Thursday 14 April 2016

మోహన గీతంఅర్టిస్టు తాడి మోహన్‌గారు వామపక్ష విలువలను చిన్ననాటినుంచే జీర్ణించుకుని నిబద్ధత నిమగ్నత గలిగిన కళాకారునిగా ఎదిగి తన కుంచెను ఎర్రజెండాగా ఎగరేసిన తెలుగువారి చిత్తప్రసాద్‌ అని ఏదైనా రాయొచ్చు. కొంచెం అర్థమయ్యేట్టు రాయెచ్చుగదబ్బా, అరిగిపోయిన మాటలను అరువు తెచ్చుకుని రాయకపోతే మనకు తెలిసిందేదో తెలిసిన భాషలోనే ఏడవచ్చుగదా అని ఆయన మీసాల చాటునుంచి సున్ని తంగా చనువుగా గదమాయించగలరు.. మోహన్‌ ఏకకాలంలో నోస్టాల్జియా, వర్తమానం- రెండూ. ఈడి దగ్గర సరుకెంత అన్నట్టు సూపును సూటిగా గుండెల్లోకి దించే నా అభిమాన ‘మగదూర్‌’ రచయిత పతంజలిని తొలిసారి కలిసింది అక్కడే. రచయితగా పేరు ప్రఖ్యాతులను నలిపి నోట్లో బీడిగా పెట్టుకుని నెత్తిమీద ఇంకేమో ఉంచుకుని ఉట్టిమీద కూడు, ఉప్పుచేప తోడు అని చిందేయగల కేశవరెడ్డిని తన్మయంగా చూసిందీ అక్కడే. భౌతి కంగా కనిపించి కొన్ని కబుర్లు పంచుకుని కొన్ని ప్రశ్నలు సంధించి వెళ్లిపోయిన వారు మాత్రమే కాదు. రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జెల మల్లారెడ్డి, నండూరి రామ్మోహన్‌ రావు, మహీధర రామ్మోహనరావు, చలసానిప్రసాదరావు, అజంతా లాంటివారెందరో మాటలమధ్యలో సన్నిహితంగా తారసపడుతూ ఉంటారు. మోహన్‌తో మాట్లాడుతుంటే ప్రావ్దాను తెలుగులో చదువుతున్నామేమో అని అపుడపుడూ అనిపిస్తుంది. అలవాటుతో కూడిన చనువుతో వచ్చిన భ్రాంతి వల్ల మన సావాసగాడిలాగా భ్రమపెడతాడు గానీ బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వాన్ని రద్దుచేసినపుడు కోల్‌కతా వీధుల్లో ఆందోళనలో పాల్గొని జైలుగోడల మీద బొమ్మలువేసిన ఆ పాతకాలపు మనిషి. నిక్కర్లేసుకోకముందే అదేంటో తెలీకముందే ఎర్రజెండా చేతపట్టుకుని ఇంట్లోనో ఇంటికి దగ్గర్లోనో చండ్రరాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెలనాగిరెడ్డి లాంటివారిని చూసిన మనిషి కదా! ఆయ న జ్ఞాపకాల గని. ఆ పురాతనత్వం అలనాటి కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టడం వల్ల వచ్చే అదనపువిలువ. చాలామంది కమ్యూనిస్టు కుటుంబాల వారసుల మాదిరి రియల్‌ ఎస్టేట్‌, విద్య తదిరర ఖరీదైన కళలను ఆవాహన చేసుకోకుండా చిన్ననాట అలవాటైన అలగా వ్యసనానికే అంకితమై ఉన్నందున ఆ కిక్కు ఎప్పటికీ దిగకుండా తలమీద దరువేస్తూనే ఉంటుం ది. దేన్నైనా మనకు సన్నిహితమయ్యేట్టు మనం ఆ కాలంలోనే ఉన్నట్టు చెప్పడం మోహన్‌ దగ్గరున్న కళ. స్టాలిన్‌ కాలపు అరాచకాల ప్రస్తావన వస్తే మనం స్టాలిన్‌కి బెరియాకు మధ్య లో కూర్చున్నంత సన్నిహితంగా ఉంటుంది. స్టాలిన్‌, మావోల గురించి కమ్యూనిజం పేరుతో సాగిన అరాచకాల గురించి మాట్లాడేతీరు చూసి మోహన్‌ అరాచకవాదానికి ప్రయాణించారని కొందరికి అనిపిస్తుంది. అది వాస్తవంకాదు. ఆయనది నిందాస్తుతి. వర్తమానం ఉత్సాహంగా లేనపుడు జ్ఞాపక సంచారమెంత బాగున్నాదో అనుకోవడం మానవసహజం.
బాలగోపాల్‌ నివాసానికి కూతవేటు దూరంలో రెడ్‌హిల్స్‌ రోజుల్లో తొలిసారి చూసినపుడే ఆయన పిల్లలు వాలిన చెట్టులాగా ఉండేవారు. స్థిర ఆవాసం ఏర్పరుచుకున్న పక్షులు కొన్ని. వలస పక్షులు కొన్ని. సంచార పక్షుల సంగతి సరేసరి. అనేకానేక బ్రష్షులు, పెన్నులు వాటిని ముంచి తేల్చడానికి రకరకాల ద్రావకాలతో నిండి ఉంటుంది ఆయన అడ్డా. నాలుగుస్ర్టోకులు నేర్చుకుని ఏదో ఒక పత్రికలో ఉపాధి పొందుదామని కుంచె చేత పట్టుకుని నగరం వచ్చే పోరగాళ్లకు అది స్థావర జంగమం. నెలకు లక్షకు పైగా తీసుకున్న రోజుల్లోనూ రేపేమిటో తెలీని రోజుల్లోనూ యోగిలాగా చిలుము పీలుస్తూ అదే రకమైన చిర్నవ్వులు చిందిస్తూ ఉండగలరాయన. చూడడానికి సామాన్యంగా కనిపిస్తుంది కానీ అదేమంత వీజీ విషయంబు గాదు. ఇహలోకపు బాదరబందీలను వదిలించుకునో బలవంతంగా విదిలించుకునో తామరాకుమీద నీటిబొట్టులాగా ఉండడానికి చాలా యాతన పడాలి. ఆయన తిప్పలేవో ఆయన పడి ఆ స్థితిని సాధించారు. ఇవ్వాళ కొన్ని పత్రికల్లో కనిపించే గండరగండల్లాంటి ప్రఖ్యాత కళాకార్స్‌ ఆ దర్బార్‌లో ఆయన చేత తీయని మందలింపులకు మురిసిపోతూ కనిపించేవారు. ఇవాళ సంఖ్య పలుచబడొచ్చు గానీ ఆ గురుకుల సంప్రదాయం ఆగిపోలేదు.
కవులు కవిత్వాన్ని కథకులు కథలను బొమ్మలేయువారు బొమ్మలు మాత్రమే చూడవలెననే మూఢనమ్మకమేదో తెలుగునాట చాలామందిలో ఉంది. ఆ అంధవిశ్వాసాన్ని పారద్రోలడానికి నిరంతరం శ్రమిస్తున్న సంస్కరణ వాది మోహన్‌! చదువుకు చిత్రమైన లక్షణముంటుంది. చదువుతున్నపుడు దాని ప్రయోజనం తెలీదు. తర్వాతెప్పుడో మనం నిస్సహాయులమై నిలబడినపుడు అదాటున చేతిలోకి ఆయుధంలా వచ్చి చేరుతుంది. ఆ రహస్యం ఎరిగిన వాడు, నలుగురికి ఆ ఆయుధాన్ని అందివ్వాలనుకున్నవాడు మోహన్‌. తన దృష్టికి వచ్చిన మంచి పుస్తకాన్ని మంచి సినిమాను నలుగురితో పంచుకునే వరకు నిద్రపోయే అలవాటు లేని ఆరోగ్యకరమైన సంప్రదాయం ఉన్న మనిషి. అయితే ఈ చదువు యావ అపుడపుడూ యారగెన్సీలాగా అనిపించి కొందరిని గాయపెడుతుంది కూడా. మోహన్‌ అనే ఔషధానికున్న సైడ్‌ ఎఫెక్ట్‌ అది. జ్ఞాపకాల్లో ఎంత పురాతనుడో ఆలోచనల్లో అంత ఆధునికుడు మోహన్‌. యానిమేషన్‌ గురించి వినడమేతప్ప దాని రూపురేఖా విలాసాల గురించి తెలుగునేలకు అంతగా పరిచయం లేని రోజుల్లోనే యానిమేషన్‌ ప్రయోగాలు చేసిన ముందుచూపరి మోహన్‌. అయితే ఆర్టి్‌స్టగా మోహన్‌ తన కృషిని గట్టిగా కొనసాగించలేదని వేయి బాహువులతో విస్తరించగలిగిన మనిషి ఎక్కడో తనను తాను కట్టేసుకున్నారని ఆయన అభిమానులు కొందరు ఆక్షేపిస్తుంటారు. వాస్తవమెంతో తెలీదు.
కళమూ గళమూ ఇత్యాది ఆయుధ ప్రయోగాల్లో పేరుమోసిన పేరుగాంచిన యోధులెందరో అక్కడ అస్త్రప్రదర్శన చేస్తూ కనిపిస్తుంటారు. అది ఓపెన్‌ హౌస్‌. పేపర్లో పేర్లూ అవీ చదివి యూరోపియన్‌ ఆర్ట్‌ అంటే పడిచస్తారు గానీ అందులో ఈ కళ ఏదీ ఈ సుళువేదీ అని ఏ చైనా ఆర్టిస్ట్‌ పేరునో ప్రస్తావిస్తారు మోహన్‌. మనం అంతగా పట్టించుకోని రామప్ప కళ గురించి తపన పడతారు. ఆ చైనా ఆర్టిస్టు తెలీదుకానీ రామప్ప చూశాం కాబట్టి ఆ తపన అర్థమయ్యేది. మనదైనదాన్నేదో పోగొట్టుకుని పొరుగింటి పుల్లగూర కోసం ఎగబడుతున్నామనే బాధ అది. కార్టూన్స్‌ గురించి వ్యాఖ్యానిస్తే అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడం అవుతుంది. కానీ కార్టూన్స్‌ నవ్వుతో పాటు కూసింత ఆలోచన కూడా రేపితే బాగుంటుంది అనే చాదస్తం ఉన్నవాడిని కాబట్టి ఆయన కార్టూన్స్‌ ఇష్టం. ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబుదాకా వైఎస్‌ నుంచి జగన్‌ దాకా ఆయన కుంచె బారిన పడినవారే. నేను కళ్లుతెరిచే నాటికి ఏ ఎర్ర సమావేశంలో చూసినా ఆయన వేసిన పోస్టర్లు, బ్యానర్లే. బక్కజీవులైన ఆడవాళ్లు, దళితులు, ఆదివాసీలు గుంపులుగుంపులుగా కొడవళ్లెత్తి మార్చింగ్‌ సాంగ్‌ పాడుతున్నట్టుండేది. చిలకలు కత్తులు దులపరించమంటే ఏమిటో ఆ బొమ్మల్లో కనపడేది. అవింకా ఊపూ ఉద్వేగం మిగిలి ఉన్న రోజులు. నయా, అర్థ, పార్లమెంటరీ అన్‌పార్లమెంటరీ గొడవలు ఎన్నున్నా సీపీఐ, సీపీఎం మొదలుకొని వివిధ గోత్రనామాలు కలిగిన ఎంఎల్‌ పార్టీలు, దళిత, స్ర్తీవాద, హక్కుల సంస్థల వరకూ కుంచె విషయంలో ఏకీ రాస్తా. అది మోహన్‌. కవిత్వం, కథల పుస్తకాల కవర్‌ ఇలస్ర్టేషన్స్‌ సరేసరి. శ్రీశ్రీ, పి.ఎల్‌. నారాయణలతో పాటలు మాటలు ఉచితంగానో అనుచితంగానో రాయించుకోవడానికి సినిమా వాళ్లు ఎన్ని వేషాలు వేసేవారో మోహన్‌ చేత బొమ్మలేయించుకోవడానికి కొందరు రచయితలు అన్ని వేషాలు వేసేవారు.
వీటన్నింటినీ మించింది నాకు కూడా కాస్తో కూస్తో అర్థంకాగలిగింది ఆయన అక్షరం. లైన్‌ డ్రాయింగ్‌ తనకిష్టమని ఆయన చెప్తూ ఉంటారు. స్కేల్‌ అవసరంలేకుండా నేరుగా గీత గీసినట్టుగానే అక్షరాన్ని సూటిగా సంధిస్తారు. తెలుగులో అంత మంచి వాక్యం రాయగలిగిన వారిని లెక్క పెట్టడానికి చేతి వేళ్లు కూడా అవసరం లేదు. ఆ వాక్యం ధర్మపీఠం మీద కూర్చుని ఉపదేశం చేస్తున్నట్టుగా ఉండదు. ప్లీజ్‌ వినండర్రా అని చేతులు జోడించి అర్థిస్తున్నట్టూ ఉండదు. స్నేహితుడి భుజం మీద చేయేసి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మోహన్‌ వాక్యం మన సహచరి. కామ్రేడ్‌. చిత్తప్రసాద్‌ను గాఢంగా పరిచయం చేసినా పేరు సక్సెస్‌ డబ్బు వెంట పరుగులు పెట్టే రచయితలను హెచ్చరిస్తూ కళా, కిరసనాయిల్‌ తహసిల్దారా అని ఎద్దేవా చేసినా వాక్యం వంకర్లు పోదు. ఇంకేదో మోటివ్‌ వెంటబెట్టుకుని వాక్యం నంగినంగిగా ప్రయాణించదు. భక్తీ లేదు, నలుగురు ఏమనుకుంటారో అనే భయమూ అంతగా లేదు. అన్ని పురోగామి స్రవంతుల సంగమ స్థలి, సంఘర్షణ స్థలి మోహన్‌. దశాబ్దాలుగా ఉద్యమాలతో నడుస్తున్న మోహన్‌ గీతలు, రాతలు ఇపుడు సంపుటాలుగా రాబోతున్నాయి. లెట్స్‌ సెలబ్రేట్‌ ది ఆర్టిస్ట్‌ ఆఫ్‌ అవర్‌ టైమ్స్‌. 


జి.ఎస్‌. రామ్మోహన్‌ 

(డిసెంబర్‌ 24, 2015న ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

No comments:

Post a Comment