Thursday 14 April 2016

మదర్‌ ఇండియా-దేశభక్తి పురాణంనెహ్రూ ఆనవాళ్లపై మోదీ చేస్తున్న యుద్ధం ఇపుడు నెహ్రూ విశ్వవిద్యాలయం దగ్గర వచ్చి ఆగింది. ఈ యుద్ధంలో ప్రతీదీ సింబాలిజమే. ఆ సింబాలిజాన్ని మొదలుపెట్టినవాడు మోదీ.  స్వాతంత్ర్యోద్యమ వారసత్వం లేకపోగా ఆ స్వాతంత్రోద్యమ నాయకుడు గాంధీ హంతక వారసత్వమున్న సమూహానికి చెందినవాడు మోదీ. నెహ్రూ స్మృతులను చెరిపివేయకుండా  బలమైన పునాదులు వేసుకోవడం కష్టమని గ్రహించినవాడు. ఇతరత్రా భావోద్వేగ అంశాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినా అది తాత్కాలికమే అవుతుందని గ్రహించి పాత గురుతులు  చెరిపివేయడానికి ప్రయత్నించిన తొలి బిజెపి నాయకుడు. నెహ్రూని చెరిపివేయడమంటే ఆయన విధానాలను , ఆయన ఆరంభించిన ప్రణాళికా సంఘం లాంటి వాటిని రద్దు  చేయడమొక్కటే కాదు. పటేల్‌ విగ్రహాలను పెద్దవి చేయడమొక్కటే కాదు. బోస్‌ ఫైల్స్‌ అడ్డం పెట్టుకుని దాడి చేయడమొక్కటే కాదు. నెహ్రూని చెరిపివేయడమంటే దేశపు మేధో  వారసత్వంలో బలంగా జీర్ణించుకుపోయి ఉన్న లిబరల్‌, లెఫ్టిస్ట్‌ ధోరణులను తుడిచేయడం. మిగిలిన పనులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేయొచ్చు. కానీ ఇక్కడ ఘర్షణ ఎదుర్కోక  తప్పదు. నెహ్రూ ఇతరత్రా అంశాల్లో ఎన్ని సర్దుబాట్లు చేసుకున్నా ఒక్కో సారి రాజీ పడినట్టు కనిపించినా మేధో సంప్రదాయంలో మాత్రం గంభీరమైన వాతావరణానికి బాటలు వేశారు.  అక్కడ సైంటిఫిక్‌ టెంపర్‌మెంట్‌ కోసం ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీ బంట్లను నియమించాలని ఎన్నడూ అనుకున్నట్టు కానరాదు. కాంగ్రెస్‌ అంత:పుర రాజకీయాల్లో భాగంగా తర్వాత  పదవి చేపట్టిన ఆయన వారసులు కూడా ఈ విషయంలో ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. వామపక్షాలతో దోస్తీ నెరుపుతున్న కాలంలోనే కాదు. వారు ప్రత్యర్థులుగా మారిన కాలంలో  కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థలకు వామపక్ష, లిబరల్‌ భావాలున్న వారినే నియమించేవారు. ఇపుడు మోదీ ఈ మొత్తం విధానాన్నే సవాల్‌ చేయదల్చుకున్నారు.దీన్ని సవాల్‌ చేయకుండా  మనం తలల మార్పిడి శస్ర్త చికిత్సలు ఎపుడో చేశామని, విమానాలు ఎప్పుడో కనుగొన్నామని సైన్స్‌ కాంగ్రెస్‌లో చెప్పడం సాధ్యం కాదు. టిప్పు సుల్తాన్‌ గురించి శివాజీ గురించి తమకు  తోచింది ప్రచారం చేయడం సాధ్యం కాదు. సినిమా కళారంగాల్లో తమ అజ్ఞానాన్ని బాహాటంగా ప్రదర్శించుకోవడం సాధ్యం కాదు.  జీవితాన్ని వాటికే అర్పించిన మేధావులు ఆయా  రంగాలన్నింటిలో స్థిరపడి పోయి ఉన్నారు.అక్కడ గురి చూసి కొట్టారు మోదీ. దేశంలోని సెక్యులర్‌ లిబరల్‌ లెఫ్టిస్ట్‌ శక్తులతో యుద్ధానికి తలపడ్డారు. అది ఎఫ్‌టిటిఐ లాంటి సంస్థల్లో  నియామకాలు కావచ్చు. హేతువాదులు, నాస్తికులపై దాడులు కావచ్చు. ఆడవాళ్ల బట్టలమీద అదేపనిగా చర్చ లేవనెత్తడం కావచ్చు. టిప్పు సుల్తాన్‌ లాంటి ఎపిసోడ్‌లు కావచ్చు.  దేశభక్తిమీద చర్చ కావచ్చు. మరేదైనా కావచ్చు. ఇవ్వన్నీ ఈ దేశపు సాంస్కృతిక రంగంలో ఇప్పటివరకూ ఎంతో కొంత స్థిరపడి పోయి ఉన్న సెక్యులర్‌ లిబరల్ వామపక్ష స్ఫూర్తిని  తుడిచివేసే బలమైన ప్రయత్నం. సైన్స్‌ కాంగ్రెస్‌, హిస్టరీ కాంగ్రెస్‌ లో ఆ మార్పులు కనిపిస్తున్నాయి. ఇంతవరకూ దేశాన్ని ఏ పార్టీ పాలించినా భావజాల రంగంలో బలమైన ప్రయత్నం  చేయలేదు. ఇది ఒక రకంగా కాషాయ సాంస్కృతిక విప్లవం.  ఇక్కడ రివర్స్‌. బంబార్డ్‌ ది హెడ్‌ క్వార్టర్స్ లాగా కేంద్రంపై పోరు కాదు. కేంద్రం నుంచి పోరు.
ఈ ముప్పును ఆయా రంగాల్లోని వారు సరిగానే గ్రహించారు. కానీ వారు సంఘటితశక్తిగా లేరు. అందువల్ల ఏ రంగానికి ఆ రంగం ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. అందులోనూ బోలెడంత  సింబాలిజం ఉంది. చరిత్రకారులు స్పందించారు. సైంటిస్టులు స్పందించారు. రచయితలు తమ అవార్డులు వెనక్కు ఇవ్వడం ద్వారా స్పందించారు. సినిమా కళాకారులు వారికి తోచిన  రూపాల్లో స్పందించారు. ప్రతి రంగంలోనూ విభజన స్పష్టంగా కానవచ్చిన కాలమిదే.కానీ  ప్రతిఘటన వచ్చిన కొద్దీ మోదీ పరివారం మరింత కరుగ్గా తయారవుతూ వచ్చింది. మన  ప్రయాణం ఎటువైపు అనేదానికి ఇదొక సింబల్‌. ఆయా సందర్భాల్లో వారి మాటలు, చేతలు చూస్తే వారికి ఎంత స్ఫష్టమైన ఎజెండా ఉందో అర్థం అవుతుంది.ప్రతిష్టాత్మకమైన పుణే ఫిల్మ్‌  ఇన్‌స్టిట్యూట్‌కి జోకర్‌ లాంటివాడిని నియమించారు అని మెజారిటీ కళాకారులు గొంతెత్తి నినదించినా, విద్యార్థులు నెలల తరబడి ఆందోళన చేసినా ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గలేదు.  ఈ స్పష్టమైన సంకేతాలు గ్రహించే అన్ని రంగాల్లోని లిబరల్‌ వామపక్ష శక్తులు తమ శక్తిమేరకు తమకు తోచిన రూపాల్లో నిరసన తెలిపారు.రాజకీయ రంగంలోని వైఫల్యం వల్ల కళాకారుల  సైంటిస్టుల మేధావుల ప్రయత్నం కూడా తాటాకు మంటగానే మిగిలిపోయింది. కాకపోతే ఏదో ముప్పు పొంచి ఉంది అనే స్పృహ ఐతే దేశంలోని ఆలోచనాపరుల్లో పెంచగలిగింది. ఇపుడిక  చివరిగా విద్యార్థుల వంతు.మధ్యతరగతి ప్రభుత్వ హాస్టళ్లో చదువుకునే రోజులు ముగిసిపోయాక కళాశాలల్లో రాజకీయ చైతన్యం దాదాపుగా అడుగంటింది.క్యాంపస్‌లలో ఉండే అనుకూల  వాతావరణం వల్ల అక్కడ కేంద్రీకృతమైంది.ఉడుకుడుకు నెత్తుటి వ్యక్తీకరణ  వేడిగా ఉంటుంది. ప్రభుత్వం అందులోని వేడిని మాత్రమే బయటకు చూపించి అందులోని నిప్పులాంటి  వాస్తవాన్ని మాత్రం దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నది. అవసరం అనుకున్న చోట నిప్పుకు ఫోటోషాప్‌ మంటలద్ది మీడియాకు వదులుతున్నది. అందుకు అన్ని అంగాలను వాడుకుంటున్నది.  హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో రోహిత్‌ ఆత్మహత్య తర్వాత తమకు తోచిన రీతిలో ఎడిట్‌ చేసిన కొన్ని దృశ్యాలను మీడియాలకు విడుదల చేయడం ఇందులో భాగం. జెఎన్‌యులో  కన్నయ్య కుమార్‌ నినాదాలపై తప్పుడు ఆడియో వేసి మోసపు వీడియో విడుదల చేయడం అందులో భాగం. వాస్తవానికి రెండు చోట్ల విద్యార్థుల ఆందోళనలో కశ్మీర్‌, అప్జల్‌ గురు  వివాదాస్పద ఉరి అంశాలు ఉన్నాయి. ఆ రెండూ చూపించి దేశభక్తిపేరుతో ఉన్మాదం పెంచొచ్చు. కానీ ఆ రెండూ మాట్లాడుతున్నవారు మేధావుల్లో చాలామందే ఉన్నారు. అందువల్ల  భారత్‌కు బర్బాద్‌ కరేంగీ అన్నారని యాకూబ్‌మెమన్‌ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇట్లా ఏవేవో మాటలు ఎలివేట్‌ చేసి లిబరల్స్‌ను కూడా ఇబ్బంది పెట్టాలనేది ఎత్తుగడ.  విద్యార్థులకు మద్దతునిచ్చే లిబరల్‌ న్యాయవాదులను కోర్టులోనే పరుగులు పెట్టించి మరీ కొట్టారు. కన్నయ్యను కోర్టు ఆవరణలోనే పోలీసుల మధ్యలోనే దారుణంగా కొట్టారు. పైగా  ఉచ్చపడేట్టు కొట్టాం అని బహిరంగ ప్రకటనలు కూడా ఇచ్చారు. భౌతికంగా తమకు ఉన్న ఆధిక్యతను భావజాల యుద్ధంలో పూర్తిగా ఉపయోగించుకోవాలని మోదీ పరివారం భావిస్తోంది.  ఇది స్పష్టం. 

స్మృతి ఇరానీ గరం గరంగా మాట్లాడారు. సావిత్రి మాదిరే తనకూ గ్లిజరిన్ అవసరం లేదు అని నిరూపించారు. చాలా ఎమోషనల్‌గా పవర్‌ఫుల్‌ స్పీచ్‌ ఇచ్చారు. బిజెపిలో మరెవరూ  మాట్లాడలేనంత గంభీరంగా మాట్లాడారు. వెల్... ఇంతకీ సారాంశమేమిటి? ఒక్క ముక్క అయినా పనికొచ్చేది మాట్లాడారా? ఈ దేశపు మానవవనరుల మంత్రి ఫలానా ఫలానా అంశాలపై  తనకు వ్యక్తిగతంగా ఫలానా ఫలానాఅభిప్రాయాలు భావోద్వేగాలు ఉన్నాయని ప్రకటించారు. అంతకంటే సరుకు అందులో ఏమన్నా ఉందా! మహిషాసుర అమరత్వ మట అని ఎద్దేవా  చేశారు. తడికంటితో గద్గదంగా మాట్లాడారు. మహిషాసుర అమరత్వపు దినం జరపడం ఇది కొత్త కాదని ఆమెకి ఎవరైనా చెప్పాలి కదా! నరకాసురుడి అమరత్వం కూడా  జరుపుకొంటున్నారని దీని వెనుక తరతరాల వివక్ష బారిన పడిన మండిన గుండెల ఆవేదన ఉందని ఆమెకెవరైనా చెప్పాలి కదా! దేవతలు రాక్షసులకు సంబంధించి ఒకే ఒక లీనియర్‌  సిద్దాంతం ఏమీ లేదు. ఎవరి నమ్మకాలు వారికి ఉండొచ్చు. దేవతలు ఆధిపత్య సూచికలు అని భావించేవారు ఆ ఆధిపత్యాన్ని సవాల్‌ చేయడానికి రాక్షసుల్లో తమను తాము  చూసుకోవచ్చు. చరిత్రలోనే కాదు. పురాణాల్లో కూడా గెలిచిన వాడే హీరో. ఓడిన వాడు విలన్.ఈనాడు అనేక రకాలుగా సమాజంలో ఓటమికి వివక్షకు బలవుతున్నవారు  ఆ నాడు ఓటమి  పాలైన వారిలో తమను తాము చూసుకోవడం ఒక సింబాలిక్‌ విషయం. దాని వెనుక పనిచేసే ఆర్యన్‌-ద్రవిడియన్‌ సిద్ధాంతాలను కాసేపు పక్కనబెడదాం. ఆమె ఏం చేశారు? కోల్‌కతాలో ఈ  మాట అనగలరా అని బెంగాల్‌ సభ్యులకు సవాల్‌ విసిరారు. ఇందులో ఏముంది? ప్రిన్సిపులా, రాజకీయ ఎత్తుగడా! తమిళనాట రాముడిని కొలిచే ఆచారం ఉండక పోవచ్చు. కొన్ని చోట్ల  రావణాసురుడిని కొలిచే ఆచారం ఉండొచ్చు. అయ్యో మహిషాసురుడిని కొలుస్తారా అని అదేదో ద్రోహం లాగా పార్లమెంట్‌లో పేపర్లు విసిరేస్తూ ఊగిపోతా ఉంటే ఆహా, ఏమి సెప్తిరి ఏమి  సెప్తిరి అని మనం చప్పట్టు కొట్టాలా? ఏవో పుస్తకాలు తెచ్చి నాలుగో తరగతికి ఇలాంటి పాఠాలు చెప్తారా, ఆరోతరగతికి ఇలాంటి పాఠాలు చెప్తారా అని నిగ్గతీసి అడిగారు. అలా వెతుక్కుంటూ  పోతే చాలానే ఉంటాయి. అంతెందుకు, చంద్రుని మీదకు గ్రహాలు పంపుతూ ఒకే తరగతిలో ఒక చోట అదొక గ్రహమని ఇంకో చోట అదొక దేవత అని చెప్పడం వింత కాదూ! ఈ వింతని  వింత అనలేనంతగా మనం అలవాటు పడలేదూ. చంద్రుని మీదకు ప్రయోగాలు చేసే సైంటిస్టులే, చంద్రుని తలలో ధరించాడని భావించే విగ్రహానికి మొక్కడం అసహ్యంగా లేదూ! అలవాటై  పోయిన వింతలు, అసహ్యాలు మామూలైపోతాయి. ఆధిపత్య సమూహపు వింతలువింతలుగా కనిపించవు. ప్రభుత్వాధినేతలు ముహూర్తాలు చూసి పునాదులు వేయడం, పూజలు  చేయడం వగైరా రాజ్యాంగానికి అవమానం కాదూ! ఇవేమీ మనం అడగడం లేదు కాబట్టి అవన్నీ వాళ్ల విశ్వాసం పోనిద్దురూ అనే సహనం మనందరిలో పెరిగిపోయింది కాబట్టి వారికి  న్యాయమైన విషయాల పట్ల కూడా అసహనం వెలిబుచ్చే అవకాశం వస్తోంది. చాలా సహజమైన విషయాలు కూడా విడ్డూరంగా కనిపిస్తున్నాయి. ఇంత గంభీరమైన ఉపన్యాసం ఇచ్చిన  మంత్రిణి కన్నయ్య కుమార్‌ మీద కేసులు తప్పుడు కేసులా నిజమైనవా  అనే విషయంలోకి మాత్రం రాలేకపోయారు. అతను బ్రాహ్మణిజం పోవాలి, ప్యూడలిజం పోవాలి, క్యాపిటలిజం  పోవాలి, అంటే కశ్మీర్‌కు అఫ్జల్‌ గురుకు అనుకూలంగా భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడినట్టు తప్పుడు మాటలు చెప్పి అరెస్ట్‌ చేశారే,దాని గురించి స్మృతి గారి నోరెందుకు మూతపడినట్టు.  చనిపోయిన రోహిత్‌ ఒక అబ్బాయి.కులం మతం కాదు, ఒక మనిషి, ఒక యువకుడు. ఒక తల్లిగా మాట్లాడుతున్నా అని ఆవేశపడిన స్మృతికి కన్నయ్య గురించి ఎందుకు నోరు రాలేదు.  ఎందుకంటే చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం ఈజీ. పైగా కులం మతం ఇత్యాది విషయాల్లో ఆధిపత్య స్థానాల్లో ఉన్నవారికి వాటి ప్రస్తావన అవసరం ఉండదు. వారికి చాలా  ఇన్‌ఫార్మల్‌ లెవల్లో ఆపరేట్‌ చేసే విద్యలు తెలిసి ఉంటాయి. కొత్తగా వాటిని ఎదుర్కోవాల్సిన సన్నివేశంలో ఉన్నవారే సంఘటితం కావల్సి ఉంటుంది. ఫార్మల్‌ రూపాల్లో బాహాటంగా వాటి  గురించి మాట్లాడాల్సి వస్తుంది. అందుకే ఈ దేశంలో కులాన్ని మతాన్ని అన్ని చోట్లా సోషల్‌ కేపిటల్‌గా ఆధిపత్య సాధనంగా వాడుకునే వారే ఈ కులం గోల ఏటండీ అనేస్తుంటారు. కేంద్రీయ  విశ్వవిద్యాలయాల్లో 23 మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో 19 మంది దళితులు, ఇద్దరు ఆదివాసీలు, ఒక మైనారిటీ అని ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక తేల్చింది. మరి  ఆత్మహత్యల మీద దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు పేటెంట్ ఎందుకు ఉందో బతుకు భరోసాపైన సంపదపైనా మిగిలిన వారికి పేటెంట్‌ ఎలా వచ్చిందో సదరు మంత్రిణి గారు చెప్పాలి  కదా? ఇంతకీ స్మృతి ఇరానీ గరం గరం ఉపన్యాసం రుచి ఏమిటి? సుగతో బోస్‌ చేసిన అర్థవంతమైన ఉపన్యాసం సోదిలేకి లేకుండా పోయి మీడియా అంతా స్మృతి ఇరానీ కనిపిస్తే మనం  ఏమని అర్థం చేసుకోవాలి?

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, దేశభక్తి అనే రెండు భావనలకు సంబంధించి బోలెడంత చర్చ నడుస్తూ ఉంది. చదువుకోవాల్సిన చోట రాజకీయాలేంటి అనే పాత ముతక మాటల దగ్గర్నుంచి  ఫలానా ఫలానా నినాదాలు ఇవ్వవచ్చా అనేదాకా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఆర్మీ వాళ్లు ఎక్కడో వాతావరణం బాగా లేక చనిపోతే దాన్ని పోటీ పెట్టి తోక కోసిన కోతిలాగాగంతులు  వేసే వాళ్లూ ఉన్నారు. విద్యార్థి లోకం బిజెపితో పెట్టుకోదల్చుకుంది. వారి జగన్నాధ రథచక్రాన్ని అడ్డుకోదల్చుకుంది. మిగిలిన రంగాలు ప్రయత్నించి వదిలేసిన బాధ్యతను తాను భుజాన  వేసుకోదల్చుకుంది.అదీ అసలు విషయం. మిగిలిందంతా సింబాలిజమే.ఇందులో వారికి ఫలానా అంశం అవసరమా కాదా అనే చర్చ ఉండదు. ఏ నినాదం ఇస్తే బిజెపికి గట్టిగా  తగులుతుందో అదే విసురుతారు.  కశ్మీర్‌, అఫ్జల్‌ గురు, యాకూబ్‌మెమన్‌ అంశాలు అలా వచ్చి చేరినవే. ఈ మూడు అంశాల్లోనూ వివాదాలున్నాయి.  కశ్మీరీల స్వేచ్ఛా కాంక్షకు  మద్దతునిచ్చేవారంతా ఉగ్రవాదులైతే వారికి ప్లెబిసైట్‌ నిర్వహిస్తామని లాల్‌ చౌక్‌లో హామీ ఇచ్చిన ప్రప్రధమ ప్రధాని నెహ్రూ ఏమవ్వాలి?  భారత రాజ్యం వారికిచ్చిన హామీ ఏమైంది అడిగిన  పాపానికి టెర్రరిస్టులు అని ముద్ర వేస్తున్న వారు హురియత్‌ కాన్ఫరెన్స్‌తో ఏ ప్రాతిపదికన చర్చలు జరుపుతున్నారు. వారినెప్పుడూ టెర్రరిస్టులు అని పిలవగా మనం విన్నామా? అఫ్జల్‌  గురు శిక్షకు సంబంధించి న్యాయనిపుణులు కూడా అప్పట్లోనే సందేహాలు వెలిబుచ్చి ఉన్నారు. కలెక్టివ్‌ కన్‌సైన్స్‌ ను సంతృప్తిపర్చడానికి ఈ శిక్ష విధిస్తున్నట్టు అప్పట్లో సుప్రీం కోర్టు  పేర్కొంది. ఆ తీర్పును తప్పు పట్టడం నేరమా? అఫ్జల్‌ గురు అమరవీరుడని పిడిపి పబ్లిగ్గానే ప్రకటించుకుంది. మరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని బిజెపి కశ్మీర్‌లో అధికారంలో ఎలా భాగం పంచుకుంది? యాకూబ్‌ మెమన్‌ను ఏమీ చేయం అని మంచి మాటలతో భారత్‌ పిలిపించి ఉరిశిక్ష వేశారు అనే వాదన బలంగా ఉంది. పోలీస్‌ శిబిరాల్లోనే  దీనికి సంబంధించిన వివాదాలున్నాయి. ఇవేమీ కొత్త అంశాలు కావు. కొత్తగా కళ్లు పత్తిపువ్వుల్లాగా విప్పార్చుకుని చూడాల్సిన వివాదాలూ కావు. సుప్రీంకోర్టు శిక్ష విధించిన మనిషికి  మద్దతుగా మాట్లాడాతారా అని కళ్లు ఇంత పెద్దవి చేసి స్మృతి ఇరానీ ప్రశ్నిస్తున్నారు. విమర్శలకు సుప్రీంకోర్టు అతీతమేమీ కాదు అని ఆమెకు ఎవరు చెప్పాలి? చుండూరు మారణకాండకు  ఎవరూ కారకులు కారన్నట్టు అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తే హైకోర్టును విమర్శించకుండా ఉన్నామా? సదరు మంత్రిణికి ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి ప్రజాస్వామ్య చరిత్ర గురించి  ఎవరు చెప్పాలి? అసలీ దేశభక్తి అనే కాన్సెప్ట్‌ ఎప్పుడు వచ్చింది, దాని మూలాలేమిటి అనే చర్చ వేరే కథ. ఆ మాటకొస్తే దేశం దేశభక్తి అనే భావనలను ఎగతాళి చేసిన ఠాగూర్‌ గీతాన్ని  జాతీయగీతంగా పెట్టుకున్న దేశం మనది. స్మృతి ఇరానీ వాదన ప్రకారం అయితే ఠాగూర్‌ దేశద్రోహి అవుతారు. అనగలరా ఆమె ఆ మాట. సుగతా బోస్‌కు పదే పదే సవాళ్లు విసిరిన  మంత్రిణి ఈ మాటకు బదులు చెప్పగలిగారా?  బెంగాల్‌ వీధుల్లో కోల్‌కతా కాళీనే కాదు, మేడమ్‌, ఠాగూర్‌ కూడా ఉంటారు అని ఆమెకు ఎవరు చెప్పాలి? దేని పట్ల అయినా ఏభక్తి అయినా  ఆరోగ్యకరమైనది కాదు. వ్యక్తికి కాదు. సమాజానికి కాదు. భక్తి హేతువుకు బద్ధశత్రువు.  బలవంతుని అభిప్రాయాలే అభిప్రాయాలుగా చెలామని అయ్యే చోట దేశభక్తి మెజారిటీ పట్ల భక్తే.  అదేమీ అమూర్తమైనది కాదు. అంతిమమైనదీకాదు. దేశభక్తి పేరుతో మిలిట్రీ డ్రెస్‌ చూసి చొక్కాలు చించుకుని స్టుడియోనే కిష్కింధ కాండగా మార్చే చానల్‌ సంపాదకులు ఉన్న చోట  చదువు బొత్తిగా లేనట్టు కనిపిస్తున్న స్మృతి ఇరానీకి ఏం చెపుతాం?
 జెఎన్‌యు లాంటి వివాదమే జాదవ్‌పూర్‌ వర్సిటీలో చెలరేగితే అక్కడ విసి చొరవ వల్ల అది అక్కడికే పరిమితమైంది. జెఎన్‌యులో పరివారం నియమించిన విసి లాగా జాదవ్‌పూర్‌ విసి  పోలీసులను పిలవలేదు. సెడిషన్‌ కేసులు పెట్టించలేదు. మాజీ ఆర్మీ వాళ్లతో దేశభక్త  పేరెడ్‌ నిర్వహించలేదు. ఆర్మీ యూనిఫామ్‌ దేశభక్తి సంకేతం కావడంలోనే ప్రమాదకరమైన సింబాలిజం  దాగున్నది. జెఎన్‌యు వివాదం కన్నయ్యతో ఆగదు. అసలు వారి టార్గెట్‌ కన్నయ్య కూడా కాకపోవచ్చు.  ఉమర్‌ ఖలీద్‌ లాంటి వాళ్లు కావచ్చు. అతను ప్రాతినిధ్యం వహించే రాజకీయ  భావజాలం కావచ్చు. అతను ప్రాతినిధ్యం వహించే మార్జినలైజ్డ్‌ సమూహాలు కావచ్చు. ఉమర్‌ ఖలీద్‌లాంటి వారి భవితవ్యం ఏమవుతుంది అనేదాన్ని బట్టి మనం ఎంతవరకు మన  ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకోగలం అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్కటైతే నిజం. ఇది ఇక్కడితే ఆగేది కాదు. దళితులు మైనారిటీలు విద్యావంతులు అయ్యే కొద్దీ మార్క్స్‌  అంబేద్కర్‌ తిరిగి తిరిగి వస్తారు. పరివారానికి సవాళ్లు విసురుతూనే ఉంటారు.
 జి ఎస్‌ రామ్మోహన్‌ 
(ఫిబ్రవరి 27, 2016న ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

ధిక్కార సంకేతం

       తన మరణ వాంగ్మూలాన్నే వ్యవస్థ పై ధిక్కార ప్రకటన చేసి వెళ్లిపోయాడు రోహిత్‌. క్యాంపస్‌ పరిణామాల పరిధిని తక్కువ చేయడానికి ఎవరైనా ఏ తెరల వెనుక అయినా దాక్కునే ప్రయత్నం చేయొచ్చు. కానీ రోహిత్‌ చనిపోయిన తర్వాత మీడియా గ్లేర్‌లో మన అందరి కళ్లముందూ జరిగిన నాలుగు విషయాలైతే తప్పించుకునే వీలు లేకుండా వ్వవస్థ స్వభావాన్ని మన ముందుంచుతున్నాయి.. ఈ నాలుగూ నిన్నా మొన్నా జరిగిన ఘటనలు. ఒకటి అతని శవాన్ని దహనం చేసిన తీరు. ఉస్మానియా ఆస్పత్రి నుంచి పోలీసులు శవాన్ని తరలించి నగరమంతా తిప్పుతూ ఆందోళనకారుల దృష్టిమళ్లించి క్షణాల్లో తగలేశారు. విద్యార్థులు ర్యాలీ చేస్తారనో సెంట్రల్‌ విశ్వవిద్యాలయం తీసుకువెళ్లి పెద్ద యెత్తున ఉద్యమిస్తారనో పోలీసులు భయపడి ఉండొచ్చు. కానీ పెద్ద కులపోళ్లకు సంబంధించిన పెద్దమనిషి చనిపోతే ఇలాగే చేస్తారా! ఎక్కడికి తీసుకుపోతున్నారో. ఎక్కడ దహనం చేస్తారో శవం వెంట ఉన్న తల్లికి తెలీదు. చెట్టంత కొడుకుపోయి దుక్ఖంలో ఉన్న తల్లిని వెంటపెట్టుకుని వెంటపడుతున్న కార్యకర్తలను తప్పించుకుని పోలీసులు అంత రహస్యంగా, దొంగతనంగా ఎందుకు తగులబెట్టాల్సి వచ్చింది? ఒక లక్ష్యం కోసం ప్రయాణిస్తూ ఆ మార్గంలో మరణించినపుడు సహ ప్రయాణికులు బంధువులకేమీ తక్కువ కారు. అతనికి మిత్రులు చాలామందే ఉన్నారు. పోలీసులు ఇలా చేస్తారని అనుమానం వచ్చి బృందాలు బృందాలుగా స్మశానలన్నింటిచుట్టూ పరుగులు పెట్టారు. అయినా కడసారి గౌరవం ఇవ్వకుండా చేయగలిగారు పోలీసులు. విద్యార్థులు క్రైస్తవ స్మశానాల వెంట తిరుగుతూ ఉంటే పోలీసులు సైలెంట్‌గా అంబర్‌ పేట స్మశాన వాటికలో కాల్చేశారు. వాళ్లు ఈ విద్యలో పండిపోయి ఉన్నారు. ఇందులో పని చేసింది ఏ అహంకారం!
రెండో ఉదంతం -లీకైన వీడియో. అది ఎబివిపి వాళ్లు సెలక్టెడ్‌గా కట్‌ చేసి పంపించిన వీడియో అని తెలుస్తూనే ఉంది. అయినా ఆ వీడియోలో ఏముంది? కొంతమంది ఎబివిపి కార్యకర్తలు రోహిత్‌ని చుట్టుముట్టి ప్రశ్నించడం ఉంది. క్యాంపస్‌లో కొంతమంది గుంపుగా వచ్చి ప్రత్యర్థి విద్యార్థి సంఘానికి చెందిన మనిషిని ఒంటరిచేసి చేసి చుట్టుముడితే వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కాబట్టి ఆ సందర్భాన్నుంచి సంభాషణను విడదీసి చూపడంలో నే కుట్ర ఉంది. అయినా ఆ వీడియోలో ఏముంది? బ్యానర్లు చించావా అంటే చించాను అన్నాడు,. చించుతాను అని కూడా అన్నాడు. అందులో అంత పెద్ద నేరం ఏముందని? అదేదో సాధించినట్టు, చనిపోయిన మనిషిని బోనులో పెట్టగలిగిన వీడియో అన్నట్టు షో చేశారు. ఏదైనా వీడియోను సగం సగం అట్లా అమెచ్యూరిష్‌గా షూట్‌ చేసి బూజరబూజరగా చూపిస్తే అందులో ఉండకూడని దేదో ఉందని సమాజం భావించేట్టు మీడియా ఇప్పటికే అలవాటు చేసింది. ఆ అలవాటును తమ ప్రయోజనాలకు అనువుగా వాడుకోవాలనే కుట్ర ఉంది ఇందులో. ఒక వీడియోలో కొంత భాగాన్ని తమకు అనువుగా ఎవరైనా మలుచుకుని మీడియాకు పంపించారంటేనే అందులో నేర స్వభావం దాగుంది అని అర్థం. పైగా ఆ వీడియో అంతకుముందే సర్కులేషన్లో ఉన్నదే. పూర్తి వీడియో పెట్టండి దమ్ముంటే అని రోహిత్‌ స్వయంగా సవాల్‌ విసిరి ఉన్నాడు కూడా. కానీ అంతా కలిసి ఆ చనిపోయిన కుర్రాడి మీద సానుభూతిని తగ్గించాలనే లక్ష్యంలో భాగంగా దాన్ని ఓవర్‌ ప్లే చేశారు. ఇందులో పనిచేసింది ఏ అహంకారం!
ఈ రెంటినీ మించింది కుల సర్టిఫికెట్ల గొడవ. అతను ఎస్సీనా కాదా అనే అనవసరమైన చర్చ లేవదీశారు. తల్లిది ఏ కులము? తండ్రిది ఏ కులము? అతను వడ్డెర అవుతాడా, మాల అవుతాడా! ఏమిటీ చర్చ. ఎంత అమానవీయం? ఒక మనిషి చనిపోయాడు. భవిష్యత్తు సమాజానికి గొప్ప ఆశ్వాసం ఇవ్వగలిగిన ఒక ఆలోచనాపరుడు చనిపోయాడు. తన పట్ల తన తోటివారి పట్ల విశ్వవిద్యాలయం చూపిన అమానవీయ వైఖరి వల్లే చనిపోయాడని తెలుస్తూనే ఉంది. విశ్వవిద్యాలయ యాజమాన్యం, ముఖ్యంగా విసి వైఖరి అతని చావుకు కారణమైందా లేదా, ఒత్తిడి తెస్తూ కేంద్రం లేఖలు పంపిందా లేదా అనేవి అసలు విషయాలు. విశ్వవిద్యాలయమూ, కేంద్రమూ మొత్తం వ్యవస్థ రకరకాల కంపులతో కుళ్లిపోయి ఒక సున్నిత మనస్కుడిని ఒంటరి చేసి బలితీసుకున్నాయా, లేదా అనేది అసలు విషయం. ఆ కుర్రాడు వడ్డెర అయినా మాల అయినా ఇందులో తేడా ఏమైనా ఉంటుందా! మెదడుకు పిలకలు వేసే వాళ్లు ఉంటారని తెలిసే నేమో అతను జాషువా కులం గురించి ఉద్వేగపూరితమైన చర్చ తన ఫేస్‌బుక్‌ పోస్టుల్లో చేసి ఉన్నాడు. సమాజానికి ఉపయోగపడగలిగిన ఆలోచించగలిగిన ఒక మనిషి అన్యాయంగా పోయాడు అనే కనీసమైన బాధ లేకుండా అతని తల్లిదండ్రుల కులం వెంట డిటెక్టివ్‌ల్లాగా పరిగెట్టే వాళ్లను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. సాంకేతికమైన అంశాల్లోనూ కోర్టుల్లోనూ కుల సర్టిఫికెట్ల అవసరం రావచ్చునేమో. ఆ సందర్భం వచ్చినపుడు ఆ చట్టమో న్యాయమో తేల్చుకుంటాయి. తాను ఏ ఐడెంటిటీతో అయితే ఏకీభవించి ఆ ఐడెంటికీ ఈ దేశంలో ఎదురవుతున్న అవమానాల గురించి తల్లడిల్లి చివరి క్షణం దాకా పోరాడి నిరసన రూపంగా ఈ వ్యవస్థ మొద్దు చర్మంమీద ఉమ్మేసి వెళ్లిపోయిన ఒక యువకుడికి అర్జెంటుగా వేరే కులం ఆపాదించి విషయాన్ని దారి మళ్లించాలని చూసే వాళ్లను ఏమనాలి? పర్వర్ట్‌డ్‌, సిక్ మైండ్స్‌?తల్లికులం కులం కాదని చెప్పే మగ దురహంకార వ్యవస్థను అతను బోనులో నిలబెట్టి వెళ్లాడు. కనీస మానవీయ స్పృ హలేకుండా అసలు విషయానికి ఏ మాత్రం సంబంధం లేని దుర్మార్గమైన చర్చను పదే పదే ముందుకు తీసుకురావడంలో పనిచేస్తున్నది ఏ అహంకారం? ఏ ఆధిపత్యం?
విద్యార్థులకు శిక్ష విధించిన విచారణ కమిటీకి దళితులు నేతృత్వం వహించారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. అసలు ఆ కమిటీలోనే దళితులు లేరు. విశ్వవిద్యాలం ఎగ్జిక్యుటీవ్ కౌన్సిల్‌లో ఎన్నడూ లేరు. తగుదునమ్మా అని మీడియాముందు గంభీరమైన బేస్‌ వాయిస్‌ పెట్టి నిర్లజ్జగాఇంత అబద్ధం ఆడడంలో పనిచేసింది ఏ అహంకారం?
విశ్వవిద్యాలయాల్లో కులాధిపత్యం పాతుకుపోయి ఉన్నదని తెలుసుకోవడానికి పెద్ద జ్ఞానమేమీ అక్కర్లేదు. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో గత ఏడేళ్లలో చనిపోయిన విద్యార్థులందరూ దళిత బహుజనులే కావడం యాదృచ్ఛికం అవుతుందా! సుఖం మీకు శోకం మాకు అని మీ గీత చెపుతోందా అన్న ప్రశ్నకు వ్యవస్థను నడిపిస్తున్న పెద్దమనుషులు సమాధానం చెప్పాలి.

అసలు ఆ విద్యార్థులకు విధించిన శిక్షలోనే ఫ్యూడల్‌ కులం కంపు ఉంది. క్యాంపస్‌ హాస్టల్‌నుంచి విద్యార్థులను బహిష్కరించడం దేనికి సంకేతం? ఇది సెక్యులర్‌ శిక్షా? గ్రామాల్లో తమ మాట విననపుడు పెత్తందార్లు దళిత బహుజనులకు విధించే సాంఘిక బహిష్కారానికి దీనికి తేడా ఉందా? సదరు వైస్‌ చాన్సలర్‌ ఛీప్‌ వార్డన్‌గా ఉన్నపుడే పదిమంది దళితబహుజన రీసెర్చ్‌ స్కాలర్స్‌ని రస్టికేట్‌ చేశారు. కెరీర్‌కు సంబంధించి వారి భవితకు సంబంధించి అది ఉరిశిక్షతో సమానం. ఆ సందర్భంగా బాలగోపాల్ సమాజానికి అవసరమైన ప్రశ్నలు వేసి ఉన్నారు. పట్టించుకున్నదెవరు? క్యాంపస్‌ పాలిటిక్స్‌లో ఆవేశకావేశాలు ఉంటాయి. అవి కొత్తవేమీ కావు. కానీ రస్టికేట్‌ చేసేంత దూరం పోవడంలో పనిచేసిన అంశం ఏమిటి? వాళ్లు అగ్రవర్ణ పెద్దమనుషుల పుత్రులే అయితే ఆ పనిచేసి ఉండేవారా! మనకు తెలిసీ తెలీకుండా లోలోపల పనిచేసే కులం ఇందులో కనిపించడం లేదా! ఉరిశిక్షను వ్యతిరేకించడం అనేది నాగరికమైన మనిషి ఎవరైనా చేయాల్సిన పని. అది ఎబివిపి వారి జ్ఞాన పరిధిని మించిన విషయం. నిక్కర్ల నుంచి ఫ్యాంట్లకు అప్‌గ్రేడ్‌ అయిన వారికి కూడా అందని విషయమే. అది వారికి మింగుడుపడకపోవచ్చు. వారి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. కానీ యాకూబ్‌ మెమన్‌ ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఆందోళన చేయడం సంఘవ్యతిరేక కార్యకలాపం ఎలా అయ్యింది? టెర్రరిస్టు యాక్టివిటీ ఎలా అయ్యింది? ఇలాంటి నిర్వచనాలు ఇచ్చే అధికారం వారికి ఇచ్చిందెవరు? నాగరికమైన పని చేసినవారిని టెర్రిరిస్టు యాక్టివిటీస్‌ చేస్తున్నవాళ్లు అని ముద్ర వేయడంతో పనిచేసే అంశం ఏమిటి?ఈ వ్యవస్థలో మేము వాళ్లు అనే విభజనలో ఈ వాళ్లు అనేది ఎప్పుడూ పేదలు, దళిత బహుజనులు, మైనారిటీలే ఎందుకవుతున్నారు? మతాన్ని కులాన్ని అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయించేవారు కులనిర్మూలనా వాదులను కులవాదులుగా చిత్రించడంలో పనిచేసే అంశం ఏమిటి? ఈ విలోమ న్యాయానికి కారణమేంటి? ఇవన్నీ యాదృఛ్చికమైన విషయాలా? హిందూత్వ వాదులు మరే భావజాలాన్ని సహించే స్థితిలో లేరని తమ అధికారాన్ని బలాన్ని ఉపయోగించి అణగదొక్కడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపే సంకేతాలు కావా?
అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ విద్యార్థులు అగ్రెసివ్‌గా ఉండే మాట వాస్తవం. అది స్థాయీ బేధాలతో కమ్యూనిస్టు సంఘాల్లోనూ దళిత సంఘాల్లోనూ ఫెమినిస్టు సంఘాల్లోనూ ఆయా సందర్భాల్లో కనిపిస్తుంది. అది వ్యవస్థను ధిక్కరించే వారిలో ఉండే ఆగ్రహం. నిలువనీటిని ధిక్కరించేవారిలో ఉండే ఆగ్రహం. అటువంటి ప్రశ్నేలేకపోతే ప్రశ్నించేవారే లేకపోతే వ్యవ్సస్థ కుళ్లిపోయి చచ్చిపోతుంది. ప్రశ్న మాత్రమే, ప్రశ్నించే గొంతులు మాత్రమే ఏ వ్యవస్థనైనా మానవీయంగా మారుస్తూ ముందుకు నడిపిస్తాయి. స్టేటస్‌కో గొంతులు కావు. కానీ వారి కళ్లలో ఆగ్రహం మాత్రమే కనిపించి ఆ ఆగ్రహానికి కారణమైన వేల సంవత్సరాల ఆకలి అవమానం కనిపించకపోవడంలో పనిచేసేది ఏ అహంకారం? వర్ణాంధత్వం కళ్లకు కమ్మితే తప్ప వాస్తవాలు కనపించకుండా ఉండడం సాధ్యమేనా! అలవాటై పోయిన అణచివేత ఇంటర్నలైజ్‌ అయిపోయి ఎరుక లేని మొద్దుతనం మెదడును ఆవహిస్తుంది. ఆ మాయా పొరలు తొలగించుకుని వాస్తవాన్ని గ్రహించాలంటే ఏ మనిషికైనా ఒకటే విలువ అనే ప్రజాస్వామిక దృక్కోణం అవసరమవుతుంది..
టీచర్లకు విద్యార్థుల పట్ల ఉండాల్సిన దృక్పథం ఏమిటి? గ్రామీణ పేద దళిత బహుజనులు ఇలాంటి సంస్థల్లో ప్రవేశం పొందడమే కష్టమైన విషయం. సంప్రదాయ అర్థంలో అయినా టీచర్‌ వారికి మార్గదర్శనం చేసేవారిగా ఉండాలని చెపుతారు. వారి మంచి చెడులు చూడగలిగే సంరక్షలుగా ఉండాలని చెపుతుంటారు. టీచర్‌ తండ్రిలాంటివాడు అని సంప్రదాయ వాదులు కూడా గంభీరంగా సెలవిస్తుంటారు. సంరక్షకులు చేసే పనేనా ఇది? ఇక్కడ జరిగిందేమిటి? సాధారణంగా హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం లాంటి వాటి పట్ల అందులో ఉండే టీచర్లకు బయటివారికి కూడా భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. అది అత్యాధునికమైన టీచర్లు, అత్యాధునిక మైన స్వేచ్ఛా వాతావరణం ఉన్నవిశ్వవిద్యాలయం అనే భావన ఉంటుంది. కొన్ని రాష్ర్ట విశ్వవిద్యాలయాల్లో ఉన్నట్టు అక్కడ కులం పేర హాస్టళ్లలోనూ టీచర్లలోనూ చీలికలు బాహాటంగా ఉండకపోవచ్చు. కులం ఇతర విశ్వవిద్యాయాల్లో మాదిరి బండగా ఆపరేట్‌ చేయకపోవచ్చు. అందువల్ల మా దగ్గర అ లాంటి వాతావరణం ఉండదండీ అని సులభంగాఅనేస్తుంటారు.. చాలామందినిజంగా నమ్ముతుంటారు కూడా. కానీ బాహాటంగా బ్లాక్‌ అండ్‌ వైట్‌గా కనిపించే చోట కంటే కనిపించకుండా అంతర్గతంగా సోఫిస్టికేటెడ్‌ రూపాల్లో పనిచేసేచోటనే ఆలోచనాపరులు దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. దాన్ని గుర్తించి దాంతో తలపడడానికి లోచూపు అవసరం. ఇపుడు రోహిత్‌ ఆ ముసుగును కూడా చించేసి కుల్లం కుల్లా చేసి వెళ్లాడు.
ఇతర విద్యార్థి సంఘాలకు బయట అండగా నిలబడే పెద్ద సంస్థలుంటాయి. కష్టనష్టాలను పంచుకోవడానికి ,అవసరమైనపుడు ఆవేశం పాలు తగ్గించి ఆలోచన పాలు పెరిగేలా చేయడానికి అనుభవజ్ఞుల సలహాలు ఉపయోగపడతాయి.. దళిత ఉద్యమం దారితప్పి కనిపించకుండా పోయిన మాట వాస్తవమే కావచ్చు. తమకు ఎవరూ లేరు అనే భావనలో దళితవిద్యార్థి సంఘాలు పడిపోయేలా అది కొంతవరకు పనిచేసి ఉండొచ్చు. కానీ హిందూత్వ రాజకీయాలను వ్యతిరేకించేవారు, అంబేద్కర్‌ కులనిర్మూలనా భావజాలంతో మౌలికంగా ఏకీభావమున్న పురోగామి శక్తులు బయట చాలామందే ఉన్నారు. అనేక రూపాల్లో ఉన్నారు. అనుసంధాన ప్రక్రియలో ఎక్కడో లోపం జరిగింది. లేకపోతే విద్యార్థులు ఒంటరితనం ఫీల్‌ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం వచ్చి ఉండేది కాదు. క్యాంపస్‌కి వెళ్లాలి అనుకుంటూ వాయిదాలు వేస్తూ వచ్చిన మిత్రులు చాలామంది ఇపుడు గిల్టీగా ఫీల్‌ అవుతున్నారు. వాళ్లు వెళ్లడం వల్ల ఏదో జరిగిపోతుందని కాదు. బలమైన శత్రువుతో తలపడుతున్నపుడు మౌలికంగా ఏకీభవించే మనుషులు చేతులు కలపకపోవడం ఆత్మహత్యాసదృశ్యం.. సామాజిక నేరం కూడా. ఇది రెండువైపులా జరగాల్సిన పని. రెండువైపులా ఉండాల్సినంత చొరవ లేకపోవడం వల్ల ఇక్కడ కనిపించే లోపం. అంత లోతైన ఆలోచనలు ఉన్న రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడడం అంతుపట్టని విషయం. పైగా అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకున్న మనిషి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటో ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం గాని విషయం. ఆ లేఖలో మనిషి అస్తిత్వం కుదించబడడం వంటి పదాలు చూశాక ఉన్న భారాలకు తోడు తాత్విక ఏకాకితనం కూడా ఆవహించిందా అనిపించొచ్చు . కానీ అవేవైనా సంక్షుభిత సందర్భంలో మనిషి చిక్కుకున్నపుడు అదనంగా పనిచేసే అంశాలు తప్పితే వాటికవి కారణాలు కాలేవు-మన వాతావరణంలో. వాటిని చర్చించడానికి ఇది సందర్భం కూడా కాదు. కానీ దుర్మార్గమైన అణిచివేత బారిన పడి ఒక మనిషి ఒంటరైపోయి తన చావుతో కదలిక తీసుకురావాలని అనుకోవడం మాత్రం అందరి ఫెయిల్యూర్‌ కిందే లెక్క. రోహిత్‌ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలు ఒక విషయాన్నైతే స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని క్యాంపస్‌లలో రగిలే గుండె మంటలు ఢిల్లీని బలంగా తాకుతున్నాయి. అంబేద్కర్‌ నుంచి స్ఫూర్తి పొందిన, చదువుకున్న దళిత బహుజనులు హిందూత్వకు వ్యతిరేకంగా ఏకం కాగలరని తెలియజేస్తున్నాయి. ఎన్ని కుయుక్తులు పన్నినా పురోగామి శిబిరం నుంచి లాగేసుకోవడం పరివార్‌కు సాధ్యం కాని పని. అగ్గిరాజుకుంటున్నది.. మార్క్స్‌- అంబేద్కర్‌ హిందూత్వకు సవాళ్లు విసురుతూనే ఉంటారు. రోహిత్‌ ఆత్మహత్య ఎట్టిపరిస్థితుల్లో అంగీకారం కాదు కానీ తన విషాదాంతంతో అటువంటి సవాల్‌ను అయితే విసిరివెళ్లాడు. క్యాంపస్‌లన్నింటిని ఏకం చేశాడు. ఈ ఐక్యతను కొనసాగించి ఆధిపత్య శక్తుల ఆట కట్టించడమే అతనికి మనం ఇవ్వగలిగిన నివాళి.

(మూడు రోజుల క్రితం నా క్యాంపస్‌కి వెళ్లి వచ్చిన రోజు రాసుకున్న నాలుగు మాటలు.)
జి ఎస్‌ రామ్మోహన్‌
(జనవరి 23, 2016న ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌)

తూర్పు-పడమర  

Artwork: Srujan Raj
Artwork: Srujan Raj
-జి ఎస్‌ రామ్మోహన్‌

వరలక్ష్మికి అప్పటికి గానీ అర్థం కాలేదు. అన్న కావాలనే అటూ ఇటూ తిరుగుతున్నాడని. తప్పించుకు తిరుగుతున్నాడని. వచ్చినపుడు దూరపోళ్లని పలకరిచ్చినట్టు పలకరిచ్చిందే! కుదురుగా మాట్లాడే అవకాశమిస్తేగా!  చూడనట్టే మొకం పక్కకు తిప్పుకుని మొబైల్‌లో మొకం దూర్చేస్తున్నాడు. అదొకటి దొరికింది మనుషులను తప్పించుకోవడానికి. ఏడాదిలోనే ఎంత మార్పు! మనిషి మునుపటంత తేటగా లేడు. కడుపు ముందుకు పొడుచుకుని వచ్చేసింది. మొకమంతా ఎవరో బాడిసెతో చెక్కినట్టు అదో రకంగా ఉంది. కళ్లకింద కండ ఉబ్బిపోయి వింతైన నునుపుతో రంగుతో మెరుస్తా ఉంది. ఆ నునుపు మెరుపు ఏం బాలేదు.
అన్న ముఖం ఎంత అందంగా ఉండేది? ఎంత చక్కని పలకరింపు? వెన్నెల ఆరబోసినట్టు ఏం నవ్వు అది? ఏమైపోయింది? డబ్బు ఇంతగా మనుషులను మారుస్తుందా! ఎందుకు మాట్లాడాలనుకుంటోందో ఏమి మాట్లాడాలనుకుంటుందో తెలిసిపోయినట్టే ఉంది. తెలీకుండా ఎట్లా ఉంటది? తడిక చాటు రాయబారాలతో పనికాకనే కదా ఆడో మొగో తేల్చుకుందామని ఇక్కడికొచ్చింది?
“ఇంకా తేల్చేదేముందే, వాళ్లు చేసుకునే రకం కాదు’
అని ఇరుగుపొరుగు అంటారు కానీ అలాంటి పాడు మాటలు వరలక్ష్మికి వినపడవు.
“ఎక్కడ ఈ సంబంధం కుదిరిపోతుందో అని వారి బాధ’ అని లోలోపల తనను తాను సమాధానపర్చుకుంటా ఇప్పటివరకూ లాక్కొచ్చింది వరలక్ష్మి. ఇపుడు వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేసరికి కాళ్లు వణుకుతున్నాయ్‌.
ఏమయితే మాత్రం, తోడపుట్టినదాన్ని ఇంత అవమానిస్తాడా! ఎంత కింది చేయి అయితే మాత్రం నాలుగు మాటలు మాట్లాడలేనంత లోకువైపోయిందా!  లోలోపల సుడులు తిరుగుతా ఉంది. అయినా వరలక్ష్మి ముక్కు చీదలేదు. వరలక్ష్మి చదువూ సంధ్యలు లేని మనిషి కాదు. మంచీ మర్యాదా తెలీని మనిషి కాదు. టెన్త్‌ పాస్‌ అయిన అమ్మాయి. ఇంటర్‌ చేరి మానేసిన అమ్మాయి. దుక్ఖాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకున్న మనిషి. వాళ్లూరు పెద్దమ్ములు పేరుకు పల్లెటూరేగానీ మరీ ఎక్కడెలా ఉండాలో తెలీనంత పల్లెటూరేమీ కాదు. దాచేపల్లి టౌన్‌కు పక్కనే అంతా కలిసిపోయినట్టే ఉండ్లా ఇపుడు!
“”ఆ దిక్కుపాలిన పడమటికి ఇవ్వబట్టి నా బతుకు ఇట్లా అయిపోయింది గానీ  తూరుపునే ఇచ్చి ఉంటే మెడలో గొలుసులు అవీ వేసుకుని దర్జాగా కుర్చీలో కూర్చొని బీడుపడిన పొలాల గురించి పాడైపోయిన వ్యవసాయం గురించి మాట్లాడతా ఉండేదాన్ని కాదూ.”
అని ఎన్ని సార్లు అనుకోని ఉంటదో ఈ మధ్య. ముక్కు పుటాలు అదురుతుండగా మొకంలో మారుతున్న రంగులను ఎవరైనా గమనిస్తున్నారా అని చుట్టూ చూసింది. నలుగురైదుగురి చూపు తనమీదే ఉందని అర్థమైనా ఛీఛీ అదంతా తన భ్రమ  అనేసుకుంది. ఊరికే చేతిలో మొబైల్‌ ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ తిప్పి చూపులో తడి ఎదుటోడికి కనిపించకుండా కాపాడుకుంది.
“ఓ గజ్జెల గుర్రమా, ఓ పిల్లా, ఏమే, ఎంత ఇంజనీరు మొగుడు దొరికితే మాత్రం పుట్టినూరోళ్లు కనిపించరేమే”
అని ఒక కుర్రపిల్లతో పనిగట్టుకుని పరాచికాలకు దిగింది. పక్కనున్న పెద్దావిడ చీర ఎక్కడ కొన్నదో వాకబు చేసింది.
మనింట్లో మనం ఎట్టైనా ఏడ్చుకోవచ్చు. పదిమందిలో, అందులోనూ బంధువుల పెళ్లిలో ఏడిస్తే నగుబాటు కాదూ!
Kadha-Saranga-2-300x268
పెళ్లి మంటపం కళకళగా ఉంది. గలగలగా ఉంది. ఇటీవలే కొత్త హంగులు తొడుక్కున్న మస్తానయ్య గారి ఎసి కల్యాణ మంటపం. సత్తెన పల్లి ఇదివరకటి సత్తెన పల్లికాదు, పల్నాడు ఇదివరకటి పల్నాడు కాదు అని ప్రభలు కట్టి మరీ చాటుతున్నట్టుంది. అమరావతి అంతగా కాకపోయినా తమకూ ఆ అదృష్టంలో ఎంతో కొంత వాటా వస్తుందని ఆశగా ఉంది. తమ పొలం పక్కనే పరిశ్రమలొస్తాయని భరోసాగా ఉంది. అమరావతి వాళ్లైతే ఎమ్మెల్యేల ఇల్లు తమ పొలంలోనే ఎలా వస్తాయో నలుగురికి చేతులూపుతా చెపుతా ఉన్నారు. ప్రతి పదిమందిలో ఆరేడు మంది రియల్‌ ఎస్టేట్‌ గురించే మాట్లాడుతున్నారు. కూలోళ్లు నోటికొచ్చినంత అడిగితే బక్క రైతు బరించేదెట్లా అని వినిపించే చోట, కాని కాలంలో ఆకాశంలో మబ్బు కనిపిస్తే మిర్చి తడిసిపో్తుందని ఆందోళనలు వినిపించే చోట ఇపుడు లేఅవుట్ల భాష వినిపిస్తోంది. లక్ష అంటే అపురూపంగా మాట్లాడుకునే గడ్డమీద ఇపుడు కోటి అంటే ఎంత, రెండక్షరాలేగా అనిపించేట్టు అయిపోయింది. ఎకరా అరెకరా అమ్ముకుని ఇంటినీ ఇల్లాలినీ మెరుగుపెట్టిన వాళ్ల హడావుడి ఒక రకంగా ఉంది. ఆడోళ్ల మెడలు కొత్త బంగారు లోకం అన్నట్టున్నాయి. మగాళ్ల చేతులకు కడియాలు మెరుస్తా ఉండాయి. అన్నిట్నీ మించి చేతుల్లో ఇమడలేక చారడేసి మొబైల్‌ ఫోన్లు బయటకు దూకుతా ఉన్నాయి. అమ్మేస్తే ఐసా పైసా అయిపోతాం అని వెనుకా ముందూ ఆడుతున్న జాగ్రత్త పరుల గొంతులు ఇంకో రకంగా ఉన్నాయి.
కొందరు మగవాళ్ల చూపులు తలుపు దగ్గర వరుసగా గులాల్‌  చల్లుతూ నిలబడిన మణిపురి, నేపాలీ పిల్లల మోకాళ్ల దగ్గర లంగరేసి ఉన్నాయి.  పిక్కల పైపైకి పాకుతూ ఉన్నాయి. ఇంత పెద్ద కల్యాణ మండపాలు అక్కడోళ్లకు మరీ వింతేమీ కాదు. కానీ ఇట్లా జవాన్లు వరుసగా నిలబడ్డట్టు ఆడపిల్లలు నిలబడ్డం కొత్త. అందునా తెల్లతెల్లగా పాలిపోయిన రంగున్న ఆడపిల్లలు. పిక్కలపైన గౌన్లేసుకున్న ఆడపిల్లలు.  భూమి పుట్టినప్పటినుంచి వాళ్లు అలాగే నుంచోని ఉన్నారేమో అన్నట్టు ఏమాత్రం ఆసక్తి కలిగించని నవ్వుతో రోబోల మాదిరి ఉన్నారు ఆ ఆడ పిల్లలందరూ. మొగోళ్ల వయ్యారాలు చూసి ఆడోళ్లు గొణుక్కుంటా ఉన్నారు. ఆ పిల్లల చేత గులాల్‌ చల్లించుకోవడానికి దగ్గరదగ్గరగా వాలిపోతున్న మొగుళ్లని డొక్కలో పొడుస్తున్నారు. “చూసింది చాల్లే నడువబ్బా” అని ముందుకు తోస్తున్నారు. పెళ్లి మంటపం అరేంజ్‌ మెంట్ ఆ ఊరోళ్లు నాలుగు రోజుల పాటు చర్చించుకోవడానికి వీలుగా ఉంది. మండపం పక్కనే వేదికపై కోలాటం ప్లస్‌ కథాకాలక్షేపం నడుస్తా ఉంది. యాభై యేళ్ల రాజమండ్రి ఆడపడుచు వాళ్ల బంధువల టీమ్‌తో కలిసి కథాకాలక్షేపం చేయిస్తా ఉంది. ఆ దిక్కుమాలిన రికార్డింగ్‌ డాన్సులకంటే ఈ కథ ఎంత బాగుంది ఒదినా అని మాటలు  వినిపిస్తున్నాయి. పట్టుచీరల రెపరెపల మధ్యలో రెండు మూడు లోవెయిస్ట్‌ జీన్స్ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. “ఎంత హైదరాబాద్‌లో ఉద్యోగమైతే మాత్రం పెళ్లిలో అదేం అవతారమే పోలేరమ్మలాగా” అనే సణుగుడులు గాజుల చప్పుళ్లలో కలగలసి ముసిముసిగా వినిపిస్తున్నాయి. పెళ్లి మంటపం వెనుక పై అంతస్తులో నల్లకుక్కతో ఇరవై మంది కుర్రాళ్లు కుస్తీ పడుతున్నారు. గ్లాస్ చప్పుళ్లు, జోకులు అపుడపుడు ఆగిఆగి వినిపిస్తున్నాయ్‌.
“బీరేందిరా ఆడోళ్ల మాదిరి…..డిసెంబర్లో బీరేందిబే” ..
గట్టిగట్టిగా నవ్వులు.
“హుస్‌ హుష్‌ ….మెల్లగా.. నీ యబ్బ, రెండు పెగ్గులకే వీరంగమెస్తున్నావేరా” అని అందరికీ మెల్లగా సుద్దులు చెప్పే గొంతుకలు కొంచెం గట్టిగానే వినిపిస్తున్నాయి. మొన్నమొన్నటిదాకా రాయల్‌ స్టాగ్‌ పేరే రాయల్గా వినిపించే చోట బ్లాగ్‌ డాగ్‌  మాలిమి అయిపోతా ఉంది.

అన్నతో అటో ఇటో తేల్చుకోవడానికి ఈ పెళ్లిని వేదికగా ఎంచుకుంది వరలక్ష్మి. పెదనాన్న మనమడి పెళ్లి. బంధుబలగమంతా చేరే పెళ్లి. ఇక్కడైతే నలుగురు పెద్దమనుషులుంటారు. అటో ఇటో తేలుస్తారు. ఏందిరా దాని సంగతి  అని అడుగుతారు. అవసరమైతే గడ్డి పెడతారు. నలుగురూ గట్టిగా అడిగితే తోడపుట్టినోడు కాదనగలడా! అటో ఇటో తేల్చకుండా తప్పుతుందా!  కొండంత అనుమానమూ గంపెడాశ కలగలిసిన ఆదుర్దాతో ఇక్కడకొచ్చింది. తీరా ఇక్కడకొస్తే సీన్‌ రివర్స్‌ గేర్‌లో తిరుగుతా ఉంది. ఇక్కడ జరుగుతున్న పంచాయితీలు తన పంచాయితీ కంటే పెద్దవిగా కనిపిస్తున్నాయి. కోర్టులు కేసులు అని ఏవేవో వినిపిస్తున్నాయి. ఇక్కడంతా పటమట తూర్పుగా విడిపోయి కనిపిస్తున్నారు. దాచేపల్లోళ్లు, అమరావతోళ్లుగా కనిపిస్తున్నారు.  సత్తెనపల్లి సెంటర్‌గా అమరావతోళ్లు, దాచేపల్లోళ్ల మధ్య సెటైర్లు నడుస్తున్నాయి. ఎక్కడ తక్కువైపోతామో అని దాచేపల్లోళ్లు సాధ్యమైనంత కష్టపడి తయారై వచ్చినా అదింకా స్పెషల్గా ఎక్కిరిస్తున్నట్టుంది కానీ అవమానాన్ని ఆపుతున్నట్టు లేదు. అంతా దగ్గరిదగ్గరోళ్లే. మొన్నమొన్నటిదాకా అంతా పంచె ఎగ్గట్టి మడిలో దిగినోళ్లే.
………………………………………..
ఎట్లాంటి అన్న. కోటప్పకొండ జాతరకు భుజాలమీదెక్కించుకుని తిప్పిన అన్న. ప్రభల ఊరేగింపు సరిగా కనిపించకపోతే నెత్తిమీద నిలబెట్టుకుని చూపించిన అన్న. మొన్నటికి మొన్న సంక్రాంతి పండక్కి పుట్టింటికి పోయినపుడు కోడలు సైకిల్‌ అడిగితే మామూలు సైకిల్‌ కాకుండా ఏడువేలు పెట్టి అదేందో గేర్ల సైకిల్‌ కొనిచ్చిన అన్న. అపుడే కదూ, అన్న ఎంత పెద్దోడయిండో తెలిసింది. మంచికి మర్యాదకు పుట్టింట్లో లోటు చేసింది లేదు. అయితే మాత్రం, ఆ దిక్కుమాలిన పడమటకిచ్చినందుకు ఒక దారి చూపించొద్దూ! బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చిన మాటైనా నిలబెట్టుకోవద్దూ!
Artwork: Srujan Raj
పెళ్లి వేదికకు దూరంగా మంత్రాల చప్పుడు మరీ ఎక్కువ కాని చోట నలుగురు పెద్దమనుషులు సీరియెస్‌గా పంచాయితీ చేస్తున్నారు. కోర్టు అనే మాట మర్యాదకాదని ఎవరికో చెపుతున్నారు. రేప్పొద్దున ఒకరికొకరు ఉండాల్సినోళ్లు అని సర్దిచెపుతున్నారు.
“కట్నం ఘనంగా ఇచ్చి తాహతుకు మించి పెళ్లి చేశాడా, లేదా! ఐదేళ్ల తర్వాత ఇపుడు భూమిలో వాటా ఉందంటే ఎట్టరా అని మీసాల పెద్దాయన చెపుతున్నాడు. అన్న ప్రేమతో ఏదైనా ఇస్తే తీసుకోవాలి. వాడు మాత్రం కాదంటడా. తాను శ్రీమంతుడైతే చెల్లెలు పేదరికంలో బతకాలని అనుకుంటడా! ఇచ్చింది తీసుకుంటే పద్ధతిగా ఉంటది, నా మాటినండి అని అనునయిస్తా ఉన్నాడు. “ఏం, అది మాత్రం వాళ్ల నాయనకు పుట్టలా! వాడొక్కడే పుట్టాడా. ఇయి పాతరోజులు కావు. ఏదో ముష్టిపడేసినట్టు పడేస్తామంటే కుదరదు. మాట ప్రకారం రెండెకరాలూ ఇవ్వాల్సిందే. ”…వెనుకనుంచి ఎవరో గొణగడానికి అడగడానికి మధ్యరకంగా మాట్లాడుతున్నారు. గట్టిగా వినిపించాలి. కానీ డిమాండ్‌ చేసినట్టు ఉండకూడదు. ఇవ్వకపోతే ఇంకో రూట్‌ తప్పదని చెప్పాలి. అదీ ఆ వాయిస్‌ సారాంశం. “ఎవడ్రా అది పెద్దోళ్లు మాట్లాడుతుంటే..” అని ఎవరో కసురుతున్నారు. వారి టోన్‌ ఇంకా స్థిరంగా ఉంది. అటూ ఇటూ స్టేక్స్‌ గట్టిగానే ఉన్నట్టున్నాయి.

అమరావతి నుంచి వచ్చినవాళ్లలోనే కొందరు ఇంకో చోట చేరి బెంగగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లు మొకాలు అంత ధీమాగా లేవు. వాళ్ల మొకాలు బాడిసెతో చెక్కినట్టుగా లేవు. వాళ్ల మొకాలు తుప్పు పట్టిన కొడవళ్లలాగా, కొచ్చన్‌ మార్కుల్లాగా ఉన్నాయి. ఉన్న ఎకరా, అరెకరా తీసేసుకున్నారు. రేపటినుంచి ఏం పనిచేయాలి? ఎట్లా బతకాలి? పిల్లల చదువులెట్లా? ప్రభుత్వం రాజధాని నిర్మించేదెపుడు? స్థలం ఇచ్చేదెపుడు? మబ్బు చూసి ముంత ఒలకబోసుకుంటే ముందు ముందు బతుక్కు భరోసా ఏంటి అని బెంగగా చర్చించుకుంటున్నారు.

అంతా కలగాపులగంగా ఉంది. వరలక్ష్మికి లోపల అంతకంటే అలజడిగా ఉంది. ఏడాదిన్నరలో అంతా మారిపోయింది. ఊర్లు మారిపోయాయి. బంధుత్వాలు మారిపోయాయి. దాచేపల్లి పక్కన పెద్దమ్ములుకు ఇచ్చి పెళ్లిచేసినపుడు ఇద్దరివీ పల్లెటూళ్లే. ఇద్దరివీ మెట్ట గ్రామాలే. ఆ మాటకొస్తే అమరావతి పక్కనున్న మహేశ్వరం కంటే పెద్దమ్ములు పెద్దగానే ఉండేది. మెట్టినిల్లు కూడా పుట్టినిల్లు కంటే పెద్దిళ్లే. రెండెకరాలు ఎక్కువుండే ఇంటికే ఇచ్చారు. అపుడంటే కథ వేరు. ఇపుడంతా మారిపోలే! అక్కడి మెట్ట ఇంకా అట్లనే ఉంది. ఇక్కడి మెట్ట కోట్లకెక్కింది. అన్న ఇన్నోవాలో తిరుగుతుంటే అందరూ మీ అన్న అంతోడు ఇంతోడు అంటుంటే పైకి సంబరంగానే ఉంటుంది కానీ లోలోపలే గుచ్చుకున్నట్టు ఉంటుంది. ఏదో తేడా. ఏదో వెలితి.
ఒక కడుపున పుట్టినదాన్ని. తనకు తానుగా పిలిచి
“అరే వరా..ఇదిగోరా…ఇది నీది. ..తీసుకో” అంటే ఎంత బాగుండును. బిడ్డలు కడుపులో ఉన్నపుడు అనుకున్నమాటకే ఇపుడు దిక్కులేకుండా పోయిందే! అంతంత ఆశలు పెట్టుకోవచ్చా! ఆ మాటొక్కటి నిలుపుకుంటే చాలదూ!”
వరలక్ష్మికి కాలూ నిలకడగా లేదు. మనసూ నిలకడగా లేదు. ఊరికే అటూ ఇటూ తిరిగి వాళ్లనీ వీళ్లనీ అకారణంగా పలకరిచ్చి మాట్లాడతా ఉంది. ఉన్నట్టుండి మొగుడిమీద కోపం గొంతుకాడికి తన్నుకొచ్చింది.
“మొగుడే సరీగుంటే తనకీ యాతన వచ్చి ఉండేదా! ఆయన కదా ఈ వ్వవహారాలు చూసుకోవాల్సింది. పేరుకు మగపుట్టుకే కానీ కూతుర్ని కనడానికి తప్ప మరెందుకైనా ఆ మగతనం ఉపయోగపడిందా! గొడ్డులాగా పనిచేయడమే గానీ ఒక సంతోషం ఉందా! ఒక సంబరం ఉందా! నలుగురూ ఎట్లా బతుకుతున్నారు అనే ఆలోచనలేదు. అసలు నలుగురిలో కలిసేదే లేకపోయెనే! పెళ్లికి రమ్మంటే కూడా అమ్మా కూతుళ్లు పోండి అనే మొగోడయిపాయె. తూరుపున అన్నదమ్ములూ ఆడబిడ్డలూ ఉన్నోళ్లందరూ ఎట్లా ఉరుకులాడుతున్నరు. ఈయనకేం పట్టకపాయె. బీడీ తాక్కుంటా ఆకాశం కేసి చూస్తా ఉంటే నడిచే రోజులా ఇవి. ఏ మనిషో ఏమో! ఇంట్లో పడున్న ఎద్దూ ఒకటే ఆయనా ఒకటే. ఒకర్ననుకుని ఏం కర్మ. నా కర్మ ఇట్లా కాలింది” నిస్సహాయతతో కూడిన ఆగ్రహంతో కుతకుతా ఉడికిపోతా ఉంది వరలక్ష్మి.
“ఆ.. ఈడ సీసాలో గొట్టమేసుకుని మజా తాగుతా ఉండు. ఆడ మీ బావ ఎవర్నో చేసుకుని మజా చేసుకుంటడు. బావెక్కడున్నాడో చూసి రాపోవే. పలకరచ్చిరాపాయే ఎర్రిమొకమా”
మొగుడిమీద విసురంతా కూతురుమీదకు ట్రాన్స్‌ఫర్‌ చేసి గదమాయించింది.
ఆ పిల్ల అటూ ఇటూ తిరుగుతూ వెనుక వరుసలో గోడకు జారగిలిపడి ఐఫోన్‌తో ఆటలాడుకుంటున్న కుర్రాడిని చూసింది. ఆ కుర్రాడు పలుచగా ఉన్నాడు. పంట్లాం జారిపోతుందేమో అని చూసేవాళ్లకు భయంపుట్టేంత కిందకి వేసుకున్నాడు. సృష్టి చేసిన ఏర్పాటు వల్ల మాత్రమే  పంట్లాం ఆ మాత్రం ఒంటిని అంటిపెట్టుకుని ఉన్నట్టుంది. పైన ఒక టీషర్ట్‌ యథాలాపంగా ఉంది. పెళ్లికి ప్రత్యేకంగా తయారైవచ్చినట్టుగా అనిపించలేదు. జుట్టు నిర్లక్ష్యంగా ఉన్నా గ్లామరస్‌గా ఉంది. ఆ నిర్లక్ష్యంలో కూడా పద్థతేదో ఉన్నట్టుంది. చేతులకు కడియాలు లేవు. మెడలో కంటె లాంటి మందమైన బంగారు గొలుసేమీ లేదు. సింపుల్‌గా ఉన్నాడు కానీ చూడగానే బలిసినోళ్ల పిలగాడు అని గుర్తు పట్టేట్టు ఉన్నాడు. వాళ్ల నాన్నకు కడుపు ఎంత ముందుకొచ్చిందో ఈ కుర్రాడికి అంత లోపలికి పోయి ఉంది. భుజాల కాడ ఇపుడిపుడే బైసెప్స్‌ ఉబ్బుదామా వద్దా అన్నట్టు తొంగి చూస్తున్నాయి. చూడగానే జిమ్‌బాడీ అని తెలిసిపోయేట్టు ఉంది.  కొత్తసినిమాలో కుర్రహీరోలకు నకలుగా ఉన్నాడు. ఆ పిల్లను గమనించినా గమనించనట్టుగానే పక్కకు తిరిగి ఫ్రెండ్స్‌ని పిలుస్తూ దూరంగా వెళ్లాడు. ఆ పిల్లకు ఏదో అర్థమయినట్టే కనిపిస్తోంది. పాతసినిమాలో హీరోయిన్‌లాగా జడను ముందుకు తెచ్చుకుని దాంతో ఆవేదన పంచుకుంటున్నట్టుగా నిమురుతూ తిరిగి తల్లి దగ్గరకు నడిచింది.
వాళ్లకు మూడు వరుసల్లోనే కుర్చీలో కాళ్లు ఎత్తిపెట్టుకుని  పొగాకు నలుపుకుంటూ కూర్చున్నాడు వెంకయ్య. ఆయన జుట్టు రేగిపోయి ఆకాశం వంక చూస్తా ఉంది. మీసాలు వంగిపోయి నేల చూపులు చూస్తున్నాయి. చేతిలోని పొగాకు లాగే ముఖంపైనా ముడుతలు. ఒక్క ముక్కలో నలిగిపోయిన పొగాకు కాడలాగా ఉన్నాడాయన. ఆయన పుస్తకాలు చదవలేదుకానీ మనుషులను చదవగలిగిన వాడు. ఏం జరుగుతుందో బాగా తెలిసినవాడు. మట్టి వాసన తప్ప నోట్ల వాసన అంతగా తెలిసినవాడు కాదు. ఆయన కొడుకు ఒక నెలలో బేబులోంచి తీసినన్ని సార్లు, తీసినన్ని నోట్లు ఆయన జీవితమంతా తీసి ఉండడేమో! కూతురు మనుమరాలు తిప్పలు, కొడుకు మనుమడి జాడింపులు అన్నీ చూస్తున్నాడు. ఆ పెళ్లి జరగదు అని అర్థమవుతూనే ఉంది.
”చిన్నపుడే ఆ పిల్ల పుట్టకముందే ఇచ్చినమాట. రెండేళ్ల క్రితం వరకూ పెళ్లి గ్యారంటీ అనే అనుకున్నారు. కొడుకు చాలా ఉత్సాహం చూపేవాడు. ఏమే కోడలా అని తప్ప పేరు పెట్టి పిలిచి ఎరగడు. ఇంటర్‌ అయిపోగానే దీన్నిక్కడ వదిలేయ్‌. ఇక్కడే ఉండి బెజవాడ వస్తా పోతా డిగ్రీ చదవుకుంటది, ఎట్లా ఈడుండాల్సిందేకదా అని తన చెల్లెల్ని తొందరపెట్టేవాడు. పిల్లాడి డిగ్రీ అయిపోగానే ఇద్దరికీ ముడేయాలని అనుకున్నారు. ఈ రెండేళ్లలో చాలా మారిపోయాయి. భూములు మారిపోయాయి. జీవితాలు మారిపోయాయి. పెళ్లి కాకపోతే పోయింది, అది అక్కడే ఆగుతుందా! ఇంకా ముందుకు పోతుందా! అసలే కూతుళ్లు కొడుకుల మీద కేసులు వేయడం చూస్తూ ఉన్నాడు. తలలు పగలకొట్టుకునేంత గొడవల గురించి వింటూ ఉన్నాడు.”
మనసు పరిపరివిధాలా ఆలోచిస్తా ఉంది.
“ఒకప్పుడు బంధుత్వం అంటే ఎట్టుండేది? పెద్దరికానికి ఎంత గౌరవం ఉండేది? పాడుకాలం, ఎవరికీ ఎవరూ కానికాలం”
అని లోలోపలే వర్తమానాన్ని శపిస్తూ ఉన్నాడు.
ఆస్తులు అమ్ముకుని తింటే కొండలైనా కరిగిపోతాయ్‌రా అని ఏదో చెప్పబోతే కొడుకు చూసిన చూపు గుర్తొచ్చింది. మనసు మూలిగింది
Artwork: Srujan Raj
.
పెళ్లిమంటపం కళగానే ఉంది. సడన్‌గా వచ్చిపడిన సంపద తెచ్చిపెట్టే సంబరం కనిపిస్తానే ఉంది. అది మనుషుల మధ్య తెచ్చిపెట్టే సంక్షోభం కూడా కనిపిస్తా ఉంది. తేలని పంచాయితీలు అనేకం కనిపిస్తున్నాయి. స్టేక్స్‌ ఎక్కువైనాయి. ఎవరూ ఏదీ వదులుకునేట్టు లేరు. నలుగురిలో నగుబాటు కాకూడదనుకునే వారు పెద్దమనుషుల ఎదుట పంచాయితీలు చేసి తేల్చేసుకుంటున్నారు. అట్లా సంతృప్తిపడలేని వారు వీధికెక్కుతున్నారు. కోర్టు గుమ్మాలు తొక్కుతున్నారు. వచ్చిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడమెట్లా అనేవాళ్లు కొందరు.
దూరంగా వెళ్లి ఏ వినుకొండ, కుంట ప్రాంతాల్లోనో ముందు జాగ్రత్తగా భూముల వేట చేస్తున్న వారు కొందరు. వేరే భూములు లేక ఉన్న కొద్ది మడిచెక్క పోగొట్టుకుని గోడుగోడు మంటున్నవారు ఇంకొందరు. అంతా కలగా పులగంగా గందరగోళంగా ఉంది. పెద్ద సుడిగాలి వచ్చేసి కొందరిని మేడమీదకు మరికొందరి లోయలోకి విసిరేసినట్టు ఉంది. వరలక్ష్మి అన్నకోసం తిరుగుతూనే ఉంది.
ఇంకొక్క సారి నేరుగా ఎదురుపోయి పట్టుకుందాం.  అప్పటికి తప్పించుకుంటే పెద్దమనుషుల దగ్గరకు పోవడం తప్ప దిక్కులేదు అని తీర్మానించుకుంది.  ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అన్న కోసం మళ్లీ పెళ్లి పందిరి చుట్టూ వెతుకులాట ఆరంభించింది. తూర్పుకు పడమటకు మధ్య దాగుడుమూతలాట సాగుతానే ఉంది.
(జనవరి 7, 2016న సారంగలో ప్రచురితమైన కథ)

మోహన గీతంఅర్టిస్టు తాడి మోహన్‌గారు వామపక్ష విలువలను చిన్ననాటినుంచే జీర్ణించుకుని నిబద్ధత నిమగ్నత గలిగిన కళాకారునిగా ఎదిగి తన కుంచెను ఎర్రజెండాగా ఎగరేసిన తెలుగువారి చిత్తప్రసాద్‌ అని ఏదైనా రాయొచ్చు. కొంచెం అర్థమయ్యేట్టు రాయెచ్చుగదబ్బా, అరిగిపోయిన మాటలను అరువు తెచ్చుకుని రాయకపోతే మనకు తెలిసిందేదో తెలిసిన భాషలోనే ఏడవచ్చుగదా అని ఆయన మీసాల చాటునుంచి సున్ని తంగా చనువుగా గదమాయించగలరు.. మోహన్‌ ఏకకాలంలో నోస్టాల్జియా, వర్తమానం- రెండూ. ఈడి దగ్గర సరుకెంత అన్నట్టు సూపును సూటిగా గుండెల్లోకి దించే నా అభిమాన ‘మగదూర్‌’ రచయిత పతంజలిని తొలిసారి కలిసింది అక్కడే. రచయితగా పేరు ప్రఖ్యాతులను నలిపి నోట్లో బీడిగా పెట్టుకుని నెత్తిమీద ఇంకేమో ఉంచుకుని ఉట్టిమీద కూడు, ఉప్పుచేప తోడు అని చిందేయగల కేశవరెడ్డిని తన్మయంగా చూసిందీ అక్కడే. భౌతి కంగా కనిపించి కొన్ని కబుర్లు పంచుకుని కొన్ని ప్రశ్నలు సంధించి వెళ్లిపోయిన వారు మాత్రమే కాదు. రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జెల మల్లారెడ్డి, నండూరి రామ్మోహన్‌ రావు, మహీధర రామ్మోహనరావు, చలసానిప్రసాదరావు, అజంతా లాంటివారెందరో మాటలమధ్యలో సన్నిహితంగా తారసపడుతూ ఉంటారు. మోహన్‌తో మాట్లాడుతుంటే ప్రావ్దాను తెలుగులో చదువుతున్నామేమో అని అపుడపుడూ అనిపిస్తుంది. అలవాటుతో కూడిన చనువుతో వచ్చిన భ్రాంతి వల్ల మన సావాసగాడిలాగా భ్రమపెడతాడు గానీ బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వాన్ని రద్దుచేసినపుడు కోల్‌కతా వీధుల్లో ఆందోళనలో పాల్గొని జైలుగోడల మీద బొమ్మలువేసిన ఆ పాతకాలపు మనిషి. నిక్కర్లేసుకోకముందే అదేంటో తెలీకముందే ఎర్రజెండా చేతపట్టుకుని ఇంట్లోనో ఇంటికి దగ్గర్లోనో చండ్రరాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెలనాగిరెడ్డి లాంటివారిని చూసిన మనిషి కదా! ఆయ న జ్ఞాపకాల గని. ఆ పురాతనత్వం అలనాటి కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టడం వల్ల వచ్చే అదనపువిలువ. చాలామంది కమ్యూనిస్టు కుటుంబాల వారసుల మాదిరి రియల్‌ ఎస్టేట్‌, విద్య తదిరర ఖరీదైన కళలను ఆవాహన చేసుకోకుండా చిన్ననాట అలవాటైన అలగా వ్యసనానికే అంకితమై ఉన్నందున ఆ కిక్కు ఎప్పటికీ దిగకుండా తలమీద దరువేస్తూనే ఉంటుం ది. దేన్నైనా మనకు సన్నిహితమయ్యేట్టు మనం ఆ కాలంలోనే ఉన్నట్టు చెప్పడం మోహన్‌ దగ్గరున్న కళ. స్టాలిన్‌ కాలపు అరాచకాల ప్రస్తావన వస్తే మనం స్టాలిన్‌కి బెరియాకు మధ్య లో కూర్చున్నంత సన్నిహితంగా ఉంటుంది. స్టాలిన్‌, మావోల గురించి కమ్యూనిజం పేరుతో సాగిన అరాచకాల గురించి మాట్లాడేతీరు చూసి మోహన్‌ అరాచకవాదానికి ప్రయాణించారని కొందరికి అనిపిస్తుంది. అది వాస్తవంకాదు. ఆయనది నిందాస్తుతి. వర్తమానం ఉత్సాహంగా లేనపుడు జ్ఞాపక సంచారమెంత బాగున్నాదో అనుకోవడం మానవసహజం.
బాలగోపాల్‌ నివాసానికి కూతవేటు దూరంలో రెడ్‌హిల్స్‌ రోజుల్లో తొలిసారి చూసినపుడే ఆయన పిల్లలు వాలిన చెట్టులాగా ఉండేవారు. స్థిర ఆవాసం ఏర్పరుచుకున్న పక్షులు కొన్ని. వలస పక్షులు కొన్ని. సంచార పక్షుల సంగతి సరేసరి. అనేకానేక బ్రష్షులు, పెన్నులు వాటిని ముంచి తేల్చడానికి రకరకాల ద్రావకాలతో నిండి ఉంటుంది ఆయన అడ్డా. నాలుగుస్ర్టోకులు నేర్చుకుని ఏదో ఒక పత్రికలో ఉపాధి పొందుదామని కుంచె చేత పట్టుకుని నగరం వచ్చే పోరగాళ్లకు అది స్థావర జంగమం. నెలకు లక్షకు పైగా తీసుకున్న రోజుల్లోనూ రేపేమిటో తెలీని రోజుల్లోనూ యోగిలాగా చిలుము పీలుస్తూ అదే రకమైన చిర్నవ్వులు చిందిస్తూ ఉండగలరాయన. చూడడానికి సామాన్యంగా కనిపిస్తుంది కానీ అదేమంత వీజీ విషయంబు గాదు. ఇహలోకపు బాదరబందీలను వదిలించుకునో బలవంతంగా విదిలించుకునో తామరాకుమీద నీటిబొట్టులాగా ఉండడానికి చాలా యాతన పడాలి. ఆయన తిప్పలేవో ఆయన పడి ఆ స్థితిని సాధించారు. ఇవ్వాళ కొన్ని పత్రికల్లో కనిపించే గండరగండల్లాంటి ప్రఖ్యాత కళాకార్స్‌ ఆ దర్బార్‌లో ఆయన చేత తీయని మందలింపులకు మురిసిపోతూ కనిపించేవారు. ఇవాళ సంఖ్య పలుచబడొచ్చు గానీ ఆ గురుకుల సంప్రదాయం ఆగిపోలేదు.
కవులు కవిత్వాన్ని కథకులు కథలను బొమ్మలేయువారు బొమ్మలు మాత్రమే చూడవలెననే మూఢనమ్మకమేదో తెలుగునాట చాలామందిలో ఉంది. ఆ అంధవిశ్వాసాన్ని పారద్రోలడానికి నిరంతరం శ్రమిస్తున్న సంస్కరణ వాది మోహన్‌! చదువుకు చిత్రమైన లక్షణముంటుంది. చదువుతున్నపుడు దాని ప్రయోజనం తెలీదు. తర్వాతెప్పుడో మనం నిస్సహాయులమై నిలబడినపుడు అదాటున చేతిలోకి ఆయుధంలా వచ్చి చేరుతుంది. ఆ రహస్యం ఎరిగిన వాడు, నలుగురికి ఆ ఆయుధాన్ని అందివ్వాలనుకున్నవాడు మోహన్‌. తన దృష్టికి వచ్చిన మంచి పుస్తకాన్ని మంచి సినిమాను నలుగురితో పంచుకునే వరకు నిద్రపోయే అలవాటు లేని ఆరోగ్యకరమైన సంప్రదాయం ఉన్న మనిషి. అయితే ఈ చదువు యావ అపుడపుడూ యారగెన్సీలాగా అనిపించి కొందరిని గాయపెడుతుంది కూడా. మోహన్‌ అనే ఔషధానికున్న సైడ్‌ ఎఫెక్ట్‌ అది. జ్ఞాపకాల్లో ఎంత పురాతనుడో ఆలోచనల్లో అంత ఆధునికుడు మోహన్‌. యానిమేషన్‌ గురించి వినడమేతప్ప దాని రూపురేఖా విలాసాల గురించి తెలుగునేలకు అంతగా పరిచయం లేని రోజుల్లోనే యానిమేషన్‌ ప్రయోగాలు చేసిన ముందుచూపరి మోహన్‌. అయితే ఆర్టి్‌స్టగా మోహన్‌ తన కృషిని గట్టిగా కొనసాగించలేదని వేయి బాహువులతో విస్తరించగలిగిన మనిషి ఎక్కడో తనను తాను కట్టేసుకున్నారని ఆయన అభిమానులు కొందరు ఆక్షేపిస్తుంటారు. వాస్తవమెంతో తెలీదు.
కళమూ గళమూ ఇత్యాది ఆయుధ ప్రయోగాల్లో పేరుమోసిన పేరుగాంచిన యోధులెందరో అక్కడ అస్త్రప్రదర్శన చేస్తూ కనిపిస్తుంటారు. అది ఓపెన్‌ హౌస్‌. పేపర్లో పేర్లూ అవీ చదివి యూరోపియన్‌ ఆర్ట్‌ అంటే పడిచస్తారు గానీ అందులో ఈ కళ ఏదీ ఈ సుళువేదీ అని ఏ చైనా ఆర్టిస్ట్‌ పేరునో ప్రస్తావిస్తారు మోహన్‌. మనం అంతగా పట్టించుకోని రామప్ప కళ గురించి తపన పడతారు. ఆ చైనా ఆర్టిస్టు తెలీదుకానీ రామప్ప చూశాం కాబట్టి ఆ తపన అర్థమయ్యేది. మనదైనదాన్నేదో పోగొట్టుకుని పొరుగింటి పుల్లగూర కోసం ఎగబడుతున్నామనే బాధ అది. కార్టూన్స్‌ గురించి వ్యాఖ్యానిస్తే అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడం అవుతుంది. కానీ కార్టూన్స్‌ నవ్వుతో పాటు కూసింత ఆలోచన కూడా రేపితే బాగుంటుంది అనే చాదస్తం ఉన్నవాడిని కాబట్టి ఆయన కార్టూన్స్‌ ఇష్టం. ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబుదాకా వైఎస్‌ నుంచి జగన్‌ దాకా ఆయన కుంచె బారిన పడినవారే. నేను కళ్లుతెరిచే నాటికి ఏ ఎర్ర సమావేశంలో చూసినా ఆయన వేసిన పోస్టర్లు, బ్యానర్లే. బక్కజీవులైన ఆడవాళ్లు, దళితులు, ఆదివాసీలు గుంపులుగుంపులుగా కొడవళ్లెత్తి మార్చింగ్‌ సాంగ్‌ పాడుతున్నట్టుండేది. చిలకలు కత్తులు దులపరించమంటే ఏమిటో ఆ బొమ్మల్లో కనపడేది. అవింకా ఊపూ ఉద్వేగం మిగిలి ఉన్న రోజులు. నయా, అర్థ, పార్లమెంటరీ అన్‌పార్లమెంటరీ గొడవలు ఎన్నున్నా సీపీఐ, సీపీఎం మొదలుకొని వివిధ గోత్రనామాలు కలిగిన ఎంఎల్‌ పార్టీలు, దళిత, స్ర్తీవాద, హక్కుల సంస్థల వరకూ కుంచె విషయంలో ఏకీ రాస్తా. అది మోహన్‌. కవిత్వం, కథల పుస్తకాల కవర్‌ ఇలస్ర్టేషన్స్‌ సరేసరి. శ్రీశ్రీ, పి.ఎల్‌. నారాయణలతో పాటలు మాటలు ఉచితంగానో అనుచితంగానో రాయించుకోవడానికి సినిమా వాళ్లు ఎన్ని వేషాలు వేసేవారో మోహన్‌ చేత బొమ్మలేయించుకోవడానికి కొందరు రచయితలు అన్ని వేషాలు వేసేవారు.
వీటన్నింటినీ మించింది నాకు కూడా కాస్తో కూస్తో అర్థంకాగలిగింది ఆయన అక్షరం. లైన్‌ డ్రాయింగ్‌ తనకిష్టమని ఆయన చెప్తూ ఉంటారు. స్కేల్‌ అవసరంలేకుండా నేరుగా గీత గీసినట్టుగానే అక్షరాన్ని సూటిగా సంధిస్తారు. తెలుగులో అంత మంచి వాక్యం రాయగలిగిన వారిని లెక్క పెట్టడానికి చేతి వేళ్లు కూడా అవసరం లేదు. ఆ వాక్యం ధర్మపీఠం మీద కూర్చుని ఉపదేశం చేస్తున్నట్టుగా ఉండదు. ప్లీజ్‌ వినండర్రా అని చేతులు జోడించి అర్థిస్తున్నట్టూ ఉండదు. స్నేహితుడి భుజం మీద చేయేసి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మోహన్‌ వాక్యం మన సహచరి. కామ్రేడ్‌. చిత్తప్రసాద్‌ను గాఢంగా పరిచయం చేసినా పేరు సక్సెస్‌ డబ్బు వెంట పరుగులు పెట్టే రచయితలను హెచ్చరిస్తూ కళా, కిరసనాయిల్‌ తహసిల్దారా అని ఎద్దేవా చేసినా వాక్యం వంకర్లు పోదు. ఇంకేదో మోటివ్‌ వెంటబెట్టుకుని వాక్యం నంగినంగిగా ప్రయాణించదు. భక్తీ లేదు, నలుగురు ఏమనుకుంటారో అనే భయమూ అంతగా లేదు. అన్ని పురోగామి స్రవంతుల సంగమ స్థలి, సంఘర్షణ స్థలి మోహన్‌. దశాబ్దాలుగా ఉద్యమాలతో నడుస్తున్న మోహన్‌ గీతలు, రాతలు ఇపుడు సంపుటాలుగా రాబోతున్నాయి. లెట్స్‌ సెలబ్రేట్‌ ది ఆర్టిస్ట్‌ ఆఫ్‌ అవర్‌ టైమ్స్‌. 


జి.ఎస్‌. రామ్మోహన్‌ 

(డిసెంబర్‌ 24, 2015న ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

కోర్ట్‌-ఆర్ట్‌ ఎట్‌ ది హార్ట్

చెప్పినదానికంటే ఎక్కువ అర్థం చేయించగలిగేదే గొప్ప కళారూపమని అంటారు. ఆ మాట  కూడా సరిపోదు కోర్ట్‌ అనే మరాఠీ సినిమా మనలో కలిగించే స్పందనను తెలియజేయడానికి. నటించలేదు,  జీవించారు అని చెప్పీ చెప్పీ ఆ మాటలను సాధారణంగా మార్చేశాం. ఈ అసాధారణ సినిమాను వర్ణించడానికి ఆ మాటలు సరిపోవు. భాషతో ఇబ్బందే. పదాల్లేవు ఈ సినిమాను వర్ణించడానికి. నినాదాల్లేవు. కానీ సినిమా  చూశాక మనం నినాదంగా మారతాం. ఆగ్రహావేశాల్లోవు. కానీ మన లోలోపలెక్కడో పట్టలేని ఆగ్రహం నిలువనీయకుండా చేస్తుంది.  ఇది గడ్డకట్టిన దుఖ్ఖం. ఇది అణిచివేసుకున్న ఆగ్రహం. చాలా సినిమాలు చూసి ఉంటాం. ఆర్ట్‌, రియలిస్టిక్‌, నియో రియలిస్టిక్‌, క్రాస్‌ ఓవర్‌, మాస్‌ లాంటి చాలా పదాలనే విని ఉంటాం. కానీ ఈ  సినిమాను అట్లా ఏదో ఒక బీకర్‌లోకి ఒంపడానికి మనసొప్పదు. జీవితాన్ని వర్ణించమంటే ఎట్లా బ్బెబ్బెబ్బే అనక తప్పదో  ఏదో ఒకటి మాట్లాడడానికి తెలిసిన పిచ్చిమాటలను ఎట్లా కూర్చుకోక తప్పదో అట్లా ఉంటదీ ఈ సినిమా గురించి చెప్పడమంటే. సటిల్, అండర్‌ ప్లేయిడ్‌, న్యూయాన్స్‌డ్‌, లేయర్డ్‌ లాంటి ఆంగ్లపదాలు అనేకం వాడేసుకోవచ్చు.  పాత్రలు మన తెలుగు సమాజానికి బాగా పరిచయమైనవి. మన ప్రజా గాయకులు, మన మానవహక్కుల  కార్యకర్తలు, మన కూలీలు, అంతా మనమే.  పరిస్థితులు మొత్తం భారతావని మొత్తానికి పరిచయమైనవే.  కోర్టులు, అడ్వకేట్లు, న్యాయం, అది పనిచేసే విధానం అన్నీ మొత్తం దేశానికి సంబంధించినవి. వ్యవస్థలోన్యాయం ధర్మం అనేవి పనిచేసే పద్ధతుల్లోని అబ్సర్డిటీని, సర్రియాలిటీని రియాలిటీతో చిత్రించిన  సినిమా. మన సమూహాలకు సంబంధించని మనుషులపట్ల వ్యవస్థలో గూడు కట్టుకుపోయిన  దుర్మార్గపూరితమైన నిర్లిప్తతను చూపించిన సినిమా. ధిక్కార స్వరాలకు సంకెళ్లు వేయడానికి వ్యవస్థ  ఎలాపనిచేస్తుందో చూపించిన సినిమా. ఒక్కముక్కలో ప్రజాస్వామ్యం అందరిపట్లా అంత ప్రజాస్వామికంగా ఏమీ  ఉండదనే వాస్తవాన్ని చూపించిన సినిమా.

         నీలివేదికమీద ఎర్రపాట పాడుతుండగా గద్దర్‌ లాంటి గాయకుడిని అరెస్ట్‌ చేస్తారు. అరెరెరె, హా లతో సహా అచ్చంగా గద్దర్‌ పాటే. జననాట్యమండలికి సంబంధించిన రెండు టూన్లు ఆ పాటలో స్పష్టంగా కనిపిస్తాయి. గద్దర్‌ పాట తన మీద చాలా ప్రభావం చూపించిందని దర్శకుడు చైతన్యతమానే ఒక చోట చెప్పారు కూడా. ఒక మనిషిని ఆత్మహత్యకు  పురికొల్పాడని నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్స్‌ కింద గాయకుడిపై కేసు. ఎవరా మనిషి? డ్రైనేజ్‌ క్లీన్‌ చేసే మనిషి. ఆ మనిషి  మాన్‌హోల్‌లోకి ఎటువంటి మాస్కులు లేకుండా దిగాడు కాబట్టి ఆత్మహత్య చేసుకునే ఉద్దేశ్యంతోనే దిగి  ఉంటాడని ప్రాసిక్యూషన్‌ అభియోగం. ఇతరుల మలమూత్రాలను చేతులతో క్లీన్‌ చేసే ఆ పనిచేయడం కన్నా  చావడం మేలు అని అర్థం వచ్చే పాట ఆ గాయకుడు పాడి ఉన్నాడు కాబట్టి ఆ ప్రేరణ తోనే సదరు కార్మికుడు  రక్షణ కవచాలేమీ లేకుండా లోపలికి దిగి ఆత్మహత్య చేసుకుని మరణించి ఉంటాడని అభియోగమన్న మాట.  పతంజలి పిలకతిరుగుడు పువ్వు గుర్తొస్తుందా! అందులో కూసింత వ్యంగ్యాన్ని హాస్యాన్ని జోడించి వ్యవస్థ  బండారం బయటపెడతాడు పతంజలి. ఆలోచనల్లో వేగుతూ వేదనలో కాగుతూ ఈ సినిమా చూస్తాం. ట్రాన్స్‌లో  ఉండి అనేకానేక ఉద్వేగాలతో ఊగిపోతాం. డ్రైనేజీ క్లీన్‌చేసేవారంతా మాస్కులు, కవచాలు ధరించి దిగరని  న్యాయవాదులకు న్యాయమూర్తులకు తెలీదా, దాన్ని ఆధారం చేసుకుని ఆత్మహత్య కేసు పెడతారా లాంటి  అమాయాక ప్రశ్నలు వేయకూడదు. ఈ సినిమా అంతకంటే లోతైనది. ఇలాంటి అభియోగం ఈ రకంగా మోపడం న్యాయాన్ని అపహాస్యం చేయడం అని జడ్జి అనుకోడు. పైగా అలాంటి పాట రాశారా అని అడిగితే ''ఇప్పటికి రాయలేదు కానీ ఇకముందు రాసే అవకాశమొస్తే రాస్తా'' అని కోర్టులో గాయకుడు ప్రకటించడం మాత్రం ఆయనకు చిర్రెక్కిస్తుంది. విలాస్‌ గోగ్రే, శంభాజీ భగత్‌ సన్నిహితుడు, స్వయంగా కార్యకర్త, విరోధి పత్రిక సంపాదకుడు అయినటువంటి వీరా సతిదార్ ఆ గాయకపాత్రలో అలా ఇమిడిపోయారు.


     న్యాయమూర్తి ,ప్రాసిక్యూషన్‌ న్యాయవాది ప్రవర్తనకు మొత్తం అన్ని యంత్రాగాల ప్రవర్తనకు మూలాలు వెతికి ఇదిగో ఇందుకు అని చూపుతాడు. సింబాలిజాన్ని ఇంతగా వాడుకున్న దర్శకుడు మనదగ్గర మరొకరున్నారా అంటే చెప్పడం కష్టం. పేదలపై వివక్ష, కుల అణచివేత ఎవరిపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయి, వ్యవస్థ ఎవర్ని ఏ స్థాయిలో వేధించే అవకాశముంది అనేది ఇంత ప్రశాంతంగా చూపిన దర్శకుడిని  మరొకరిని ఎరగం. మధ్యతరగతికి చెందిన హక్కుల న్యాయవాది మీద ఇంకుదాడి జరిగితే ఎర్రెర్రని దళిత గాయకుడి మీద  జైలు దాడి జరుగుతుంది. దళితగాయకుడిని నేరుగా ప్రభుత్వమే వేధిస్తే, మానవహక్కుల న్యాయవాదిపై అదే  ప్రభుత్వం అండ ఉన్న ఉన్మాద మూకలు హెచ్చరిక లాంటి దాడి చేస్తాయి. ఇంకు దాడి జరిగిన తర్వాత  మానవహక్కుల న్యాయవాది బ్యూటీపార్లర్‌లో కూర్చుని గంభీరంగా ఆలోచించే దశ్యమూ, పోలీసుల కస్టడీలో  ఆస్పత్రిలో ఉన్న గాయకకార్యకర్త ఇంజక్షన్‌ వేసుకోవడానికి తిరస్కరించే దృశ్యాన్ని ఎటువంటి కామెంట్‌  లేకుండా నింపాదిగా చూపించి మనలో అలజడి రేపుతాడు. ఊరికే వాస్తవాలను చూపితే చాలదు, మంచి కళారూపం ఒక దిక్కు  దిశా చూపించాలి  అని కొందరు వ్యాఖ్యానిస్తా ఉంటారు. వాస్తవం అనేదాన్ని ఎలా నిర్వచిస్తావ్‌  అనేదే ముఖ్యం కానీ ఎటువంటి వ్యాఖ్యానం చేయకుండా- కనీసం వాచ్యం చేయకుండా అద్భుతమైన కళారూపం సాధ్యమనేదానికి సాక్ష్యం ఈ సినిమా. పోలీసుల మీద కానీ ప్రాసిక్యూషన్ లాయర్‌ మీద కానీ జడ్జిమీద కానీ ఎటువంటి వ్యాఖ్యానం ఉండదు. వారిని దుర్మార్గులుగా ఏమీ చిత్రించడు. కాకపోతే లాయరమ్మ పిల్లల్ని చూసుకుంటూ శ్రద్ధగా ఇంటిల్లిపాదీకి వంట వార్పూ చేస్తూ ఆ పనిమధ్యలోనే తన డాక్యుమెంట్లు చదువుకుంటూ ఆలివ్‌ ఆయిల్‌ డిస్కంట్‌లో కొనడం మంచిదేనా కాదా అని తర్కించుకుంటూ ఉంటుంది. కుటుంబంతో ఒక మధ్యతరగతి వెజ్‌ రెస్టారెంట్లో ఏదో తినేసి ముంబైనుంచి బీహారీలను తరిమికొట్టాలనే వికృత హాస్యం గలిగిన నాటకాన్ని ఆనందిస్తుంది. కోర్టులో ఎలాంటి ఎమోషన్‌ లేకుండా నిర్లిప్తంగా పేజీలకొద్దీ సెడిషన్‌ చార్జీలను, డ్రామా చట్టాలను చదివేస్తుంది. ఈ పాత్రలో గీతాంజలి కులకర్ణిని చూశాక ఇంత గొప్ప నటిని ఇండియన్‌ సినిమా ఎట్లా మిస్‌ అయ్యిందా అని కచ్చితంగా ఆలోచిస్తాం. బంధువులు, మిత్రబృందంతో ఏదో రిసార్టుకెళ్లిన జడ్జిగారు  పేరులో ఒక్క హెచ్ అదనంగా చేర్చుకుంటే ఎలా మంచి జరుగుతుందో ఎవరికో సలహా ఇస్తుంటాడు. తన నిద్ర చెడగొట్టినందుకు ఒక పసిపిల్లాడి చెంప పగలగొడతాడు. ప్రతీదీ దృశ్యరూపంలోని సింబాలిజమే. చివరకు ఒకరోజు విచారణ తర్వాత కోర్టు అటెండర్‌ ఒక్కొక్క లైట్‌ ఆర్పుకుంటూ హాలంతా చీకటి అయిపోయే దృశ్యం కూడా మనల్ని వెంటాడుతుంది. పొరలు పొరలుగా వలుచుకుంటూ పోతూ ఉంటే ఆ దృశ్యాల్లో ఉన్న లోతు అర్థమవుతా ఉంటది. నిగ్రహం ఎంత శక్తిమంతమైనదో కదా అనిపిస్తుంది. అసలు ఆ వయసుకు అంత నిగ్రహం దర్శకుడికి ఎలా సాధ్యమైందో ఎంత ఆలోచించినా అర్థమయ్యే విషయంకాదు. కానీ ఒక చట్టబద్ధం కాని హెచ్చరిక- ఈ సినిమా మీకేమీ ప్రశాంతతనివ్వదు. వార్మ్‌డ్‌ అప్‌ ఇన్‌ ది హెల్‌ అని రచయితలకు సలహా ఇచ్చాడో పెద్దమనిషి. ఈ సినిమా చూడడం కూడా వార్మ్‌డ్‌ అప్‌ ఇన్‌ ది హెల్‌ లాంటి విషయమే. సామాజిక వాస్తవం హెల్‌ లాగా ఉన్నది మరి!
జి ఎస్‌ రామ్మోహన్‌
(నవంబర్‌ 8, 2015న ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)