Thursday 22 August 2013

దృష్టిలోపంతో దారితప్పిన కథలు

ఖదీర్‌ వాక్యం డ్రైవింగ్‌ తెలిసినవాడు పద్దతిగా వాహనం నడుపుతున్నట్టు ఉంటుంది అంటాడు పూడూరి రాజిరెడ్డి. గేర్‌ ఎక్కడ మార్చాలో ఖదీర్‌కు బాగా తెలుసు. ఇపుడు బియాండ్‌ కాఫీతో అతను చేసిందదే. ఇంతకుముందే కింద నేల ఉందితో అతను హైజంప్‌ చేశాడు. ఇపుడు ఏకంగా పోల్‌వాల్ట్‌. అందులో ఎంత సఫలీకృతుడయ్యాడనేది తర్వాత చూద్దాం. పాతను వదిలేసుకుని కొత్త ముఖమైతే తొడుక్కున్నాడు. బహుశా దర్గామిట్ట నాటి పాత అభిమానులకు కూడా వదిలేసుకునేందుకు సిద్ధపడ్డాడని అర్థమవుతోంది. రచయితతో పాటు ప్రయాణం చేసే వారి కథ వేరే.
        దర్గామిట్ట కథలను చాలామంది ప్రేమించారు. బహుశా నామినిని మించి ప్రేమించారేమో కూడా. ఆ కథల్లోనూ ఆ ప్రేమలోనూ చిన్న ఇబ్బంది ఉంది. పచ్చనాకు సాక్షిగా అయినా, సినబ్బ కథలైనా, మిట్టూరోడి కథలైనా నామిని కథల్లో పెయిన్‌ ఉంటుంది. పైకి తమాస మాటల్లాగే కనిపిస్తాయి. లోపలికి పోయే కొద్దీ అంతులేని దుఖ్ఖం పొంగుకొస్తుంది.  " మా కన్నెబావ రామభక్తి'' గుర్తొచ్చినా, "నా రెక్కలున్నంత కాలం'' గుర్తొచ్చినా ఇప్పటికీ లోలోపల మెలిపెడుతుంది.  అవి నీడ కరవైన వారి ఏడుపు పాటలు. నామినిలో ఉన్న సొగసు చాలావరకు ఖదీర్‌ కథల్లో ఉంటుంది కానీ ఈ పెయిన్‌ తక్కువ.  పేదరికాన్ని సెలబ్రేట్‌ చేసినట్టుంటాయి దర్గామిట్ట కథలు. తమకు తెలీని జీవితాన్ని  కులీనులు నోరెళ్లబెట్టి చూసి అరె, భలే రాశాడే అనిపించేట్టు ఉంటాయి. హైదరాబాద్‌లో శిల్పారామం పోయి అక్కడ గుడిసెలు, రోకళ్లు, రోళ్లు, ఎద్దుల బండ్లు చూసి ముచ్చడపడతారే, అలా! కందిపచ్చడి, గుమ్మడిపులుసుతో పాటు ఆ కథలను కూడా ఇష్టపడడంలో ఇబ్బంది ఉండదు.  ఆ జీవితంతో సంబంధంలేని కులీనులకు, దాటి వచ్చిన దారిద్ర్యాన్ని మురిపెంగా మాత్రమే గుర్తుచేసుకునేవారికి ఆ కథలు మంచి వినోదాన్ని కలిగించగలవు. మనల్ని ప్రశ్నించని ఇబ్బంది పెట్టని వినోదం అలాంటివారికి బాగానే ఉంటుంది. నామినిని ఖదీర్‌ను విభజించే ప్రధానమైన రేఖ ఇదే. పాపులర్‌ ఫేమస్‌ రెండూ ఒకేలా కనిపించినంత మాత్రాన తేడా లేదనగలమా!


      అయితే దర్గామిట్ట నుంచి చాలా ప్రయాణమే చేశాడు ఖదీర్‌. పెండెం సోడా సెంటర్‌ లాంటి ప్రాపగాండా కథలను దాటుకుని చాలాకాలం క్రితమే కిందనేల ఉంది అని భూమార్గం పట్టాడు. ఈ ప్రయాణం పొడవునా జీవితంలోనూ అధ్యయనంలోనూ కొత్త ఎక్స్‌పోజర్‌ చాలానే వచ్చి ఉండాలి. అదంతా ఇపుడు బియాండ్‌ కాఫీ రూపంలో మన ముందుకొచ్చింది. ఏ లాట్‌ కెన్‌ హ్యాపెన్‌ ఓవర్‌ కాఫీ అంటుంది కాఫీడే. నువ్వు తీసుకునే పదార్థం కంటే దాని చుట్టూ ఉన్న వాతావరణం ఇతరత్రా నీకు 'ఉపయోగపడే' పద్ధతుల గురించి చెపుతుందా స్లోగన్‌. దటీజ్‌ బియాండ్ కాఫీ. మీరు హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దాటాక పైన సింపుల్‌గా కనిపించి లోపల అడుగుపెడితే విస్తుపోయే ప్రపంచాన్ని చూపించే బియాండ్‌ కాఫీ షాప్‌ ఎలాంటిదో ఈ కథలూ అలాంటివే. ఇది మనబోటి వాళ్లకు పరిచయంలేని ప్రపంచం అని రాస్తే ఆత్మవంచన అవుతుంది. ముఖ్యంగా మనం పట్టణజీవులమైతే! మనం చూడదల్చుకోకుండా మొకం తిప్పేసుకుని పోతే తప్ప ఈ జీవితం పట్టణవాసులకు తెలీకుండా పోయే అవకాశం లేదు. మానవజీవితంలో సెక్స్‌ లేమి లేదా దాని యావ సృష్టించగల విలయాన్ని ప్రధానంగా తీసుకుని రాసిన కథలు అనిపిస్తుంది. అందులోనూ స్ర్తీ కేంద్రకంగా రాసిన కథలు. బహుశా కొంతమంది అర్బన్‌ మహిళల వల్నర్‌బిలిటీని కూడా చిత్రించిన కథలు. డబ్బూదస్కానికి లోటు లేని వారి జీవితాల్లో ఇతరత్రా ఉండే సంక్షోభాలు.  "అన్నీ ఉండడం కూడా శిక్షేనే'' అనుకునే వారి జీవితాలు. ఏది రాసినా దానికి సంబంధించిన ఆవరణాన్ని, భాషను పట్టుకోవడంలో ఖదీర్‌ గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అంతేకాదు. అక్షరాలను దృశ్యాలుగా మార్చగలిగిన శక్తి గలిగిన కొద్దిమంది రచయితల్లో ఖదీర్‌ ఒకడు.
      "తీరుబడికి స్ర్తీత్వం తోడైతే ఆ శాపం రెట్టింపై అది ఆ పాత్రనే కాకుండా ఇతరులను కూడా ఎలా పీడిస్తుందో ఖదీర్‌బాబు పసికట్టాడు" అని ముందుమాటలో అంచనావేశారు అన్నపనేని గాంధీగారు. మూలుగుతున్న కోట్లరూపాయలు కొడుకు మగతనాన్ని దొంగిలిస్తే డ్రైవర్‌నో మరొకర్నో 'తగులుకుని' ఎవర్నీ పూచికపుల్ల చేయకుండా చులకనగా చూసే కోడలి 'పొగరు'ను మంత్రతంత్రాలతో అణచివేయాలని చూసే తల్లి తాపత్రయం, భర్త తాగుడుకు బానిసై తనను పట్టించుకోకపోవడమే కాకుండా పదే పదే చికాకులు తెస్తూ ఉంటే ఆ ఫ్రస్ర్టేషన్‌ని మోసుకుంటూ తిరిగే ఒక ఇల్లాలి వేదన, భర్త ఆఫీసుకు అంకితమైపోగా  చిన్నపుడు ప్రతి చిన్నదానికి తనమీదే ఆధారపడే పిల్లలు ఇపుడు నీకేం తెలీదు పోమ్మా అని దులిపేసుకుని పోతుంటే  లోలోపల రగిలి రగిలి వాళ్లనూ వీళ్లనూ ఫోన్‌లో వేపుకు తినే ఇల్లాలు...ఇదిగో ఇలాంటి వారి కథలివి. కోడలు అలా చేయడంలో తప్పేముంది, ఆమెనెందుకు విలన్‌ చేయాలి అనే ప్లేన్‌లోకి వెళ్లి పొలిటికల్లీ కరెక్ట్‌నెస్‌ కొలబద్దతో వీటిని చర్చించకుండా కేవలం రచయిత చెప్పదల్చుకున్న కోణానికే పరిమితమవుదాము.
      తొలి మూడు కథలు కథలే. అందులోనూ టాక్‌ టైమ్‌ మంచి కథ. ఆ తర్వాత అవి ఎటోటో వెళ్లిపోయాయి. 'మచ్చ' మంచిదే కానీ చివర్లో రచయిత అలవోకగా  విసిరేసిన ఒక వాక్యం కథను దెబ్బతీసింది. భర్త నిర్లక్ష్యానికి తోడు తీరుబడి ఎక్కువైన మహిళ ఫుడ్‌ వరల్డ్‌లో ఎవరో పొరబాటున తగిలినా రచ్చరచ్చ చేసేస్తుంది. చివర్లో ఆమె ఉద్యోగంలో చేరడంతో కథ సుఖాంతమవుతుంది. అంతకుముందు వచ్చే మచ్చలు ఇపుడు రావు. అంత వరకు బాగా ఉంది. కానీ ఫుడ్‌ వరల్డ్‌లో ఎవరైనా నిజంగానే రాసుకున్నా ఇపుడు ఆమెకేమీ అనిపించడం లేదు అని రచయిత ముక్తాయిస్తాడు. సెన్సిబిల్‌ పాఠకులు గాయపడే ఎక్స్‌ప్రెషన్‌.  ఏకాభిప్రాయం తీసుకుందాం. అది కథ అవుతుందా? రచయిత ఏం చెప్పదల్చుకున్నాడు?  వివాహ బంధం బయట కూడా సెక్స్‌ సంబంధాలు నార్మల్‌ అని చెప్పదల్చుకున్నాడా? మగవాడు వల్నర్‌బుల్‌గా ఉండే ఆడవాళ్లని లోబరుచుకోవడానికి ఎలా ప్రయత్నిస్తాడు అనేది చెప్పదల్చుకున్నాడా? ఇంకోవైపు కథ కథేనా! పట్టాయ ఉంది. ఏముంది అందులో? ఏఏ వీధిలో ఏఏ రూపాల్లో సెక్స్‌ దొరుకుతుంది అని చెప్పాడు. ఆ కథ చదివిన తర్వాత మనకందేదేమిటి?  "పోయే బోడిముండా అన్నాడు నాయుడు ముద్దుముద్దుగా, తాంకూ తాంకూ అంటూ నవ్విందది'' అనే వాక్యాలతో మొదలవుతుంది కధ. నవ్విందది అని రచయిత స్వరంతోనే ఆబ్జెక్టిఫై చేశాక ఇక పాఠకుడు ఏ ఫీల్‌తో కథను కొనసాగిస్తాడు? రచయిత స్వరం మాత్రం రచయితదేనా అని సిద్ధాంతాలను లాగొచ్చు కానీ అవి ఈ కథకు అతకవని జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. కథంతా ఆ బండది, ఈ షార్ట్‌స్కర్ట్‌ది అని శరీరాలను ఆబ్జెక్టిఫై చేస్తూ ఒక చీకటి మూడ్‌ని క్రియేట్‌ చేసి మధ్యలో సడన్‌గా "వీళ్లు కూడా అందరు ఆడపిల్లల్లా పుట్టినవాళ్లే ....మన అమ్మల్లాగా అక్కల్లాగా చెల్లెళ్లలాగా ఈ ప్రపంచం నుంచి వేరే ఏమీ ఆశించకపోయినా కాసింత మంచిని ఆశించినవాళ్లే'' అని ధర్మోపన్యాసం ఇచ్చినంత మాత్రాన పాఠకుడిలో ఉదాత్తభావం వచ్చేయదు. ఖదీర్‌లో స్కీమింగ్‌ ఎక్కువ. అన్ని సందర్భాల్లో అది ఫలితాలనిస్తుందని ఆశించకూడదు. మధ్యలో అక్కడక్కడా ఒకట్రెండు మానవీయ దినుసులు వేశానులే అని సంతృప్తిపడితే కుదరదు. పదార్థ స్వరూపం మారదు. రచయిత హృదయం ఎక్కడ ఉందో తెలియాలి. ఎక్కడ కోపం రావాలో అక్కడ రావాలి. ఎక్కడ ప్రేమించాలో అక్కడ ప్రేమించాలి. అవి మిస్‌ప్లేస్‌ అయితే కథ దెబ్బతింటుంది. ఇక్కడదే జరిగింది.
           పుస్తకానికి టైటిల్‌ బియాండ్ కాఫీ కథ తీసుకుందాం. "ప్రతి మగనాబట్ట ఛాతీ మీద పచ్చబొట్టు పొడవాల్సిన'' నీతి కథ చెప్పిన మరికాసేపటికే ఆ పొందికలోకి ఇమడని డీటైల్స్‌ ఎక్కువైపోయి, చివర్లో క్రైం థ్రిల్లర్‌ అయిపోయి కథ ఎటో పోయింది. తాను కొత్తగా తెలుసుకున్న విషయాలు ఎక్కువగా చెప్పాలన్న  ఆత్రం ఈ కథను దెబ్బతీసిందేమో అనిపిస్తుంది. ఇక  "చిన్నపుట్టుమచ్చ లాంటి బొట్టు" ఉన్న అమ్మాయి కథ చూద్దాం. కథ నుంచి మనకు అందుతున్నదేమిటి? టీ బండి నడుపుకునే  చిన్న అమ్మాయి ఇలాంటి వ్యవహారాల్లో రాటుతేలి ఉంటుందని ఊహించలేదనే ఆశ్చర్యం కనిపిస్తూ ఉంటుంది. అంతే! వాళ్లు అలా రాటుతేలడానికి కారణమైన పాత్రపై సానుభూతి వచ్చేలా కథ నడిపించాక, పన్నెండేళ్ల పాపని అబ్యూజ్‌ చేసిన మనిషి మీద సానుభూతి కలిగేలా కథ నడిపించాక ఇక ఎలాంటి స్పందన ఆశిస్తాం. ఇలాంటి అంశాలు కథాంశంగా తీసుకోవద్దని ఎవరూ అనడం లేదు. చెప్పొచ్చు. కానీ పద్ధతి ఏమిటనేది ప్రశ్న. ఖదీర్‌ పుట్టమచ్చ లాంటి బొట్టున్న అమ్మాయి లాగే నామిని మెడకింద గీతలున్న అమ్మాయి గురించి రాస్తారు. గొడ్లకాసుకునే అమ్మాయి గురించి రాస్తారు. ఊర్లో బొడ్డుతెగిన ప్రతి మగోడు ఆ అమ్మాయి మీద పడడం గురించి రాస్తారు. కానీ చదివాక మనలో కలిగే స్పందన వేరే. ఆ పాప బాధ పాఠకుడి బాధగా మారుతుంది.
        మన దగ్గర చాలామంది రచయితలు ఏం చెప్పదల్చుకున్నారన్నదానిమీద పెట్టినంత దృష్టి దానికి సాహిత్య రూపం ఇవ్వడం మీద పెట్టరు. ఖదీర్‌ కథ వేరు. ఎలా చెప్పాలన్నదానిమీద అతను విపరీతమైన శ్రద్ధ పెడతాడు. కానీ ఏం చెప్పదల్చుకున్నామనేదానిమీద అంత శ్రధ్ధ ఉన్నదా అనేది సందేహం. కొంచెం బరువైన భాషలో చెప్పుకుంటే దృక్పథాన్ని  సరిచూసుకోవాల్సి ఉన్నదేమో అనిపిస్తుంది.
         లైంగిక వాంఛకు సంబంధించిన వివిధ సందర్భాలను వివరించడంలో  నైపుణ్యాన్ని చూపాడు. ఒక కథలో "పురుషుడు స్ర్తీని పట్టుకున్నట్టు" అని రాసి ఆ తర్వాత "వాళ్లు ఇంటినుంచి బయటపడడానికి మరికొంత సమయం పట్టింది" అంటాడు. ఇంకో కథలో "ఆమె కాళ్లు పట్టేది" అంటాడు. "అతను  నిద్రపోకుండానే మెళకువగానే ఉండి వెళ్లేవాడు, ఇపుడు అదేమీ లేదు" అని చెప్తాడు.  "కాసేపు రెస్ట్‌ తీసుకుని వెళ్దామా మేడమ్‌" అని గడుసుగా చెప్పిస్తాడు. వహీద్‌ అనే కథలో  ఆపా అని అంటూనే "చప్టామీద చేపలు పడేసి, ఊగిఊగి తోముతూ ఉండే ఎగిరిపడే అంచు"ను గుర్తుచేసుకునే చిన్నోడి స్థితిని వర్ణిస్తాడు. ఇలా ప్రతికథలోనూ వొడుపు చూపుతాడు.  ఇటువంటి  కథాంశాలని ఎంచుకోవడం కచ్చితంగా అభినందించాల్సిన విషయం. మానవజీవితంలో చాలాప్రాధాన్యమున్న ఈ విషయాన్ని, మన శారీరక మేధో వికాసాలమీద, మన వ్యక్తిత్వంమీద చాలా రకాలుగా ప్రభావం చూపే ఈ విషయాన్ని అసుంట ఉంచడం సరైంది కాదు. కాకపోతే ఎలా చర్చిస్తున్నామనేదే ప్రశ్న.
       తనకు అలవాటైన స్ర్తీ ఎంత ప్రేరేపించినా ఒక సర్దార్జీకి ఒంట్లో వేడిపుట్టకపోవడాన్ని  నేపథ్యంగా తీసుకుని మంటో రాశాడు. దాని పేరు థండా ఘోష్‌. అది చదివితే చల్లగా ఒణికిపోతాం. ఖోల్‌దో అయినా ఇంకోటయినా ఆయన కథలన్నింటా లైంగిక అంశాలే. కానీ అన్నీ మనిషి జంతువుగా మారే క్రమాన్ని బీభత్సంగా చిత్రిస్తాయి. ఎలాంటి స్థితిలో అయినా మనిషితనాన్ని నిలుపుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి. ఫెలిని, గొడార్డ్‌ సినిమాల్లోనూ నగ్నదేహాలు కనిపిస్తాయి. కిస్లోవిస్కీ త్రీకలర్స్‌ ట్రయాలజీలో అయితే చెప్పడానికి లేదు. క్యూబా సినిమాల్లోనూ అంతే. కానీ అంతిమంగా అవి మనలో కలిగించే స్పందన వేరే.  ఖదీర్‌ తొలి మూడు కథలను మినహాయిస్తే  మిగిలిన కథలు అలాంటి చైతన్యాన్ని మనలో కలిగించడం లేదు. సున్నితమైన అంశాలను కథలుగా మలిచేపుడు ఎక్కువ జాగ్రత్త అవసరం. ఒడుపు తెలుసుకదా అని తొందరపడితే నోరు కాలుతుంది, చేయి కాలుతుంది. మొదటి కథల్లో మనకు బాధితులెవరో తెలుస్తుంది. వారిపట్ల ఎంతో కొంత ఆర్తి కలుగుతుంది. తాగుబోతు భర్త పట్టించుకోక ఏ ముచ్చటా తీరక విసుగ్గా ఉన్న మహిళ యాక్సిడెంటల్‌గా కలిసిన, తనపై ఆసక్తి కనపరిచిన కుర్రాడితో సెక్స్‌ తర్వాత స్థిమితపడే స్థితిని అర్థం చేసుకోగలము. ఆ మహిళ ఎర్రేటిక్‌ బిహేవియర్‌ని కూడా అర్థం చేసుకోగలం. చివరకు రచయితలకు ఫోన్లు చేసి భయంకరంగా వేధించే స్ర్తీ పైన కూడా కోపం రాదు.  ఆ తర్వాతి కథల్లోనే బ్యాలెన్స్‌ కుదరలేదు. అందులో చర్చించినవి కూడా అవాస్తవాలేం కాదు. కొంతమంది స్ర్తీలకు సంబంధించినవే అయినా అవి వాస్తవాలే. 'మైనారిటీ' కథలు రాయకూడదని రూలేం లేదు.  భర్త వేళ్లు కోసేసిన భార్య సంగతి పక్కనబెడితే చాలావరకు ఇందులో ఉన్న పాత్రలన్నీ నిజమైనవే. మనకు కనిపించేవే. కాకపోతే ఊరకే సంచలన వాస్తవాలను వెల్లడించడం దానికదే కథ కాదు కదా! ఆ వాస్తవాలకు సాహిత్య రూపమిచ్చేదేదో ఉంటుంది కదా! అది ఆ కథల్లో లోపించింది. కొన్ని కథల్లో వక్రీకరించింది కూడా. ఇంకో విషయం కూడా చెప్పక తప్పదు.  కొద్దిమందికే పరిమితమైన కథలు రాయడం వరకూ ఇబ్బంది లేకపోయినా సమాజంలో  ఒక సమూహం గురించి ఇంకో సమూహంలో ప్రచారంలో ఉండే స్టీరియోటైప్స్‌ని యథాతథంగా సమర్థిస్తున్నామేమో అనేది కూడా రచయిత ఆలోచించుకోవాలి.

        ముందు మాట రాసిన ఇద్దరూ పెద్దమనసుతో రచయితను సానుభూతిగా చూసి ఆశీర్వదించారేమో అనిపిస్తుంది. ముక్తవరం పార్థసారధిగారు "సింగింగ్‌ ఇన్‌ ది పెయిన్‌" అన్నారు. కానీ రచయితతో ఉన్న అనుబంధం వల్ల అతను ఇంకేదో చెప్పడానికి ప్రయత్నించి ఉంటాడు అని అర్థం చేసుకుని పని గట్టుకుని మళ్లీ మళ్లీ అతని కళ్లలోంచి చదివితే తప్ప అందులో నొప్పి ఉందని అనిపించడం లేదు. కథ దానికదిగా అలాంటి స్పందన కలిగించడం లేదు. తొలి మూడు కథలు మినహాయింపు.
      "లోకంలో ఎవరు దేనిమీదైనా కథ రాయొచ్చు. కానీ ఎంత మేరకు సాహిత్యం చేశారనేది మీరు శ్రద్ధగా గమనిస్తారు" అని తనమాటగా ఖదీర్‌ రాశాడు. దీన్నే కొంచెం మార్చి చెప్పుకోవచ్చు. వొడుపు తెలిస్తే లోకంలో ఎవరు దేన్నైనా సాహిత్యం చేయొచ్చు. కానీ మంచి సాహిత్యం చేయడానికి ఒడుపుతో పాటు మరికొన్ని తెలియాలేమో!
జి ఎస్‌ రామ్మోహన్‌
(సారంగ వెబ్‌ మ్యాగజైన్‌(sarangabooks.com/magazine)లో 22.8.2013న ప్రచురితం)