Thursday, 14 April 2016

తూర్పు-పడమర  

Artwork: Srujan Raj
Artwork: Srujan Raj
-జి ఎస్‌ రామ్మోహన్‌

వరలక్ష్మికి అప్పటికి గానీ అర్థం కాలేదు. అన్న కావాలనే అటూ ఇటూ తిరుగుతున్నాడని. తప్పించుకు తిరుగుతున్నాడని. వచ్చినపుడు దూరపోళ్లని పలకరిచ్చినట్టు పలకరిచ్చిందే! కుదురుగా మాట్లాడే అవకాశమిస్తేగా!  చూడనట్టే మొకం పక్కకు తిప్పుకుని మొబైల్‌లో మొకం దూర్చేస్తున్నాడు. అదొకటి దొరికింది మనుషులను తప్పించుకోవడానికి. ఏడాదిలోనే ఎంత మార్పు! మనిషి మునుపటంత తేటగా లేడు. కడుపు ముందుకు పొడుచుకుని వచ్చేసింది. మొకమంతా ఎవరో బాడిసెతో చెక్కినట్టు అదో రకంగా ఉంది. కళ్లకింద కండ ఉబ్బిపోయి వింతైన నునుపుతో రంగుతో మెరుస్తా ఉంది. ఆ నునుపు మెరుపు ఏం బాలేదు.
అన్న ముఖం ఎంత అందంగా ఉండేది? ఎంత చక్కని పలకరింపు? వెన్నెల ఆరబోసినట్టు ఏం నవ్వు అది? ఏమైపోయింది? డబ్బు ఇంతగా మనుషులను మారుస్తుందా! ఎందుకు మాట్లాడాలనుకుంటోందో ఏమి మాట్లాడాలనుకుంటుందో తెలిసిపోయినట్టే ఉంది. తెలీకుండా ఎట్లా ఉంటది? తడిక చాటు రాయబారాలతో పనికాకనే కదా ఆడో మొగో తేల్చుకుందామని ఇక్కడికొచ్చింది?
“ఇంకా తేల్చేదేముందే, వాళ్లు చేసుకునే రకం కాదు’
అని ఇరుగుపొరుగు అంటారు కానీ అలాంటి పాడు మాటలు వరలక్ష్మికి వినపడవు.
“ఎక్కడ ఈ సంబంధం కుదిరిపోతుందో అని వారి బాధ’ అని లోలోపల తనను తాను సమాధానపర్చుకుంటా ఇప్పటివరకూ లాక్కొచ్చింది వరలక్ష్మి. ఇపుడు వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేసరికి కాళ్లు వణుకుతున్నాయ్‌.
ఏమయితే మాత్రం, తోడపుట్టినదాన్ని ఇంత అవమానిస్తాడా! ఎంత కింది చేయి అయితే మాత్రం నాలుగు మాటలు మాట్లాడలేనంత లోకువైపోయిందా!  లోలోపల సుడులు తిరుగుతా ఉంది. అయినా వరలక్ష్మి ముక్కు చీదలేదు. వరలక్ష్మి చదువూ సంధ్యలు లేని మనిషి కాదు. మంచీ మర్యాదా తెలీని మనిషి కాదు. టెన్త్‌ పాస్‌ అయిన అమ్మాయి. ఇంటర్‌ చేరి మానేసిన అమ్మాయి. దుక్ఖాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకున్న మనిషి. వాళ్లూరు పెద్దమ్ములు పేరుకు పల్లెటూరేగానీ మరీ ఎక్కడెలా ఉండాలో తెలీనంత పల్లెటూరేమీ కాదు. దాచేపల్లి టౌన్‌కు పక్కనే అంతా కలిసిపోయినట్టే ఉండ్లా ఇపుడు!
“”ఆ దిక్కుపాలిన పడమటికి ఇవ్వబట్టి నా బతుకు ఇట్లా అయిపోయింది గానీ  తూరుపునే ఇచ్చి ఉంటే మెడలో గొలుసులు అవీ వేసుకుని దర్జాగా కుర్చీలో కూర్చొని బీడుపడిన పొలాల గురించి పాడైపోయిన వ్యవసాయం గురించి మాట్లాడతా ఉండేదాన్ని కాదూ.”
అని ఎన్ని సార్లు అనుకోని ఉంటదో ఈ మధ్య. ముక్కు పుటాలు అదురుతుండగా మొకంలో మారుతున్న రంగులను ఎవరైనా గమనిస్తున్నారా అని చుట్టూ చూసింది. నలుగురైదుగురి చూపు తనమీదే ఉందని అర్థమైనా ఛీఛీ అదంతా తన భ్రమ  అనేసుకుంది. ఊరికే చేతిలో మొబైల్‌ ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ తిప్పి చూపులో తడి ఎదుటోడికి కనిపించకుండా కాపాడుకుంది.
“ఓ గజ్జెల గుర్రమా, ఓ పిల్లా, ఏమే, ఎంత ఇంజనీరు మొగుడు దొరికితే మాత్రం పుట్టినూరోళ్లు కనిపించరేమే”
అని ఒక కుర్రపిల్లతో పనిగట్టుకుని పరాచికాలకు దిగింది. పక్కనున్న పెద్దావిడ చీర ఎక్కడ కొన్నదో వాకబు చేసింది.
మనింట్లో మనం ఎట్టైనా ఏడ్చుకోవచ్చు. పదిమందిలో, అందులోనూ బంధువుల పెళ్లిలో ఏడిస్తే నగుబాటు కాదూ!
Kadha-Saranga-2-300x268
పెళ్లి మంటపం కళకళగా ఉంది. గలగలగా ఉంది. ఇటీవలే కొత్త హంగులు తొడుక్కున్న మస్తానయ్య గారి ఎసి కల్యాణ మంటపం. సత్తెన పల్లి ఇదివరకటి సత్తెన పల్లికాదు, పల్నాడు ఇదివరకటి పల్నాడు కాదు అని ప్రభలు కట్టి మరీ చాటుతున్నట్టుంది. అమరావతి అంతగా కాకపోయినా తమకూ ఆ అదృష్టంలో ఎంతో కొంత వాటా వస్తుందని ఆశగా ఉంది. తమ పొలం పక్కనే పరిశ్రమలొస్తాయని భరోసాగా ఉంది. అమరావతి వాళ్లైతే ఎమ్మెల్యేల ఇల్లు తమ పొలంలోనే ఎలా వస్తాయో నలుగురికి చేతులూపుతా చెపుతా ఉన్నారు. ప్రతి పదిమందిలో ఆరేడు మంది రియల్‌ ఎస్టేట్‌ గురించే మాట్లాడుతున్నారు. కూలోళ్లు నోటికొచ్చినంత అడిగితే బక్క రైతు బరించేదెట్లా అని వినిపించే చోట, కాని కాలంలో ఆకాశంలో మబ్బు కనిపిస్తే మిర్చి తడిసిపో్తుందని ఆందోళనలు వినిపించే చోట ఇపుడు లేఅవుట్ల భాష వినిపిస్తోంది. లక్ష అంటే అపురూపంగా మాట్లాడుకునే గడ్డమీద ఇపుడు కోటి అంటే ఎంత, రెండక్షరాలేగా అనిపించేట్టు అయిపోయింది. ఎకరా అరెకరా అమ్ముకుని ఇంటినీ ఇల్లాలినీ మెరుగుపెట్టిన వాళ్ల హడావుడి ఒక రకంగా ఉంది. ఆడోళ్ల మెడలు కొత్త బంగారు లోకం అన్నట్టున్నాయి. మగాళ్ల చేతులకు కడియాలు మెరుస్తా ఉండాయి. అన్నిట్నీ మించి చేతుల్లో ఇమడలేక చారడేసి మొబైల్‌ ఫోన్లు బయటకు దూకుతా ఉన్నాయి. అమ్మేస్తే ఐసా పైసా అయిపోతాం అని వెనుకా ముందూ ఆడుతున్న జాగ్రత్త పరుల గొంతులు ఇంకో రకంగా ఉన్నాయి.
కొందరు మగవాళ్ల చూపులు తలుపు దగ్గర వరుసగా గులాల్‌  చల్లుతూ నిలబడిన మణిపురి, నేపాలీ పిల్లల మోకాళ్ల దగ్గర లంగరేసి ఉన్నాయి.  పిక్కల పైపైకి పాకుతూ ఉన్నాయి. ఇంత పెద్ద కల్యాణ మండపాలు అక్కడోళ్లకు మరీ వింతేమీ కాదు. కానీ ఇట్లా జవాన్లు వరుసగా నిలబడ్డట్టు ఆడపిల్లలు నిలబడ్డం కొత్త. అందునా తెల్లతెల్లగా పాలిపోయిన రంగున్న ఆడపిల్లలు. పిక్కలపైన గౌన్లేసుకున్న ఆడపిల్లలు.  భూమి పుట్టినప్పటినుంచి వాళ్లు అలాగే నుంచోని ఉన్నారేమో అన్నట్టు ఏమాత్రం ఆసక్తి కలిగించని నవ్వుతో రోబోల మాదిరి ఉన్నారు ఆ ఆడ పిల్లలందరూ. మొగోళ్ల వయ్యారాలు చూసి ఆడోళ్లు గొణుక్కుంటా ఉన్నారు. ఆ పిల్లల చేత గులాల్‌ చల్లించుకోవడానికి దగ్గరదగ్గరగా వాలిపోతున్న మొగుళ్లని డొక్కలో పొడుస్తున్నారు. “చూసింది చాల్లే నడువబ్బా” అని ముందుకు తోస్తున్నారు. పెళ్లి మంటపం అరేంజ్‌ మెంట్ ఆ ఊరోళ్లు నాలుగు రోజుల పాటు చర్చించుకోవడానికి వీలుగా ఉంది. మండపం పక్కనే వేదికపై కోలాటం ప్లస్‌ కథాకాలక్షేపం నడుస్తా ఉంది. యాభై యేళ్ల రాజమండ్రి ఆడపడుచు వాళ్ల బంధువల టీమ్‌తో కలిసి కథాకాలక్షేపం చేయిస్తా ఉంది. ఆ దిక్కుమాలిన రికార్డింగ్‌ డాన్సులకంటే ఈ కథ ఎంత బాగుంది ఒదినా అని మాటలు  వినిపిస్తున్నాయి. పట్టుచీరల రెపరెపల మధ్యలో రెండు మూడు లోవెయిస్ట్‌ జీన్స్ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. “ఎంత హైదరాబాద్‌లో ఉద్యోగమైతే మాత్రం పెళ్లిలో అదేం అవతారమే పోలేరమ్మలాగా” అనే సణుగుడులు గాజుల చప్పుళ్లలో కలగలసి ముసిముసిగా వినిపిస్తున్నాయి. పెళ్లి మంటపం వెనుక పై అంతస్తులో నల్లకుక్కతో ఇరవై మంది కుర్రాళ్లు కుస్తీ పడుతున్నారు. గ్లాస్ చప్పుళ్లు, జోకులు అపుడపుడు ఆగిఆగి వినిపిస్తున్నాయ్‌.
“బీరేందిరా ఆడోళ్ల మాదిరి…..డిసెంబర్లో బీరేందిబే” ..
గట్టిగట్టిగా నవ్వులు.
“హుస్‌ హుష్‌ ….మెల్లగా.. నీ యబ్బ, రెండు పెగ్గులకే వీరంగమెస్తున్నావేరా” అని అందరికీ మెల్లగా సుద్దులు చెప్పే గొంతుకలు కొంచెం గట్టిగానే వినిపిస్తున్నాయి. మొన్నమొన్నటిదాకా రాయల్‌ స్టాగ్‌ పేరే రాయల్గా వినిపించే చోట బ్లాగ్‌ డాగ్‌  మాలిమి అయిపోతా ఉంది.

అన్నతో అటో ఇటో తేల్చుకోవడానికి ఈ పెళ్లిని వేదికగా ఎంచుకుంది వరలక్ష్మి. పెదనాన్న మనమడి పెళ్లి. బంధుబలగమంతా చేరే పెళ్లి. ఇక్కడైతే నలుగురు పెద్దమనుషులుంటారు. అటో ఇటో తేలుస్తారు. ఏందిరా దాని సంగతి  అని అడుగుతారు. అవసరమైతే గడ్డి పెడతారు. నలుగురూ గట్టిగా అడిగితే తోడపుట్టినోడు కాదనగలడా! అటో ఇటో తేల్చకుండా తప్పుతుందా!  కొండంత అనుమానమూ గంపెడాశ కలగలిసిన ఆదుర్దాతో ఇక్కడకొచ్చింది. తీరా ఇక్కడకొస్తే సీన్‌ రివర్స్‌ గేర్‌లో తిరుగుతా ఉంది. ఇక్కడ జరుగుతున్న పంచాయితీలు తన పంచాయితీ కంటే పెద్దవిగా కనిపిస్తున్నాయి. కోర్టులు కేసులు అని ఏవేవో వినిపిస్తున్నాయి. ఇక్కడంతా పటమట తూర్పుగా విడిపోయి కనిపిస్తున్నారు. దాచేపల్లోళ్లు, అమరావతోళ్లుగా కనిపిస్తున్నారు.  సత్తెనపల్లి సెంటర్‌గా అమరావతోళ్లు, దాచేపల్లోళ్ల మధ్య సెటైర్లు నడుస్తున్నాయి. ఎక్కడ తక్కువైపోతామో అని దాచేపల్లోళ్లు సాధ్యమైనంత కష్టపడి తయారై వచ్చినా అదింకా స్పెషల్గా ఎక్కిరిస్తున్నట్టుంది కానీ అవమానాన్ని ఆపుతున్నట్టు లేదు. అంతా దగ్గరిదగ్గరోళ్లే. మొన్నమొన్నటిదాకా అంతా పంచె ఎగ్గట్టి మడిలో దిగినోళ్లే.
………………………………………..
ఎట్లాంటి అన్న. కోటప్పకొండ జాతరకు భుజాలమీదెక్కించుకుని తిప్పిన అన్న. ప్రభల ఊరేగింపు సరిగా కనిపించకపోతే నెత్తిమీద నిలబెట్టుకుని చూపించిన అన్న. మొన్నటికి మొన్న సంక్రాంతి పండక్కి పుట్టింటికి పోయినపుడు కోడలు సైకిల్‌ అడిగితే మామూలు సైకిల్‌ కాకుండా ఏడువేలు పెట్టి అదేందో గేర్ల సైకిల్‌ కొనిచ్చిన అన్న. అపుడే కదూ, అన్న ఎంత పెద్దోడయిండో తెలిసింది. మంచికి మర్యాదకు పుట్టింట్లో లోటు చేసింది లేదు. అయితే మాత్రం, ఆ దిక్కుమాలిన పడమటకిచ్చినందుకు ఒక దారి చూపించొద్దూ! బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చిన మాటైనా నిలబెట్టుకోవద్దూ!
Artwork: Srujan Raj
పెళ్లి వేదికకు దూరంగా మంత్రాల చప్పుడు మరీ ఎక్కువ కాని చోట నలుగురు పెద్దమనుషులు సీరియెస్‌గా పంచాయితీ చేస్తున్నారు. కోర్టు అనే మాట మర్యాదకాదని ఎవరికో చెపుతున్నారు. రేప్పొద్దున ఒకరికొకరు ఉండాల్సినోళ్లు అని సర్దిచెపుతున్నారు.
“కట్నం ఘనంగా ఇచ్చి తాహతుకు మించి పెళ్లి చేశాడా, లేదా! ఐదేళ్ల తర్వాత ఇపుడు భూమిలో వాటా ఉందంటే ఎట్టరా అని మీసాల పెద్దాయన చెపుతున్నాడు. అన్న ప్రేమతో ఏదైనా ఇస్తే తీసుకోవాలి. వాడు మాత్రం కాదంటడా. తాను శ్రీమంతుడైతే చెల్లెలు పేదరికంలో బతకాలని అనుకుంటడా! ఇచ్చింది తీసుకుంటే పద్ధతిగా ఉంటది, నా మాటినండి అని అనునయిస్తా ఉన్నాడు. “ఏం, అది మాత్రం వాళ్ల నాయనకు పుట్టలా! వాడొక్కడే పుట్టాడా. ఇయి పాతరోజులు కావు. ఏదో ముష్టిపడేసినట్టు పడేస్తామంటే కుదరదు. మాట ప్రకారం రెండెకరాలూ ఇవ్వాల్సిందే. ”…వెనుకనుంచి ఎవరో గొణగడానికి అడగడానికి మధ్యరకంగా మాట్లాడుతున్నారు. గట్టిగా వినిపించాలి. కానీ డిమాండ్‌ చేసినట్టు ఉండకూడదు. ఇవ్వకపోతే ఇంకో రూట్‌ తప్పదని చెప్పాలి. అదీ ఆ వాయిస్‌ సారాంశం. “ఎవడ్రా అది పెద్దోళ్లు మాట్లాడుతుంటే..” అని ఎవరో కసురుతున్నారు. వారి టోన్‌ ఇంకా స్థిరంగా ఉంది. అటూ ఇటూ స్టేక్స్‌ గట్టిగానే ఉన్నట్టున్నాయి.

అమరావతి నుంచి వచ్చినవాళ్లలోనే కొందరు ఇంకో చోట చేరి బెంగగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లు మొకాలు అంత ధీమాగా లేవు. వాళ్ల మొకాలు బాడిసెతో చెక్కినట్టుగా లేవు. వాళ్ల మొకాలు తుప్పు పట్టిన కొడవళ్లలాగా, కొచ్చన్‌ మార్కుల్లాగా ఉన్నాయి. ఉన్న ఎకరా, అరెకరా తీసేసుకున్నారు. రేపటినుంచి ఏం పనిచేయాలి? ఎట్లా బతకాలి? పిల్లల చదువులెట్లా? ప్రభుత్వం రాజధాని నిర్మించేదెపుడు? స్థలం ఇచ్చేదెపుడు? మబ్బు చూసి ముంత ఒలకబోసుకుంటే ముందు ముందు బతుక్కు భరోసా ఏంటి అని బెంగగా చర్చించుకుంటున్నారు.

అంతా కలగాపులగంగా ఉంది. వరలక్ష్మికి లోపల అంతకంటే అలజడిగా ఉంది. ఏడాదిన్నరలో అంతా మారిపోయింది. ఊర్లు మారిపోయాయి. బంధుత్వాలు మారిపోయాయి. దాచేపల్లి పక్కన పెద్దమ్ములుకు ఇచ్చి పెళ్లిచేసినపుడు ఇద్దరివీ పల్లెటూళ్లే. ఇద్దరివీ మెట్ట గ్రామాలే. ఆ మాటకొస్తే అమరావతి పక్కనున్న మహేశ్వరం కంటే పెద్దమ్ములు పెద్దగానే ఉండేది. మెట్టినిల్లు కూడా పుట్టినిల్లు కంటే పెద్దిళ్లే. రెండెకరాలు ఎక్కువుండే ఇంటికే ఇచ్చారు. అపుడంటే కథ వేరు. ఇపుడంతా మారిపోలే! అక్కడి మెట్ట ఇంకా అట్లనే ఉంది. ఇక్కడి మెట్ట కోట్లకెక్కింది. అన్న ఇన్నోవాలో తిరుగుతుంటే అందరూ మీ అన్న అంతోడు ఇంతోడు అంటుంటే పైకి సంబరంగానే ఉంటుంది కానీ లోలోపలే గుచ్చుకున్నట్టు ఉంటుంది. ఏదో తేడా. ఏదో వెలితి.
ఒక కడుపున పుట్టినదాన్ని. తనకు తానుగా పిలిచి
“అరే వరా..ఇదిగోరా…ఇది నీది. ..తీసుకో” అంటే ఎంత బాగుండును. బిడ్డలు కడుపులో ఉన్నపుడు అనుకున్నమాటకే ఇపుడు దిక్కులేకుండా పోయిందే! అంతంత ఆశలు పెట్టుకోవచ్చా! ఆ మాటొక్కటి నిలుపుకుంటే చాలదూ!”
వరలక్ష్మికి కాలూ నిలకడగా లేదు. మనసూ నిలకడగా లేదు. ఊరికే అటూ ఇటూ తిరిగి వాళ్లనీ వీళ్లనీ అకారణంగా పలకరిచ్చి మాట్లాడతా ఉంది. ఉన్నట్టుండి మొగుడిమీద కోపం గొంతుకాడికి తన్నుకొచ్చింది.
“మొగుడే సరీగుంటే తనకీ యాతన వచ్చి ఉండేదా! ఆయన కదా ఈ వ్వవహారాలు చూసుకోవాల్సింది. పేరుకు మగపుట్టుకే కానీ కూతుర్ని కనడానికి తప్ప మరెందుకైనా ఆ మగతనం ఉపయోగపడిందా! గొడ్డులాగా పనిచేయడమే గానీ ఒక సంతోషం ఉందా! ఒక సంబరం ఉందా! నలుగురూ ఎట్లా బతుకుతున్నారు అనే ఆలోచనలేదు. అసలు నలుగురిలో కలిసేదే లేకపోయెనే! పెళ్లికి రమ్మంటే కూడా అమ్మా కూతుళ్లు పోండి అనే మొగోడయిపాయె. తూరుపున అన్నదమ్ములూ ఆడబిడ్డలూ ఉన్నోళ్లందరూ ఎట్లా ఉరుకులాడుతున్నరు. ఈయనకేం పట్టకపాయె. బీడీ తాక్కుంటా ఆకాశం కేసి చూస్తా ఉంటే నడిచే రోజులా ఇవి. ఏ మనిషో ఏమో! ఇంట్లో పడున్న ఎద్దూ ఒకటే ఆయనా ఒకటే. ఒకర్ననుకుని ఏం కర్మ. నా కర్మ ఇట్లా కాలింది” నిస్సహాయతతో కూడిన ఆగ్రహంతో కుతకుతా ఉడికిపోతా ఉంది వరలక్ష్మి.
“ఆ.. ఈడ సీసాలో గొట్టమేసుకుని మజా తాగుతా ఉండు. ఆడ మీ బావ ఎవర్నో చేసుకుని మజా చేసుకుంటడు. బావెక్కడున్నాడో చూసి రాపోవే. పలకరచ్చిరాపాయే ఎర్రిమొకమా”
మొగుడిమీద విసురంతా కూతురుమీదకు ట్రాన్స్‌ఫర్‌ చేసి గదమాయించింది.
ఆ పిల్ల అటూ ఇటూ తిరుగుతూ వెనుక వరుసలో గోడకు జారగిలిపడి ఐఫోన్‌తో ఆటలాడుకుంటున్న కుర్రాడిని చూసింది. ఆ కుర్రాడు పలుచగా ఉన్నాడు. పంట్లాం జారిపోతుందేమో అని చూసేవాళ్లకు భయంపుట్టేంత కిందకి వేసుకున్నాడు. సృష్టి చేసిన ఏర్పాటు వల్ల మాత్రమే  పంట్లాం ఆ మాత్రం ఒంటిని అంటిపెట్టుకుని ఉన్నట్టుంది. పైన ఒక టీషర్ట్‌ యథాలాపంగా ఉంది. పెళ్లికి ప్రత్యేకంగా తయారైవచ్చినట్టుగా అనిపించలేదు. జుట్టు నిర్లక్ష్యంగా ఉన్నా గ్లామరస్‌గా ఉంది. ఆ నిర్లక్ష్యంలో కూడా పద్థతేదో ఉన్నట్టుంది. చేతులకు కడియాలు లేవు. మెడలో కంటె లాంటి మందమైన బంగారు గొలుసేమీ లేదు. సింపుల్‌గా ఉన్నాడు కానీ చూడగానే బలిసినోళ్ల పిలగాడు అని గుర్తు పట్టేట్టు ఉన్నాడు. వాళ్ల నాన్నకు కడుపు ఎంత ముందుకొచ్చిందో ఈ కుర్రాడికి అంత లోపలికి పోయి ఉంది. భుజాల కాడ ఇపుడిపుడే బైసెప్స్‌ ఉబ్బుదామా వద్దా అన్నట్టు తొంగి చూస్తున్నాయి. చూడగానే జిమ్‌బాడీ అని తెలిసిపోయేట్టు ఉంది.  కొత్తసినిమాలో కుర్రహీరోలకు నకలుగా ఉన్నాడు. ఆ పిల్లను గమనించినా గమనించనట్టుగానే పక్కకు తిరిగి ఫ్రెండ్స్‌ని పిలుస్తూ దూరంగా వెళ్లాడు. ఆ పిల్లకు ఏదో అర్థమయినట్టే కనిపిస్తోంది. పాతసినిమాలో హీరోయిన్‌లాగా జడను ముందుకు తెచ్చుకుని దాంతో ఆవేదన పంచుకుంటున్నట్టుగా నిమురుతూ తిరిగి తల్లి దగ్గరకు నడిచింది.
వాళ్లకు మూడు వరుసల్లోనే కుర్చీలో కాళ్లు ఎత్తిపెట్టుకుని  పొగాకు నలుపుకుంటూ కూర్చున్నాడు వెంకయ్య. ఆయన జుట్టు రేగిపోయి ఆకాశం వంక చూస్తా ఉంది. మీసాలు వంగిపోయి నేల చూపులు చూస్తున్నాయి. చేతిలోని పొగాకు లాగే ముఖంపైనా ముడుతలు. ఒక్క ముక్కలో నలిగిపోయిన పొగాకు కాడలాగా ఉన్నాడాయన. ఆయన పుస్తకాలు చదవలేదుకానీ మనుషులను చదవగలిగిన వాడు. ఏం జరుగుతుందో బాగా తెలిసినవాడు. మట్టి వాసన తప్ప నోట్ల వాసన అంతగా తెలిసినవాడు కాదు. ఆయన కొడుకు ఒక నెలలో బేబులోంచి తీసినన్ని సార్లు, తీసినన్ని నోట్లు ఆయన జీవితమంతా తీసి ఉండడేమో! కూతురు మనుమరాలు తిప్పలు, కొడుకు మనుమడి జాడింపులు అన్నీ చూస్తున్నాడు. ఆ పెళ్లి జరగదు అని అర్థమవుతూనే ఉంది.
”చిన్నపుడే ఆ పిల్ల పుట్టకముందే ఇచ్చినమాట. రెండేళ్ల క్రితం వరకూ పెళ్లి గ్యారంటీ అనే అనుకున్నారు. కొడుకు చాలా ఉత్సాహం చూపేవాడు. ఏమే కోడలా అని తప్ప పేరు పెట్టి పిలిచి ఎరగడు. ఇంటర్‌ అయిపోగానే దీన్నిక్కడ వదిలేయ్‌. ఇక్కడే ఉండి బెజవాడ వస్తా పోతా డిగ్రీ చదవుకుంటది, ఎట్లా ఈడుండాల్సిందేకదా అని తన చెల్లెల్ని తొందరపెట్టేవాడు. పిల్లాడి డిగ్రీ అయిపోగానే ఇద్దరికీ ముడేయాలని అనుకున్నారు. ఈ రెండేళ్లలో చాలా మారిపోయాయి. భూములు మారిపోయాయి. జీవితాలు మారిపోయాయి. పెళ్లి కాకపోతే పోయింది, అది అక్కడే ఆగుతుందా! ఇంకా ముందుకు పోతుందా! అసలే కూతుళ్లు కొడుకుల మీద కేసులు వేయడం చూస్తూ ఉన్నాడు. తలలు పగలకొట్టుకునేంత గొడవల గురించి వింటూ ఉన్నాడు.”
మనసు పరిపరివిధాలా ఆలోచిస్తా ఉంది.
“ఒకప్పుడు బంధుత్వం అంటే ఎట్టుండేది? పెద్దరికానికి ఎంత గౌరవం ఉండేది? పాడుకాలం, ఎవరికీ ఎవరూ కానికాలం”
అని లోలోపలే వర్తమానాన్ని శపిస్తూ ఉన్నాడు.
ఆస్తులు అమ్ముకుని తింటే కొండలైనా కరిగిపోతాయ్‌రా అని ఏదో చెప్పబోతే కొడుకు చూసిన చూపు గుర్తొచ్చింది. మనసు మూలిగింది
Artwork: Srujan Raj
.
పెళ్లిమంటపం కళగానే ఉంది. సడన్‌గా వచ్చిపడిన సంపద తెచ్చిపెట్టే సంబరం కనిపిస్తానే ఉంది. అది మనుషుల మధ్య తెచ్చిపెట్టే సంక్షోభం కూడా కనిపిస్తా ఉంది. తేలని పంచాయితీలు అనేకం కనిపిస్తున్నాయి. స్టేక్స్‌ ఎక్కువైనాయి. ఎవరూ ఏదీ వదులుకునేట్టు లేరు. నలుగురిలో నగుబాటు కాకూడదనుకునే వారు పెద్దమనుషుల ఎదుట పంచాయితీలు చేసి తేల్చేసుకుంటున్నారు. అట్లా సంతృప్తిపడలేని వారు వీధికెక్కుతున్నారు. కోర్టు గుమ్మాలు తొక్కుతున్నారు. వచ్చిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడమెట్లా అనేవాళ్లు కొందరు.
దూరంగా వెళ్లి ఏ వినుకొండ, కుంట ప్రాంతాల్లోనో ముందు జాగ్రత్తగా భూముల వేట చేస్తున్న వారు కొందరు. వేరే భూములు లేక ఉన్న కొద్ది మడిచెక్క పోగొట్టుకుని గోడుగోడు మంటున్నవారు ఇంకొందరు. అంతా కలగా పులగంగా గందరగోళంగా ఉంది. పెద్ద సుడిగాలి వచ్చేసి కొందరిని మేడమీదకు మరికొందరి లోయలోకి విసిరేసినట్టు ఉంది. వరలక్ష్మి అన్నకోసం తిరుగుతూనే ఉంది.
ఇంకొక్క సారి నేరుగా ఎదురుపోయి పట్టుకుందాం.  అప్పటికి తప్పించుకుంటే పెద్దమనుషుల దగ్గరకు పోవడం తప్ప దిక్కులేదు అని తీర్మానించుకుంది.  ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అన్న కోసం మళ్లీ పెళ్లి పందిరి చుట్టూ వెతుకులాట ఆరంభించింది. తూర్పుకు పడమటకు మధ్య దాగుడుమూతలాట సాగుతానే ఉంది.
(జనవరి 7, 2016న సారంగలో ప్రచురితమైన కథ)

No comments:

Post a Comment