Saturday 11 October 2014

 వెబ్‌ పత్రికలతో ఒక బెంగ తీరింది, కానీ…!
సీరియస్‌ సాహిత్యాన్ని ప్రచురించే పత్రికలు తగ్గిపోయాయి అనే మాట తరచుగా వినిపిస్తున్నది. కథలు రాస్తాం సరే, వేదిక ఏదీ అని ఆందోళన వ్యక్తమవుతున్నది. కథకుల సమావేశాల్లో ఈ సమస్య గురించి చర్చ జరుగుతున్నది. ఆ లోటు తీర్చడానికి వెబ్‌ మ్యాగజైన్లు వచ్చేశాయి. పత్రికల్లో వచ్చిందాంతో సమానం కాదు అనే మాట ఉండనే ఉంటుంది. అది వేరే సంగతి.
వెబ్‌ మ్యాగజైన్లు వస్తూ వస్తూ చాలామంది కొత్త రచయితలను వెంట తీసుకొచ్చాయి. కొన్ని పాత బెంగలను తీర్చేశాయి. తెలుగు చచ్చిపోతోందని కొందరు రచయితలు బోలెడంత ఆవేదన చెందేవాళ్లు. తమ బాధను ప్రపంచం బాధ చేయడానికి విశ్వప్రయత్నం చేసేవాళ్లు. కొత్త తరంలో సాహిత్యం రాసేవాళ్లే లేరని ‘మన’ తరంతోనే ఈ సాహిత్య వ్యాసంగం చచ్చిపోతుందేమో అని ఆందోళన వ్యక్తమయ్యేది. ముఖ్యంగా సింగమనేని నారాయణ లాంటి పెద్దమనుషులయితే రేపట్నించే తెలుగు మాయమైపోతుందేమో, మన గోడు పంచుకోవడానికి మనుషులను వెతుక్కోవాలేమో అన్నంత దిగులు అందరికీ పంచేవారు. ఆ బెంగను  వెబ్‌ మ్యాగజైన్లు తీర్చేశాయి.
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల మీద బోలెడన్ని అపోహలుండేవి. ఐటి అనగానే తాగుడు, తినుడు, తిరుగుడు అని తా గుణింతం ఒకటి తెలుగులోకంలో ప్రచారంలో ఉండేది. వాళ్లు ఏమీ చదవరని, తమ తీపి బాధలు తప్ప ప్రపంచం బాధలు పట్టవని, వాళ్లవల్లే తెలుగునేల మీద తెలుగుదనం అంతరిస్తోందని ప్రచారం సాగుతుండేది. వెబ్‌ మ్యాగజైన్లు వచ్చాక ఈ అపోహను యథాతథంగా ప్రచారం చేసే అవకాశం పోయింది.
అంతకుముందు పత్రికల్లో కూడా అడపా దడపా సాఫ్ట్‌వేర్‌ రచయితలు కనిపించినా ఇపుడు కొత్త తరం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ వారితో పాటు చాలా రంగాల్లో పనిచేస్తున్న యువత సాహితీ ప్రపంచంలోకి దూసుకొస్తున్నది.
కాకపోతే ఏ మార్పు అయినా సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా రాదు. అతి విస్తరణ, ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టత లేకపోవడం అనే ముఖ్యమైన సమస్యలైతే ఉన్నాయి. రెండోది చాలా లోతైన వ్యవహారం.రచయితల ఎక్స్‌పోజర్‌ దగ్గర్నుంచి మన చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం దాకా చాలా అంశాలతో ముడిపడిన వ్యవహారం. సాహిత్యంపై లెఫ్ట్‌-లిబరల్‌ ప్రభావం పలుచబడడం స్పష్టంగా కనిపిస్తున్నది.
కేవలం సాహిత్యానికే పరిమితం కానటువంటి విస్తృతమైన రాజకీయార్థిక కోణాలున్నటువంటి ఆ సమస్యను పక్కనబెట్టి తొలి సమస్య వరకే పరిమితమవుదాం. స్థలానికి సంబంధించిన నియంత్రణ లేకపోవడం అనేది ఒక అర్థంలో రచనకు అవసరమే కావచ్చు. కథ ఇన్ని పేజీలే ఉండాలంటే ఎలా, సృజనకు హద్దులు గీస్తారా అనే హూంకారంలో కొంత న్యాయముండొచ్చు. ప్రశ్నలో న్యాయం కనిపించినంత మాత్రాన ప్రతి ప్రశ్న వెనుక న్యాయమైన ఉద్దేశ్యమే ఉన్నట్టు భావించనక్కర్లేదు.
ప్రశ్నించినవారందరూ కోరుకుంటున్న పరిష్కారం న్యాయమైనదే అయిఉండనక్కర్లేదు.  ఫలానా పార్టీ బిసిలకు తగినన్ని సీట్లు ఇవ్వడం లేదు అనే ప్రశ్న న్యాయంగానే కనిపించొచ్చు. కానీ దగ్గరగా పరిశీలిస్తే ఆ వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం వల్ల ఆతని వైయ్యక్తిక బాధకు సామాజిక కోణాన్ని ఆపాదించాడని అర్థమవుతుంది. ఫలానా సంకలనంలో నా కవిత, నా కథ ఎందుకు రాలేదు, ఫలానా అవార్డు నాకెందుకు రాలేదు అని ప్రశ్నించే బదులు  ఏదో ఒక సామాజిక వివక్షారూపాన్ని ఆపాదించేసుకుని దళితులకు అన్యాయం జరిగిందనో, స్ర్తీలకు అన్యాయం జరిగిందనో, మైనారిటీలకు అన్యాయం జరుగుతుందనో, తెలంగాణకు అన్యాయం జరిగిందనో చర్చను లేవదీసి అవతలివారిని బోనులో నిలబెట్టవచ్చును.
ఎందుకొచ్చిన గొడవ, ఇతని కథ అందులో పడేస్తే పోలా, ఒక అవార్డు ఇతని మొకాన కొడితే పోలా అనే స్థితిని కల్పించవచ్చును. వివక్షకు గురైన శ్రేణుల న్యాయమైన ప్రశ్నలు, ఆందోళనతో పాటే ఆ సమూహ శక్తిని వైయక్తికమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే శక్తులు ఎల్లప్పుడూ ఉంటాయి. అది కేవలం ఈ శ్రేణులకే పరిమితమైనది కాదు  కానీ వైయక్తికమైన ప్రయోజనాలు తీర్చుకోవడానికి న్యాయమైనదిగా కనిపించే సాధారణ అంశాల్ని ముందుపెట్టడమనే పెడధోరణి ఇటీవల పెరిగిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఆ ఊబిలోకి దిగితే బయటపడలేం. ఏదో రకమైన అధికారాన్ని ఆశించని, అధికారంలో ఆనందాన్ని వెతుక్కోని వ్యక్తుల సంఖ్య స్వల్పం. అధికారం లేని రాజకీయాలు ఆశావహంగా కనిపించనపుడు ఆ రాజకీయాలతో ముడిపడిన వారిలో సైతం మార్పు కనిపిస్తుంది.
Book and internet
అదెలాగూ సాధ్యం కాదు కాబట్టి ఉన్న రాజకీయాల్లో అధికారం కోసం పోటీపడదాం అనే ధోరణి తొంగి చూస్తుంది. అది కొన్ని సందర్భాల్లో పచ్చిగా కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో సోఫిస్టికేటెడ్‌గా కనిపిస్తుంది. మళ్లీ స్థల నియంత్రణ దగ్గరకు వద్దాం. నియంత్రణ అనేది  లేకపోతే ఏం జరుగుతుందో వెబ్‌మ్యాగజైన్లలో వచ్చే కొన్ని కథలను చూస్తే అర్థమవుతుంది. ఎటు తీసుకుపోతున్నారో తెలీని సుదీర్ఘప్రయాణాలు కనిపిస్తున్నాయి. చెలాన్ని ఇతరత్రా విషయాల్లో గుర్తుచేసుకుందాం కానీ ఇకానమీ ఆఫ్‌ వర్డ్స్‌ అండ్‌ థాట్స్ మాత్రం మర్చిపోదాం అనే వారు కనిపిస్తున్నారు.
వెబ్‌ అనేది బ్లాక్‌హోల్‌ అని తెలిశాక ఎంతైనా అందులో తోసెయ్యొచ్చు అనిపిస్తుంది. ఏం ఎడిట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. దానికితోడు సైబర్‌ ప్రపంచం లైకుల మీద కామెంట్లమీద నడుస్తుంది. సీరియస్‌ విమర్శకు అవకాశం తక్కువ. బాగుందండీ, చాలా బాగుందండీ దగ్గర్నుంచి అద్భుతమండీ వరకూ  భుజతాడనాలు ఎక్కువ. రచనకు అప్పటికప్పుడు స్పందన చూసుకొని ఆ చర్చలో భాగం పంచుకోవడమనే అవకాశము ఇందులోని సానుకూల కోణమైతే మన ఉనికి బయటపడకుండా కామెంట్‌ విసరగలిగే అవకాశం ఇందులోని లోపం. అజ్ఞాతంలో మనిషి స్వైరుడయ్యే అవకాశం ఎక్కువ. ఇది ఆరోగ్యకరమైన చర్చను పక్కదారిపట్టించే ప్రమాదం ఉంటుంది.
సాధారణంగా తాను రాసిన ప్రతివాక్యం సామాజిక శాసనం వంటి భావన కొందరు రచయితల్లో ఉంటుంది. పత్రికల్లో సాహిత్య పేజీల నిర్వాహకులు అపుడపుడు ఈ గాలిబుడగను సూదితో గుచ్చేవాళ్లు. వెబ్‌ మ్యాగజైన్ల నిర్వాహకులు తమ సాహిత్య సామాజిక ఆసక్తికొద్దీ శ్రమను వెచ్చించువారు. స్వయంగా సాహిత్యజీవులు. మార్పులు సూచించో, తిరస్కరించో రచయిత మోరల్‌ను దెబ్బతీయడమెందుకులే అనే సంశయం ఉండొచ్చు. అందులోనూ పత్రికల్లో అయితే స్థలాభావం పేరుతో అయినా ఎడిటింగ్‌ సూచించవచ్చు. కానీ ఇక్కడ స్థలాభావం అని చెప్సడానికి లేదు. ఫలితం, భుజబలం బుధ్దిబలాన్ని అధిగమించిన కథలు కనిపిస్తున్నాయి.
నిజమే, దిన పత్రికల సాహిత్యపేజీల నిర్వాహకుల్లో కొందరు దాన్ని బెత్తంగానో, కిరీటంగానో భావించి ఉండొచ్చు. ఏదో ఒక అధికార సాధనంగా మార్చుకుని ఉండొచ్చును. కానీ వ్యక్తులను పక్కనబెడితే స్థలనియంత్రణ అనేది రచయితలోని ఎడిటర్‌ను వెలికి తీసేందుకు ఉపయోగపడేది. సాంద్రతకు ఉపయోగపడేది. గాఢతకు ఉపయోగపడేది. స్వయం నియంత్రణ ఉన్న రచయిత కథ వేరు. ఖదీర్‌ తన కథను ఎన్నిసార్లు పునర్లిఖిస్తాడో ఎంతగా శ్రమిస్తాడో నాకు బాగా తెలుసు. తన శక్తి కథకు తప్ప మరోదానికి పెట్టాల్సిన అవసరం లేనంతగా పరిసరాలను ఏర్పరుచుకుంటాడు కూడా. అతన్ని దగ్గరగా చూసినందువల్ల సాధికారంగా ఉటంకిస్తున్నాను తప్పితే అతనొక్కడే అని కాదు. సీనియర్‌ కథకులు చాలామందిలో మనకు వారు పడిన శ్రమ అర్థమవుతుంది. ఆయా కథల మీద మనకు వేరే రకమైన విమర్శలు ఏవైనా ఉండొచ్చును కానీ వారు కథను బాధ్యతగా తీసుకుంటారు.  ఇపుడది కాస్తలోటుగా అనిపిస్తున్నది.  రాసిన ఇంకు ఆరకముందే అచ్చులో పడితే బాగుంటుందనే ఆత్రం పెరిగినట్టు అనిపిస్తోంది.
వెబ్‌ పత్రికలు చేసిన మరోమేలు భాషకు సంబంధించింది. ఆయా సందర్భాల్లో పాత్రలు పలికే సంభాషణల్ని కూడా యథాతథంగా రాయకుండా బూతుఫోబియా అడ్డుపడేది. మన సాహిత్య సంప్రదాయంలో ఇదొక అనవసరమైన అడ్డుగోడ. ఈ గోడను బద్దలు కొట్టిన రచనలు అరుదు. వసంతగీతం లాంటివి ఒకటో రెండో చెప్పుకోవచ్చు.పత్రికా మర్యాదలయితే చాలానే ఉండేవి. అతను ఆమెలోకి ప్రవేశించాడు అని మాగజైన్‌ మధ్యపేజీలో రాయొచ్చు. కానీ లంజె అని అతను తిట్టిన మాట మాత్రం వాడరాదు. బూతును భావనగా కాకుండా భాషకు పరిమితం చేసే వ్యవహారం మనకు ఎక్కువ.  ఎబికె లాంటివాడు దాన్ని బద్దలు చేసి పచ్చనాకు సాక్షిగా కొత్తగాలికి తెరలేపినా అది తెలుగు సమాజానికి నామిని అనే అద్భుతమైన రచయితను ఇచ్చింది కానీ పత్రికల్లో ఒక ధోరణిగా స్థిరపడలేదు.
గతంలో ఉమామహేశ్వరరావు ఆంధ్రజ్యోతి సండే ఇన్‌ చార్జిగా ఉన్నపుడు గాడిద ప్రస్తావనతో ఉన్న చిన్న కథను యథాతథంగా అచ్చేస్తే పత్రికలో పనిచేసే మర్యాదస్తులైన సీనియర్‌ ఉద్యోగులు ఎంత గొడవ చేశారో ఇంకా గుర్తుంది. నేను ఒక పద్యంలో కొన్ని హాండ్‌ షేకులను బురదమట్టలతోనూ, రత్యానంతర శిశ్నంతోనూ పోలిస్తే అదే సీనియర్లు ఎంత గొడవ చేశారో గుర్తుంది. ఇపుడు వెబ్‌ మ్యాగజైన్ల వల్ల ఆ మర్యాదలు తొలిగిపోయే అవకాశం వచ్చింది.
ఐరోపా, పశ్చిమదేశాల్లోని సీరియస్‌ రచయితలు సైతం ఫలానా ఫలానా వ్యక్తీకరణలను యధేచ్ఛగా వాడుతున్నారు. మనం ఎందుకు సంభాషణల్లో ఇంత మర్యాదగా అసహజంగా వ్యవహరిస్తున్నాం అనే వారు పెరిగారు.ఈ ఎరుక శుభసూచకం. అది మరీ ఫ్యాషన్‌గా మారిపోయి దానికదే ఒక విలువగా మారిపోతే ప్రమాదమనుకోండి. అది వేరే విషయం. సాధారణంగా సీరియస్‌ రచయితలు రచన తర్వాత వచ్చే స్పందన కంటే రచనను ఎక్కువ ప్రేమించారు  అనే వాస్తవాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే మనం ఒక పద్యమో, కథో అచ్చేశామనుకోండి. మనకు పరిచయమున్న వారు, లేనివారు  ఓ యాభై మంది లైక్‌ చేస్తారు.  బాగుందండీ అనేస్తారు. పత్రికలో ఫోన్‌ నెంబర్‌ ఇచ్చామనుకోండి. ఓ వందమంది ఫోన్‌ చేసి బ్రహ్మండమండీ అనేస్తారు. నెట్‌లో అయితే ప్రశంస ఒక క్లిక్‌ దూరం కాబట్టి చేసేస్తారు. అదే నిజమైన స్పందన అని తృప్తి పడితే బోల్తా పడే ప్రమాదం ఉంది. అక్కడే ఆగిపోయే ప్రమాదం ఉంది.
(మే 7, 2014న సారంగలో 'సంవేదన' కాలమ్‌ )

No comments:

Post a Comment