటుందనుకోవచ్చు. గొప్ప కాలక్షేపం.

ఇదీ ముఖపుస్తక భాష!
భాషకు వ్యక్తీకరణకు సంబంధించి ఫేస్‌బుక్‌ కొన్ని మౌలిక మైన మార్పులు చేసినట్టుగా అనిపిస్తుంది. మామూలుగా లిఖిత భాషకు మౌఖిక భాషకు తేడా ఉంటుంది. లిఖిత భాషతో పోలిస్తే మౌఖిక భాషలో ఆలోచనకు తావు తక్కువ. అప్పటి సందర్భాన్ని బట్టి ఉద్వేగాన్ని బట్టి మాట్లాడేస్తాం. కానీ రాసేటప్పుడు మనకు మనమే సెన్సార్‌ ఆఫీసర్‌ అవుతాం. వెనుకా ముందూ ఆలోచిస్తాం. కానీ ఫేస్‌బుక్‌ ఈ అంతరాన్ని బాగా తగ్గించేసింది. అప్పటికప్పుడు ఏ మూడ్‌లో ఉంటే ఆ మూడ్లో టపాటపా రెండు వాక్యాలు కొట్టేయడమే. థింక్‌ అండ్‌ రైట్‌ స్థానంలో ఫీల్‌ అండ్ ఎక్స్‌‌ప్రెస్‌ అనే భావనను తెచ్చేసింది. థింకింగ్‌ ఎలిమెంట్‌ను బాగా తగ్గించేసింది. వ్యక్తీకరణ రూపం మారిపోయింది. హహహహ అని నాటకాల పుస్తకాల్లో చదువుకున్న నవ్వు ధ్వనిని పెట్టేస్తారు. హమ్‌మ్‌...అని ఆలోచనకు కూడా ధ్వని సంకేతాన్ని కల్పించి లిపిలో పెట్టేస్తారు. అంటే మౌఖిక స్వభావాన్ని చాలావరకు లిపిలోకి తెచ్చేస్తా ఉంటారు. ఈ వేదిక అటువంటి అవసరాలను సృష్టించింది. ఆవేశకావేశాలపైన అదుపు తప్పే ప్రమాదం సైతం ఎక్కువే. వ్యాప్తి చెందే లక్షణం ఎక్కువగానూ నిర్థరించుకోగలిగిన అవకాశం వ్యవధి తక్కవగానూ ఉండడం వల్ల గాలి కబుర్లు హైటెక్‌ వేషమేసుకుని విపరీతమైన ప్రచారం పొందేస్తాయి. తిరుమల కొండమీద మూడు తలలున్న పాము వీడియో ఇలాంటిదే. ఇలాంటి కల్పితమైన వీడియోలకు లెక్కే ఉండదు. ఇంకొన్ని గంభీరమైన విషయాలుంటాయి. ఒక సందర్భంలో ఒక సమూహంలో పంచుకుంటేనే వాటి అంతరార్థం అర్థమయ్యే విషయాలుంటాయి. అంటే ఆయా విషయాలకు సంబంధించి లోతుపాతులు తెలిసినవారికి మాత్రమే సవ్యంగా అర్థమయ్యే విషయాలు కొన్ని ఉంటాయి. అవి దారి తప్పి ఇక్కడికొచ్చి పెద్ద రచ్చ చేసేస్తుంటాయి. టైం అండ్‌ స్పేస్‌ కలగాపులగం అవుతుంటాయి. ఆశీష్‌ నందినో, రొమిల్లా థాపరో ఎక్కడో ఏదో మాట్లాడారు అనుకోండి. మన పక్కన ఉన్న ఎమ్మెల్యే లేదా ఎంపికీ ఏమిటీ సంబంధం? ఫేస్‌బుక్‌లో సందర్భశుధ్దిలేకుండా పెట్టిన రెండు మూడు వాక్యాలు చూసి ఆయన రంకెలేస్తారు. కేసులు పెడతామంటారు. దేవుడు చనిపోయాడు అని నీషే మాట ఎవరైనా పెడితే అతని ఉనికితో నిమిత్తం లేకుండా నీషే మీద రంకెలేయడానికి, బెదిరించడానికి బయల్దేరగలిగిన వారుంటారు. ప్రతీదీ అందరకీ అందుబాటులో ఉండడం అనే మాట బాగానే కనిపించినా అది ప్రజాస్వామికమే అనిపించినా అందులో ఇలాంటి ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. సాంస్కృతిక అంతరాలతో పాటు సాంస్కృతిక వైషమ్యాలు కూడా ఎక్కువగా ఉన్న మనలాంటి సమాజాల్లో ఇలాంటి అబ్సర్డ్‌ వ్యవహారాలు చాలా చూడాల్సి వస్తుంది. 



బిజినెస్‌ ..మాటర్స్‌
నౌ వి నీడ్‌ టు గెట్‌ ఇన్‌ టు బిజినెస్‌. ఫేస్‌బుక్‌తో సామాజిక లాభనష్టములు ఎన్ని విధములో వారికి లాభము చేకూర్చు మార్గములు అన్ని విధములు. మన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్లో ఇష్టమైన పుస్తకాలు, మ్యూజిక్‌, సినిమాలు,నటులు వగైరా ఆప్షన్స్‌ చాలా ఉంటాయి. అవన్నీ కేవలం మన అభిరుచి ప్రదర్శన కోసమే ఉండవు. ప్రధానంగా వారి లాభంకోసం ఉంటాయి. అదెలా! మీ అభిరుచులు, ఆసక్తులు గమనించి అందుకు తగిన ప్రొడక్ట్స్‌ యాడ్స్‌గా ప్రత్యక్షమవుతాయి. మనం తరచుగా పంచుకునే సమాచారం, మిత్రులతో చేసే సంభాషణలో దొర్లే అంశాలు, తరచుగా వీక్షించే అంశాలు వంటి అనేకానేక అంశాలను వడపోసి ఆయా ప్రొడక్ట్‌ కంపెనీలు యాడ్స్‌ రూపంలో తెరమీద కనిపిస్తాయి. గూగుల్‌ లాంటి కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకుని నీ ఈ మెయిల్స్‌, ఉపయోగించే యాప్స్‌, గూగుల్‌ సెర్చ్‌లో వెతికే అంశాలను కూడా వడబోసి కంపెనీల వారికి అందిస్తుంది ఫేస్‌బుక్‌. అంటే ఉత్పత్తిదారునికి వినియోగదారుడికి మధ్య వారధిగా పనిచేస్తుంది ఫేస్‌బుక్‌. ఇన్ని కోట్లమంది ఈమెయిల్స్‌, సంభాషణలు ఎలా చూస్తారు అనే సందేహమక్కర్లేదు. దానికి ఆల్గోరిథమ్స్‌ లాంటి కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ సాయం చేస్తాయి. ఇవి మాత్రమే కాకుండా కంపెనీ పేజెస్‌ పేరుతో కార్పోరేట్లకు వేరే రూపాల్లో ఫేస్‌బుక్‌ ఖరీదైన సేవలు అందిస్తూ ఉంటుంది. ఇదంతా భారీ బిజినెస్‌ వ్యవహారం. కార్పోరేట్‌ అడ్వర్టయిజ్‌ మెంట్లు మాత్రమే కాదు. వినియోగదారుల అభిరుచులు ఆసక్తుల్లో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసే సంస్థలకు రాజకీయ పార్టీలకు కూడా ఉపయోగపడుతుంది ఫేస్‌బుక్‌‌. 'మిస్టర్‌ ఆవరేజ్‌' ఫ్రెంచ్‌ సినిమాలో చిరుబొజ్జతో కూడిన సగటురూపం, సగటు ఉద్యోగం, వగైరా ఉన్న సగటు మనిషిని చాలా అధ్యయనంతో వెతికి పట్టుకుని అతను ఎటువంటి ప్రాడక్ట్స్‌ వాడతాడు, రాజకీయంగా ఎట్లా ఆలోచిస్తాడు వగైరా విషయాలను తెలుసుకోవడానికి కార్పోరేట్ల-రాజకీయపార్టీల కన్సార్టియం ఒక ఏజెంట్‌ని అతని గర్ల్‌ఫ్రెండ్‌ రూపంలో పంపిస్తుంది. అతని ఇంటినిండా కెమెరాలు పెట్టి 24 గంటలు అతన్ని నీడలా వెంటాడి అతని ఆలోచనలన్నీ తెలుసుకుని వాటిని ఈ కన్సార్టియం తాలూకు లేబరేటరీలో రికార్డు చేసి అధ్యయనం చేస్తా ఉంటారు. అదిగో అన్ని కెమెరాలు హడావుడి అవసరం లేకుండా ఆ గర్ల్‌ఫ్రెండ్ పాత్రను ఇక్కడ ఫేస్‌బుక్‌ పోషిస్తుంది. యు ఆర్‌ అండర్‌ సర్వైలెన్స్‌. యు ఆర్‌ బీయింగ్‌ అబ్జర్వ్‌డ్‌. యూ ఆర్‌ బీయింగ్‌ మెజర్డ్‌. అయితే అదేమీ మనకుఇబ్బంది కలిగించేట్టు ఉండదు. కనిపించేట్టు ఉండదు. నీ పనినువ్వు చేసుకుపోతావు. వాళ్లపని వాళ్లు చేసుకుపోతారు. బిజినెస్‌ వాళ్ల భాషలో విన్‌-విన్‌ సిచ్యుయేషన్‌!

అతి సర్వత్రా వర్జయేత్‌!
ఫేస్‌బుక్‌ను వారధిగా ఉపయోగించుకోవడం వరకు ఉపయోగమే. కానీ వ్యసనంగా మార్చుకోకూడదనేది మానసిక విశ్లేషకుల మాట. ఇదేమీ తక్కువ వ్యసనం కాదు. వ్యసనమనగానే తాగుడు, తిరుగుడు అని తాగుణింతం వల్లించనక్కర్లేదు. తగ్గించుకోవడం లేదా మానడం కష్టమైన ఏ అలవాటునైనా స్థూలమైన అర్థంలో వ్యవసనమనే పిలవొచ్చు. రోజుకు గంటలకొద్దీ చూడకుండా ఉండలేని స్థాయిలో ఈ వ్యసనం బారిన పడిన వారు చాలామంది కనిపిస్తున్నారు. దాని ప్రభావాలూ కనిపిస్తున్నాయి. సైక్రియిట్రిస్టుల దగ్గరకు చేరుతున్న కేసులు భారీ స్థాయిలోఉన్నాయి. సామాజిక బంధాలపై ప్రభావానికి సంబంధించిన ఉదాహరణలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. ఉపయోగమే, ఉపయోగించుకోండి. కానీ కాసేపు నెట్‌ లేకపోతే ఫేస్‌బుక్‌ చూడకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్‌ కలుగుతోందంటే మాత్రం ఆలోచించుకోవాల్సిందే. అతి సర్వత్రా వర్జయేత్‌!

జి ఎస్‌ రామ్మోహన్‌
(2014 అక్టోబర్‌ 26న ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో "ఫేస్‌బుక్‌ వి లవ్‌ యు'' పేరుతో 'వచ్చిన కవర్‌ స్టోరీ)

శాంతి-ఆలోచనా పరుల కథ

కారా కథల మీద రాయొచ్చు కదా, శాంతి గురించి రాయండి అని మిత్రులు అడగ్గానే ఇపుడు కొత్తగా దివిటీ పట్టడమేమిటి అనిపించింది. బహుశా ఈ కాలపు పిల్లలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడం కోసం అడిగి ఉంటారనిపించింది. కారా కథలు మానేసిన తర్వాత(సంకల్పం మినహాయింపు) పుట్టిన పిల్లలం. పెద్దల మాటలు విని ఆ కథలు సేకరించి చదవడం తప్ప ఉడుకుడుకు అక్షరాలు చదివే అవకాశం లేదు. చదవడం వరకే అయితే కథ వేరు. కథలపై అభిప్రాయం చెప్పాలంటే మాత్రం స్థలకాలాల ఇబ్బందిని దాటాల్సి ఉంటుంది.
       శాంతి 1971 కథ. 71 అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పాలా! నక్సల్బరీ గాలి శ్రీకాకుళం మీదుగా ఉత్తర తెలంగాణకు వ్యాపిస్తున్న కాలం. శ్రీకాకుళం ఆటుపోట్లమధ్య మిణుకుమిణుకు మంటుంటే ఉత్తర తెలంగాణలో కొలిమంటుకుంటున్న కాలం. సిపిఐ ఎంఎల్‌ ఆవిర్భవించి తొలిఅడుగులు వేస్తున్న కాలం. త్వరలోనే సాధిస్తాం అని ఆ ప్రయాణంలో ఉన్న వాళ్లు చాలామంది నిజంగానే నమ్మిన కాలం. ''కా.రా.గారు, ఐవి కూడబలుక్కుని సమిధలు, సరంజామా సమకూర్చుకుంటున్న'' కాలం. కారాగారు సమకూర్చుకున్న సరంజామా ఏమిటో శాంతిలో కనిపిస్తుంది. యజ్ఞం మరి తొమ్మిది కథల్లో కనిపిస్తుంది.  శ్రీకాకుళ ఉద్యమానికి అక్షరాండగా రాసిన కథలివి. ఇవి  వర్గపోరాట చైతన్యపు కథలు . లోతూ విస్తృతీ ఉన్న కథలు. కారా మాటలెంత పొదుపుగా సౌమ్యంగా ఉంటాయో రాతలు అంత విస్తారంగా ఘాటుగా ఉంటాయి. వీటిలో కొంత ప్రాపగాండా లక్షణం ఉంటుంది. విషయాన్ని వివరంగా  చెప్పేయాలనే తపన ఉంటుంది. అది అప్పటి అవసరం కావచ్చునేమో! "వృత్తాంతం ద్వారా వ్యక్తమయ్యే అసలు విశేషమే కథ" అన్న స్వీయనియమాన్ని నిక్కచ్చిగా నిష్ఠగా పాటించిన రచయితగా కారా ఈ దశలో కనిపిస్తారు.  ఏదో ఒక నిర్దుష్టమైన విషయాన్నిప్రతిపాదించడానికో వివరించడానికో సీరియస్‌ ఎజెండా పెట్టుకుని ఈ దశలో వరుసగా కథలు రాసినట్టు కూడా అనిపిస్తుంది. ఒక్కముక్కలో ఆయన  కలం కార్యకర్త పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు.

     అసమసమాజంలో శాంతి అనే పదం ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు ఉపయోగపడుతుందో వివరిస్తుంది శాంతి కథ. స్టేటస్‌కోయిస్టుల శాంతి మంత్రం వెనుక ఉన్న బూటకత్వాన్ని ఎండగడుతుంది.  కథనిండా యజమాని- కార్మిక సంబంధాలపై లోతైన చర్చ ఉంటుంది. బలవంతుడి ఎత్తుగడలు, వాటిని చిత్తు చేసేందుకు బలహీనుల స్థిరచిత్తం, వీరిద్దరి మధ్యలో బ్యూరాక్రసీ తెలివితేటలు ఉంటాయి. జ్ఞానం, తెలివితేటలు, చిత్తశుద్ధి, అంకితభావం వగైరా లక్షణాలు మూర్తీభవించిన కార్మిక నాయకుడు, అన్నింట్లోనూ  లౌక్యాన్ని చూపే 'నిస్సహాయపు' కలెక్టర్‌, ఎలాగైనా ఈ వ్యవస్థ తనకు అండగా నిలబడి తీరుతుంది అనే నమ్మకమున్న ధనబలశాలి మిల్లు యజమాని- మూడు ప్రధానపాత్రలుగా కథ సాగుతుంది.
    ఈ కథ చదువుతున్నపుడు అపుడెపుడో సీఫెల్లో చూసిన క్యూబా సినిమా లాస్ట్‌ సప్పర్‌ గుర్తొచ్చింది. 1976లో వచ్చిన ఈ సినిమాలో చిత్రించిన కాలం పద్దెనిమిదివ శతాబ్ది చివరి రోజులకు సంబంధించినది. చెరుకు తోటల యజమాని, అతని బానిసలు, చర్చి ఫాదర్‌ మూడు కేంద్రాలుగా సాగేకథ. ఇక్కడ స్టీల్‌ మిల్‌ యజమాని అయితే అక్కడ షుగర్‌ మిల్‌ యజమాని. ఇక్కడ కార్మికులు అయితే అక్కడ బానిసలు.  ఆధునిక కలెక్టర్ స్థానంలో చర్చి ఫాదర్‌.  అందులోనూ శాంతి గురించి స్వేచ్ఛ గురించి చర్చ ఉంటుంది. కాకపోతే చర్చే ప్రధానం కాదు. రెండు వేర్వేరు దేశాల్లో వేర్వేరు సామాజిక దశలకు సంబంధించిన జీవితాన్ని చిత్రించిన వేర్వేరు కళా ప్రక్రియలైనప్పటికీ బలవంతుడు, లేదా వారి ప్రతినిధి శాంతి మంత్రం పఠించే తీరు దాదాపు ఒకే రకంగా ఉంటుంది. యజమాని ఉదారంగా పన్నెండు మంది బానిసలను పిల్చి తనతో సమానంగా టేబుల్‌పై కూర్చుండబెట్టుకుని లాస్ట్‌ సప్పర్‌ జరుపుకుంటాడు. ఈ సందర్భంగా బానిసలకు- యజమానికి మధ్య జరిగే సంభాషణ, వారి హావభావాలు మర్చిపోవాలన్నా మర్చిపోవడం కష్టం. అంతేనా! యజమాని నదిదాకా తీసుకువెళ్లి వారి కాళ్లు కడిగి ఆ 'పుణ్య తంతు' కూడా జరిపించిన రెండు రోజులకే వారి తలకాయలన్నీ పోల్స్‌మీద వేలాడదీయడంలో మనకు ఆ నాటి బలవంతుల శాంతి స్వరూపం అవగతమవుతుంది.
   లాస్ట్‌ సప్పర్‌ కూడా విప్లవ సినిమానే. కమ్యూనిస్టు సినిమానే. కానీ తొలిరీల్‌నుంచే ఇది కమ్యూనిస్టు సినిమా అనే ఎరుకను మనకు కలిగించరు. సినిమాలో దర్శకుని హృదయం ఎక్కడ ఉందో అర్ఠమవుతుంది, అంతే! బలవంతుడి శాంతి మంత్రం ఎంత బూటకమో కళాత్మకంగానే చెపుతారు. సినిమా పొడవునా మనం నవ్వుతాము, ఏడుస్తాము. పాత్రల వెంట నడుస్తూనే ఉంటాము. సినిమా సరే, రావిశాస్ర్తి కథలో! ఆ కోవకే చెందిన మరికొందరు గత, వర్తమాన, వర్థమాన రచయితల కథలో! ఆ రచనలు చదువుతున్నపుడు కాసేపు వారి ఆధీనంలోకి వెళ్లిపోతాం. వారు సృష్టించిన పాత్రల వెంట తిరుగుతూ ఆ భావోద్వేగాల్లో భాగమవుతాం. ఆ పాత్రలతో బంధమేర్పడుతుంది. అలాంటి జీవితమే ఉన్న పాఠకుల జ్ఞాపకాలను కదిపి అలజడి రేపుతారు.రచయిత తాడు పట్టుకుని ఆడిస్తూ ఉంటాడు. మనం కోతుల్లాగా ఆడుతూ ఉంటాము. అది ఆర్ట్‌ మహిమ. శాంతి లాంటి కథలతో వచ్చిన చిక్కేమిటంటే ఇందులోని పాత్రలతో అలాంటి అనుబంధమేదీ ఏర్పడదు. పెద్దమనిషి గంభీరంగా విషయాలు చెపుతూ ఉంటే కాస్త ఎడంగా నుంచొని వింటున్నట్టు ఉంటుంది. ఇలాంటి కథలు మన మనసును పెద్దగా తాకవు. మేధనే తాకుతాయి. ఇవి మన మేధను పెంచడం కోసం, వర్గపోరాట ద్పృక్పథాన్ని  పదును పెట్టడం కోసం రాసిన రాజకీయ కథలు. విశాలమైన అర్థంలో రాజకీయం లేకుండా ఏ కళా ఉండదు. పైగా కారా  రాసింది పీడితులకు అవసరమైన రాజకీయాలు. కాబట్టే వామపక్ష శిబిరం చాలా యేళ్లుగా ఎత్తుపీట వేసి గౌరవిస్తున్నది. కాకపోతే కళారూపం సమర్థంగా లేకపోతే అది రాజకీయవాసన గాఢంగా ఉన్న జీవులను తప్ప ఇతర జీవులను అంతగా ఆకర్షించదు. మోనోలాగ్‌గా మారిపోయే ప్రమాదం ఉంది. కారా కథలన్నీ అలాగే ఉన్నాయనే దుస్సాహసం చేయబోను. జీవధారను అలా అనగలమా! నోరూమ్‌ని అనగలమా! కానీ శాంతి కథలో రాజకీయ చర్చల బరువుకు కళారూపం అణగిపోయిందేమో అనిపిస్తుంది. పాత్రల చిత్రణలో కూడా స్టీరియోటైప్‌ లక్షణం కనిపిస్తున్నది. మందు, విందు, పొందుల కలబోతగా నల్లని బొచ్చుశరీరం కలిగిన ఫ్యాక్టరీ యజమాని చిత్రణే తీసుకోండి. భార్యను పట్టించుకోక ఆమెను లైంగిక అసంతృప్తి అగ్గిమంటకు ఆహుతి చేస్తూ అతను మాత్రం రోజొక అమ్మాయితో కులకడం వంటి లక్షణాలు చూస్తే సాధ్యమైనన్ని "దుర్లక్షణాల'తో అతనిమీద కోపం తెప్పించాలనేది రచయిత వ్యూహంగా కనిపిస్తున్నది. కథాక్రమంలో అతని దోపిడిస్వభావం మీద కోపం తెప్పించవచ్చునుగాని కారా వంటి రచయితకు ఈ అడ్డదారేల! కుప్పబోసినట్టు ఇన్ని "దుర్లక్షణాలు' లేకుండా కూడా ఫ్యాక్టరీ యజమానులు చాలామంది ఉంటారు. ఆధునిక పెట్టుబడిదారుల్లో అనేకులు మందు, చిందుల జోలికి పోకుండా కార్మికుడి కంటే ఎక్కువ గంటలే పనిచేయవచ్చును. వారు దోపిడీదారులు కాకుండా పోతారా! సత్యమే శివం సినిమాలో సూటూ బూటూ వేసుకుని డాబుగా ఉన్న మనిషి సూట్‌కేస్‌ కొట్టేసే సీన్‌ ఉంది కదా,  అదే సరైన రాజకీయ దృష్టికోణం అవుతుంది. సమాజంలో మంచిచెడులకు, ఎక్కువ తక్కువలకు దర్పణాలుగా స్థిరపడిన స్టీరియోటైప్‌ లక్షణాలను ఉపయోగించుకోవడం స్టేటస్‌ కోయిస్టులకు అవసరం. తాత్కాలికంగా మనకు కూడా ఉపయోగపడినట్టు అనిపించినా దీర్ఘకాలికంగా నష్టం చేస్తాయి. బహుశా ఆనాటికి కథలో చిత్రించిన సమాజం ఇంకా పాతదశలోనే ఉంది కాబట్టి ఫ్యూడల్‌ లక్షణాలు బలంగా ఉన్న సమాజంలో మంచిచెడులు ఇపుడున్న సమాజంతో పోలిస్తే బ్లాక్‌ అండ్‌ వైట్లో కనిపించే అవకాశం ఉంది కాబట్టి అప్పటి అవసరాలకు అనుగుణంగా రాశారు అనుకోవాలా!
      "సాంఘిక దురాచారాలమీద కాని, కొన్ని ప్రభుత్వ విధానాల దుష్ఫలితాల మీదకాని, వ్యవస్థలో కనిపించే కొన్ని దుర్లక్షణాల మీదకానీ లేక ఇదే కోవకి చెందిన మరేదో అవకరం మీదకాని, మన అభిప్రాయాలను కథగా చెప్పాలనుకుంటాము. కొన్ని పాత్రలను ప్రవేశపెడుతూ మొదటి పేరాని కథలా ఆరంభించి క్రమక్రమంగా కథను ఒక చర్చాగోష్టిలా సాగించి, మన అభిప్రాయాలను ముఖ్యపాత్ర ద్వారా చెప్పించేస్తాం. అలా చేస్తే అది కథ ముసుగేసుకున్న చర్చా వ్యాసమౌతుందిగాని కథ కాదు'' అంటారు కారా. ఈ లక్షణం శాంతి కథలో కూడా జొరబడినట్టు అనిపిస్తుంది. అయితే సౌష్టవం కొద్దిగా దెబ్బతిన్నప్పటికీ  కథా రూపమైతే ఉన్నది. కుట్రలాగా  కథ కాకుండా పోలేదు. కుట్రను కూడ కథ అనే వారు, ఆ మాటకొస్తే గొప్ప కథ అని కీర్తించే వారు ఉన్నారని తెలుసు. ఎవరి దృష్టికోణం వారిది. దృక్పథం లేకుండా భాషా నైపుణ్యంతోనూ క్రాఫ్ట్‌తోనూ చెమక్కుమనిపించి మాయమైపోయే కథలతో ఇబ్బంది ఉన్నట్టే  క్రాఫ్ట్‌ను  నిర్లక్ష్యం చేసి కథను రాజకీయ ఉపన్యాస వేదికగా మార్చే కథలతోనూ ఇబ్బంది ఉంటుంది. "కారా సాధారణ పాఠకుల రచయిత కాదు, ఆలోచనాపరుల రచయిత అన్న వల్లంపాటి అన్నపుడు కూడా ప్రశంసతో పాటు సున్నితమైన విమర్శనాధ్వని ఉందేమో అని అనుమానం.
జి ఎస్‌ రామ్మోహన్‌
(అక్టోబర్‌ 30, 2014న సారంగ వెబ్‌ మ్యాగజైన్‌లో వచ్చిన వ్యాసం, బొమ్మ-సారంగలో వచ్చిందే...వేసిన వారు అన్వర్‌)
               


Saturday 13 December 2014

మార్కెట్‌ వ్యూహంలో మాతృభాష

కేజీ టు పీజీ ఉచిత విద్య అని తెలంగాణ రాష్ట్రసమితి ఎన్నికల హామీనిచ్చింది. అమలు చేస్తామని ఇపుడు భరోసా ఇస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనికి మరీ దూరంగా ఉండే అవకాశం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంతో పాటు ఇంగ్లీష్‌ మీడియం అని కూడా అన్నది. ఇపుడు దానికి సంబంధించి వెనుకాముందూ ఆడుతున్నది. ఇంగ్లీష్‌ మీడియం అమలు చేయండి, మాట నిలబెట్టుకోండి అని కొందరు దళిత బహుజన మేధావులు డిమాండ్‌ చేస్తున్నారు. ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారు. ఇంకోవైపు చిన్ననాటి నుంచే ఇంగ్లీష్‌ మీడియం ఎందుకు, తెలుగు మీడియం కొనసాగించాలి అని మరికొందరు మేధావులు మాట్లాడుతున్నారు. వీరిలో వామపక్ష వాదులు, మాతృభాషోద్యమ కారులు ఉన్నారు. రెండు వైపులా ప్రజలకు మేలు చేయాలనే వారే ఉన్నారు. అయినప్పటికీ భాషకు చెరోవైపు నిలబడి మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణకే పరిమితమయ్యే అవకాశం లేదు. రేపు ఆంధ్రలోనూ తప్పదు. ఇది మొత్తం తెలుగువారందరూ ఎదుర్కొంటున్న సమస్య. ఆ మాటకొస్తే తెల్లోడు పాలించిన చాలా దేశాలు ఎదుర్కొంటున్న సమస్య. పల్లెల్లో కూడా ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లు ఉంటే మాసాయిపేట బస్సు ప్రమాదం జరిగి ఉండేది కాదన్నా, ఇంగ్లీష్‌ మీడియం వేలం వెర్రి వల్లే ప్రమాదం జరిగిందన్నా రెండూ అటూ ఇటూ సింబాలిక్‌ వాదనలే. 90ల్లో మారిన పరిస్థితులు ఇలాంటి సంక్లిష్టతలను చాలా తెచ్చిపెట్టాయి. రాజకీయ రంగంలోనూ, ఇతర రంగాల్లోనూ!


‘ఇంగ్లీష్‌ పాత సంబంధాలను దెబ్బతీసి మాకు కొత్త అవకాశాల కిటికీ తెరుస్తున్నది. అది ఇవాళ అధికారపు నిచ్చెనగా ఉన్నది. సంపద, రాజకీయాధికారం కొందరి చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నందున చదువు ఒక్కటే దళిత బహుజనులకు ఆయుధంగా మారింది. అందులోనూ ఇంగ్లీష్‌ చదువు వారిని పైవారి సరసన కూర్చోబెట్టగలుగుతున్నది. పైవారి ఆధిపత్యాన్ని సవాల్‌ చేయడానికి సాధనంగా ఉపయోగపడుతున్నది. కాబట్టి ఇంగ్లీష్‌ చదవండి. ఇంగ్లీష్‌లోనే చదవండి’ అనేది దళిత బహుజన మేధావుల వాదనలో కనిపించే సారాంశం. ‘ఇప్పటికే ఇంగ్లీష్‌ను అవసరానికి మించి నెత్తిన పెట్టుకున్నాం. అది చదవడం అవసరమే కావచ్చు కానీ ఆ మీడియంలోనే చదవడం అవసరం కాదు. మాతృభాషలో నేర్చుకుంటేనే ఏదైనా త్వరగా ఒంటబడుతుంది. అడ్డూ ఆపూ లేని ఇంగ్లీష్‌ వ్యామోహం సామ్రాజ్యవాదానికి తప్ప మనకేమీ మేలు చేయదు’ అనేది మాతృభాషలో విద్యాబోధన గురించి మాట్లాడేవారి వాదనల్లోని సారాంశం. భాష భావప్రసార సాధనం అన్న నిర్వచనం పరిధిలోనే అయితే ఇంగ్లీష్‌ గురించి ఇంత గొడవ అక్కర్లేదు. అది మెరుగైన ఉపాధి సాధనంగా ఉందని ఇవాళ కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. ఆధునికతకు, పెట్టుబడీదారీ అభివృద్ధికి సంకేతంగా మారిపోయింది. మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లో, తెలుగు మీడియంలో చదువుకుని వచ్చినవాళ్లం కాదా అని ప్రజా మేధావులు అనుకునేవారు కూడా మాట్లాడితే ఆశ్చర్యమనిపిస్తుంది. అప్పట్లో ఊరి కామందు పిల్లలు, హెడ్‌మాస్టర్‌ పిల్లలు అక్కడే చదువుకునేవాళ్లు. కాబట్టి ప్రమాణాలు బాగానే ఉండేవి. అప్పటికి మన సాంఘిక ఆర్థిక జీవనంలో ఇంగ్లీష్‌ ఆధిపత్యం ఇంత విస్తరించలేదు. ప్రైవేటైజేషన్‌ను ప్రోత్సహించడానికి పద్ధతి ప్రకారం సర్కారీ బడులను-ఆస్పత్రులను నాశనం చేశారనొచ్చు. లేదా సర్కారీ బడులు వ్యవస్థకు అవసరమైనంత ప్రమాణాల్లో అవసరమైనంత మందిని ప్రొడ్యూస్‌ చేయలేకపోతున్నాయి కాబట్టి అది తన అవసరం కోసం ఈ పద్ధతిని ఎంచుకుందనీ అనొచ్చు. ఏమైనా కానీ ఇవాళ నోరుగలిగిన వారెవరూ సర్కారీ తెలుగు బడుల వైపు తొంగి చూడడం లేదనేదైతే వాస్తవం. ఆధునిక నాగరికతలో ప్రాధమిక అవసరాలుగా మారిన విద్య, వైద్యం రెంటిలోనూ ఈ దుర్మార్గమైన అసమానతలు పేదలు తమ పరిస్థితిని మెరుగుపర్చుకోనీయకుండా అడ్డుపడు తున్నాయి. పేదలు ఈ హర్డిల్‌ దాటాలనుకునేవారు ఏం చేయాలనేది ఆలోచించడమే ప్రజాస్వామికం అనిపించు కుంటుంది. తెలుగు మీడియం ఇవాళ ఎక్కడ ఉన్నది? ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది ఎవరు? దిక్కూ మొక్కూ లేని పేద జనం. ఎక్కువలో ఎక్కువ దళిత బహుజన పిల్లలు. తెలుగు మీడియమే కొనసాగాలి అన్నపుడు మనం తెలుగును రక్షించే బాధ్యతను ఎవరి మీద మోపుతున్నాం? నిరుపేద విద్యార్థుల మీద! ఇక్కడ ఎదురయ్యే సంక్లిష్టతను ఎదుర్కోవడం అంత సులభం కాదు. పెట్టుబడి రాజకీయ రంగంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ దృశ్యాలను డిఫరెంట్‌ షేడ్స్‌లోకి మార్చి సంక్లిష్టం చేసినట్టే ఇక్కడా గందరగోళం చేసింది. నీ మాటలకు చేతలకు మధ్య వైరుధ్యాన్ని తెచ్చిపెట్టి నీ విశ్వసనీయతను దెబ్బకొట్టింది. కొందరికి అవకాశాలు కల్పించి ఎక్కువమందికి ఆశలు కల్పించి పాత పరిభాషలో మాట్లాడే ఉద్యమాలను దెబ్బకొట్టింది. నువ్వు మాతృభాషలో విద్యాబోధన గురించి మాట్లాడతావు. నీ పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతుంటారు. నువ్వు సర్కారీ ఆస్పత్రికి వెళ్లవు. కానీ ప్రభుత్వ వైద్యాన్ని గురించే మాట్లాడుతుంటావు. నువ్వు అన్ని విద్యుత్‌ పరికరాలన్నింటినీ వాడుతుంటావు. కానీ థర్మల్‌, హైడ్రో, ఆటమిక్‌ విద్యుత్‌ కేంద్రాలనన్నింటినీ వ్యతిరేకిస్తూ ఉంటావు. తెలుగు ప్రేమ ప్రదర్శించే నాయకుల పిల్లలంతా ఎక్కడ చదువుతున్నారు అనే ప్రశ్న కేవలం నైతిక పరమైన ప్రశ్నే కాదు. రాజకీయ ప్రశ్న కూడా. మా పిల్లలు మురికి విద్యావిధానంలో చదువుతున్నారు, తెలుగు మీడియమే సరైనది అనొచ్చు. అయితే ఆ మురికో గంధమో అందరికీ అందుబాటులో ఉండాలా వద్దా అనే ప్రశ్న వస్తుంది. ప్రభుత్వ రంగం బాగాలేదు కాబట్టి ప్రైవేట్‌ పాఠశాలలకు వైద్యశాలలకు వెడుతున్నాం. కానీ పేదలు ఉపయోగించుకునే ఆ రెండు రంగాలు బలపడాల్సిన అవసరముందని కోరుకుంటున్నాం, అందుకనే వాటి గురించి మాట్లాడుతున్నాం అని సమర్ధించుకోవచ్చు గానీ అది ఫలితాన్నివ్వదు. వైద్యం విషయంలో డిమాండ్‌-సప్లయ్‌ మధ్య దారుణమైన వ్యత్యాసం ఉండడం వల్ల స్కూళ్లతో పోలిస్తే ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య కూసింత ఎక్కువ. కాబట్టి వైద్య రంగాన్ని కాసేపు పక్కనబెట్టి విద్యారంగానికే పరిమితమవుదాం.

వాస్తవానికి ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటేనే ఏ శాస్త్రమైనా ఏ భాషైనా సులభంగా వంటబడుతుందన్నది శాస్ర్తీయమైన జ్ఞానం. ఇంగ్లీష్‌ కూడా మాతృ భాష నుంచి నేర్చుకుంటేనే సరిగా వస్తుంది అనే వాదనా శాస్ర్తీయమైనదే. కానీ ఈ వాదన ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియమే కొనసాగాలన్నది మాత్రం న్యాయమైనది కాదు. జ్ఞానవంతమైనది ప్రతి సందర్భంలోనూ న్యాయవంతమైనది కానక్కర్లేదు. టైం అండ్‌ స్పేస్‌ అనేవి వర్తిస్తాయి. పేదోడికి పెద్దోడికి వేర్వేరు విద్య, వేర్వేరు అవకాశాలు అనేది పోవాలా వద్దా అనేది న్యాయమైన ప్రశ్న. అశాస్ర్తీయమైనది అనుకున్న ప్పటికీ అదే మెరుగైన ఉపాధినిస్తున్నది. శాస్ర్తీయమైన దనుకున్నప్పటికీ ఇది ఉపాధినివ్వడం లేదు. ఆధిపత్యంలో ఉన్న ఇంగ్లీష్‌ మార్కెట్‌ అలాంటి విచిత్ర స్థితిని తెచ్చిపెట్టింది. విద్య ఇవాళ మార్కెట్‌ డిమాండ్లను నెరవేర్చే సరుకు. ఈ వ్యవస్థలో మార్పు చేయగలిగితే కానీ ఈ విచిత్రమైన వైరుధ్యం పోదు. అది పోయేదాకా పేదల బిడ్డలు ఉపాధి అవకాశాలను కోల్పోతూనే ఉండాలా! నీ బిడ్డలు ఇంగ్లీష్‌లో చదివి ఐఐటీలోకి జొరబడుతుంటే పేదల బిడ్డలు తెలుగులో చదివి ఐటీఐ దగ్గర తచ్చాడే స్థితి పోవాలా వద్దా! పోవాలనుకుంటే శాస్ర్తీయమైన పద్ధతిలోనే పోవాలనుకుంటే మన మన అంతర్గత గొడవలు పక్కనపెట్టి రకరకాల సమూహాలకు సంబంధించిన ప్రజా స్వామిక వాదులంతా ప్రభుత్వ ప్రైవేట్‌ స్కూళ్లు అన్నింటిలోనూ ఒకే విద్యావిధానమే ఉండేట్టు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి సాధించాలి. ప్రాథమిక స్థాయిలో అన్నిచోట్లా తెలుగు మాధ్యమమే ఉండాలి. ఈ లోగా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌ మీడియం పెట్టాలి. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ పెట్టినంత మాత్రాన వారు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివిన వారితో ఏకమవుతారా అనొచ్చు. కాకపోవచ్చు. వసతులు, పరిసరాలు, ఇంటి వాతావరణం, శ్రద్ధ అన్నింటా తేడా ఉంటుంది. కానీ భాష అనే ప్రధానమైన విషయంలో అయితే హర్డిల్‌ దాటడానికి అవకాశం ఏర్పడు తుంది. మిగిలిన హర్డిల్స్‌ దాటడానికి ప్రయత్నం చేయగలరు. ఇంకొక పని తప్పనిసరిగా చేయాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జరిపే ప్రతి రిక్రూట్‌ మెంట్లోనూ తెలుగు భాషా నైపుణ్యానికి సంబంధించిన అంశాలు తప్పనిసరి చేయాలి. 2011లో కామెరూన్‌ ప్రభుత్వం బ్రిటన్‌లో ఇంగ్లీష్‌ సరిగా రాకపోతే ఉద్యోగాలు, పెన్షన్లలో ప్రయోజనాలు కోల్పోతారని స్పష్టం చేసి ఉన్నది. ఎలుంగొడ్డు లాంటి వారే అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నపుడు ఎలుక పిల్లలాంటి వారము తీసుకోకపోతే ఎలా!

ఇంగ్లీష్‌కు ఉన్న అనవసరపు ఆధిక్యాన్ని తీసేసి మాతృ భాషలో చదివిన వారికి కూడా సమానమైన ఉపాధి, గౌరవం లభించేలా మార్పులు తీసుకురావడమనే లక్ష్యం వైపు చిత్తశుద్ధితో పనిచేసే సంస్థలు దీర్ఘకాలిక అవసరం. మన సాంఘిక ఆర్థిక జీవనంలో ఇంగ్లీష్‌ ఆధిపత్యాన్ని నిజంగా తీసివేయగలిగితే పేదలకు అంతకు మించినదేముంటుంది? అంతవరకు పేదల స్కూళ్లు పెద్దోళ్ల స్కూళ్ల మధ్య మీడియంలో ఉన్న అసమానతను తక్షణం తీసివేయడమే పరిష్కారం. ఇల్లూ వాకిలీ తాకట్టు పెట్టి దిక్కుమాలిన కాన్వెంట్‌కు ఫీజులు పోసే శ్రమ పేదలకు తప్పుతుంది. ఇంగ్లీష్‌, తెలుగు రెండూ అందుబాటులో ఉంచొచ్చు. తప్పో ఒప్పో మనకున్న ఛాయిస్‌ పేదలకు కూడా ఉండాలి. డబ్బులేని కారణంగా ఛాయిస్‌ లేకపోవడం అన్యాయం. మనం కోరుకుంటున్న లక్ష్యానికి మనం ప్రయాణించిన దానికి మధ్య విపరీతమైన వ్యత్యాసం ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు చాలా ఎదురవుతుంటాయి. రాజకీయ నైతిక ప్రశ్నలను మన ముందుంచుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో మనం కోరుకుంటున్న వ్యవస్థ కోసం ప్రయత్నిస్తూనే ఉన్న వ్యవస్థలో అసమానతలు తొలగించడానికి ఏ అవకాశం ఉన్నా ఆచరణాత్మకంగా ఆలోచించి దాని వైపుగా నిలబడడమే సరైనది. అయితే ఈ పరిష్కారం పెద్దోళ్లకున్న ఛాయిస్‌ పేదోళ్లకు లేకపోవడమనే అసమానతను తగ్గించడం కోసం మాత్రమే. శాశ్వత పరిష్కారం కాదు. ఇవాల్టి భౌతిక అవసరాల కోసం బౌద్ధిక బానిసత్వాన్ని ఆరాధిస్తే తలెత్తే విపరిణామాల గురించి చాలా దేశాలు బాధపడుతున్నాయి. స్థానిక పలుకుబడులు- సామెతలు ఏమాత్రం అర్థం కాని, కుటుంబ సంబరాల్లో పెద్దోళ్ల జోకులను సెటైర్లను ఏమాత్రం ఆస్వాదించలేని ఆంగ్లవ్యామోహపు తరానికి దక్షిణాఫ్రికా ప్రజాస్వామిక మేధావులు ‘కోకోనట్స్‌’ అని పేరుపెట్టారు. ఒంటి రంగే స్థానికం. లోపలి ఆత్మ తెల్లోడిది. సమాజమంతా ఇలాంటి టెంకాయలతో నిండిపోవాలని కోరుకోవడం లేదు. తాత్కాలిక సర్దుబాటుగా మాత్రం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం అవసరం.
(ఆంధ్రజ్యోతిలో Published at: 22-08-2014 02:57 AM)

Saturday 11 October 2014

మూలింటామె-నామిని రెండో రాకడ


నామినితో భలే కష్టం. ఆయన పాత్రలు త్వరగా వదిలిపెట్టవు. కథ చదివి పక్కన మడిచిపెట్టేసి మన మానాన మనం వేరే వ్యాపకాల్లోకి వెడదామంటే కుదరదు. కొంత కాలం పాటు అందులోని మనుషులు మనతోపాటు ప్రయాణిస్తూనే ఉంటారు. మన గతంలోకి దూకేసి జ్ఞాపకాల తుట్టెను రేపి డిస్ర్టబ్‌ చేస్తా ఉంటారు. ముఖ్యంగా పనీ పాట ఉన్న కుటుంబాలనుంచి వచ్చినవారికి ఇది బాగా అనుభవంలోకి వస్తుంది. మనం పల్లెటూరినుంచి వచ్చినవారిమే అయితే మూలింటామెను చూసే ఉంటాం. ఒంటరితనంతోనూ కష్టాలతోనూ నలిగిన మనిషిని మనం మన పక్కింట్లోనో ఎదిరింట్లోనో నాలుగిళ్లకావలో చూసే ఉంటాం. కొందరు రచయితలు ఆమెను తమ కథల్లో చిత్రించే ఉంటారు. ఇపుడామెను నామిని కావ్వనాయక చేశారు. ధర్మారావు, దయానిధి పక్కన మాంచి పీటవేసి కూర్చోబెట్టారు.
ఈ నవలలో ప్రధాన పాత్రలు మూడు. భర్తను కోల్పోయి పిల్లలను తన భుజాలమీద పెంచి పెద్దచేసిన మూలింటామె కుంచమమ్మ. ఆమె మనమరాలు రూపావతి. బతకనేర్చిన పందొసంత. కథ సగభాగం మాయాబజార్‌లో పాండవుల మాదిరి రూపావతి చుట్టే తిరుగుతా ఉంటుంది. రూపావతి కనిపించకుండా కథను నడిపిస్తూ ఉంటుంది. మూలింటామె మనమరాలు "కళాయిబోసుకునే మాదిగోడితో" లేచిపోవడం ఆ తర్వాత మూలింటామె కొడుక్కి పందొసంతతో పెళ్లి చేయడం, ఆ మహాతల్లి అతని ముందే వేరే ఆసామితో వ్యవహారం నడుపుతూ కుటుంబాన్ని'అభివృద్ధి' చేయడం పైపైన చూస్తే కనిపించే కథ. ఇందులో ప్రత్యేకత ఏమీలేదు. ఎవరయినా ఈ కథ చెప్పేయొచ్చు. కానీ ఈ మధ్యలో నామిని చిత్రిస్తారే ఆ ప్రపంచం, ఆ విలువల వైవిధ్యమూ, వైరుధ్యమూ, హిప్పోక్రసీ, ఆ మార్పూ ఉందే అది మాత్రం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఎక్కడ ఏహ్యభావం కలిగించాలి,ఎక్కడ ప్రేమ పుట్టించాలి అనే విషయంలో పట్టింపు రచయిత దృక్పధానికి అద్దం పడుతుంది. మనుషుల స్వభావాలను పలుకు తీరులోనూ స్వభావంలోనూ జాగ్రత్తగా చిత్రిక పడతారు. ప్రతిపాత్రకూ తనదైన స్వభావమూ, తనదైన నడక ఆసాంతమూ కొనసాగుతుంటాయి. వాళ్లను మనం మనూళ్లో ఉన్న ఫలానా ఫలానా వాళ్లతో పోల్చుకోగలుగుతాం. అరె, ఇది అచ్చంగా మనూర్లో జరిగిందే అనుకోగలుగుతాం. మూలింటామె మౌనం మాటున బాధను అణిచివేసుకునేదయితే ఆమె కూతురు మాటల రొద మాటున సొద మాటున మనేదను వెల్లగక్కుకునే బాపతు. పందొసంత ఒళ్లంతా లౌక్యం నిండిన మార్కెట్‌ బిడ్డ. చీమంతమ్మ ఎదుటోడి దుక్ఖం తన దుక్ఖంగా భావించగలిగిన ఆర్తి కలిగిన మనిషి. మొలకమ్మ, రంజకం లాంటివారు నోటిదూలిస్టులు. ఇలాంటివారు ఇంతకంటే అన్యాయమైన వారు మన చుట్టూతా రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంటారు. రకరకాల అసంతృప్తులతో రగిలిపోతూ ఆమె ఇట్టంటలే, ఈయన ఇట్టంటలే అని ఇతరుల మీద అవాకులూ చెవాకులూ ప్రచారం చేస్తూ ఆ రకమైన ఫేక్‌ ఓరల్‌ సెక్స్‌తో సంతృప్తిపడదామనుకునే మానసిక రోగులుంటారు. అన్నంతినే నోటితోనే అశుద్ధపు మాటలను విసర్జించగల పృష్టముఖులుంటారు. ఈ పేడపురుగులకు జెండర్‌ ఉండదు. కుచ్చుంటే కత లేస్తే కత రోజుల్లో అలాంటి వారిని లైటర్‌ నోట్లో చిత్రిస్తే ఇందులో మాత్రం ఆడుకున్నారు నామిని. నోరు గలిగిన వారు నీతిమాటల్ని గట్టిగట్టిగా చెపుతూ న్యాయాన్యాయాలను నిర్దేశిస్తున్నపుడు కడుపుమండిన వికర్ణుడి మాదిరి సభను ధిక్కరించి మాట్టాడిన సుకుమారుడు సింబాలిక్‌గా చూసినపుడు నామిని ప్రతినిధి గామోలు అనిపిస్తుంది. " వుండండి లంజిల్లారా, యీ ఊళ్లో ఆడవి మొగుళ్ల దాపున చేరుకొని ఏఏ వాటంతో లంజరికాలు జేసి పత్తిత్తుల్లాగా చెలామణి అవుతుండాయో ఒక పుస్కం రాసి చూపిస్తా నుండండి లంజల్లారా!" అనేయగలిగిన తెంపు నామినిదే అనిపిస్తుంది. కానీ ఆ సింబాలిజాన్ని దాటుకుని చూస్తే రచయిత సర్వాంతర్యామిలాగా కనిపిస్తాడు. కొన్నిసార్లు మూలింటామెలో మరికొన్ని సార్లు చిలకమ్మలో ఇంకొన్ని సార్లు మాల గురివిలో కూడా కనిపిస్తాడు. 
"ఈ కత ఊరి గెమిని దాటిపోకూడదు. ఆడలంజిలు దీన్ని చాటవమాదిరిగా చెప్పుకుంటా ఉంటే యిన్నమొగోడు యిన్నట్టే మెట్టుతో కొట్టీయాల. చుట్టూతా రెడ్లు. రామాపురం రెడ్లు. నడవలూరు రెడ్లు, నెన్నూరు రెడ్లు, గంగరెడ్డి పల్లె రెడ్లు, యిన్నేండ్లూ రెడ్లేలతా ఉంటే మనం నోట్లో ఏలేస్కోని గమ్మనుండినాము. యిప్పుడనంగా మనోడు ఏల్తా ఉంటే రెడ్లు కక్కలేక మింగలేక మినకతా ఉండారు. యీ టయింలో మన కమ్మిరికంలో ఒకాడది యీ మాదిరిగా కళాయిబోస్కునే అరవ మాదిగోడితో పూడిసిందంటే-యీ కత నాలుగూళ్లకు తెలిస్తే మళ్ల మనం తిరప్తికి బస్సెక్కి పోగలమా!'' అని ఇది ఎప్పటికథ,ఎవరి కథ, అనేవి నామిని చెప్పేశాడు. 80ల కథ, కమ్మపల్లెలో జరిగిన కథ. రాష్ర్టంలో ఎన్టీఆర్‌, కేంద్రంలో రాజీవ్‌ గాంధీ పాలిస్తున్న దశ. రాజీవ్‌ కొత్త మార్పులను సమాజంలో ప్రవేశపెడుతున్న దశ. గ్రామీణ సమాజం మార్పులను అనుమానంగానూ ఆసక్తిగానూ చూస్తున్న దశ. పాత కొత్తలు రెంటిలోని విషాదాల్ని వ్యాఖ్యానం లేకుండా మనముందుంచారు నామిని. 


నా కొడుక్కి యవాదశొచ్చి పదేడు పజ్జెనిమిదేళ్లయినా నేను పెళ్లి ప్రయత్నం చేసినానా! అప్పుడు నువ్వు మూడేండ్ల బిడ్డ. నిన్ను తండ్రి మాదిరిగా చూసినాడు నీ మేనమామ. నిన్ను బుజాల మిందనే ఎత్తుకొని తిప్పినాడు. ... బొటనేలు తొక్కించుకుని బొట్టు కట్టించుకునే నాటికి నీకు యొచ్చూ తక్కవగా పదైదు పదారేండ్లు. నీ మొగుడికి ముప్పై ముప్పై మూడేళ్లు. వొంటికాలి మింద పదైదేండ్లు దేనికని నిలబడుకోనుండినాడు. సంకన బెట్టుకుని సాకిన బిడ్డి మెళ్లోనే బొట్టు కడదామని!...మూలింటామె మనేదలో కలిపేసి చెప్పాల్సినవి చెప్పేస్తాడు. మనం చేస్తే తప్పుకాదు గానీ పసిబిడ్డ చేస్తే తప్పా....కిందా పైనా నెరిసిపోయ్‌నాక నువ్వూ పత్తీతవే, నేను పత్తీతనే! అని మూలింటామె నోట ఊరికే పలికించలేదు. ఆ ముసలాళ్ల యవ్వనపు రహస్యాలు మనకు తెలియజేయాలనే కొంచెపు మనస్తత్వంతో చేయలేదు. అది ఒక బూటకపు విలువను అపహాస్యం చేయడం. ఏదో ఒక ఆధిపత్యాన్ని ఆపాదించుకుని ఎదుటివారి మీద చెలాయించాలని చూసే మనస్తత్వాలను ఎద్దేవా చేయడం. మనిషి మీద గౌరవం చూపడం. 
నవలను రెండు భాగాలుగా విభజించారు నామిని. కంటికి కనిపించని రూపావతి మొదటి భాగానికి కేంద్రకమైతే రెండో భాగమంతా పందొసంత విశ్వరూపం.బావా, నువ్వేంది బీడీలు తాగేది సిగరెట్లు తాగు అని వయసుకు బావైన మనిషితో సరసాలాడే పందొసంత ప్రవేశంతో నవల మరో దశకు చేరుతుంది. బీడీల నుంచి సిగరెట్లకు మారడంలో చాలా మతలబు ఉంది. సిగరెట్లే కాదు, అలాంటి అనేకానేక కొత్త వస్తువులను అమ్మే దుకాణాలు, ట్రాక్టర్లు, మోటార్లు, మోపెడ్లు, కొత్త కొత్త మాటలు అన్నీ చాలా వచ్చేస్తాయి పందొసంత కొంగుపట్టుకుని. అక్కడ్నించి రచయిత కలం కట్టలు తెంచుకుంటుంది. కథనంలో వేగమే కాదు, దూకుడు కూడా పెరుగుతుంది .ప్రయోజనానికి అడ్డొచ్చే ప్రతిదాన్నీ నాశనం చేసుకుంటూ వెళ్లిపోయే ఆధునిక మార్పు పట్ల పట్టరాని కోపం కనిపిస్తుంది. చెట్లు కొట్టేసే దృశ్యం వివరణలో పర్యావరణ స్పృహను కూడా పలికిస్తాడు నామిని. కథకు ఎక్కడా తులం దెబ్బతగలకుండా ఇన్ని విషయాలను చెప్పడంలోనే నేర్పరితనం కనిపిస్తుంది. మరీ అవసరమనుకుంటే తప్ప పాఠకులకు టెక్ట్స్‌కు మధ్య రచయిత పదేపదే అడ్డమొచ్చేసి ఇది ఇదీ, ఇది ఇదీ అని వ్యాఖ్యానాలు జడ్జిమెంట్లు చేయడం నామినికి అలవాటు లేదు. పాఠకులకు నామిని ఇచ్చే గౌరవం ఎక్కువ. 
"పాపం మూలింట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒళ్లెరగని నిద్రపోయినా గుడుగుడు చంద్రడు గానీ, పందొసంత గానీ కంటిమీద రెప్పేసుంటే! ,...ఆ మాదిరిగా ఎంతసేపూ ఒకర్నొకరు కరుసుకుని పొడుకోలేక మంచి నిద్దట్లోనే ఆ రేత్తిరంతా అడ్డాపింట్లోకి పొయ్‌ కొంచి కొంచిం సేపు పొనుకుంటూ మళ్లా మంచం మీదకు వస్తా -రేయి తెల్లవాదులూ ఆ యిద్దురూ కంటిమీద రెప్పేయకుండా వనవాసరం చేసినారు."రచయిత కోపం వ్యంగ్యంలోకి దిగితే ఎలాఉంటుందన్నదానికి ఇది సూచిక అనిపిస్తుంది. గుడుగుడు చంద్రడికి పందొసంతకి బంధాన్ని చెప్పడానికి మామూలుగా నైతే ఇంత వర్ణన అవసరం లేదు. కానీ ప్రథమ భాగంలో 'కళాయిబోసుకునే మాదిగోడితో లేచిపోయిన' రూపావతిపై సాధ్యమైనంత ప్రేమనుచూపే నామిని కలం రెండో భాగంలో కేవలం ప్రయోజనాలకోసం అన్ని లెక్కలు వేసి పందొసంత పెట్టుకున్న బంధంపై సాధ్యమైనంత ఏహ్యభావం కలిగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రెండు చోట్ల కూడా లోకం పోకడను ధిక్కరిస్తుంది. "రంగబిళ్ల ఆ ప్రకారంగా నిప్పుల్లో కాలిపోయ్‌నాక పొందొసంతను బజిన గుడికాడికి పిలిపించి 'గుడుగుడు చంద్రుడెవుడు? వోడి నీ ఇంటికి రావడమేంది, ఆ కోళ్లు కోయడమేంది, నిన్న జూసి మిగతా ఆడవి నేర్చుకోవా?' అని నిగ్గదీసే మొగోడేడీ? అయినా గుడుగుడు చంద్రడు కళాయి బోసుకునే అరవమాదిగోడేమీ గాదే! ఆ తప్పుకే రాములవారి గుడి ముందు అపరాదం పడాలా, యివన్నీ ఏముండాయి, తుకడా ఎవ్వారాలు." అని ఊరి న్యాయం తాలూకు స్వభావాన్ని ఎండగడతారు నామిని. అధికారం ఏ సమాజంలో ఏ రూపమెత్తుతుందో నామినికి బాగా తెలుసు. అయితే సంకనబెట్టుకుని సాకిన బిడ్డి మెళ్లోనే బొట్టుకట్టే వ్యవస్థలో దాగిన అన్యాయం కంటే కాసు తప్ప మరేమీ కనిపించని కొత్త వ్యవస్థ మీద రచయితకు ఎక్కువ కోపం ఉంది అని ఆయన పందొసంత పాత్రను తీర్చిన తీరు చూస్తే అనిపిస్తుంది. రచయితకు ఇంతకుముందు అలవాటు లేని బీభత్స దృశ్యాలు ఇందులో చిత్రించిన తీరు చూస్తే ఒక రకంగా రచయిత పందొసంత మీద కత్తి గట్టినట్టు అనిపిస్తుంది. అలాగే నవల మొదట్లో -యిపుడే బయటకో యాడికో పొయినట్టుండాది మూలింటామె మనవరాలు రూపావొతి అనే వాక్యం లేకపోతేనే బాగుండేమో అనిపిస్తుంది. పాఠకుడిని అలా మళ్లించాల్సిన అవసరం నామిని లాంటి రచయితకేల! 
చికెన్‌ వండేటప్పుడు టమోటా వాడకూడదని ఎంత పట్టింపో అలాగే పిల్లుల జోలికి పోగూడదు అనే పట్టింపు కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. నెపం కాసేపు మూలింటామె మీద నెట్టేసి నవల మొత్తం ఒక ధారలాగా పిల్లిశాస్ర్తం నడిపిస్తూ ఉంటారు. వాటి శుభ్రత, శుచీ, ఆహారపు అలవాట్లు, విసర్జక అలవాట్లు, ఇలా పిల్లి శాస్ర్తమంతా చెప్పేస్తారు రచయిత. రైతాంగ కుటుంబాల్లో పిల్లి పట్ల ఉండే సెంటిమెంట్‌ను పందొసంత మీద కోపాన్ని పెంచడానికి వాడుకున్నారు. మామూలుగా నామిని రచన పెయిన్‌కి పర్యాయపదం. ఇందులో మాత్రం ఆగ్రహం దాన్ని దాటేసింది. ప్రథమభాగంలో వ్యక్తుల మీద పెద్దగా కోపం రాదు. మొత్తం ఆ వ్యవస్థ మీదే కోపం వస్తుంది. కానీ రెండో భాగంలో మాత్రం వ్యవస్థ మీద కంటే కూడా పందొసంత మీదే కోపం కేంద్రీకృతమవుతుంది. . కులమూ, ధనమూ, మానవ విలువల విధ్వంసమూ, పర్యావరణమూ, లాంటి అనేక విషయాలు పాతకొత్త రూపాల్లో ఎలా పనిచేస్తుంటాయో ప్రాక్టికల్‌గా చూపించిన పుస్తకం మూలింటామె. గతంలో ఘటనలనే ఎక్కువగా చిత్రించిన నామిని ఇపుడు పరిణామాన్ని చిత్రించడానికి పూనుకోవడం తెలుగు సాహిత్యం రెండు చేతులా ఆహ్వానించాల్సిన విషయం. నామిని రెండో రాకడకు స్వాగతం.
(జూన్‌ 29, 2014 ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసం)

పాత బూతుల బూజు దులపాల్సిందే!

“పనిమనిషులు దొరకడం లేదండీ. అబ్బో, రోజొక గంట పనిచేయడానికి వేలు అడగుతున్నారు. ఇళ్లలోనే ఉండి పనిచేసే అమ్మాయిలు అయితే అసలే దొరకరు.” పట్నాల్లోమధ్యతరగతి బాధ ఇది. ఇంటి నిర్వహణ ప్రధానంగా ఆడవాళ్ల బాధ్యతే కాబట్టి వాళ్లే ఎక్కువగా బాధపడుతునట్టు కనిపించినా ఈ బాధకు జెండర్‌ అంటగట్టక్కర్లేదు.
“ప్లంబరండీ, ఇంటికొస్తే చిన్న ట్యాప్‌ బిగించడానికి కూడా మూడునాలుగొందలు పోయాల్సిందే. బట్టలు ఐరన్‌ చేసే దిక్కులేదు”. ఇలాంటి మాటలు కూడా ఎడా పెడా వినిపిస్తూ ఉంటాయి.
“కూలోళ్లు దొరడం లేదండీ, వ్యవసాయం సర్వనాశనం అయిపోయింది. ఈ గ్రామీణ ఉపాధి పథకం తెచ్చిఅందర్నీ సోమరులను చేసిపెట్టారు. మనకెందుకు పనిచేస్తారు”.ఇది పల్లెల్లో ఎక్కువగా వినిపించే మాట.
“డప్పు కొట్టే మాదిగ లేకపాయె, చాకలి, కమ్మరి, కుమ్మరి పనులు పాయె, గ్రామాలు పాడైపోయాయండి.” ఇది కూడా దాని పక్కనే వినిపించే మాట.
ఈ బాధలు ఎవరికైనా బాధలు కావచ్చు కానీ వర్కింగ్‌క్లాస్‌ తరపున మాట్లాడేవారికి  కావచ్చునా! శారీరక శ్రమకు డిమాండూ విలువా పెరగడం వర్కింగ్‌ క్లాస్‌ తరపున మాట్లాడేవారు సంతోషించాల్సిన విషయాలు. కానీ మనం చేసే మధ్యతరగతి ఉద్యోగాలకు మాత్రం వేతనాలు మెరుగ్గా ఉండాలని, మనకు సర్వీసెస్‌ అందించేవారు మాత్రం ఎప్పట్లాగే జోలె పట్టుకుని మనం ఇచ్చినంత తీసుకుని చిత్తం దొరా అనాలని చాలామంది కోరుకుంటున్నారు. గ్యాస్‌ బండమీద సబ్సిడీ తగ్గిస్తే గోలగోల చేసేసి గ్రామీణ ఉపాధి పథకాన్ని మాత్రం ఆడిపోసుకుంటుంది ఇలాంటి మధ్యతగరతి.
పేదలవైపున నిలవడమంటే పేదరికాన్ని ప్రేమించడంగా అర్థం చేసుకున్న మిత్రులు ఇంకో రకమైన ఏడుపును అవుట్‌ సోర్స్‌ చేస్తుంటారు. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి ఏమాయె, అంతా ఉంటేనే గదా ఊరు అని ఒకటే బాధ!  మనం కాలేజీలోనో, బ్యాంకులోనో, కోర్టులోనో, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోనో, పత్రికా కార్యాలయంలోనో  పనిచేయాల. స్థిరమైన వేతనం తీసుకుంటూ మధ్య మధ్యలో సాహిత్య సేవ చేస్తూ ఉండాల. కానీ ఊరిలో మాత్రం నాలుగు వీధులు, ఏ వీధిలో ఆ కులాలు, మధ్యలో రచ్చబండ, దాని మీద ఓ యాపచెట్టు ఉండాల.  బాడిస చప్పుడు, మగ్గం  చప్పుడు, కుమ్మరి సారె చప్పుడు వినిపిస్తూ ఉండాల. ఊరిని ఊరిలా ఉంచడానికి చాకళ్లు, మంగళ్లు, కుమ్మర్లు, కమ్మర్లు నానా చావు చస్తూ అలానే ఉండిపోవాల! లేకపోతే సర్వనాశినం అయిపోయినట్టే!
మనం పైన ట్యాంక్‌ కట్టుకుని ఎప్పుడంటే అప్పుడు నీళ్లు తిప్పుకుంటాం‌‌, కానీ కుండలు చేసేవాడు కావాల! మనం ఖాదీ వేయం‌. ఆధునిక పరిశ్రమ చేసిన బట్టలే వేస్తాం. కానీ సాలె బట్టలు నేయాల. ఇందులో ప్రాక్టికాలిటీ ఏమైనా ఉందా. జీవితమేమైనా కె విశ్వనాధ్‌ సినిమానా! వివేకానంద సూత్రం ప్రకారం అన్ని కులాలు గౌరవంగా తమపని తాము చేసుకుంటూ అంతిమంగా బ్రాహ్మణత్వాన్ని పొందడానికి! గతాన్ని నెమరేసుకోవడం తప్పుకాదు. గతం లేకుండా వర్తమానం ఎక్కడినుంచి వస్తుంది? అమ్మమ్మ ఒడిని, ఒడిలో విన్న కథలను, చీమచింతకాయ కోయబోయి కింద పడిన దెబ్బలను, ఊరిబావిలో కొట్టిన ఈతలను గుర్తు చేసుకోకుండా ఉండడం సాధ్యమా! కానీ జ్ఞాపకాలకు విలువలు అంటగట్టి ఎత్తుపీట వేసి కూర్చోబెట్ట కూడదు. మా కాలంలో స్కూలుకు ఆరేడు కిలోమీటర్లు నడిచిపోయేవాళ్లం. ఇపుడు ఎవరైనా నడుస్తున్నారా అసలు! కూలీలు పక్కూరి చేన్లో పనులకు పోవడానికి కూడా సెవన్‌ సీటర్లు ఎక్కుతా ఉంటే!  అని ఎవరైనా గతాన్ని తీపిగా గోక్కున్నారనుకోండి. మనమేం అనాల? పండితులారా! మన పూర్వీకులు కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనేవారు, యోజనాల దూరం నడిచేపోయేవారు, ఇవాళ మనం యాడికైనా అలావెళ్లి ఇలాగొచ్చేస్తున్నాం. మనం సోమరులైపోయామని మనం ఎన్నడూ అనుకోలేదు. మన తర్వాతి తరానికి మన కంటే కూడా శారీరక శ్రమ తగ్గింది. శారీరక శ్రమను తగ్గించుకుని సౌకర్యాలు పెంచుకునేందుకు మనిషి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అది తప్పు కాదు అనాలా! లేక భలే చెప్పావు బాస్‌ అని ఫ్యూడల్ భజన చేయాలా !
An-Indian-boy-breaks-coal-006
“మా కాలంలో మాదిరి కాదమ్మా, ఇపుడాడవాళ్లకు పనా పంగా, అన్నీ మెషీన్లే అయిపాయె” అని కోడళ్లను చూసి ఈర్ష్య పడే కొందరు పాతకాలపు అత్తల మాటలకు దీనికి తేడా ఏమైనా ఉందా! ఇదింకా చిన్నబూతే. ఆ మంగలేమాయె, చాకలేమాయె, ఊరేమైపాయె అనైదైతే బూతున్నర బూతు.
ఊరు ఊరిలాగా ఉంచడం కోసం చాకలి మన పిల్లల పీతిగుడ్డలు, ఆడవాళ్ల ముట్టుగుడ్డలు, మగవాళ్లు తాగి వాంతి చేసుకున్న గుడ్డలు ఉతుకుతూనే ఉండాలా?సాయంత్రం ఇంటిమందుకొచ్చి బిచ్చమెత్తుకున్నట్టు జోలెపట్టుకుని మనం వేసే అన్నం పచ్చడి తీసికెళ్లి తినాలా? నీ మాల్గుడి డేస్‌ ఆనందం కోసం ఈ అవమానాన్ని
భరిస్తూ మనకు వెట్టి చాకిరీ చేస్తూనే ఉండాలా? నువ్వు పిలిచినపుడల్లా మాదిగ తప్పెట తీసుకొచ్చి చాటింపు వేయాలా? నువ్వు చస్తే అతను చచ్చినట్టు వచ్చి డప్పేయాలా?
లేకపోతే పీనిగ లేవదా? కాలిస్తే కాలదా? పూడిస్తే పూడదా? పశువు చచ్చిపోతే అతనొచ్చి తీసేయాలా? లేకపోతే  ఊర్లు పాడైపోయినట్టా? ఏం నువ్వు తీయలేవా?
తిండికి లేక ఒకనాడు కళేబరాల మాంసం తిన్నందుకు అది పారంపర్యంగా అతని బాధ్యతే అవుతుందా? చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుడుతూ బట్టలు నేసేవాడు బట్టలు నేస్తూ
బట్టలుతికేవాడు బట్టలుతుకుతూ వ్యవసాయం చేసేవాడు వ్యయసాయం చేస్తూ పాలించేవాడు పాలిస్తూ అప్పులిచ్చేవాడు ఎప్పుడూ అప్పులిస్తూ అప్పలు తీసుకునే వాడు ఎప్పుడూ అప్పులు తీసుకుంటూ ఉంటేనే ఊరు పచ్చగా ఉన్నట్టా? ఇదేనా మనం కోరుకునే ప్రజాస్వామ్యం?
బహిష్టు కావడమంటే అదేదో నేరమైనట్టు మూలన కూర్చొని ఏ గుడ్డలు వాడాలో తెలీక అవే చింపిరిగుడ్డలను పదే పదే వాడుతూ చివరకు గోనెసంచులను చించి కూడా వాడుతూ రోగాలు, కాన్సర్లు తెచ్చుకుని ఆడోళ్లు నానా అవస్తలు పడే రోజులు ఎంత బాగుండేవని ఆ పాత రోజులను మధురంగా తల్చుకుందామా! బహిర్భూమికి వెడుతూ నానా రోగాలు తెచ్చుకుంటూ, తెస్తూ సహజమైన జీవన క్రియను కూడా అవమానంగా దొంగదొంగగా తీర్చుకునే రోజులు బాగున్నాయనుకుందామా! బిపినో షుగరో పెరిగిపోయి హఠాత్తుగా మనిషికి చెమట్లు పట్టి స్పృహతప్పి చచ్చిపోతే అదేం రోగమో తెలీక దయ్యం పట్టిందేమో భూతం పట్టిందేమో అనుకుని కాటికి మోసుకుపోయే అన్యాయపు రోజులను అందంగా గుర్తు చేసుకుందామా! ఎవరికో ఎక్కడో ఏదో అయితే  చేతబడి, బాణామతి, చిల్లంగి అని పిచ్చిమాటలు మాట్లాడతా మంత్రగాళ్ల పేరుతో మనుషుల పళ్లు ఊడగొట్టి జుట్టు రాలగొట్టి రాళ్లతో చంపేసే ఆ గుంపున్యాయపు క్రూరత్వాన్ని తన్మయంగా నెమరేసుకుందామా!
ఊరు ఊరంతా అరె ఒరె అంటుంటే అలాగే బాబయా అని అలవాటైన భయంతో కూడిన సిగ్గువల్ల వచ్చిన నవ్వుని అభినయిస్తూ పనిచేసుకుంటూ పోయే సర్వీస్‌ కులాలు లేకుండా పోయాయని బాధపడదామా! కులవృత్తులనుంచి బయటకొచ్చినవాళ్లంతా వేరే పనుల్లో కుదురుకుంటే బాధలేదు,  నలిగిపోతున్నారు, రాలిపోతున్నారు, వారి కోసం రాస్తున్నాము అని సమర్థించుకోవచ్చు. నిజమే, ఆ బాధలో న్యాయమున్నది. కానీ అప్పుడు దాని స్వరం వేరే ఉండాలి. బ్రాహ్మణ, వైశ్య, కుమ్మరి, కమ్మరి, చాకలి అని కులవృత్తుల సంగమస్థలిగా నాలుగు వీధుల్లో  నడిచే చతుష్పాద వ్యవస్థ పోయినందుకు బాధపడకూడదు.. చాకలి ఏమాయె, కుమ్మరి ఏమాయె అని పలవరించకూడదు.
మనుషులను ప్రేమించడానికి ఆ కులవృత్తుల బానిసత్వాన్ని ప్రేమించడానికి తేడా ఉంది. వాస్తవానికి వృత్తి పనిచేసేవారిలో ఆర్టిస్ట్‌ లక్షణం ఉంటుంది. తాము చేసే పని స్వతంత్రమైనదనే భావన చాలామందిలో ఉంటుంది. కూటికి పేదోళ్లమే కానీ కులానికి కాదనే వాసన కొన్ని కులాల్లో ఉంటుంది. ‘ఒకడి కిందకు పనికిపోవడమంటే పరువుపోగొట్టుకోవడం’ అనే న్యూనత ఉంటుంది. దీన్ని వదులుకోగలిగినవారు లేదా వదులుకోక తప్పనిసరైన వారు నెమ్మదిగా వేర్వేరు పనుల్లో కుదురుకుంటున్నారు. ఆ మధ్యలో కొంత ఘర్షణ ఉంటుంది. ఏ మార్పులో మాత్రం ఘర్షణ ఉండదు?
ఒక్క వృత్తి కులాలనే కాదు, ఏ రకమైన కాయకష్టం చేసేవారయినా దానికి తగిన ప్రతిఫలం రానప్పుడు అంతకంటే తక్కువ శ్రమతోనో అదే శ్రమతోనో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించడం సరైనదనే చేతన మనం కలిగించగలగాలి. అటువంటి ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఏది ఏమైనా తన పొలంలో తాను చావనైనా చస్తాడు గానీ…అన్నట్టు రాసే వాళ్లు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. “తన పొలంలో తాను రాజులాగా బతికినవాడు ఇపుడు పాపం గార్డుగా” .. చొచ్చొచ్చొ అంటూ ఫ్యూడల్‌ వాసనను ప్రేమించాలా లేక శ్రమసంస్కృతిని పెంపొందించాలా? ‘బతికి చెడడం’ మీద పురోగామి రచయితలక్కూడా ఇలాంటి భావనలుండవచ్చునా! వర్కింగ్‌ కల్చర్‌ అంటే అంత ఏహ్యభావం ఉండవచ్చునా ? నువ్వో పక్క ఇది నీచం అదితక్కువ అని ప్రచారం చేస్తూ ఉంటే మార్పుకు సిద్ధపడే వాడు కూడా అదేదో చేయకూడని పని అనుకుని దాని బదులు చావుకు సిద్ధపడతాడు. నువ్వు మేలు చేస్తున్నట్టా! కీడు చేస్తున్నట్టా! ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోబట్టే అందులో ఉన్నవారి గురించి వారి స్థితిగతుల గురించి బాధపడుతున్నాం అనొచ్చు. కానీ చేస్తున్న పని అదిస్తున్న బతుకు మిగిలిన శారీరక శ్రమల కంటే అన్యాయంగా ఉన్న విషయాన్ని గుర్తించాలా వద్దా, గుర్తింప జేయాలా వద్దా! అలవాటైన పని మిగిలిన శ్రమలకంటే మెరుగ్గా కనిపించే ధోరణి ఉంటుంది.
ఆ భావన నుంచి వారిని బయటపడేయాలంటే ఏదో ఒక వైపునుంచి ఇంటర్‌వెన్షన్‌ అవసరం. లేదంటే ఏదో ఒక టైంలో ఆకలి ఆ పని మరింత క్రూరంగా చేసి చూపిస్తుంది. ఇంటిల్లిపాదీ పనిచేసినా రోజుకు వంద రూపాయలు కూడా మజూరీ ఇవ్వని చోట మగ్గం పని గ్రామీణ ఉపాధి కూలీ కంటే ఏ రకంగా మెరుగు? మనుషులు దున్నపోతుల్లా కూర్చుని ఉంటే ఒక బక్కపల్చని మనిషి రెక్కలతో లాక్కుపోయే టాంగాను నువ్వెలా చూస్తావన్నదానిమీద నీ దృక్పథం ఆధారపడి ఉంటుంది. సాంకేతికత ఇంత పెరిగిన ఈ దశలో కూడా ఇది కొనసాగడం అమానవీయం, అన్యాయం అనే భావన నీకుంటే నీ భాష వేరే ఉంటుంది. లేకపోతే “పేదరికం, ఏం చేస్తారు” అని పరోక్షంగా సమర్థించే ప్రమాదం ఉంది. అవి ఉండడానికి వీల్లేదన్నవాళ్లంతా వాళ్లు ఆకలిచావులు చావాలని కోరుకుంటున్నవాళ్లేమీకాదు. ముందుగా అది అమానవీయం అని గుర్తిస్తే దాన్ని గట్టిగా ప్రకటిస్తే ఆ మేరకు వ్యవస్థ మీద ఒత్తిడి పెడితే ప్రత్యామ్నాయం ఏదో ఒకటి దొరుకుతుంది. ఎంతో చైతన్యవంతులం అనుకునే వారు కూడా గూడు రిక్షాలో బెజవాడలో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో అనేసుకున్నారనుకో!
ఇక అది అన్యాయమనే చైతన్యం సమాజానికి ఎక్కడినుంచి వస్తుంది? అలవాటైన మనిషి మార్పుకు సిద్ధపడే ఒత్తిడేదో ఉండాలి. చైతన్యవంతులైన వ్యక్తులు శక్తులు దానికి చోదకశక్తిలాగా పనిచేయాలి. వెనక్కు లాగ్గూడదు. ఒంటిని చర్నాకోలతో కొట్టుకుని, బిడ్డలను తాడుమీద నడిపించే అడక్కతినే విన్యాసాలను చూసి “ఆహా ఏమి ఆర్ట్‌” అనుకునే వారుంటారు. రచయితలైనా కాకపోయినా వీరిలో చాలామంది పురోగామి ముసుగులోనే ఉంటారు. వీరిలో కొందరు చివరకు కళావతులు, దేవదాసీ వృత్తులను కూడా ఆరాధిస్తారు. గొప్ప కళ అండీ అంటారు. వర్కింగ్‌క్లాస్‌ కల్చర్‌ ఉన్నోళ్లమయితే మనమేమని అడగాల? అంత మంచి ఆర్ట్‌ అయితే మీ బిడ్డలెందుకు తాడుమీద ఎక్కరు సార్‌! అంత గొప్ప ఆర్ట్‌ అయితే ఆ దేవదాసీల్లో మీ వాళ్లెందుకు కనిపించరు సార్‌! ఓ అని ఒకటే పొగిడే మీరు ఆ ఆర్ట్‌లను ఎందుకు ప్రాక్టీస్‌ చేయరు సార్‌,ఏదైనా నేర్చుకుంటే వస్తాది గదసార్‌! అని అడగాలా, వద్దా! అడక్కతినే స్థాయిలో ఉన్న అన్యాయమైన పనిని ఎవరైనా ఆర్ట్‌ పేరుతో పొగిడితే తప్పనిసరిగా కఠినంగా స్పందించాల్సిందే. కోపం రావాల్సిన చోట రాకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్టే లెక్క.
మార్పు అనివార్యమైనపుడు దానికి తగినట్టుగా సిద్ధం కావడం, సిద్ధం చేయడం మన బాధ్యత. ఈ మార్పులో సానుకూలమైనవేవో ప్రతికూలమైనవేవో బేరీజు వేసుకుని దానికి అనుగుణమైన చైతన్యాన్ని పెంపొందించుకోవడం మన బాధ్యత. కొత్త ఆర్థిక వ్యవస్థ మనల్ని వస్తువుల వెంట పరిగెట్టేట్టు చేస్తుంది. ఆ వస్తువుల ఉత్పత్తి నిరంతరం అవసరయయ్యేలా చేస్తుంది. భావజాల పరంగా ఆ అవసరాన్ని కూడా అది నిరంతరం సృష్టిస్తూనే ఉంటుంది. ఆ నిరంతర వినిమయం, ఉత్పత్తిలో భాగంగా ఉపాధి పెరుగుతుంది. ఆ పరుగు ఆగితే వ్యవస్థలో సంక్షోభం ఏర్పడుతుంది.  అదే సమయంలో ఆ పరుగుకు అడ్డు వచ్చే తాబేటి వ్యవస్థను దాని తాలూకు చిహ్నాలను మార్చుకుంటూ వెడుతుంది. కొన్నింటినైతే రద్దు చేస్తూ వెడుతుంది. అందులో ఇప్పటివరకూ అణచివేతకు వివక్షకు గురైన సమూహాలకు ఊరటనిచ్చే కొన్ని విషయాలుంటాయి.
ఇప్పటివరకూ కొన్ని పనులను నీచంగా విలువ తక్కవగా చూసిన వారు కూడా ఆ  పనులను చేయాల్సిన అవసరం కల్పిస్తుంది. ఆ పనికి అంతకుముందు లేని గౌరవాన్ని ఆపాదిస్తుంది. ఒక్క ముక్కలో ఆయా పనులను మార్కెట్‌ చేయడానికి అడ్డొచ్చే అనవసరమైన న్యూనతలను, అనవసరమైన గౌరవాలను రద్దుచేస్తుంది. కనీసం తగ్గిస్తుంది. కొత్త వ్యవస్థ కేవలం పట్నాలకే పరిమితం కాదు. టీవీ ఇంటర్‌నెట్‌ వంటి సాధనాలు, మెరుగుపడిన రవాణా సాధనాలు పల్లె-పట్నాల మధ్య తేడాను చెరిపేసుకుంటూ వస్తున్నాయి. ఈ చెరిపివేయడం వల్ల కొంతమందికి అలవాటైన సౌఖ్యాలు, గౌరవాలు, మర్యాదలు తగ్గిపోతాయి. అయ్యవారు అనో రెడ్డీ అనో రాజుగారు అనో దొరా అనో గౌరవ సంబోధనలను కోల్పోయిన వారికి ఉక్కపోత ఉంటుంది. ఆ ఉక్కబోతను అలాగే ప్రదర్శించుకుంటే దాని కథ వేరే!
అలా కాకుండా శ్రామిక కులాల పాత్రలను పెట్టి పెద్ద మెలోడ్రామాలను సృష్టించి ఇంకా అవసరమనుకుంటే పాత్రలను చంపేయడం లాంటి విన్యాసాలు చేసి నాలుగు పాదాల సంస్కృతి పోయినందుకు బాధపడితే మాత్రం బాధేస్తుంది! ప్రపంచీకరణ అనే భూతాన్ని పోటీగా నిలబెట్టినంత మాత్రాన అలాంటి వాదన న్యాయమైనదైపోదు! పీడిత కులాల నుంచి వచ్చినవారు, నిజంగా వర్కింగ్‌ క్లాస్‌వైపు నిలబడేవారు ఇక్కడ కన్ఫూజ్‌ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ మాయలో పడే ప్రమాదం ఉంది. అది సాహిత్యంలో చూచాయగా కనిపిస్తున్నది. కొత్త వ్యవస్థలో ఉన్న దుర్మార్గాలను ప్రశ్నించడమూ, అంత కంటే దుర్మార్గమైన పాత వ్యవస్థను ప్రేమించడమూ రెండూ ఒకటి కావు.
కొత్త ఆర్థిక వ్యవస్థ రెండు రకాల మార్పులు తెస్తుంది. ఒకటి- కులానికి వృత్తికి మధ్య ఉన్న బంధాన్ని తెంచేయడం, రెండు- సోషల్‌ మార్కర్స్‌ను మెటీరియల్‌ మార్కర్స్‌గా మార్చడం. పల్లెలో నీ ఉనికి నీ కులంతోనే ముడిపడి ఉంటుంది. ఏ ఊరిలో నైనా ఎవరిగురించైనా అడిగితే ఏంటోళ్లు అని ప్రశ్నిస్తారు. అదే పట్నంలో అయితే ఏం చేస్తారు అని అడుగుతారు. అక్కడ గుర్తింపు నీ కులం. ఇక్కడ గుర్తింపు నీ పని. నీ గుర్తింపు నీకు సంబంధం లేని పుట్టుకతో ముడిపడి ఉండడం కంటే నువ్వు చేసే పనితో ముడిపడి ఉండడం కచ్చితంగా మెరుగైన విషయం. కొత్త వ్యవస్థ  సంప్రదాయకంగా సాగుతున్న వృత్తి పనులను మార్కెట్‌ చేసి కొత్త విలువను ఇస్తుంది. అంతకు ముందు మార్కెట్‌ చేసుకోలేని విషయాలను బ్రాండ్‌గా మార్చివేసి కొత్త మేకప్‌ వేస్తుంది. ఆరోగ్యం కాస్తా ఫిట్‌నెస్‌ అనే మార్కెట్‌ పదంగా మారుతుంది.
సంప్రదాయ వ్యాయామశాలల స్థానంలో ఆధునికమైన జిమ్‌ మార్కెట్‌ ప్రవేశిస్తుంది. చిలకజోస్యాలు పిచ్చి లాజిక్కులతో న్యూమరాలజీ-వాస్తు రూపం తీసుకుంటాయి. బాత్‌రూమ్‌లు, లెట్రిన్‌లు క్లీన్‌ చేయడమనే పని మెయిన్‌టెయిన్స్‌ అనే రూపం తీసుకుని కొత్త డ్రస్ తొడుక్కుంటుంది. యూనిఫామ్‌, మెడలో ఐడెంటిటీ కార్డు లాంటివి కొత్త ఆత్మవిశ్వాసాన్ని, చైతన్యాన్ని ఇస్తాయి. కావాలంటే ఇళ్లలో పనిచేసే వారిని పరిశ్రమల్లో అదే పనిచేసేవారిని పోల్చిచూడండి. హౌస్‌ వైఫ్‌  అనే పదం దానికున్న న్యూనతను తొలగించుకుని హోమ్‌మేకర్‌ అనే ఆధునిక రూపం తీసుకుంటుంది. దర్జీపని  బాతిక్‌ రూపమెత్తుతుంది. చాకలి పని డ్రైక్లీనింగ్‌ రూపమెత్తి పరిశ్రమగా రూపుదాలుస్తుంది.  వంటపని కొత్త గౌరవాన్ని సంతరించుకుని గౌరవనీయమైన వృత్తిగా అవతరిస్తుంది. ఈ రంగంలో సూపర్‌ స్టార్‌ సంజీవ్ కపూర్‌ స్ర్తీ కాదు. వెంట్రుకలు కత్తిరించే పని ఇంతకుముందు లాగా అగౌరవంగా ఉండదు.
అందులో కులాన్ని తీసేసి కొత్త వర్గాల్ని ప్రవేశపెడుతుంది మార్కెట్‌. ఎదురుగా అద్దం తగిలించి కబుర్లు చెపుతూ బ్లేడుతో గడ్డం గీకడం ఒక వర్గం. కత్తెర చేత్తో పట్టుకుని ఏ స్టైల్‌చేయాలి సర్‌ అని అడిగేదొక వర్గం. పిలకజుట్టో పిల్లగడ్డమో పెట్టుకుని చొక్కా ఫ్యాంటు మీద అప్పటికప్పుడు ఒక బెల్టు లాంటిది తగిలించుకుని అందులోని ఆధునిక పొత్తి లోంచి కత్తెర్లు విలాసంగా ఎగరేసి తీస్తూ మీకు సెపరేషన్‌ కంటే సెపరేషన్‌లేకుంటేనే బాగుంటుంది సర్‌ అనేదొక వర్గం. పాత మంగలి పొత్తికి ఈ పొత్తికి మధ్య చాలా దూరం ఉంది. హబీబ్‌ ఇవ్వాల నేషనల్‌ స్టార్‌. ఆయన మంగలి కాదు. ఆయన శిష్యులు ప్రశిష్యులు వేలు లక్షలుగా మారి చిన్నచిన్న పట్నాల్లో కూడా సెలూన్లు తెరుస్తున్నారు. వాళ్లల్లో మంగళ్లు ఉన్నారో లేదో వెతుక్కోవాల్సిందే. మంగలిషాపు సెలూన్‌గా మారే ప్రక్రియ ప్రజాస్వామిక మైనది. ఇది వారి వృత్తిని దోచుకున్నదేమీ కాదు. ఎక్కువమంది ఆధారపడిన వృత్తి విషయంలో మార్పుసంక్లిష్టంగా ఉంటుందనేది వాస్తవం. కానీ ఆ సంక్లిష్టతలో మనం స్టేటస్‌ కోయిస్టుల పాత్ర పోషించరాదు.
పనికి పుట్టుకకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచడం వల్ల దానికి మార్కెట్‌ కల్పించడం వల్ల అన్ని కులాల వారు అన్ని పనులు చేయడంలో పోటీ పడే పరిస్తితి వస్తుంది. అత్యంత అమానవీయమైన వేశ్యావృత్తి కూడా రూపం మార్చుకుంది. ఇంతకుముందు కొన్ని కులాలకు పరిమితమైన వృత్తి ఇవాళ సెక్స్‌ వర్కర్స్‌ రూపమెత్తింది. అందులో వర్గాల వారిగా అన్ని కులాల వారు కనిపిస్తున్నారు. చివరకు ఆధ్యాత్మికత కూడా ఇండస్ర్టీగా మారిపోయి బోధకుల్లో గురువుల్లో బాబాల్లో బ్రాహ్మణేతర కులాల వాళ్లు చాలామంది రాణిస్తున్నారు. మంచి మాటకార్లకు బోలెడంత డిమాండ్ ఉంది. అమ్మోర్ల నుంచి బాబాల దాకా చాలా దూరమే ప్రయాణించాం. కాకపోతే సంప్రదాయకంగా మిగిలిపోయిన పూజారితనంలోకి శ్రామిక కులాలు రాకుండా ఆటకం ఉంది. డ్రైనేజీలో దిగి మురికిని బయటకు తోడివేసే పనిలోకి బ్రాహ్మణులు వస్తున్న పరిస్థితి లేదు.(ఇంత ఆధునిక యుగంలో కూడా ఇంకా మనుషులు డ్రైనేజీలోకి దిగాల్సి రావడం ఈ వ్యవస్థ శ్రామికుల పట్ల చూపిస్తున్న దుర్మార్గానికి దర్పణం) చేపలు పట్టే పనిలో  ఆధునికత తగినంత రాకపోవడం వల్ల అక్కడా లోటు కనిపిస్తున్నది. ఇలాంటి కొన్ని ఉదాహరణలు మినహాయిస్తే  మిగిలిన చాలా పనులతో కులబంధం బలహీన పడింది. ఇంతకుముందు చీప్‌గా చూసిన శ్రమలకు విలువ పెరుగుతున్నది.
ఆధునిక కత్తెర్ల పొత్తి మాదిరే మార్కెట్‌ వ్యవస్థ డబ్బు ఖర్చుపెట్టడంలో నీ శక్తి ఆధారంగా కొత్త రకమైన వర్గీకరణలను చేస్తుంది. మార్కెట్‌ కొత్త రకం కులాలను తయారుచేస్తుంది అని కూడా అనొచ్చు కానీ కులంలోఉండే పుట్టుక వ్యవహారం ఇక్కడ ఉండదని గుర్తించాలి. డబ్బు ఆర్జించడంలో నీకున్న శక్తి మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. పాతకాలపు స్టెనో గ్రాఫర్‌తో పోల్చదగిన మెడికల్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌, బిపివో, కాల్‌ సెంటర్‌ల పని కూడా ఇప్పుడు గొప్ప గ్లామర్‌ను సంతరించుకుంటుంది. డబ్బు మహిమ! సహింపరానంత అసమానతలు పెరిగిపోతూనే ఉంటాయి. నిరంతరం పోటీ పడుతూనే ఉంటావు కాబట్టి సరిపోని తనం అనేది నీకు గుదిబండలాగా కట్టేసే ఉంటుంది. లేనితనం ఒకటి అందని ద్రాక్షలాగా నిన్ను శాశ్వతంగా ఊరిస్తూనే ఉంటుంది. మార్కెట్‌- మీడియా ఈ లేనితనాన్ని సరిపోని తనాన్ని ఎప్పటికప్పుడు సృష్టిస్తూనే ఉంటాయి.
న్యూనత అసంతృప్తి అనేవి ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు చచ్చేదాకా ఊపిరాడకుండా నిలువనీయకుండా చేస్తూనే ఉంటాయి.  అది టాల్‌స్టాయ్‌  “హౌ మచ్‌ లాండ్‌ డస్‌ ఏ మ్యాన్‌ రిక్వైర్‌” కథలో పరుగులాంటిది . అలాంటి ఒత్తిడి నిరంతరం మనల్ని తరుముతూ ఉంటుంది.  కోతుల్ని చేసి ఆడిస్తుంది.  కొన్ని ఆలోచనలు,కొన్ని స్పందనలు ఉన్న మనిషిగా కంటే నిరంతరం వస్తువులు కొనే వినియోగదారునిగా మాత్రమే చూస్తుంది. నిలుచుని ఆలోచించే తీరిక లేకుండా చేస్తుంది. నీకు నిన్ను పరాయివాడిని చేస్తుంది. మాయా తెరలను సృష్టిస్తుంది. తెర సౌకర్యం స్థాయిని దాటిపోయి వ్యసనమై కూర్చుంటుంది. మనిషి తోటి మనిషితో కాకుండా తెరతో సంపర్కం చేసి మాయా సంతృప్తి పొందే తెరాధునికత లక్షణాన్ని మన జీవితంలోకి తెస్తుంది. ఇవన్నీ చర్చించాల్సినవే. కథనం చేయాల్సినవే. చాలామంది చేస్తున్నారు కూడా. కొందరే ఇంకా పాత మాయను మోసుకు తిరుగుతున్నారు. అది మాయ కదా, కొత్త జీవం కడుపులోంచి బయటపడ్డాక దానికి విలువ ఉండదు. ఆ తర్వాత కూడా మోసుకు తిరుగుదామంటే కంపు కొడుతుంది. ఆ కంపును వదులుకోవాల్సిందే. పుట్టుక ఆధారంగా నీ వృత్తిని దాని గౌరవాన్ని నిర్ణయించే నాలుగు పాదాల వ్యవస్థను ఏ సాకుతో కీర్తించినా అది అన్యాయం. శ్రామిక వ్యతిరేకం.
(జూన్‌ 12, 2014న సారంగలో అచ్చయిన 'సంవేదన' కాలమ్‌)

 వెబ్‌ పత్రికలతో ఒక బెంగ తీరింది, కానీ…!
సీరియస్‌ సాహిత్యాన్ని ప్రచురించే పత్రికలు తగ్గిపోయాయి అనే మాట తరచుగా వినిపిస్తున్నది. కథలు రాస్తాం సరే, వేదిక ఏదీ అని ఆందోళన వ్యక్తమవుతున్నది. కథకుల సమావేశాల్లో ఈ సమస్య గురించి చర్చ జరుగుతున్నది. ఆ లోటు తీర్చడానికి వెబ్‌ మ్యాగజైన్లు వచ్చేశాయి. పత్రికల్లో వచ్చిందాంతో సమానం కాదు అనే మాట ఉండనే ఉంటుంది. అది వేరే సంగతి.
వెబ్‌ మ్యాగజైన్లు వస్తూ వస్తూ చాలామంది కొత్త రచయితలను వెంట తీసుకొచ్చాయి. కొన్ని పాత బెంగలను తీర్చేశాయి. తెలుగు చచ్చిపోతోందని కొందరు రచయితలు బోలెడంత ఆవేదన చెందేవాళ్లు. తమ బాధను ప్రపంచం బాధ చేయడానికి విశ్వప్రయత్నం చేసేవాళ్లు. కొత్త తరంలో సాహిత్యం రాసేవాళ్లే లేరని ‘మన’ తరంతోనే ఈ సాహిత్య వ్యాసంగం చచ్చిపోతుందేమో అని ఆందోళన వ్యక్తమయ్యేది. ముఖ్యంగా సింగమనేని నారాయణ లాంటి పెద్దమనుషులయితే రేపట్నించే తెలుగు మాయమైపోతుందేమో, మన గోడు పంచుకోవడానికి మనుషులను వెతుక్కోవాలేమో అన్నంత దిగులు అందరికీ పంచేవారు. ఆ బెంగను  వెబ్‌ మ్యాగజైన్లు తీర్చేశాయి.
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల మీద బోలెడన్ని అపోహలుండేవి. ఐటి అనగానే తాగుడు, తినుడు, తిరుగుడు అని తా గుణింతం ఒకటి తెలుగులోకంలో ప్రచారంలో ఉండేది. వాళ్లు ఏమీ చదవరని, తమ తీపి బాధలు తప్ప ప్రపంచం బాధలు పట్టవని, వాళ్లవల్లే తెలుగునేల మీద తెలుగుదనం అంతరిస్తోందని ప్రచారం సాగుతుండేది. వెబ్‌ మ్యాగజైన్లు వచ్చాక ఈ అపోహను యథాతథంగా ప్రచారం చేసే అవకాశం పోయింది.
అంతకుముందు పత్రికల్లో కూడా అడపా దడపా సాఫ్ట్‌వేర్‌ రచయితలు కనిపించినా ఇపుడు కొత్త తరం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ వారితో పాటు చాలా రంగాల్లో పనిచేస్తున్న యువత సాహితీ ప్రపంచంలోకి దూసుకొస్తున్నది.
కాకపోతే ఏ మార్పు అయినా సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా రాదు. అతి విస్తరణ, ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టత లేకపోవడం అనే ముఖ్యమైన సమస్యలైతే ఉన్నాయి. రెండోది చాలా లోతైన వ్యవహారం.రచయితల ఎక్స్‌పోజర్‌ దగ్గర్నుంచి మన చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం దాకా చాలా అంశాలతో ముడిపడిన వ్యవహారం. సాహిత్యంపై లెఫ్ట్‌-లిబరల్‌ ప్రభావం పలుచబడడం స్పష్టంగా కనిపిస్తున్నది.
కేవలం సాహిత్యానికే పరిమితం కానటువంటి విస్తృతమైన రాజకీయార్థిక కోణాలున్నటువంటి ఆ సమస్యను పక్కనబెట్టి తొలి సమస్య వరకే పరిమితమవుదాం. స్థలానికి సంబంధించిన నియంత్రణ లేకపోవడం అనేది ఒక అర్థంలో రచనకు అవసరమే కావచ్చు. కథ ఇన్ని పేజీలే ఉండాలంటే ఎలా, సృజనకు హద్దులు గీస్తారా అనే హూంకారంలో కొంత న్యాయముండొచ్చు. ప్రశ్నలో న్యాయం కనిపించినంత మాత్రాన ప్రతి ప్రశ్న వెనుక న్యాయమైన ఉద్దేశ్యమే ఉన్నట్టు భావించనక్కర్లేదు.
ప్రశ్నించినవారందరూ కోరుకుంటున్న పరిష్కారం న్యాయమైనదే అయిఉండనక్కర్లేదు.  ఫలానా పార్టీ బిసిలకు తగినన్ని సీట్లు ఇవ్వడం లేదు అనే ప్రశ్న న్యాయంగానే కనిపించొచ్చు. కానీ దగ్గరగా పరిశీలిస్తే ఆ వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం వల్ల ఆతని వైయ్యక్తిక బాధకు సామాజిక కోణాన్ని ఆపాదించాడని అర్థమవుతుంది. ఫలానా సంకలనంలో నా కవిత, నా కథ ఎందుకు రాలేదు, ఫలానా అవార్డు నాకెందుకు రాలేదు అని ప్రశ్నించే బదులు  ఏదో ఒక సామాజిక వివక్షారూపాన్ని ఆపాదించేసుకుని దళితులకు అన్యాయం జరిగిందనో, స్ర్తీలకు అన్యాయం జరిగిందనో, మైనారిటీలకు అన్యాయం జరుగుతుందనో, తెలంగాణకు అన్యాయం జరిగిందనో చర్చను లేవదీసి అవతలివారిని బోనులో నిలబెట్టవచ్చును.
ఎందుకొచ్చిన గొడవ, ఇతని కథ అందులో పడేస్తే పోలా, ఒక అవార్డు ఇతని మొకాన కొడితే పోలా అనే స్థితిని కల్పించవచ్చును. వివక్షకు గురైన శ్రేణుల న్యాయమైన ప్రశ్నలు, ఆందోళనతో పాటే ఆ సమూహ శక్తిని వైయక్తికమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే శక్తులు ఎల్లప్పుడూ ఉంటాయి. అది కేవలం ఈ శ్రేణులకే పరిమితమైనది కాదు  కానీ వైయక్తికమైన ప్రయోజనాలు తీర్చుకోవడానికి న్యాయమైనదిగా కనిపించే సాధారణ అంశాల్ని ముందుపెట్టడమనే పెడధోరణి ఇటీవల పెరిగిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఆ ఊబిలోకి దిగితే బయటపడలేం. ఏదో రకమైన అధికారాన్ని ఆశించని, అధికారంలో ఆనందాన్ని వెతుక్కోని వ్యక్తుల సంఖ్య స్వల్పం. అధికారం లేని రాజకీయాలు ఆశావహంగా కనిపించనపుడు ఆ రాజకీయాలతో ముడిపడిన వారిలో సైతం మార్పు కనిపిస్తుంది.
Book and internet
అదెలాగూ సాధ్యం కాదు కాబట్టి ఉన్న రాజకీయాల్లో అధికారం కోసం పోటీపడదాం అనే ధోరణి తొంగి చూస్తుంది. అది కొన్ని సందర్భాల్లో పచ్చిగా కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో సోఫిస్టికేటెడ్‌గా కనిపిస్తుంది. మళ్లీ స్థల నియంత్రణ దగ్గరకు వద్దాం. నియంత్రణ అనేది  లేకపోతే ఏం జరుగుతుందో వెబ్‌మ్యాగజైన్లలో వచ్చే కొన్ని కథలను చూస్తే అర్థమవుతుంది. ఎటు తీసుకుపోతున్నారో తెలీని సుదీర్ఘప్రయాణాలు కనిపిస్తున్నాయి. చెలాన్ని ఇతరత్రా విషయాల్లో గుర్తుచేసుకుందాం కానీ ఇకానమీ ఆఫ్‌ వర్డ్స్‌ అండ్‌ థాట్స్ మాత్రం మర్చిపోదాం అనే వారు కనిపిస్తున్నారు.
వెబ్‌ అనేది బ్లాక్‌హోల్‌ అని తెలిశాక ఎంతైనా అందులో తోసెయ్యొచ్చు అనిపిస్తుంది. ఏం ఎడిట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. దానికితోడు సైబర్‌ ప్రపంచం లైకుల మీద కామెంట్లమీద నడుస్తుంది. సీరియస్‌ విమర్శకు అవకాశం తక్కువ. బాగుందండీ, చాలా బాగుందండీ దగ్గర్నుంచి అద్భుతమండీ వరకూ  భుజతాడనాలు ఎక్కువ. రచనకు అప్పటికప్పుడు స్పందన చూసుకొని ఆ చర్చలో భాగం పంచుకోవడమనే అవకాశము ఇందులోని సానుకూల కోణమైతే మన ఉనికి బయటపడకుండా కామెంట్‌ విసరగలిగే అవకాశం ఇందులోని లోపం. అజ్ఞాతంలో మనిషి స్వైరుడయ్యే అవకాశం ఎక్కువ. ఇది ఆరోగ్యకరమైన చర్చను పక్కదారిపట్టించే ప్రమాదం ఉంటుంది.
సాధారణంగా తాను రాసిన ప్రతివాక్యం సామాజిక శాసనం వంటి భావన కొందరు రచయితల్లో ఉంటుంది. పత్రికల్లో సాహిత్య పేజీల నిర్వాహకులు అపుడపుడు ఈ గాలిబుడగను సూదితో గుచ్చేవాళ్లు. వెబ్‌ మ్యాగజైన్ల నిర్వాహకులు తమ సాహిత్య సామాజిక ఆసక్తికొద్దీ శ్రమను వెచ్చించువారు. స్వయంగా సాహిత్యజీవులు. మార్పులు సూచించో, తిరస్కరించో రచయిత మోరల్‌ను దెబ్బతీయడమెందుకులే అనే సంశయం ఉండొచ్చు. అందులోనూ పత్రికల్లో అయితే స్థలాభావం పేరుతో అయినా ఎడిటింగ్‌ సూచించవచ్చు. కానీ ఇక్కడ స్థలాభావం అని చెప్సడానికి లేదు. ఫలితం, భుజబలం బుధ్దిబలాన్ని అధిగమించిన కథలు కనిపిస్తున్నాయి.
నిజమే, దిన పత్రికల సాహిత్యపేజీల నిర్వాహకుల్లో కొందరు దాన్ని బెత్తంగానో, కిరీటంగానో భావించి ఉండొచ్చు. ఏదో ఒక అధికార సాధనంగా మార్చుకుని ఉండొచ్చును. కానీ వ్యక్తులను పక్కనబెడితే స్థలనియంత్రణ అనేది రచయితలోని ఎడిటర్‌ను వెలికి తీసేందుకు ఉపయోగపడేది. సాంద్రతకు ఉపయోగపడేది. గాఢతకు ఉపయోగపడేది. స్వయం నియంత్రణ ఉన్న రచయిత కథ వేరు. ఖదీర్‌ తన కథను ఎన్నిసార్లు పునర్లిఖిస్తాడో ఎంతగా శ్రమిస్తాడో నాకు బాగా తెలుసు. తన శక్తి కథకు తప్ప మరోదానికి పెట్టాల్సిన అవసరం లేనంతగా పరిసరాలను ఏర్పరుచుకుంటాడు కూడా. అతన్ని దగ్గరగా చూసినందువల్ల సాధికారంగా ఉటంకిస్తున్నాను తప్పితే అతనొక్కడే అని కాదు. సీనియర్‌ కథకులు చాలామందిలో మనకు వారు పడిన శ్రమ అర్థమవుతుంది. ఆయా కథల మీద మనకు వేరే రకమైన విమర్శలు ఏవైనా ఉండొచ్చును కానీ వారు కథను బాధ్యతగా తీసుకుంటారు.  ఇపుడది కాస్తలోటుగా అనిపిస్తున్నది.  రాసిన ఇంకు ఆరకముందే అచ్చులో పడితే బాగుంటుందనే ఆత్రం పెరిగినట్టు అనిపిస్తోంది.
వెబ్‌ పత్రికలు చేసిన మరోమేలు భాషకు సంబంధించింది. ఆయా సందర్భాల్లో పాత్రలు పలికే సంభాషణల్ని కూడా యథాతథంగా రాయకుండా బూతుఫోబియా అడ్డుపడేది. మన సాహిత్య సంప్రదాయంలో ఇదొక అనవసరమైన అడ్డుగోడ. ఈ గోడను బద్దలు కొట్టిన రచనలు అరుదు. వసంతగీతం లాంటివి ఒకటో రెండో చెప్పుకోవచ్చు.పత్రికా మర్యాదలయితే చాలానే ఉండేవి. అతను ఆమెలోకి ప్రవేశించాడు అని మాగజైన్‌ మధ్యపేజీలో రాయొచ్చు. కానీ లంజె అని అతను తిట్టిన మాట మాత్రం వాడరాదు. బూతును భావనగా కాకుండా భాషకు పరిమితం చేసే వ్యవహారం మనకు ఎక్కువ.  ఎబికె లాంటివాడు దాన్ని బద్దలు చేసి పచ్చనాకు సాక్షిగా కొత్తగాలికి తెరలేపినా అది తెలుగు సమాజానికి నామిని అనే అద్భుతమైన రచయితను ఇచ్చింది కానీ పత్రికల్లో ఒక ధోరణిగా స్థిరపడలేదు.
గతంలో ఉమామహేశ్వరరావు ఆంధ్రజ్యోతి సండే ఇన్‌ చార్జిగా ఉన్నపుడు గాడిద ప్రస్తావనతో ఉన్న చిన్న కథను యథాతథంగా అచ్చేస్తే పత్రికలో పనిచేసే మర్యాదస్తులైన సీనియర్‌ ఉద్యోగులు ఎంత గొడవ చేశారో ఇంకా గుర్తుంది. నేను ఒక పద్యంలో కొన్ని హాండ్‌ షేకులను బురదమట్టలతోనూ, రత్యానంతర శిశ్నంతోనూ పోలిస్తే అదే సీనియర్లు ఎంత గొడవ చేశారో గుర్తుంది. ఇపుడు వెబ్‌ మ్యాగజైన్ల వల్ల ఆ మర్యాదలు తొలిగిపోయే అవకాశం వచ్చింది.
ఐరోపా, పశ్చిమదేశాల్లోని సీరియస్‌ రచయితలు సైతం ఫలానా ఫలానా వ్యక్తీకరణలను యధేచ్ఛగా వాడుతున్నారు. మనం ఎందుకు సంభాషణల్లో ఇంత మర్యాదగా అసహజంగా వ్యవహరిస్తున్నాం అనే వారు పెరిగారు.ఈ ఎరుక శుభసూచకం. అది మరీ ఫ్యాషన్‌గా మారిపోయి దానికదే ఒక విలువగా మారిపోతే ప్రమాదమనుకోండి. అది వేరే విషయం. సాధారణంగా సీరియస్‌ రచయితలు రచన తర్వాత వచ్చే స్పందన కంటే రచనను ఎక్కువ ప్రేమించారు  అనే వాస్తవాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే మనం ఒక పద్యమో, కథో అచ్చేశామనుకోండి. మనకు పరిచయమున్న వారు, లేనివారు  ఓ యాభై మంది లైక్‌ చేస్తారు.  బాగుందండీ అనేస్తారు. పత్రికలో ఫోన్‌ నెంబర్‌ ఇచ్చామనుకోండి. ఓ వందమంది ఫోన్‌ చేసి బ్రహ్మండమండీ అనేస్తారు. నెట్‌లో అయితే ప్రశంస ఒక క్లిక్‌ దూరం కాబట్టి చేసేస్తారు. అదే నిజమైన స్పందన అని తృప్తి పడితే బోల్తా పడే ప్రమాదం ఉంది. అక్కడే ఆగిపోయే ప్రమాదం ఉంది.
(మే 7, 2014న సారంగలో 'సంవేదన' కాలమ్‌ )