Thursday 14 April 2016

తూరుపు తీరాన తీరని లోటు








ఆ నవ్వు లేక విశాఖ బోసిపోయింది. సముద్రం లాగే కొలవలేనంత తడి ఉన్న మనిషి. నీళ్లు కనిపించినా పరిచయస్తులు కనిపించినా పట్టలేం. దూకి లోతు తెలుసుకోవాల్సిందే. పరిసరాలతో పరిచయం లేకపోయినా నీళ్లు కనిపిస్తే దూకేస్తారు. పరిచయస్తులు కనిపిస్తే భుజం పట్టుకుని లోపలా బయటా కుదిపేసి లోతుల్ని తెలుసుకుంటారు. ఆయనతో రెండో సారి మాట్లాడేసరికే పేరుతో పలకరించేసే చనువు వచ్చేస్తుంది. అచేతనంగా పడి ఉన్న మనిషి సాక్షిగా సాగిన సమావేశంలో అందరూ మా చలసాని అనే గుర్తుచేసుకున్నారు. చాలామంది బోళా మనిషి అన్నారు. మామూలుగా వాడే అర్థంలో అయితే భోళా అనేది సరిపోదు. తెలివైన మనిషి, తెలిసిన మనిషి బోళాగా బతకడం కష్టం. అందుకు చాలా వదులుకోవాల్సి ఉంటుంది. అది ఊరికే ఆయాచితంగా వచ్చిపడే లక్షణం కాదు. సులభంగా కనిపించే తెలుగు వాక్యం రాయడం లాంటిది. అది అంత సులువుగా రాదు. సాధన కావాలి. ఆ సాధన వెనుక లక్ష్యం ఉండాలి. భోళాతనంలోనూ లక్ష్యమున్నది.
        నిత్య జీవితంలో ప్రివిలేజెస్‌ని అడ్వాంటెజెస్‌గా మార్చుకోకుండా నిగ్రహంచుకోవడం కష్టం. కులం ప్రివిలేజ్‌. అందులోనూ ఇంటిపేరు ప్రివిలేజ్‌. సీనియారిటీ ప్రివిలేజ్‌. అనుభవం ప్రివిలేజ్‌. వయసు ప్రివిలేజ్‌. విస్తృత పరిచయాలు ప్రివిలేజ్‌. నా ఏకైక కైక అని శ్రీశ్రీ స్వయంగా అని ఉండడం ప్రివిలేజ్‌. ఇలాంటివాటిని చాలామంది ఏదో సందర్భంలో అడ్వాంటెజెస్‌గా మార్చుకుంటారు. ఎదుటివ్యక్తిని డామినేట్‌ చేయడానికి ఉపయోగించుకుంటారు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా అన్నట్టు ఆయన చూడడం నేనెన్నడూ చూడలేదు. శ్రీశ్రీకే ఆత్మలాంటివాడిని, ఈ పిపీలికములతోనా అన్నట్టు ఎవరితోనైనా ఆయన ప్రవర్తించినట్టుగా తెలీదు. ఆ ప్రివిలేజెస్‌ ఆయనకు ఏపరోక్ష రూపంలోనైనా ఏ కొంచెమైనా ఉపయోగపడ్డాయో లేదో చెప్పలేను కానీ ప్రజాజీవనంలో తన ప్రయోజనం కోసం ప్రయత్నపూర్వకంగా ఉపయోగించుకున్నట్టుగా అయితే తెలీదు. సంస్థల కోసం ఎన్నడైనా ఉపయోగించి ఉండవచ్చును.    
     
        ఆయన మానవసంబంధాల్లో పార్టీవ్రత్యం పాటించలేదు. ఉక్కు క్రమశిక్షణ అవసరమైన, అత్యంత కఠినమైన రాజకీయపంథాతోనూ పోరాటంతోనూ ఉంటూ కూడా ఇంత విస్తృతమైన సున్నితమైన సంబంధబాంధవ్యాలు నెరపడం మామూలు విషయం కాదు. ఆ మానవసంబంధాల విస్తృతి చూసినపుడు ఉదారవాదపు లక్షణాలున్నట్టుగా కనిపించొచ్చుకానీ ఆయన రాజకీయ జీవితంలో ఉదారవాదిగా వ్యవహరించినట్టు అయితే తెలీదు. సంబంధ బాంధవ్యాలు కూడా ఏదో వ్యక్తిగత అవసరం కొద్దీ ఎంచుకుని చేసినవి కావు. ఈ లక్షణం ఆయాచితంగా వచ్చే భోళా లక్షణం కాదు. రాజకీయ వైఖరికి సంస్థల క్రమశిక్షణకు కట్టుబడి ఉంటూనే ఆ లైన్‌ తప్పకుండానే ఇన్ని రకాల మనుషులతో వ్యవహారం నెరపాలంటే ఏదో కావాలి. అదేదో ఆయన దగ్గర ఉంది. దాన్నిసాధించారు. స్టాలిన్‌కు వీరాభిమానిగా ఉంటూ కూడా ఇలాంటి లక్షణాన్ని అలవర్చుకోవడం ఊహించడానికే కష్టమైన విషయం. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కుటుంబంలో జన్మించిడం వల్ల ఆ వారసత్వంగా వచ్చిందా, లేక ఎప్పుడో ఒకసారి అందరమూ కలవాల్సినవాళ్లమే, పంథాలు వేరుకావచ్చుకానీ, లక్ష్యం వేరుకాదు అనేభావనలోంచి వచ్చిందా అనేది తెలీదు. ఆయనకు ముందు ముగ్గురు కుటుంబ సభ్యులు అమరులై ఉన్నారు. ఆయన తర్వాతా ఆ కుటుంబ సభ్యులు ముళ్ల బాటనే ఎంచుకుని ఉన్నారు. అపుడైనా ఇపుడైనా వారెంచుకున్న బాటతో రాజకీయ విభేదం ఉండవచ్చును. కానీ అది త్యాగాల బాట కాదని అయితే ఎవరమూ అనలేం. ఆయనెప్పుడూ వివాదాస్పద అంశాలను చర్చించేవారు కాదు. హాయిగా మాట్లాడుకోవడానికి అవసరమైన అంశాలనే ప్రస్తావించేవారు. ఏదైనా ఫాక్చువల్‌ మిస్టేక్‌ ఉందనిపిస్తే మాత్రం అందులో అలా లేదు. ఇలా ఉంది అని గుర్తుచేసేవారు అంతే. ఆయన మనసులో ఏమి ఉండింది అనేది తెలిసేది కాదు. ఎదుటివారి పట్ల లుకింగ్‌ డౌన్‌ యాట్టిట్యూడ్‌ లేదు.  జీవితం అర్థవంతంగా ఉండాలని చాలామంది సామాజికులు తపిస్తారు. ఒక లక్ష్యంకోసం నిలవడం అనేది అందులో భాగమౌతుంది. లక్ష్యశుద్ధి, ఎంచుకున్న మార్గం పట్ల విశ్వాసం లేకుండా ప్రయాణం కష్టం. కానీ అందుకోసం మన మార్గాన్ని సంపూర్ణంగా విశ్వసించని వారినందరినీ తక్కువగా చూడనక్కర్లేదని అర్థం చేసుకున్నవాడు. మనుషులను కూడగట్టుకోవడానికి అది అవసరమని భావించి ఉండొచ్చు. అందువల్లే అన్ని శ్రేణులతో అంత విస్తృత సంబంధాలు ఏర్పరుచుకోగలిగాడు. చాలామందికి ఏకకాలంలో తండ్రీ, బాబాయ్‌, స్నేహితుడు. కూడగట్టడం కష్టమైన కాలంలో అది అవసరమైన లక్షణం. ఏసుక్రీస్తు ముళ్లకిరీటం భారం తానొక్కడే మోస్తున్నట్టు ఎన్నడూ కనిపించేవారు కాదు. సదా బాలక్‌, సదా లోక్‌ సంచార్‌. 
       ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌ అనే వాడుకకు నిజమైన అర్థంగా నిలిచినవాడు. మూడింటి మిక్స్‌. చేసే పనిలో తన పేరు ప్రముఖంగా కనిపించాల్సిన, తన పేరు వినిపించాల్సిన అవసరం లేదని భావించినవాడు. నేను అనేది ముందుకు తోయకుండా పనిచేసేవారు అరుదు. ఇతరులను ప్రోత్సహించడంలోనూ శ్రీశ్రీ, కొకు, గోపీచంద్‌ సంపుటాలు తేవడంలోనూ వెచ్చించిన శ్రమ, సమయం తన పేరును వెలిగించుకోవడం కోసం వెచ్చించి ఉంటే ఆయన ఇంకో రకంగా కూడా పేరు పొంది ఉండేవారేమో! తెలీదు. సమాచారం మీద పెట్టిన శ్రద్ధ విశ్లేషణ మీద వ్యాఖ్యానం మీద పెట్టారా! అనుమానమే! వ్యక్తిగత పరిమితుల పాత్ర కూడా ఉండొచ్చును కానీ పూర్తిగా పరిమితికి మాత్రమే వదిలేయగలమా! వ్యక్తులపై ప్రేమవల్ల ఆయన తన సమయాన్ని శక్తిని అవసరమైన దానికన్నా ఎక్కువ వెచ్చించారేమో ఆ వెచ్చింపులో కొంత వృధా కూడా ఉందేమో అనిపిస్తుంది. ఏమైనా సామాజిక ఆచరణలో నేనును సాధ్యమైనంత వరకు రద్దు చేసుకోగలిగారు. ఇది చాలా చాలా కష్టమైన విషయం. ప్రాణాల్ని వదులుకోవడం సులభం, అహాన్ని వదులుకోవడం కష్టం అని గంటి ప్రసాదం అనేవారని వివి అక్కడ గుర్తు చేశారు. లిటరల్‌ సెన్స్‌లో తీసుకోకుండా స్పిరిట్‌ తీసుకుంటే గొప్పమాట. అలా వదులుకున్న మనిషి చలసాని.
         పుస్తకానుభావాలైనా జీవితానుభవాలైనా అవసరమైన వారితో పంచుకోవడం వాటి ప్రాధాన్యాన్ని తెలియజెప్పడానికే అనిపిస్తుంది. చదువు ప్రాధాన్యాన్ని అర్థం చేయించే కృషి అవసరమైనది. చివరి దశలో తారీఖులు దస్తావేజుల చాదస్తం కాస్త కనిపిస్తుంది. చరిత్రను సరిగా రికార్డు చేయడం అనే కచ్చితత్వం నుంచి వచ్చిన అవశేషంగా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో! తన ఇంటినే ఒక నమూనాగా మార్చడంలో ఆయన విజయం సాధించారు. తాళాలు లేని ఇల్లు, దండన లేని చదువులు, పోలీస్‌ స్టేషన్లు లేని రాజ్యం ఆదర్శ నమూనా అని వాటికోసం కలగన్న చలసాని  తన పరిధిలో వాటిని చేసి చూపించారని వివి అక్కడ చెప్పారు. మొదటిది, చివరిది ఏ సమాజంలోనైనా సాధ్యమేనా, అది ఉటోపియా మాత్రమేనా అనే సందేహం ఉన్నప్పటికీ సారాంశంలో అటువంటి లక్ష్యమొకటి ఉండడం ఉదాత్తం. ఆ అవసరాన్ని తన ఆచరణతో గుర్తు చేసిన మనిషి చలసాని. బీ ద చేంజ్‌ యు వాంట్‌ అన్న గాంధీ మాటలకు ఆచరణ రూపం.

       చలసాని ఎనభై యేళ్లకు పైబడి బతికారు. కూసింత డిమెన్షియా లక్షణాలు తొంగిచూస్తున్న తరుణంలోనే గుండ్రాయిలాగా తిరుగుతున్న తరుణంలోనే ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా మరణించారు. కొన్ని ఒంటరితనాలు, కొన్ని దిగుళ్లు, సాయం చేయబోయి తిన్న ఎదురుదెబ్బలు కొన్ని ఉంటే ఉండొచ్చును కానీ  అవేవీ ఆయన జీవితాన్ని అసంపూర్ణం చేయలేవు. ఇట్స్‌ ఏ సెలబ్రేషన్‌ ఆఫ్‌ లైఫ్‌. మనకు ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుని బాధపడడం తప్ప,  ఆ మరణంలో దిగ్భ్రాంతికరమైనదేమీ లేదు. సంపూర్ణజీవితమే గడిపారు. చేయాలనుకున్నది చేయగలిగినంత చేశారు. కానీ ఆయన లేని ఉత్తరాంధ్రను గుర్తుచేసుకుంటే మాత్రం బాధేస్తుంది. కేంద్రం లేకపోతే ఆ ప్రాంతాలు ఎలా అనాధలవుతాయో చరిత్ర చూపించి ఉంది. అసలే గడ్డుకాలం. పురోగామి శక్తులు  పుట్టకొకరు చెట్టుకొకరుగా చెల్లా చెదురవుతున్న కాలం. నలుగురిని కూడగట్టడం గగనమవుతున్నకాలం. ఈ సమయంలో చెట్టులాగా అందరికీ చల్లని నీడనిచ్చి కూడగట్టే మనిషి లేకపోతే ఆ శక్తులు విస్తరించలేవు. దాన్ని తల్చుకుంటే మరింత దుఖ్ఖమేస్తుందని ఒక మిత్రుడు వ్యాఖ్యానించారు. అది నిజమైన లోటు. 

జి ఎస్‌ రామ్మోహన్‌
(ఆగస్టు2, 2015న ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

No comments:

Post a Comment