Friday 14 February 2014

అరవింద్‌ కేజ్రీవాల్‌ దేనికి సంకేతం?

అవినీతి లేని రాజకీయ నాయకులు ఈ దేశానికి కొత్త కాదు. గాంధీ, నెహ్రూ, శాస్ర్తి, మురార్జీ దేశాయ్‌ దాకా వెళ్లనక్కర్లేదు. వర్తమానంలోనూ ఉన్నారు. త్రిపుర నుంచి ఒరిస్సాదాకా తూరుపు ముఖ్యమంత్రులందరూ వ్యక్తిగతంగా మచ్చలేనివాళ్లే. మధ్యభారతం నిండా వాళ్లే. 'చావల్‌బాబా' రమణ్‌సింగ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లకు ఆ మచ్చ లేదు. చివరాకరికి మోదీని కూడా పాపులర్‌ అర్థంలో అవినీతిపరుడని అయితే అనలేం. మరి కేజ్రీవాల్‌ ఇంత క్రేజీగా ఎందుకు మారారు? బుగ్గకారు వద్దనుకునే వారు, అట్టహాసపు భద్రతలు కోరుకోని వారు ఈ దేశానికి కొత్త కాదు.  చైనా యుద్ధంలో ఓటమి తర్వాత జనం నెహ్రూను చుట్టుముట్టి దాదాపు దాడిచేసినంత పనిచేసిన దృశ్యాన్ని, ఆ ఫొటోను ఒకసారి గుర్తు చేసుకోండి. మొన్నమొన్న రక్షణ మంత్రికి భద్రత అవసరం అని ఇంటిముందు సెక్యూరిటీ గేట్‌ పెడితే ఫెర్నాండెజ్‌ విసురుగా దాన్ని విసిరి బయటవేసిన దృశ్యం గుర్తు చేసుకోండి. ఆ చివర ఎర్రని మాణిక్‌ సర్కారు నుంచి ఈ చివర కాషాయ పారికర్‌ దాకా చాలామంది హడావుడికి దూరంగా ఉండాలని కోరుకునేవారే! సింప్లిసిటీనే వాల్యూ అయితే మమతా బెనర్జీని విస్మరించగలమా! మరి కేజ్రీవాల్‌ ఇంత క్రేజీగా ఎందుకు మారారు? పాలనలోకి వచ్చిన వెంటనే ప్రజోపయోగ పథకాలను అమలు చేసినవారు ఈ దేశానికి కొత్తకాదు. ఎక్కడిదాకానో పోనక్కర్లేదు. ఇందులో మనమే ముందు! ఎమ్జీఆర్‌, ఆయన బాటలో ఎన్టీఆర్‌ అమలు చేసిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, వైఎస్‌ చేపట్టిన ఉచితవిద్యుత్, ఫీజ్‌ రీఎంబర్స్‌మెంట్‌ పథకాలు ఇవాళ కేజ్రీవాల్‌ చేపట్టిన బిజిలీ, పానీ పథకాల కంటే విస్తృతమైనవి. ఒక అర్ఠంలో విప్లవాత్మకమైనవి కూడా!మరి కేజ్రీవాల్‌ ఎందుకింత క్రేజీగా మారారు?

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒక చిత్రమైన కాంబినేషన్‌. ఆ కాంబినేషన్ పేరు భిన్నత్వం‌. ఏదో ఒక అంశంలో కాదు. ఆ భిన్నత్వం అన్నింటా కనిపిస్తుంది. మేం సంప్రదాయ రాజకీయ నాయకుల కంటే భిన్నమైనవాళ్లం అనేది ఆమ్‌ ఆద్మీ అస్ర్తం. సంప్రదాయ రాజకీయాల్లో ఉండే అవినీతికి భిన్నం. సంప్రదాయ రాజకీయాల్లో ఉండే హడావుడికి భిన్నం. ప్రజలతో సంబంధాల్లో భిన్నం. వేషభాషల్లో, వ్యవహారశైలిలో భిన్నం. అరవింద్‌ ఖద్దరు మాత్రమే కాదు, బ్రాండెడ్‌ బట్టలు కూడా వేయరు. అన్నిరకాలుగా బ్రాండ్‌ అంబాసిడర్ ఆఫ్‌ అన్‌బ్రాండెడ్‌ లైఫ్‌ అనదగిన మనిషిలాగా ఉంటారు. ఎక్కడా నాయకుడు అనే ఇమేజ్‌లోకి ఒదగడు. మన పక్కింట్లో స్కూటర్‌ మీద క్యారేజ్‌ పెట్టుకుని ఆపీస్‌కి వెళ్లే ఉద్యోగి వలె ఉంటారు. అమోల్‌ పాలేకర్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అనేది సింబాలిజం. తెలుగు సినిమా వారి లాగా కేవలం మేం డిఫరెంట్ అని అంటేనే జనం నమ్ముతారా! ఇక్కడ ఆయన వెనుక ఉన్న, ఆయనను అందలమెక్కించిన రాజకీయాల గురించి కూడా మాట్లాడుకోవాలి.
అన్నా హజారే లోక్‌పాల్‌ ఉద్యమం కేజ్రీవాల్‌ను ఢిల్లీ వాసులకు పరిచయం  చేసిన మాట వాస్తవమే. నాయకుడిగా జనంలోకి వెళ్లడానికి అవసరమైన ముఖపరిచయం దాంతో ఆయనకు లభించిన మాట వాస్తవమే. కానీ ఈ పాక్షిక సత్యాలేవీ కేజ్రీవాల్‌ పరిణామాన్ని పట్టించలేవు. వ్యక్తి కేంద్రకమైన విశ్లేషణలు పరిణామాన్ని అర్థవంతంగా వివరించలేవు. ఏఏ సమూహాలు తమ నాయకుడిగా కేజ్రీవాల్‌ను చూస్తున్నాయి, ఎందుకు చూస్తున్నాయి అనేది ప్రధానమైన అంశం. 1990ల తర్వాత మధ్యతరగతి తన సైజ్‌ పెంచుకుంటూనే ప్రివిలేజెస్‌ కోల్పోతూ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు పోయాక రికమెండేషన్ అనే రూపం అంతరిస్తూ వస్తున్నది. ఎమ్మెల్యేల ఇంటి ముందు ఇంతకుముందులాగా క్యూలు కట్టడం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దైనందిన సంబంధాలు తగ్గాక ఇతరత్రా చిన్నచిన్న రూపాల్లోని అవినీతి తగ్గిపోతూ వస్తున్నది.  ఓ వందో రెండొందలో ఇచ్చి పనిచేయించుకోగలిగిన రూపాలు ఇపుడు బాగా తగ్గిపోయాయి. జనన, మరణ పత్రాలు, ఓటర్‌, ఆధార్‌ కార్డుల లాంటి వ్యవహరాలు మినహాయిస్తే ఇతరత్రా రూపాల్లో ఇవాళ ప్రభుత్వంతో ప్రజలకు నేరుగా సంబంధాలు లేవు.  సంఖ్య తక్కువున్నపుడే ప్రివిలేజ్‌ పనిచేస్తుంది. సంఖ్యతో పాటు పోటీ పెరిగినపుడు అది ఆర్డర్‌ కోరుకుంటుంది. ఆర్డర్‌ సాంకేతిక రూపంలోకి బదిలీ అయి రైల్వేలో ఇంతకుముందులాగ అవినీతి కనిపించడం లేదని సంబరపడే స్థితి వస్తుంది. గ్యాస్‌ ధరతో పాటు సప్లయ్‌ పెరిగి అందుకోసం కొంతమంది చేతులు తడపాల్సిన స్థితి తప్పిపోతుంది. ప్రభుత్వ రంగంలోంచి ఎదిగిన మధ్యతరగతికి ప్రైవేట్‌ రంగంలోంచి ఎదిగిన మధ్యతరగతికి తేడా ఉంటుంది. 90ల తర్వాత పెరిగిన మధ్యతరగతి చాలా తొందరగా టాక్స్‌పేయర్‌ భాష నేర్చేసుకుంటుంది. తన రక్తమాంసాలు పిండి కట్టించుకుంటున్న పన్నులు బడా పారిశ్రామిక వేత్తల బొక్కసాలకు అక్రమంగా తరలిపోతున్నాయనే బాధ మధ్యతరగతికి ఇటీవల తీవ్రంగా పెరిగింది. అదే సమయంలో పాలకులు అడ్డదిడ్డంగా పేదలకు, రైతులకు సబ్సిడీలు ఇవ్వడం వల్ల డబ్బు వృధా అవుతున్నదనే బాధ కూడా పెరిగింది. ఈ రెండు బాధలూ మన మీడియాలో ప్రతిరోజూ డిజిటల్‌ డాల్బీ సౌండ్‌లో వినిపిస్తా ఉంటాయి. వారి బాధను తమ బాధగా మార్చుకున్న మీడియా ఈరెండు విషయాల్లోనూ దూకుడుగా ఉంటుంది. అదే సమయంలో మొదటి బాధ మరీ ఎక్కువైతే అభివృద్ధి కుంటుబడే ప్రమాదముందనే వాదనను కొందరి నోటి గుండా వినిపిస్తూ ఉంటుంది. రెండో బాధను నేరుగా వ్యక్తీకరిస్తే పేదలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం గొంతు మార్చి సబ్సిడీలు లబ్ధిదారులకు చేరడం లేదని పక్కదారి పడుతున్నాయని మాట్లాడుతుంది. రెండువైపులా ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్న పాలకులు కూడా అటూ ఇటూ బ్యాలెన్స్‌ చేయలేక అందర్నీ సంతృప్తి పరిచడానికి నానా విన్యాసాలు చేస్తున్నారు. ప్రకృతి వనరులను తమ క్లాస్‌కు కట్టబెట్టడంలోని అవినీతి బయటపడినపుడు కొంతమంది హైప్రొఫైల్‌ వ్యక్తులను జైళ్లలో వేయడం దగ్గర్నుంచి ఇటు ఆహార భద్రతా పథకం లాంటి పథకాలను పేదలకోసం వండి వడ్డించడం దాకా అటూ ఇటూ దరువేస్తూనే ఉన్నారు. అవినీతి ఆరోపణలకు భయపడి ప్రాజెక్టుల విషయంలో పట్టిపట్టి వ్యవహరించడం వల్ల అభివృద్ధి, దానికి సంకేతమైన జిడిపి దెబ్బతిన్నాయనే వాదనతో తలలు పట్టుకుంటూనే ఉన్నారు. మధ్యతరగతిలోనూ ఆ భావన రకరకాలుగా ఉంది. పాలన కనుక సక్రమంగా చేయగలిగితే రంధ్రాలను పూడ్చగలిగితే అభివృద్ధి వేగం కొనసాగిస్తూనే టాక్స్‌ మనీని సద్వినయోగం చేయొచ్చనే భావనను కొంతకాలంగా పెంచుతూ వచ్చారు. డెలివరీ సిస్టమ్స్‌లో పందికొక్కులను దూరంగా ఉంచగలిగితే న్యాయం జరుగుతుందనే భావన బలపడింది.  ఇది కాకుండా ఇంకో ఆవేదన ఉంది. 90ల తర్వాత రాజకీయాలు మధ్యతరగతికి పూర్తి దూరంగా వెళ్లపోయాయి. పేదరికం కొంత తగ్గించి జనాల కొనుగోలు శక్తి పెంచగలిగినప్పటికీ కొత్త ఆర్థిక విధానాలు అసమానతలను అన్ని రకాలుగా అమానవీయంగా పెంచేశాయి. ముఖ్యంగా రాజకీయ తరగతి పూర్తి ప్రత్యేక తరగతిగా మారిపోయింది. వ్యాపారాలకు రాజకీయాలకు తేడా చెరిగిపోయింది. తమ తమ వ్యాపార సామ్రాజ్యాలను పెంచుకోవడానికి అధికారాన్ని సాధనంగా వాడుకునే ధోరణి పెరిగింది. రాజకీయాల్లో అవినీతి ఉండొద్దని అంతా మాట్లాడతారు గానీ రాజకీయ నేతలు వ్యాపారాలు చేయకూడదని ఒక్క నేతా మాట్లాడలేరు. దిగ్విజయ్‌ సింగ్ ఆ మధ్య అలాంటి మాట గొణిగినట్టుగా అన్నారు కానీ ఆ తర్వాత దాన్ని పట్టించుకున్నవారు లేరు. అంతగా రాజకీయాలు వ్యాపారాలు కలగలిసి పోయాయి. సామాన్యుడికి పూర్తి దూరంగా వెళ్లిపోయాయి. వ్యక్తిగత నిజాయితీ వేరే. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన నాయకుల్లో నిజాయితీపరులు ఇప్పటికీ ఉన్నారు. సమూహ లక్షణం ముందు వ్యక్తుల మంచిచెడ్డలు పనిచేయవు. ఇంతకుముందు విద్యార్థి సంఘాల ఎన్నికలనుంచో ట్రేట్‌ యూనియన్లనుంచో కొద్ది మందైనా మధ్యతరగతి రావడానికి ఆస్కారముండేది. ఇవాళ ఎన్నికల ఖర్చు, అక్కడున్న హడావుడి మధ్యతరగతి అటువైపు తొంగి చూడడానికే ఆస్కారం లేకుండా చేశాయి. ఓటు వేయడం మినహాయిస్తే ఇతరత్రా రూపాల్లో పాలనా పరంగా తన గొంతు వినిపించే అవకాశాన్ని మధ్యతరగతి పూర్తిగా కోల్పోయింది. ఈ కోపం  మధ్యతరగతికి తీవ్రంగా ఉంది. ఇటువంటి సమయంలో జిందా తిలిస్మాత్‌ లాగా వచ్చినవాడు అరవింద్‌ కేజ్రీవాల్. వాళ్ల ఆశలకు రూపమిచ్చినవాడు అరవింద్‌ కేజ్రీవాల్‌. ఈ పరిస్థితి ఇవాళ ఇప్పటికిప్పుడు తయారైందేమీ కాదు. చాలాకాలంగా మధ్యతరగతిలో ఇటువంటి అభిప్రాయాలు పెరుగుతూ వస్తున్నాయి. కాకపోతే ఏదైనా ప్రయోగం జరిగినా ఇది అయ్యేదికాదు, పొయ్యేది కాదు అనేభావన ఉంటుంది. ఆ ముద్ర పడకుండా ఇది అవగలదు అనే నమ్మకాన్ని కలిగించడంలో ఆమ్‌ ఆద్మీ సక్సెస్‌ దాగుంది. మైగ్రేంట్‌ మిడిల్‌క్లాస్‌ కేంద్రీకృతమై ఉండే ఢిల్లీ, టీవీ కెమెరాలు-గొట్టాల ప్రభావం ఎక్కువగాఉండే ఢిల్లీ అతనికి ఫెర్టైల్‌ గ్రౌండ్‌ లాగా ఉపయోగపడింది.
పూర్తిగా మధ్యతరగతేనా! బస్తీలు కూడా అతనికి ఓటేశాయి కదా, దాని సంగతేమిటి అనే ప్రశ్న వస్తుంది. అక్కడ ఆయన వ్యవహారశైలి, డ్రెస్‌, మొహల్లా మీటింగ్స్ అన్నీ ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు. ఆయన టక్కు టెక్కుగా మొకం గంభీరంగా పెట్టుకుని నేను చెపుతున్నాను, మీరు వినాలి అనే బాపతు కాదు. డబ్బులోనూ అధికారంలోనూ తనకంటే పెద్దవారితో వ్యవహరించేపుడు దూకుడుగా కనిపిస్తాడు. ఉపన్యాసకుడిగా కనిపిస్తాడు. బస్తీ సమావేశాల్లో వినయంగా కనిపిస్తాడు. శ్రోతగా కనిపిస్తాడు. మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ ప్రచారాన్ని గమనిస్తే కనిపించే అంశమిది. ఎన్నికల గుర్తు చీపురు కూడా ఆమ్‌ఆద్మీకి దగ్గరకావడానికి తనవంతు సాయం చేసింది.  పైపెచ్చు కరెంట్‌ చార్జీలు సగానికి సగం తగ్గించడం, అన్ని ఇళ్లకు 666 లీటర్ల నీటిని సప్లయ్‌ చేయడం అనే మాటలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీ పేదలను ఆకర్షించగలిగిన వ్యవహారాలు. ఇతను 'మేధావి' అనే ముద్ర పడకుండా చూసుకున్నారు. మనకోసం రోడ్డెక్కే వ్యక్తి, మన కోసం పెద్దపెద్దోళ్లను ఎంతమాటైనా అనగలిగిన వ్యక్తి అనే రెబెల్‌ ఇమేజ్‌ని సంపాదించుకున్నారు. ఇది చిన్నవిషయమేమీ కాదు. కేంద్ర ప్రభుత్వ గందరగోళ విధానాల వల్ల అటూ ఇటూ విసిగిపోయి పొలిటికల్‌ క్లాస్‌ మీద పెంచుకున్న కోపానికి ఒక రూపునిచ్చారు. పొలిటికల్‌ క్లాస్ లోనికి ఎంట్రీపాయింట్‌ లేక మధ్యతరగతి పడుతున్న వేదనకు సమాధానంలాగా ముందుకొచ్చారు. ఆయనలో లేని కమ్యూనిస్టును చూసి తిట్టిపోసేవారైనా, ఆ తానులో ముక్కే అనే తేల్చపడేసేవారైనా పరిస్థితిని పూర్తిగా అర్థంచేసుకుని తప్పులు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు కాదు. పొలిటికల్‌క్లాస్‌కి ఆయనొక హెచ్చరిక. కొత్త ఆర్థిక వ్యవస్థ భారత్ లో బలపడిందని కొన్ని ప్రాంతాల్లో దాని తాలూకు భావజాలం పూర్తి స్తాయిలో ఆవరించి అది ఆర్డర్‌ కోసం వెతుక్కుంటోందని అనుకోవచ్చు. మార్కెట్‌ విస్తరణకు కూడా కొన్ని సమయాల్లో ఆర్డర్‌ అవసరమవుతుంది. అవినీతి అనేదే దానికి అడ్డుకట్టగా మారితే దాని ప్రదర్శిత రూపాలను రద్దు చేసుకోవడానికి అది సంశయించదు. స్థూలమైన అర్థంలో ఉత్పత్తి మెరుగుపడుతున్నప్పటికీ సప్లయ్‌ చెయిన్స్‌, డెలివరీ సిస్టమ్స్‌ మరీ నాసిరకంగా ఉన్న తరుణాన జయప్రకాశ్‌ నారాయణ్‌ సంపూర్ణక్రాంతితో ముందుకొచ్చారు. ఉత్పత్తితో పాటు సప్లయ్‌చెయిన్స్‌ కూడా మెరుగుపడి డెలివరీ-డిస్ర్టిబ్యూషన్‌ ఘోరంగా ఉన్న తరుణాన అరవింద్‌ కేజ్రీవాల్‌ అవతరించారు. ఒక్కముక్కలో చెప్పాలంటే కాలం కడుపుతో ఉండి కేజ్రీవాల్‌ను కన్నది. ఈ పార్లమెంటరీ తిరుగుబాటు దారుడి అవతారం ఎంతకాలం ఉంటుంది అనేది వేరే సంగతి. మేం అన్నింటిలోనూ భిన్నం అనే ఇమేజ్‌ని అరవింద్‌ బృందం ఎంతకాలం కాపాడుకోగలదు అనేది ఇపుడు ఆసక్తికరమైన అంశం.
జి ఎస్‌ రామ్మోహన్‌(ఆంధ్రజ్యోతి-8-1-2014)