Saturday 11 October 2014

మూలింటామె-నామిని రెండో రాకడ


నామినితో భలే కష్టం. ఆయన పాత్రలు త్వరగా వదిలిపెట్టవు. కథ చదివి పక్కన మడిచిపెట్టేసి మన మానాన మనం వేరే వ్యాపకాల్లోకి వెడదామంటే కుదరదు. కొంత కాలం పాటు అందులోని మనుషులు మనతోపాటు ప్రయాణిస్తూనే ఉంటారు. మన గతంలోకి దూకేసి జ్ఞాపకాల తుట్టెను రేపి డిస్ర్టబ్‌ చేస్తా ఉంటారు. ముఖ్యంగా పనీ పాట ఉన్న కుటుంబాలనుంచి వచ్చినవారికి ఇది బాగా అనుభవంలోకి వస్తుంది. మనం పల్లెటూరినుంచి వచ్చినవారిమే అయితే మూలింటామెను చూసే ఉంటాం. ఒంటరితనంతోనూ కష్టాలతోనూ నలిగిన మనిషిని మనం మన పక్కింట్లోనో ఎదిరింట్లోనో నాలుగిళ్లకావలో చూసే ఉంటాం. కొందరు రచయితలు ఆమెను తమ కథల్లో చిత్రించే ఉంటారు. ఇపుడామెను నామిని కావ్వనాయక చేశారు. ధర్మారావు, దయానిధి పక్కన మాంచి పీటవేసి కూర్చోబెట్టారు.
ఈ నవలలో ప్రధాన పాత్రలు మూడు. భర్తను కోల్పోయి పిల్లలను తన భుజాలమీద పెంచి పెద్దచేసిన మూలింటామె కుంచమమ్మ. ఆమె మనమరాలు రూపావతి. బతకనేర్చిన పందొసంత. కథ సగభాగం మాయాబజార్‌లో పాండవుల మాదిరి రూపావతి చుట్టే తిరుగుతా ఉంటుంది. రూపావతి కనిపించకుండా కథను నడిపిస్తూ ఉంటుంది. మూలింటామె మనమరాలు "కళాయిబోసుకునే మాదిగోడితో" లేచిపోవడం ఆ తర్వాత మూలింటామె కొడుక్కి పందొసంతతో పెళ్లి చేయడం, ఆ మహాతల్లి అతని ముందే వేరే ఆసామితో వ్యవహారం నడుపుతూ కుటుంబాన్ని'అభివృద్ధి' చేయడం పైపైన చూస్తే కనిపించే కథ. ఇందులో ప్రత్యేకత ఏమీలేదు. ఎవరయినా ఈ కథ చెప్పేయొచ్చు. కానీ ఈ మధ్యలో నామిని చిత్రిస్తారే ఆ ప్రపంచం, ఆ విలువల వైవిధ్యమూ, వైరుధ్యమూ, హిప్పోక్రసీ, ఆ మార్పూ ఉందే అది మాత్రం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఎక్కడ ఏహ్యభావం కలిగించాలి,ఎక్కడ ప్రేమ పుట్టించాలి అనే విషయంలో పట్టింపు రచయిత దృక్పధానికి అద్దం పడుతుంది. మనుషుల స్వభావాలను పలుకు తీరులోనూ స్వభావంలోనూ జాగ్రత్తగా చిత్రిక పడతారు. ప్రతిపాత్రకూ తనదైన స్వభావమూ, తనదైన నడక ఆసాంతమూ కొనసాగుతుంటాయి. వాళ్లను మనం మనూళ్లో ఉన్న ఫలానా ఫలానా వాళ్లతో పోల్చుకోగలుగుతాం. అరె, ఇది అచ్చంగా మనూర్లో జరిగిందే అనుకోగలుగుతాం. మూలింటామె మౌనం మాటున బాధను అణిచివేసుకునేదయితే ఆమె కూతురు మాటల రొద మాటున సొద మాటున మనేదను వెల్లగక్కుకునే బాపతు. పందొసంత ఒళ్లంతా లౌక్యం నిండిన మార్కెట్‌ బిడ్డ. చీమంతమ్మ ఎదుటోడి దుక్ఖం తన దుక్ఖంగా భావించగలిగిన ఆర్తి కలిగిన మనిషి. మొలకమ్మ, రంజకం లాంటివారు నోటిదూలిస్టులు. ఇలాంటివారు ఇంతకంటే అన్యాయమైన వారు మన చుట్టూతా రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంటారు. రకరకాల అసంతృప్తులతో రగిలిపోతూ ఆమె ఇట్టంటలే, ఈయన ఇట్టంటలే అని ఇతరుల మీద అవాకులూ చెవాకులూ ప్రచారం చేస్తూ ఆ రకమైన ఫేక్‌ ఓరల్‌ సెక్స్‌తో సంతృప్తిపడదామనుకునే మానసిక రోగులుంటారు. అన్నంతినే నోటితోనే అశుద్ధపు మాటలను విసర్జించగల పృష్టముఖులుంటారు. ఈ పేడపురుగులకు జెండర్‌ ఉండదు. కుచ్చుంటే కత లేస్తే కత రోజుల్లో అలాంటి వారిని లైటర్‌ నోట్లో చిత్రిస్తే ఇందులో మాత్రం ఆడుకున్నారు నామిని. నోరు గలిగిన వారు నీతిమాటల్ని గట్టిగట్టిగా చెపుతూ న్యాయాన్యాయాలను నిర్దేశిస్తున్నపుడు కడుపుమండిన వికర్ణుడి మాదిరి సభను ధిక్కరించి మాట్టాడిన సుకుమారుడు సింబాలిక్‌గా చూసినపుడు నామిని ప్రతినిధి గామోలు అనిపిస్తుంది. " వుండండి లంజిల్లారా, యీ ఊళ్లో ఆడవి మొగుళ్ల దాపున చేరుకొని ఏఏ వాటంతో లంజరికాలు జేసి పత్తిత్తుల్లాగా చెలామణి అవుతుండాయో ఒక పుస్కం రాసి చూపిస్తా నుండండి లంజల్లారా!" అనేయగలిగిన తెంపు నామినిదే అనిపిస్తుంది. కానీ ఆ సింబాలిజాన్ని దాటుకుని చూస్తే రచయిత సర్వాంతర్యామిలాగా కనిపిస్తాడు. కొన్నిసార్లు మూలింటామెలో మరికొన్ని సార్లు చిలకమ్మలో ఇంకొన్ని సార్లు మాల గురివిలో కూడా కనిపిస్తాడు. 
"ఈ కత ఊరి గెమిని దాటిపోకూడదు. ఆడలంజిలు దీన్ని చాటవమాదిరిగా చెప్పుకుంటా ఉంటే యిన్నమొగోడు యిన్నట్టే మెట్టుతో కొట్టీయాల. చుట్టూతా రెడ్లు. రామాపురం రెడ్లు. నడవలూరు రెడ్లు, నెన్నూరు రెడ్లు, గంగరెడ్డి పల్లె రెడ్లు, యిన్నేండ్లూ రెడ్లేలతా ఉంటే మనం నోట్లో ఏలేస్కోని గమ్మనుండినాము. యిప్పుడనంగా మనోడు ఏల్తా ఉంటే రెడ్లు కక్కలేక మింగలేక మినకతా ఉండారు. యీ టయింలో మన కమ్మిరికంలో ఒకాడది యీ మాదిరిగా కళాయిబోస్కునే అరవ మాదిగోడితో పూడిసిందంటే-యీ కత నాలుగూళ్లకు తెలిస్తే మళ్ల మనం తిరప్తికి బస్సెక్కి పోగలమా!'' అని ఇది ఎప్పటికథ,ఎవరి కథ, అనేవి నామిని చెప్పేశాడు. 80ల కథ, కమ్మపల్లెలో జరిగిన కథ. రాష్ర్టంలో ఎన్టీఆర్‌, కేంద్రంలో రాజీవ్‌ గాంధీ పాలిస్తున్న దశ. రాజీవ్‌ కొత్త మార్పులను సమాజంలో ప్రవేశపెడుతున్న దశ. గ్రామీణ సమాజం మార్పులను అనుమానంగానూ ఆసక్తిగానూ చూస్తున్న దశ. పాత కొత్తలు రెంటిలోని విషాదాల్ని వ్యాఖ్యానం లేకుండా మనముందుంచారు నామిని. 


నా కొడుక్కి యవాదశొచ్చి పదేడు పజ్జెనిమిదేళ్లయినా నేను పెళ్లి ప్రయత్నం చేసినానా! అప్పుడు నువ్వు మూడేండ్ల బిడ్డ. నిన్ను తండ్రి మాదిరిగా చూసినాడు నీ మేనమామ. నిన్ను బుజాల మిందనే ఎత్తుకొని తిప్పినాడు. ... బొటనేలు తొక్కించుకుని బొట్టు కట్టించుకునే నాటికి నీకు యొచ్చూ తక్కవగా పదైదు పదారేండ్లు. నీ మొగుడికి ముప్పై ముప్పై మూడేళ్లు. వొంటికాలి మింద పదైదేండ్లు దేనికని నిలబడుకోనుండినాడు. సంకన బెట్టుకుని సాకిన బిడ్డి మెళ్లోనే బొట్టు కడదామని!...మూలింటామె మనేదలో కలిపేసి చెప్పాల్సినవి చెప్పేస్తాడు. మనం చేస్తే తప్పుకాదు గానీ పసిబిడ్డ చేస్తే తప్పా....కిందా పైనా నెరిసిపోయ్‌నాక నువ్వూ పత్తీతవే, నేను పత్తీతనే! అని మూలింటామె నోట ఊరికే పలికించలేదు. ఆ ముసలాళ్ల యవ్వనపు రహస్యాలు మనకు తెలియజేయాలనే కొంచెపు మనస్తత్వంతో చేయలేదు. అది ఒక బూటకపు విలువను అపహాస్యం చేయడం. ఏదో ఒక ఆధిపత్యాన్ని ఆపాదించుకుని ఎదుటివారి మీద చెలాయించాలని చూసే మనస్తత్వాలను ఎద్దేవా చేయడం. మనిషి మీద గౌరవం చూపడం. 
నవలను రెండు భాగాలుగా విభజించారు నామిని. కంటికి కనిపించని రూపావతి మొదటి భాగానికి కేంద్రకమైతే రెండో భాగమంతా పందొసంత విశ్వరూపం.బావా, నువ్వేంది బీడీలు తాగేది సిగరెట్లు తాగు అని వయసుకు బావైన మనిషితో సరసాలాడే పందొసంత ప్రవేశంతో నవల మరో దశకు చేరుతుంది. బీడీల నుంచి సిగరెట్లకు మారడంలో చాలా మతలబు ఉంది. సిగరెట్లే కాదు, అలాంటి అనేకానేక కొత్త వస్తువులను అమ్మే దుకాణాలు, ట్రాక్టర్లు, మోటార్లు, మోపెడ్లు, కొత్త కొత్త మాటలు అన్నీ చాలా వచ్చేస్తాయి పందొసంత కొంగుపట్టుకుని. అక్కడ్నించి రచయిత కలం కట్టలు తెంచుకుంటుంది. కథనంలో వేగమే కాదు, దూకుడు కూడా పెరుగుతుంది .ప్రయోజనానికి అడ్డొచ్చే ప్రతిదాన్నీ నాశనం చేసుకుంటూ వెళ్లిపోయే ఆధునిక మార్పు పట్ల పట్టరాని కోపం కనిపిస్తుంది. చెట్లు కొట్టేసే దృశ్యం వివరణలో పర్యావరణ స్పృహను కూడా పలికిస్తాడు నామిని. కథకు ఎక్కడా తులం దెబ్బతగలకుండా ఇన్ని విషయాలను చెప్పడంలోనే నేర్పరితనం కనిపిస్తుంది. మరీ అవసరమనుకుంటే తప్ప పాఠకులకు టెక్ట్స్‌కు మధ్య రచయిత పదేపదే అడ్డమొచ్చేసి ఇది ఇదీ, ఇది ఇదీ అని వ్యాఖ్యానాలు జడ్జిమెంట్లు చేయడం నామినికి అలవాటు లేదు. పాఠకులకు నామిని ఇచ్చే గౌరవం ఎక్కువ. 
"పాపం మూలింట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒళ్లెరగని నిద్రపోయినా గుడుగుడు చంద్రడు గానీ, పందొసంత గానీ కంటిమీద రెప్పేసుంటే! ,...ఆ మాదిరిగా ఎంతసేపూ ఒకర్నొకరు కరుసుకుని పొడుకోలేక మంచి నిద్దట్లోనే ఆ రేత్తిరంతా అడ్డాపింట్లోకి పొయ్‌ కొంచి కొంచిం సేపు పొనుకుంటూ మళ్లా మంచం మీదకు వస్తా -రేయి తెల్లవాదులూ ఆ యిద్దురూ కంటిమీద రెప్పేయకుండా వనవాసరం చేసినారు."రచయిత కోపం వ్యంగ్యంలోకి దిగితే ఎలాఉంటుందన్నదానికి ఇది సూచిక అనిపిస్తుంది. గుడుగుడు చంద్రడికి పందొసంతకి బంధాన్ని చెప్పడానికి మామూలుగా నైతే ఇంత వర్ణన అవసరం లేదు. కానీ ప్రథమ భాగంలో 'కళాయిబోసుకునే మాదిగోడితో లేచిపోయిన' రూపావతిపై సాధ్యమైనంత ప్రేమనుచూపే నామిని కలం రెండో భాగంలో కేవలం ప్రయోజనాలకోసం అన్ని లెక్కలు వేసి పందొసంత పెట్టుకున్న బంధంపై సాధ్యమైనంత ఏహ్యభావం కలిగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రెండు చోట్ల కూడా లోకం పోకడను ధిక్కరిస్తుంది. "రంగబిళ్ల ఆ ప్రకారంగా నిప్పుల్లో కాలిపోయ్‌నాక పొందొసంతను బజిన గుడికాడికి పిలిపించి 'గుడుగుడు చంద్రుడెవుడు? వోడి నీ ఇంటికి రావడమేంది, ఆ కోళ్లు కోయడమేంది, నిన్న జూసి మిగతా ఆడవి నేర్చుకోవా?' అని నిగ్గదీసే మొగోడేడీ? అయినా గుడుగుడు చంద్రడు కళాయి బోసుకునే అరవమాదిగోడేమీ గాదే! ఆ తప్పుకే రాములవారి గుడి ముందు అపరాదం పడాలా, యివన్నీ ఏముండాయి, తుకడా ఎవ్వారాలు." అని ఊరి న్యాయం తాలూకు స్వభావాన్ని ఎండగడతారు నామిని. అధికారం ఏ సమాజంలో ఏ రూపమెత్తుతుందో నామినికి బాగా తెలుసు. అయితే సంకనబెట్టుకుని సాకిన బిడ్డి మెళ్లోనే బొట్టుకట్టే వ్యవస్థలో దాగిన అన్యాయం కంటే కాసు తప్ప మరేమీ కనిపించని కొత్త వ్యవస్థ మీద రచయితకు ఎక్కువ కోపం ఉంది అని ఆయన పందొసంత పాత్రను తీర్చిన తీరు చూస్తే అనిపిస్తుంది. రచయితకు ఇంతకుముందు అలవాటు లేని బీభత్స దృశ్యాలు ఇందులో చిత్రించిన తీరు చూస్తే ఒక రకంగా రచయిత పందొసంత మీద కత్తి గట్టినట్టు అనిపిస్తుంది. అలాగే నవల మొదట్లో -యిపుడే బయటకో యాడికో పొయినట్టుండాది మూలింటామె మనవరాలు రూపావొతి అనే వాక్యం లేకపోతేనే బాగుండేమో అనిపిస్తుంది. పాఠకుడిని అలా మళ్లించాల్సిన అవసరం నామిని లాంటి రచయితకేల! 
చికెన్‌ వండేటప్పుడు టమోటా వాడకూడదని ఎంత పట్టింపో అలాగే పిల్లుల జోలికి పోగూడదు అనే పట్టింపు కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. నెపం కాసేపు మూలింటామె మీద నెట్టేసి నవల మొత్తం ఒక ధారలాగా పిల్లిశాస్ర్తం నడిపిస్తూ ఉంటారు. వాటి శుభ్రత, శుచీ, ఆహారపు అలవాట్లు, విసర్జక అలవాట్లు, ఇలా పిల్లి శాస్ర్తమంతా చెప్పేస్తారు రచయిత. రైతాంగ కుటుంబాల్లో పిల్లి పట్ల ఉండే సెంటిమెంట్‌ను పందొసంత మీద కోపాన్ని పెంచడానికి వాడుకున్నారు. మామూలుగా నామిని రచన పెయిన్‌కి పర్యాయపదం. ఇందులో మాత్రం ఆగ్రహం దాన్ని దాటేసింది. ప్రథమభాగంలో వ్యక్తుల మీద పెద్దగా కోపం రాదు. మొత్తం ఆ వ్యవస్థ మీదే కోపం వస్తుంది. కానీ రెండో భాగంలో మాత్రం వ్యవస్థ మీద కంటే కూడా పందొసంత మీదే కోపం కేంద్రీకృతమవుతుంది. . కులమూ, ధనమూ, మానవ విలువల విధ్వంసమూ, పర్యావరణమూ, లాంటి అనేక విషయాలు పాతకొత్త రూపాల్లో ఎలా పనిచేస్తుంటాయో ప్రాక్టికల్‌గా చూపించిన పుస్తకం మూలింటామె. గతంలో ఘటనలనే ఎక్కువగా చిత్రించిన నామిని ఇపుడు పరిణామాన్ని చిత్రించడానికి పూనుకోవడం తెలుగు సాహిత్యం రెండు చేతులా ఆహ్వానించాల్సిన విషయం. నామిని రెండో రాకడకు స్వాగతం.
(జూన్‌ 29, 2014 ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసం)

పాత బూతుల బూజు దులపాల్సిందే!

“పనిమనిషులు దొరకడం లేదండీ. అబ్బో, రోజొక గంట పనిచేయడానికి వేలు అడగుతున్నారు. ఇళ్లలోనే ఉండి పనిచేసే అమ్మాయిలు అయితే అసలే దొరకరు.” పట్నాల్లోమధ్యతరగతి బాధ ఇది. ఇంటి నిర్వహణ ప్రధానంగా ఆడవాళ్ల బాధ్యతే కాబట్టి వాళ్లే ఎక్కువగా బాధపడుతునట్టు కనిపించినా ఈ బాధకు జెండర్‌ అంటగట్టక్కర్లేదు.
“ప్లంబరండీ, ఇంటికొస్తే చిన్న ట్యాప్‌ బిగించడానికి కూడా మూడునాలుగొందలు పోయాల్సిందే. బట్టలు ఐరన్‌ చేసే దిక్కులేదు”. ఇలాంటి మాటలు కూడా ఎడా పెడా వినిపిస్తూ ఉంటాయి.
“కూలోళ్లు దొరడం లేదండీ, వ్యవసాయం సర్వనాశనం అయిపోయింది. ఈ గ్రామీణ ఉపాధి పథకం తెచ్చిఅందర్నీ సోమరులను చేసిపెట్టారు. మనకెందుకు పనిచేస్తారు”.ఇది పల్లెల్లో ఎక్కువగా వినిపించే మాట.
“డప్పు కొట్టే మాదిగ లేకపాయె, చాకలి, కమ్మరి, కుమ్మరి పనులు పాయె, గ్రామాలు పాడైపోయాయండి.” ఇది కూడా దాని పక్కనే వినిపించే మాట.
ఈ బాధలు ఎవరికైనా బాధలు కావచ్చు కానీ వర్కింగ్‌క్లాస్‌ తరపున మాట్లాడేవారికి  కావచ్చునా! శారీరక శ్రమకు డిమాండూ విలువా పెరగడం వర్కింగ్‌ క్లాస్‌ తరపున మాట్లాడేవారు సంతోషించాల్సిన విషయాలు. కానీ మనం చేసే మధ్యతరగతి ఉద్యోగాలకు మాత్రం వేతనాలు మెరుగ్గా ఉండాలని, మనకు సర్వీసెస్‌ అందించేవారు మాత్రం ఎప్పట్లాగే జోలె పట్టుకుని మనం ఇచ్చినంత తీసుకుని చిత్తం దొరా అనాలని చాలామంది కోరుకుంటున్నారు. గ్యాస్‌ బండమీద సబ్సిడీ తగ్గిస్తే గోలగోల చేసేసి గ్రామీణ ఉపాధి పథకాన్ని మాత్రం ఆడిపోసుకుంటుంది ఇలాంటి మధ్యతగరతి.
పేదలవైపున నిలవడమంటే పేదరికాన్ని ప్రేమించడంగా అర్థం చేసుకున్న మిత్రులు ఇంకో రకమైన ఏడుపును అవుట్‌ సోర్స్‌ చేస్తుంటారు. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి ఏమాయె, అంతా ఉంటేనే గదా ఊరు అని ఒకటే బాధ!  మనం కాలేజీలోనో, బ్యాంకులోనో, కోర్టులోనో, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోనో, పత్రికా కార్యాలయంలోనో  పనిచేయాల. స్థిరమైన వేతనం తీసుకుంటూ మధ్య మధ్యలో సాహిత్య సేవ చేస్తూ ఉండాల. కానీ ఊరిలో మాత్రం నాలుగు వీధులు, ఏ వీధిలో ఆ కులాలు, మధ్యలో రచ్చబండ, దాని మీద ఓ యాపచెట్టు ఉండాల.  బాడిస చప్పుడు, మగ్గం  చప్పుడు, కుమ్మరి సారె చప్పుడు వినిపిస్తూ ఉండాల. ఊరిని ఊరిలా ఉంచడానికి చాకళ్లు, మంగళ్లు, కుమ్మర్లు, కమ్మర్లు నానా చావు చస్తూ అలానే ఉండిపోవాల! లేకపోతే సర్వనాశినం అయిపోయినట్టే!
మనం పైన ట్యాంక్‌ కట్టుకుని ఎప్పుడంటే అప్పుడు నీళ్లు తిప్పుకుంటాం‌‌, కానీ కుండలు చేసేవాడు కావాల! మనం ఖాదీ వేయం‌. ఆధునిక పరిశ్రమ చేసిన బట్టలే వేస్తాం. కానీ సాలె బట్టలు నేయాల. ఇందులో ప్రాక్టికాలిటీ ఏమైనా ఉందా. జీవితమేమైనా కె విశ్వనాధ్‌ సినిమానా! వివేకానంద సూత్రం ప్రకారం అన్ని కులాలు గౌరవంగా తమపని తాము చేసుకుంటూ అంతిమంగా బ్రాహ్మణత్వాన్ని పొందడానికి! గతాన్ని నెమరేసుకోవడం తప్పుకాదు. గతం లేకుండా వర్తమానం ఎక్కడినుంచి వస్తుంది? అమ్మమ్మ ఒడిని, ఒడిలో విన్న కథలను, చీమచింతకాయ కోయబోయి కింద పడిన దెబ్బలను, ఊరిబావిలో కొట్టిన ఈతలను గుర్తు చేసుకోకుండా ఉండడం సాధ్యమా! కానీ జ్ఞాపకాలకు విలువలు అంటగట్టి ఎత్తుపీట వేసి కూర్చోబెట్ట కూడదు. మా కాలంలో స్కూలుకు ఆరేడు కిలోమీటర్లు నడిచిపోయేవాళ్లం. ఇపుడు ఎవరైనా నడుస్తున్నారా అసలు! కూలీలు పక్కూరి చేన్లో పనులకు పోవడానికి కూడా సెవన్‌ సీటర్లు ఎక్కుతా ఉంటే!  అని ఎవరైనా గతాన్ని తీపిగా గోక్కున్నారనుకోండి. మనమేం అనాల? పండితులారా! మన పూర్వీకులు కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనేవారు, యోజనాల దూరం నడిచేపోయేవారు, ఇవాళ మనం యాడికైనా అలావెళ్లి ఇలాగొచ్చేస్తున్నాం. మనం సోమరులైపోయామని మనం ఎన్నడూ అనుకోలేదు. మన తర్వాతి తరానికి మన కంటే కూడా శారీరక శ్రమ తగ్గింది. శారీరక శ్రమను తగ్గించుకుని సౌకర్యాలు పెంచుకునేందుకు మనిషి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అది తప్పు కాదు అనాలా! లేక భలే చెప్పావు బాస్‌ అని ఫ్యూడల్ భజన చేయాలా !
An-Indian-boy-breaks-coal-006
“మా కాలంలో మాదిరి కాదమ్మా, ఇపుడాడవాళ్లకు పనా పంగా, అన్నీ మెషీన్లే అయిపాయె” అని కోడళ్లను చూసి ఈర్ష్య పడే కొందరు పాతకాలపు అత్తల మాటలకు దీనికి తేడా ఏమైనా ఉందా! ఇదింకా చిన్నబూతే. ఆ మంగలేమాయె, చాకలేమాయె, ఊరేమైపాయె అనైదైతే బూతున్నర బూతు.
ఊరు ఊరిలాగా ఉంచడం కోసం చాకలి మన పిల్లల పీతిగుడ్డలు, ఆడవాళ్ల ముట్టుగుడ్డలు, మగవాళ్లు తాగి వాంతి చేసుకున్న గుడ్డలు ఉతుకుతూనే ఉండాలా?సాయంత్రం ఇంటిమందుకొచ్చి బిచ్చమెత్తుకున్నట్టు జోలెపట్టుకుని మనం వేసే అన్నం పచ్చడి తీసికెళ్లి తినాలా? నీ మాల్గుడి డేస్‌ ఆనందం కోసం ఈ అవమానాన్ని
భరిస్తూ మనకు వెట్టి చాకిరీ చేస్తూనే ఉండాలా? నువ్వు పిలిచినపుడల్లా మాదిగ తప్పెట తీసుకొచ్చి చాటింపు వేయాలా? నువ్వు చస్తే అతను చచ్చినట్టు వచ్చి డప్పేయాలా?
లేకపోతే పీనిగ లేవదా? కాలిస్తే కాలదా? పూడిస్తే పూడదా? పశువు చచ్చిపోతే అతనొచ్చి తీసేయాలా? లేకపోతే  ఊర్లు పాడైపోయినట్టా? ఏం నువ్వు తీయలేవా?
తిండికి లేక ఒకనాడు కళేబరాల మాంసం తిన్నందుకు అది పారంపర్యంగా అతని బాధ్యతే అవుతుందా? చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుడుతూ బట్టలు నేసేవాడు బట్టలు నేస్తూ
బట్టలుతికేవాడు బట్టలుతుకుతూ వ్యవసాయం చేసేవాడు వ్యయసాయం చేస్తూ పాలించేవాడు పాలిస్తూ అప్పులిచ్చేవాడు ఎప్పుడూ అప్పులిస్తూ అప్పలు తీసుకునే వాడు ఎప్పుడూ అప్పులు తీసుకుంటూ ఉంటేనే ఊరు పచ్చగా ఉన్నట్టా? ఇదేనా మనం కోరుకునే ప్రజాస్వామ్యం?
బహిష్టు కావడమంటే అదేదో నేరమైనట్టు మూలన కూర్చొని ఏ గుడ్డలు వాడాలో తెలీక అవే చింపిరిగుడ్డలను పదే పదే వాడుతూ చివరకు గోనెసంచులను చించి కూడా వాడుతూ రోగాలు, కాన్సర్లు తెచ్చుకుని ఆడోళ్లు నానా అవస్తలు పడే రోజులు ఎంత బాగుండేవని ఆ పాత రోజులను మధురంగా తల్చుకుందామా! బహిర్భూమికి వెడుతూ నానా రోగాలు తెచ్చుకుంటూ, తెస్తూ సహజమైన జీవన క్రియను కూడా అవమానంగా దొంగదొంగగా తీర్చుకునే రోజులు బాగున్నాయనుకుందామా! బిపినో షుగరో పెరిగిపోయి హఠాత్తుగా మనిషికి చెమట్లు పట్టి స్పృహతప్పి చచ్చిపోతే అదేం రోగమో తెలీక దయ్యం పట్టిందేమో భూతం పట్టిందేమో అనుకుని కాటికి మోసుకుపోయే అన్యాయపు రోజులను అందంగా గుర్తు చేసుకుందామా! ఎవరికో ఎక్కడో ఏదో అయితే  చేతబడి, బాణామతి, చిల్లంగి అని పిచ్చిమాటలు మాట్లాడతా మంత్రగాళ్ల పేరుతో మనుషుల పళ్లు ఊడగొట్టి జుట్టు రాలగొట్టి రాళ్లతో చంపేసే ఆ గుంపున్యాయపు క్రూరత్వాన్ని తన్మయంగా నెమరేసుకుందామా!
ఊరు ఊరంతా అరె ఒరె అంటుంటే అలాగే బాబయా అని అలవాటైన భయంతో కూడిన సిగ్గువల్ల వచ్చిన నవ్వుని అభినయిస్తూ పనిచేసుకుంటూ పోయే సర్వీస్‌ కులాలు లేకుండా పోయాయని బాధపడదామా! కులవృత్తులనుంచి బయటకొచ్చినవాళ్లంతా వేరే పనుల్లో కుదురుకుంటే బాధలేదు,  నలిగిపోతున్నారు, రాలిపోతున్నారు, వారి కోసం రాస్తున్నాము అని సమర్థించుకోవచ్చు. నిజమే, ఆ బాధలో న్యాయమున్నది. కానీ అప్పుడు దాని స్వరం వేరే ఉండాలి. బ్రాహ్మణ, వైశ్య, కుమ్మరి, కమ్మరి, చాకలి అని కులవృత్తుల సంగమస్థలిగా నాలుగు వీధుల్లో  నడిచే చతుష్పాద వ్యవస్థ పోయినందుకు బాధపడకూడదు.. చాకలి ఏమాయె, కుమ్మరి ఏమాయె అని పలవరించకూడదు.
మనుషులను ప్రేమించడానికి ఆ కులవృత్తుల బానిసత్వాన్ని ప్రేమించడానికి తేడా ఉంది. వాస్తవానికి వృత్తి పనిచేసేవారిలో ఆర్టిస్ట్‌ లక్షణం ఉంటుంది. తాము చేసే పని స్వతంత్రమైనదనే భావన చాలామందిలో ఉంటుంది. కూటికి పేదోళ్లమే కానీ కులానికి కాదనే వాసన కొన్ని కులాల్లో ఉంటుంది. ‘ఒకడి కిందకు పనికిపోవడమంటే పరువుపోగొట్టుకోవడం’ అనే న్యూనత ఉంటుంది. దీన్ని వదులుకోగలిగినవారు లేదా వదులుకోక తప్పనిసరైన వారు నెమ్మదిగా వేర్వేరు పనుల్లో కుదురుకుంటున్నారు. ఆ మధ్యలో కొంత ఘర్షణ ఉంటుంది. ఏ మార్పులో మాత్రం ఘర్షణ ఉండదు?
ఒక్క వృత్తి కులాలనే కాదు, ఏ రకమైన కాయకష్టం చేసేవారయినా దానికి తగిన ప్రతిఫలం రానప్పుడు అంతకంటే తక్కువ శ్రమతోనో అదే శ్రమతోనో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించడం సరైనదనే చేతన మనం కలిగించగలగాలి. అటువంటి ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఏది ఏమైనా తన పొలంలో తాను చావనైనా చస్తాడు గానీ…అన్నట్టు రాసే వాళ్లు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. “తన పొలంలో తాను రాజులాగా బతికినవాడు ఇపుడు పాపం గార్డుగా” .. చొచ్చొచ్చొ అంటూ ఫ్యూడల్‌ వాసనను ప్రేమించాలా లేక శ్రమసంస్కృతిని పెంపొందించాలా? ‘బతికి చెడడం’ మీద పురోగామి రచయితలక్కూడా ఇలాంటి భావనలుండవచ్చునా! వర్కింగ్‌ కల్చర్‌ అంటే అంత ఏహ్యభావం ఉండవచ్చునా ? నువ్వో పక్క ఇది నీచం అదితక్కువ అని ప్రచారం చేస్తూ ఉంటే మార్పుకు సిద్ధపడే వాడు కూడా అదేదో చేయకూడని పని అనుకుని దాని బదులు చావుకు సిద్ధపడతాడు. నువ్వు మేలు చేస్తున్నట్టా! కీడు చేస్తున్నట్టా! ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోబట్టే అందులో ఉన్నవారి గురించి వారి స్థితిగతుల గురించి బాధపడుతున్నాం అనొచ్చు. కానీ చేస్తున్న పని అదిస్తున్న బతుకు మిగిలిన శారీరక శ్రమల కంటే అన్యాయంగా ఉన్న విషయాన్ని గుర్తించాలా వద్దా, గుర్తింప జేయాలా వద్దా! అలవాటైన పని మిగిలిన శ్రమలకంటే మెరుగ్గా కనిపించే ధోరణి ఉంటుంది.
ఆ భావన నుంచి వారిని బయటపడేయాలంటే ఏదో ఒక వైపునుంచి ఇంటర్‌వెన్షన్‌ అవసరం. లేదంటే ఏదో ఒక టైంలో ఆకలి ఆ పని మరింత క్రూరంగా చేసి చూపిస్తుంది. ఇంటిల్లిపాదీ పనిచేసినా రోజుకు వంద రూపాయలు కూడా మజూరీ ఇవ్వని చోట మగ్గం పని గ్రామీణ ఉపాధి కూలీ కంటే ఏ రకంగా మెరుగు? మనుషులు దున్నపోతుల్లా కూర్చుని ఉంటే ఒక బక్కపల్చని మనిషి రెక్కలతో లాక్కుపోయే టాంగాను నువ్వెలా చూస్తావన్నదానిమీద నీ దృక్పథం ఆధారపడి ఉంటుంది. సాంకేతికత ఇంత పెరిగిన ఈ దశలో కూడా ఇది కొనసాగడం అమానవీయం, అన్యాయం అనే భావన నీకుంటే నీ భాష వేరే ఉంటుంది. లేకపోతే “పేదరికం, ఏం చేస్తారు” అని పరోక్షంగా సమర్థించే ప్రమాదం ఉంది. అవి ఉండడానికి వీల్లేదన్నవాళ్లంతా వాళ్లు ఆకలిచావులు చావాలని కోరుకుంటున్నవాళ్లేమీకాదు. ముందుగా అది అమానవీయం అని గుర్తిస్తే దాన్ని గట్టిగా ప్రకటిస్తే ఆ మేరకు వ్యవస్థ మీద ఒత్తిడి పెడితే ప్రత్యామ్నాయం ఏదో ఒకటి దొరుకుతుంది. ఎంతో చైతన్యవంతులం అనుకునే వారు కూడా గూడు రిక్షాలో బెజవాడలో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో అనేసుకున్నారనుకో!
ఇక అది అన్యాయమనే చైతన్యం సమాజానికి ఎక్కడినుంచి వస్తుంది? అలవాటైన మనిషి మార్పుకు సిద్ధపడే ఒత్తిడేదో ఉండాలి. చైతన్యవంతులైన వ్యక్తులు శక్తులు దానికి చోదకశక్తిలాగా పనిచేయాలి. వెనక్కు లాగ్గూడదు. ఒంటిని చర్నాకోలతో కొట్టుకుని, బిడ్డలను తాడుమీద నడిపించే అడక్కతినే విన్యాసాలను చూసి “ఆహా ఏమి ఆర్ట్‌” అనుకునే వారుంటారు. రచయితలైనా కాకపోయినా వీరిలో చాలామంది పురోగామి ముసుగులోనే ఉంటారు. వీరిలో కొందరు చివరకు కళావతులు, దేవదాసీ వృత్తులను కూడా ఆరాధిస్తారు. గొప్ప కళ అండీ అంటారు. వర్కింగ్‌క్లాస్‌ కల్చర్‌ ఉన్నోళ్లమయితే మనమేమని అడగాల? అంత మంచి ఆర్ట్‌ అయితే మీ బిడ్డలెందుకు తాడుమీద ఎక్కరు సార్‌! అంత గొప్ప ఆర్ట్‌ అయితే ఆ దేవదాసీల్లో మీ వాళ్లెందుకు కనిపించరు సార్‌! ఓ అని ఒకటే పొగిడే మీరు ఆ ఆర్ట్‌లను ఎందుకు ప్రాక్టీస్‌ చేయరు సార్‌,ఏదైనా నేర్చుకుంటే వస్తాది గదసార్‌! అని అడగాలా, వద్దా! అడక్కతినే స్థాయిలో ఉన్న అన్యాయమైన పనిని ఎవరైనా ఆర్ట్‌ పేరుతో పొగిడితే తప్పనిసరిగా కఠినంగా స్పందించాల్సిందే. కోపం రావాల్సిన చోట రాకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్టే లెక్క.
మార్పు అనివార్యమైనపుడు దానికి తగినట్టుగా సిద్ధం కావడం, సిద్ధం చేయడం మన బాధ్యత. ఈ మార్పులో సానుకూలమైనవేవో ప్రతికూలమైనవేవో బేరీజు వేసుకుని దానికి అనుగుణమైన చైతన్యాన్ని పెంపొందించుకోవడం మన బాధ్యత. కొత్త ఆర్థిక వ్యవస్థ మనల్ని వస్తువుల వెంట పరిగెట్టేట్టు చేస్తుంది. ఆ వస్తువుల ఉత్పత్తి నిరంతరం అవసరయయ్యేలా చేస్తుంది. భావజాల పరంగా ఆ అవసరాన్ని కూడా అది నిరంతరం సృష్టిస్తూనే ఉంటుంది. ఆ నిరంతర వినిమయం, ఉత్పత్తిలో భాగంగా ఉపాధి పెరుగుతుంది. ఆ పరుగు ఆగితే వ్యవస్థలో సంక్షోభం ఏర్పడుతుంది.  అదే సమయంలో ఆ పరుగుకు అడ్డు వచ్చే తాబేటి వ్యవస్థను దాని తాలూకు చిహ్నాలను మార్చుకుంటూ వెడుతుంది. కొన్నింటినైతే రద్దు చేస్తూ వెడుతుంది. అందులో ఇప్పటివరకూ అణచివేతకు వివక్షకు గురైన సమూహాలకు ఊరటనిచ్చే కొన్ని విషయాలుంటాయి.
ఇప్పటివరకూ కొన్ని పనులను నీచంగా విలువ తక్కవగా చూసిన వారు కూడా ఆ  పనులను చేయాల్సిన అవసరం కల్పిస్తుంది. ఆ పనికి అంతకుముందు లేని గౌరవాన్ని ఆపాదిస్తుంది. ఒక్క ముక్కలో ఆయా పనులను మార్కెట్‌ చేయడానికి అడ్డొచ్చే అనవసరమైన న్యూనతలను, అనవసరమైన గౌరవాలను రద్దుచేస్తుంది. కనీసం తగ్గిస్తుంది. కొత్త వ్యవస్థ కేవలం పట్నాలకే పరిమితం కాదు. టీవీ ఇంటర్‌నెట్‌ వంటి సాధనాలు, మెరుగుపడిన రవాణా సాధనాలు పల్లె-పట్నాల మధ్య తేడాను చెరిపేసుకుంటూ వస్తున్నాయి. ఈ చెరిపివేయడం వల్ల కొంతమందికి అలవాటైన సౌఖ్యాలు, గౌరవాలు, మర్యాదలు తగ్గిపోతాయి. అయ్యవారు అనో రెడ్డీ అనో రాజుగారు అనో దొరా అనో గౌరవ సంబోధనలను కోల్పోయిన వారికి ఉక్కపోత ఉంటుంది. ఆ ఉక్కబోతను అలాగే ప్రదర్శించుకుంటే దాని కథ వేరే!
అలా కాకుండా శ్రామిక కులాల పాత్రలను పెట్టి పెద్ద మెలోడ్రామాలను సృష్టించి ఇంకా అవసరమనుకుంటే పాత్రలను చంపేయడం లాంటి విన్యాసాలు చేసి నాలుగు పాదాల సంస్కృతి పోయినందుకు బాధపడితే మాత్రం బాధేస్తుంది! ప్రపంచీకరణ అనే భూతాన్ని పోటీగా నిలబెట్టినంత మాత్రాన అలాంటి వాదన న్యాయమైనదైపోదు! పీడిత కులాల నుంచి వచ్చినవారు, నిజంగా వర్కింగ్‌ క్లాస్‌వైపు నిలబడేవారు ఇక్కడ కన్ఫూజ్‌ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ మాయలో పడే ప్రమాదం ఉంది. అది సాహిత్యంలో చూచాయగా కనిపిస్తున్నది. కొత్త వ్యవస్థలో ఉన్న దుర్మార్గాలను ప్రశ్నించడమూ, అంత కంటే దుర్మార్గమైన పాత వ్యవస్థను ప్రేమించడమూ రెండూ ఒకటి కావు.
కొత్త ఆర్థిక వ్యవస్థ రెండు రకాల మార్పులు తెస్తుంది. ఒకటి- కులానికి వృత్తికి మధ్య ఉన్న బంధాన్ని తెంచేయడం, రెండు- సోషల్‌ మార్కర్స్‌ను మెటీరియల్‌ మార్కర్స్‌గా మార్చడం. పల్లెలో నీ ఉనికి నీ కులంతోనే ముడిపడి ఉంటుంది. ఏ ఊరిలో నైనా ఎవరిగురించైనా అడిగితే ఏంటోళ్లు అని ప్రశ్నిస్తారు. అదే పట్నంలో అయితే ఏం చేస్తారు అని అడుగుతారు. అక్కడ గుర్తింపు నీ కులం. ఇక్కడ గుర్తింపు నీ పని. నీ గుర్తింపు నీకు సంబంధం లేని పుట్టుకతో ముడిపడి ఉండడం కంటే నువ్వు చేసే పనితో ముడిపడి ఉండడం కచ్చితంగా మెరుగైన విషయం. కొత్త వ్యవస్థ  సంప్రదాయకంగా సాగుతున్న వృత్తి పనులను మార్కెట్‌ చేసి కొత్త విలువను ఇస్తుంది. అంతకు ముందు మార్కెట్‌ చేసుకోలేని విషయాలను బ్రాండ్‌గా మార్చివేసి కొత్త మేకప్‌ వేస్తుంది. ఆరోగ్యం కాస్తా ఫిట్‌నెస్‌ అనే మార్కెట్‌ పదంగా మారుతుంది.
సంప్రదాయ వ్యాయామశాలల స్థానంలో ఆధునికమైన జిమ్‌ మార్కెట్‌ ప్రవేశిస్తుంది. చిలకజోస్యాలు పిచ్చి లాజిక్కులతో న్యూమరాలజీ-వాస్తు రూపం తీసుకుంటాయి. బాత్‌రూమ్‌లు, లెట్రిన్‌లు క్లీన్‌ చేయడమనే పని మెయిన్‌టెయిన్స్‌ అనే రూపం తీసుకుని కొత్త డ్రస్ తొడుక్కుంటుంది. యూనిఫామ్‌, మెడలో ఐడెంటిటీ కార్డు లాంటివి కొత్త ఆత్మవిశ్వాసాన్ని, చైతన్యాన్ని ఇస్తాయి. కావాలంటే ఇళ్లలో పనిచేసే వారిని పరిశ్రమల్లో అదే పనిచేసేవారిని పోల్చిచూడండి. హౌస్‌ వైఫ్‌  అనే పదం దానికున్న న్యూనతను తొలగించుకుని హోమ్‌మేకర్‌ అనే ఆధునిక రూపం తీసుకుంటుంది. దర్జీపని  బాతిక్‌ రూపమెత్తుతుంది. చాకలి పని డ్రైక్లీనింగ్‌ రూపమెత్తి పరిశ్రమగా రూపుదాలుస్తుంది.  వంటపని కొత్త గౌరవాన్ని సంతరించుకుని గౌరవనీయమైన వృత్తిగా అవతరిస్తుంది. ఈ రంగంలో సూపర్‌ స్టార్‌ సంజీవ్ కపూర్‌ స్ర్తీ కాదు. వెంట్రుకలు కత్తిరించే పని ఇంతకుముందు లాగా అగౌరవంగా ఉండదు.
అందులో కులాన్ని తీసేసి కొత్త వర్గాల్ని ప్రవేశపెడుతుంది మార్కెట్‌. ఎదురుగా అద్దం తగిలించి కబుర్లు చెపుతూ బ్లేడుతో గడ్డం గీకడం ఒక వర్గం. కత్తెర చేత్తో పట్టుకుని ఏ స్టైల్‌చేయాలి సర్‌ అని అడిగేదొక వర్గం. పిలకజుట్టో పిల్లగడ్డమో పెట్టుకుని చొక్కా ఫ్యాంటు మీద అప్పటికప్పుడు ఒక బెల్టు లాంటిది తగిలించుకుని అందులోని ఆధునిక పొత్తి లోంచి కత్తెర్లు విలాసంగా ఎగరేసి తీస్తూ మీకు సెపరేషన్‌ కంటే సెపరేషన్‌లేకుంటేనే బాగుంటుంది సర్‌ అనేదొక వర్గం. పాత మంగలి పొత్తికి ఈ పొత్తికి మధ్య చాలా దూరం ఉంది. హబీబ్‌ ఇవ్వాల నేషనల్‌ స్టార్‌. ఆయన మంగలి కాదు. ఆయన శిష్యులు ప్రశిష్యులు వేలు లక్షలుగా మారి చిన్నచిన్న పట్నాల్లో కూడా సెలూన్లు తెరుస్తున్నారు. వాళ్లల్లో మంగళ్లు ఉన్నారో లేదో వెతుక్కోవాల్సిందే. మంగలిషాపు సెలూన్‌గా మారే ప్రక్రియ ప్రజాస్వామిక మైనది. ఇది వారి వృత్తిని దోచుకున్నదేమీ కాదు. ఎక్కువమంది ఆధారపడిన వృత్తి విషయంలో మార్పుసంక్లిష్టంగా ఉంటుందనేది వాస్తవం. కానీ ఆ సంక్లిష్టతలో మనం స్టేటస్‌ కోయిస్టుల పాత్ర పోషించరాదు.
పనికి పుట్టుకకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచడం వల్ల దానికి మార్కెట్‌ కల్పించడం వల్ల అన్ని కులాల వారు అన్ని పనులు చేయడంలో పోటీ పడే పరిస్తితి వస్తుంది. అత్యంత అమానవీయమైన వేశ్యావృత్తి కూడా రూపం మార్చుకుంది. ఇంతకుముందు కొన్ని కులాలకు పరిమితమైన వృత్తి ఇవాళ సెక్స్‌ వర్కర్స్‌ రూపమెత్తింది. అందులో వర్గాల వారిగా అన్ని కులాల వారు కనిపిస్తున్నారు. చివరకు ఆధ్యాత్మికత కూడా ఇండస్ర్టీగా మారిపోయి బోధకుల్లో గురువుల్లో బాబాల్లో బ్రాహ్మణేతర కులాల వాళ్లు చాలామంది రాణిస్తున్నారు. మంచి మాటకార్లకు బోలెడంత డిమాండ్ ఉంది. అమ్మోర్ల నుంచి బాబాల దాకా చాలా దూరమే ప్రయాణించాం. కాకపోతే సంప్రదాయకంగా మిగిలిపోయిన పూజారితనంలోకి శ్రామిక కులాలు రాకుండా ఆటకం ఉంది. డ్రైనేజీలో దిగి మురికిని బయటకు తోడివేసే పనిలోకి బ్రాహ్మణులు వస్తున్న పరిస్థితి లేదు.(ఇంత ఆధునిక యుగంలో కూడా ఇంకా మనుషులు డ్రైనేజీలోకి దిగాల్సి రావడం ఈ వ్యవస్థ శ్రామికుల పట్ల చూపిస్తున్న దుర్మార్గానికి దర్పణం) చేపలు పట్టే పనిలో  ఆధునికత తగినంత రాకపోవడం వల్ల అక్కడా లోటు కనిపిస్తున్నది. ఇలాంటి కొన్ని ఉదాహరణలు మినహాయిస్తే  మిగిలిన చాలా పనులతో కులబంధం బలహీన పడింది. ఇంతకుముందు చీప్‌గా చూసిన శ్రమలకు విలువ పెరుగుతున్నది.
ఆధునిక కత్తెర్ల పొత్తి మాదిరే మార్కెట్‌ వ్యవస్థ డబ్బు ఖర్చుపెట్టడంలో నీ శక్తి ఆధారంగా కొత్త రకమైన వర్గీకరణలను చేస్తుంది. మార్కెట్‌ కొత్త రకం కులాలను తయారుచేస్తుంది అని కూడా అనొచ్చు కానీ కులంలోఉండే పుట్టుక వ్యవహారం ఇక్కడ ఉండదని గుర్తించాలి. డబ్బు ఆర్జించడంలో నీకున్న శక్తి మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. పాతకాలపు స్టెనో గ్రాఫర్‌తో పోల్చదగిన మెడికల్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌, బిపివో, కాల్‌ సెంటర్‌ల పని కూడా ఇప్పుడు గొప్ప గ్లామర్‌ను సంతరించుకుంటుంది. డబ్బు మహిమ! సహింపరానంత అసమానతలు పెరిగిపోతూనే ఉంటాయి. నిరంతరం పోటీ పడుతూనే ఉంటావు కాబట్టి సరిపోని తనం అనేది నీకు గుదిబండలాగా కట్టేసే ఉంటుంది. లేనితనం ఒకటి అందని ద్రాక్షలాగా నిన్ను శాశ్వతంగా ఊరిస్తూనే ఉంటుంది. మార్కెట్‌- మీడియా ఈ లేనితనాన్ని సరిపోని తనాన్ని ఎప్పటికప్పుడు సృష్టిస్తూనే ఉంటాయి.
న్యూనత అసంతృప్తి అనేవి ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు చచ్చేదాకా ఊపిరాడకుండా నిలువనీయకుండా చేస్తూనే ఉంటాయి.  అది టాల్‌స్టాయ్‌  “హౌ మచ్‌ లాండ్‌ డస్‌ ఏ మ్యాన్‌ రిక్వైర్‌” కథలో పరుగులాంటిది . అలాంటి ఒత్తిడి నిరంతరం మనల్ని తరుముతూ ఉంటుంది.  కోతుల్ని చేసి ఆడిస్తుంది.  కొన్ని ఆలోచనలు,కొన్ని స్పందనలు ఉన్న మనిషిగా కంటే నిరంతరం వస్తువులు కొనే వినియోగదారునిగా మాత్రమే చూస్తుంది. నిలుచుని ఆలోచించే తీరిక లేకుండా చేస్తుంది. నీకు నిన్ను పరాయివాడిని చేస్తుంది. మాయా తెరలను సృష్టిస్తుంది. తెర సౌకర్యం స్థాయిని దాటిపోయి వ్యసనమై కూర్చుంటుంది. మనిషి తోటి మనిషితో కాకుండా తెరతో సంపర్కం చేసి మాయా సంతృప్తి పొందే తెరాధునికత లక్షణాన్ని మన జీవితంలోకి తెస్తుంది. ఇవన్నీ చర్చించాల్సినవే. కథనం చేయాల్సినవే. చాలామంది చేస్తున్నారు కూడా. కొందరే ఇంకా పాత మాయను మోసుకు తిరుగుతున్నారు. అది మాయ కదా, కొత్త జీవం కడుపులోంచి బయటపడ్డాక దానికి విలువ ఉండదు. ఆ తర్వాత కూడా మోసుకు తిరుగుదామంటే కంపు కొడుతుంది. ఆ కంపును వదులుకోవాల్సిందే. పుట్టుక ఆధారంగా నీ వృత్తిని దాని గౌరవాన్ని నిర్ణయించే నాలుగు పాదాల వ్యవస్థను ఏ సాకుతో కీర్తించినా అది అన్యాయం. శ్రామిక వ్యతిరేకం.
(జూన్‌ 12, 2014న సారంగలో అచ్చయిన 'సంవేదన' కాలమ్‌)

 వెబ్‌ పత్రికలతో ఒక బెంగ తీరింది, కానీ…!
సీరియస్‌ సాహిత్యాన్ని ప్రచురించే పత్రికలు తగ్గిపోయాయి అనే మాట తరచుగా వినిపిస్తున్నది. కథలు రాస్తాం సరే, వేదిక ఏదీ అని ఆందోళన వ్యక్తమవుతున్నది. కథకుల సమావేశాల్లో ఈ సమస్య గురించి చర్చ జరుగుతున్నది. ఆ లోటు తీర్చడానికి వెబ్‌ మ్యాగజైన్లు వచ్చేశాయి. పత్రికల్లో వచ్చిందాంతో సమానం కాదు అనే మాట ఉండనే ఉంటుంది. అది వేరే సంగతి.
వెబ్‌ మ్యాగజైన్లు వస్తూ వస్తూ చాలామంది కొత్త రచయితలను వెంట తీసుకొచ్చాయి. కొన్ని పాత బెంగలను తీర్చేశాయి. తెలుగు చచ్చిపోతోందని కొందరు రచయితలు బోలెడంత ఆవేదన చెందేవాళ్లు. తమ బాధను ప్రపంచం బాధ చేయడానికి విశ్వప్రయత్నం చేసేవాళ్లు. కొత్త తరంలో సాహిత్యం రాసేవాళ్లే లేరని ‘మన’ తరంతోనే ఈ సాహిత్య వ్యాసంగం చచ్చిపోతుందేమో అని ఆందోళన వ్యక్తమయ్యేది. ముఖ్యంగా సింగమనేని నారాయణ లాంటి పెద్దమనుషులయితే రేపట్నించే తెలుగు మాయమైపోతుందేమో, మన గోడు పంచుకోవడానికి మనుషులను వెతుక్కోవాలేమో అన్నంత దిగులు అందరికీ పంచేవారు. ఆ బెంగను  వెబ్‌ మ్యాగజైన్లు తీర్చేశాయి.
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల మీద బోలెడన్ని అపోహలుండేవి. ఐటి అనగానే తాగుడు, తినుడు, తిరుగుడు అని తా గుణింతం ఒకటి తెలుగులోకంలో ప్రచారంలో ఉండేది. వాళ్లు ఏమీ చదవరని, తమ తీపి బాధలు తప్ప ప్రపంచం బాధలు పట్టవని, వాళ్లవల్లే తెలుగునేల మీద తెలుగుదనం అంతరిస్తోందని ప్రచారం సాగుతుండేది. వెబ్‌ మ్యాగజైన్లు వచ్చాక ఈ అపోహను యథాతథంగా ప్రచారం చేసే అవకాశం పోయింది.
అంతకుముందు పత్రికల్లో కూడా అడపా దడపా సాఫ్ట్‌వేర్‌ రచయితలు కనిపించినా ఇపుడు కొత్త తరం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ వారితో పాటు చాలా రంగాల్లో పనిచేస్తున్న యువత సాహితీ ప్రపంచంలోకి దూసుకొస్తున్నది.
కాకపోతే ఏ మార్పు అయినా సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా రాదు. అతి విస్తరణ, ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టత లేకపోవడం అనే ముఖ్యమైన సమస్యలైతే ఉన్నాయి. రెండోది చాలా లోతైన వ్యవహారం.రచయితల ఎక్స్‌పోజర్‌ దగ్గర్నుంచి మన చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం దాకా చాలా అంశాలతో ముడిపడిన వ్యవహారం. సాహిత్యంపై లెఫ్ట్‌-లిబరల్‌ ప్రభావం పలుచబడడం స్పష్టంగా కనిపిస్తున్నది.
కేవలం సాహిత్యానికే పరిమితం కానటువంటి విస్తృతమైన రాజకీయార్థిక కోణాలున్నటువంటి ఆ సమస్యను పక్కనబెట్టి తొలి సమస్య వరకే పరిమితమవుదాం. స్థలానికి సంబంధించిన నియంత్రణ లేకపోవడం అనేది ఒక అర్థంలో రచనకు అవసరమే కావచ్చు. కథ ఇన్ని పేజీలే ఉండాలంటే ఎలా, సృజనకు హద్దులు గీస్తారా అనే హూంకారంలో కొంత న్యాయముండొచ్చు. ప్రశ్నలో న్యాయం కనిపించినంత మాత్రాన ప్రతి ప్రశ్న వెనుక న్యాయమైన ఉద్దేశ్యమే ఉన్నట్టు భావించనక్కర్లేదు.
ప్రశ్నించినవారందరూ కోరుకుంటున్న పరిష్కారం న్యాయమైనదే అయిఉండనక్కర్లేదు.  ఫలానా పార్టీ బిసిలకు తగినన్ని సీట్లు ఇవ్వడం లేదు అనే ప్రశ్న న్యాయంగానే కనిపించొచ్చు. కానీ దగ్గరగా పరిశీలిస్తే ఆ వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం వల్ల ఆతని వైయ్యక్తిక బాధకు సామాజిక కోణాన్ని ఆపాదించాడని అర్థమవుతుంది. ఫలానా సంకలనంలో నా కవిత, నా కథ ఎందుకు రాలేదు, ఫలానా అవార్డు నాకెందుకు రాలేదు అని ప్రశ్నించే బదులు  ఏదో ఒక సామాజిక వివక్షారూపాన్ని ఆపాదించేసుకుని దళితులకు అన్యాయం జరిగిందనో, స్ర్తీలకు అన్యాయం జరిగిందనో, మైనారిటీలకు అన్యాయం జరుగుతుందనో, తెలంగాణకు అన్యాయం జరిగిందనో చర్చను లేవదీసి అవతలివారిని బోనులో నిలబెట్టవచ్చును.
ఎందుకొచ్చిన గొడవ, ఇతని కథ అందులో పడేస్తే పోలా, ఒక అవార్డు ఇతని మొకాన కొడితే పోలా అనే స్థితిని కల్పించవచ్చును. వివక్షకు గురైన శ్రేణుల న్యాయమైన ప్రశ్నలు, ఆందోళనతో పాటే ఆ సమూహ శక్తిని వైయక్తికమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే శక్తులు ఎల్లప్పుడూ ఉంటాయి. అది కేవలం ఈ శ్రేణులకే పరిమితమైనది కాదు  కానీ వైయక్తికమైన ప్రయోజనాలు తీర్చుకోవడానికి న్యాయమైనదిగా కనిపించే సాధారణ అంశాల్ని ముందుపెట్టడమనే పెడధోరణి ఇటీవల పెరిగిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఆ ఊబిలోకి దిగితే బయటపడలేం. ఏదో రకమైన అధికారాన్ని ఆశించని, అధికారంలో ఆనందాన్ని వెతుక్కోని వ్యక్తుల సంఖ్య స్వల్పం. అధికారం లేని రాజకీయాలు ఆశావహంగా కనిపించనపుడు ఆ రాజకీయాలతో ముడిపడిన వారిలో సైతం మార్పు కనిపిస్తుంది.
Book and internet
అదెలాగూ సాధ్యం కాదు కాబట్టి ఉన్న రాజకీయాల్లో అధికారం కోసం పోటీపడదాం అనే ధోరణి తొంగి చూస్తుంది. అది కొన్ని సందర్భాల్లో పచ్చిగా కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో సోఫిస్టికేటెడ్‌గా కనిపిస్తుంది. మళ్లీ స్థల నియంత్రణ దగ్గరకు వద్దాం. నియంత్రణ అనేది  లేకపోతే ఏం జరుగుతుందో వెబ్‌మ్యాగజైన్లలో వచ్చే కొన్ని కథలను చూస్తే అర్థమవుతుంది. ఎటు తీసుకుపోతున్నారో తెలీని సుదీర్ఘప్రయాణాలు కనిపిస్తున్నాయి. చెలాన్ని ఇతరత్రా విషయాల్లో గుర్తుచేసుకుందాం కానీ ఇకానమీ ఆఫ్‌ వర్డ్స్‌ అండ్‌ థాట్స్ మాత్రం మర్చిపోదాం అనే వారు కనిపిస్తున్నారు.
వెబ్‌ అనేది బ్లాక్‌హోల్‌ అని తెలిశాక ఎంతైనా అందులో తోసెయ్యొచ్చు అనిపిస్తుంది. ఏం ఎడిట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. దానికితోడు సైబర్‌ ప్రపంచం లైకుల మీద కామెంట్లమీద నడుస్తుంది. సీరియస్‌ విమర్శకు అవకాశం తక్కువ. బాగుందండీ, చాలా బాగుందండీ దగ్గర్నుంచి అద్భుతమండీ వరకూ  భుజతాడనాలు ఎక్కువ. రచనకు అప్పటికప్పుడు స్పందన చూసుకొని ఆ చర్చలో భాగం పంచుకోవడమనే అవకాశము ఇందులోని సానుకూల కోణమైతే మన ఉనికి బయటపడకుండా కామెంట్‌ విసరగలిగే అవకాశం ఇందులోని లోపం. అజ్ఞాతంలో మనిషి స్వైరుడయ్యే అవకాశం ఎక్కువ. ఇది ఆరోగ్యకరమైన చర్చను పక్కదారిపట్టించే ప్రమాదం ఉంటుంది.
సాధారణంగా తాను రాసిన ప్రతివాక్యం సామాజిక శాసనం వంటి భావన కొందరు రచయితల్లో ఉంటుంది. పత్రికల్లో సాహిత్య పేజీల నిర్వాహకులు అపుడపుడు ఈ గాలిబుడగను సూదితో గుచ్చేవాళ్లు. వెబ్‌ మ్యాగజైన్ల నిర్వాహకులు తమ సాహిత్య సామాజిక ఆసక్తికొద్దీ శ్రమను వెచ్చించువారు. స్వయంగా సాహిత్యజీవులు. మార్పులు సూచించో, తిరస్కరించో రచయిత మోరల్‌ను దెబ్బతీయడమెందుకులే అనే సంశయం ఉండొచ్చు. అందులోనూ పత్రికల్లో అయితే స్థలాభావం పేరుతో అయినా ఎడిటింగ్‌ సూచించవచ్చు. కానీ ఇక్కడ స్థలాభావం అని చెప్సడానికి లేదు. ఫలితం, భుజబలం బుధ్దిబలాన్ని అధిగమించిన కథలు కనిపిస్తున్నాయి.
నిజమే, దిన పత్రికల సాహిత్యపేజీల నిర్వాహకుల్లో కొందరు దాన్ని బెత్తంగానో, కిరీటంగానో భావించి ఉండొచ్చు. ఏదో ఒక అధికార సాధనంగా మార్చుకుని ఉండొచ్చును. కానీ వ్యక్తులను పక్కనబెడితే స్థలనియంత్రణ అనేది రచయితలోని ఎడిటర్‌ను వెలికి తీసేందుకు ఉపయోగపడేది. సాంద్రతకు ఉపయోగపడేది. గాఢతకు ఉపయోగపడేది. స్వయం నియంత్రణ ఉన్న రచయిత కథ వేరు. ఖదీర్‌ తన కథను ఎన్నిసార్లు పునర్లిఖిస్తాడో ఎంతగా శ్రమిస్తాడో నాకు బాగా తెలుసు. తన శక్తి కథకు తప్ప మరోదానికి పెట్టాల్సిన అవసరం లేనంతగా పరిసరాలను ఏర్పరుచుకుంటాడు కూడా. అతన్ని దగ్గరగా చూసినందువల్ల సాధికారంగా ఉటంకిస్తున్నాను తప్పితే అతనొక్కడే అని కాదు. సీనియర్‌ కథకులు చాలామందిలో మనకు వారు పడిన శ్రమ అర్థమవుతుంది. ఆయా కథల మీద మనకు వేరే రకమైన విమర్శలు ఏవైనా ఉండొచ్చును కానీ వారు కథను బాధ్యతగా తీసుకుంటారు.  ఇపుడది కాస్తలోటుగా అనిపిస్తున్నది.  రాసిన ఇంకు ఆరకముందే అచ్చులో పడితే బాగుంటుందనే ఆత్రం పెరిగినట్టు అనిపిస్తోంది.
వెబ్‌ పత్రికలు చేసిన మరోమేలు భాషకు సంబంధించింది. ఆయా సందర్భాల్లో పాత్రలు పలికే సంభాషణల్ని కూడా యథాతథంగా రాయకుండా బూతుఫోబియా అడ్డుపడేది. మన సాహిత్య సంప్రదాయంలో ఇదొక అనవసరమైన అడ్డుగోడ. ఈ గోడను బద్దలు కొట్టిన రచనలు అరుదు. వసంతగీతం లాంటివి ఒకటో రెండో చెప్పుకోవచ్చు.పత్రికా మర్యాదలయితే చాలానే ఉండేవి. అతను ఆమెలోకి ప్రవేశించాడు అని మాగజైన్‌ మధ్యపేజీలో రాయొచ్చు. కానీ లంజె అని అతను తిట్టిన మాట మాత్రం వాడరాదు. బూతును భావనగా కాకుండా భాషకు పరిమితం చేసే వ్యవహారం మనకు ఎక్కువ.  ఎబికె లాంటివాడు దాన్ని బద్దలు చేసి పచ్చనాకు సాక్షిగా కొత్తగాలికి తెరలేపినా అది తెలుగు సమాజానికి నామిని అనే అద్భుతమైన రచయితను ఇచ్చింది కానీ పత్రికల్లో ఒక ధోరణిగా స్థిరపడలేదు.
గతంలో ఉమామహేశ్వరరావు ఆంధ్రజ్యోతి సండే ఇన్‌ చార్జిగా ఉన్నపుడు గాడిద ప్రస్తావనతో ఉన్న చిన్న కథను యథాతథంగా అచ్చేస్తే పత్రికలో పనిచేసే మర్యాదస్తులైన సీనియర్‌ ఉద్యోగులు ఎంత గొడవ చేశారో ఇంకా గుర్తుంది. నేను ఒక పద్యంలో కొన్ని హాండ్‌ షేకులను బురదమట్టలతోనూ, రత్యానంతర శిశ్నంతోనూ పోలిస్తే అదే సీనియర్లు ఎంత గొడవ చేశారో గుర్తుంది. ఇపుడు వెబ్‌ మ్యాగజైన్ల వల్ల ఆ మర్యాదలు తొలిగిపోయే అవకాశం వచ్చింది.
ఐరోపా, పశ్చిమదేశాల్లోని సీరియస్‌ రచయితలు సైతం ఫలానా ఫలానా వ్యక్తీకరణలను యధేచ్ఛగా వాడుతున్నారు. మనం ఎందుకు సంభాషణల్లో ఇంత మర్యాదగా అసహజంగా వ్యవహరిస్తున్నాం అనే వారు పెరిగారు.ఈ ఎరుక శుభసూచకం. అది మరీ ఫ్యాషన్‌గా మారిపోయి దానికదే ఒక విలువగా మారిపోతే ప్రమాదమనుకోండి. అది వేరే విషయం. సాధారణంగా సీరియస్‌ రచయితలు రచన తర్వాత వచ్చే స్పందన కంటే రచనను ఎక్కువ ప్రేమించారు  అనే వాస్తవాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే మనం ఒక పద్యమో, కథో అచ్చేశామనుకోండి. మనకు పరిచయమున్న వారు, లేనివారు  ఓ యాభై మంది లైక్‌ చేస్తారు.  బాగుందండీ అనేస్తారు. పత్రికలో ఫోన్‌ నెంబర్‌ ఇచ్చామనుకోండి. ఓ వందమంది ఫోన్‌ చేసి బ్రహ్మండమండీ అనేస్తారు. నెట్‌లో అయితే ప్రశంస ఒక క్లిక్‌ దూరం కాబట్టి చేసేస్తారు. అదే నిజమైన స్పందన అని తృప్తి పడితే బోల్తా పడే ప్రమాదం ఉంది. అక్కడే ఆగిపోయే ప్రమాదం ఉంది.
(మే 7, 2014న సారంగలో 'సంవేదన' కాలమ్‌ )

మార్క్కూజ్‌ స్మృతిలో..!


ఆ తర్వాతెప్పుడో హండ్రెడ్‌ ఇయర్స్ ఆఫ్‌ సాలిట్యూడ్‌ హైదరాబాద్‌ ఫుట్‌పాత్‌ మీద కొనుక్కొని చదివి భయపడిపోయా, ఆశ్యర్యపడిపోయా,.ఆనందపడిపోయా. అచ్చు ఆయన పాత్రలు తొలిసారి ఐస్‌ ముక్కలు చేతుల్తో ముట్టుకున్నట్టుగానే. అంతకుముందెప్పుడో మద్రాస్‌ ఆనంద్‌(నవయాన్‌ ఆనంద్‌) లవ్‌ ఇన్‌ద టైమ్స్ ఆఫ్‌ కలరా ఇచ్చి మార్క్కూజ్‌ అనే మనిషిని నా నెత్తిన పాతేశాడు. ఆ మార్కూజ్‌ ఇక లేరు. ఇపుడే ఫేస్‌బుక్‌లోకి అడుగుపెడితే మద్రాస్‌ మోహన్‌ పోస్టులో ఆయన కొటేషన్‌ కనిపించింది. ఎందుకో అనుమానం వచ్చి పోస్టుల్లోకి వెడితే వేణుగారు, వనజ పోస్టుల్లో ఆయన లేరన్న విషయం తెలిసింది. నిరంతరం వార్తల మధ్య బతుకుతూ కూడా ఈ వార్త ఫేస్‌బుక్‌లోకి వెడితే తప్ప తెలీని స్థితి ఉండడం..హౌ అబ్సర్డ్‌. ఎందుకో తెలీదు. ఎక్కడో కలుక్కుమన్న ఫీలింగ్. మనసంతా ఆయన పాత్రలే. ఏం సబంధం ఆయనతో! చూడనైనా చూడలేదు. మహా అయితే రెండు మూడు పుస్తకాలు చదివి ఉంటాను. మహా అయితే రచయితంటే వీడురా బుజ్జీ అనుకుని ఉంటాను. ఇతన్ని రైటర్‌ అని మనల్ని రైటర్‌ అని ఒకే పేరుతో పిలిస్తే ఏం బాగుంటుంది. మనం ఏమీ రాయకపోతేనే మేలు అని ఆనందవైరాగ్యం కూడా పొంది ఉంటాను . అయితే మాత్రం ఇంతగా ఎందుకు వెంటాడుతున్నాడతను. అతనికి మనకు ఏమిటి సంబంధం!

If I knew that today would be the last time I’d see you, I would hug you tight and pray the Lord be the keeper of your soul. If I knew that this would be the last time you pass through this door, I’d embrace you, kiss you, and call you back for one more. If I knew that this would be the last time I would hear your voice, I’d take hold of each word to be able to hear it over and over again. If I knew this is the last time I see you, I’d tell you I love you, and would not just assume foolishly you know it already."
(మార్కూజ్‌ మరణ వార్త విని ఏప్రిల్‌ 18, 2014న ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌)

పల్లె బతుకుపై అక్షర చిత్రం

నేడే చదవండి.పల్లె బతుకు లోతుల్ని తవ్వి తీసిన విద్యాసాగర్ అపురూపమైన అక్షర చిత్రం పల్లెను మింగిన పెట్టుబడి. మాయా లేదు, మర్మం లేదు. గాలిమేడలు కట్టడం అసలే లేదు.నిద్రలో ఉన్నవారిని, నిద్రనటించేవారిని మేల్కొలిపే రాత యిది. ఈ నేల గురించి ఈ నేలను నమ్ముకున్న మనుషుల గురించి  ప్రేమ ఉన్న వారు, వారికోసం ఏమైనాచేయాలనుకునే వారు తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం ఇది. మా రోజుల్లో అనే తలపోతల నుంచి, పల్లెలు కూడా చెడిపోతున్నాయి అనే వలపోతల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపకరించే సాధనం ఈ పుస్తకం. పట్నవాసపు సౌఖ్యాలను అందుకుంటూ పల్లెగురించి తెలిసీ తెలీని రాతలు రాసే రచయితల వల్ల వ్యాపించిన రోమాంటిసిజమ్ అనే వ్యాధిని నయం చేసే కషాయం ఈ పుస్తకం. గ్రామీణ సమాజం,వ్యవసాయం,వృత్తులు,వలస, పెట్టుబడి, వాటి అంతస్సంబంధాల గురించి అధ్యయనం చేయాలనుకునే వారు అవశ్యం పఠించాల్సిన గ్రంధం. తిరోగామి వాదాన్ని పురోగామివాదంగా విప్లవకరంగా ప్రచారం చేస్తూ చరిత్రను, సామాజిక చలనాల్ని తలకిందులుగా చూపిస్తున్న మేధావులను సరిచేసి నిటారుగా నిలబెట్టే శక్తి కలిగిన అక్షరాయుధం. వామపక్ష రాజకీయాల్లో ఇటీవల తీవ్రస్థాయిలో సాగుతున్న  మోడ్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ డిబేట్‌ని ప్రభావితం చేయగలిగిన సత్తా ఉన్న పుస్తకం. సాధారణ కార్యకర్తలకు సైతం సులభంగా ఆ అంశాలను వివరించగలిగిన పుస్తకం. ఆ రకంగా  సామాజిక రాజకీయ రంగాలకు విద్యాసాగర్‌ చేర్పుగా దీన్ని చెప్పుకోవచ్చు.

విద్యాసాగర్‌ ఏం చెప్పారు? గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌ అనే పరమ చెత్తను మోసుకు తిరుగుతున్న వారి బండారాన్ని బయటపెట్టారు. గ్రామీణ సమాజంలో స్వర్ణయుగం అనేది ఏదీ లేదని అది కొందరి స్వకపోల కల్పితమని ఆధారాలతో సహా చూపించారు.శ్రీకాకుళం జిల్లాను నమూనాగా తీసుకుని ఊరూరూ తిరిగి గొడ్డుచాకిరీ చేసి మరీ నిరూపించారు. గతంలో సుందరయ్య లాంటి వారు చేసిన సర్వేల కంటే విసృతమైనది ఇది. ఉత్పత్తి, రవాణా మెరుగుపడని సమాజాల్లో జీవనం ఎంత దుర్భరంగా ఉండేదో నివేదికల సాక్ష్యంగా చూపించారు విద్యాసాగర్‌. గతం స్వర్ణయుగం కాదని తెలిసిన వారికి కూడా ఒళ్లు జలదరించే నివేదికలవి. బిడ్డలను 6 నుంచి 12 దినార్‌లకు అమ్మివేయడం దగ్గర్నుంచి బిడ్డల్నే చంపి తినేదాకా చరిత్ర పొడవునా దారుణమైన కరువులు. గుర్రాలు, ఏనుగుల మలంలో ధాన్యం కోసం వెతుక్కునే దగ్గర నుంచి కోటలోంచి ఒక గాడిద బయటకు వస్తే దానిమీద తోడేళ్ల మందవలెపడి కండరకండరాన్ని పీక్కుతినే ఉదంతాల దాకా ఎన్నో భరింప శక్యం కాని ఉదాహరణలిచ్చారు. ఉత్పత్తి అంతంతమాత్రంగా ఉండి కరువు కాటకాల సమయంలో బయటినుంచి ధాన్యం వచ్చే రవాణా ఏర్పాట్లు లేని రోజున ఈ సమాజం ఎలా ఉండిందో సామాజిక చలనాల గురించి తెలిసినవారు ఊహించగలిగిన విషయాలే. నిన్న కాక మొన్న బెంగాల్లో చూసిందే. చరిత్ర తెలుగు సినిమా కాదు. ఇది అర్థభూస్వామ్య అర్థ వలస సమాజమనే విశ్లేషణను పూర్వపక్షం చేశారు విద్యాసాగర్‌. పెట్టుబడి దానితో పాటే లాభాలపోటీ ఎట్లా విస్తరిస్తున్నాయో స్వేచ్చగా శ్రమను అమ్ముకునే అవకాశాలు ఎలా పెరిగాయో వివరించారు. రోలు, మిక్సీ పక్కపక్కనే ఉండే స్థితిని చూపించి పెట్టుబడి భూస్వామ్యంతో మిలాఖత్ అయ్యిందని గాలిపటాలెగరేయలేదు. దానికి భిన్నంగా ఆదిమ సమాజం నాటి కంక నుంచి ఇవాల్టి ట్రాక్టర్‌ దాకా అన్నీ ఉనికిలో ఉండి కూడా పెట్టుబడిదారీ సంబంధాలు సాధ్యమేనని ఉదాహరణలతో చాటారు.మతాన్ని కులాన్ని ముందుపెట్టి  పెట్టుబడి వాటితో సహజీవనం చేస్తున్నది కదా అని కూడా కొందరు అంటుంటారు. పెట్టుబడిదారీ సమాజంలో మతం- కులం ఉండవని ఎవరు చెప్పారో ఎందుకలాంటి అపోహ ఏర్పడిందో తెలీదు. మనలాంటి దేశాల్లో పెట్టుబడికి పురోగామి స్వభావం ఉండదని ఇంకొంతమంది మిత్రులు వాదిస్తూ ఉంటారు. ఇక్కడ బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ఏదీ రాలేదని అందువల్ల పెట్టుబడికి సానుకూల స్వభావమేదీ లేకుండా పోయిందని చెపుతూ ఉంటారు. రైలు అనే ఒక సాధారణ రవాణా సాధనం తెచ్చిన మార్పుల గురించి తెలిసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చక్రానికే అంత శక్తి ఉంటే శాటిలైట్‌కి ఎంత ఉండాలి!  పెట్టుబడికి ఒక స్వభావముంది. బూర్జువా ప్రజాతంత్ర విప్లవం షరతు ఏమీ కాదు. షరతుగా చెప్పడమంటే ఉత్పత్తి సంబంధాలకు మనిషి చైతన్యానికి మధ్య సంబంధాన్ని తిరస్కరించడం. పాత సంబంధాలను ధ్వంసం చేయకుండా పెట్టుబడి పురోగమించలేదని విద్యాసాగర్‌ తేల్చిచెప్పారు. పెట్టుబడి తనతో పాటు తీసుకువచ్చే సాంకేతికత  ఫ్యూడల్‌ సంబంధాలను నాశనం చేయడానికి ఎలా ఉపయోగ పడుతుందో చూపించారు. వాడిపడేసే ప్లాస్టిక్‌ గ్లాసులు రావడం రెండు గ్లాసుల విధానం పోవడానికి ఎలా దారితీసిందో చిన్న ఉదాహరణతో సంకేతాత్మకంగా చెప్పారు. ఇది చదువుతుంటే ఉత్తరాదిన నాగళ్లు పోయి ట్రాక్టర్లు రావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కుల అణచివేతకు సంబంధించిన కొన్ని రూపాలు ఎలా అంతరించాయో చెప్పే అధ్యయనాలు గుర్తొచ్చాయి. గతంలో అనూరాధాగాంధీ లాంటివారు గ్రామీణ-కుల సంబంధాలను మార్చడంలో పెట్టుబడి పాత్ర గురించి ప్రస్తావించినా దాని ప్రాధాన్యాన్ని పట్టించుకోలేదు. వృత్తికార్మికులకు సంబంధించిన వివరణలో ట్రాప్డ్‌ అనే పదాన్ని ఉపయోగించినా దాన్ని చాలా పరిమితమైన అర్థంలో పాసింగ్‌గా వాడారు. విద్యాసాగర్‌ ఆ  ఖాళీని పూరించారు.
14844_front_cover
మెరుగైనా రవాణా సౌకర్యాలు ఏర్పడడం కూలీరేట్లు పెరగడానికి ఏ విధంగా దోహదం చేసిందో రచయిత వివరించారు. ”కులవృత్తుల విధ్వంసం అనేది పెట్టుబడి చొరబాటుకు మౌలిక అవసరం. గ్రామీణ ధనిక రైతాంగానికి అర్థబానిస రూపంలో దీర్ఘకాలం కట్టివేయబడిన ఈ కులవృత్తుల సమాజం స్వేచ్ఛగా శ్రమను అమ్ముకునే కూలీలుగా మారారు” అని తేల్చారు. వృత్తులు కొనసాగాలని కోరుకోవడమంటే మనుధర్మాన్ని కొనసాగించాలని కోరుకోవడమేనని, వామపక్ష మేధావులు కూడా అ పాట పాడడం అన్యాయమని చెప్పారు. ఎన్ని సాకులు చెప్పి ఏ రూపంలో వివరించినా అది తిరోగమనమేనని నిర్మొహమాటంగా చెప్పారు. భారత దేశంలో పురోగామివాదులు ప్రధానంగా మార్క్స్‌ అనుయాయులు. లేదంటే అంబేద్కర్‌ అనుయాయలు. ఇద్దరి లోంచి అవసరమైనవి తీసుకోవాలని భావించేవారు కూడా ఉండొచ్చు. ఆ ఇద్దరూ వృత్తులు ధ్వంసం కావాలనే కోరుకున్నారు. వృత్తులు కొనసాగాలని కోరుకున్నది గాంధీ. ఆర్థిక రంగానికి సంబంధించి ఆయన ప్రవచించిన విషయాలు ఆచరణ సాధ్యం కానివి. సమాజాన్ని వెనక్కు తీసికెళ్లేవి. కానీ విచిత్రంగా మార్క్సిస్టులని చెప్పుకునేవారు కూడా రకరకాల వాదనలతో వృత్తులను ఆరాధించడం  చూస్తూ ఉంటాం. సమాజాన్ని మార్చాలనే బాధ్యతను భుజాన  వేసుకున్న వారెవరైనా వ్యూహాలు-ఎత్తుగడలకు సంబంధించిన గాంధీ నాయకత్వ పటిమనుంచి స్ఫూర్తి పొందొచ్చు. ఆయన వాదంనుంచి కాదు.  వ్యక్తిగా ఆయన మహానాయకుడు. ఆయన జీవితం ప్రతి కార్యకర్త తప్పనిసరిగా చదివి తీరాల్సిన పాఠం. కానీ మన దగ్గర దానికి భిన్నంగా జరుగుతోంది. వ్యక్తిగతంగా ఆయన్ను దూషించడం, భావజాలంలో ఆయనను అనుసరించడం వంటి విచిత్రాలు మనం చాలాకాలంగా చూస్తున్నాం. అందుకే ఈ రచయిత మీరెటువైపు, మనువు-గాంధీవైపా, మార్క్స్‌-అంబేద్కర్‌ వైపా అనేరీతిలో అడగాల్సిన ప్రశ్నే అడిగారు.
22vzgss03-book__23_1594038e
విద్యాసాగర్‌ ఇంకా ఏం చెప్పారు? వ్యవసాయ సంక్షోభం ఏటికేడు ఎందుకు తీవ్రమవుతున్నదో వివరించారు. ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ సంక్షోభం పెరగడం వెనుక కారణాలను సరిగా పట్టుకున్నారు. ప్రధానంగా అది చెల్లింపుల సంక్షోభం అని తేల్చారు. వ్యవసాయం వ్యాపారంగా మారిపోయిందని విస్పష్టంగా వివరించారు. సేద్యంలోకి ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం దగ్గర్నుంచి రైతాంగం జీవనశైలి మార్పుల దాకా అనేకానేక అంశాలను చర్చించారు. పిల్లల చదువులకు ఎక్కువ ఖర్చుపెట్లాల్సిన స్థితితో పాటు బర్త్‌డే పార్టీల్లాంటివి పెరిగిపోవడం లిక్కర్‌ వాడుక పెరిగిపోవడం లాంటి అంశాలను మన ముందుంచారు. “తక్కువ ఖర్చుతో జీవితం గడిచినప్పటికీ అతితక్కువ ఆదాయం ఉండడంతో ఫ్యూడల్‌ సమాజం ఒకరకం సంక్షోభం సృష్టిస్తే పెరిగిన ఆదాయాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చులు పెంచి పెట్టుబడి మరో రకం సంక్షోభం సృష్టిస్తోంది” అని   ప్రకటించారు. వాస్తవానికి ఒకనాడు గ్రామీణ సమాజంలో ఖర్చు అంటే ప్రధానంగా తిండి ఖర్చే. ఇవాళ పట్టణాల మాదిరే ఇతర ఖర్చులు తిండి ఖర్చును మించిపోయాయి. ఈ మార్పు సమాజం ఒక దశ నుంచి ఇంకో దశకు వెళ్లిందనేదానికి సంకేతం. ఇవాళ గ్రామాలంటూ ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు, అవి పట్టణాల ఎక్స్‌టెన్షన్స్‌ మాత్రమే అని చక్కని మాట చెప్పారు. ఇళ్లలో పాల చుక్కవాడకుండా అన్నీ పాలకేంద్రాలకే పోస్తున్న ధోరణి గురించి రచయిత ఒక చోట ప్రస్తావించారు. గ్రామాల్లో పెట్టుబడి తెచ్చిన విషాదం ఇక్కడుంది. ఒకనాడు ఎదురింటి రైతుకు కుడితి నీళ్లు పోస్తే పెరుగో మజ్జిగో పోసేవారు. కూలీపని నుంచి వస్తూ వస్తూ ఏదో ఒక పొలంలో పిడికెడు గోంగూర పెరక్కొచ్చుకుని ఏదో ఒక రొట్టె చేసుకుంటే పూటగడిచేది. ఒక వీధిలో చిక్కుడు పాదుకు కాయలు కాస్తే ఆ ఆవీధిలోని ఇళ్లన్నింటా ఆ రోజు చిక్కుడు గుభాలించేది. ఏదీ లేని నాడు ఊరికే పడిఉండే మునగచెట్లనుంచి నాలుగు ఆకులు దూసి ఉడికేసుకుంటే పూటగడిచేది. అమ్మడం-కొనడం జీవితాన్ని ముంచెత్తని  దశ కావడం వల్ల ఇరుగు పొరుగు సహకార జీవనం ఒకటి ఉండేది. ఒకే సాంఘిక హోదా కలిగిన కుటుంబాల మధ్య ఆర్థిక అంతరాలతో నిమిత్తం లేకుండా ఇలాంటి ఆదాన ప్రదానాలుండేవి. అన్నీ సరుకులుగా మారి మార్కెట్‌కు వెళ్లడం వల్ల  ఇవాళ పల్లెల్లో కూడా ఈ రకమైన జీవనం కనిపించడం లేదు. గుంపు జీవనంలో ఉన్న అణచివేత తగ్గడం వంటి సానుకూల పరిణామాలతో పాటు అదే జీవనంలో కొంతవరకు అంతర్భాగంగా ఉండే  సహకార ధోరణి పోయి వ్యక్తి ఒంటరవుతున్న దృశ్యం కనిపిస్తోంది.
గ్రామీణ సమాజం సంవత్సరమంతా మట్టిగడ్డలను కౌగిలించుకుని, అర్థబానిస తరహా శ్రమను చేస్తూ పండించిన ఉత్పత్తిని మార్కెట్‌కు ‘విలువ తక్కువ’ ఉత్పత్తులుగా  ఎగుమతి చేస్తోంది. తిరిగిన తనకు అవసరం ఉన్నా లేకపోయినా ‘విలువ ఎక్కువైన’ పారిశ్రామిక ఉత్పత్తులను దిగుమతి చేసుకునే స్థితిని మార్కెట్‌ కల్పించింది. ఈ చెల్లింపుల సంక్షోభమే నేటి రైతు సంక్షోభం” అని విద్యాసాగర్‌ వివరించారు.  వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం గురించిన ప్రస్తావన ఒక చోట చేశారు. తాను కొనుగోలు చేసే వస్తువుల రూపంలో పన్నుభారం, వ్యవసాయంపై మదుపు భారం అనే  ” ఈ రెండు పర్వతాలను మోస్తున్న భారతీయ రైతాంగం ఆ భారాన్ని వదిలించుకోవడానికి పట్టణ శ్రామిక వర్గంగా మారుతోంది.” అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు లోపించడం వల్ల తలెత్తుతున్న సమస్యలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. చాలా దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర ఉత్ప్తత్తి ఇంకా ఎందుకు దారుణంగా ఉంటోంది? చైనాలో హెక్టార్‌కు ఆరు టన్నులకు మించి వరి పండిస్తూ ఉంటే మనం మూడు టన్నులు కూడా ఎందుకు చేరలేకపోతున్నాం అనేది ఆలోచించాలేమో! ఒక సీజన్‌లో కిలో యాభై రూపాయలు పలికే ఉల్లి, టమోటా, ఆలూ మరో సీజన్‌లో రోడ్డుమీద పారేయాల్సిన స్థితికి ఎలా వెడుతుందనే ప్రశ్నకు కూడా సమాధానం వెతుక్కోవాలేమో!  వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల గురించి అతిగా మాట్లాడే ప్రభుత్వాలు ఆచరణలో దుర్మార్గమైన నిర్ల్యక్షం చూపడాన్ని కచ్చితంగా ప్రశ్చించాలి. కోళ్లకు దాణాగా ఉన్న మొక్కజొన్న శ్రీకాకుళం జిల్లాలో 8500 ఎకరాల నుంచి 20 వేల ఎకరాలకు పెరగడాన్ని ప్రస్తావిస్తూ”మనుషులు తినే ఆహారం కోసం విదేశాలవైపుకు కోళ్ల ఆహారం కోసం దేశీయ పొలాలకు అనే వ్యూహం ఏ న్యాయసూత్రాల ప్రకారం సరైనదో ఆలోచించాలి” అన్నారు. ఇక్కడ రచయిత ఒక విషయం మర్చిపోయారు. కోళ్లు కూడా మనుషులు తినే ఆహారమే. ఈ దేశంలో ఎక్కువ జనాభా తినే ఆహారం. ఒకనాడు పండక్కో పబ్బానికో లేక ఇంటికి బంధువొచ్చినపుడో మాత్రమే తినగలిగే ఆహారం ఇవాళ బ్రాయిలర్‌ కోళ్ల వెల్లువ వల్ల తరచుగా తినే ఆహారంగా మారింది. ఇది సానుకూలంగా చూడాల్సిన పరిణామమే. రచయిత చెప్పిన అర్థంలో అయినా మనుషులు తినే ఆహార ఉత్పత్తిలో మనమేం వెనుకబడిలేం. ఏటా కోట్ల టన్నుల ధాన్యం గోడౌన్లలో మగ్గిపోతోంది. ఆహారపంటల వైశాల్యం తగ్గిపోతోందని ఆందోళన పడాల్సిన అవసరమేమీ ఇవాళ లేదు. ఇలాంటి చిన్న చిన్న వివరాల విషయం పక్కనబెడితే మౌలిక మైన విషయాలన్నింటా రచయిత పూర్తిగా శాస్ర్తీయమైన దృక్పధాన్ని పాటించారు.
తెలుగు నేలమీద వలస వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతున్నది. బలవంతపు వలసలను వ్యతిరేకించవచ్చు. పేదరికాన్ని ఆసరా చేసుకుని భూములు తక్కువకు కొనుగోలు చేసే దోపిడీని వ్యతిరేకించవచ్చు. ”కుండా సట్టి మూటనుగట్టి ఉండా బిడ్డల చంకనబెట్టి మాసం మాసం గాసం కోసం దేశం దేశం తిరిగే పేదల” బతుకుల గురించి ఆందోళన తోనూ ఆర్తితోనూ చర్చించొచ్చు. కానీ మొత్తంగానే వలస అనేపదాన్ని బూతుపదంగా మార్చకూడదు. ఇక్కడ రచయిత సరైన వైఖరి తీసుకున్నారు. వలస  తెచ్చిన సానుకూల పరిణామాలను చూపారు. కూలీ రేట్లలో వేతనాల్లో వచ్చిన మార్పులను చూపారు. మెరుగైన రవాణా సౌకర్యాలతో కూలీలు తమకిష్టమైన చోట శ్రమను అమ్ముకునే వెసులుబాటు కలిగిన తీరును చూపారు. తలదాచుకోవడానికి గ్రామం-శ్రమను అమ్ముకోవడానికి బస్తీ అనే పరిణామాన్ని పట్టుకున్నారు. మద్రాస్‌ పోయిన దళిత కూలీలు తమ గ్రామాల్లో రైతులకు డబ్బులు అప్పు ఇచ్చే స్థితికి చేరిన విధానాన్ని వివరించారు. “మనిషి తన వృత్తిని మార్చుకోగలగడమే అతని మనుగడకు పునాదిగా ఉందని గుర్తించాలి. అలా గుర్తించకపోతే మనిషి రాకాసి బల్లి అయ్యే ప్రమాదముంది” అని చక్కని మాట చెప్పారు. అప్పుల విధానంలో వచ్చిన మార్పుల గురించి చెపుతూ ఫాయిదాలు, ముందస్తు ధర ఖండన ,అప్పులిచ్చిన షావుకారికి పంటను అమ్మాలనే షరతులు రద్దయ్యాయి. ఆ స్థానంలో సరళమైన వడ్డీరేట్లతో అప్పులు దొరికే స్థితికి శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాలు చేరుకున్నాయి” అని  మంచి మాట చెప్పారు. సరళమైన అప్పులైనా మన వ్యవసాయ రంగంలో ఉరిత్రాడే. కాదనలేం. కాకపోతే సామాజిక సంబంధాల పరంగా చూసినపుడు గ్రామీణ వడ్డీవ్యాపారికి ముందస్తు ధరకు పంట అమ్మడం లాంటి బానిసత్వం నుంచి విముక్తి పొందడం అనేది ముఖ్యమైన పరిణామం. ”ఏ దేశంలో అయినా ఫ్యూడల్‌ వ్యవస్థను ధ్వంసం చేసేది పెట్టుబడే. ఆ పని భారతదేశంలో దాదాపుగా పూర్తయ్యింది”. అని మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఈ సమాజం స్వరూపస్వభావాలేమిటో చెప్పకనే చెప్పారు. సామాజిక సంబంధాల విషయంలో నిశిత పరిశీలన వల్ల  వాస్తవాలను వాస్తవంగా చూపే వీలు కల్పించింది. ముఖ్యంగా రచయిత  శ్రామికుల- శ్రామిక కులాల దృక్కోణం నుంచి సమాజాన్ని పరిశీలించారు. సాధారణంగా గ్రామీణ సంబంధాల్లో మార్పులను పైనించి చూసేవారికి కోల్పోయిన దర్జా గుర్తొస్తుంది. కింది నుంచి చూసేవారికి వదిలించుకున్న బానిసత్వం గుర్తొస్తుంది.  పాలేర్ల వ్యవస్థ పోవడంతో పశుసంపద అంతరిస్తున్న వైనాన్ని సాగర్‌ బాగా చెప్పారు. రైతుకు-పశుసంపదకు తల్లీ బిడ్డ సంబంధమని అదనీ ఇదనీ మనదగ్గర పురోగామివాదులనుకునే వారు సైతం బోలెడు సెంటిమెంట్లు గుమ్మరిస్తుంటారు. అనుబంధం ఉండే మాట వాస్తవమేగాని అది తన జీవికను మించి కాదు. పశుమాంసం ఎగుమతిలో మన దేశం ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్న విషయం గుర్తు చేసుకుంటే మన పశువులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరు వాటిని తరలిస్తున్నారో అర్థం అవుతుంది. గతంలో దళితులు నికర ఉద్యోగంగా లభించే పాలేరు వృత్తి దొరకడమే అదృష్టంగా భావించేవారని ఆ స్థితి ఇవాళ పోయి కాస్త మెరుగైన ఉపాధి దొరుకుతున్నదని సానుకూల పరిణామాన్ని రచయిత వివరించారు. ”గ్రామీణ ప్రాంతాల్లో వాళ్లకు వృత్తిని ఉపాధిని కల్పించిన అర్థబానిస వ్యవస్థ అయిన పాలేరు వృత్తి నుంచే కాక, అర్థాకలితో మాడ్చి చంపిన వ్యవసాయ కూలీ రంగం నుంచి కూడా దళితులు నిష్ర్కమిస్తున్నారు” అని గతాన్ని వర్తమానాన్ని కలిపి వివరించారు. “స్వతంత్ర జీవనం సాగించడానికి పట్టణాల్లో ఉపాధి దొరకడం, సాంఘిక గౌరవం లభించడం” అనేవి పాలేరు వ్యవస్థ పోవడానికి కారణాలుగా దళితుల మాటల్లోనే చూపారు. సాంఘిక గౌరవమనగానే పట్నాల్లో కులం లేదా అని దీర్ఘాలు తీయనక్కర్లేదు. పల్లెల్లో కులానికి పట్నాల్లో కులానికి తేడా ఉంటుంది. ఈ మార్పు కేవలం పరిమాణాత్మకంగా మాత్రమే కొందరికి కనిపించొచ్చు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అది గుణాత్మకమార్పుగా మారుతున్నదని అర్థమవుతుంది. యాంత్రీకరణ జరిగితే ఉపాధి పోతుందని ‘సర్‌ప్లస్‌ పీపుల్‌’ పెరుగుతారని గాంధీలాగే చాలామంది ఇప్పటికి కూడా భావిస్తుంటారు. ట్రాక్టర్లు వచ్చాక కూలీలు గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణబాట పట్టారని దీనితో కూలీల కొరత తీవ్రమై కూలీరేట్లు పెరిగాయని వాస్తవ స్థితిని రచయిత వర్ణించారు.
అయితే ఏమిటి? ఇంతకుముందున్నది నరకమూ, ఇప్పటిది స్వర్గమూనా అనొచ్చు. కానే కాదు. రచయితకు స్పష్టత ఉంది. విద్యాసాగర్‌ కమ్యూనిస్టు. ఎంత కమ్యూనిస్టు అంటే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం గురించి రాయాల్సి వచ్చినపుడు మహాత్మాగాంధీకి కోట్స్‌ పెట్టే అంత కమ్యూనిస్టు. కాట్‌స్కీని ఎక్కువగా కోట్‌ చేస్తే తనమీద రెనగేడ్‌ ముద్ర పడే ప్రమాదముందని తెలిసీ సదాశయం కోసం తెగింపుతో ముందుకెళ్లిన కమ్యూనిస్టు. పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మార్గమైనదే. లాభం తప్ప మరేమీ పట్టని ఈ వ్యవస్థను, మనిషిని యంత్రంగా మార్చే ఈ వ్యవస్థను, మనిషికి మనిషిని నిరంతరం పోటీ పెట్టే ఈ వ్యవస్థలోని దుర్మార్గాన్ని ఎదుర్కోవాల్సిందే. కాకపోతే దానికోసం ఇంతకంటే దుర్మార్గమైన గతాన్ని ఆశ్రయించరాదు అని రచయిత చెప్పారు. ఇది పాతవ్యవస్థ కాదు. దానిని తలదన్ని ఏర్పాటైన కొత్త వ్యవస్థ. కొత్త వ్యవస్థ వల్ల కొన్ని  మార్పులున్నాయి. అవి  మౌలిక మైనవి కావు. పెట్టుబడికి అవసరమైన మార్పులు మాత్రమే. అసమానతలు పోగొట్టే మౌలిక మైన మార్పుల కోసం పోరాటం సాగాల్సిందే. కాకపోతే దానికి పాత మాటలు, పాత సాధనాలు పనిచేయవు అని కూడా రచయిత చెప్పకుండానే చెప్పినట్టుగా అనిపించింది.
జి ఎస్‌ రామ్మోహన్‌
 (నేల మీద నమ్మకం ఉంటే చదవండి తప్పక!..శీర్షికతో ఏప్రిల్‌10, 2014న సారంగలో అచ్చయిన 'సంవేదన' కాలమ్‌)

తమ్ముడూ పవనూ,

 ఏమన్నా జేస్కో, ఎవురితోనన్నా కలువ్‌, నీ ఇష్టం. కానీ చే బొమ్మ పక్కన మాత్రం మోదీని పెట్టమాకయ్యా! నీకు పుణ్యముంటది. బాంచెన్‌ నీ కాల్మొక్త! భగత్‌ సింగ్‌ పక్కన కూడా వద్దయ్యా! పాటలెన్నైనా పాడుకో! గబ్బర్‌ సింగ్‌ పాటలే పాడుతవో, గద్దర్‌ పాటలే పాడుతవో నీ ఇష్టం. నీకు ఊపు కావాల, ఉత్సాహం కావాల, చేతులు కాళ్లూ ఊపుకోవడానికి రిథమ్‌ కావాల, పాడుకో. జల్సా జేస్కో. ఏమన్నా జేస్కో. ఆ పుటవా మాత్రం, ఆ మోదీ పుటవా మాత్రం ఆళ్ల పక్కన పెట్టమాకు బాబయ్యా! బాంచెన్‌ నీ కాల్మొక్త.

(మార్చి 22న ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌. తర్వాత శేఖర్‌గారు తెలుగువార్తలు డాట్‌కామ్‌లో షేర్‌ చేశారు.)