Thursday, 14 April 2016

సమాజానికి వడదెబ్బ

తెలుగు నేల మీద దాదాపు మూడు వేలమంది వడదెబ్బకు చనిపోయినట్టు వార్తలు చూస్తున్నాం. ఇవన్నీ పదిరోజుల వ్యవధిలో జరిగినవే. పదిరోజుల్లో మూడువేల మంది మరణించడం ఏ విధంగా చూసినా మానవీయ సంక్షోభమే. పదిరోజుల్లో వేలమంది చనిపోతే ఏ నాగరిక ప్రపంచమైనా ఇంత నిర్లిప్తంగా ఉంటుందా!
అయితే ప్రభుత్వాలు ఏం చేయాలి? వాళ్లకు గొడుగు పట్టాలా? అని ప్రశ్నించే మేధావులు ఉంటారని తెలుసు. మనకంటే వాతావరణ సంక్షోభాలు ఏర్పడే దేశాలు చాలానే ఉన్నాయి. శీతల దేశాల్లో ఇంత కంటే అననుకూల పరిస్థితులు ఉంటాయి. మరి అక్కడ జనం ఎం దుకు మనలాగా రాలిపోవడంలేదు. జనం పిట్టల్లా రాలుతుంటే దీనికి పరిష్కారం కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలమీద ఉండదా! ఒక గుండెనో కిడ్నీనో మార్పిడి చేస్తున్నారంటూ ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో తరలించి నగరాల్లో ట్రాఫిక్‌లు ఆపి దాన్ని గొప్ప మాన వీయమైన పనిగా మీడియాలో అదే పనిగా చాటుకునే సమాజం వేలమంది రాలిపోతున్నా నిర్లిప్తంగా ఉండిపోవడంలో పని చేస్తున్న అంశమేమిటి? ఒక్క ప్రాణం కాపాడడం కోసం చూపించే ఈ తపన దానికి సమాజంలో కనిపిస్తున్న స్పందన వేయిమంది చనిపోయిన పుడు ఎందుకు కనిపించడం లేదు. దానికి దీనికి నేరుగా సంబంధం లేకపోవచ్చు. అవయవమార్పిడికి పాజిటివ్‌ సింబాలిజం అవసరమే. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. కానీ అదే సెన్సిబిలిటీలో వందో భాగమైనా ఎందుకు ఇక్కడ కనిపించడం లేదన్నదే ప్రశ్న. హుద్‌ హుద్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌ను అతలా కుతలం చేసిందని రాష్ట్రం నడుము విరిగిందని చాలా చాలా బాధపడ్డాం. విశాఖను చూసి అయ్యో అననివారు లేరు. విశాఖ, ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ప్రాణ నష్టం తక్కువ. ఆస్తి నష్టం ఎక్కువ. అయినా సరే, దానిపై చూపిన కన్సర్న్‌లో వందో భాగం కూడా వడదెబ్బ మరణాలపై ఎందుకు చూపించలేకపోతున్నాం. ఆస్తి నష్టానికి చూపించిన స్పందన ప్రాణ నష్టంపై కనిపించకపోతే ఆ సమాజపు ఆలోచన సవ్యంగా ఉన్నట్టు భావించాలా! తుపానులను ఉత్పాతాలుగా చూసినట్టుగా వడదెబ్బను చూసే దృక్పథం మనకు లేదు. ఎండలు అలవాటైన దేశం కాబట్టి అది చండ ప్రచండమై వేలమందిని బలితీసుకుంటున్నా మామూలే అన్నట్టు చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యం అనే విషయంలో మన దృక్పథంలోనే మార్పు రావాల్సిన అవసరం ఉంది.
నిపోతున్న వారిలో అత్యధికులు పేదలు. చచ్చినట్టు ఎండన బడక తప్పనిసరిస్థితిని ఎదుర్కొంటున్నవారు. గ్రామీణ ఉపాధి హామీ కూలీలు, చిన్నచిన్న పనులు చేసి పొట్ట పోషించుకునేవారు. పనిలోనో ప్రయాణంలోనో కనీస నీటివసతి కరువై ప్రాణాలొదిలిన వారు. తుపాన్ల సమయంలో పల్లపు ప్రాంతాల్లోని జనాన్ని బలవంతంగా నైనా తరలించి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఎందుకు తీసుకోలేం? కనీస జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చును. ఎండా కాలం అడవుల్లో జంతువులకు సైతం తొట్టెలు తవ్వి నీటిని నింపే ప్రభుత్వాలు మన మధ్యలో మనుషులు ఇంత సంఖ్యలో రాలి పోతుంటే కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోతున్నాయి? పోనీ, ఇది తెలీకుండా హఠాత్తుగా విరుచుకుపడిన ఉత్పాతం కూడా కాదు. రెండేళ్ల క్రితం కూడా పెద్దసంఖ్యలో మనుషులు మరణించారు.
చప్రతి యేటా మే 15 నుంచి నెలాఖరు వరకు ఎండలు భయాన కంగా మారతాయని అందరికీ తెలుసు. అటూ ఇటూగా ఎంత ఉష్ణో గ్రతలు నమోదవుతాయో కూడా తెలుసు. ఇన్ని తెలిసి కూడా ప్రాణ నష్టాన్ని నివారించలేకపోవడం నేరపూరిత నిర్లక్ష్యంగానే భావించాల్సి ఉంటుంది. చాలాదేశాల్లో వాతావరణం ఉగ్రరూపం దాల్చే సీజన్‌లో సెలవులు ప్రకటిస్తారు. మనకు కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తు న్నారు. పనిలో పనిగా గ్రామీణ ఉపాధి పథకం కూలీలకు పనివేళల్లో మార్పులు చేసి అక్కడ నీరు అందుబాటులో ఉంచి ఉంటే ప్రాణాలు కాపాడుకోగలిగి ఉండేవారం కాదా! కనీసం ఆ పది పదిహేనురోజులు ఆర్టీసీ బస్సుల్లోనూ డిపోల్లోనూ నీటిని విస్తృతంగా అందుబాటులో ఉంచితే చాలా ప్రాణాలను కాపాడుకోలేమా! రోడ్ల మీద అక్కడక్కడా మనుషులకు నీడనిచ్చే తాత్కాలిక టెంట్లు వేసి అక్కడ కాస్త నీరు ఏర్పాటు చేస్తే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు కదా! మన పట్నాల్లో మనిషి ఇంట్లోంచి బయటపడితే మళ్లీ ఇల్లు చేరేదాకా నీడనిచ్చే వేదికలేమైనా ఉన్నాయా! రోడ్డుమీద కిలోమీటర్ల మేర పబ్లిక్‌ కుళా యిలే కనిపించని పట్టణాలు మనవి. అన్ని కార్యాలయాలకు సెల వులు ప్రకటించలేకపోవచ్చు. కనీసం ఆ పదిహేను రోజులు కార్యాల యాలకు, దుకాణాలకు మధ్యాహ్నం 12 నుంచి నాలుగు వరకూ సెలవు ప్రకటించి వేళలు మార్చలేమా! ఇవేవీ కోట్లు ఖర్చయ్యే విష యాలుకాదు. అసాధ్యాలు అసలేకాదు. డబ్బుసమస్య కాదు. పట్టింపు లేకపోవడం సమస్య. నిరుపేదల ప్రాణాలంటే పట్టింపులేకపోవడం.


ప్రభుత్వాల ఆలోచనల్లోనే కాదు, సివిల్‌ సొసైటీ ఆలోచనల్లో కూడా ఆ పరిమితి ఉంది. మనం ఆర్థికంగా, సాంఘికంగా ఏ సమూహంలో ఉన్నామో ఆ సమూహపు ప్రయోజనాలే తమ ప్రయోజనాలుగానూ ఆ సమూహపు కష్టాలే తమ కష్టాలుగానూ భావించే ఆలోచన ప్రబలంగా ఉంటుంది. 90ల తర్వాత మారిన పరిస్థితులు తాము చేరాలని ఆశించే సమూహపు ప్రయోజనాలతో కింది మనుషులు కూడా లంకె వేసుకునే విధంగా మార్చేశాయి. దీంతో ఆలోచనా పద్ధతిలో చాలా తేడా కనిపిస్తున్నది. ఎండకు వానకు మనమెందుకు చస్తాం. వాళ్లెవరో చస్తారు కానీ అనే భ్రమ ఒకటి ఉంటుంది. పెళ్లికి హాజరు కావడానికి టూవీలర్‌ మీద దూర ప్రయాణానికి బయలుదేరిన టీచర్‌, లాయర్‌ కూడా మృతుల్లో ఉం డొచ్చు. అయినా ఎక్కువలో ఎక్కువ పేదలుంటారు కాబట్టి ఏ సమూహమూ తనవారిగా తీసుకోదు. దీనికి తోడు ఎన్నికల్లో ప్రెషర్‌ గ్రూప్‌గా పనిచేయగలిగిన సమూహ లక్షణం లేదు. ప్రభుత్వాలు అందుకే ఇంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయా అనిపిస్తుంది.
ఎండ కూడా ప్రకృతి వైపరీత్యమే. పదిరోజుల్లో మూడువేల మం దికి పైగా చనిపోతే అది వైపరీత్యం కాకపోవడమేమిటి? ముఖ్యంగా నలభయ్యో, నలభై రెండో ఏదో ఒక పారామీటర్‌ ఏర్పాటు చేసుకుని అది దాటిన ఎండను ప్రకృతి వైపరీత్యంగా గుర్తించి తుపాన్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలాంటి జాగ్రత్తలు తీసుకోవా ల్సిన అవసరం ఉంది. తుపాన్లలో మొత్తం యంత్రాంగం ఎలా అయితే స్పందించి పనిచేస్తుందో అదే విధంగా ప్రాణాపాయాన్ని నివారించడానికి పనిచేయాల్సి ఉంది. మూడువేల మంది అన్యాయంగా ఎండకు బలైపోయినా ఎవరికీ ఏమీ అనిపించనంతగా చర్మం ముదిరిపోవడం సమాజానికి మంచిది కాదు.

-జి.ఎస్‌. రామ్మోహన్‌
(జూన్‌11, 2015న ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

No comments:

Post a Comment